శిలాక్షరాలైన క్షణాలు- 2

బ్రతుకు తెరువు చూపిస్తున్న ఊరిలో బతుకే ఒక ప్రశ్నార్ధకంగా మారితే.. పుట్టిన ఊరికే తిరుగుప్రయాణం కట్టాము. నాంపల్లిలో రైలెక్కినా.. ఇంటికి తిరిగివెళ్ళిపోతే బాగుణ్ణు అనిపిస్తుండింది నాకు. రైలు హైదరాబాద్ ని వదిలి దూరంగా పోతున్నకొద్దీ.. నా మనసు దానిమీదకు పోతోంది. “మనవాళ్ళె”వరూ అంటే గుర్తించలేని వయస్సులో కూడా హైద్ అంటే నాకు చాలా ఇష్టం. అది నాది అనే భావన. “రాష్టంలో అతి ముఖ్యమైన పట్టణాలు” అనే పాఠం.. హైద్ తో మొదలవుతుంది. అటు తర్వాత వైజాగ్, తిరుపతి, విజయవాడ గురించి ఉంటుంది. ఒక్కోదాని గురించి నాలుగు ముక్కలంతే!! అయినా నా చిట్టి మెదడుకి.. హైద్ లో సముద్రం లేదనీ, తిరుపతంత పేద్ద గుడి లేదనీ తెలిసిపోయింది. బాగా చదివేసి.. ఈ రెంటినీ హైద్ లో పెట్టేయాలని నా జీవిత లక్ష్యం అప్పటిలో. షారుఖ్ ఖాన్  “బొంబాయ్ ని కొనేస్తాను” అని ఓ అర్ధరాత్రి పూట ఆవేశంలో అరిచాడట.. అతగాడి గురించి చదివినప్పుడల్లా.. నాకు నా ఊరంటే ఎంత ఇష్టమో.. గుర్తు వస్తుంది.

మా అమ్మానాన్నల పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది. గూటికి క్షేమంగా చేరుతున్నామన్న ఆనందం తెలుస్తుంది. నా మూడ్ ని సరిచేయడానికి తన చిన్ననాటి జ్ఞాపకాలను నాకు చూపించడానికి… అసలు దిగాల్సిన స్టేషను కన్నా ముందే దిగి.. ఓ రిక్షా ఎక్కితే.. మా ఊరెళ్ళే లోపు ఇంకో రెండు ఊర్లు చూడచ్చు అని నాన్న ప్లాన్. రిక్షాలో వెళ్తున్నంత సేపూ.. మా నాన్న బాల్యాన్ని చెప్తుంటే.. నా ఊహలు సినిమా వేసుకున్నాయి. చదివిన బడి, తిరిగిన కాలువ గట్లు, నడిచిన దారులు, ఆడుకున్న ఆటలు, పెంచుకున్న పేరు, పంచుకున్న స్నేహాలు, పొలాలు.. చేలూ, చెరువులూ, మండువా ఇళ్ళులు, తాటాకిళ్ళులు.. అన్నీ నాక్కొక్కటే చూపిస్తున్నారు. నేనంటున్న.. “ఒకే”, “యస్”, “బట్ వై?”, “హు?” లకే ఆ రిక్షా అబ్బి ఆంగ్ల సాహిత్యాన్ని తిరగరాసింది నేనే అన్నట్టు చూడడం.. ఇవ్వన్నీ బాగా గుర్తు. మా ఊరెళ్ళడానికింకా ఓ రెండు గంటలు సమయం ఉంది కాబట్టి.. అప్పటికే పది.. పదిన్నర అవుతుంది కాబట్టి.. దారిలో ఒక చిన్న బడీ కొట్టు దగ్గర ఇడ్లీ తిన్నాము అందరూ.. ఆ రిక్షా అబ్బితో సహా!! ఇడ్లీ అంటే నాకు గొంతు దిగదు.. చాలా కష్టపడతా.. కానీ అది అంటే ఇంకా ఇష్టం.. ఆ కొట్టులో తిన్న రుచిలో ఎదో ఉంది. తింటున్నంత సేపూ.. నవ్వుకుంటూనే ఉన్నాము.. ఎందుకో గుర్తు లేదు.

నెమ్మది నెమ్మదిగా ఊరి వైపుకు వస్తున్నాము. ఒక్కొక్కరే కనిపిస్తున్నారు.. తెలిసిన వాళ్ళు. మా అమ్మా నాన్న పలకరింపుగా నవ్వుతుంటే.. ఎవరూ బదులు ఇవ్వటంలేదు. నాకు అన్నయ్య వరసయ్యే అబ్బాయి మాత్రం నోరారా పలకరించాడు.. దారిలో ఉండగానే. మా నాన్నని ఎక్కడికో తీసుకెళ్ళాడు. “నాకు వాళ్ళని పరిచయం చేయకుండా.. నువ్వే మాట్లాడేసుకుంటావేం??” అని మా అమ్మ మీద అపవాదు. చెప్తాలే అని అమ్మ బుజ్జగింపు అయ్యే సరికి మేము మా నాన్నమ్మ ఇంటి ముందు ఉన్నాము. బయటకే ఘుమఘుమలు వచ్చేస్తున్నాయి.. వంటలకి!! మేము లోపలకి వెళ్ళాము.. రిక్షా అబ్బి మంచి నీళ్ళ కోసమని ఆగాడు. అడుగుపెట్టడమేమి మా అమ్మ.. “ఏమయ్యింది.. ఏమయ్యింది” అని ఒకటే అడగడం.. నాకేమీ అర్ధం కావటం లేదు. మాకులాగానే.. అంతా మా నాన్నమ్మ ఇంటికి వచ్చారు అనుకున్నా. మా అమ్మ ఒక్కసారిగా గట్టిగా ఏడవడం మొదలెట్టింది.. నాకు అమ్మంటే భయం వేసేంతలా!! ఎవరో వచ్చి నన్ను పక్కకు పట్టికెళ్ళారు. మా అమ్మ, మా అత్తలు, పెద్దమ్మలు అంతా ఘొల్లుమన్నారు. నాకు ఒక్క ముక్క అర్ధం కావటం లేదు.. ఆ పట్టుకున్న ఆవిడనే ఇంకా గట్టిగా పట్టుకున్నా. ఈ లోపు.. మా అక్కలు అంతా వచ్చి నన్ను అక్కడి నుండి తీసుకెళ్ళిపోయారు. వాళ్ళే.. నిదానంగా చెప్పారు.. “తాతయ్య పోయారు.. ఇవ్వాల్టికి నాలుగో రోజు” అని. మా అమ్మకు మల్లే నాకు ఏడుపు రాలేదు.. విని ఊరుకున్నాను.

