రెండు కడుపునొప్పులు ;-(


అమ్మాయిలూ.. ఈ కింది బ్లాగును చూసిన దగ్గరనుండీ కడుపులో ఒకటే నొప్పి.. ఎందుకో మీకు తెలుసు 😉 Mr. Bean సినిమా మానేసి మరీ “టపా”యిస్తున్నా అంటే అర్ధం చేసుకోండి.

http://maheshwarams.blogspot.com/

చూడ్డమే కానీ.. ఇప్పుడున్న ధరలకి ఏం కొంటాములే అని అంటారు.. పోనీ చూడమైనా అవుతుంది కదా!! నేరుగా మనింటిలోకి.. వస్తున్న లక్ష్మిని కాదనగలమా??

ఇంతటితో టపా ఆపేస్తే.. నేను నేనెందుకు అవుతాను. 😉 సుత్తి లేకుండా సూటిగా చెప్పింది… సుత్తి రావాల్సిన బస్ కొంచెం లేటయ్యింనందుకు..ఇంకో కడుపు నొప్పిని తీసుకు వస్తుంది. అమ్మాయిలు ఇక వస్తారో లేదో.. మీరొచ్చేయ్యండీ..

*************************************************************************

ఒక సాయత్రం పూట.. అప్పుడే ఇంటికి చేరి కూలబడ్డా..

రేపు నువ్వు ఆఫీస్ మానేస్తున్నావు.. (అమ్మ)
“ఏం??”..
బయటకు వెళ్ళాలి.. షాపింగ్..
ఏం షాపింగ్??
బంగారం కొనాలి
నేను రాను పో..నాకు చాలా పనుంది. చెప్తే వినవేంటి.. టీమంతా ఆగాల్సి వస్తుంది నా కోసం.. లీవ్ దొరకదు.. అయినా బంగారం కొనడానికి మంచి రోజేంటి?? వీకెండ్ వెళ్ళకూడదా.. మాట విను.. రేపు కాదు,, ఇంకో మంచి రోజు.. మా.. …. …

సీన్ కట్ చేస్తే.. తెల్లారే లేచి.. “బాస్.. ఎమర్జెన్సీ.. లీవ్!!” ఫోన్ లో టెలిగ్రాముకు మల్లే చెప్పా!!
“ఓ.. క్రికెట్ట్ మాచ్.. సచిన్ ఇస్ ప్లేయింగ్??”
“లేదు.. ఇవ్వాల కూడా ఆడటం లేదు..అసలు తన గాయం ఎలాంటిదంటే..” హే.. ఏం చేస్తున్నా?? అసలందుకు కాదు కదా ఫోన్ చేస్తా..
“నో.. ఇట్స్ ఎ రియల్ ఎమర్జెన్సీ..” (మహా అయితే వారానికి రెండు మూడు రోజులు మాత్రమే మానేసే నా మీద అనుమానమా అన్న అమాయకత్వం ధ్వన్నించేట్టు)
“ఓ.కే.. హావ్ ఫన్..”

And the fun begins..

ఎనిమిదింటి కళ్ళా కొట్టు ముందు కూర్చున్నాము.. అందరికన్నా ముందే లోపలికి వెళ్ళాలి కదా.. లేకపోతే అంతే సంగతులు. ఇరుకు కొట్టు.. నేనూ మా అమ్మా (మా గాంగ్) ఎదురెదురుగా!! తీసి..పెడుతున్న నీలం రంగు, ఎరుపు రంగూ డబ్బాలు.. మా మధ్య రాబోతున్న దూరానికి వారధిలా!! చూపించటం మొదలెట్టగానే ఒకటి నచ్చింది. నచ్చాకా.. మనసూ ఆగదు.. నోరు అంతకన్నా!! “నాకిదే కావాలి” .. నిఖ్ఖచ్చిగా చెప్పేశా!! “అలా కాదమ్మా .. అన్నీ చూడండి” అంటూ అప్యాయంగా ఆ కొట్టతను అంటుంటే.. మధ్యన మా అమ్మ.. “ఆగుతావా??” అని ఆ ఫీలింగ్ ఎంజాయ్ చేయన్నివ్వకుండా!!

ఇంకా చూపిస్తున్నా.. ఇందాకటి దాని మీదే కళ్ళుండడం గమనించి.. “ఇది నీదే రా.. ఎవ్వరికీ ఇవ్వమూ.. ఇక్కడే ఉంచుకో.. కానీ మిగితావి చూడు నాన్న..” అని ఆ డబ్బా నాకిచేశారు షాపులో అందరికన్నా పెద్దాయన. ప్రత్యుపకారంగా పెద్ద బదులే ఇవ్వాల్సి వచ్చింది.. వీరరంగం మొదలు పెట్టారు.. ప్రతీది మెడలో పెడతారు.. చూడమంటారు.. (నన్ను కాదు చూడమనేది.. మా గాంగ్ ని) పెట్టి తీస్తారు.. తీసి పెడతారు. ఆ వేళ మెడ నరాలకి ఇచ్చిన exercise మల్లా ఇప్పటిదాకా దొరకలేదు. ఎంతెలా అంటే.. మరుసటి రోజు వెనుకున్నవి తేలికగా చూడగలిగా .. మొత్తం శరీరాన్నే తిప్పాక!!

అది చాలక మా అమ్మ.. లాంగ్ సైట్.. షోర్ట్ సైట్ లో కూడా పరీక్షించింది బంగారాన్ని తక్కువ.. నా ఓపికను ఎక్కువగా. అంటే.. పాతబస్తీ గల్లీల్లో.. ఇన్నోవా కారుని నడపడం మాట. అయితే మొదటి గేర్.. లేకపోతే రివర్స్!! వెలుతురులో నుంచో.. లైట్ కింద నిలుచో.. ఆ ఆంగిల్.. ఈ ఆంగిల్.. ఒక సారి నవ్వుతూ చూడూ.. మరీ ఇకిలించక. నేను మొడలింగ్ కి కొత్త అర్ధం ఆపాదిస్తుంటే.. కొట్లో ఉన్న మిగితా వారు.. ఆ అమ్మాయి ఇందాక పెట్టుకున్నది బాగుంది కదా.. “ఏది ఆంటీ అది??” అంటూ మా అమ్మను అడగడం.. మా అమ్మ వారి కోరికను నా శిరస్సున.. కాదు మెడను రుద్దటం.. మేమొచ్చింది మురుగుల కోసం.. బాగుందని అడిగాము.. ఇదే తీసుకోండి అని ఓ ఉచిత సలహా.. ఛాస్!!

ఏది నచ్చింది ఇందులో?? అన్న ప్రశ్నతో.. పెట్టుకుని చూపించడానికే రాలేదని నాకు గుర్తొచ్చింది. నేను చెప్పా.. ఆ మొదటి దాని గురించి!! చాలా మల్లగుల్లలు పడ్డాక.. అదే ఖరారు అయ్యింది 🙂

ఇప్పుడిక బేరాలు మొదలు. ఓడిపోవడం నాకలవాటు చేసింది ఈ బేరాలే. వంద రూపాయలన్న వస్తువును పాతికకు అడుగుతా.. వాడు చక్కా సంచిలో వస్తువు వేసి నవ్వుతూ ఇచ్చి పంపిస్తాడు. అంటే అది పాతికకన్నా చాలా చాలా తక్కువని అర్ధం. బేరాలాడడం నేర్పబడే.. కోచింగ్ సెంటర్స్ ఉంటే బాగుణ్ణు. క్రాష్ కోర్సైనా జాయిన్ అవుతా వెంటనే!! చెప్పరూ..

మొత్తానికి వాళ్లేదో డిసైడ్ అయ్యి.. రేటు.. బిల్ సెటిల్ చేస్తుంటే.. వాడిపోయిన నా మొహం చూసి..ఆ సేల్స్ పెర్సన్స్ లో అందరికన్నా చిన్న అబ్బాయి.. “ఇది చూడండి.. ఒక సినిమా హిరోయిన్ పెట్టుకోవాలని ప్రత్యేకంగా చేయించారు” అంటూ ఒకటి చూపించారు. ఏదో లోకంలో ఉన్న నేను Wall hangings అన్నా ఆశగా.. “హీరోయిన్ పెట్టుకోడానికి” అన్నాడు కోపం బయటకు రాకుండా!! “ఏం బాలే” అని చెప్పేసా ఖచ్చితంగా.

మొత్తానికి కావాల్సింది కొని ఇంటికి వచ్చే సరికి.. “కష్టం” అంటే అర్ధమైంది. పంచుకుంటే కష్టం తగ్గుతుందన్న వారిని ఇటు పంపించండి!! తెల్లారి ఆఫీసుకెల్లి అత్యావసరపు “ఉప్పరు మీటింగ్” పెట్టి ఈ నా సొద అంతా చెప్పా.. నన్ను కార్నెర్ చేయటం మాత్రమే తెలిసిన మా వాళ్ళు.. ఏ రేంజ్ లో ఇప్పటికీ విసిగిస్తారో చెప్పాలా??

*******************************************************************

ఎమ్.బి.ఏ లూ.. ఎమ్.ఎస్ లూ చేయని వీళ్ళు.. అంతలా మనుషులని ఎలా ఆకట్టుకుంటారు? నాకిష్టమైనది నాకిచ్చి.. మా అమ్మకి నచ్చేలా అన్నీ చూపించారు. అందులో ఏ ఒక్కటి చేయకపోయినా.. కొనడం అయ్యేది కాదు. విసిగి పోయిన వారికి.. తోచిన విధానంలో ఏదో ఆటవిడుపు ఇవ్వటం. ఇంటిలో వారందరకీ “అడిగామని” చెప్పడాలు.. వద్దన్నా మల్లా అటే వెళ్తాం. కనిపించిన వారందరకీ చెప్తాం.. business books చదివే ఓపిక లేకపోతే ఇలా ఒక షాపింగ్ చేస్తే సరిపోతుందేమో..కదా??

అవునూ.. ఒక సారి క్లాసులో సార్.. “మీరు గ్రీటింగ్ షాపుకి వెళ్ళారనుకోండీ.. అప్పుడు అక్కడున్న వాటిలో ఏది నచ్చితే అది తీసుకుని.. ఏదీ నచ్చక పొతే వట్టిగా వచ్చేస్తారా?? లేక ముందు ఉన్న వాటిలో నచ్చినవి పక్కకు పెట్టి.. మళ్ళీ వాటిలో నచ్చింది తీసుకుంటారా??” అని అడిగారు. ఎవరికి తోచింది వారు చెప్పాం.. కానీ ఈ రెంటిలో తేడా ఏంటని అడగలేదు. If actions speak the mind, can something to be read into these?? ఇది అడగాలనే రెండో కొడుపు నొప్పి!!

Advertisements

ఎందుకు??….ఇందుకు..


“ఎందుకూ??”

వచ్చే ప్రతీ అలా.. సాగరంలోకి తిరిగి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు
రావటం ఎందుకు?
పాదాన్ని తాకటం ఎందుకు?

వీచే ప్రతీ గాలీ.. నన్నుదాటుకుని పోవాలనుకున్నప్పుడు..
వీయటం ఎందుకు?
చెక్కిలిగింతలు పెట్టడమెందుకు??

కురిసే ప్రతీ వాన చుక్కా.. నాకు కాకుండా జారిపోవాలకున్నప్పుడు
కరుణించటం ఎందుకూ?
నన్ను తడపడమెందుకూ??

మురిసే ప్రతీ వెన్నెల రాత్రీ.. నేను నిద్రలో ఉండగా జారుకోవాలనుకున్నప్పుడు
కురవడం ఎందుకు?
నన్ను మైమరపించడం ఎందుకు??

చేరే ప్రతీ ఘడియా.. కాళ్ళాగని కాలమై”పోతు”న్నప్పుడు
నిలవటం ఎందుకు?
క్షణికంలోనే జీవితాన్ని నేర్పడం ఎందుకు??

ప్రతీ కలయికా విడిపోవడం కోసమే అయితే.. అసలది పుట్టడడం ఎందుకు??
వచ్చి ఇచ్చిన ఆనందం.. వెళ్ళేటప్పుడు తీసుకు పోడానికే అయితే.. ఇవ్వడం ఎందుకు??

