లాన్స్ ఆర్మ్ స్ట్ర్ట్రాంగ్ – ఆత్మకథ


2003-04 సీసన్ లో ఊకదంపుడు దంచాక, వివిస్ లక్ష్మణ్ ఒకానొక ఇంటర్వులో తనకిష్టమైన పుస్తకాల్లో “Its not about bike, My journey back to life” అని చెప్పిన మరుక్షణం ఈ పుస్తకం చదివేయాలనుకున్నాను. కాని ఎక్కడ??.. ఇంటర్నల్లు, సెమిస్టర్లు, ఎగ్జాములు అంటూ గడిచిపొయింది. పోనీ ఉద్యోగంలో చేరాకైనా అనుకుంటే.. ట్రేనింగులు, మీటింగులు, బిల్డులు..రిగ్రషన్లు అంటూ కాలం నిలవలేదు. ఏదో సినిమాకి ప్రసాద్స్ కి వెళ్తే టికెట్స్ దొరకలేదు.. అక్కడే ఉన్న “Odyssey”లో ఈ పుస్తకం పట్టా!! ఎప్పుడెప్పుడు ఇంటికి వచ్చి ఆ పుస్తకం చదవాలా అని మనసు ఉవ్విల్లూరింది. లక్ష్మణ్ చెప్పారని కాదుగాని ఓ వ్యక్తి సంపూర్ణ జీవితం నా చేతుల్లో ఉందంటే ఓ వింత అనుభూతికి లోనయ్యా!! లాన్స్ అర్మ్ స్ట్రాంగ్ గురించి బాగానే తెలుసు నాకు, అతడో ప్రపంచ ప్రధమశ్రేని సైక్లిస్ట్ అని, అత్యంత కష్టసాధ్యమైన “టూర్ డి ఫ్రాన్స్” ను ఏడు సార్లు గెలుచుకున్న అపరయోధుడని, అదీ కాన్సర్ లాంటి మృత్యువుని గెలిచాడని. అయినా తన మాటల్లో తన కథ చదువుదామని పుస్తకం తెరిచా.. నా ఊహకు కూడ అందని ఎన్నెన్నో అనుభూతులు ఆవిష్కృతం అయ్యాయి.. వాటినే ఈ బ్లాగులో పంచుకునే ప్రయత్నం. ఇది ఒక పుస్తకాన్ని సమీక్షించటం కాదు, ఒక జీవితపు అవశేషాలు నాలో మిగిలిన వైనం.

దిగువ మధ్యతరగతి జీవనాలు ప్రపంచంలో ఎక్కడున్నా ఒక్కటేనేమో అనిపించింది లాన్స్ బాల్యం చదువుతుంటే. ఎవరో ఒకసారి “మధ్యతరగతి జీవితమంటే ఒక రైలుభోగీలో కూర్చుని ఇంకో రైలు వెళ్ళుతుంటే మనమే కదులుతున్నాం అని భ్రమించడం” అని వ్యాఖ్యానించారు. ఆ వాక్యం వినగానే మనసు చివ్వుక్కుమనిపించింది. కానీ లాన్స్ తల్లి తన బిడ్డను ఎలాంటి భ్రమలోనూ బ్రతకనివ్వలేదు. తన శక్తి ఎంతో, తాను ఏమివ్వగలదో అన్నీ సవివరంగా చెప్పింది. లాన్స్ ఎప్పుడూ ఆ పరధుల్లోనే తన సామర్ధ్యాన్ని నిరూపించుకున్నాడు. బహుముఖప్రఙాసాలిగా ఎదిగాడు. సైక్లింగ్, స్విమ్మింగ్, మారతాన్లలో తన సత్తువును చాటాడు. ప్రపంచపటంపై తన ఉనికి అప్పుడప్పుడే చూసుకుంటున్న సమయంలో, ఓ సాయంత్రం వచ్చిన తలనొప్పి మరువక ముందే భయంకరమైన దగ్గుగా మారి, తాను నిల్చున్నా కూర్చున్నా నిలువన్నివ్వని నొప్పి తో, తన ఊపిరితిత్తులవరకు పాకి.. కేవలం వారం రోజులలో కాన్సరని తెలియటమే కాక, తన చరిత్ర ఇక క్షణాలదే అని తెలిసిన్నప్పుడు నా మెదడు మొద్దు బారింది. లాన్స్ ఆరోగ్యంగా ఇంకా జీవించి ఉన్నాడు అని నాకు తెలుసు. అయినా ఎందుకంత భయపడ్డానో!! ఒక సారి ఫ్రెండ్ ఫోన్ చేసి “హౌస్ లైఫ్??” అని అడిగితే.. “ఏమో రాఘవా!! కొత్తగా ఏమీ జరగడంలేదు. అలా అని జీవితం ఆగిపోనులేదు” అని సమాధానమిచ్చాను. దానికి తను “జీవితం ఇచ్చే ట్విట్స్ ఆండ్ టర్న్స్ మన ఊహకు అందవు. జీవితం ఎలా వస్తుందో అలానే అంగీకరించటం తప్ప”. అనగానే ఊ కొట్టాను. వారంరోజుల క్రితంవరకు సంపూర్ణ ఆరోగ్యవంతుడైన లాన్స్ ఇప్పుడు మృత్యుముఖంలో ఉన్నాడు,.. నిజంగానే మన ఊహకు అందవు… రాఘవతో అన్న “ఊ”ను ఇప్పుడు అనుభవించాను!!