మా తాతయ్యకి అప్పటికే ఒకసారి గుండెపోటు వచ్చిందనీ.. ఆర్నెళ్ళ క్రితమే వచ్చి చూశామని.. నాకు గుర్తు. అప్పుడు వార్త తెలియగానే హడావిడిగా వచ్చేశాము..ఇప్పుడసలు వార్తే తెలీదు. మేమెందుకో వస్తే.. ఇంకెదుకో అయ్యింది. “తండ్రి కాలం చేస్తే.. హాయిగా పిల్లా పాపలతో.. నవ్వుకుంటూ వచ్చారు వాళ్ళు.. గుమ్మం వరకూ వస్తే గానీ తెలీలేదు” అని ఊరు ఊరంతా విడ్డూరంగా చెప్పుకున్నారు. హైద్ లో గొడవలకి తపాలా శాఖ విధులు ఆపబడి.. వార్తల్లో మాత్రమే టెలిగ్రాములు చదివేవారని చెప్పాను కదా!! అలా మా తాతగారి విషయం కూడా రేడియో వచ్చింది. ప్రతీ రోజూ ధ్యాసగా వినే మా అమ్మ.. ఎలానో మిస్స్ అయ్యింది. ఈ వార్త మాకు తెలిసిన వారెవ్వరో విని మాకొచ్చి చెప్పేసరికి.. మేమే ఊరికి వచ్చేసాము. దారిలో దిగిన నాన్న నేరుగా పొలంకి వెళ్ళారట. అక్కడేమి చేసారో తెలీదు కానీ మా నాన్న అసలు ఏడవలేదని అంతా చెప్పుకున్నారు. బాధపడడం.. ఏడవడం.. పర్యాయపదాలు కాదు. ఏడవని వారికి బాధలేనట్టు కాదు.. ఆ బాధ బయటకు వచ్చే మార్గం లేదంతే!!

ఉత్తర-దక్షిణ ధృవాలను కలపగలిగే ఏకైక మార్గం.. వివాహం అని మా నాన్నమ్మా.. తాతయ్యలను గురించి తలచుకున్నప్పుడల్లా అనిపిస్తుంది. మా తాతయ్య ఆరడుగులు ఆజానుబాహుడు.. ముట్టుకుంటే డాగు పడుతుందనే మేలిమి ఛాయ. అందమైన ముఖ వర్చస్సు. ఎక్కువుగా చదువుకోలేదు. అలాంటి వారు.. నల్లగా, పొట్టిగా ఉన్నా కళైన ముఖంతో ఉన్న మా నాన్నమ్మని అప్పటిలో నాలుగు వందల వెండి కాసులు ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్ళి చేసుకున్నారట. “అప్పటిలో ఆడపిల్లలు దొర్రక్క అంతా ముదిరిపోయారు.. నాకీ చిన్నది దొరికింది బాహు బాగుగా” అని డబ్బై ఏళ్ళలో కూడా హుషారుగా చెప్పేవారు.. ఆయన జీవితంలో ఎక్కువ సార్లు విన్న ప్రశ్న కావచ్చు.. “ఎలాగండీ.. మీ ఇద్దరికీ కుదిరింది?” అని. కేవలం రూపు రేఖలలోనే కాదు.. గుణగణాలలో కూడా. మా నాన్నమ్మకి చదవటం రాదు.. కానీ గీత, భాగవతం, భారతం నోటికి వచ్చు.. నిష్ఠా గరిష్టురాలు.. ఎప్పుడూ పూజా పునస్కారాలు.. ఉపవాసాలు. మా తాతగారికి భోజనప్రియలు. మాంసాహారం మరీను!! నాన్నమ్మేమో.. పూర్తి శాఖాహారి. అయినా ఏ వంటైనా అమోఘంగా చేసేవారు. చతుర సంభాషణలకు తాతయ్య ప్రతీతి.. నాన్నమ్మ చాలా నెమ్మదస్తురాలిలా ఉండేవారు.. కోపం వచ్చేంత వరకూ!! ఇక ఇద్దరూ కలిసి.. భారతావనిలో వెళ్ళని పుణ్యక్షేత్రం లేదు.. వాళ్ళు చూడని గుడి లేదు. నాన్నమ్మ చేయని పూజలేదు.. పట్టని నోము లేదు. ఆ రోజు కూడా పక్కూరిలో ఎవరిదో పెళ్ళికి వెళ్దామని తాతయ్య, నాన్నమ్మ ప్రయాణం కట్టారు. ఇంకో పది నిమిషాల్లో బండి వస్తుంది. తాతయ్య భోజనం చేసి.. పడక కూర్చిలో పడుకున్నారు. నాన్నమ్మ వసారాలో ఎదో సర్దివచ్చి లేపుతున్నా.. లేవలేదు!! అంతే.. ప్రాణం అలా వదిలివెళ్ళిపోయింది. అది అదృష్టమట.. నేను చాలా మంది అనగా విన్నాను. మా నాన్నమ్మకూడా అదే అనుకునే వారా?? అని ఇప్పుడు అడగాలనిపిస్తుంది. ఓ ఆరేళ్ళ తర్వాత ఆవిడ కూడా కాలం చేసారు. 

