చివరి ప్రేమలేఖ


“హే… ఎవర్నైనా ప్రేమిస్తున్నావా??” అన్న ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు అంతా!! “యస్..యస్..ఐమ్ ఇన్ లవ్.. ” అని చెపితే సరిపొతుందా?? అప్పటికప్పుడు అతని ఊరు పేరు చెప్పాలి, త్వరలో అతన్ని అందరి ముందు నిలబెట్టి పరిచయం చెయ్యాలి, “ఎప్పటికీ ఒక్కటైపోతున్నామోచ్!!” అంటూ కార్డులు పంచాలి, అటు తర్వాత ఇంకా కలిసే ఉన్నాము అని ఎప్పటికప్పుడు నిరూపిస్తూ ఉండాలి. ఇవ్వనీ నాతో workout కావు. అందుకే “అబ్బే అలాంటిది ఎమీ లేదులే” అని చెప్పుకొస్తున్నాను. నీతో అలా తప్పించుకోలేను.

ప్రేమ ఎప్పుడూ పరస్పరంగా ఎందుకు ఉండాలి?? నాకు నువ్వు నచ్చావ్.. ఎంతగా అంటే ఏం చెప్పను? కొలబద్దలు ఉన్నాయా.. ఇష్టానికి? ఇది కేవలం ఆకర్షణ మాత్రమే అనుకున్నాను మొదట్లో .. ఆరడుగుల అందగాడివి, అరవిందనేత్రుడివి పడిపోయాననే అనుకున్నా!! Sense of humor కి కోచింగ్ సెంటర్స్ ఉంటే బాగున్ను!! నీ నవ్వు.. నీ కళ్ళల్లో స్థిరపడినప్పుడు.. నా మనసు ఆనందతాండవం చేస్తుంది!! నిన్ను భరించగలను అనిపించింది.. అందరిలో కుళ్ళు జోకులు వేసి నన్ను corner చేస్తున్నా.. నన్ను చూసి నీతో పాటు నవ్వాను చూడు అప్పుడు. నీ వేలి గాయానికి నా మనసు మూల్గుతుంటే.. ఆకర్షణ మాత్రమే కాదేమోననిపించింది!!

కానీ నిన్ను ప్రేమించానని ఎప్పుడు తెలిసిందో తెలుసా?? నువ్వు నా ముందే ఇంకో అమ్మాయికి లైన్ వేస్తుంటే. కోపం వచ్చింది పీకల దాకా.. మల్లా నీ మొహం చూడకోడదనుకున్నా.. అయినా అందులో నీ ఆనందం ఉందన్న విషయం గ్రహించిన మరుక్షణం కోపం మాయమయ్యింది. నీ choice కరెక్ట్ అవ్వాలని ప్రార్ధించాను. నీ బాధను పంచుకోవాలనే తాపత్రయమే కాదు, నీ సంతోషం నన్ను బాధించినా ఫర్వాలేదు అని తెలిసినప్పుడు.. నాకు శాశ్వతంగా దూరమవుతావని కన్నీరు కారుస్తూనే, నీ కోరిక నెరవేరితే నీకన్నా నాకు ఎక్కువ ఆనందం అని నిర్దారించుకున్నాను. అందుకే నిస్సంకోచంగా చెప్పగలను.. “I’m in love with you.. truly, madly”. కానీ చెప్పను. ఆ అవసరం రాదు.

“ఏంటీ.. వీకెండ్ అంతా సినిమాలు చూశావా?? ఇప్పుడు నీది త్యాగం అనుకోవాలా??” అన్న ప్రశ్న నీ మెదడులో ఇప్పటికే వచ్చి ఉండాలి. మనతో వచ్చిన ప్రాబ్లమే అది.. నువ్వు అనుకునే లోపే నేను చదివేస్తాను నిన్ను. నేను నీకు అర్దం కాను.. బొత్తిగా!! నా ఒక్కో మాటని డీకోడ్ చెయ్యటం నీకు యజ్ఞంతో సమానం. నువ్వు వెతికేవి నాలో లేవు.. నీ నవ్వులో నా నవ్వు కలిస్తే అపశృతి. నా మాటలో గమకాలు వినపడవు. నా నడకలో లయ లేదు. నీ మనసులో పట్టలేనంత భారీ నేను. నిన్ను ఊహల్లో విరహింపచేయలేను. సాన్నిహిత్యంలో కట్టిపడేయలేను. నీకు పేమంటే శాస్త్రీయ సంగీతంలా ఉండాలి.. అది పూర్వజన్మ సుకృతం, నాకు వంటబట్టదు ఈ జన్మకి. అందుకే అన్నాను Workout కాదని.