పిచ్చీ.. రావటం.. పోవటం సహజం..
కలవటం.. విడిపోవటం ప్రకృతి విధానం
వెళ్తేనే కదా తిరిగి వస్తారంటూ..
వద్దు.. నాకేమీ చెప్పద్దు..

నన్ను శాస్వతంగా విడిచి వెళ్ళే నేస్తాన్ని చూడనివ్వకుండా ఇన్ని కన్నీళ్ళు ఎందుకు??

శ్రీవారే బదులిస్తే..


(ఈ టపా చదివేముందు… “శ్రీ వారికి ప్రేమలేఖ” చదివారో లేదో చూడండి. )

ఎటూ నువ్వు లేవు కదా అని చాలా సేపు స్నేహితులతో గడిపి, ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఇళ్ళంతా చీకటిగా ఉంది. ఒక లైట్ వేశాను.. చీకటిగానే ఉంది. అన్నీ లైటులూ వేసాను.. చీకటి పెరుగుతూనే ఉంది. ఇంకా చెప్పాలా, ఈ ఇంటికి, నా కంటికి వెలుగు నువ్వేనని?? I miss you అనీ!!

నీలా నవ్వు, పువ్వు అంటూ కవితలు రాయలేను. ఇలా లైట్ల సాయంతో నా పాట్లు చెప్పుకోవడమే తప్ప!! నీతో గలగలా మాట్లాడే ఆ మనీ ప్లాంట్ నాకన్నా వాడిపోయిన మొహం వేసుకుని కూర్చుంది. దానికోసమైనా తిరిగి వచ్చేయ్!! కాండిల్ వెలుగులో నువ్వు రాసిన ఉత్తరాన్ని మళ్ళీ చదువుతున్నాను.. ఇప్పటికి ఎన్ని సార్లు చదివాననీ.. నిజం చెప్పు.. నీ మనసుని ఈ అక్షరాలుగా disguise చేయడానికి ఏదో మంత్రం వేశావు కదూ?? మానవమాత్రులు ఇలా రాయలేరు కదూ??

మేము business mailsకి in-line replies పంపిస్తూ ఉంటాంరా… అవతలి వారు రాసినదాన్ని భాగాలుగా చేసి వాటి మధ్యనే మేము చెప్పదలచుకున్నది రాస్తాము. చదివే వారికి ఇరువురి అభిప్రాయాలు ఒక్కదగ్గరే ఉంటాయి. అలా నీ ఉత్తరంలోని ప్రతీ లైన్ కి నా మనసు స్పందించిన విధానం రాసి, దానినో ప్రేమ ప్రబంధ కావ్యం గా మార్చాలనిపిస్తుంది. కానీ నాకంత భాషా పరిజ్ఞానం లేదు. 😦 ఒక వేళ ఉన్నా రాయనేమో.. నా ప్రతీ ఊహనీ నాకన్నా ముందే చదివేసే నువ్వుండగా.. ఇలా కలం కాగితంతో తిప్పలు నాకెందుకు??

“అబ్బా.. చెప్పొచ్చారులే.. ఓ నాలుగు ముక్కలు రాయాలంటేనే బద్ధకం మీకు..” అని దెప్పుతావా?? నీ ఇష్టం.. నువ్వేదన్నా నాకిష్టం. తిలక్ కీ తిక్కన్నకీ తేడా తెలియదని నువ్వు నన్ను ఉడికించినట్టే.. Super genius, Vishwanathan Anand ని కూడా వాళ్ళావిడ “మొద్దూ..” అంటుందట.. సాల్సా నేర్చుకునేటప్పుడు అడుగులు తడబడితే!! మీకేం??.. పాదాలతోనైనా.. పదాలతోనైనా.. నాట్యం చేస్తారు, చేయిస్తారు. మాకది రాదే!! :-(( ఒక సారి నన్నూ “మొద్దూ” అని ముద్దుగా పిలవకూడదూ.. కారణం కావాలా??.. ఈ లేఖ మొదట్లో నిన్ను సంభోదించలేదని గేళి చేయి.. అప్పుడు నేనూ చెప్తాను.. నీ పేరుతో ఉత్తరం మొదలెట్టాల్సి వస్తే.. చివరి దాకా నీ పేరే ఉంటుందని, మధ్యన ఇంకో పదానికి ఆస్కారం ఇవ్వదు నా మనసని.

ఏంటీ?? నేనేనా రాస్తుంది?? స్ఫోర్ట్స్ కాలమ్స్ లో కూడా ప్రేమే కనిపిస్తుంది. నన్ను అంతగా మార్చేసావు నువ్వు. నన్ను నాకే కొత్తగా పరిచయం చేస్తావు ప్రతీ సారి.. నీ చెలం, నీ గీతాంజలి, నీ నాయుడు బావ వీళ్ళెవరినీ నేనెరుగను.. కానీ నాకు తెలిసిన Ayn Rand ఏమంటుందో చెప్పనా?? To say “I love you” one must first be able to say the “I” అని. “I” ని నీ వల్లే తెలుసుకున్నాను.. ఇక Love you……….. అని చెప్పకుండా ఉండగలనా??

ఇక నా practicality గురించి.. హమ్మ్.. నిజమే.. నేను చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తాను. ప్రతీ సమస్యకూ ఒక రియలిస్టిక్ సమాధానం ఉందని నమ్ముతాను. అందుకే తొలి నాళ్ళల్లో మన మధ్య దూరాన్ని ఒక ప్రాక్టికల్ ప్రశ్నతోనే దూరం చేశాను.. ఇంకెవరినైనా పెళ్ళి చేసుకుంటావా అని?? నాతో నువ్వు సంతోషంగా లేనప్పుడు నేనెంత ప్రేమించినా లాభం లేదు కదా?? నువ్వు చుర..చురా చూసినా.. అమితానందం.. నన్ను కోరుకుంటునావని భోధపడ్డాక!! ఈ జన్మే కాదు రా.. నేను కోరుకుంటున్నట్టు ఏడు జన్మల వరకూ నువ్వే నాక్కావాలి. ఆ “రాజేష్” కి నీకిష్టమైన రాజేష్ ఖన్నాసినిమా సీడీలివ్వు.. ఇప్పటినుండే అలవాటు పడతాడు జీవితం ఇంతే అని!!

నవ్వకు.. నేనే వాడి పేరు చెప్పాక.. నువ్వు నవ్వితే నాకస్సలు నచ్చదు. నిజం చెప్పనా.. నువ్వు లేకపోతే నాకు భయం!! అంత ఆశ్చర్యంగా చూస్తావే.. మాకూ భయాలుంటాయి.. చెప్పమంతే!! చిన్నప్పుడు స్కూల్లోనూ, కాలేజీలోనూ అంతా మాథ్స్ కి భయపడుతుంటే.. పిచ్చి వాళ్ళు అనుకునే వాణ్ణి. లెక్కలంటే నాకు భయం లేదు కానీ అమ్మ పెట్టే మెలికల ముగ్గు అంటే భయం నాకు. అమ్మ పెట్టేటప్పుడు శ్రద్ధగా చూసేవాణ్ణి.. అది నాకు జీవితంలా అనిపిస్తుంది. ఎక్కడ మొదలువుతుందో అక్కడికే వచ్చి చేరాలి. మధ్యలో ఎన్నెన్నో మలుపులు… కొన్ని ఊహించినవీ, కొన్ని నమ్మలేనివీ!! తీరాన్ని వదిలేసి.. జీవన సముద్రంపై ప్రయాణం సాగించి మళ్ళా అదే తీరానికి రావాలి. ఏమాత్రం అటూ ఇటూ అయినా.. ఇక గమ్యం చేరే ప్రశక్తే లేదు. ఎవరికీ తెలియకుండా ఓ కాగితం మీద ప్రాక్టీసు చేసేవాణ్ణి.. వచ్చేది కాదు. ఓడిపోతున్నానని బాధ. అమ్మ మాత్రం చక చకా వేసేసేది. అమ్మ ఉంది కదా అని ధీమా, నన్ను నడిపిస్తుందని.

నువ్వు నా చిటికెన వేలు పట్టుకుని, చాలదనట్టు ఇంకో చేతితో నా అదే చేయి పట్టుకుని నా భుజం పై తల వాల్చి నడుస్తుంటే.. ఆ మెలికల ముగ్గును, జీవితాన్ని జయిస్తాననే ధైర్యం వస్తుంది. ఏడడుగుల మీదే కాదు ఏడు జన్మలపైనా నమ్మకం కుదురుతుంది.

ఇన్నాళ్ళూ నువ్వలా నన్ను పట్టుకునేది నీ భయం పోగొట్టుకోడానికి కదూ.. అలా పట్టుకుని నా భయం పోగుడుతున్నావని నీకు తెలియదు కదూ.. కవులు “మనసున మనసై” అంటారే.. అది ఇదే!!

ఇంకో విషయం.. నేను వచ్చే వారం ఎక్కడికీ వెళ్ళడం లేదు. ఆ వేరే ప్రాంతంలో ఉన్నవాడికి ట్రేనింగ్ ఇవ్వాలి కదా.. దానికి ఒక అప్లికేషన్ ఉపయోగిస్తాము… అప్పుడు వాడు నేను నా పి.సి.లో ఏమి చేస్తున్నానో పూర్తిగా చూడగలడు. అలా చూపిస్తూ ఫోన్ లోనే ట్రేనింగ్ కానిచ్చేస్తా అని బాస్ ని ఒప్పించా!!

ఆగాగు…నిదానంగా గమనిస్తే మన ఉత్తరాల రాయబారం కూడా ఆ ఆప్లికేషన్ లా ఉంది కదూ. నువ్వుక్కిడ లేకపోయినా నువ్వున్నట్టు ఊహించుకుని రాయడం.. నాలోనే ఉన్నావన్న నమ్మకాన్ని గెలిపిస్తుంది. ఉత్తరంలో ఉన్నది ఒక మనసే అయ్యినా.. full conversation లా ఎందుకనిపిస్తుంది?? ఏమో?? నీకు తెలుసా??

ఇప్పటికే గెడ్డం పెరిగి, అది మాసి.. గీతాంజలిలో నాగార్జునలా ఉన్నాను. నువ్వింకా ఆలస్యం చేస్తే.. ఆఫీసువాళ్ళు firing letter తో పాటు ఓ షాలు, బాటిలూ ఇస్తారు. ఏ రంగు తీసుకోనో చెప్పడానికైనా త్వరాగా వచ్చేయ్!! రాస్తూ ఉంటే ఆగేటట్టు లేదు.. ఇక ఆగక తప్పదు..

నీ,
ముద్దోచ్చే.. మొద్దబ్బాయి

******************************************************************************************************

“నువ్వు అడిగింది ఏనాడైనా కాదన్నానా.. నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా” అంటూ పాటలు పాడి మరీ నా చుట్టూ sincere తిరిగే నా మనసు.. నిషీ ప్రేమలేఖ చదివిన దగ్గరనుండీ ఓ full u turn కొట్టి “ఛాస్.. ఈ పిల్లెవరో చిత్తగొట్టేసింది. నాకే ఈ ప్రేమలేఖ వచ్చి ఉంటే..” అని తెగ మెలికలు తిరిగిపోతుంది. దాని నస భరించలేక.. లీవైస్ లో కొన్న పాంటూ చొక్కా దానికి తొడిగి, రీబాక్ షూస్ తగిలించి.. ఇక నీ ఇష్టం అని వదిలేస్తే.. ఇదో ఈ టపా అయ్యి కూర్చుంది.

పుస్తకాలనీ, సినిమాలనీ, విజయాలనీ అంకితం ఇస్తారే.. అలా అనుభూతుల్ని కూడా అంకితమంటూ ఇవ్వగలిగితే.. అది ఇద్దరికి ఇవ్వాలి.. ఒకరు నిషీ.. మరొకరు ప్రవీణ్. ఒకరు ఇంత అందాన్ని ఆవిష్కరిస్తే.. మరొకరు ఆ అందాన్ని అందరికీ అందేలా చేసారు. తెలుగు బ్లాగు పుస్తకం చదవకపోయుంటే.. ఇంత అందమైన అనుభవం పూర్తిగా కోల్పోయేదాన్ని!!

