నువ్వు నువ్వుగా…

హే… ఏంటీ ఇది?

ఇంత రాత్రి.. ఏం చేద్దాం అని? తొంగి చూడకు అలా…

చెప్పాను కదా నీతో మాట్లాడలేనని.. ఇప్పుడు రానని..

అయినా వినిపించుకోవేం? చెప్తుంది నీకు కాదు..

అబ్బా.. అంతా వెలుతురు.. మసక వెలుతురు..వద్దన్నా తీసుకువస్తావు దీన్ని నీతో పాటు. ఒక్కడివే రావచ్చు కదా.. దీన్ని వెంటేసుకు తిగరడం దేనికి? నువ్వూ.. వీళ్ళలానే బాగా రుచిమరిగావు.. పొగడ్తలకీ, కవిత్వాలకీ. నిన్ను చూసి రాస్తున్నారనుకున్నావా.. అవ్వన్నీ.. కాదు నీతో పాటు వస్తుందే దీన్ని చూసి. “వెన్నెల రాత్రి.. వెన్నెల రాజు… వెన్నెల నవ్వు.. వెన్నెలా.. వెన్నెలా..” ఎప్పుడూ దాని గురించే గోల. అది లేని నాడు నిన్ను ఎవరైనా పట్టించుకున్నారా?? నీ ఉనికైనా వీరికి తెలుస్తుందా?? అసలు ఉన్నావని గుర్తిస్తారా వీళ్ళు.. గుర్తించినా “అమావాస్య” అనీ, అపశకునమనీ అనరు? అయినా దాన్నే వెంటేసుకు తిరుగుతావు.. ఏం?

విసిగిపోయాను.. చెప్పి..చెప్పి.. నువ్వంటే నాకిష్టమనీ.. నీతో కలిగే ఆనందం నాకెవ్వరూ ఇవ్వలేరని. అయినా నీ ధోరణి నీదే.. చెప్తునే ఉన్నా.. నీతో గడపడానికి సమయం కావాలనీ.. నీతో ఊసులాడాలనీ!! “వెన్నెలుంటే ఏం.. చెప్పూ” అంటావు. వెన్నెలంటే.. సహజంగా ఉండే అసహజం!! అన్నీ కనిపిస్తాయి.. కానీ అస్పష్టంగా. అది ఉంటే.. నీ మీద ఎవరిదో బలమైన గుర్తు కనిపిస్తుంది నాకు. అప్పుడు నువ్వు నువ్వులా కనిపించవు.. రూపాంతరం చెందుతావు. నేను గుర్తించలేనంతగా మారి పోతావు. కొత్తగా అనిపిస్తావు. నాకు నువ్వు కావాలి… నువ్వు నువ్వులా ఉండాలి. ఎవరికోసమో.. ఎవరి వళ్ళనో.. నువ్వు ముసుగులో ఉండడం నాకిష్టం లేదు. నిన్ను ప్రేమిస్తున్నాను.. నిన్ను నిన్నుగా..

నువ్వు ఉన్నావు అంటే.. వెన్నెల కూడా ఉంటుంది. నేనెంత అరచి గీ పెట్టినా.. అది నిన్ను వీడి పోలేదు. కానీ నా బాధా అర్ధం చేసుకో!! నేనీ లోకంలో మనగలగాలి. వీళ్ళకన్నీ కావాలి.. అసలు వీళ్ళు మాట్లాడే భాషే వేరు. చూసిందే నిజం అంటారు.. చూసిందళ్ళా నిజం అంటారు. కంటికి కనిపించక పోతే అవి ఉన్నాయన్నవి కూడా వీరికి అనుమానమే. నన్నూ అలానే ఉండమంటారు. నా భాష మౌనమని ఎందుకంటారు? నాతో మాట్లాడుతుంటే బయటకు వినిపించదు కనుక. కనిపించదూ.. అనిపించదూ కనుక. ఒంటరితనం వీళ్ళకి బొత్తిగా చేతకాదు. ఒంటరిగా కూర్చుని నవ్వితే.. పిచ్చి పట్టింది అంటారు. అందరితో కలసి బలవంతపు నవ్వులు నవ్వితే.. మహాసంతోషి. అందుకే నాకు చీకటి కావాలి.. ఇంకెవ్వరికీ కనపడనంత చీకటి కావాలి. అప్పుడు నేను ఏం చేసినా ఎవరికీ సమాధానం చెప్పనవసరం లేదు. నా మాన్నాన నేను బతకచ్చు.