మన సంప్రదాయాలు కూడా నన్ను భలే ఆశ్చర్యపరుస్తాయి. వచ్చి పోయే వారితో.. వంటలతో.. పలకరింపులతో..బ్రాహ్మణుల హడావిడితో.. ఏర్పాటుల కోసం అటూ ఇటూ పరుగులు.. పిల్లల ఆటలు.. సినిమా పాటలు కాక భగద్గీత.. ఆ ఇల్లు నాకు పెళ్ళి ఇల్లులానే కనిపించేది. అప్పుడప్పుడు ఉన్నట్టుండి ఏడవటం ఒక్కటే నచ్చలేదు. చావుని కూడా పెళ్ళిలా చేసారనిపించింది. అంతా కానిచ్చుకుని.. మేము తిరుగు ప్రయాణం కట్టేసరికి.. ఇరవై రోజులు పట్టింది. అప్పటికి హైద్ ప్రశాంతత సంతరించుకుంది, ఇక ఏమీ భయం లేదు అని తెలిసింది. అసలు ఏ పరిస్థితుల్లో వచ్చేమో.. మర్చిపోయేంత అనుభవాలు ఎదురయ్యాయి. ఇంటికి తిరిగి వచ్చేసరికి.. అవ్వ వాళ్ళూ అంతా వచ్చి మా బాధని మళ్ళీ మళ్ళీ పంచుకున్నారు. ఇల్లు పూర్తిగా దుమ్ము పట్టేసుంది. నా ఇంటికి కూడా బోలెడు దుమ్ము!! స్కూల్ కి వెళ్ళితే.. అప్పటికే నేను ఎదురుచూసిన పండగ అయ్యిపోయిందని చెప్పారు. నాకేడుపాగలేదు.. ఆ ఇల్లు నా దగ్గరే ఉండిపోయింది.. నేను పోగట్టుకున్న దానికి జ్ఞాపకంలా. చాలా ఏళ్ళు పదిలంగా చూసుకున్నాను.. ఇక నా వళ్ళ కాదంటూ మొండికేసింది. నేనూ పెద్దదాని అయ్యా కదా.. పోతే పో!! అన్నాను.

ఇవి తలచుకున్నప్పుడల్లా.. ఎంత మందిలో ఉన్నా.. ఈ జ్ఞాపకాలు జైలులో ఖైదు అయ్యిపోతా!! “మనకు జరిగే ప్రతీ దాని వెనుకా ఏదో బలమైన కారణం ఉంటుందేమో” అని ఆలోచనలో పడేస్తుంది. మా తాతగారి మరణ వార్త విని ఎందరో ఎక్కెడెక్కడి ఊరునించో వచ్చారు… మనం ఎంత మంచో మనం పోయాకే తెలుస్తుందా అన్న ప్రశ్న మదిలో మెదలుతుంది. పెళ్ళి చూసుకోబోయే ప్రతీ అబ్బాయిని.. “ఇక నీ పని అయ్యిపోయిందం”టూ స్నేహితులు ఏడిపిస్తారు.. కానీ నాకిప్పటికీ చావును అంతే ఘనంగా ఎందుకు జరుపుకుంటామో అన్న ప్రశ్న తొలిచేస్తుంది. ఇవ్వన్నీ నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు జరిగాయి.. అయినా నిన్నే జరిగినంతగా నాకు ఎలా గుర్తుండిపోయాయి?? పసి హృదయాల మీద అనుభవాలు ఎంత త్వరగా చెరిగిపోవు ఏమో?? మరలా అయితే.. యుద్ధం జరిగే దేశంలో పిల్లల పరిస్థితి ఏమిటి?? అయిన వాళ్ళు పోయి.. ఉన్న దేశంలో ఉండలేక.. బతుకంటే ఏమిటో తెలియక ముందే.. భయం చంపేస్తుంటే… “అసులీ యుద్ధం ఏ అవసరానికంటే” అంటూ మెదడు ఎలా పనిచేస్తుంది? ఆ తర్వాత అలాంటి పిల్లలు జీవితాంతం ఇలాంటి జ్ఞాపకాలే వెన్నాడుతుంటే.. వాటి బరువు ఎలా మోస్తారు? ఎందాకా.. ఇలాంటి దుస్సంఘటనలు.. మానవ చరిత్రను వెన్నాడుతాయి. వేటికీ నా దగ్గర సమాధానం లేదు.. కానీ నేనూ మనిషినే.. తోడుగా నిలవలేకపోయినా.. “నీ బాధ నా బాధే” అని నాకీ జ్ఞాపకాలు గుర్తు చేస్తూనే ఉంటాయి.

(సమాప్తం)

Advertisements

31 comments on “శిలాక్షరాలైన క్షణాలు- 2

 1. నిజమే కదా! చిన్నప్పటి విషయాలు ఆయిల్ పెయింట్ లా మహిష్కంలో అలా అతుక్కుపోతాయి.. నాకైతే స్కూల్ విషయాలన్నీ గుర్తున్నాయి కానీ ఒక ఐదు సంవత్సరాల క్రితం జరిగినవి గుర్తులేవు!

  మీ తాతయ్య గారు, నానమ్మ గారు గురించి చదువుతుంటే అభిరుచులలో అన్ని విబేధాలున్నా కలిసి అన్ని సంవత్సరాలు సహజీవనం చేయడం మన వివాహ వ్యవస్థలోని గొప్పతనాన్ని చూపిస్తుంది!

  ఇక యుద్ధం జరిగే ప్రదేశాల్లోని పిల్లల మానసిక పరిస్థితి గురించి ఆలోచిస్తేనే మనసు స్థబ్దమైపోతుంది.. యుద్ధం నించి, ప్రకృతి వైపరీత్యాల నించీ బయటపడిన పిల్లలి అదృష్టవంతులనుకోలేము.. చూసిన భయానక దృశ్యాల తాలూకు trauma నించి జీవితాంతం బయటపడని వాళ్ళుంటారు!