ఈ అనుభూతులన్నీ నీ వరకూ చేరకూడదని చాల జాగ్రత్త పడ్డా ఇన్నాళ్ళూ, ఎట్టి పరిస్థితుల్లో మన స్నేహం గాయపడకోడదని!! “నీ మనసులో ఎవరో ఉన్నారని అంటున్నారంతా.. నాకు చెప్పవూ, లేకపోతే నా మీద ఒట్టే!!” అని నన్ను Emotional Blackmail చేశావు గనుక, మొదలే కాని నా ప్రేమకు ఇది “చివరి ప్రేమలేఖ”గా నిలిచింది!! జరిగినదాంట్లో నువ్వు guilty గా అనుకోవడానికి ఏమీ లేదు.. We were never made for one another..అంతే!! ఎవరైనా, ఎప్పుడైనా, ఎవరినైనా, ఎక్కడైనా ప్రేమించచ్చు. సహజీవనం మాత్రమే ప్రేమకు పరమావధి కాదు. ఇచ్చిపుచ్చుకోవటంలోనే పరిపూర్ణత లేదు.

ఇదంతా తెలిసి నాతో normal గా ఉండడం నీకు కష్టమైన పని. ఆ ఇబ్బంది నుండి తప్పించటానికే నేను వెళ్ళిపోతున్నాను.. నీ కంటికి కష్టం రానివ్వనని మాటిస్తున్నాను.. మనసుకు నువ్వే సర్దిచెప్పాలి. “నీ ప్లానింగ్ అంతా meticulous రా!!” అని నువ్వే అంటుంటావు.. నన్ను వెతకాలనే ప్రయత్నం వ్యర్దం అని మళ్లీ చెప్పాలా??
నీకు తెలియకుండానే ఓ జీవితకాలపు అనుభూతుల్ని నాకిచ్చావు. వాటితో నేను హాయిగా బ్రతికేస్తాను.. ఒక్క షరతు మీద. నాకు intuitions ఎక్కువ.. నీ విషయంలో మరీను.. సో.. నేను హాయిగా ఉండాలంటే.. నీవు ఆనందంగా ఉండాలి. మర్చిపోకు!! నాకోసం ఎమైనా చెయ్యాలనిపిస్తే ఈ ఒక్కటీ చెయ్యి.
నీ నేస్తం.
===================================================================
“ఏమీ ఆశించకుండా ప్రేమించటం గొప్పా?? తిరిగివచ్చేది గాయమే అని తెలిసీ కూడా ప్రేమించటం గొప్పా??” అని నా మనసు తెగ మీమాంశ పడుతుంది. బాధ కల్గుతున్నా ఆనందంగా ప్రేమించే మనసును ఇలా ఉంటుంది అన్నా ఊహను ఆవిష్కరించే ప్రయత్నమే ఈ చివరి ప్రేమలేఖ!!

Advertisements

వీకెండ్ అంటే శనాదివారాలు కాదా??


ఉద్యోగంలో చేరిన కొత్తలో మాచెడ్డ చిరాకు వచ్చిపడింది నాకు. వారమంతా ఆఫీసులో బాగానే ఉండేది, ఎక్కువ పనిభారం గానీ, బోరింగ్గా కానీ అనిపించేది కాదు. వారాంతరం అంటే కాస్త హాయిగా ఉండేది.. పనికి దూరంగా ఉన్నదానికన్నా ఓ 40 కి.మీ. ప్రయాణం చెయ్యక్కరలేదు అనే ఆనందమే ఎక్కువ. శుక్రవారం కాస్త పెందలాడే బయలుదేరి, మళ్ళా సోమవారం ఉత్సుకతో ఆఫీసుకు వెళ్ళడం అంటే భలే నచ్చేది నాకు. కానీ మండే మార్నింగ్ ప్రశ్న .. “వీకెండ్ ఏమి చేసావు” అన్న దానికి ఏం చెప్పాలో అర్ధమైయ్యేది కాదు.