I’m very sorry.. అన్నా వందో సారి….


సరదాగా మన్నించేయ్ ఒక సారి అని బ్లాగ్లోకానికి నా క్షమాపణలు పాట పాడి చెప్పగలను.. కానీ భయంకరంగా జలుబు చేసింది. అసలే అంతంత మాత్రం స్వరం.. ఇక ఈ పరిస్థితుల్లో పాడితే ఇక అంతే సంగతులు.

క్రికెట్ట్ సీరీస్ ఓడిపోయాకా మన వాళ్ళు వచ్చి చెప్పే సాకుల్లా చెప్పవచ్చు.. కానీ క్రికెట్ట్ ఇష్టం లేని వారికి తలకెక్కదు. పంచుకుంటే తలనొప్పి తగ్గిపోతుందని నాకెవ్వరూ చెప్పలేదు..

చేజేతులారా ఉన్న సీట్లను అందరికీ పంచేసిన కే.సీ.ఆర్ లా నేనూ రాజీనామా చేస్తున్నానంటూ బెదిరించవచ్చు.. కానీ నన్నెవరూ ఆపకపోతే.. “పోతే .. ఫో” అనేస్తా.. అమ్మో.. నేను ఈ లోకాన్ని వదలేను.

“పెంచాల్సినవన్నీ పెంచేసి” మన్మోహన్ సింగ్ లా ఆపద్ధ్రర్మం అని ప్రెస్ మీట్ పెట్టచ్చు.. కానీ రాజకీయనేతల్లా నేనూ వోట్ల కోసం.. అదే వ్యాఖ్యల కోసం చేస్తున్నానని అనుకుంటే మరీ కష్టం.

అందుకే ఎప్పటిలాగానే నా సోది మొదలుపెట్టేస్తాను..

ఇవాళ పొద్దున్న నాకొచ్చిన వ్యాఖ్యలకు సమాధానం ఇస్తూ.. నేనసలు చదివిన పుస్తకాల గురించి నాకు నచ్చినవి రాస్తున్నానే కానీ.. ఆ పుస్తకాన్నిలో తప్పొప్పులు రాయటం లేదు.. రాయాలనీ లేదు. అందుకనీ ఆ టపాలకు తోకలు అనగా “లేబెల్స్” మారుద్దామని ప్రత్నించా. అప్పటికే ఉన్నవాటిని ఎలా మార్చాలో తెలియకపోవడంతో కొత్తవాటిని రాసి అతికించా. బానే అత్తుకున్నాయ్ తోకలు.. కానీ “కొత్తగా తోకలొచ్చెనే” అని పాడుకుంటూ నా టపాలన్నీ కూడలిలో పునఃప్రత్యక్షమైనాయి. చూసి మనసు చివ్వుకుమ్మంది. నాకే కష్టం గా ఉంటే ఇక చూసేవారికి.. ఎలా ఉంటుందో??!! అందుకే ఈ టపా.. మన్నించండి.. ఉద్ధేశ్య పూర్వకంగా జరిగింది కాదు. ఇలా జరుగుతుందని తెలిస్తే.. రోజుకో టపాను మారుస్తాను..నేనూ బంగారు బాతు కథ విని నీతిని అర్ధం చేసుకున్నాను. 😉

On a serious note, my sincere apologies to one and all!!

బాబా గారికి, NETIZEN వారికి ధన్యవాదాలు!!


న్యాయంగా ఈ టపాకి సీతారామారావు Vs డోరియన్ గ్రే అని శీర్షిక పెట్టి ఎప్పటిలానే నా సోది మొదలెడితే… ఎవరు చదువుతారో చదవరో గాని, నేను కృతజ్ఞతలు చెప్పాలనుకున్న బాబా గారు, నెటిజెన్ వారు చూడకపోతే ఈ టపా ఇక్కడ రాసి దండగ!! వీరెవరో బ్లాగ్లోకానికి నేను చెప్పనవసరం లేదు. అందుకే సీతారామా రావు, డోరియన్లను పరిచయం చేసుకుందాం.

సీతా రామారావు.. త్రిపురనేని గోపిచంద్ రాసిన “అసమర్ధుని జీవయాత్ర” అనే తెలుగు నవలలో కథానాయకుడు. డోరియన్ గ్రే.. ఆస్కర్ వైల్డ్ రచించిన ఇంగ్లీషు నవల “ది పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే” లో నాయకుడు. నేను అసమర్ధుని జీవయాత్ర పై రాసిన టపా కి బాబా గారు “ఎక్కడో చదివాను ఈ పుస్తకానికి డోరియన్ గ్రే కి సారూప్యం ఉండని ఆ వివరాలు ఎవరైనా తెలుపగరలరా?” అని వ్యాఖ్యానించారు. “నాకు తెలియదండీ” అని చేతులెత్తేసే ప్లానులో ఉండగా.. ” ఎవరండీ,అన్నది, డొరియన్ గ్రేకి, అసమర్ధుని జీవయాత్రకి కధలో పోలికలున్నవని? నక్క ఎక్కడ, నాగలోకం ఎక్కడ?” అన్న నెటిజన్ వారు ఈ ప్రశ్నకు సమాధానమల్లే కనిపించారు. “చెప్పండి.. చెప్పండి” అని వెంటబడితే చెప్పేస్తారనుకున్నాను. రెండు పుస్తకాలకీ లంకెలిచ్చి.. చుదువుకో అని చెప్పకనే చెప్పారు.

ఇక చేసేది ఏమీ లేక.. డోరియన్ గ్రే గురించి కాస్త తెలిస్తే.. పుస్తకం కొనాలో లేదో నిర్ణయించుకోవచ్చునని మొదలు పెట్టా!! నవల పూర్తి చేయగానే.. పేజీ మధ్యలో మడత పెట్టి ఒక భాగం లో సీతారామారావని, మరో దాంట్లో గ్రేని పెట్టి.. 1, 2, 3 అని వారిలో తేడాలు రాసేసి.. “నాకర్ధమియ్యిందీ” అని ఓ టపా రాయాలన్న ఆశయంతో మొదలుపెట్టినా.. చదువుతున్నంత సేపూ ఇక ఏ ఇతర ఆలోచనా రాకుండా ఈ రచనలో మినిగిపోయా. నవల పూర్తి అయ్యింది. ఇప్పుడు ఈ కథానాయకుల సారూప్యం చూద్దామా??

ఈ ఇద్దరూ నవలా కాలంలో బోలెడన్ని మార్పులకు గురవుతారు. మొదట్లో.. అందరి లానే ఉంది.. ఒక సుఖవంతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆనందిచడానికి పూర్తి అవకాశం ఉన్న వీరిద్దరూ.. నవల ముగిసేసరికి ఒక భయంకరమైన విఫలంగా మిగిలిపోతారు. ఇద్దరూ.. ఆత్మహత్య చేసుకుంటారు. ఇలాంటి మనుషులూ ఉంటారా అని అనుమానం కలిగేలా ఉంటుంది వీరి ప్రవర్తన.. కానీ నిజానికి వీరిద్దరూ మనందరిలో చిన్ని చిన్నిపాళ్ళల్లో అయినా ఉంటారు. వీరిద్దరి అధోగతికి మాత్రం కారణాలు వేరు.. ఒకరు తన comfort zone వదిలి బయటకు రాక.. మరొకరు అవతలి వారి comfort గమనించక అసమర్ధులుగా మిగిలిపోతారు. ఒకరు false prestigeకి చిరునామాగా మారితే.. మరొకరు youth and pleasureకి బానిసవుతాడు. ఇద్దరి జాతి, మతం, వ్యవహార శైలి, ఆలోచనా సరళి, జీవితాన్ని జీవించిన విధానం, విఫలమనిపించుకోడానికి కారణాలు చాలా చాలా విభిన్నం. ఈ పాత్రల ద్వారా ఆయా రచయితలు చెప్పాలనే విషయాలకు.. నిజంగానే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా!! ఈ రెండూ నేను చదివిన విభిన్న పుస్తకాలు. నాకు నచ్చిన పుస్తకాలు. నాలా quotation collection hobby ఉన్నవారికి ఈ పుస్తకాలు.. ఖజానాలు.

ఇదీ నాకర్ధమైన విషయం. మీరు ఏకీభవించక పోతే.. కారణాలు తెలుపగలరు. ఒక సందేహం కూడా ఉంది. నాయకుడు.. ప్రతినాయకుడూ అన్న పదాలు తరుచుగా ఎవరిని ఉద్ధేశ్యించి అంటామో మనకి తెలుసు. ఈ రెండు కథలలోనూ lead character (అసలు కథ ఎవరి గురించో వారు..) ప్రతినాయకుడల్లే అనిపిస్తూ.. ఒక disaster లా కనిపిస్తారు. వీరిని కూడా “కథానాయకులు” అని వ్యవహరించవచ్చా?? లేక ఇలాంటి పాత్రలను వేరేగా అనాలా?? సందేహం నివృత్తి చేయగలరు.

ఎలాంటి పుస్తకాన్ని (హార్డ్ కాపీలు మాత్రమే) అయినా సరే ఏకబిగువ చదివే నాకు, ఈ పుస్తకం వల్ల రెండు విజయాలు కలిగాయి.. ఒకటి.. 230 పేజీలున్న ఈ నవలను పూర్తిగా ఆన్-లైన్ లో చదవటం.. రోజులో కొన్ని ముఖ్య పనులకు మధ్య ఉండే ఐదు-పది నిమిషాల వ్యవధిని ఉపయోగిస్తూ నవలను పూర్తి చేయటం. అందుకు నాకు నేనే ఓ చిన్ని పార్టీ ఇచ్చుకోవాలేమో. 😉

ఈ పుస్తకాలను చదవదలచిన వారు, కింది లంకెలను చూడగలరు.
అసమర్ధుని జీవయాత్ర

The Picture of Dorian Gray.

పుస్తకాన్ని పరిచయం చేసిన బాబాగారికి, చదివేలా చేసిన నెటిజన్ వారికి మరో మారు హృదయపూర్వక ధన్యవాదాలు.

దశ తప్పిన బ్లాగావతారం


దేవుడున్నాడు.. తేడాలొస్తే శపిస్తాడు అనుకునే వారు.. ఈ టపా చదవకుండా ఇటు నుండి ఇటే టపాకట్టేయ్యండి. దేవుడున్నాడు.. కానీ దయాహృదయుడు అనుకునే వారు.. భారాన్నంతా దేవుడు మీద వేసి చదవటం మొదలు పెట్టండి. దేవుడున్నాడని నమ్మని వారు మీ బాగేజీని నమ్మినవారికి ఇచ్చి ఇటు రండి.

*********************************************************************************************************
బ్లాగ్ ప్రపంచంలో ఏదో జరుగుతూనే ఉంటుంది.. కొన్ని మనకు తెలుస్తాయి, మరి కొన్ని అసలు కనపడవు. ఒక టపా నుండి మొదలైన ఆలోచన వేలానువేల కోట్ల అడ్డంకులను అధిగమిస్తూ మరలా ఓ టపాగా రూపాంతరం చెందుతుంది. ఒక టపా ప్రకంపనలు ఒక టపాలో స్పందనగా సీతాకోకచిలుక రెక్కల టపటపలా మారే సందర్భాలు ఉన్నాయి. ఇది మానవ మానస ప్రయత్నమా… లేదా ఒక అద్వీతీయమైన శక్తి వీటి వెనుకుందా అంటే.. ఓ కథ చెప్పాలి. ఆ కథలో ముఖ్యపాత్రనాదే!! ఇప్పుడు మీకా కథను క్లుప్తంగా చెప్పాలన్నా కనీసం మనం గత మంగళవారం వరకూ అయినా ప్రయాణించక తప్పదు.

17-06-2008, మధ్యాహ్నం ఒంటిగంటన్నర, ప్రాంతం: ఆఫీసులో నా డెస్క్.

