అమ్మా! బొమ్మ కొనిస్తా, నాతో ఉంటావా?


మృదుల సోఫాలో రెండు కాళ్ళు పైకి పెట్టి కూర్చుని, రెండు చేతులతో మోకాళ్ళని చుట్టి, తలను దాచేసుకుని ఏడుస్తోంది. శరత్ రెండడుగుల దూరంలో అసహనంగా, ఆయాసంగా కదులుతున్నాడు. ఆమె కన్నీరాగడం లేదు, అతని కాళ్ళాడడం లేదు. ఓ రెండు మూడు నిముషాలు అలాగే తిరిగాక, ఇక లాభం లేదనకుని, ఆమె ఎదురుగా నేల మీద కూర్చున్నాడు ఆమె తలను నిమురుతూ. తన బాధ అతడిని నిలువనివ్వటం లేదని గుర్తించి, పొంగి వస్తున్న దుఃఖానికి ఎలాగోలా ఆనకట్ట వేయాలని కన్నీటిని తుడుచుకుంటూ అతణ్ణి చూడ్డానికి ప్రయత్నించింది మృదుల.

“మృదూ, ప్లీజ్! ఏడ్వకూ” అన్నాడు అనునయంగా, కలిసిన చూపులు విడిపోయే లోపు. వద్దనే కొద్దీ కట్టలు తెంచుకుని మరీ ప్రహవించే గంగమ్మను ఆపలేక, కంటిలోని నీటి పొరను బిందువులుగా చెక్కిలిపై నెట్టడానికి రెప్పలు వాల్చింది.

“నేను వాడితో మాట్లాడుతాను కదా? ఊరుకో..” అన్నాడు ఆమె చెక్కిలిపై కన్నీటిని తానే తుడుస్తూ. “వద్దు.. మాట్లాడేందుకు ఏమీ లేదు” అని ఆమె అనలేదు కానీ అతడి చేతిని మాత్రం బలంగా పక్కకు నెట్టేసి, రెండు కాళ్ళు నేల మీద పెట్టి,  పక్కన పడున్న దిళ్ళని గట్టిగా పట్టుకుని, తనలోని వత్తిడినంతా వాటికి సరఫరా చేసింది.

“చిన్నపిల్లాడు, వాడి మాటల్ని నువ్వింతిలా పట్టించుకుంటే ఎలా?” ఆమె పడుతున్న వేదనకి కారణమైన విషయమేమంత పెద్దది కాదు అన్న భావన కలిగించడానికి, అంతకన్నా ఏమనాలో తెలియక అనేశాడు.

“వాడు అన్నాడని కాదు, శరత్” బాధలో మాటలూ కొట్టుకు పోతున్నాయి. ఒక్కొక్కటే ఏరుకోవాల్సి వస్తుంది.

“వాడు అన్నాడని కాదు నా బాధ, వాడు అన్నది గుర్తు వస్తుంటే నాకు మతి పోతోంది.” అంటున్న మాటల్లో స్పష్టత కూడా లోపించింది. అడ్డుకట్ట వేయలేక మాటలని తనలోనే ఉంచుకుని, మరింత బాధను బయటకు పంపించింది. కాసేపటికి తేరుకుని, ఇక ఏడవటానికి నీళ్ళు కూడా లేవని నిర్ణయించేసుకున్నట్టు, అరచేతితో కళ్ళని, చెక్కిళ్ళని గట్టిగా తుడుచుకుని, దిళ్ళని వదిలేసి, అతని చేతుల్ని వణుకుతున్న వేళ్ళతో చుట్టి, ఒక్కో మాట, ఒక్కో మాట ఇలా అంది.

“బాబు అన్నాడనే నా బాధ. వాడు అలా అనకూడదని కాదు. అయినా వాడితోనే అనిపించుకునేంత వరకూ వచ్చానంటే, తల్లిగా నా పాత్ర ఏ మాత్రం నిర్వర్తిస్తున్నానో నువ్వే చెప్పు” నిలదీసిందో, బతిమాలిందో తెలీకుండా అనేసింది.

“నువ్వు కాస్త ఎక్కువ ఆలోచిస్తున్నావేమో ఈ విషయమై?!” విషయం నుండి ఆమె దృష్టి మరల్చడమే ధ్యేయంగా అన్నాడతను.