సోమమంగళ వారాల్లో “వీకెండ్ ఏమి చేసావు?”, గురుశుక్రవారాల్లో “ఈ వీకెండ్ ఏంటి ప్లాన్స్?” , బుధవారంనాడు ఈ రెంటిలో ఏదో ఒకటి. ఇంచుమించుగా ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా కనిపించినా ఇవే ప్రశ్నలు. నన్నే కాదు ఎవరినైనా ఇవే ప్రశ్నలు. “అబ్బా” అనిపించేది మనసులో, బయటకు మాత్రం ఏమి చెప్పాలా అని తెగ గింజుకునేదాన్ని. “శుక్రవారం ఇంటికి వెళ్ళానా, అప్పుడే తన కాల్ వచ్చింది. రేపు రెడీగా ఉండు అని చెప్పాడు. Saturday పొద్దునే ప్రసాద్స్ లో మూవీ చూసాము. లంచ్ అక్కడే ఉన్న Waterfront లో, మబ్బుపట్టి ఉంది కదా, చల్లగా గాలి వేస్తుంటే yummy food తింటుంటే wooow ఉండింది. Necklace Road మీద కాసేపు షికార్లు కొట్టి, లీవైస్ లో తను, కళాంజలిలో నేను shopping చేసాము. ఇంటికి వచ్చేసరికి పదయ్యింది. అయినా తనివి తీరక రాత్రి మూడింటి వరకు చాట్టింగ్ చేసుకుంటూనే ఉన్నాము. మర్నాడు చాలా ఆలస్యంగా లేచినా, సాయత్రం కలుసుకుని Central లో Timepass చేసాము. రోడ్డు పక్కన చాట్ తిన్నాం” అని ఆపకుండా చెప్పాలనిపించేది నాకు. అబధ్ధమైతే అయ్యింది, చూసారా వీళ్ళూ అనుకునేదాన్ని.

సెలవుంటే ఏమి చేస్తాం? చెయ్యాల్సినవ్వన్నీ ఆలస్యంగా చేస్తాము. ఇంకా ఓపికుంటే ఎప్పుడూ చెయ్యని చేస్తాం, అంతే కాని అప్పటికప్పుడు కొండ తవ్వముకదా?? నేను బాగా నిద్రపోతాను. (పాపం అలసిపోయింది అన్న ఫీలింగ్ తో అమ్మ కూడా ఏమీ అనదు) టీవీ చూస్తాను. పుస్తకాలు చదువుతాను. Net surfing విపరీతంగా చేస్తాను. చాట్టింగూ ఎక్కువే!! మాంచి మూడులో ఉంటే కొత్త వంటకాలు ప్రయొగిస్తాను.. అసలే నా హాబీల లిస్ట్ చాంతాడంత ఉంటుంది. అయినా “How was the weekend?” మింగుడుపడేది కాదు. పైవాటిలో ఏమి చెప్పినా ఏదో వంక “నిద్రనే ఎంత సేపూ??”, “టీవీ లో చూసిన సినిమా కూడా సినిమానే??”, “ఎప్పుడూ పుస్తకాలేనా .. enjoy చెయ్యవూ??” , “net surfing & chatting కి వీకెండ్ ఆ?? ఆఫీసులో ఏమి చేస్తావు?” etc etc లాంటి కౌంటర్లు వచ్చేవి. వీకెండ్ అంటే శనిఆదివారాలనుకున్నా నేను, వాటిని కూడా స్టేటస్ సింబల్ గా ఎందుకు తీసుకుంటున్నారో.. మనకు మనం సమయం కేటాయించుకోకుండా.. ఇలా మాల్లు, సినిమాల్లు అంటూ ఎందుకు తిరగాలో నాకు అర్దమైయ్యేది కాదు. ఒకవేళ ఏ వింతో జరిగి, నేను అలా గడిపానే అనుకోండి, ఆ వారం నన్ను ఏవరూ ఏమీ అడిగేవారు కాదు, చిర్రెత్తుకొచ్చేది.