అత్యంత శ్రమతో రెండు కాళ్ళూ కూర్చిపై పెట్టి నీల్ డౌన్ (స్కూల్ లో అవకాశాలు పెద్దగా రాలేదు మరి 😦 ) చేసి .. రెండు చేతులూ పైకి లేపి, హెడ్ ఫోన్ ద్వారా వస్తున్న linkin park musicకి బొత్తిగా లయ కలపకుండా, ఆదిత్యా ఛానల్ ఆంకర్లల కన్నా కొంచెం అతిగా ఊగితూ ఎందుకో అటు చూస్తే.. ఓ అబ్బాయి నోరు వెళ్ళబెట్టుకుని నేను ఏమి చేయడానికి ప్రయత్నిస్తున్నానా అని చూస్తుండడం చూసాను. అందరూ లంచ్ కి వెళ్ళారు కదా.. హాయిగా ఏకాంత వేళ.. ఉప్పోంగే భావాల్లా ఆడుకుందామనుకుంటే.. పాపం ఓ జీవి హతాసుడైనాడు. ఛాస్.. కాఫీ బ్రేక్ లో ఓ రెండు మూడు ఛలోక్తులు విసిరి మరీ కొట్టిన impression ఎత్తిపోయింది. కొత్త ఎంట్రీ కావున వచ్చేవారం ట్రేనింగ్ లో మన టాలెంట్ చూపవచ్చునులే.. ఈ లింకిన్ పాటలకు ఊగుతుంటే.. ఏదో పూన్నిందనుకునే ప్రమాదం ఉందని గ్రహించి చట్టుకున U turn తీసుకుని, ఇళయరాజా కలెక్షన్ వినడం మొదలుపెట్టా. కంటి చూపుతో చంపేయచ్చు అని తెలుసుగాని, ఐదో గేర్ లో హైవే లో దూసుకుపోతున్న నా మనసును ఒకే ఒక్క చూపు వల్ల ఒకటో గేర్ లో గతుకుల రోడ్డు మీదకు తీసుకురావచ్చని ఇప్పుడే అవగతమైంది. బోర్లా వేసిన Dust bin పై కాళ్ళు చాచుకుని, కూర్చిలో వెనక్కి వాలి, కళ్ళు మూసుకుని వస్తున్న పాటను ఆశ్వాదిస్తుంటే.. ఇదీ బానే ఉందే అనుకుంటూండగా,,, “డభ్” అని చెవిలో ఒక శబ్దం. కళ్ళు తెరిచి చూద్దును కదా..

“మగవారి హక్కులను సోదాహరణంగా వివరింపుడు” (60 m) అన్న మెసేజ్ కనిపించింది జీటాక్ లో..
ఏంటీ అరవై మార్కులూ నాకేనా?? ఎంతకీ??
అది ప్రశ్న.. నీ జవాబు బట్టి మార్కులు ఉంటాయి..
అదే కదా నేను బ్లాగ్ చేసింది? చదవలేదా??
ఓ.. అవునా?? చూస్తానుండు..

చేతిలో ఓ గులాబీ ఉంటే బాగుణ్ణు.. “Like my post, Not like my post” అంటూ రేకులు తెంపుతూ రిసల్ట్ కోసం తెలుగు సినిమా హీరోయిన్ లా రొమాంటిక్ గా ఎదురుచూసేదాన్ని. ఇప్పుడేమో ఆర్ట్ సినిమాల్లోలా .. deep breaths, huge sighs!! ఏమంటారో.. బాగుంది అని తనకనిపిస్తుందా… “what nonsense” అని నాకు వినిపిస్తుందా?? క్షణంలో నాగైదు సార్లు మారే నా ముఖకళవికలను చూస్తే జంధ్యాల గారు “వెలగనా వద్దా అని ఆలోచించే tubelight మొహమూ.. నువ్వూనూ” అని అనేవారు. రామా!! ఎందుకొచ్చిన తిప్పలు నాకు ఇవి. మగవారు.. వారి హక్కులు.. చివరికి నా తిప్పలు. అప్పటికే లంచ్ లో అరవీరభయంకరంగా జరిగిన చర్చలో.. మా భాషలో నువ్వు రాసినదాన్ని “తడి గుడ్డతో గొంతు కోయటం” అంటారు అని తీర్మానించారు. వారి భాష తెలుగు. నా భాష ఏ రకైమన తెలుగు కిందా పరిగణించలేమని చాలా పూర్వమే నిర్ణయం తీసేసుకున్నారు. నాది తెలుగే అని ఒప్పించడం కన్నా.. నా భాషకు ఓ గుర్తింపు తెచ్చి indian currencyలో ఒక ఎంట్రీ లా వేయించుకోవటం తేలిక!! ముక్కూ మొహం తెలియని అబ్బాయిలను blogger లో moderate చెయ్యచ్చు అన్న ధైర్యంతో టపా రాసినా.. ఇప్పుడు మా వాళ్ళందరికీ తెలిసేలా చెయ్యటం అవసరమా?? అవసరమే.. బగ్ (software bug) తప్ప నాకో ప్రపంచం లేదని వీరంతా నన్నో బగ్ (పురుగు) లా చూస్తుంటే.. నేను సైతం అంటూ వీళ్ళకు తెలియద్దూ??

బాగుంది రా… నీ బ్లాగ్. బాగా రాశావ్ అన్న ఫలితం వెలువడింది. (అనవసరం గా టెంషన్ పడ్డానే.. పోనీలే..)
ఇది విను .. (ఓ ఫైల్ నా వైపు ప్రయాణిస్తుంది.)
ఏంటిది.. దీనికీ నా టపాకీ లింకా?? (తిట్లున్న ఆడియో ఫైల్ కూడా దొరుకుతున్నాయేమో అన్న భయంతో)
కాదు.. ఇది నీ వచ్చే టపాలో విషయం.

తీరా చూస్తే.. దశావతారం లోని “రాముని మాత్రం కంటే..” పాట. ఆసాంతం విని..

విన్నాను.. శైవులు, వైష్ణువులకు మధ్యపోరాటం..
ఊ.. కానీ అది కాదు నువ్వు రాయాల్సింది.
మరి??
ఈ సినిమాలో కమల్ ఏమి చెప్పాలనుకున్నాడో నాకర్ధం కాలేదు. నువ్వు చెప్పు.
నేనీ సినిమా చూడలేదు..
అయితే చూసి రాయి.
మీకే అర్ధం కాకపోతే.. ఇక నా చిట్టి బుర్ర సంగతేంటి..
అయినా సరే..

అనుకున్నా ఇలాంటిదేదో జరుగుతుందని. ఎంచుమించు రాముడంతటి వారు.. ఎక్కు పెట్టిన ప్రశ్నను అలా వృధా చేయరు. హైదరాబాదులో పర్వాతాలు లేవుకనుక నాలాంటి పిచ్చుక మీద ప్రయోగించడమే. కానీ ఇప్పుడు నేనే రాముణ్ణి.. ఎలా అంటారా?? కైక పట్టుతో తండ్రి ఆన మేరకు రాముడు అరణ్యవాసం కి వెళ్ళెను. ఇప్పుడు రాయమన్న ఆ మనిషి ఐ.టీలో బిక్కుబిక్కుమంటున్న నాకు, ఉన్న ఏకైక గాడ్ ఫాదర్. రాముడు నేను. తెల్లారగట్ల 9:30 కి సినిమా చూడడానికి, అదీ ఓ శనివారం పూట.. ఇంతకన్నా అరణ్యవాసం ఉంటుందా!! మరి కైక ఎవరు అని అడగకండి… “మగవారి హక్కులే నా డిమాండ్” అన్న నా టపా!!

నా అరణ్యవాసం కబురు మా రాజ్యమంతటా (టీమంతా) పాకటంతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి “సంతాపం” ప్రకటించారు. పది కమల్ హాసన్లు ఎవరెవరు లాంటి క్లిష్ట ప్రశ్నలకు.. స్ర్కీన్ మీద ఎక్కువ సేపు ఎవరు కనిపిస్తే.. వారంతా కమల్ లాంటి చిట్కాలు చెప్పారు. మనుషులకే ఎంసెట్లు, ఈసెట్లు ఉంటాయని.. ధైర్యంగా ఉండమనీ వెన్ను తట్టారు. కంటనీరు ఆపుకుంటూ.. నా మనోధైర్యాన్ని పెంచడానికి “సినిమాని సినిమాలానే చూడాలి” అన్న తారక మంత్రం ఉపదేశించారు. శుక్రవారం పూట ఇంటికి వెళ్తుండగా అందరూ మరీ మరీ చెప్పి పంపించారు.. జాగ్రత్త అని.

శనివారం తెల్లారింది. ఈ సూర్యుడు కూడా లేట్ రావచ్చు కదా?? మరీ ఇంత టైమ్ ఫాలోయింగా!! రాత్రి నిద్రలేక ఇప్పుడు ఇంత త్వరగా లేచి.. ఛా!! ఎలా అయితేనేమి 9 గంటలకు ప్రసాద్స్ చేరుకున్నాము. నేను అరణ్యవాసంలా భావిస్తున్నానని వీడికెలా తెలిసిందో.. సకల ఏర్పాట్లు చేశాడు.. ఏ మాత్రం సౌకర్యం కలగకుండా!! ముందు ఓ ఐదు నిమిషాలు గేట్ దగ్గరే నిలుచోబెట్టాడు. సినిమా థియేటర్ గేట్ల ముందు పడిగాపులు పడాల్సి వస్తుంది.. ఖర్మ!! తర్వాత ఎలానో పంపించాడు. ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేసుకున్న నాలాంటి వారి నుండి.. రేపటి షోకి టికెట్స్ ఉన్నాయా అని కనుక్కోడానికి మాత్రమే వచ్చినవారుతో సహా అందరూ కలిసి పెద్ద క్యూలు కట్టాము ప్రతీ కౌంటరు దగ్గర. ఎంత సేపనీ ఇలా నిలబడడం అన్న నిరాశకి నా లైన్ త్వరగా కదలటం ఊరటనిచ్చింది. చక చక కదిలిపోతుంది. నా ముందో ముగ్గురు ఉన్నారంతే.. ఆహా భాగ్యం అనుకుంటున్న నాకు హావెల్స్ ఆడ్ లోలా షాక్ కొట్టింది. అసలు అక్కడ కౌంటరు తెరిచే లేదు. ఇప్పటి వరకూ అంతా ఎందుకు నిలుచున్నారు? వెళ్ళిపోతున్న వారెవ్వరూ చెప్పలేదు?? అక్కడ కూడా లాజిక్క్ పీకుతుంది నా మనసు. “ఇలానే నిలుచుని ఉంటే వాళ్ళు అలానే నిలబెడతారమ్మాయ్.. చెప్పు టికెట్స్ తీసుకోమని.” అని నా వెనుక ఒక అతను అన్నారు. వారు చెప్పింది నేనింకా డీకోడ్ చేసుకుంటూ వింత మొహమేసుకుని చూస్తుంటే.. కౌంటర్లో పిల్ల “మేము నిలబడద్దన్నా.. అంతా నుంచున్నారు.. సరే ఇటు ఇవ్వండి” అని మాకు టికెట్స్ ఇచ్చింది. ఇంతకు ముందు రియాక్ట్ అవ్వటం ఆలస్యం అవటంతో బాటు నా వెర్రి మొహం చూసి నాకు తెలుగు రాదనుకుని.. “You should raise voice.. otherwise people won’t notice you.” అని అతను అనేసరికి అభిమానం పొడుకొచ్చి “ఈ కౌంటర్ తెరిచి లేదు” అన్న సమాచారాన్ని నాకొచ్చిన మూడు భాషల్లోనూ రైల్వే అనౌన్సర్ లా చెప్పుకుంటూ పైకి ఎక్కా!!