 2. నాకు ఎలా స్పందించాలో తెలీడం లేదు పూర్ణిమా… “మనసుని ఎవరో మెలి పెట్టినట్లు…” అని పుస్తకాల్లో వ్రాసే అనుభూతి ని ప్రత్యక్షం గా అనుభవించేలా చేసారు..!!

 3. హమ్మ్మ్… ఈ క్షణంలో ఏమి చెప్పాలో అర్ధం కావడం లేదు… చివరి దాకా చదివే వరకు ఊపిరి తీసుకోలెనట్టు ఉంది…

  మండువా లోగిలి అంటే మా ఇల్లు గుర్తొచ్చింది… 125 ఏళ్ళు దానికి… మా తాత గారి నాన్న గారి తమ్ముడి మనవడకి కూడా వాటా ఉంది దానిలో… వాళ్ళ వాటా వరకు ఇంటిని కోసేసి డాబా కట్టుకుంటారంట… మాకైతే ఏదోలా ఉంది… నేను ఆ ఇంటిని చక్కగా మాడలింగ్ చేయించుకుందామనుకున్నాను… ఈ ఆగస్ట్లో ఇంటికెళ్ళినప్పుడు ఆ గొడవ తేల్చుకోవాలి…

 4. చదివి మౌనంగా నిష్క్రమించలేక ఈ వ్యాఖ్య తప్ప నా వద్ద మాటలు లేవు.

 5. “ఏడవని వారికి బాధలేనట్టు కాదు.. ఆ బాధ బయటకు వచ్చే మార్గం లేదంతే!!”
  “ఉత్తర-దక్షిణ ధృవాలను కలపగలిగే ఏకైక మార్గం.. వివాహం”

  ఇలా నువ్వు అక్షరసత్యాల్ని చెప్పేస్తూఉంటే ఎలా? చాలా బాగుంది.

 6. పూర్ణిమా, (గారు అనాలని అస్సలు అనిపించడం లేదు!) అంత చిన్నప్పటి జ్ఞాపకాలని ఇప్పటికీ కళ్ళకి కట్టినట్లు చూపిస్తున్నారు… అసలు ఇలాంటి గొడవలు జరిగాయని ఇప్పటివరకూ తెలియదు నాకు…
  రోజుకో జీవిత సత్యం చెబుతున్నారు… త్వరలో ఒక పెద్ద డేటాబేస్ అవుతుందేమే…!

 7. సునాయాసంగా, అతి సహజంగా జీవితసత్యాలను అక్షరీకరించిన మీ శైలి, అందులో ఆవిష్కరించబడిన విషయం…. బరువెక్కిన గుండెతో అభినందించడానికి కూడా పదాలను వెతుక్కోవలసి వస్తోంది. అద్భుతం!

 8. పూర్ణిమా,
  మరపు రాని బాధకంటే మధురమే లేదోయ్, అని కవి గారన్నా, అది అన్నింటికీ వర్తించదేమో! పసితనంలో ఎదురైన ఇలాంటి అనుభవాలు చిత్రంగా జీవితాంతం గుర్తుండిపోతాయి. అదీ మంచిదే, మన పిల్లల కి ఏది ముఖ్యమో(మతమా..మానవత్వమా లాంటివి) చెప్పగలిగే పరిణితి మనలో వస్తుంది!

  నీ బాధ నీ బాధ మాత్రమే కాదు, మా బాధ కూడా!

 9. పూర్ణిమ,
  మీరు రాసిన బ్లోగ్ చదువుతుంటే నా చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి, మా తాతగారు చనిపోనా రోజులూ గుర్తుకు వచాయి. అప్పుడు నేను స్కూల్ లో ఉండగా , మా పిన్ని గారు వచ్చి ఈ దుర్వార్త చెప్పారు. ఇప్పటికీ ఆ రోజులు తలుచుకుంటే బాధగా ఉంటుంది. మా అమ్ముమ్మ దగ్గరికి వెళ్ళినప్పడుల్లా గుర్తు చేస్తుంది.

 10. సాంప్రదాయాలు x
  = సంప్రదాయాలు

 11. ఏమి వ్రాయాలి?
  ఎలా వ్రాయాలి?
  ఒక ఝుంఝుం మారుతం తాకిందని వ్రాయాలా
  ఒక కడలి అల విసిరిందని వ్రాయాలా
  ఒక వెన్నెల రాత్రి గుచ్చుకొందని వ్రాయాలా
  ఒక చండ్ర గాడ్పు స్పర్సించందని వ్రాయాలా
  ఒక దవన సువాసన గుప్పుమందని వ్రాయాలా
  ఒక మంచు తెర కళ్ల కడ్డంపడిందని వ్రాయాలా
  జ్ఞాపకాల బాణాలు హృదయపు బుల్స్ ఐ ని తాకాయని వ్రాయాలా

  ఏమి వ్రాయాలి?
  ఎలా వ్రాయాలి?

  బొల్లోజు బాబా

 12. First of all, Let me admit that I might deviate from the post though I try to relate both as much as possible, and though I want to keep it short, I am afraid I may not.

  Gaali kante veegamainindi Manasu annaru evaro peddalu… Nijame… gatam ane mallelanu(konni vaadipoyina mallelu kooda vundavachu sumaa!), bavishyathu ane baangaaru paarijaathamulatho(vaati gurunchi vinadam, oohinchukovadam tappa nenu vaatini choosi eruganu) kaalam ane daaramtho vardhamanam ane Gulabilatho (appudapudu mullu gruchukuntuntaayi) ituvanti moodu vibhinnamaina kaalaalanu (puvvulu kooda) kalapagaladi bahusaa edaina vundi ante adi naaku telisi manasu okkate… (manasu paina nammakam leni vaaru alochanalu,medadu ane words use chesukovachu…) Kaani ikkada okkate chikku… Gatam lenidi Vardamanm ledu.. Vardamanam lenide Bavishyathu ledu…Edi leka poyina jeevitham ane poola danda ledu.. Ii jeevitham ane maalalo gatam neti jeevitaniki punaadi. Ii gataniki nidarsaname Gnapakaalu…

  mee manasunu chaka chakaa parigethisthoo Mee Ganapakaalanu teluputhoo chala prasnale repaaru… Okkoka daaniki gantalu tharabadi kustee pattina samadhanam dorukunthandani aasa ledu…samadhanam kaavalane korika ledu… Kaani enduko “‘asali yuddham ae avasaraani kante’ ae medadu alochincha galadu” ane opinion ii comment raasela chesthunnadi…

  Nenu intha varakoo naa lifelo yudda baadhithudini kaadu (Naaloni Argumentative Indian:p, jeevithamantene yuddam ani kooda vaadinche raakame..but it takes away the whole discussion into another domain. so lets not get there:D)… So Idi naa opinion matraame. experience kaadu.