ఆ తర్వాత అర్ధమైంది.. అంతగా పరిచయం లేని వాళ్ళము గనుక, ఏదో ఒక విషయంతో మాటలు మొదలవ్వాలి కనుక, మాటా మాటా కలపడానికి ఈ ప్రశ్న ఉపయోగపడుతుందని. అలావాటు అయ్యిపోయాక, ఈ ప్రశ్న ఓ casual questionయే అని. మొదట్లో నేను పడిన ఇబ్బంది ఇప్పుడు నవ్వుతెప్పిస్తుంది. 🙂

ప్రశ్నాతీతాలేవి??


పదో తరగతిలో మాకు చరిత్ర మొత్తం “భారత స్వతంత్ర” పోరాటం గురించే పాఠాలు. ఎంతో ఆసక్తిగా ఉండేది చరిత్రంటే నాకు. చదివి ఊరుకునేది లేదు, దానిగురించి సమగ్ర చర్చలు జరిపేవాళ్ళం నేను నా మిత్రులు. అలా ఒకనాడు “గాంధీ వళ్ళ మనకు స్వాతంత్ర్యం రాలేదు. అప్పటికే రెండో ప్రపంచ యుద్ధంలో దారుణంగా నష్టపోయిన బ్రిటీషువాళ్ళు ఇంత సామ్రాజ్యాని పరిపాలించలేమేమో అన్న భయంతో కొంత, కొల్లగట్టడానికి భారత్ దగ్గర ఏమీ లేకపోవటం వల్ల మనకు స్వరాజ్యం వచ్చింది” అని ఒక అమ్మాయి అంది. ఆ వాదంలో నాకు ఏ మాత్రం నిజం కనిపించలేదు. అసలైతే నేను ఎందుకు ఒప్పుకోవటంలేదో చెప్పే దానను. కానీ ఆవేళ ఆ అమ్మాయి మీద భరించరాని కోపం వచ్చింది. “గాంధీ మహాత్మున్నే ప్రశ్నించే” తనతో ప్రతివాదన అనవసరమనిపించింది. జాతిపితను గౌరవించలేని తనను చూసి “అయ్యో!!” అనుకున్నా. ౩౦ కోట్ల భారతీయులను ఒక్క తాటిపై నిలబెట్టిన అవతారపురుషునిపైనా ఈ నెపం అని మధనపడ్డా!!

ఇంజనీరీంగు చేస్తున్న సమయంలో గాంధీజీ ఆత్మకథ “My experiments with Truth” చదివా. చదివే కొద్దీ గాంధీ మహాత్ముడన్న భావన సన్నగిల్లుతుందో, బలపడుతుందో అర్ధం కాలేదు. అవతారమూర్తి కాదని తెలిసింది. మనలా మామూలు మనిషే, నమ్ముకున్న సిద్ధాంతలను ఆమరణం చిత్తసుద్ధితో పాటించారు కాబట్టి, మహాత్మునిగా ఎదిగారు. నిజమేనేమో.. కేవలం అహింసావాదంతో మనకు స్వేఛ్చరాలేదేమో.. ఇంకా ఎన్నో త్యాగాలఫలం అది. ఎవరి దారీ తప్పు అనటానికి లేదు, ఎవరి సేవను విస్మరించడానికి లేదు. గాంధీ విధివిధానలను ఎవరైనా వ్యతిరేకిస్తే ఇప్పుడు ఆశక్తిగా వింటా.. వింటే పాపం అనే భ్రమపోయింది. ప్రశ్నించడం తప్పు కాదు, సరైన సమాధానం ఇవ్వక అసలు ప్రశ్నించడమే తప్పు అనడం అసమంజసంగా అని అవగతమైంది.

