తోడు


ఒంటరిగా ఉన్న నన్ను చూసి..
చంద్రుడు కన్ను గీటు నవ్వుతున్నాడు
పవణుడు ఈల వేసి గోల చేస్తున్నాడు
వరుణుడు చేయి గిల్లి కవ్విస్తున్నాడు!!

కలలోని నీవు నిజమై తోడు నిలిస్తే ..
చంద్రుడు మబ్బుల చాటు దాగి పోతాడు
“వస్తున్నా” అంటూ వరుణుడు, ఎక్కడికో పయనమవుతాడు
పవణుడు జోల పాడి నిద్రపుచ్చుతాడు!!

Advertisements

రామ కనవేమిరా??


నా స్వామిని పేరులో నింపుకున్న ఓ చిలుకా..
నా స్వామి స్పర్శ తాకి ధణ్యమైన ఓ ఉడతా..
నా స్వామి పాద ధూళి తాకిన ఓ నేలా..
నా స్వామికి ఎంగిలి తినిపించిన ఓ శబరీ..
నా స్వామి వింటె నారి శబ్దానికి ఉలికి పడ్డిన సంద్రమా..
చప్పరే నా దేవునికి,
లోకం కోసం నన్ను కాదనుకున్నా, అతడే నా లోకమని!!

క్షణం – మరుక్షణం


నీవు ఎదురుపడిన ప్రతిసారి
మాటలు మరిచిన పెదవులు తెగ వణుకుతాయి ఒక క్షణం
మదిలో దాచుకున్నవన్నీ కళ్ళు చదివిపెడతాయి మరుక్షణం

నీ చేతిలో చేయి వేసి, అడుగులో అడుగు కలుపుతుంటే
ప్రపంచమే మరుగున పడుతుంది ఒక క్షణం
నువ్వే ప్రపంచమవుతావు మరుక్షణం

నీ ధ్యాసలో ఉండగా, వీచే చల్లని గాలి
మనసుకి చెక్కిలిగింతలు పెట్టి ఆడిస్తుంది ఒక క్షణం
అంతులేని విరహాన్ని రగిలిస్తుంది మరుక్షణం

నీ తలపులను ఊసులుగా మార్చాలి అంటే
అనంత పదకోశం ఉందన్న ధైర్యం ఒక క్షణం
మాటే రాక మూగపోతాను మరుక్షణం

నీకై జారే ప్రతీ కన్నీటి బిందువు
నువ్వే నా సైన్యం అని చెబుతుంది ఒక క్షణం
నువ్వే నా శత్రువు అని ప్రకటిస్తుంది మరు క్షణం

నీతో సహచర్యం
ప్రాప్తం అనిపిస్తుంది ఒక క్షణం
బ్రతుకే మనసారా పండిందనిపిస్తుంది మరు క్షణం

నీవు
“నల్లపూస”గా నా హ్రుదిపై నివసిస్తావు అన్న ఆనందం ఒకక్షణం
నల్లపూసై నా కంటిని సెలయేరుగా మారుస్తావని బాధ మరుక్షణం

నీవే నా ప్రాణం అనిపిస్తుంది ఒక క్షణం
నీవే నా? అనిపిస్తుంది మరుక్షణం

ప్రేమ జడివైనా, అలజడివైనా .. నువ్వే నా సర్వసం అనుక్షణం!!

జ్ఞాపకాలు


ఒక రోజు ఫిసిక్స్ క్లాసులో ఎదో మాటల మధ్యలో, “గంగా నదిలో పూజ చేసిన సామాగ్రి అంతా వేస్తారు; గంగలో చాలా మంది స్నానాలు చేస్తారు. నానా చెత్త పడేస్తారు. అఖరకు శవాల్ని కూడ!! ఐనా మనం ఆ నదిని దైవంగా కొలుస్తాం, పరమావధిగా భావిస్తాం. మనది అంతా గుడ్డి నమ్మకాలు…”, టీచరు చెప్తునే ఉన్నారు. అంతకు ముందు రోజే ఎవరో కాశి నుండి తెచ్చిన నీళ్ళు అమ్మ ప్రసాదం అని ఇచ్చిన గుర్తుతో నా మొహం కలవికలు మారాయి. “నిజంగా మనవి గుడ్డి నమ్మకమేనా?? మనలో సైంటిఫిక్ అప్రోచ్ లేదా?” అని టీచరు అనేసరికి, మళ్ళీ క్లాసులోకి వచ్చా!! “కాని ఆ గంగా నది ప్రవహిస్తూనే ఉంటుంది కదా?? కదిలే నీరు మలినాన్ని తనతో పాటే తీసుకుపోదా??” ఒక అమ్మాయి ప్రశ్న అడుగుతూనే జవాబు చెప్పింది.

ఇది ఎప్పుడో జరిగిన విషయం. కానీ మనసు ఎందుకో ఆ ఙాపకం చూటూనే తిరుగుతుంది. ఙాపకం అంటే గుర్తువచ్చింది. మన జీవితంలో ఙాపకాలకు నదికి ఎందుకో పోలిక ఉన్నట్టు లేదూ?? అసలు జీవితం అంటే ఎంటి? మన జీవితాన్నే మనవళ్ళకు కథగానో, లేక ఓ పుస్తకంగానో, ఓ సినేమాగానో తీయ్యాలి అనుకుంటే, అందులో ఉండేవి ఎంటి? ఙాపకాలే కదా!! కొన్ని మనకు నచ్చినవి, మరి కొన్ని బాధించేవి. ప్రతీది మనతో ముడిపడింది కనుక అవి ప్రత్యేకం. జీవితం చిన్ని చిన్ని ఙాపకాల సమాహారం.అవి లేని జీవితం నిరర్దకం. గతం గుర్తులేక అనుభవించే నరకం, ముందర ఎంత వెలుగున్నా హరించేస్తుంది. బ్రతికున్న జీవచ్చవం లా మారుస్తుంది.