“నీకు వాడన్న దాంట్లో ఏం అనిపించటం లేదా? మొన్న వాడు స్కూల్లో ఒక అబ్బాయితో గొడవ పడితే, నువ్వెళ్ళి ఆ తగాదా తీర్చావా? పోయిన నెల ఆ పిల్లాడిది పుట్టిన రోజున నువ్వే ఒక గిప్ట్ కొని ఇచ్చి, వాళ్ళింట్లో పార్టీకి పంపవా?”

తప్పు చేసిందని టీచరు తిట్టాక బాధతో ఏడుస్తూ, పాఠం మళ్ళీ అప్పచెప్పడానికి ప్రయత్నించే చిన్నారిలా ఉంది ఆమె ఇప్పుడు. ఒక్కొక్కటే గుర్తు చేసుకుంటూ చెప్తుంటే అవునన్నట్టు ఊ కొడుతున్నాడు శరత్. “అప్పటినుండీ వాళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారంట” ఇక పూడుకుపోతున్న గొంతును సవరిస్తూనే కొనసాగించింది. “ఇప్పుడు నీకూ అలా ఒక బొమ్మ కొనిస్తానమ్మా, నాతో ఉంటావా? నాతో ఆడుకుంటావా? నీకు కావాల్సొస్తే ఇంకా పెద్ద బొమ్మ కొనిస్తా. కానీ నాతో ఉండమ్మా.. ప్లీజ్! ఎందుకు నువ్వెప్పుడూ నాతో ఉండవని వాడు నన్ను నిలదీస్తుంటే, ఏమని చెప్పను? అసలు వాడిముందు నిలబడలేకపోతున్నాను తెలుసా? ఏమీ లేదంటావేమిటి?” చెప్పాలనుకున్నది చెప్పేశాక, అప్పటిదాకా ఆగిపోయిందనుకున్న కన్నీరు ఇంతలోనే అంతగా ఎలా ఊరిందో తెలీదు గానీ, అతడిని గట్టిగా పట్టుకుని, తనివి తీరా ఏడుస్తోంది. 

శరత్ కి ఆ బాధ అర్థం అవుతోంది. ఇక చిన్నపిల్లల్ని బుజ్జగించేటప్పుడు అసలు బాధనుండి దృష్టిని మరల్చి, వేరే వాటిని ధ్యాస కుదురేలా చేయటం లాంటి ప్రయత్నాలు ఇప్పుడు ఆమెతో అసంభవం అని నిర్ణయించుకున్నాడు. ఆ బాధను కాస్త అనుభవిస్తేనే మంచిది అనుకుని, ఆమెతో పాటు సోఫాలో కూర్చుని ఆ ఆవేదనను తానూ అనుభవిస్తున్నాడు. ఆమె శిరస్సు అతడి భజం పై, అతడి చెంప ఆమె తల పై, వణుకున్న ఆమె చేతి వేళ్ళు అతడినెలా మెత్తగా తాకుతున్నాయో, వణుకుతున్న ఆమె స్వరం మాత్రం అతడి హృదయాన్ని అంత తీవ్రంగా తాకుతున్నాయి. ఉన్నట్టుండి తలపైకెత్తి, కాస్త వాడిగా , “ఇక నేనీ ఉద్యోగం మానేస్తాను, శరత్!” అని ఆమె అంది. అతడు ఏదైతే భయపడుతూ ఉన్నాడో అదే జరిగింది.

“ఇప్పుడేమీ ఆలోచించక, కాసేపలా పడుకో! రాత్రంతా ఫ్లైట్లో ఉన్నావ్ కదా, ఆ బడలిక తీరాకా మాట్లాడుకుందాం!”

“లేదు, నేను ఇక ఈ ఉద్యోగం చేయలేను. వారంలో నాలుగు రోజులు ప్రయాణానికే సరిపోయే ఈ ఉద్యోగం నాకొద్దు”

“ఈ ఉద్యోగం కోసం నువ్వెన్ని కలలు కన్నావో! ఎంత శ్రమించి ఈ స్థానానికి వచ్చావో! వాటన్నింటినీ ప్రయాణం వంకతో మానేస్తావా?”

“జాబ్ లో ఎంత వత్తిడైనా భరించగలను. కానీ బాబుకి దూరమయ్యిపోతున్నా అన్న నిజం నన్ను తినేస్తుంది శరత్. వాడికి నేనుండీ లేనట్టుగా అయ్యిపోతున్నా”

“నువ్వెక్కువ ఆలోచిస్తున్నావు. నా మాట విని పడుకో కాసేపు”

“ఊ..హూ! ఈ సమస్య తేలాల్సిందే. అయినా ఇదసలు సమస్యే కాదు. కాసిన్ని డబ్బులకోసం మనం సృష్టించుకుంటున్న కాంప్లికేషన్. వాడికి అమ్మని లేకుండా చేస్తున్నాం” అన్న ఆమెను అపక తప్పలేదతడికి.