ప్రశ్న ఓ వింత ప్రహసనం. ప్రశ్నలేనిదే మానవ మనుగడే ప్రశ్నార్ధకం, ప్రశ్న అడగలేనప్పుడు ఎంత అస్సహాయతో!! ప్రశ్నకు జవాబు రానప్పుడు ఎంత నిరుత్సాహామో!! “అది ఏమిటి?”, “దీన్ని ఏమంటారు??” అన్న అమాయక ప్రశ్నలతో మొదలయ్యే జీవన ప్రయాణం, “నేను ఎవరు?” అన్న ప్రశ్నకు జవాబు కోసం అన్వేషిస్తుంది. ఆద్యంతాలకు నడుమ ఇంకెన్నో ప్రశ్నావళికి జవాబులు వెతకడమే జీవితం. ఇంత ముఖ్యమైన పాత్ర పోషించే ప్రశ్నకు ఏమి అడ్డంకులు ఉన్నవన్న ప్రశ్నే.. నన్ను నిలువనివ్వడంలేదు. “దేవుడే ఇవ్వన్నీ చేయమన్నాడా??” అంటూ నైవేద్యాలవంక చూపిస్తే లెంపలు వేసుకోమంటుంది. సినిమాలో సెన్స్ ఉందా అంటే ఫాన్స్ కి కోపం. రాముడున్నాడా అసలు అంటే మమల్ని అగౌరవిస్తున్నారు అంటారు. ఎక్కువ ప్రశ్నలు వేసే విద్యార్ది అంటే టీచరుకు మింగుడుపడదు. సీత స్థానంలో నువ్వుంటే రామున్ని ఇష్టపడేదానివా అనేది ఊహాజనితమైనా మనం ఆదరించలేము. కొన్ని ప్రశ్నలను ఎందుకు దాటవేస్తాము? ఎందుకు వాటిని ప్రశ్నలుగా భరించలేము? సమాధానం ఇవ్వకుండా ఎవేవో కారణాలు చెప్పి మనల్ని మనం సమాధానపరుచుకుంటాము? ప్రశ్నను అర్ధంచేసుకోకుండా.. అడిగినవాళ్ళను బద్ధ శత్రువులుగా భావిస్తారు.

“నువ్వు ఉన్నావా అసలు?” అని అడిగితే నిజంగా దేవుడుంటే ఆ ప్రశ్నకు ఆనందించాలి, తననే ప్రశ్నించే ధైర్యం, మేధస్సు ఉన్నందుకు సంతసించాలి గాని, నన్నే ప్రశ్నిస్తావా అంటూ శపించకూడదు కదా?? వీరిని ప్రశ్నించరాదు, ఇవ్వన్నీ ప్రశ్నలకు అతీతం అంటూ ఒక విభజన ఉందా?? మనకు నచ్చనవ్వన్నీ వ్యర్ధప్రశ్నలే అంటే మన పయనం కష్టమవదూ??

ఖుషీ ఇవ్వని “జల్సా”


“తెలుగు సినిమాలు జనంలోకి ఎంత ఎలా చొచ్చుకుపోయాయి అంటే.. ఇవ్వలా ఏ ఇద్దరు కలిసిన “బాగున్నారా” అన్న పలకరింపు తర్వాత ఫలానా సినిమా చూసావా?? ఆ పాట విన్నావా?? ఈ డైలాగు గుర్తుందా?? అన్నటాపికే!!” అంటూ మెగాస్టారు వారు ఒకానొక సందర్భంలో చెప్తుండగా వినే వరకు సినిమా గురించి నేను పెద్దగా పట్టించుకోలేదు. ఓ మూడు గంటల పాటు ఎవరో చెప్పదలచుకున్న విషయాన్ని వాళ్లకు నచ్చిన విధంగా చెప్తుంటే, చూసే ఓపిక నాకుండదు. నన్ను పూర్తిగా మంత్రముగ్దం చేసె సినిమాలు చాలా అరుదు. అవీ కూడా నీతి కథలా, సీరియస్ పుస్తకాల్లా ఉండాలి నాకు. కారణాంతరాల వల్ల ఈ మధ్యలో సినిమాలు చూడడం సంభవిస్తుంది కాబట్టి, నచ్చినా నచ్చక పోయినా, అమూల్యమైన రెండున్నర గంటలు వెచ్చించాను కనుక, దానికై ఆలోచించకుండా ఉండలేను. ఆలోచించాక వ్రాయకుండా ఉండలేను. అందుకే “చెప్పాలని ఉంది” అంటూ ఈ బ్లాగు.