  Naaku telisinantha varaku, bhayam manishini alochanarahithudini chesthundi ani anukonu… may be bhayam manishi alochanalani biased chesthundi tappa alochana rahitudini chesthundi anukonu….Yuddhaaniki sava laksha reasons vundavachu… Oka manishi Vaatitho ekebhavinchavachu leka ekibhavinchaka povachu…depends on his situation.. kastha thelivaina vaadiathe kastha dilemmaki guri kavachu anthey… kaani asalu alochincha leni parsthithiki guri avuthaadu ante emo naa oohalaki andatam ledu..

  may be meeru chinna pillaliki asalu antha alochana shakthi(Idi chala goppadi ani naa abhipraayam) vundademo ani anavachu. Kaani Deeniki againstga kontha varaku examplega ‘The Diary of a Young Girl’ by Anne frank cheppavachu.. Kaani yuddam anedi okati vundi ani thelesthene, daaniki gala karaanaalanu vethukuthaam… Yuddam ani okati vundi ani theliyakapothe, may be appudu “asaliii yuddham ae avasaraani kanee” alochana raaka povachu….

  Kaani yes ii bhayam vaarini jeevithantham vennaduthoone vuntundi. Kaani marapu devudi ichina goppa varam annaaru evaro peddalu (trivikramudu anukuntaaa). oka vela maravaka poyinaa kaalam gnapakalaki, over the period of time kotha definitions isthoo velthuntaayi ani anukuntaaanu.

  yuddam(violance) gurunchi intha matladesamu kabatti mana sirivennalagaari rendu linestho end chesesthaa…

  yE charitra nErchukundi pacchani paaTham
  yE kshaNaana maarchukundi jittula maargam
  raamabaaNamaarpindaa raavaNa kaashTham
  kRishNa geeta aarpindaa nitya kurukshEtram

  Ika selavu…

  Hmm PoornimaGaaru,
  Chala peddadi ayipoyindi andi and also may be deviate kooda ayipoyaanu.. andaroo gnapakaalu gurunchi raasthunna edo Oopika leka padi vunna daanini ikkada padesaanu second paralo. Sambandham lekunda ila ikkada vesinanduku kshaminchandi.. Ekkada oka chota vesthe silakshaarlai kakapoyinaa, digital aksharalai ayinaa padi vuntaayani padavesaa ikkada.

 13. పూర్ణిమా గారు,
  నేను అ౦దరిలాగా చెప్పలేకపోయినా ఒక్క మాటలో చెప్తాను.
  రాసేవారికి గొప్ప’ధన౦’ తన భావాన్ని చదివిన మనసులో పలికి౦చడమే ఐతే.మీరు ఆ పనిని సమర్ధ౦గా చేసారు.
  Great one great feeling.

 14. వంశీ కృష్ణా

  ఇంతలేసి పెద్ద వ్యాఖ్యలు అంగ్రేజీ(తెంగ్రేజీ)లో వ్రాస్తే ఎలా? ఎప్పుడు చదవాలి మేము? అక్షరం అక్షరం కూడబలుక్కోని 😦

  తెలుగులో వ్రాయ విన్నపం…

 15. కిరణ్ గారు:

  వంశీ అడిగిన ప్రశ్న చిన్నగా చేసి నేనే రాస్తున్నాను.. మీ అభిప్రాయాన్ని తెలుపగలరు:

  “”అసులీ యుద్ధం ఏ అవసరానికంటే” అంటూ మెదడు ఎలా పనిచేస్తుంది? ” అని నేను రాసిన వాక్యానికి అభ్యంతరం తెలుపుతున్నారు. యుద్ధం వలన భయం వేయడం సహజమే కానీ, ఆలోచించే శక్తి నశించదు అని అభిప్రాయపడుతున్నారు. జ్ఞాపకాలు సదా వెన్నాడి వారి జీవితం దుర్భరం చేయవు.. మానవులకి మరుపు కూడా ఉంటుంది.

  వారు వీలు చూసుకుని, తెలుగులో వ్యాఖ్యాన్నించే లోపు.. మీరు మీ ఆలోచనలు తెలుపగలరు.

 16. పూర్ణిమా..

  నా అభిప్రాయం ఇక్కడ చదవగలరు.

  http://venugaanam.blogspot.com/2008/07/blog-post_18.html

  యుద్ధం వల్ల ఎదుర్కున్న సంఘటనలు, దాని ప్రభావాలు అవి ఎదుర్కున్న వారే చప్పగలరని నా అభిప్రాయం.

 17. First of all, Let me admit that I might deviate from the post though I try to relate both as much as possible, and though I want to keep it short, I am afraid I may not.