“తెల్లని మనసు.. మల్లెపువ్వు లాంటి మనసు” అని నన్ను గుండెల్లో పెట్టుకుని బాగానే చూసుకుంటారు. కానీ ఎప్పుడెలా మారతారో తెలీదు.. ఒకసారి అంచులు దాటే సాహసం, వెనువెంటనే భయంకరమైన నీరసం. వాళ్ళు ముడుచుకుపోయి.. నా రెక్కలను కట్టేస్తారు. సహజంగా వస్తే ఈ మార్పులు అనుకోవచ్చు. కానీ ఏవో కొన్ని పద్ధతులు.. పట్టింపులు అంటూ నా స్వేచ్చను కాదంటారు. ఒక తెల్ల చొక్కా.. ఖండువా వేసేసి.. మంచిదానివి అంటే.. మాత్రం మారిపోతానా??  నేను వాళ్ళని పెట్టే తిప్పలు మానేస్తానా?? “నా మనసు.. బంగారం” అంటే మాత్రం నేను చేయాల్సింది ఆపేస్తానా?? వాళ్ళు నాకు అలవాటు పడ్డట్టే.. నేను వాళ్ళకి పడుతున్నాను. కానీ ఎదో ఒక క్షణంలో నాకు నాలా ఉండాలి అనిపిస్తుంది. ఆ క్షణాలలో ఇలా అంటూ నిర్దేశించే హక్కు ఎవరికీ లేదు.

మరి నన్నెందుకు నువ్వు ఆదేశిస్తున్నావు అని అడుగుతున్నావా?? అది నీకర్ధం కాదులే.. అది పరవశంతో వచ్చిన అధికారం.. నువ్వు నాకివ్వలేదు.. నేను దాన్ని కావాలని తీసుకోలేదు. నువ్వే నా వశమైయ్యాకా.. నిన్ను కాక ఇంకెవరినీ భరించలేను. ఈ ప్రపంచపు నియమాలు, నిభంధనలు మీద నాకు గౌరవం లేదు. నిన్ను నిన్నుగా నా దరికి రానివ్వని వారెవ్వరినీ నేను అంగీకరించలేను. నువ్వూ.. నేనూ.. కలిస్తే.. “మనం” అయ్యినప్పుడు అందులో నువ్వూ.. నేను తప్ప మరెవరూ ఉండకూడదు. రాకూడదు. లోకం కోసం నువ్వు వేసే పోకడలు నా దగ్గర నడవవు. నువ్వు దీన్ని ఏమైనా అను.. నాకు మాత్రం ఇది నువ్విచ్చిన వరం.

ఎంత చెప్పి ఏం లాభం.. కథ మళ్ళీ అక్కడికే వస్తుంది. వెళ్ళు.. మళ్ళీ వెన్నెల లేనినాడే నా దగ్గరకు రా!!

***********************************************************************************
“చీకటి గృహ నీవు.. చింతల చెలి నీవు.. నాటక రంగానివే మనసా..” అన్న ఆత్రేయగారి మాటలే మనసుకి నిర్వచనం అయితే.. ఆ మనసుకి చంద్రుడి మీద మనసైతే.. అప్పుడు వెన్నెల కూడా ఆర్భాటంగా, అనవసరంగా  అనిపిస్తే.. ఆ ఊహకి రూపాంతరం ఈ టపా!!

మనసైన వెన్నెలను.. మనసులను ఇలా ఆవిష్కరిస్తావా అనే ముందు.. ప్రేమ చినుకులా గిచ్చి గిలిగింతలు పెట్టవచ్చు.. అలజడై మనకే ప్రమాదంగా మారవచ్చు. ఏదైనా ప్రేమే కదా!! 🙂

**********************************************************************************

Advertisements

33 comments on “నువ్వు నువ్వుగా…

 1. నాలుగు సార్లు చదివితే కానీ ఇదేంటో నాకర్ధం కాలేదు. అర్ధం అయ్యాక దీని గురించి చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు.
  Simply superb.Keep going……

 2. ఈ కొత్త template అమావాస్య చంద్రుడిలా కాక, వెన్నెల రాత్రి వలే ప్రకాశిస్తూ, మనస్సుపై కురిపిస్తున్నది, చల్లదనం.

 3. చాలా బావుంది పూర్ణిమా! ‘మళ్ళీ వెన్నెల లేనినాడే నా దగ్గరకు రా’ అని అలిగినట్లు చెప్పడం భలే ఉంది.. ప్రేమ చినుకులా తడిమితే బానే ఉంటుంది, వరదలా ముంచేస్తేనే కష్టం.. పాపం చందమామ! ఇప్పుడు వెన్నెలని వదిలించుకోవడానికి ఎన్ని పాట్లు పడాలో :))

 4. ముందు మీ టెంప్లేట్ అదుర్స్ …. తరువాత మీ టపా…

 5. పూర్ణిమా ఎప్పటిలానే చాలా బావుంది… కొత్త టెంప్లేట్ కూడా మీ టపాలకి సరిగ్గా సరిపోయినట్లు అందం గా ఆహ్లాదంగా ఉంది.