ఇవ్వాల నేను చూసిన సినిమా “జల్సా”. పేరు ఓ మాదిరిగా నచ్చింది. కానీ త్రివిక్రం ఇంకా నచ్చుతారు.. అందుకే ధైర్యం చేసి వెళ్ళా. టికెట్లు దొరకడం నా అదృష్టమన్నారు. నిజమా?? అని అనుమానంగా అడిగా అప్పుడు. ఇప్పుడు అడగను, అవగతమైనాక. ఇక సినిమా మొదల్లోనే “Our Special Thanks to Mahesh” అనే సరికి ఎవరబ్బా అనుకున్నా, క్షణకాలంలో పోకిరిగొంతు వినగానే ఎందుకూ? అని అనిపించింది. పవన్ కళ్యాణ్ హైట్, వైట్ చెపితే additional info అనుకున్నా. కానీ అటు తర్వాత ఎలాంటి ఇన్ఫోకి తావు లేదని తేలిపోయింది. సినిమా నడుస్తూనే ఉంది, నేను కథ ఎక్కడ మొదలవుతుందా అని చూస్తూనే ఉన్నా. హిరో, హిరోయిన్, వాళ్ళ నాన్న, విలన్, వాడి కుడి భుజం అంతా వచ్చారు, పాటలూ అయిపోతున్నాయి. కానీ వాటన్నింటిని కలిపే లింక్ కనిపించలేదు. “నేను నక్సలైట్” అని పవణ్ డిక్లేర్ చెయ్యగానే కుంబ్లే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసినంత సంబరపడ్డా!! అందుకే సెకండ్ హాఫ్ చూసా!!

సినిమా మల్లా మొదలయింది… మల్లా అయిపోయింది.. నేను మాత్రం ఇంకా ఏంటో వెతుకుతున్నాను. మొన్న అంపశయ్య నవీన్ వ్రాసిన భాందవ్యాలు చదివా. అందులో ఒక వెనుకబడిన వర్గం కుర్రాడు, కష్టపడి చదివి చివరకు “అన్న”లతో కలిసిపోతాడు. అతను ఎలాంటి పరిస్థితులలో అలా చేసింది ఆ నవలలో చెప్పరు. ఈ సినిమాలో చూపిస్తారు ఏమో అనుకున్నా.. అత్యాశ కదూ?? సంజయ్ నక్సలైట్స్ లో కలవడానికి ఇంకా బలమైన కారణాలు చూపించి ఉండాల్సింది, కనీసం అతడి ఆలోచనా సరళిని పరిచయం చెయ్యాల్సింది. అందులో అతనికి నచ్చని విషయాలను ఇంకా ఫోకస్ చెయ్యాల్సింది. చదువుకున్న యువత ఎందుకు తప్పు దారి పడుతోంది, పట్టిన దారి తప్పని ఎలా తెలుస్తుంది, ఆ తప్పును సరిదిద్దుకున్నా సమాజం వారిని ఎలా ఆదరిస్తుంది అన్నవాటిపై దృష్టి సారించాల్సింది. ఇది ఎమైనా సొషియో – ఎకనోమిక్ డాక్యుమెంటరీ నా?? ఇవ్వనీ చూపటానికి అంటే.. ఆ రెండు మూడు సీనులు ఎందుకు?? మంచి విషయాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేదు నా ఉద్ధేశ్యంలో. సంజయ్ లోతును తెలుసుకున్నా అంటాడు వాయిస్ ఓవర్.. నాకు ఆ లోతు లోతుగా కనబడలేదు.

సినిమాలో వైలెన్స్ మాత్రం ఉల్లిక్కిపడేలా చేసింది. ఇంతకు ముందు బాంబు పేలిన సీను వస్తే .. సినిమా కదా అనిపించేది. ఈ సారి మాత్రం నిజంగా జరుగుతుంది కదా అన్న ఊహ భయం కలిగించింది. ఆ సంఘటన తాలూకు ఫొటోలు విలన్ జాగ్రత్త పెడుతుంటే.. నాకు మాత్రం గోకుల్ చాట్ బ్లాస్ట్ కథనాలే కళ్ళ ముందు కదలాడాయి. పవణ్ నుండి ఏమేమో ఆశించి వెళ్ళాను కనుక, తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాను. మాటల గారడీ బానే ఉన్నా.. ఎక్కువ సేపు నాతో నిలవలేదు. కాసేపు హాయిగా నవ్వుకునే సన్నివేశాలున్నాయి కాబట్టి హిట్ట్ టాక్ ఎందుకు వచ్చిందో అర్ధమైంది. ఇలియానా, బ్రహ్మానందం, ఆలీ, ప్రకాష్ రాజ్ ఉన్నారు అనిపించినా సునీల్ మాత్రం బాగా ఆనాడు నా కళ్ళకి. ఆరేళ్ళ క్రితం చూసిన ఖుషీ సినిమాతో పోలిస్తే ఇది ఏ మూలకూ రాదు.