  గాలి కంటే వేగమైనది మనసు అన్నారు ఎవరో పెద్దలు… నిజమే… గతం అనే మల్లెలను(కొన్ని వాడిపోయిన మల్లెలు కూడ వుండవచ్చు సుమా!), భవిష్యత్తు అనే బంగారు పారిజాతములతో(వాటి గురుంచి వినడం, ఊహించుకోవడం తప్ప నేను వాటిని చూసి ఎరుగను) కాలం అనే దారంతో వర్ధమానం అనే గులాబిలతో (అప్పుడపుడు ముల్లు గ్రుచ్చుకుంటుంటాయి) ఇటువంటి మూడు విభిన్నమైన కాలాలను (పువ్వులు కూడ) కలపగలది బహుసా ఎదైనా వుంది అంటే అది నాకు తెలిసి మనసు ఒక్కటే… (మనసు పైన నమ్మకం లేని వారు ఆలోచనలు,మెదడు అని అన్వయించుకోవచ్చు…) కాని ఇక్కడ ఒక్కటె చిక్కు… గతం లేనిదే వర్దమానం లేదు.. వర్దమానం లేనిదే భవిష్యత్తు లేదు…ఏ ఒక్కటి లేకపోయిన జీవితం అనే పూల దంద లేదు.. ఈ జీవితం అనే మాలలో గతం నెటి జీవితనికి పునాది. ఈ గతానికి నిదర్శనమే ఙ్నాపకాలు.

  మీ మనసును చక చకా పరిగెతిస్తూ మీ ఙ్నాపకాలకి కొత్త కొత్త అర్థాలను ఇస్తూ చాల ప్రశ్నలే రేపారు… ఒక్కొక దానికి గంటలు తరబడి ఖుస్తీ పట్టినా సమాధానం దొరుకుంతుందని ఆశ లేదు… సమాధానం కావలనే కోరికా లేదు… కాని ఎందుకో “‘అసలీ యుద్ధం ఏ అవసరాని కంటే’ ఏ మెదడు అలోచించ గలదు” అనే opinion ఈ comment రాసేల చేస్తున్నది…

  నేను ఇంత వరకూ నా జీవితంలో యుద్ధ బాదితుదిని కాదు (నాలోని argumentative indian:p, జీవితమంటెనే యుద్దం అని కూడ వాదించే రకమే..but it takes away the whole discussion into another domain. so lets not get there:D:D)…so ఇది నా opinion మాత్రమే. అనుభవం కాదు.
  నాకు తెలిసినంత వరకు, భయం మనిషిని ఆలోచనారహితుడిని చెస్థుంది అని అనుకోను… బహుసా భయం మనిషి ఆలోచనలని biased చేస్తుంది తప్ప ఆలోచనారహితుడిని చేస్తుంది అనుకోను… యుద్ధానికి సవాలక్ష కారణాలు వుండవచ్చు… ఒక మనిషి వాటితో ఏకీభవించవచ్చు లేకపొతే ఏకీభవించక పోవచ్చు…depends on his situation.. కాస్త తెలివైన వాడైతే కాస్త dilemmaకి గురి కావచ్చు అంతే… కాని అసలు ఆలోచించ లేని పరిస్తితికి గురి అవుతాడు అంటే ఏమో నా ఊహలకి అందటం లేదు..
  may be మీరు చిన్న పిల్లలికి అసలు అంత ఆలోచనా శక్తి (ఇది చాల గొప్పది అని నా అభిప్రాయం) వుండదేమో అని అనవచ్చు. కాని దీనికి againstగా కొంత వరకు exampleగా ‘The Diary of a Young Girl by Anne frank’ చెప్పవచ్చు.. కాని యుద్దం అనేది ఒకటి వుంది అని తెలిస్తేనే, దానికి గల కారనాలను వెతుకుతాం… యుద్దం అని ఒకటి వుంది అని తెలియకపొతె, may be అప్పుడు “అసలీ యుద్ధం ఏ అవసరాని కనే” ఆలోచన రాక పోవచ్చు….

  కాని yes ఈ భయం వారిని జీవితాంతం వెన్నడుతూనె వుంటుంది. కాని మరపు దెవుడిచ్చిన గొప్ప వరం అన్నారు ఎవరో పెద్దలు (త్రివిక్రముడు అనుకుంటా). ఒక వేల మరవక పోయినా కాలం ఙ్నాపకాలకి, over the period of time కొత్త కొత్త definitions ఇస్తూ వెల్తుంటాయి అని నా అభిప్రాయం.
  యుద్దం (violence) గురుంచి ఇంత మాత్లాదేసాణు కాబట్టి మన సిరివెన్నలగారి రెండు linesతో end చెసెస్తా…

  యే చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
  యే క్షణాన మార్చుకుంది జిత్తుల మార్గం
  రామబాణమార్పిందా రావణ కాష్ఠం
  కృష్ణ గీత ఆర్పిందా నిత్య కురుక్షేత్రం

  ఇక సెలవు…
  hmm పూర్నిమగారు,
  చాల పెద్దది అయిపోయింది అండి and also may be deviate కూద అయిపోయాను.. అందరూ ఙ్నాపకాలు గురుంచి రాస్తున్నా ఎదో ఓపిక లేక రాయక పడి వున్న ఆలోచనలని ఇక్కడ పడెసాను second paraలొ. సంబంధం లేకుందా ఇలా ఇక్కడ వేసినందుకు క్షమించండి.. ఏక్కడో ఒక చోట వెస్తే శిలాక్షారలై కాకపోయినా, digital అక్షరాలై అయినా పడి వుంటాయని పడవెసాను ఇక్కడ.

  –Vamsi

 18. Since my earlier comment was in tengreazz, I was asked to post it in telugu lipi. So I posted it again now in Telugu.. Sorry readers for posting it multiple times…

  –Vamsi..

 19. మొదటిది – ఈ రెండు భాగాల కథనం ఎత్తుగడలోనూ, చెప్పడంలోని ఒక అమాయకత్వంతోనూ, చివరిగా వ్యాఖ్యానించే ఒక ఆర్ద్రమైన వేదాంత ధోరణితోనూ మొత్తానికి ఒక సంక్లిష్టమైన అనుభూతి కలిగించింది నాలో. ఒక్కటె చెప్పగలను. ఇలాంటిది నేనెప్పుడూ ఎక్కడా చదవలేదు. బహుశా ఈ శైలికూడా అలా సహజంగా రావాలి తప్ప, పని గట్టుకుని రాస్తే రాదేమో. ఒక్క సలహా .. ఇటువంటి విలువైన టపాలు రాసేటప్పుడు ఒకటికి రెండు సార్లు అచ్చు తప్పులు వెదికి సరి చేయండి. భావం మీద దృష్టిపెట్టాల్సిన సమయంలో ఇవి చాటు దెబ్బ తీస్తాయి. తెలుగు వాడుకలని తెలిసి వాడండి. పలు రకాల ఇళ్ళని ఇళ్ళు అనే అంటాము, ఇళ్ళులు అనము.