ఒకసారి జరిగిన రేసులో బాగానే మొదలుపెట్టినా, మధ్యలో లాన్స్ కి ఓపిక పూర్తిగా పోతుంది. అయినా సైకిలు దిగి కుంటుతూ, పడుతూ లేస్తూ తన గమ్యాన్ని చేరుకుంటాడు. “ఎప్పుడూ మధ్యలో వదిలిపెట్టకు, చివరిదాక ప్రయత్నించు” అన్న తన తల్లి మాటలకు కట్టుబడడమే!! మాటకు విలువిచ్చి తన తల్లి విలువను పెంచాడా?? తల్లి విలువ తెలుసు కాబట్టి మాటకు విలువినిచ్చాడా?? అన్న ప్రశ్న నన్ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఆ ఒక్క వాక్యమే లాన్స్ ను కాన్సర్ని ఎదురుకునేలా చేసింది. I’ll not let it take over me అని తన ధృడ నిశ్చయాన్ని తెలిపాడు. అత్యంత క్లిష్టసాధ్యమైన ట్రీట్మెంట్ తీసుకున్నాడు. తన తలపై చుక్కలుపెట్టి బ్రేయిన్ సర్జరీ చేసినా.. కెమోతెరపీ తీసుకున్నా.. ఆ భాదనంతా భరించింది కాన్సరుని గెలవన్నివ్వకూడదని.. అది మోండితనమే.చావుని కూడ ఎదిరించేంత. “Death is not a cocktail party conversation” అంటాడు లాన్స్ ఒక సందర్భంలో, అయినా మృత్యువుతో సంభాషిస్తూనే ఉంటాడు, ఆ సొద వినలేకె చావు కూడ వెళ్ళిపొయిందెమో!! బక్కచిక్కి చావుకు మరో రూపంగా మంచంపై పడున్న లాన్స్ కోసం ఒక స్పాన్సరు రావటం, అతని స్థితి చూసాక కాంట్రాక్ట్ రద్దు చెయ్యటం.. లోకం పోకడ చెప్పకనే చెప్తుంది.

ఇంతా చేసి అంతా బాగయ్యాక లాన్స్ సైక్లింగ్ పై ఆసక్తి లేకపొవటం నాకు ఆశ్చర్యమేసింది. తనకు కాన్సరు అని తెలిసినప్పుడు కూడా ఆటకు దూరమైయ్యాననే ఎక్కువ మధనపడతాడు. బాగయ్యాక మాత్రం ఆటపై ఆసక్తి లేకపొవటం… ఒక భీభత్సమైన యుద్ధంలో గెలిచాక, ఓ మాములు పోట్లాట మజానివ్వదు. చావునే మట్టికరిపించిన తనకు ఇప్పుడు “టూర్ డి ఫ్రాన్స్” కూడ ఓ మామూలు విషయంలా తోచింది ఏమో!! కుటుంబం, స్నేహితులు, సన్నిహితులు ప్రోద్బలంతో మళ్ళీ రేసింగ్ మొదలు పెట్టి అనితర సాధ్యమైన విజయాలను సొంతం చేసుకున్నాడు. మనిషన్న ప్రతీవాడూ చెయ్యెత్తి జేకొట్టాల్సిన విజయాలు సాధిస్తున్నా, “డ్రగ్స్” అంటూ సాధించే మనుషులను ఎదురుకోవాల్సివచ్చింది. కెమోతెరపీ వల్లే అతనికింత బలం వచ్చిందని ఆరోపించిన వారికి ఏమి తెలుసు, ఛాతీలో ఒక పరికరాన్ని పెట్టుకుని అందులో నుండి వెలువడే కెమికల్స్ అన్నీ తన నరనరాల్లోకి చొచ్చుకుపోతుంటే కలిగే వేదన. నాలుగు నెలల కాలంలో ఆ పరికరం చుట్టూ ఫ్లెష్ పెరిగాక దాన్ని తన శరీరం నుండి వేరు చెయ్యటంలో కలిగిన వ్యధ??