యాక్టర్లు కాకుండా ఇలాంటి స్టార్స్ సినిమాకి వెళ్ళితే, చుక్కలే కనిపిస్తాయి. అయినా ఆలోచించే కొద్దీ ఆ చుక్కలని కలిపే సన్నని దారమేదో ఉందని.. దాన్ని పూర్తి స్థాయిలో వాడుకోలేదని అనిపిస్తుంది. “నేను, నా వాళ్ళు, నా సమస్యలు, నా సంతోషం” అన్న భావనతో కాలం వెళ్ళదీస్తున్న మనకు, ఏదో చెప్పి ఆలోచింపచేస్తారు అనుకున్నా.. చెప్పటం మొదలు పెట్టే తర్వాత “లైట్” తీసుకున్నారు. అక్కడే నాకు అసలు నచ్చలేదు. ఇవి కచ్చితంగా నా అభిప్రాయాలు, మీరు ఏకీభవించాలని గాని, సమర్దించాలని కాని అనుకోవటం లేదు. అన్ని సినిమాలు ఒక్కలా ఉండవు.. తీసేవారి లక్ష్యాలు వేరు వేరు కాబట్టి. అన్ని రెవ్యూలు ఒకేలా ఉండవు.. చూసేవారి మనస్తత్వాలు విభిన్నం కాబట్టి.

ఏడకి పోతాండ్రు??


నమస్తే అన్నా!! ఎట్లున్నారే?? అంతా బాగేనా?? ఇన్ని దినముల సంది గా మూలన పడున్నా.. గివలా ఎందుకో ఊరు మీదకు పొవాలే అని తెచ్చిండ్రు. పొద్దుగాల నుండి ఒక్కటే చక్కర్లు. ఇక ఇంటికి పొతాంటే మీరు కానొచ్చినారు.. మాట మాట కలుపుకుంటూ పోదాము రాండ్రి.

అసలు పొద్దుగాల రోడ్డు మీదకు రాగానే మస్తు పరెశాను అయ్యినా.. ఏడికాడికి గిట్లా తవ్విపెట్టినారు ఏమని? నడవలేక నడవలేక నడిచినా!! ఏమో మెగా సిటీ అంటున్నారు కదా, జుమ్మున పొదాం అనుకున్నా.. నత్త మల్లే నడిచి వచ్చినా.. తోవంతా తవ్వింది.. గాడ ఆ ఎక్స్ ప్రెస్స్ వే కడుతున్నారట గా!! రాను రాను ఊరంతా మారిపోయినట్టు కానచ్చే.. గా మెహదిపట్నం – సరోజిని దవాఖాన కాడ చిన్న చిన్న ఇల్లు ఉండే.. ఇప్పుడన్నీ మిద్దలే!! ఆడే కాదు.. మొత్తం అట్లనే ఉంది. ఆ పంజగుట్ట ట్రాఫిక్ లో గంట ఇరుకున్నా.. కదలలేము, నిలవలేము, హార్న్ లు కొడతానే ఉంటిరి.. కాలు పెట్టనీకి సందు లేదాడ.. గీ బైకుల మీద పొరగాళ్ళు పొతానే ఉన్నరు.. ఒక్కడు నన్ను డొక్కలో పొడిచిండు. నేనయితే నోరు మూసుకున్నా.. ముందర ఎవడో లొల్లి చెసినాడు. ఓ యమ్మా.. నరకమంటే గింతే అనుకున్నా. ఎట్లొ హైటెక్ సిటీ కాడకు పొయినా నిక్కుతూ నీల్గుతూ.. ఏం జబర్దస్తుగుంది ఆ మిద్దే.. నాకైతే దిమ్మతిరిగిందనుకో రాదు.. బానే నేర్వబట్టిరి అనుకున్నా.. ఆ రాస్తాలో గన్నీ గట్లానే ఉన్నయ్.. నా షెహరేనా అనిపించింది. మేగా సిటీ నుండి గ్రేటరు సిటీ గా మారుతున్నారటగా??