 6. పూర్ణిమా.. అని ఏకవచనాంలో పిలవాలని ఉంది మిమ్మల్ని..

  పేరులోనే ఆమెనీ,అతడిని ఇముడ్చుకున్నారుగా.. ఇంకా వారిని వేరుగా చూస్తారేం? 🙂

  >>ఇంకెవ్వరికీ కనపడనంత చీకటి కావాలి.
  నిజమే, నాకు చాలా సార్లు ఇలా అనిపిస్తుంది. ఐతే,ఓ పక్క, ఎవరికీ కనపడనంత చీకటి ఏకాంతం కోరుకుంటూనే, ఆ గుహ చేరగానే, మనసుకు నచ్చిన వారి సాంగత్యం కోరుకుంటాం. ఇదే అసలు సిసలు చిక్కుముడి. కంప్యూటర్ భాషలో deadlock.

  >>ప్రేమ చినుకులా గిచ్చి గిలిగింతలు పెట్టవచ్చు.. అలజడై మనకే ప్రమాదంగా మారవచ్చు. ఏదైనా ప్రేమే కదా!!
  ప్రేమ, తనని ఆశ్రయించిన వారికే ప్రమాదంగా మారుతోందంటే, మనమెక్కడో దానిని manipulate చేస్తున్నాం అని నా అభిప్రాయం. మీరేమంటరు ?

  ఏది ఏమైనా, మంచి శృజనాత్మకమైన ఆలోచన.

 7. పూర్ణిమ గారూ,
  మీ బుర్ర్ర ఎప్పుడూ ఖాళీగా ఉండదా అండి ఎలా రాస్తున్నారండి ప్రతిరోజూ?చాలా బాగుందండి.

 8. ఇన్నాళ్ళూ సైలెంటుగా ఉంటే, ఇలాంటిదేదో జరిగుతుందని ఊహించా! ఈ టపాకి నువ్వు పెట్టిన శీర్షిక చాలా బాగుంది. కానీ నేను మాత్రం “ఒక జాబిలి, ఒక వెన్నెల,మరి నేను!” అనేసుకున్నా.

  చాలా బాగుంది.

 9. హే… ఒక్కసారి ఆగు…

  నిజం చెప్పు… ఆ వెన్నెల వెలుగులోనే కదా ఈ లోకంలానే నువ్వూ నన్ను మొదట గుర్తించింది?
  కాకపోతే… తరవత్తర్వాత అందిరిలా కాకుండా వెన్నెల లేనప్పుడూ గుర్తించగలిగావు… నన్ను నన్ను లా గుర్తించి అభిమానించగలిగావు… నాకు నీలాంటి స్నేహం దొరికినందుకు వెన్నెల మీద ఇంకా మక్కువ పెంచుకున్నాను… ఎందుకుంటే ఆ వెన్నెల గుర్తే లేకపోతే నేను నీకు పరిచయమయ్యేవాన్ని కాదు కాబట్టి….

  వెన్నెల లేనప్పుడు లోకం నన్ను పట్టించుకోవడంలేదని… లోకం మీద కోపం పెంచుకున్నావు… వెన్నెల లేని నన్ను ఇంకా దగ్గరకి తీసుకున్నావు… అందరి కన్నా బాగా చూసుకున్నావు… అప్పుడు నేను నీపై చూపించే ఆరాధనలో, నీ వల్ల నాకు కలిగిన ఆనందంలో నువ్వు పరవశించిపోయావు… ఆ పరవశంలో నీకు మాత్రమే నా మీద అధికారం ఉంది అనుకున్నావు… నా మీద నీకే సర్వ హక్కులూ ఉన్నాయనుకున్నావు…దాన్ని నేనూ ప్రశ్నించలేదు… నీ అధికారంలో తన్మయత్వానికి గురయ్యాను…

  ఈ రేయి వెన్నెలతో వచ్చిన నన్ను అకస్మాత్తుగా ప్రశ్నించావు… ఒక్కడివే రావొచ్చుగా అని… నాకు అర్ధం అయ్యి అవ్వనట్టుంది… ఈ రేయి నన్ను లోకం దరి చేర్చుకుంటుందని లోకమ్మీద కోపమా? నీకు ఈ రేయి దూరమైపోతానని కదా? లేక నా మీద ప్రేమా? అన్నీ కదా?

  ఏదైనా సరే… ఒక్కసారి నాకోసం ఆలోచించవా?… నా కోసం…

  నువ్వు నన్ను వెన్నెల్లో గుర్తుపట్టేముందు… వందలాది మంది నన్ను గుర్తు పట్టారు… నాలో ఒక ఆశని చూసుకున్నారు, ప్రశాంతత కనుగొన్నారు… వాళ్ళలో నా జీవితపు పరమార్ధం నాకు బోధపడింది… వాళ్ళకోసం రోజు వెన్నెల పంచాలనుకున్నాను… కానీ ఆ వెన్నెల కూడా నాకు వేరొకరు పంచితేనే వస్తుంది!! నాకు అలా పంచుతుంది కూడా నా కర్తవ్యాన్ని నెరవేర్చడం కోసమేనేమో..!