“నువ్వు రెంటినీ కలిపి చూస్తున్నావు. నీ కెరీర్ ని వాడిని కలిపి చూడడం మానెయ్యి. డబ్బు మాటెత్తుకు ప్లీజ్! డబ్బులు కోసమే అయితే నేనూ నీలా ఊర్లు పట్టుకుని తిరిగే ఉద్యోగం చేస్తూ లక్షలు సంపాదిస్తూ, వీడిని ఏ బోర్డింగ్ స్కూల్లోనో పడేసే వాళ్ళం..” అతని మాటలు శ్రద్ధగా వింటోంది. అతడు కొనసాగించాడు, ” సో, డబ్బు మాట చెప్పి మనల్ని మనం కించపర్చుకోవద్దు. నీకీ జాబ్ ముఖ్యం, ఇన్నాళ్ళ నీ శ్రమకి ఫలితం ఇది. ఎందుకు చేజార్చుకోవడం? ఇంకొన్నాళ్ళు పోతే నీ మీద వొత్తిడి తగ్గుతుంది, అందాకా ఓపిక పట్టు”.

“కానీ, ఇంతలోపు బాబు నా మీద ద్వేషం పెంచుకుంటే? నాకు పూర్తిగా దూరమయ్యిపోతే? అమ్మని అయ్యుండి కూడా వాడికి నేనొక స్ట్రేంజర్ లా మిగిలిపోతే?” ఆ కంఠంలో బాధ స్థానాన్ని భయం పూర్తిగా ఆక్రమించింది.

“హమ్మ్.. దాని గురించి ఆలోచిద్దాం. ఏదో ఒకటి చేద్దాం. ఇంట్లో ఉన్నంత సేపూ నీతోనే ఉండేలా లేక, అంతగా పని వత్తిడి లేని ట్రిప్స్ కి మేమూ నీతో రావడమో, ఏదో ఒకటి చేద్దాం!” ఎంత సర్ది చెపుదామనుకున్నా, సమస్య తీవ్రత అతణ్ణి నిలనివ్వటం లేదు. “ఏమో.. నాకూ ఏమీ తోచడం లేదు. అమ్మకి కొన్నాళ్ళు దూరంగా ఉంటే పూర్తిగా దూరమైపోతామేమో అన్న బాధ నాకు తెలుసు. అమ్మని చూడాలనిపిస్తుంది” అంటూ ఆమె భుజంపై తల ఆన్చాడు, అప్పటి వరకూ కనిపించిన ధైర్యం ఇప్పుడు బెంగగా వాలిపోవడంతో ఏమీ చేయలేక మృదుల అలానే ఉండిపోయింది.

సెల్లో రిమైండైర్ టోను మోగేసరికి, ఇద్దరి మధ్య నిశ్శబ్ధం బద్దలయ్యింది. ఆన్-లైన్ మీటింగు ఉందంటూ శరత్ లాప్ టాప్ వైపుకి నడిచాడు. ఏడ్చి ఏడ్చున్న కళ్ళు నిలువలేమంటుంటే, వాటితో పాటు తనువునూ వాల్చడానికి మృదుల మంచం వైపుకి నడిచింది.

Advertisements

The Last Lecture నోట్స్ కావాలా? :-)


“వీకెండ్ ఏం చేశావు?” అని అడుగుతుంటే ఒక పుస్తకం చదివాను అని చెప్పాలి అసలైతే, కానీ “క్లాసు లో ఉన్నా ఇంత సేపూ” అని అనాలి అనిపించేంతగా ఉంది ఈ పుస్తకం. మరి క్లాసు అటెండ్ అయితే నోట్స్ ఉంటుంది కదా? అదే ఈ టపా! ఒక్కప్పుడైతే మన నోట్స్ కి తెగ ఫాన్ ఫాలోయింగ్ ఉండేది, అన్ని చోట్ల. ఇప్పుడు పూర్తిగా అలవాటు తప్పిపోయింది.