ఇంక ఐదు నిమిషాలే ఉంది.. సినిమా మొదలవడానికి. ఇంత ఆపదలోనూ ఎస్కలేటర్ అంటే భయం పోలేదు. మెట్లే ఎక్కా.ఆయాసంతో, అలసటతో పాటు కొనుకున్న పాప్ కార్న్ తీసుకుని వెళ్ళి సీటులో కూలబడ్డా.. సినిమా మొదలయ్యింది.. విరామం వచ్చింది. మల్లా మొదలయ్యింది.. మల్లా అయ్యిపోయింది. మా వాళ్ళు ఇచ్చిన తారకమంత్రం భలే పనిచేసింది అందుకే.. “బుష్ కాబిన్ లో మిగిలిన వారు అమెరికన్ ఆక్సెంట్ తో ఎందుకు మాట్లాడడం లేదూ??, బైయో వెపన్ లాంటి కీలక ఆంతరంగిక విషయాన్ని అమెరికా వాళ్ళు భారతీయులకు వదిలేస్తారా?? అమెరికన్ డాన్స్ బార్ లో మల్లికా తెలుగు పాట ఎందుకు పాడుతుంది? 12 వ శతాబ్దంలో కమల్ కి అసిన్ జంట. 21 వ శతాబ్దంలో కూడా.. ఈ లోపు వీరు ఎన్ని ఏడు జన్మలు ఎత్తే అవకాశం ఉందా?? బయొ వార్మ్ ని మింగిన విలన్ ఎటూ decease అవుతున్నా.. సునామీలో కొట్టుకుపోతున్నా అతడిని భారత జెండా వల్లే చనిపోయినట్టు చూపించడం దేనికి? లోకనాయకుడికి లోకల్ ఫీలింగ్ ఏంటి?” లాంటి ప్రశ్నలు ఏమీ వేయకుండా హాయిగా ఆనందించింది నా మెదడు.

ఇక ఈ సినిమా ద్వారా కమల్ ఏమి చెప్పదలుచుకున్నాడో నాకు తెలీదు గాని, నేను అర్ధం చేసుకుంది మాత్రం ఇది.. Mankind never learns from history, that is why it repeats. దేవుడు పేరుతో కొట్టుకోవాలని మనుషులు నిర్ణయించుకోవాలే గాని, ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. రెండో విషయం.. దేవుడున్నాడా లేడా అన్నది “half glass water” లాంటిది. సగం ఉన్నాయీ అన్నచ్చు… సగం లేవూ అనచ్చు. ఎవరూ తప్పు కాదు. మనం చేసే ప్రతీ క్రియకు దేవుడే నిర్ణయించాడనుకోవచ్చు.. ఉదా: ఈ టపాను మీరు మీ పూర్వ జన్మ పాప ఫలితంగా చదువుతున్నారు. లేక మన ప్రతీ చర్య వెనుకా మన మెదడు ఇచ్చే ఏదో reasoning ఉంటుంది. ఉదా: nonsense లో కూడా సెన్స్ చూడడానికే ఈ టపా ఉపయోగపడుతుందని అనుకోవచ్చు. మనం ఎలా అర్ధం చేసుకుంటే అలా. అందుకే కమల్ దేవుడున్నాడనీ .. లేడనీ ఒక నిర్ణయంగా చెప్పలేదు. సునామి దేవుడు పంపాడని అసిన్ నమ్మకం.. ప్రకృతి వైపరిత్యం అని కమల్ వివరణ. వారిద్దరిలానే.. అభిప్రాయాలు కలవకపోయినా మనుషులంతా కలిసి ఉండాలని అని సారాంశం. ఇది సినిమా చూసి నాకు అర్ధం అయ్యింది. కమల్ చదివితే ఏమి అంటారో..

ఈ రెండు ముక్కలు చెప్పటానికి ఇంతిలా మా మెదళ్ళు తినాలా అని మీరు అడుగుతున్నారా?? అయితే.. మీరు జె.ఎన్.టి.యులో చదవలేదన్న మాట.. అక్కడే చదివితే నాకన్నా తక్కువ మార్కులు వచ్చినవారై ఉండాలి. ఈ మాత్రం రాయకపోతే.. 60 మార్కులు ఇచ్చేత్తారూ?? “ఎం చెప్పామ్మనది కాదండి.. ఎంత చెప్పామన్నదే” ముఖ్యం.

ప్రేమించే హృదయానికి ప్రణమిల్లవే.. మనసా!!


“నువ్వు అందంగా ఉంటావా?” అని మీలో ఎవరైనా నన్ను అడిగితే, “ఊ” అనే ధ్వని మీ చెవిని చేరుతుంది. “అద్దం ముందు నిలబడి మనల్ని మనం రెప్పపాటు కాలమైనా చూసుకోగలిగితే మనం అందంగా ఉన్నట్టే!!” అన్న అనుభవం నా మనసులో ప్రతిధ్వనిస్తుంది. అందాన్ని నిర్వచించు అనగానే ఓ పది famous quotations మీ ముందు ఉంచగలను. కానీ పైన చెప్పింది మాత్రం నా మనసుకి చాలా దగ్గరైయ్యింది. ఈనాడు ఆదివారంలో వచ్చే ఒకానొక “ఇది కథ కాదు” లో అందానికే కొత్త అర్ధం ఇచ్చేలా ఉండే ఒక అమ్మాయి డైరీలో రాసుకున్న మనసది. ఆసిడ్ పడి పూర్తిగా కాలిపోయిన తన మొహాన్ని శస్త్రచికిత్స తర్వాత డాక్టర్లు చూసుకోమని అద్దం ఇస్తే.. చూసి భరించలేక అద్దాన్ని విసిరికొడుతుంది. ఆ రాత్రి తన డైరీని ఈ వాక్యంతో మొదలుపెడుతుంది. ఇది చదివి ఓ పదేళ్ళవుతుందేమో.. అయినా నా ఆలోచనలలో నిలిచిపోయింది.

ఊహాలోకాన్ని కట్ చేసి మనషులుండే ప్రపంచానికి వస్తే.. ఆఫీసులో ఎవరైనా కొత్తగా అమ్మాయి చేరిందంటే.. చాలా వరకు అబ్బాయిలు ముందు ఆ అమ్మాయిని చూస్తారు, నచ్చితే కాళ్ళవంక చూస్తారు.. పెళ్ళయ్యిందా లేదా అని. అలలు వచ్చి పాదాలను తాకి వెళ్ళిపోతుంటే.. ఏదో బాధ, ఆ బంధానికున్న వయసు క్షణికమే అయినా. ఆకర్షణ మొదలైన క్షణంలోనే ప్రేమించడం మొదలు పెట్టినా ఆమె వివాహిత అన్న మరుక్షణం వీరి గుండెలు ముక్కలవుతాయి. ఆ తర్వాత దాని సరిచేసే బాధ్యత నాలాంటి వాళ్ళ స్నేహితుల మీద ఉంటుంది. ఆకర్షించేంతగా లేకపోతే గొడవే లేదు.. ఆ అమ్మాయితో సఖ్యత కుదిరితే హాయిగా స్నేహితులు అయ్యిపోతారు. గౌతం రాసినట్టు.. “ఒక అందమైన అమ్మయితో ‘ఫ్రెండ్’ అనిపించుకోవటంకంటే ‘అన్నయ్య ‘ అనిపించుకోవటం మంచిది” అన్న సిద్ధాంతం నవ్వు తెప్పించినా అది నిజం. 🙂 ఇది అబ్బాయిల స్వగతమైతే, మరి అమ్మాయిలో?? మేమేది అంత త్వరగా బయటపడము కానీ ఎంచుమించు ఇలానే ఆలోచిస్తాము, ఆలోచించాల్సిన సందర్భాలు వచ్చినప్పుడు. పెళ్ళికి అతిముఖ్యం “ఈడు-జోడు” అనే కాంసెప్ట్ అని మాకూ తెలుసు. (ఇది నా అనుభవసారం మాత్రమే.. ఏకీభవించకపోయినా గౌరవిస్తారని ఆశిస్తున్నా!! There is no attempt to generalize, whatsoever!!)

ఎందుకో ఓ సాయంత్రం ఈ ఆలోచలన్నీ కొత్తగా మళ్ళీ పలకరిస్తుంటే.. టపాను రాసా. ఆ పది వాక్యాలకీ ఇప్పుడింత ఉపోద్ఘాతమా అవసరమా? అని అనకండి. పరిచయం చేసేంత గొప్పగా నేను రాయనూ లేదు. ఇప్పుడు మనం ఆ పది వాక్యాల గురించి మాట్లాడుకోవడమూ లేదు .. దానికి వచ్చిన స్పందన మాత్రమే ఈ టపా ఉద్దేశ్యం .

దిలీప్ కవితలను నేను బ్లాగులు చదువుతున్నప్పటి నుండీ చూస్తున్నాను. ఏదో హాయి కనిపించేది వాటిలో. తను నా రెండు టపాలకు వ్యాఖ్యానించాక ఆ అభిప్రాయం స్థానే ఒక కొత్త ఆశ మొదలయ్యింది. తన కవితలను, తక్కిన అందరి టపాలను కూడా, నా రచనలలోని అందాన్ని నాకు పరిచయంచేసినట్టుగా వివరించి చెప్తే బాగుణ్ణు అని అత్యాశ. ఈ టపాకు వ్యాఖ్యానిస్తూ.. “మనసు నమ్మలేనిదాన్ని మెదడు పరిహసిస్తుంది. అందుకని మనసు తనకి అరుదుగా దొరికే అవకాశాలని వదులుకోదు. ఇంకా తీవ్రంగా పరిహసిస్తుంది.” అంటూ నిత్యం మనలో జరిగే అంతర్సంఘర్షణని మాటల్లో చిత్రీకరిస్తూ ఇలా సాగించారు ” అనుభవించి, శోధించి, సాధించి ఒక సత్యాన్ని కనుగొంటుంది. ఆ సత్యం ప్రేమకి వ్యతిరేకం కాదు. ప్రేమ మీద మరింత నమ్మకాన్ని పెంచేది. ప్రేమని ద్విగుణీకృతం చేసేది. ప్రేమ యొక్క అసలు తత్వాన్ని బయటపెట్టేది. మనిషిని స్వయం ప్రకాశం వైపు నడిపించేది. తనని ఒక గొప్ప ప్రేమికురాలి(ప్రియుడి)గా చేసేది. అది తెలుసుకోగానే మనసు ప్రేమ కోసం పరితపించడం మానేస్తుంది. కానీ ఆ స్థితిలో ఇంకా తోడు కోసం పరితపిస్తూనే ఉంటుంది. ఆ తోడు నుండి ప్రేమని ఆశించడానికి కాదు, పొందడానికి కాదు. ఆ తోడుకి ప్రేమని పంచడానికి!” నా మనసులో ఎంత ప్రేమ ఉందంటే.. నీకివ్వకుండా ఉండలేను అనే భావం.. నాకైతే అనిర్వచనీయమైన అనుభూతి కలిగింది. అలాగే దిలీప్ నా “చివరిప్రేమలేఖ” కు ఇచ్చిన వ్యాఖ్య కూడా ఆలోచింపచేసేట్టుగా ఉంటుంది.

ఇక భావకుడన్ గారి విషయానికి వస్తే.. వీరూ అసాధ్యులే!! వీరు నా చివరి ప్రేమలేఖకు ఇచ్చిన వ్యాఖ్యాను గమనిస్తే.. చాలా subtleness తో కూడిన ఆ లేఖ రాసిన అమ్మాయి psycheని నా ఊహలనుండి తన అక్షరాలుగా దిగుమతి చేసారు. అందమే ప్రేమకు తొలి మెట్టు అంటున్న నన్ను ఈ క్రింది కవితతో హెచ్చరించారు. ఇది వారి కవిత, న్యాయంగా వారి బ్లాగులో ఉండాల్సింది. మీరంతా వారిని మెచ్చుకోవాలి. అయినా ఒక అందమైన కవితా, అందులోని జీవితం ఒక మూల వ్యాఖ్యగా మాత్రమే మిగిలిపోకూడదని.. ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను. నాకు తెలిసిన పాఠం మీతో పంచుకోవాలనే ఈ ప్రయత్నం. అసందర్భంగా అనిపించినా ఇక్కడే చెపేస్తా.. మీరు తెలుగు బ్లాగులు రాయని వారైతే ఇప్పుడే మొదలు పెట్టండి. రాసేవారైతే ఇంకా రాయండి. మనసులో ఉన్న ఎంతటి భావాన్నైనా ఓ నాలుగు తెలుగు ముక్కలలో రాసేయ్యండి. మీరు అందంగా రాయలేకపోయినా ఫర్వాలేదు. నా తెలుగుతోనే నేను ప్రయత్నిస్తున్నాను.. నన్ను చూసి ధైర్యం తెచ్చుకోండి 🙂 అటు తర్వాత అందులోని అందాన్ని, ఆనందాన్ని, ఆవేదననీ అర్ధం చేసుకునేవారు, అర్ధం చెప్పేవారు బోలేడుమంది. ఈ బ్లాగ్ ప్రపంచంలో జీవిస్తే కేవలం భాషేకాదు, భావం, భావుకత, అర్ధం అంతరార్ధం అన్నీ నేర్చుకోవచ్చు. ఓ జీవిత కాలం సరిపడా అనుభూతులను పోగు చేసుకోవచ్చు.