ఇది లాన్స్ కథే అనుకున్నా.. కానీ అతన్ని మించి నన్ను ఆకట్టుకున్నారు, లాన్స్ జీవితంలో ముఖ్యపాత్ర పోషించిన నలుగురు స్త్రీలు. వారిలో ప్రధమం అతడి తల్లి. ఒక మనిషికున్న మనోబలానికి ఈమే పరాకాష్ట అనిపించింది. చిన్నవయస్సులోనే ఎన్నో కష్టాలు పడుతున్నా మరో చిన్నారిని దృఢమైన వ్యక్తిగా తీర్చిదిద్దిన తీరు నన్ను ప్రభావితం చేసింది. తన సమస్యలేమిటో, తన ఏమివ్వగలదో ఏమి తీసుకోగలదో ఆ చిన్ని హృదయానికి వివరించిన తీరు అమోఘం అనిపించింది. కల్మషంలేని వారి సంభాషణలు తల్లీ-బిడ్డ, స్నేహితుల మధ్య తేడాను చెరిపివేసాయెమో అనేలా ఉంటాయి. ఇక పోతే అతని భార్య!! “మగాడు తన భార్యను ప్రేమిస్తాడు, కాని ఆమె తల్లి అయ్యాక గౌరవిస్తాడు” అని ఎదో డైలీ సీరియల్ లో భారి డైలాగు. నిజం లేకపోలేదు ఆ మాటలో. అసహజమైన పద్దతుల్లో లాన్స్ బిడ్డకు జన్మనిచ్చేందుకు ఆమె పడిన అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. తను ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు, దగ్గరుండి అన్నీ చూసుకున్న నర్స్ ని లాన్స్ దేవత అని వ్యవహరిస్తాడు. మనకూ దేవతలానే కనిపిస్తుంది. ఇక ఆ కష్టకాలంలో లాన్స్ కి తోడుగా ఒక గాళ్ ఫ్రెండ్ ఉండేది. ఈమె పాత్ర కూడ చాల ముఖ్యమైంది. కానీ ఎందుకో వారి బంధం కొనసాగదు.

పుస్తకమైతే మూసేశాను గాని, ఆ తాలుకు గుర్తులు నాలో ఇంకా వినిపిస్తున్నాయి, జీవితం ఒక అందమైన అనుభవం అని మళ్ళా నిరూపించిన ఈ ప్రయాణం నాతో ఎప్పుడు ఉంటుంది.

Advertisements

నే మనసు పడిన వెంటనే ఓ ఇంద్రధనుస్సు పొంగులే


తన అనురాగపు కిరణాలు నామీద ప్రసరించగానే
వానచినుకులా మబ్బుచాటున మాటువేసిన నేను
తెల్లని ఆ కిరణానికి ఏడు రంగులు పులిమి..
నే మనసు పడిన వెంటనే ఓ ఇంద్రధనుస్సు పొంగులే.. అని పాడాలనుకున్నా!!

కారుమబ్బులలో చిక్కుకుపోయింది కిరణం
విరహవేదనతో విలపిస్తూ భారంగా మారిన నన్ను
తనలో దాచుకున్న మబ్బే నేలకు సాగనంపింది.

మచ్చలేని మమతకు లోకంలో రంగులన్నీ పరిచయం చెయ్యాలనుకున్నా..
కానీ నలుపొక్కటే చూపించింది ఈ ప్రకృతి మాకు
నే మనసు పడిన వెంటనే ఓ ఇంద్రధనుస్సు పొంగులే.. కేవలం నా భ్రమేనా!!??