  వాళ్ళంతా నాకోసం ఎదురు చూస్తారు… ఏది ఏమైనా నేను వెన్నెల పంచాలి… నా కర్తవ్యాన్ని నెరవేర్చాలి…

  నీకు ఇంకో విషయం తెలుసా… నా ఉనికిని నేను మొదట కనుగొంది లోకం నా వెన్నెల గుర్తించినప్పుడే… అలాంటిది ఇప్పుడు ఆ వెన్నెలని దూరం చేసుకొమ్మంటే నాకు భయంగా ఉంది… నాకు అలవాటైన నా ఉనికి ప్రశ్నార్ధకమైపోతుందేమో అని…

  నన్ను అర్ధం చేసుకుంటున్నావా?

  పిరికివాడిలా కనిపిస్తున్నానా? విశ్వాసం లేని వాడిలా అనిపిస్తున్నానా? నువ్వేమైనా అను…
  వెన్నెల లేనప్పుడు నువ్వు చూపించిన ప్రేమానురాగాలు నాకు కావాలి… కోపంగా ఉందా? నీ నుండి ఇలా ఎలా ఆశిస్తున్నానో అర్ధం కావడం లేదా?

  నేను నేనుగా లేను.. నాతో నా వెన్నెల ఉంది… నా కర్తవ్యం ఉంది.. నా కోసం ఎదురుచూసే వందమందిలో కనపడే ఆశ కోసం, ప్రశాంతత కోసం…

  ***********************************

  అమ్మమ్మ, అమ్మ, చందమామని ఆరాధించినంతగా నేను ఇంకెవరిని ఆరాధించలేదు… నా చందమామనే నిలదీస్తుంటే చూస్తూ ఉండలేకపోయాను. ఆ చందమామే ఎదురునిలిచి బదులిస్తే అనే నా ఊహలోనుండి వచ్చిన సమాధానం ఈ టపాకి నా స్పందన!

 10. శ్రీవిద్య: అర్ధం కాలేదు అంటావేమో అనుకున్నా.. అర్ధం అయ్యే దాకా చదివావు మాట. నీ స్పందనే అంతా చెప్తుంది.. మాటలు అవసరం లేని సందర్భం అది.

  రావు గారు: టెంప్లేట్ వెన్నెలా మీకు అనిపించవచ్చు.. అంత అందంగా ఉంది కనుక. కానీ నాకు అది అమ్మ గోరు ముద్ద. ఆప్యాయత మాత్రమే కనిపిస్తుంది. జ్యోతిగారు నాకోసం ఎంతో శ్రమించి చేసిన డిసైన్ అది.

  నిషీ: నెనర్లు!! చంద్రుడు వెన్నెలను వదిలించుకోలేడు.. అది అసంభవం. ఏ మనసుకోసమో వదిలించుకోవాల్సిన అవసరం కూడా లేదు. నేనే చంద్రుణ్ణి అయితే ఆ ఒక్క క్షణం ఆ ఆవేదనను భరించి.. ఆ క్షణం దాటిపోయాకా.. అంతా మామూలే అన్నట్టు ఉంటాను. అది బయటపడాలి అనిపించే పిచ్చితనం.. నా దగ్గర మాత్రమే అని ఆనందిస్తాను.

  అశ్విన్: టెంప్లేట్ అదుర్స్ : జ్యోతిగారికే సొంతం!! నా టాపాని కూడా అభినందించినందుకు నెనర్లు.

  వేణూ: థాంక్స్!! ఇది అంత ఆహ్లాదమైన టపా కాదుకాని.. నిజమే.. టెంప్లేట్ వల్ల నా రాతలకే కొత్త అందం వస్తుంది.

 11. మోహనా:
  మీ బ్లాగులో నా కమ్మెంట్లెప్పుడూ ఇంగ్లీషులో ఎందుకుంటాయో ఇప్పుడర్ధమయ్యిందా?? 😉

  మీ ప్రశ్నకు జవాబు చెప్పాలంటే… చాలా పెద్ద కథే ఉంది. నా పేరు గురించి మాత్రం నేనెప్పుడూ ఎక్కువ ఆలోచించలేదు.. అందుకని దానికి ఏమి చెప్పాలో తెలియటం లేదు. వేరుగా ఎందుకు అన్నది మాత్రం చెప్పగలను.