భావకుడన్ గారు: నచ్చితే వ్యాఖ్యగా, నచ్చకపోతే సూచనగా స్వీకరించమన్నారు. జీవితాన్ని నేర్పిస్తుంటే కాదనగలనా?? అందునా… I’m a very good girl, said me all teachers, you see!! 😉

కవిత: “జాగ్రత్త మిత్రమా”

చెత్తకుండిలో మనసు
అబ్బాయిల బెరుకు
సంసారపు సొగసు
దానిలో ఒడిదుడుకు

తెలిసిన వో మనసూ
“అందం చూసే వాళ్ల కళ్ళల్లోనే”
మరిచావే ఈ మాటను
చిన్నబుచ్చకు నిరీక్షణను

అభిరుచులు కలిసిన తొడు
బంగారానికి తావి అద్దేను
అది లేని జత కూడేవా
పిచ్చొని చేతిలో మొగలి పువ్వేనూ

సామాజికతకు, అధైర్యానికీ,
నిరాశకూ నిస్పృహకీ
తల ఒగ్గి సర్దుకుపోయావా
జీవితమంతా అంతేనూ

మన కనకపు విలువను
కొలిచే కంసాలి తప్పక ఉండేను
కావలసినదంతా తన కొరకు
వేచి చూసే గుండేనూ

కాదని సర్దుకు పోయావా
జీవితాంతం ఇక అంతేను
విసుగు చెంది ఆపావో
“సగటు మనువు”లో పడ్డట్టే

స్ఫందించే మనసూ
అది పొందే భావుకత
ఇవన్నిటికీ “సగటు మనువు”
కర్కసమైన గొడ్డలి పెట్టే

ఇది చదివాకా “ప్రేమించే హృదయానికి ప్రణమిల్లవే.. మనసా ప్రణమిల్లవే..” అనే “ఋతురాగాలు” (బంటి సంగీతం) సీరియల్ లో పాట పదే పదే పెదవి పై ఆడుతోంది. అంతర్జాలంలో ఈ పాట ఆచూకీ తెలిపిన వారికి “మనసు తీరేంత ప్రేమ కలుగుతుంది”. 😉 కనిపిస్తే చెప్పరూ.. ప్లీజ్!!

అద్దరగొట్టే బ్లాగర్లే కాదు, బెదరగొడుతున్నా చదివి ఆదరించే “కమ్మెంటర్లు” ఉన్నారని నిరూపించే బ్లాగ్లోకానికి ఓ జై కొడుతూ.. సెలవు!!

మనసైన తన కన్నీరు…


తను నా గుండెలపై తలవాల్చుకుంది. నా షర్ట్ కున్న రెండు sleevesని పిడికిల్లలో గట్టిగా పట్టుకుంది. తన అంతర్సంఘర్షణ అంతా భరించలేక నా షర్ట్ తో పాటూ నేనూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాను. నా చేతులు తన చూట్టూ ఉన్నాయి, నాకు దగ్గరగానే తను ఉంది.. కానీ మా ఇద్దరి మధ్యా చాలా దూరం ఉన్నట్టు అనిపిస్తుంది. నా మాటగాని, నా స్పర్శగాని ఏదీ తనని అనునయించలేక పోతున్నాయి. ఏమీ చెయ్యలేని నిస్సహాయతలో తనను మరింత దగ్గరకు లాక్కుని, తన తలపై నా బుగ్గ ఆన్చి తన మూగ బాధను ప్రేక్షకునిగా కాక, పాత్రధారియై అనుభవిస్తున్నాను.

ఏమయ్యిందో, తను ఎందుకింత హర్ట్ అయ్యిందో నాకేమి అర్ధం కావటంలేదు. “నాకు జలుబు చేసి కాస్త నలతగా ఉంది, ఇంటికి త్వరగా వెళ్ళిపోతున్నా.. నువ్వు నన్ను తీసుకువెళ్ళడానికి రావద్దు” అని ఫోన్ చేసింది. రాత్రి ఆలస్యంగా ఇంటికి చేరేసరికి అంతా నిశ్శబ్ధం. అమ్మ అప్పుడే పడుకున్నట్టు ఉంది.. నాన్న ఎవో పుస్తకాలు తిరేగుస్తున్నారు. నా అలికిడి వినగానే నిషీ బయటకు వచ్చింది. తన మొహంలో చిరునవ్వు లేదు. అసలే చిన్న కళ్ళు జలుబు చేయటం వల్ల మరీ చిన్నగా కనిపిస్తున్నాయి. అన్నింటికీ మించి, గలగలమంటూ తన గొంతు వినిపించకపోవటంతో పెరిగిన నిశ్శబ్ధాన్ని వినలేకపోయాను. భరించలేని నిశ్శబ్ధంలో మాటకూడా వినపడదేమో!!

భోజనాలవ్వగానే తను మంచం మీద పడుకుండిపోయింది. దగ్గరకు వెళ్ళి “ఏమయ్యిందిరా” అని అడిగా. సమాధానం రాలేదు.. “ఎందుకింత అప్-సెట్ట్”గా ఉన్నావు మళ్ళీ అడిగా. ఈ సారి సమాధానం వచ్చింది సన్నగా వణుకుతున్న తన శరీరం రూపంలో.. తన ఏడుస్తుందేమో. ఆ ఊహే భయపెట్టింది. తనను లేపాను, మోహాన్ని నా చేతుల్లోకి తీసుకుని, “ఏంటిది?” అని కళ్ళతో ప్రశ్నించాను. చెప్పలేననట్టుగా కళ్ళు మూసుకుంది. “నిషీ..” అన్నాను ఏడుపుకి సిద్ధమవుతున్న గొంతుతో. “మధూ” మాట్లాడలేకపోతున్నా చెప్తూంది “ఓ సాయం చేస్తావా, నాకు ఏడుపొస్తుంది, చాలా!! కాసేపు నన్ను ఏడవనిస్తావా?? కారణం అడగకు.. నిన్ను పట్టుకుని ఏడవనిస్తావా?” అని అడిగింది. నాకర్ధమయ్యేలోపే నా చేతులను తన మొహం నుండి తీసేసి, తలను నా గుండెలపై వాల్చి రెండు చేతులతో నా చొక్కాని బిగిపిడికిల పట్టి.. తనివితీరా హాయిగా ఏడుస్తుంది. తన కన్నీళ్ళు నా షర్ట్ లోకి ఇంకిపోయి, ఆరిపోయాయి కూడా!! ఊ..హూ.. షర్ట్ లోకి కాదు నా హృదయంలోకి ఇంకిపోయాయి. కానీ నా గుండెలో అవి ఆరలేదు. బరువెక్కించాయి, భయంకరంగా బరువుగా ఉంది. తన గుండె నుండి నేరుగా నా గుండెలోకి, Souls at conversation అంటే ఇదేనేమో. కారణాలు వెతకటం లేదు నా మనసు కూడా.. ఈ అద్వితీయమైన సంభాషణను ఆనందిస్తూ!!

కుక్కర్ విసిల్ వినిపించేసరికి మెలుకువ వచ్చింది. తను పక్కన లేదు. నేను నెమ్మదిగా లేచి నా మార్నింగ్ వాక్ కి సిద్ధపడ్డా!! నాన్న కూడా ఇంకా వెళ్ళలేనట్టు ఉన్నారు. ఇద్దరం కలిసి బయలుదేరబోయాము. షూ వేసుకుంటుండగా.. “ఏరా.. రాత్రి నిద్ర పోలేదా” అని అడిగారు. “అవును.. పోయాను” అంటూ నేనిచ్చిన తికమక సమాధానం ఆయనకు నిజాన్ని చెప్పేసింది. పార్క్ లో ఓ రౌండయ్యాకా, బెంచీ మీద కూర్చుంటే నాన్నే మొదలుపెట్టారు నెమ్మదిగా… “నిన్న నిషీ ఆఫీసు నుండి త్వరగా వచ్చేసింది. అత్తాకోడళ్ళిద్దరూ ఎదో సరికొత్త వంట చేద్దామని పురమాయించుకున్నారు. ఎందుకో మీ అమ్మ నిషీ మీద అరుస్తుంటే వంటగదిలోకి వెళ్ళా!! గాస్ వాసన వస్తూ, నిషీ ఏడుస్తూ కనిపించింది. రాత్రి మీరు పడుకున్నాక మీ అమ్మ చెప్పింది, పాలు పెట్టిన స్టవ్ ఆరిపోయిందని నిషీ చూసుకోలేదని. గాస్ అంతా లీక్ అయ్యింది. జలబేమో తనకి వాసన కూడా రాలేదు. మిక్సీ పెట్టబోయింది. ఇది గమనించిన మీ అమ్మకి దడ వచ్చింది..నిషీకి చెబుదామంటే.. తన చెవిలో ఐపాడ్ ఉంది. అందుకే గట్టిగా అరిచింది. నిషీకి ఏమీ అర్ధం కాలేదు, చేసిన తప్పుకే అత్త తిడుతుందని భయపడింది, ఏడ్చింది. అదీ నాన్న జరిగింది. ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోకూడదు..అత్తాకోడళ్ళది అపురూప బంధం. ఇద్దరికీ కొత్తకదా, అలవాటు పడాలి. కానీ ఈ కాలపు పిల్లలు మీరు. మీకు ఎలా అర్ధాలు అవుతాయో మీ ఇష్టం. మీ బాగోగులే మా చింత” అని ముగించారు. “ఏమీ కాదులే” అన్నట్టుగా నాన్న చేతిలో చేయి వేశాను. కానీ నా మనసు కుదుటపడలేదు. తిరిగి వస్తున్నంత సేపూ ఎలాగా ఈ సమస్యకు పరిష్కారం అని ఆలోచించాను. అమ్మా, నిషీ … ఏమి చేయాలి? నాన్న భయం నిజమవుతుందా?? అన్న ఆలోచనలతో మెదడు మొద్దుబారిపోయింది.

ఇంటికి వచ్చేసరికి, అమ్మా నిషీ ఎందుకో గట్టిగా నవ్వుతున్నారు, బయటకు వినపడేలా!!. మమల్ని చూడగానే చకచకా టిఫిన్లు వడ్డించారు. వారినలా చూడగానే ప్రాణం లేచి వచ్చింది. హమ్మయ్యా!! అనుకున్నాను. అటు తర్వాత ఆఫీసు, మీటింగూ అంటూ రోజూలానే రోజు గడిచిపోతోంది. కానీ రాతింకా కళ్ళముందే ఉంది. నిషీ ఈ మాట చెప్పకుండా ఎందుకు దాచినట్టు? నేను తనను అర్ధం చేసుకోను అనుకుందా?? అందుకే చెప్పలేదా?? తన నన్ను పూర్తిగా నమ్మటం లేదా?? ఏవో ప్రశ్నలు మనసును నిలవన్నివ్వటం లేదు. తనని అడగాలి.. కాని అడగద్దనిందిగా!! అడగనులే.. ఇలాంటివి జరగకుండా మున్ముందు జాగ్రత్తగా ఉండాలి. కానీ ఎలా?? ఆఫీసు నుండి నిషీ నేనూ ఇంటికి వస్తుండగా దారిలో చిన్న చెరువు దగ్గర ఆపమంది తను. సరే అని వెళ్ళి ఒక రాయి మీద కూర్చున్నాము. వీస్తున్న గాలికి తన కురులను సర్దుకుంటూ, చున్నీని పట్టుకుంటూ, నా కళ్ళలోకి చూడకుండా “నిన్న రాత్రి నన్ను అర్ధంచేసుకున్నందుకు థాంక్స్. మధూ.. నన్నేను ఆపుకోలేకపోయాను. చాలా భయం వేసింది. అందుకే అంతలా రియాక్ట్ అయ్యా.. నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను కదా..” అని తను చెప్తుండగానే.. “ఇబ్బంది కాదు.. నరకమను.. ఏమి జరిగిందో, ఏమయ్యిందో తెలియక, నిన్ను అడగలేక, ఎవరికీ చెప్పలేక ఎంత కష్టమైయ్యిందో తెలుసా? కాసేపటికి నువ్వు నిద్రపోయావు, నీ గురించి ఆలోచిస్తూ నేనంత మధనపడ్డానో.. నన్ను నమ్ముకుని నా ఇంటికి వచ్చిన ఆడపిల్ల నన్ను పట్టుకుని ఏడుస్తుంటే.. ఎంత భయం వేసిందో!! నువ్వు నా భార్యవి, భాధ్యతవి అన్న విషయాన్ని పక్కకు పెట్టి, నా స్నేహితురాలే బాధపడుతుంటే.. ఏం చేస్తాను అలా చేసాను. అందుకే నువ్వు అడగద్దు అన్నాక మళ్ళీ అడగలేదు. అసలు ఏమి జరిగిందో చెప్తే ఏదో ఒక పరిష్కారం చూసేవాళ్ళం కదా..” అంటున్న నన్ను ఆపడం ఈసారి తన వంతయ్యింది.