క్లాస్: The Last Lecture book
లెక్చరర్: Randy Pausch

* Somehow, with the passage of time, and the deadlines that life imposes, surrendering became the right thing to do – రాండీతో పరిచయం ఈ వాక్యంతోటే. చదవగానే “అబ్బా.. మరీ నిర్వేదం. ఎందుకు లొంగిపోవడం? ఎదురు తిరగాలి గాని? ఏం బాలేదు” అని అనుకుంటూనే అసలు అన్నవారి గురించి తెలుసుకుందామని గూగుల్లో వెతికితే, Randy Pausch ఒక అమెరికన్ కంప్యూటర్ ప్రొఫెసర్ అనీ, చిన్న వయస్సులోనే పాంక్రియాటిక్ కాన్సర్ బారిన పడి. జూలై 25, 2008 న మరణించారు అనీ. తాను మరణించబోతున్నారు అని తెలుసుకుని, కడసారిగా తన యూనివర్సిటీలో ఇప్పటిదాకా తన ప్రయాణాన్ని పునశ్చరణ చేసుకునేలా “Really Achieving Your Childhood Dreams” అన్న లెక్చర్ ని ఇచ్చారనీ, (వీడియో ఇక్కడ లభ్యం) అటు తర్వాత The Last Lecture అనే పుస్తకాన్ని రాశారనీ అని తెలిసింది.

* తరగతి గదిలో మహరాజులు/ మహరాణుల్లా కూర్చుని, మన ముందు నిలుచున్న వ్యక్తి వైపు తదేకంగా చూస్తూ పాఠాలు వింటున్నప్పుడు “క్లాసు రూం లో తపస్సు చేయిట వేస్టురా గురూ” అని అనిపిస్తుంది. బయటున్న ప్రపంచంలోకి వచ్చేసరికి మహారాజులం కాస్త సామాన్య ప్రజానీకం అయ్యిపోతాం. ఇప్పుడు మనల్ని ఆడించడం జీవితం వంతు. చాలానే నేర్పిస్తుంది జీవితం కూడా, కాకపోతే వీలైనన్ని తిప్పలు పెట్టి మరీ. అందుకే ఒక్కోసారి మళ్ళీ క్లాసుల్లోకి వెళ్ళిపోవాలనిపిస్తుంది నాకు. నాకు అర్ధమయ్యే స్థాయికి దిగి వచ్చి, నాకర్ధమయ్యే వరకూ ఓపిగ్గా చెప్పేవారుండడం కూడా అదృష్టం కదా?

* రాండీ అనగానే ఇక పై నాకు గుర్తు వచ్చేది కాన్సర్ కాదు. Imagineer (Imagination+Engineer) అన్న ఆంగ్ల పదం. రాండీకి చిన్నప్పటి నుండి వాల్ట్ డిస్నీలో పని చేయాలని కోరిక ఉండేది. అక్కడ పని చేసే వారిని ఇమాజనీర్స్ అని అంటారు. అబ్బుర పరిచింది ఆ పదం నన్ను. Engineering is not about perfect solutions; it’s about the best you can do with limited resources. ఉన్న పరిమితులని పడగొట్టటంలో ఊహలకున్నంత బలం అంతా ఇంతా కాదు. ఈ రెంటినీ సమపాళ్ళల్లో కలిపితే ఎన్ని అందాలను ఆవిష్కరించవచ్చు కదా! రాండీ ఎంచక్కా తనని తాను “ఇమాజనీర్” అనేసుకుంటారు, డిస్నీతో పని చేశారు కావున. నేను డిస్నీతో పని చేసే అవకాశం ఒక్కటే లేదు! ఉన్న ఇంజనీరింగ్ డిగ్రీ, నా ఊహలూ సరిపోతే బాగుణ్ణు ఆ పేరు పెట్టేసుకోవడానికి అని అనిపిస్తుంది. ప్చ్! 😦 (మరీ మనసును ఊరించేస్తుంది ఆ పేరు :-(( )