రాముడా?? రావణుడా??


నాపై అనుమానంతో అగ్నిపరీక్ష పెట్టిన రాముడా
నాకై బంగారు లంకను అగ్నికి ఆహుతిచ్చిన రావణుడా

నన్ను తప్ప ఇంకెవరినీ దరిచేరనివ్వని రాముడా
నాకై సర్వస్వాని పోగట్టుకున్న రావణుడా

తప్పుచేయకపోయినా లోకం కోసం కారడువులలో వదిలిన రాముడా
తప్పని తెలిసినా ఆత్మార్పణ చేసిన రావణుడా

ఎవరు నన్ను ఆరాధించిన వారు?ఎవరు నన్ను ప్రేమించింది?

తాగుబోతు కూతలకు ఆలిని కాదనుకున్న రాముడేమి దేవుడు?
హృదిలో కట్టిన వలపు గుడికై, పతనమైపోయినా రావణుడు రాక్షసుడా?? అని అనిపించినా

తన పతనానికి కారణభూతంగా నన్ను నిలిపిన రావణుడు కాడు
నను నిందించినా, తను మధనపడినా,
రామరాజ్యపు సౌధానికి నన్ను పునాదిగా మార్చిన రాముడే నా స్వామి!!

************************************************************************************
*అప్పుడెవరో.. “సీతకు రాముడు కరెక్టా?? రావణుడు ఆ?? ఎవరితో సీత సుఖంగా ఉండేది??” అని అడిగారు. నా
సమాధానం చదివారు కదా!! మరి మీ అభిప్రాయమేమిటో తెలియచేయగలరు.

వాన అలిగితే..


“”వర్సం పప్పొతుంది డాడి, వర్సం పప్పోతుంది !!” అని చిన్నా అరిచేవరకు నువ్వు నా రాకను గమనించలేదు అంటే, అసలు నేనిప్పుడు రావాలా వద్దా అని ఆలోచిస్తున్నా!! నన్ను చూసి ఆ చిన్ని గొంతులో ఎన్ని భావాలు.. నేను ఎక్కడనుండి వస్తున్నానో అని ఆశ్చర్యం, వచ్చి ఏమి చేస్తాను అని భయం, మెరుపులా గర్జిస్తానేమో అని అనుమానం, అయినా ఆనందం!! అది నా కోసం పడే ఆనందం. నీకు అర్దమైయేలా చెప్పాలి అంటే, “ఇట్స్ ఎక్స్ క్లుసివ్ ఫర్ మి”. నువ్వూ నా కోసం అలానే వేచి చూస్తావు అనుకున్నాను, నీ మనసు నా కోసం తపిస్తుందని భ్రమించా! ఆశాగా నిన్ను చేరాలి ఉబలాటపడ్డాను. కాని ఏది?? నీ లేత బుగ్గ పై జారినా, నీ చేతిని గిచ్చినా నువ్వు ఈ (నా??) లోకంలోకి రావటం లేదు. ప్రారబ్దం!!