“పరిష్కారం కావాలంటే ముందు సమస్య తెలియాలి. బాధ కలిగితే సమస్య ఉందనుకుంటాము, నిజానికి ఉండకపోవచ్చు కూడా!!. అసలు సమస్య లేనప్పుడు కూడా దేనినోదాన్ని సమస్యగా చిత్రీకరించి, తోచిన పరిష్కారం ఇచ్చి సంతోషిస్తాము. అందుకే నీకు చెప్పలేదు. నేను ఏడుస్తుంటే.. నీకు కలిగే బాధను నేను అర్ధం చేసుకోగలను. కానీ “ఇది” అని నీకు చెప్పలేను. నాకు కష్టం కలిగింది, అత్తయ్య ఏదో అన్నారని కాదు, నేనంత నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు. ఆ పరిస్థితుల్లో మా అమ్మ ఉంటే నాన్నకి చెప్పి మళ్ళీ తిట్టేది. అది కాదు నా బాధ. చెప్పించుకునేంతవరకూ వచ్చానే అని నా మీదనాకే కోపం. ఎట్టి పరిస్థితుల్లోనూ “నీకు మీ అమ్మకావాలా? నేను కావాలా?” అన్న సమస్య ఇవ్వలేను. ఆ ఆలోచన కూడా నీకు రానివ్వకూడదనే నా తాపత్రయం. భోంచేసేటప్పుడు “జాంగిరీ కావాలా?? జిలేబీ కావాలా” అని అడగచ్చు కానీ, అన్నం కావాలా? కూర కావాలా? అని ఎవ్వరూ అడగరు. We both aren’t options for you, we are absolute necessities for your life. ఆవిడ జీవితం ఇస్తే.. నేను దాన్ని పంచుకుంటున్నాను. ఆవిడ నిన్ను తయారు చేస్తే.. నిన్ను కాపాడుకుంటుంది నేను. నీ వల్ల ఆవిడా, నేనూ కూడా సంపూర్ణమైయ్యాము. అందుకే నీకు కష్టం కలగకూడదనే మా వేదన. అన్ని బంధాల్లానే మాకు కొంచెం సమయం కావాలి, ఒకరినొకరం అర్ధం చేసుకోవడానికి. మధూ.. మూర్ఖంగా ప్రవర్తిస్తే క్షమించు. రాత్రి చేసిన సాయం ఎప్పటికీ మరువలేను. ఇక ముందు ఇలా జరగకుండా చూసుకుంటాను” అంటూ నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పింది.

ఓ నాలుగైదు నిమిషాలు మా మధ్య ఎలాంటి సంభాషణా లేదు. ఒకరికొకరం పూర్తిగా అర్ధమైయ్యాకా.. మధ్యనున్న మౌనం కూడా గలగలా మాట్లాడుతుంది. నిన్న రాత్రి స్కూల్లో టీచరు కొట్టిన చిన్నారిలా, ఇప్పుడు జీవితం నేర్పే టీచరులా.. సహచర్యం అంటే ఇంతే.. తనలోని ప్రతీ మనిషీ నా సొంతం. నేనామెకు సొంతం. భయంకరంగా బరువెక్కిన గుండె ఇప్పుడు దూది పింజలా ఎగురుతుంది. తనని దగ్గరకు తీసుకుని.. “అయితే.. నువ్వు “అన్నం” లాగా మాట నాకు. రోజూ ఈ అన్నమే తిని బోరుకొడుతుంది.. చైనీస్ ఫ్రైడ్ రైస్ తిననా.. నా కొత్త మానేజర్ పేరు .. హౌకున్ యాంగ్!!” అన్నాను చిలిపిగా.. నన్నొక తోపు తోసింది గట్టిగా. వెనక్కి ఒరిగిన నన్ను చూసి నవ్వుకుంటూ బైక్ దగ్గరకు పరిగెత్తింది. బైక్ మీద వెళ్తుంటే నన్ను పెనవేసుకున్న తనను చూస్తూ..
“నేనొచ్చి తాకానో ముళ్ళల్లే పొడిచానో, తానొచ్చి తాకిందో పువ్వల్లే మారేనే..” అంటూ సఖిలో పాట చరణాన్ని నా మనసు మొదలెట్టింది.

మగవారి హక్కులే.. నా డిమాండ్!!


పాపం అబ్బాయిలు.. వీరికి అడుగడుగునా కష్టాలే!! ఇది అభిప్రాయం కాదు, స్వానుభవం. ఒకసారి బస్సురాక, ఊసుపోక ఉన్నత చదువులు-ఉద్యాగాలు మీద ధీర్ఘంగా చర్చించుకుంటుంటే.. మా సీనియర్ ఒక అబ్బాయి.. “మీకేంటి? చదివినా, చదవక ఇంటి దగ్గర కూర్చున్నా సరే!! మీ నుండి expectations ఉండవు. అదే మేమైతే తప్పక సంపాదించాలి.. లేకపోతే వాల్యూనే లేదు” అని అన్నాడు. సెహ్వాగ్ బంతిని కొట్టేంత గట్టిగా తగిలింది ఆ మాట నా మనసుకి. “ఈ అబ్బాయిలున్నారే..” (నువ్వు-నేను సినిమాలో ఉదయ్ కిరణ్.. “ఈ పెద్దోళ్ళూ ఉన్నారే”.. అంటునట్టుగా) అంటూ ఇంటికి వెళ్ళగానే మొదలెట్టా!! “అవును మరి.. అమ్మాయి పనిచేయటం లేదు అనేది చాలా మంది లెక్కలోనే రాదు. అదే అబ్బాయికి “సరైన” ఉద్యోగం లేకపోతే.. పెళ్ళి మాట తలవను కూడా తలవరు”. అన్నారు నాన్న సీరియస్ గా!! మొదట సారిగా మగవారి బరువు (భాధ్యత) నాకు అర్ధమైంది. (జల్సా సినిమాలో మహేశ్ బాబుకి తెలుస్తుందే పవణ్ గురించి.. అలా అన్న మాట)

కాలేజీలో నా స్నేహితురాలికి ఒక సెమ్ లో మార్కులు మన tailenders స్కోర్స్ లా వచ్చాయి. మంచిగా చదివే అమ్మాయే.. కానీ టాప్ బాట్స్ మెన్ ఉండి కూడా చతికిలబడే ఇండియా బాట్టింగ్ లా, బాగా రాసినా ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని జె.ఎన్.టి.యు వాల్యువేషన్. మార్కు లిస్ట్ పట్టుకుని భోరున ఏడవడం మొదలెట్టింది. సానుభూతితో అంతా ఆ పిల్ల చూట్టూ గుంపు కట్టి ఆ అమ్మాయి ఏడవడానికి కావల్సిన అనుకూల వాతావరణం కలిగిస్తుంటే.. ఒకడు వచ్చి “ఎందుకు ఏడవడం.. అసహ్యంగా!! బోడి మార్కుల కోసం కూడా ఇలా గోలచెయ్యాలా??” అని అరచినంత పని చేశాడు. “ఈ అబ్బాయిలున్నారే..” అంటూ మొదలెట్టేలోగా.. పక్కనుండి లోతుగా వస్తున్న మగగొంతు.. “మీకు కనీసం ఏడిచే ఛాన్స్ అయినా ఉంది. బాధ ఉన్నా మేము ఏడవలేము.” దీనంగా వినిపించింది. అప్పుడు నేను మగవారి లోతు తెలుసుకున్నాను.

ఎదో ఆదివారం పూట.. వేయి కళ్ళతో.. కోటి ఆశలు పెట్టుకున్న కీలకమైన క్రికెట్ట్ మాచ్ లో మనవాళ్ళు మెలితిరుగుతున్న బంతితో వేగలేక.. ఆడలేక, తెలుగు సినీ ఇండస్ట్ర్రీ కి వచ్చీ రాగానే వెళ్ళిపోతున్న హీరోయిన్స్ లా అందరూ పెవిలియన్ దారిపడుతుంటే.. గతిలేక, మతి చెడినందుకు చిహ్నంగా ఛాన్నెళ్ళు తిప్పుతూండగా.. “చూడు వీడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో.. నీ కోసం చావడానికి సిద్ధపడ్డాడు. అదే వాడు నిన్ను మోసం చేసుంటే.. వాణ్ణి తన్నటానికి గూండాలు, రౌడీలు, పోలీసు కంప్లేట్స్, మహిళా హక్కులు, నిరసనలు, ర్యాలీలు, చట్టాలు, కోర్టులు.. ఆఖరకు అసెంబ్లీ, పార్లమెంట్ దాకా చర్చలు. అదే మీరు మమల్ని మోసం చేస్తే కనీసం ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పుకోలేని దుఃస్ఠితి” అంటూ తరుణ్ ఏదో సినిమాలో, “ఈ అబ్బాయిలు ఉన్నారే..” అనే ఛాన్స్ లేకుండా యువ్ రాజ్ కొట్టే భారీ సిక్సర్ లా కొట్టాడు. ఇకప్పటినుండీ కరుణానిధికి తమిళంలా, థాకరేకు ముంబై లా, బీజేపీకి రామునిలా, ప్రధానికి సోనియాలా, ధోనికి “యూత్”లా, తెలుగుసినిమాకి మాస్ లా .. నాకూ మగవారిపై “గురి” కుదిరింది. ఎంతగా అంటే.. నా ఒకానొక టపాకి వ్యాఖ్యలో నన్ను ఫెమినిస్ట్ అంటే.. సైమెండ్స్ ని “మంకీ” అన్నప్పుడు కూడా ఫీల్ అయ్యుండడు నేనయినంత!!