  చంద్రుడూ.. వెన్నెల విడదీయలేని ప్రకృతి విధానం. నిండు పున్నమిని మనమంతా ఎంత ఆదరిస్తామో వేరే చెప్పనవసరం లేదు. కవితలలోనే కాదు.. పూజా పునస్కారం అంటూ. నేనూ అందుకు విరుద్ధం కాదు. నాకు వెన్నెలంటే చాలా ఇష్టం. అయితే వెన్నెల ఉన్నా లేకపోయినా చందమామ నాకు మరీ ఇష్టం. ఇక్కడవాళ్ళు “ఈద్ కా చాంద్” అంటూ నెలపొడుపును చూస్తారు. అది మంచిది కాదు అనే నమ్మకం మనకున్నా చూసే అలవాటు నాది. ఏ రోజుకా రోజు చంద్రుణిలో ఒక కొత్త అందం కనిపిస్తుంది. ఇది నా స్వగతం.

  ఇక నా ఊహకి ప్రేరణలను చాలానే ఉన్నాయి. ముఖ్యంగా తిలక్ రాసిన “నల్లజర్ల రోడ్డు” అనే కథ. ఇది మొదలవడం తోటే.. వెన్నెలను భయం కలిగించేలా చిత్రీకరిస్తారు తిలక్. వెన్నెలెప్పుడూ ఆహ్లాదంగా అనిపించాలి అంటే.. ఆ ఆహ్లాదమంతా ముందు మనలో ఉండాలి. మనం ఆ క్షణం ఏమి ఆలోచిస్తున్నాం, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం అన్నదాని బట్టే ఆహ్లాదమా కాదా అనిపిస్తుంది. ఈ విషయాన్ని ఉపయోగించుకునే.. మనసు చూడకూడదని నిశ్చయించుకుంటే.. వెన్నెలకి కూడా మనం దూరం అవుతాము అనే ఇక్కడ చెప్పదలుచుకున్నది. సందడిలో సందడి మిగితా వారిని కూడా లాగేసా!! 😉

  I don’t view it as a deadlock as such. “తోడుగా నువ్వుంటే చీకటే ఓ అందం” అని మీరంటున్నారు. “చీకటే తోడయితే లోకమే ఓ అందం” అని నేనంటున్నాను. పరిణీత హిందీ సినిమాలోని “రాత్ హమారితో చాంద్ కి సహెలీ హై” అన్న పాట విన్నారా?? వినండి. అప్పుడు మీకేమనిపిస్తుందో చెప్పండి.

  మనం మానిప్యులేట్ చేస్తాం. ఏ ప్రేమనీ అలానే, in its purest form స్వీకరించం. కనీసం అన్నింటినీ స్వీకరించలేం. కారణాలు కోకొల్లలు. ఒక్కోసారి లోకం సృష్టించినవి అయితే.. ఒక్కోసారి స్వయంకృతాలు. ఈ రెంటినీ నా టపాలో ప్రస్తావించాను.

  నా మనసు పంచుకోనే అవకాశం ఉన్న వ్యాఖ్య చేసినందుకు ధన్యవాదాలు.

 12. కిరణ్ గారు: మీరు నా బ్లాగుకి వ్యాఖ్యానించటం ఇదే మొదటిసారి. 🙂 మీతో “బావుంది” అంటూ బోణీ చేయించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

  క్రాంతి గారు: రాస్తున్నానా లేదా అన్నది వేరే విషయం.. బుర్ర మాత్రం ఖాళీగా ఉండే ప్రశక్తి లేదు. మెదడండీ అది.. దాని పని ఆలోచించడమే.

  మహేశ్ గారు: ఇన్నాళ్ళూ కాదండీ.. ఓ రెండుమూడు రోజులే!! ఇకపై ఇంతకన్నా ఎక్కువ కాలం “చేయి” ఆడదేమో!! 😦
  మీరన్నదే మొదట నేను శీర్షికగా పెడదాము అనుకున్నా. కానీ ఎవరు ఎవరితో.. ఎవరి గిరించి మాట్లాడుతున్నారో శీర్షికలోనే చెప్పేసినట్టు ఉంటుంది. ఏదో ఆ క్షణంలో తట్టింది “నువ్వు నువ్వగా” అని.. రొమాంటిక్ గా ఉంది ఇప్పుడు ఆలోచిస్తుంటే. మన సినిమా వాళ్ళు చూస్తే ఇట్టే పట్టేసుకుంటారు ఏమో!! 😉
  మీ ప్రొత్సాహానికి నెనర్లు.

  రాధిక గారు: త్రిషా ఎందుకు వచ్చింది మధ్యలో?? 😦 నాకేమీ అర్ధం కాలే!!

  మీనూ: ఇందులో హాయి కనిపించిందా నీకు?! థాంక్స్!!