ఎందుకు నీలో ఇంత మార్పు? మనమిద్దరము గడిపిన కాలం నువ్వు మర్చిపోయావా?? నేను వస్తున్నాను అని ఏ మాత్రం తెలిసినా, నా కోసం ఎంత ఎలా నిరీక్షించేదానవు? ఎంత చలి గాలి వీస్తున్నా, ఈదురు గాలి కంటిలో దుమ్ము కొడుతున్నా, ఇంటిలోకి వెళ్ళకుండా అలానే చూస్తూ ఉండెదానవు. నేను చినుకులా వచ్చీ రాకుండా ఊరిస్తుంటే నువ్వు బుంగ మూతి పెట్టి నా వైపే చూసేదానవు. అంత ముద్దుగా నువ్వు చూస్తుంటే, మనసాగక నేను విజృంభిస్తే, నాలో పూర్తిగా తడిచి, అటు ఇటు పరిగెత్తుతూ, గెంతులు వేస్తూ ఆటలు ఆడుకునే రోజులు ఎలా మరుగున పడ్డాయి?? నేను వస్తే నువ్వు దాక్కునే పరిస్థితి రాకూడదని పుస్తకాలన్ని ప్లాస్టిక్ కవర్ చుట్టి, నువ్వు “అన్నింటికీ సిద్ధం, నువ్వు రా” అంటే రాకుండా ఉండగలనా??. నీలో నన్ను నింపుకొని, నేను వెళ్ళగానే, ఇంటికి వెళ్ళి, అమ్మ తిట్లను, గోరుముద్దలను ఒకేలా ఆస్వాదిస్తూ, వేళ్ల తో చిక్కుతీసుకుని కురులు ఆరబెట్టుకుంటూ, నేను వెళ్ళిపొయాను అని గుర్తు రాగానే, నా నీటిలో కాగితపు పడవలు వేసేదానవు. మన కలయిక గుర్తులుగా మారిన నేలలో నీ అడుగులను, ముద్దయిపోయిన నీ పాదాలను చూస్తూ.. ముక్కు దిబ్బడ వేసుకుపొతున్నా, తల భారంగా మారుతున్నా, వళ్ళు వేడేక్కుతున్నా, నా ఆలోచనలతోనే నిద్రలోకి జారుకునేదానవు.

మరి ఇప్పుడో?? నేను ఒక అడ్డంకి నీకు. నీవు బయటకు వెళ్తున్నప్పుడు వస్తే, “సమయం, సందర్భం లేకుండా ఏంటి ఈ పాడు వాన” అని ఈసడింపు. నీవు దారిలో ఉండగా నేను వస్తే .. నీ ప్రియమైన తెల్ల డ్రెస్స్ పాడవుతుందని భయం. నువ్వు ఆఫీసులో ఉండగా వస్తే అసలు నా ఉనికే తెలియదు నీకు. ఎవరో చెప్పినా “ఓ.. డామ్న్ ఇట్” అనడానికే!! నీకూ బరువులు భాధ్యతలు పెరిగాయిలే అని సరిపుచ్చుకుని, నువ్వు ఇంట్లో విశ్రాంతి తీసుకునే వేళ వస్తే, “అమ్మో వాన!! కరెంటు పోతుంది ఏమో, కేబుల్ రాదేమో – మంచి ప్రోగ్రామే!!, ఇంటెర్నెట్ కన్నెక్ట్ అవ్వదు ఏమో – కొత్త పాటలు విందామనుకున్నానే??” అని టెన్షన్. పోనీ నీ నుండి దూరంగా వెళ్ళి ప్రపంచంలో ఏ మూలో భోరుమంటుంటే, “అన్-టైమ్లీ రేన్, మనకు నెగ్గే ఛాన్స్ ఉన్నప్పుడే వస్తుంది” అని తిట్టుకుంటుంటే నేను ఎటు పోయేది?? ఎమైపోయేది?? నాకన్నా నీకు అందరూ ఎక్కువే.. కదూ??!!

ఒక్కప్పుడు నేను తెచ్చే నల్లని మబ్బులు,చల్లని గాలి, మెరుపులు ఉరుములు, మట్టి వాసన, చినుకులు, వడగండ్లు, నేను చేసే శబ్దం అన్నీ నీకు ప్రాణం, కాని ఇవ్వలా, నేనంటే నీకు గుర్తువచ్చేది బురద, చీకటి, ట్రాఫిక్ జాం, రోడ్ల మీద గతుకులు, చిరాకు లాంటివి. ఎప్పుడూ వచ్చిపొయే వానకు స్పందన అవసరమనిపించకపోవచ్చు. కానీ స్పందించే హృదయం నీకుందని, అదిలేకపోతే మనిషిగా నీ ఉనికికే ప్రమాదమని మర్చిపోకు. మీ సైన్స్ టీచరు చెప్పినట్టు ఓ కాలంలో ఓ పధ్ధతిగా రావాల్సిన నేను, ఇప్పటికే అలవాటు మానేసా!! నువ్వు ఇలానే చేస్తే ఇక ఎప్పటికీ రాను. ఆనంద్ డివిడి పెట్టుకుని.. “అబ్బా.. ఎంత వానో!!” అని చూసుకోవటం తప్ప నేను ఎన్నడూ కనిపించను” అని వర్షం వెళ్ళిపోతుంది అనుకున్నా ఒక క్షణం,