సన్నిహితులు దూరమైనప్పుడు, ఆత్మీయుల దరి చేరలేనప్పుడు, ఙాపకం ఊరట నిలుస్తుంది. దూరాలు దూరంగా పొతాయన్న ఆశ కలిగిస్తుంది. ఆ వేదనలో ఊరటనిస్తుంది. ఒక వేళ ఆ దూరం చెరగకపొతే, చెరపలేనిది ఐతే?? మనం ‘ఙాపకాలలోనే జీవించగలమా??!! ఊరటనిచ్చే ఆ ఙాపకాలే, ఇప్పుడు ఉరి తాడులు అవుతాయి. ఉ.. గంగ నిత్య ప్రవాహిని. అందుకే అది ఆరోగ్యకరం. కాని అదే గంగను ఓ సీసలో బంధించి, నెల తర్వాత తాగితే మ్రుత్యువు. ఙాపకాలు అంతే, జీవితం సాగేంతవరకు అవి ఓ ఆలంబన. వాటినే జీవితం చేసుకోవాలి అని బంధించామా, అవే ఉరి తాడులు.

మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరాలు: ఙాపకం, ఇంకోటి మరుపు. ఒకటి జీవితాన్ని ఆస్వాదించటానికి, మరోకటి ఏమి ఎదురైనా జీవితం సాగించటానికి. వీటిలో ఏది సమపాళ్ళు మించినా, మనుగడ కష్టమే!!

పరిచయం


సాయం సంధ్యవేళ, సముద్ర తీరానా.. ఇసుకలో భారంగా నడిచే పాదాలు, అయినా అలసిన మనసుని తట్టి లేపే చల్లని గాలి; చెదురుతున్న కురులని సర్దడంలో సన్నని విసుగు, అయినా పెదాలపై చిరునవ్వు తెప్పించే ఆహ్లాదమైన వాతావరణం. ఎదురువస్తూ పలకరిస్తున్న గాలికి రెప్పలు వాలిపోతున్నా.. అనంతముగా కనిపించే నీలిసాగరం రెప్పని కట్టిపడేస్తుంది.

“ఎంత గాంభీర్యం .. ఎంత నిఘూడత్వం.. ఊ..నీలో ఎముంది?” అంటూ ఆలోచించేలా చేసే సముద్రాన్ని చూస్తూ తెలియకుండానే ముందుకు నడక సాగుతుంది.

అల్లంత దూరాన ఘోషిస్తూ ఇప్పుడు కనిపించే సముద్రం ఎమీ అంత ప్రశాంతంగా లేదు.. వచ్చి పొయే అలలు .. ఏదో కల్లోలపడుతూ, ఎందుకో కలవరపడుతునట్టుగా .. మన కోసమే ఎదురు చూస్తునట్టుగా అనిపిస్తుంది.. రా రమ్మని పిలుస్తు ఉంటుంది.

ఇంత అభిమానమా అని ఇంకాస్త ముందుకు అడుగులు వేస్తే..” వందనం.. అభివందనం!!” అంటూ పాదాలను సున్నితంగా తాకుతుంది. అప్పుడే ముద్దాడి, అప్పుడే వెన్నక్కి వెళ్ళిపొయే అల చూస్తే ఎందుకో తెలియని బాధ. రెప్ప పాటులో ఏర్పడిన భందం, చేజారిపోతుంది అన్న భయం.

నీరు పాదాల అడుగును విడవగానే.. మనసు నిలువుమన్నా వినదు. తన గమ్యం ఎంటో తెలిసాక.. అటే పరుగులు తీస్తుంది. ఇక నేనూ ఆగలేను అంటూ నిలువెత్తు అల శీర్షాభిషేకం కానిస్తుంది. ఆ భావావేశంలో, ఆ పరవశంలో ముందుకు వెళ్ళామా?? .. తనతో పాటు తిరిగి రాని తీరాలకు తీసుకువెళ్తుంది.

జీవితంలో వ్యక్తులతో పరిచయాలు కూడా ఇలాగే ఉంటాయి!! తొలిచూపులో మెరుపు, మాటల్లో చిలిపితనం, స్పర్శలో సున్నితత్వం, కౌగిలో పరవశం.. అటుపై చేరవలసిన తీరం!! మనకున్న ప్రతీ సంబంధం ఒక ప్రత్యేకం. కొన్ని దైవాధీనం ఐతే, మరి కొన్ని స్వయం నిర్ణయాలు.

తప్పటడుగులు వేస్తున్న మనల్ని నడిపించే చేయ్యి నుంచి, నీరసించిన అడుగులు తడబడుతుంటే సాయంగా నిలిచే చేతుల వరకు, జీవనం ఓ నిరంతర ప్రయాణం. ఆ మజిలో తారసపడిన ప్రతీ మనిషి, ఇసుకలో పాదం గుర్తు లాంటి వారు. కొన్ని అడుగులు మనకు మార్గదర్శకం ఐతే, మనలని అనుసరించే అడుగులు మరిన్ని. కలిపి అడుగులు వేసే స్నేహాలు నుంచి, అడుగులో అడుగై మనతో మమేకమైయే జీవిత భాగస్వామి వరకు, అన్ని పరిచయాలు మనిషిగా మనల్ని సంపూర్ణం చేసెవే!!

జీవితం అనే ఇసుక తిన్ననలో, కాలపు అలలుకు చెదరిపొయినా, మనసు ఫలకం పై నిలిచి ఉండే, ప్రతీ పరిచయానికి ఇదే నా జొహారు!!