*ఇప్పుడో ఫుట్ బాల్ ఆటలో ఓ అబ్బి కాలి దగ్గర బాల్ ఉంటే, అతడు తల ఎటు వైపుకి తిరిగి ఉంటే అటే కొట్టేస్తాడేమో అని అనుకుంటాము కదా? కానీ అలా కాకుండా అతడి నడుము భాగాన్ని చూస్తే, ఖచ్చితంగా ఏ వైపుకి కొడతాడో చెప్పవచ్చునట. దీన్నే Head Fake అంటారు. ఈ పదాన్ని రాండీ “ఒకటి నేర్చుకుంటున్నాము అనుకుని దాన్ని అభ్యసిస్తున్నప్పుడు, మనం వేరేవి బాగా నేర్చుసుకుంటాము” అనే ప్రక్రియకి కూడా ఉపయోగిస్తారు. (indirect learning) మనం ఒక ఆట ఆడుతుంటే, మనం ఆ ఆటనే నేర్చుకుంటున్నాము అనుకుంటుంటాము, కానీ  అసలు నేర్చుకునేది శ్రమకోర్చడం, టీం వర్క్, పట్టుదల, కష్టాలను అధిగమించడం లాంటివి. ఇప్పుడూ నేను తెలుగు బ్లాగులు రాయడంలో కూడా “భాషా, భావ వ్యక్తీకరణ” మెరుగుపడాలి అని అనిపించినా, టైం మానేజ్ మెంట్, నచ్చని అభిప్రాయాలతో వినమ్రంగా విభేదించటం, నా అనుభవంలోకి రాని జీవితాన్ని చదివి ఆకళింపు చేసుకోవడం, ముఖపరిచయం కూడా లేని వాళ్ళతో ఆప్తులుగా కలిసిపోగలగడం లాంటివి తెలుగు బ్లాగుల వల్ల నేను నేర్చుకున్న(కుంటున్న) అసలైన జీవితం. హైడ్ ఫేక్ అంటే అర్ధం అయ్యిందిగా? మీ అనుభవాలు చెప్పండి మరి?

* “నువ్వింకో మూడు నెలల్లో చనిపోతావు, ఇక మేము చేసేది కూడా ఏమీ లేదు” అని ఒక డాక్టర్ ఓ మనిషితో చెప్తే నేల కింద భూమి కంపించినట్టు, ఓ పెద్ద అల వచ్చి శిలని కొట్టినట్టు అని నేను వర్ణించకపోయినా ఆ బాధ మీకు తెలుసు. బాధ, భయం, ఆశ, ఆవేశం, నిస్పృహ, అసహనం అన్నీ కలిసి ఒక్కసారిగా చుట్టుముట్టేస్తాయి. మెదడు పని చేయటం మానేస్తుందేమో అని అనిపిస్తుంది. కానీ రాండీ బుర్ర చకచకా పని చేస్తుంది ఇలాంటి సమయాల్లోనూ. ఇక లాభం లేదన్న మాట వినగానే కుప్పకూలిన భార్యని ఓదారుస్తున్న డాక్టర్ మాటల్లో “మందు”ని రాండీ ఇలా చెప్తాడు.
“..he isn’t putting his arm around her shoulder, I understand why. That would be too presumptuous. But he’s leaning in, his hand on her knee. Boy, he’s good at this.”
మాటల్లో ఎంత శక్తి కదా? ఒక అందమైన అనుభవాన్ని, అంతులేని అగాధాన్ని ఒక మాటతో సృష్టించవచ్చు. “నాకు మాటలంటే భయం” అని జనాలెందుకు దూరంగా పరిగెడతారో ఇప్పుడు అర్ధం అవుతోంది.

* “ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు/ప్రియుడు అంత కఠినం” అని బాధపడుతున్న అబ్బాయిలకీ, అమ్మాయిలకీ ప్రేమ క్షీర సాగరాన్ని మధించిన రాండీ ఓ బహు చక్కని ఉపదేశం ఇస్తున్నాడు. 🙂
“..the most inpenetrable bricks walls are made of human flesh. And the brick walls are there to stop the people who don’t want it badly enough. They are there to stop the other people.”
ఏ మనిషిలోనైనా మంచి అనేది ఉంటుందనీ, అది చూసే ఓపిక, సహనం లేకే మనం మనుష్యులని దూరం చేసేసుకుంటామని అని రాండీ అభిప్రాయం.

* ఇక ఈ తరం ఉద్యోగాలు చేస్తున్న అమ్మాయిలకు మరో గొప్ప మంత్రం. (తన కూతురికి ఈ విషయం చెప్పాలని రాండీ కోరిక. పాపకింకా నాలుగేళ్ళే!)
When it comes to men who are romantically interested in you, it’s really simple. Just ignore everything they say and only pay attention to what they do.