అసలు వాన వస్తుందిప్పుడు, మబ్బు పట్టింది కదా అనుకునే మేడ మీదకు వెళ్ళా!! చినుకు కోసం ఎదురుచూస్తూనే, మనసు ఏవో ఊసులు చెప్తుంటే ఆలకిస్తూ ఉండిపొయా!! మనసు కూడా మనం చెప్పేది వినదు.. దానికి వాదనలు, ప్రతి వాదనలతో పని లేదు. దాన్ని మభ్యపెట్టలేక, అలా అని అది చెప్పిన దానితో ఏకీభవించలేక సంఘర్షణ పడే వేళ చినుకులు రాలుతున్నా కూడా ధ్యాస మరలలేదు, “వర్సం పప్పొతుంది డాడి” అని చిన్నా అనేవరకు. తర్వాత ఎంత ఎదురుచూసినా వాన రాకపొయేసరికి, అలిగిందేమో అని భయం వేసింది. వానకే మాటలు వస్తే నన్ను ఎలా విమర్శించేదో వచ్చిన ఊహకు రుపాంతరం ఈ బ్లాగు.

కన్యాదానం


తెర తీసిన తరుణంలో
నన్ను చదువ తొందరపడే అతని చూపులు
కొత్త రెక్కలు తొడిగే నా తలపులు
అతడు చాచిన చేతిలో నా దోసిలి పెట్టి
ముసి ముసిగా నవ్వుకుని మురిసిపొయే వేళ

భాజా భజంత్రీలతో మోగుతున్న మంటపంలో
వేద మంత్రాల నడుమ, “ఇహ నీదే నా చిట్టి తల్లి” అంటూ
కన్యాదానం చేసే నాన్న కన్నీళ్ళ పర్యంతమైతే..

ఏమి చేయను? ఎలా సంభాలించను?
అతడి గుప్పట్లో ఉండిపోయాయి చేతులు
వదలలేను, ఆ కన్నీటిని తుడవలేను, నా కంటి ధారను ఆపలేను

నాకై చాచిన చేతులలో నా నిన్నను మరువనా??
నన్ను మలచిన చేతిల్లో, నేన్నున్నాను అని నిలువనా??

(ఇవ్వాళ ప్రియ (నా ఫ్రెండ్) పెళ్ళికి వెళ్ళా!! కాళ్ళు కడిగి కన్యాదానం చేసేటప్పుడు వాళ్ళ నాన్న గారు భాధపడ్డారు. నా మనసు ఇంకా ఆ క్షణం చుట్టూనే తిరుగుతుంది 😦 )

మేధావి మనిషి


తెల్లారే లేచి, తల్లంటు పోసుకుని, చీరను సింగారించుకొని, నగా నట్రా పెట్టుకుని.. కాటుక చాటున రెప్పలు అతడి ఊహా చిత్రాన్ని గీయలేక ఇబ్బంది పడుతుంటే, ఫక్కున నవ్వే మనసు..మరుక్షణం ఏమి జరుగుతుందో అని గాబరా పడుతుంది.. ఇది ఒక అపూర్వ అనుభూతి. పెద్దల సమక్షంలో జరిగే పెళ్లి చూపుల్లో అతడిని చూడాలి, కన్ను కన్ను కలిసిన క్షణంలో హృదయంలో రేగే అలజడిని పంటి కింద అదమాలి. తన కంచు కంఠం చెవిని తాకగానే, మదిలో మ్రోగే వీణలను ఆపతరమా?? మాట తడబడుతూన్నా మాట మాట కలిస్తుంటే ఆ అనుభవం చెప్పతరమా?? “మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశ పడకే” .. అని మనసును బుజ్జగిస్తుండగానే, “అమ్మాయి మాకు నచ్చింది. ఇహ కట్న, కానుకల విషయంకి వస్తే..” అన్న మాటలు మనసు చివ్వుకుమనిపిస్తాయి. అప్పటి దాక అల్లుకున్న ఊహలు, కన్నీరై కారిపోతాయి. మనసున మనసై మాంగల్య బలంతో పండాల్సిన నిండు జీవితాలు, ఇప్పుడు సంతలో బేరానికి పెట్టిన వస్తువులుగా మారిపొతారు. “సంతలో బేరాలు” మరీ పాత కాలం పధ్ధతులు ఏమో? హైటెక్ షాప్పింగ్ మాల్ల్లులాగా “ఫిక్సెడ్ రేట్స్” ఏమో??