  వంశీ: భలే కాచ్ చేశారే!! ఊ.. ఇది పున్నమి రాత్రి వచ్చిన ఊహే!! శీర్షిక బాగుంది కదూ.. నాకూ ఇప్పుడిప్పుడే అనిపిస్తుంది. 🙂

  దిలీప్: మీ స్పందనకు నెనర్లు. పై వ్యాఖ్యలు చదివితే.. నేనేమనుకుని రాసానో అర్ధమైయ్యే ఉంటుంది.

  కొత్త పాళీ గారు: Those were exactly the two words I wanted to hear!! 🙂 Thanks!!

 13. హమ్మ్ .. బావుంది. పూర్ణిమ నాడు పుట్టిన ఊహని అమావాస్య ణాటికి ఆవిష్కరించారన్నమాట. అన్నట్టు నిన్న అమావాస్య – ఆ విధంఘా కూడా ఇది చాలా సందర్భోచితంగా ఉంది.
  ఇప్పుడు పాఠకులకి (పూర్ణిమ గారికి కూడా) ఒక ప్రశ్న.
  “నువ్వే నా వశమైయ్యాకా.. నిన్ను కాక ఇంకెవరినీ భరించలేను. ఈ ప్రపంచపు నియమాలు, నిభంధనలు మీద నాకు గౌరవం లేదు. నిన్ను నిన్నుగా నా దరికి రానివ్వని వారెవ్వరినీ నేను అంగీకరించలేను. నువ్వూ.. నేనూ.. కలిస్తే.. “మనం” అయ్యినప్పుడు అందులో నువ్వూ.. నేను తప్ప మరెవరూ ఉండకూడదు. రాకూడదు. లోకం కోసం నువ్వు వేసే పోకడలు నా దగ్గర నడవవు.”

  .. ఈ మాటలు ఒక యువతి ఒక యువకుడితో అంటే పరిస్థితి ఎలా ఉంటుంది?

 14. కొత్తపాళీగారు:

  Hmm.. interesting question!! అది అబ్బాయి అమ్మాయి అంటే కూడా.. మీ ప్రశ్నకు నా అభిప్రాయం.. ఆ క్షణంలో ఆ బంధం బీటలు వారడం మొదలు పెడుతుంది. అప్పుడే అంతా అయ్యిపోయినట్టు కాదు కానీ ఆ ఫీల్ ఉంటే మాత్రం మనుగడ కష్టం. Any relation on earth, should help you grow as an individual. Otherwise it is next to impossible to sustain that relation, with you being as you. “మన” లో కూడా “నా” ఉంటుంది,

  బొమ్మరిల్లు సినిమాలో అంతగా ప్రేమించే నాన్న అంటే హీరోకి ఎందుకు పడదు? అమ్మ మనకి తెలిసిన జాగ్రత్తలే మళ్ళీ మళ్ళీ చెప్తుంటే ఎందుకు విసుక్కుంటాము? “నువ్వు నాకు మాత్రమే సొంతం.. మీ అమ్మ మనకు అడ్డం” అంటే ఏ భర్త హర్షిస్తాడు? నీ కెరీర్ వల్ల నువ్వు నాకు దూరం అయ్యిపోతావంటే ఇప్పటి అమ్మాయిలు ఎంత మంది దాన్ని ఆమోదిస్తారు??

  బంగారంతో వేసినా, మనసుతో వేసినా అవి సంకెళ్ళే!! వాటి తెంపుకోడానికే మన ప్రయత్నం. The beauty of a relation is purely and solely on the two individuals. అందుకే కొన్ని (ముఖ్యంగా క్రైం) తల్లీబిడ్డల కథలు చదివితే ఏవగింపు కలుగుతుంది. సమాజ వ్యతిరేక బంధాలలో నిశితంగా పరీక్షించే ఆసక్తి ఉంటే.. అందం కనిపిస్తుంది.

  ఇది నా అభిప్రాయం అధ్యక్షా!! Lets here from the rest.

  ఇక నిన్న అమావాస్యని నాకు తెలీదు!! 😦

 15. కొత్తపాళి గారు చర్చను ఒక కొత్త మలుపు తిప్పారు. భావావేశంతో నిజజీవిత సంబంధాలని అన్వయించడం, అదొక ఎత్తు. పూర్ణిమ సమాధానం కూడా చాలా అర్థవంతంగా ఉంది.

  నిజమే! more you hold a person close in a relationship, more she/he start feeling suffocated. అందుకే కొంత పట్టూ-విడుపూ ఉండాలంటారు. నిజానికి, ఎంత స్వేచ్చగా వదిలేస్తే, అంత గట్టిగా బంధం ఉంటుందనుకుంటా. నమ్మకం ఉంటే ఆపని చెయ్యడం సులువు. ఇక insecurity ఉంటే, ఆ బంధం ఎప్పుడో ఒకప్పుడు తెగిపోవడం మాత్రం ఖాయం.