  వంశీ కృష్ణ .. మీకు ఇంతింతలాంటి భావాలు పొంగి వస్తున్నాయి అంటే .. అందులో మీరు ఆర్గ్యుమెంటెటివ్ కూడా కాబట్టి, మీరు అర్జంటుగా బ్లాగు మొదలెట్టేయ్యాలి 🙂 భయం ముందుగా ఏ మనిషిలోనైనా కలిగించే ప్రతీకారము శరీరంలో ఎడ్రెనలిన్ ప్రవహించి, పెద్ద కండరాలు ఉప్పొంగి, అకక్డినించి వేగంగా పారిపోవడానికి శరీరాన్ని తయారు చెయ్యడం. విపరీతమైన సాధనతో శరీరమ్మీద పట్టు సాధించిన వారు ఈ ప్రతీకారాలను కూడా నియంత్రించ గలరు. ఇది మనకి ప్రకృతి కలిగించిన ధర్మం. దీన్ని మించిన ఇతర ప్రతీకారాలు, మనుషులు ఎంతమంది ఉన్నారో అన్ని రకాలుగా ఉండొచ్చు. కొందరిలో సహజమైన నాయకత్వం బయటికి వస్తుంది. కొందరిలో తన సొంత తల దాచుకునే ఆలోచన కనిపిస్తుంది. కొందరు అయోమయం పాలవుతే కొందరు అచేతను లవుతారు.
  అంచేత మొదటి అసంకల్పిత ప్రతీకారం తప్ప తరవాత మనుషుల ప్రవర్తన ఎలావుంటుందని జెనరలైజ్ చేసి చెప్పలేమని నేననుకుంటున్నా.

 20. ఎలా చెపాలి..? ఏమి చెప్పాలి..? మనసు మూగబోయింది. ఒక్క క్షణం నా మనసుని ఆపేసావనుకో..నిజంగా నీ కళ్ళతో చూపించి మనసుని మెలితిప్పావు. నేను పల్లెటూరులోనే పెరిగాను. అవన్నీ గుర్తు చేసావు.

 21. సమయాభావం వల్ల ఈ టపాకి వచ్చిన స్పందనలకి చాలా ఆలస్యంగా జవాబు ఇస్తున్నాను. మన్నించగలరు.

  నిషీ: నెనర్లు. మీ నుండి వ్యాఖ్య చదివి చాలా రోజులయ్యింది. మనసును పంచుకునే వేళకు పంక్చువల్ గా వచ్చేసినందుకు చాలా చాలా థాంక్స్!!

  వేణూ గారు: “మనసుని ఎవరో మెలి పెట్టినట్లు…” నిజమే!!

  దిలీప్ గారు: నెనర్లు!!

  మురళీ గారు: చదివి మౌనంగా నిష్క్రమించలేక.. మీ స్పందనని నాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు!!

  మహేశ్ గారు: నేను నేర్చుకున్నది చెప్పాను.. అంతే!!

  మేధ: గారు, మీరు.. ఇవ్వన్నీ మనుషులను దగ్గర చేయడానికి. మీకిబ్బందనిపిస్తే తీసేయ్యండి. “నువ్వు”లో కూడా బోలెడు మర్యాద చూడగలను నేను. డేటాబేస్ అయ్యే అవకాశం లేదులేండి. ఇక పై మరలా నా ఊహలే ఊసులుగా చేప్తాను. అందుకే ఈ బ్లాగు.

  గిరీష్ gaaru: ఇబ్బంది పెట్టానని తెలిసినా ఆనందపడేలా వ్యాఖ్యాన్నించినందుకు నెనర్లు!!

 22. “ఏడవని వారికి బాధలేనట్టు కాదు.. ఆ బాధ బయటకు వచ్చే మార్గం లేదంతే!!”…..naakuu edurayindi ii anubhavam.cinna vaaTiki kuudaa boTa boTaa vachchea kanniiru aa kshaNam loa raaleadu.
  ii post cadivi bhaaramayina gumDe tho tirigi velutunnaanu.

 23. కొత్త పాలిగారు,
  మీరు అన్నది నిజమే. మనుషుల ప్రవర్తనని జెనరలైజ్ చెయ్యడం దుస్సాహసమే అవుతుంది ఏమో.
  కాని, ఒక చర్యకి, ప్రతిచర్య అసంకల్పిత ప్రతీకార చర్య కావచ్చు లేక సంకల్పిత ప్రతీకార చర్య కావచ్చు. ప్రతిచర్య అసంకల్పితమో సంకల్పితమో అన్న సంబంధం లేకుండా, చర్య మరియు ప్రతిచర్య ఎదో ఒక కారణంచేత కలపబడి వుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఆ కారణం మనం consciousga ఆలోచించ కుండానే (నిప్పుని తాకితే చెయ్యి కాలుతుంది) ప్రతీకార చర్య చేయవచ్చు. consciousga ఆలోచించి చేయవచ్చు. But in any case, చర్యకి ప్రతిచర్యకి మద్య ఆలోచన వుంది అనుకుంటా. sometimes we realize its existence, sometimes we don’t, though it exists in both the cases.

  Btw, I do blog. Catch me at http://athmakatha.wordpress.com/

  — వంశీ

 24. సుజాత గారు: ఎవరి బాధ వారిదే.. ఎంత ఆర్చినా.. తీర్చినా!! కాదంటారా?? 😉

  జయా: చాన్నాళ్ళకి నా బ్లాగులో మళ్ళా కమ్మెంటినందుకు నెనెర్లు!!