అప్పుడే నిశ్చయించేసుకున్నా.. ఎప్పటికైనా ఓ “Men’s Rights Commision” పెట్టాలని. అప్పటికే ఉంటే.. నేనే సంఘ అధ్యక్షురాలిని అవ్వాలని. అప్పుడు గానీ నా ఈ భక్తి భావనలు వెలుగులోకి రావని. సివిల్స్ ఇంటర్వ్యూలో .. “పదవి రాగానే మొట్టమొదట నువ్వు ఏమి చేస్తావ్??” అని ప్రశ్న విరివిగా అడుగుతారట. మీరూ ఆ ప్రశ్న నన్నడగండి.. సర్వకాల సర్వావస్థలలోనూ మన టీవీ వాళ్ళు అడిగే “ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు” కి బదులుగా. అప్పుడు నా సమాధానం…

“సమావేశమైన మీ అందరికీ నమస్కారాలు. ఇది నాకు ఆషామాషీ పదవి కాదు.. నేను రేయింబగళ్ళు కన్న కల. అసలు మగవారికి జరిగే అన్యాయం అంతా ఇంతా కాదు. చిన్నప్పటినుండీ వారిని వేరుగా చూస్తారు. ఒక అమ్మాయి కన్నా ఆటపాటల్లో, చదువుసంధ్యల్లో తక్కువగా ఉంటే.. చూసి నేర్చుకో అంటారు. అదే భేషుగ్గా చేస్తే.. “ఆడపిల్లతో పోటీ ఏంటిరా?” అంటారు. పెళ్ళి కాక ముందు అమ్మ emotional blackmails తో, పెళ్ళయ్యాక వట్టి blackmails తో జీవితం సరిపోతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎన్నో ఎన్నెన్నో!! అన్నింటిలో ఆడవాళ్ళ గొప్పలే.. ఏదో వాళ్ళే కష్టపడుతున్నట్టు. అసలు చెయ్యాలేగాని మగవాళ్ళ ముందు ఆడవాళ్ళు ఏ పనిలో సరిపోరు. ఆడవాళ్ళంతా విస్సుకుని, నస్సుకుని చేసే వంట.. మగవాళ్ళెంత సునాయాసంగా చేస్తారు. హోటెలుకి వెళ్తున్నాము అంటే.. దాదాపు ఓ మగాడి చేతి వంట తింటున్నట్టే. అంతెందుకు “నలభీమపాకం” అంటారే గాని, సీత , ద్రౌపది లాంటివారి వంట గురించి ఉందా అసలు?? అందుకే..మగవారి పై సమాజిక వొత్తిడి తగ్గించే తొలి మెట్టుగా నేను తీసుకునే మహత్తర నిర్ణయం.. ఈవాల్టి నుండీ మగవారిదే వంటిళ్ళు.. ఆడవారికి అందులో ప్రవేశం నిషేదిస్తున్నాము. ఇన్నాళ్ళు మీ ఈ కళను కుటుంబమంతా ఆనందిచకుండా అడ్డుపడిన ఆడవారికి ఇదే గుణపాఠం. పాకశాస్త్ర ప్రావీణ్యం తోటే.. ఈ జైత్రయాత్ర మొదలవుతుంది. ఇంట, వంటింట గెలిచినాకా.. రెచ్చను గెలవడం.. ఓ..రచ్చల్.. రచ్చలంతే!!” అని చెప్పాలని నా ప్లాను. ఎప్పటికి తీరుతుందో ఈ కల, ఆశయం, అభిలాష !!

********************************************************************************************************************************************************
ఇప్పటికిప్పుడు నాచేత ఈ టపా రాయించిన సుజాతగారికి ఓ థాంక్స్!! వంట చేయడంని ఒక కళగానే కాక, నిత్యావసరంగా గుర్తించకపోగా… శ్రమించి చేసేవాళ్ళను ఎగతాళి చేసే వారి గురించి ఆలోచనానూ, “జోర్ కా జట్కా భీ ధీరేసె లగ్నా చాహియే” (భీకరమైన షాకును కూడా.. నిదానంగా ఇవ్వాలి) అన్న కొత్త మానేజ్ మెంట్ సూత్రము వెరసి ఈ టపా.

చెత్తకుండీ కీ ఓ మనస్సుంటే..


వేసవి సాయత్రం.. సూర్యుడు తన ప్రతాపమంతా చూపించి “మళ్ళొస్తా!!” అంటూ పడమరలో అస్తమిస్తున్నాడు. చల్లని గాలితో పాటు, చంద్రుడూ రాబోతున్నాడు. ఇప్పటిదాకా నిర్మానుష్యంగా ఉన్న వీధి కొత్త సందడి నేర్చుకుంటుంది. ఇళ్లకు చేరే వారితో, ఆటలాడే చిన్నారులతో..వహనాలతో యమా బిజీగా ఉంది. ఈ సందడంతా కాసేపే, ఆ తర్వాత అందరూ నిద్రకు ఉపక్రమిస్తారు.. అప్పుడు మళ్ళీ ఒంటరిగా నేను. ఒంటరితనం జీవితానికి ఒక కొత్త అందాన్ని ఇస్తుంది. ఒక ఆనుభూతినో ఒక ఊహనో కౌగిలించుకుంటే.. ఒంటరితనం కూడా అందమే!! ఇంతకీ నేనెవరో చెప్పలేదు కదూ.. ఈ ప్రాంతానికి ఉన్న ఏకైక చెత్తకుండీని, పాష్ గా గార్బేజ్ బిన్ ని. రండి.. ఈ ఆహ్లాదమైన వేళ మీతో మాటా మంతి కాసేపు..

నన్నిక్కడ సుమారు ఓ పదేళ్ళ కింద అప్పటి యం.సి.హెచ్ వారు స్థాపించారు (భారీ పదమా?? పోనీ.. పెట్టారు!!) ఆ తర్వాత ఓ రెండు మూడు సార్లు మరమత్తులు జరిగాయి. ఇప్పుడు మళ్ళీ renovation ఉందట. Makeover కోసం ఆశగా ఎదురుచూస్తున్నాను. చెత్త కుండీలు ఎలా ఉంటాయో మీకు తెలుసుకదండీ..నేనోక చోట, చెత్త ఒక చోట!! నేనే కాక..నా పరిసర ప్రాంతాలన్నీ చెత్త మయం. గాల్లో ఎగురుతూ ఉండే చెత్త.. ఆ కంపు వాసనా.. ఇవ్వన్నీ మీరు సృష్టించేదే!! చెత్త డబ్బాను సరిగ్గా ఉపయోగించక నేనున్నా లేకున్నట్టే చేస్తారు మీరు. ఇప్పుడు ఎంటో గ్రేటర్ సిటీ అవుతుందటగా?? ఇప్పుడైనా ముందు చెత్తనెట్లా పాడేయ్యాలో నేర్పమని నా మాటగా మీ వాళ్ళకు చెప్పండి. ఏంటా హడావిడి అక్కడ.. అయ్యో!! ఎవరో ఆడుకుట్టున్న పిల్లాడు కింద పడ్డట్టున్నాడు. ఓ క్షణం ఆగండీ.. ఏమి జరుగుతుందో తెలుసుకుని వస్తాను.

పాపం పిల్లాడికి బానే తగిలింది దెబ్బ.. మూతంతా రక్తం కారుతుంది, స్పృహలో లేడు. ఇప్పుడే ఆసుపత్రికి తీసుకువెళ్ళుతున్నారు. వాళ్ళ అమ్మ గుక్క తిప్పకుండా ఏడుస్తుంది. కన్నపేగు కదండీ అలానే ఉంటుంది కదా!! నాకెలా తెలుసుననుకుంటున్నారా?? చూస్తుంటే తెలియదంటారా?? ఈ వీధి చివరన ఉన్న అమ్మ ఓ ఫేద్ద ఉద్యోగం చేస్తుందట.. పొద్దున పోయి రాత్రి వేళకు వస్తుంది. తన మూడేళ్ళ కూతురిని వదిలి వేళ్ళాలంటే ఆ అమ్మ పాణం మీదకొస్తుంది. విడవలేక విడవలేక వెళ్తుంది ప్రతీ ఉదయం. రాత్రి రాగానే ఆ అమ్మ-బిడ్డల కౌగిలింతలు, ముద్దులు, ముచ్చట్లు, ఆటలు.. చూడాలి అంతే!! ఇక ఆ పక్క వీధిలో ఉన్న మూడో ఇంటిలో ఉండే అమ్మ.. నేను ఇక్కడ వచ్చినప్పుడు కొత్త పెళ్ళికూతురు. చానాళ్ళు ఎదురుచూస్తేగాని సంతానం కలుగలేదు. ఎన్ని నోములు, ఎన్ని వ్రతాలు?? అమ్మ కావటానికి పడే వేదన అర్ధమైంది. ఇక ఈ ఎదురింట్లో ఉండే అమ్మ.. నాకు బాగా తెలిసిన అమ్మ. మేస్త్రీ పని చేస్తారు భార్యాభర్తలిద్దరూ.. ఉన్న కొంతలో పిల్లలను ఎంత చక్కగా తీరుస్తుందని.. ముత్యాల్లా ఉంటారు వాళ్ళూ. అందులో శీను ఆమెకు పుట్టలేదు. వాడి అమ్మ కథ వేరే..

అనుకోకుండా ఒక రోజు ఓ అమ్మాయి వచ్చింది, నా దగ్గరకు. పేరు “పిచ్చిది” అనుకుంటా.. (మీ వాళ్ళు అంతా అలానే పిలిచేవారు) పొత్తిళ్ళలో ఓ పసికందును పెట్టుకుని వచ్చింది.. ఇక్కడే ఉండేది. చెత్త ఎటూ మీరంతా బయటే వేస్తారు కనుక ఈ పిల్ల నా గదిలో ఉండేది. తనలో తను మాట్లాడుకుంటూ ఉండేది. ఎప్పుడూ ఆ పిల్లాడి చింతనే ఆమెకు. వాడిని అపురూపంగా చూసుకునేది. తను చెత్తలో దొరికింది తినేది.. ఆ పాపడికోసం మాత్రం వీద్దుల్లో తిరిగేది.. అడుకున్నేది. వచ్చిన దానితో ఆ పిల్లాడి పోషించేది. ఓ రాత్రి పడుకుని ఉండగా.. కుక్కలన్నీ చేరాయి..ఆ పసికందు మీద కన్నేసి!! బాబును కాపాడుకోవటం కోసం ఆమె కుక్కలతో పోరాడింది. బిడ్డకు ఏమీ కానీలేదు. ఆమెకు మాత్రం చాలా కాట్లు అయ్యాయి. ఆ గాయాల్తో ఆమె కొన్ని రోజలకి చనిపోయింది. అప్పటి నుంచీ ఆ బిడ్డను ఈ మేస్త్రమ్మే పెంచుకుంటుంది. మీ మానవుల్లో ఉన్న “అమ్మతనం” దగ్గరగా చూస్తేనే ఇంత ఆనందమైతే ఇక ఆ వరం పొందుతే ఎంత మధురమో!!

ఆహ్లాదమైన వాతావరణంలో మాట్లాడుకుందామని భారీ, భారీ అనుభవాలను పంచుకున్నానా?? ఏం చేస్తాం. ఆ పిల్లాడికి దెబ్బ తగిలేసరికి.. మనసు అటే పోయింది. జీవులంటిలో ఈ మాతృత్వం ఉంటుందట కదా.. మీరు చాలానే అదృష్టవంతులు!! మాకలాంటి భాగ్యం లేదు.. నాకూ ఓ అవకాశం ఉంటే.. మనిషిగా పుడతా.. ఇవ్వనీ అనుభవిస్తా!! నా సంగతి ఏమో గాని మీకు ఆలస్యమవుతుందేమో..ఇక వెళ్లి రండి. ఇంకెప్పుడైనా.. ఏమిటిది?? ఎవరిదో పసికందు ఏడుపు వినిపిస్తుంది. అయ్యో… నా వళ్ళో ఎవరో పసిపాపను వదిలేసారు.. ఇంకా రక్తపు మరకలు కూడా వదలలేదు. ఎవరినైనా పిలవండీ.. ఈ పాపను తీసుకేళ్ళమనండీ. ఇక్కడే నా కళ్ళముందే కుక్కలు పీక్కుతినడం నేను చూడలేను. ఇది చెత్త కుండీ అని చెప్పండి.. ఇక్కడ నిజమైన చెత్తను వేయాలి గాని, మీకు నచ్చని ప్రతీది నాలో వెయ్యోద్దని చెప్పండి. నా మనసుకింత గాయం భరించే శక్తి లేదు, చూస్తూ ఉండలేను.. ఏమీ చెయ్యనూలేను. ప్లీజ్.. చెప్పండి.. త్వరగా ఎదో ఒకటి చెయ్యండి..పాపని రక్షించండీ..

*************************************************************************************
చెత్తకుండీకి కూడా ఓ మనసు ఏడిస్తే.. మనల్ని చూసి అది ఎంతగా ఏడుస్తుందో అన్న ఊహకు రూపాంతరం ఈ టపా!! అదృష్టం.. దానికి మనసు లేదు. మనకేమో “అలవాటు” పడిపోవడమనే కవచం ఉంది. ఎంతటి విపరీతాలకైనా అలవాటు పడిపోవడం, మొద్దుకెక్కిపోవడం.. మన నైజం!!