 16. పూర్ణిమ గారూ,
  చాలా బాగుంది. మనసు ని మృదువుగా తాకింది. చదువుతూ ఉన్నప్పుడు సున్నితంగా మెల్లగా ఒక మంచి భావన మనసుని ఆవరించిది. జోహార్లు.

  కొత్తపాళీగారు:
  ప్రేమ సున్నితమైన గులాబి కదండీ, మృదువుగా పట్టుకుంటే అందంగా ఉంటుంది. ఒత్తిడి పెడితే పాడవుతుంది.

 17. @ పూర్ణిమ
  నువ్వు ఎందుకు రాసావో నాకు ఇప్పటికీ అర్ధం కాలేదు. కానీ నా చందమామని నిలదీసావు. నేను తన తరపున రాసాను.

  కానీ అసలు విషయం చెప్పలేదు… చాలా చాలా బాగుంది నీ టపా.. 🙂

 18. @కొత్తపాళీ గారు
  ఒక అమ్మాయి ఆ ప్రశ్న అంత తీవ్రంగా ఎప్పుడు అడుగుతుందనుకుంటారు? నాకైతే వారిరువురు కలిసి భవిష్యత్తును పంచుకుంటారా లేదా అనే ప్రశ్న తలెత్తినప్పుడు అనిపిస్తుంది…. ఈ టపా మొత్తం చదివినప్పుడు నాకైతే అదే అనిపించింది….

  ఒకవేళ అంతలా ప్రేమించిన అమ్మాయి అలా అంటే, అబ్బాయి కూడా ఆ అమ్మాయిని ప్రేమించి ఉంటే…. ఆ అబ్బాయి అలౌకికానందాన్ని పొందుతాడు ఆ క్షణంలో… తనకు కలుగుతున్న అనుభూతి నిజమో కాదో, అది ఆనంద పాడాల్సిన విషయమో కాదో అన్న తర్జన భర్జన పడతాడు ఆ క్షణంలో… (తను లోకం దృష్టిలో చూడటానికి అలవాటుపడిపోయాడు కాబట్టి) అదొక మిశ్రమ అనుభూతి… నన్ను,నన్నుగా ఈ అమ్మాయి ప్రేమిస్తున్నందుకు కృతజ్ఞతాభావంతో మాటలు కరువవుతాయి. ఆ అమ్మాయి మీద ఏ కోశానా కోపం కలగదు. ఆ బంధం బీటలు వారదు. ఆ అమ్మాయి మాటల ప్రవాహాన్ని కరిగిపోతున్న మబ్బులా, ఎగిరిపడుతున్న కెరటంలా చూస్తాడు. తనకి తెలిసు… ఆ ఘడియ గడిస్తే మరల తను ఆ ప్రశ్నలు వెయ్యదని…. అమ్మాయిలో, ఆ బంధంలో ప్రశాంతత(స్తబ్ధత అని కూడా అనొచ్చేమో) ఆవరిస్తుందని… ఆ స్తబ్ధత ఆ బంధంలో ఆ క్షణం నుండీ కొనసాగుతుందని…

  ఎందుకంటే.. తనకు తెలుసు తన ప్రియురాలి గురించి… తను నా కోసం ఎంత గొప్ప త్యాగం చేస్తున్నా కూడా అది త్యాగం అనుకోదు… త్యాగం అనేది తన నిఘంటువులో లేని పదం… తను అసహ్యించుకునే పదం… సొంతం చేసుకోవడం మాత్రమే తనకు తెలిసింది… తనకి తెలుసు నేను తన పక్కనున్నా లేకున్నా తనకి సొంతమని…

  ఈ లోకం ఆ నిజాన్ని గుర్తించలేకపోతుందని లోకం మీద జాలి… నిజాన్ని గుర్తించలేని ఈ లోకాన్ని నేను ఆసరాగా చేసుకుంటున్నానని నా మీద కోపం… అలా నన్ను తనకి దూరం చేస్తుందనుకుంటున్న ఈ లోకం అంటే అసహ్యం…

  వారిరువురు కలిసి జీవించకపోవచ్చు… లోకం పోకడలని అనుసరించనూ వచ్చూ… లోకం చేత గొప్పగా మెప్పు కూడా పొందవచ్చు. కానీ ఆ బంధం శాశ్వతం. లోకం దాన్ని నిర్వచించ లేదు…

 19. పూర్ణిమా, ఆర్థమయ్యింది :-).