  బాబా గారు: మీ స్పందన చదివాకా.. నాకేమీ రాయ బుద్ధి కావటం లేదసలు.

  క్రాంతి గారు: నిజమే.. ఇంతిలా స్పందిస్తారని నేనూహించలేదు.

  మోహన: మీ అభిప్రాయాన్ని చదివాను. నన్ను తట్టి మరీ మేల్కొపినందుకు మీకే నా ధన్యవాదాలు.

  శ్రీవిద్యా: మనసును ఆపేయడం.. ఆ మాటలనింకా అనుభవిస్తున్నాను

  రాధిక గారు: నిజమే… ఉత్త పుణ్యానికి ఏడవటం.. అలవాటు నాక్కూడ!! కష్టం కలిగించానే అని మీ అందరి వ్యాఖ్యలు చదువుతుంటే నాకూ అదోలా ఉంది. 😦

 25. కొత్తపాళీ గారు:
  ఏమని బదులివ్వను మీ వ్యాఖ్యకి? “అమాయకత్వం”.. ఆ మాట నన్ను ఎలా తడుముతుందో ఎలా చెప్పను?? I’ve not killed the little lassy in me, with age అని ఇప్పుడే తెలిసినట్టుంది. నా రాతలకి మొట్టమొదటి సారిగా ఆ పదం వాడారు.. ఎవరైనా. ఇది నేను రాసింది కాదు.. చెప్పింది. నేను ఇప్పటి ఎవరకూ ఈ జ్ఞాపకాలను చాలా సార్లు చెప్పేనే గాని.. ఎక్కడా రాయలేదు. రాయాల్సి వచ్చినప్పుడూ…. అలా మాట్లాడుతున్నట్టే రాసాను. “విలువైన టపాలు” .. ఏమనాలో తెలియటం లేదు. 🙂 మీరన్నట్టు ఒకటి రెండు సార్లు సరిచూసుకోవాలి .. ఏం రాసినా.. బద్ధకాన్నికి బిజీ ముసుగేసే ప్రయత్నం చేస్తున్నాను అని తెలిసింది. ఇక పై జాగ్రత్త వహిస్తాను.

  కొత్తపాళీ గారు, తాడేపల్లి గారు:
  నా తెలుగు అంతంత మాత్రం అని ఒప్పుకోవటం ఎలాంటి సంశయమూ లేదు. నేను రాసేవాటిలో అచ్చుతప్పులే కాక.. నిజంగా నాకు పూర్తి అవగాహన లేక కూడా అయ్యుండచ్చు!! ఈ మాత్రం తెలుగు.. స్కూల్లో “తెలుగు టీచర్” గారి పుణ్యం. మీరిలానే నా తప్పులు చెప్తే.. నాతో పాటు ఇంకొందరు నేర్చుకుంటారని ఆశ. మీ వ్యాఖ్యలకై వేచి చూస్తాను.

 26. భయంతో ఒకచోటి నుంచి ఇంకో చోటికి పరిగెడితే అక్కడ మనకోసం ఇంకో దుర్వార్త వేచివుండటం నిజంగా దురదృష్టం. నిర్వేదం, నిర్లిప్తత మనస్సుని ఎంతగా బాధిస్తాయో వాటిని మోసేవారికి తప్ప చూసే వారికి తెలియదు. కన్నీరు రావడం లేదంటే కన్నీరు ఇంకిబోవడమే అని ఈ మనుష్యులకి ఎప్పుడు తెలుస్తుందో కదా? కన్నీరుని దాచి కర్తవ్యం కోసం అడుగులిడగాలంటే ఎంత స్థైర్యం కావాలి? ఆ స్థైర్యాన్ని గుర్తించలేని ప్రపంచం నాకొద్దనే వొద్దు అంటూ మనం ముందుకు సాగిపోవాలి.

  సమయాభావం వల్ల ముందుగా రాయలేక పోయాను.

 27. పూర్ణిమా,
  ఏం రాయాలో అర్ధం కావడం లేదు. జీవితసత్యాలన్నీ మీరిలా ఊసుల్లో చెబుతుంటే ఏం చెప్పగలను?

 28. వంశీ.. మీ కామెంట్ గురించి చాలా ఆలోచించా.. ఎంత భయమైనా మనిషిని ఆలోచనారహితుడిగా చేస్తుందా.. చేయవచ్చనే నా అభిప్రాయం. ఇప్పటికిప్పుడు మీకు విశీదీకరించే అంత పరిజ్ఞానం నాకు లేదు. నేనూ ఈ విషయమై చదువుతున్నాను.. చూద్దాం.. ఆ అభిప్రాయం ఎలా మారుతుందో.

  ఓపిగ్గా కమ్మెంటినందుకు నెనర్లు!! మీ డిజిటల్ అక్షరాలను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది!! 🙂

  ప్రతాప్ గారు, కల గారు: నెనర్లు!! ఓపిక చేసుకుని అంత పెద్ద టపా చదివినందుకు మరోమారు ధన్యవాదాలు.

 29. మనసును కదిలించే ఇటువంటి కథలు ఒక్కోసారి మనిషిని స్థంబింప చేస్తాయి. అద్బుతమైన వర్ణన..శిలాక్షరాలు కావివి, శిలలను సైతం కరిగించే మనసాక్షరాలు.

 30. నాకైతే మీ టపాలన్నీ ప్రింటు చేసి బుక్కులా దాచుకోవాలని ఉందండి.

  నేను హిస్టరీ లో కొద్దిగా వీకు. మీరు టపాలో ప్రస్తావించింది ఏ సంఘటన??

 31. గుండెల్ని హత్తుకునేలా రాశావు. కొన్ని సంఘటనలు మనసుని మెలి పెట్టి, ఆలొచనలను స్పురింపచెస్తాయి. అలాంటి ఈ టపా కి, నా దెగ్గర మాటలు లేవు.

  Together we can fight a calmity and alone we can just make a knot.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s