అటు నుండి… కోఠీకి పోవాల్సి వచ్చె!! అగుతూ నడుస్తూ వెళ్లింటిమి. సుల్తాన్ బజార్లో తిరుగాతా ఉంటే .. అమ్మా.. ఇది నా షహరే అని నమ్మకం కుదిరింది. గవె గల్లీలు, గవె దుక్కణాలు. అప్పట్లో ఉన్నట్టు జనం లేరు గాని, సందడిగా మాత్రం ఉందనట్టు. ఈ కొత్త పోరగాళ్లంతా గవివో “సెంట్రల్లు” అంటూ తిరుగుతాండ్రట గా.. నా చెవిన పడ్డది. అటె ఉన్న ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ కి ఎల్లగానే పాణం సమ్మగయ్యింది. ఏన్నెన్ని సినెమాలు ఈడ..అన్నీ యాదికి వస్తూనే ఉన్నయ్. కనీ ఇదేంది ఇంత ఉక్కగా ఉంది. గాలే లేకపాయే!! సరె.. అని అటు నుండి… మల్లా మెహిదిపట్నం వచ్చినా.. అప్పటికే ఓళ్ళు ఊహనమయ్యిందా.. గైనా ఈ పొరగాడు.. ఒకటే గోల చెవిలో .. పీక కొసిన వేట లెక్క ఒక్కటే కేకలు. అప్పు ఇచ్చినోడు కాడ కూడ అట్లా గదమాయించడేమో… దబాయించి మరీ కుర్సోబెడుతున్నాడు. ఇప్పుడె ఆ పోలీసు వచ్చి నన్ను దబా దబా బాదిన్నాడు. ముసల్దానని సూడకుండా.. అయ్యినా ఈడు మళ్ళా షురువయ్యిండు. ఇప్పుడు కనీశం ఎనిమిది-పది మంది ఎన్నడు ఎక్కుతారో.. నేను ఎప్పుడు కదులుతానో మల్లగుల్లలు పడతాంటే మీరు వచ్చిండ్రు.

ఇది నేను పుట్టి పెరిగిన ఊరేనా?? ఈళ్ళంతా నా మనుషులేనా అని ఓ అనుమానం వచ్చి పడ్డాది. నాకు తెల్వదా ఈ మనుషుల గురించి అనుకున్నా గాని సానానే మారిపొయిండ్రు మీరంతా.. ఈ ఉరుకులేంది?? ఈ పరుగులేంది?? ఒక్కడైనా నిదానంగా ఉంటడా అంటే.. ఎవడూ కానరాకపోయె. ఈ రోడ్లు, మిద్దెలు, సిటీలు, సెంట్రల్లు అన్నీ బానే ఉన్నై.. రేపు మా ఆటో లన్నీ మూల పడేసి ఆ కాబుల్లోనే తిరిగుతారేమో!! బానే అనిపిస్తాంది.. .కానీ మీరెమి గిలా దేనికీ కాకుండా పోతాండ్రు. పైసలు కట్టీ, ఎందుకలా మా ముందు సీట్లలో ఏలాడుతున్నారు? ఆడకూతుర్లను నడిమిట్ల దించేస్తారా.. పక్కకు జరగము అంటే. జర్రంత ఓపిక పట్టలేరు.. ట్రాఫిక్ లో!! అసలు “ఆప్ జావో .. ఆప్ జావో” అని లేట్ లతీఫ్ లు గా పిలిచేటోరు గదా మిమల్ని.. మీరేనా గిట్ల కాళ్ళు గాలిని పిల్లి లెక్క సెక్కర్లు కొడతాండ్రు?? ఎమయ్యింది మీకు?? ఎటు పోతాండ్రు మీరు?? ఎరుకేనా??
****************************************************************************************************************
The city of laidbackness నుండి The restless city గా మనం ఎదుగుతున్న(??) వైనం అగమ్యగోచరంగా ఉంది. సిటి విస్తరిస్తూనే ఉంది, మనమే ఇరుక్కుగా మారిపోతున్నాము. వాతావరణమే కాదు.. మన మనసులు అలాగే ఉన్నాయి. హైదరాబాదుతో అనుబంధం ఉన్నవాళ్ళే కాదు.. ఏ కొంచం తెలిసిన వాళ్ళూ కూడా “ఏంటిది??” అని ప్రశ్నించేలా చేసుకుంటున్నాము. ఆటో అన్నట్టు .. మన గమ్యం ఎటో ఎమీ తెలియదు.. కనీసం దారినైనా ఆశ్వాదిద్దామా??