  చంద్రుడు ఎలా ఉన్నా అందంగానే ఉంటాడు. నిజానికి అది చూసే వారి కళ్ళలో ఉంది కదా..
  పరిణీత లోని అ పాట నాకు చలా నచ్చిన పాటల్లో ఒకటి. చలా రోజుల తరువాత తన ప్రేమికుడు తనకి ఇచ్చిన ఏకాంతాన్ని, తనలో మిగిలిన చీకటిగా అభివర్ణించి, ఆ చికటిని తాను చంద్రునితో, అ పై తనతో తాను పంచుకుంటూ, కష్టమనిపించినా.. గుండెలకి హత్తుకునే సందర్భంలా అనిపిస్తుంది.
  accepting the destiny and oneself as it is, even when it hurts needs a lot of courage. It takes some time and leaves a composed self.

  Your post has raised few thoughts in me too. 🙂

  కొత్తపాళీగారూ:

  అలా ఒక అమ్మాయి ఒక అబ్బాయితో అంటే, అది తన ప్రేమలో గాఢతను తెలియచేయటానికి అని నే అనుకుంటున్నాను. దిలీప్ గారు చెప్పినట్టు ఆ క్షణం గడిస్తే ఆ భావావేశం వర్షించే మేఘంలా కరిగిపోతుంది. ఆ తరువాత మిగిలేది ప్రకాశవంతమయిన, ప్రశాంతమయిన వాతావరణం [బంధం] మాత్రమే. ఇది వారిద్దరి మధ్య ఉన్న నమ్మకం, understanding మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా అబ్బయి ఇది ఆమె బలహీనత గా కాక, ఆమె ఆవేశం అర్థం చేసుకోగలగాలి.

  అదే ఒక అబ్బాయి ఒక అమ్మాయితో ఆ మాట అంటే ఆలోచించాల్సిందే..! ఎందుకంటే వారి అవేశం క్షణికం కాదు. అది మాటల్లో వ్యక్తపరచటం వరకే పరిమితం అవ్వదు అని నా అభిప్రాయం.

  అమ్మాయికైనా, అబ్బాయికైనా ఇలాంటి భావం ఎక్కువ కాలం ఉంటే పూర్ణిమ గారు చెప్పినట్టు ఆ బంధం మనుగడే కష్టం అయ్యె ప్రమాదం ఉంది. అలాంటి బంధం ఇద్దరి ఎదుగుదలకు కాక, ఒకరి ఎదుగుదలకు ఒకరు అడ్డంగా అయ్యేలా మారుతుంది.

 20. మోహనా: మీలో ఆలోచనలు రేకెత్తించగలిగానంటే.. నా రాత సార్ధకత పొందిందన్న మాటే!!

  మీరు కొత్తపాళీ గారికిచ్చిన సమాధానం ఆశ్చర్యం కలిగించింది. ఇద్దరిలో అంత తేడా ఉంటుంది అంటారా??

 21. @RSG:

  ఇప్పుడే చూస్తున్నా ఈ కవితలు.. ఇంతకీ నన్నా ప్రశ్న ఎందుకు అడిగినట్టు.. అదీ ఈ టపాలో??

 22. @పూర్ణిమా..
  హ హ. సార్ధకత అని పెద్ద మాటే వాడేసారు.
  I feel that each of us is an inspiration to another.

  సైకలాజికల్ గా ఆడ, మగ మధ్య విభేదాలు ఉంటాయన్నది మనకి తెలిసిన విషయమే కదా..
  ఐతే దానికి తోడు పెరిగిన వాతావరణం, కుటుంబం, స్నేహితులు, ఎదుర్కున్న సంఘటనలు ఇలా చాలా విషయాలపై ఒక వ్యక్తి వికాశం ఏర్పడి ఉంటుంది. కాబట్టి ఇలానే ఉండలి అని నే అనను. కానీ ఎక్కువ శాతం ఇలా ఉండచ్చు అనేది నా అభిప్రాయం. కాస్త నిశితం గా పరిశీలిస్తే మన చుట్టూ ఉన్న వారిలోనే ఈ విషయాలు గమనించవచ్చు. ఆడవాళ్ళళ్ళో కొపాలు వచ్చినా, గొడవలు వచ్చినా ఎంత సేపు ఉంటాయి? మగవారికంటే త్వరగానే,తేలికగానే మర్చిపోతరేమో కదా..?
  And I see that members of she-group are more spontaneous than he-group members. you can take me as an example 😉

 23. Love exists in forms that are twisted and love is selfish. I loved this blog puri. The possessiveness one feels for the object of their amusement and the bare essentials of you as you, that it looks for, is portrayed beautifully. Ability to share your individual with the society that you scoff upon is a marathon of a task.

  But then, personally, I feel love is giving. The ability to see from the same perspective, the ability to love what your love loves. The ability to cherish the very presence of that person, irrespective of his attention to you. That is ulterior love. The ability to be able to communicate to that person, without the means of communication…

  The very breath you take is a reverence for that love,
  The very battle you fight is a shrine for that love.

 24. Mahi: Personally, I do have different idea about love. But here was an attempt to showcase the most selfish form of it. I hope I was successful.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s