అసలు వరకట్నం అనే ఆచారం (దురాచారం??) ఎలా, ఎందుకు మొదలు అయ్యిందో తెలియదు. ఎన్నాళ్ళు ఇలాగే సాగుతుందో తెలియదు. రాను రాను దేశ జనాభాలో ఆడపిల్లల సంఖ్య తగ్గుతుంది. అప్పుడు ఈ కొనుక్కోవడాలు మానేసి, మనల్ని మళ్ళీ “అమ్ముకోవాలి” (కన్యాశుల్కం)!! అది ఇంకా నరకం!! నచ్చి ఇచ్చే కానుకలు “ఇచ్చి తీరాలి” అన్న కట్నాలుగా మారిన వైనం ఏమిటో తెలుసుకోవాలి అని ఉంది. ప్రకృతికే అందం తెచ్చే ఇంత అందమైన అనుబంధం ఇలా వ్యాపారంగా, మన సంస్క్రృతిలో అంతర్భాగంగా మారే అంత విలువ ఇచ్చాము!! భారతజాతి జీవినశైలిలో అత్యంత కీలకమైన తెలుగువారు దీనికి పెద్దపీట వేయడం శోచనీయం. దీన్ని ఎదిరించే శక్తి లేక, తల వంచుకుని పోవడమే..సబబా??

చట్టాలు ఉన్నాయి, న్యాయమూ జరుగుతుంది (మనం ఉండగానే కానవసరం లేదు!!). మనలో మార్పు రాకపోతే, ఎవరు ఎవర్ని ఎందాక బెత్తం తీసుకుని బెదిరిస్తారు?? మన అమ్మానాన్నలను సరిగ్గా చూసుకోవటానికి, మన పిల్లల్ని బడి మానిపించి పనికి పంపకుండా ఉండటానికి, ఆలిని కొట్టద్దు, చంపద్దు అని, ఇంకొన్నాళ్ళు పోతే మనం బ్రతకటానికి కూడ చట్టం కావాలి. మనం సృష్టించుకున్న ధనాన్ని, కాలాన్ని లెక్కేసుకుంటూ, ప్రతీ వస్తువునూ, మనిషినీ లెక్క కడుతున్నాము. ఎవరు ఏమన్నా, మనం మేధావులం, మనసు లేకపొతే ఏమి?? కదూ?? ఇంటి పని, వంట పని చూసుకోవటానికి అమ్మా-నాన్న కావాలి. లేక పొతే వృద్ధ ఆశ్రమాలు ఉన్నాయి. లెక్క సరిపొయింది కదూ?? మనిషి మహా మేధావి!!

“మనషి అన్న ప్రతి వారికి ఓ మనసు ఉంటుంది. ఆ మనసెప్పుడూ మంచినే కోరుకుంటుంది.” ఈ నమ్మకానికి దారుణంగా బలి అయ్యిన వారు చాల మంది. కాని ఆ నమ్మకమే మనల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది.. అదే మనకు, మన సమాజానికి శ్రేయస్కరం!!

ఓ అత్తా!!


ఎక్కడో పడి ఉన్న తులసి మొక్కను తీసుకువచ్చి..
దానికో గుడి కట్టి, అందులో ప్రతిష్టించి
రోజూ పూజలు చేసి, హారతులు ఇచ్చి
మా ఇంటి “లక్ష్మి” అంటూ ఆరాధించి
మురిసిపొయే ఓ అత్తా…

అల్లారుముద్దుగా పెరిగి, నీ ఇంట మెట్టి
నీ వంశ ధారను కావలసిన నన్ను
“లక్ష్మి”* తేలేదు అంటూ
కొట్టి, తిట్టి, అగ్నికి ఆహుతి చేసి
కక్ష తీర్చుకొనే నా అత్తా..

నీ జాతి మీద నీకున్న గౌరవం ఇదేనా??
మానుకున్న విలువ మనిషికి లేదా??

*గమనిక: మనకు గుర్తించే సమయం ఉన్నా, లేకున్నా, ఇప్పట్టికీ సమాజం లోని అన్ని వర్గాలలోను “వరకట్న”భాదితురాలు కోకొలల్లు.