* Insurances ఎందుకో మనకి తెలుసు. మన తదనంతరం కూడా మన వాళ్ళకి ఆర్ధక ఇబ్బందులు లేకుండా చూడడం కోసం. రాండీ ఇంకో అడుగు ముందుకేసి, emotional insurance గురించి చెప్తారు. మనం పోతాం సరే, తర్వాత మనవాళ్ళు ఎలా బ్రతుకుతారు, మనం లేకుండా? మనిషిగా మిగలకపోయినా, మిగితా అన్ని రూపాల్లో మనం వారి దగ్గరుండేలా జాగ్రత్త పడాలి, ఫోటోల్లో, వీడియోల్లో, ఉత్తరాల్లో, వీలైనన్ని జ్ఞాపకాలని వదిలి వెళ్ళాలి అంటారు.

* తాను బ్రతికుండగా భార్య ఆఖరి పుట్టినరోజుకి ఒక పార్టీ ఏర్పాటు చేస్తారు రాండి. ఆవిడ ( పేరు జే) స్టేజీ మీదకు వచ్చీ రాగానే భర్తను గట్టిగా పట్టుకుని ఏడుస్తూ “please don’t die” అని అంటుంది. మన రాండీకి ఏదో హాలివుడ్ డైలాగు గుర్తు వస్తుంది. కానీ ఆమె అన్నది అవే పదాలు. మనకి తెలియకుండానే కొన్ని పదాలు ఎడా పెడా వాడేసి, వాటి విలువ తగ్గించేస్తామేమో అని అనిపించింది. “నిన్నే ప్రేమిస్తున్నాను”, “నువ్వు లేక నేను లేను”, “నీ కోసం”, “నిన్ను చూడకుండా ఉండలేను” లాంటివన్నీ ఇప్పుడు సినిమా టైటిల్లేనా? ఏమో!

* తనకే ఆక్సిడెంటో అయ్యి లేక గుండె పోటో వచ్చి ఉంటే, చివరి నెలల్లో జీవితాన్ని ఆనందించేవాడిని కాదని, తన వాళ్ళకోసం అంతా సంసిద్ధం చేయలేకపోయే వాడిననీ, ఒక రకంగా చూస్తే కాన్సర్ కూడా అదృష్టమే అని అంటారు. ఇది అక్షరాల నిజం అని ఒప్పుకుంటాము. ఎందుకంటే పుస్తకం మొదలెట్టినప్పుడు ఎంత భయంకరమైన మూడ్ లో మొదలెట్టానో, రాండీ కథ చదువుతుండగా, మనం ఊరెళ్ళాలి అంటే ఎంత హడావిడి ఉంటుంది: ఒక పక్క అన్నీ సర్దుకోవాలి, ఏదీ మర్చిపోకూడదు, మన బాధ్యతలని వేరే వారికి అప్పగించాలి, మనం వెళ్తున్నామని అమ్మ ఏడుపు మొదలెడితే ఊరుకోబెట్టాలి.. రాండీ ఈ లోకం నుండి ఇంకో లోకానికి వెళ్ళడానికి అలానే సిద్ధమయ్యారు. నాకు తెలీకుండానే నేను ఆ పనుల్లో మునిగిపోయాను.
రాండీకి కనీసం ఇన్నాళ్ళని టైం అన్నా ఉంది, మనకి అదీ లేదు. ఏ క్షణాన్న ఏ విపరీతానికి బలి అవుతామో తెలీదు. అంటే మనమెంత రెడీగా, preparedగా ఉండాలి అన్న ఆలోచన నన్ను తొలిచేస్తుంది.

అసలు క్లాసు అటెండ్ అవ్వాల్సిందే ఇందుకు. మనకి చెప్పే సబ్జెక్ట్ తో పాటు లెక్చరర్లు తన జీవితపు విశేషాలను చెప్తుంటే మనం వారి అనుభవాలనుండి నేర్చుకోవటం. నేను చెప్పినవి కాక, ఈ పుస్తకంలో ఇంకా చాలా విషయాలున్నాయి, ఎన్నో సూక్తులు, ఆదర్శాలు, మంచి మాటలు, ప్రేమలూ, అప్యాయతలూ, ఆలోచనలూ. కలలు నిజం చేసుకోవటమల్లే అనిపించినా కానీ రాండీ నేర్పించే అతి పెద్ద పాఠం.. “ఈ క్షణాన్ని ఆస్వాదిద్దాం”! Live in the moment! Time is all you have. And you may find one day that you have less than you think. పుస్తకాలు ఇందుకే చదవాలి, మనకి తెలియనవి తెలుసుకోవటం కాదు, తెలిసీ మర్చిపోయినవి గుర్తుచేస్తాయి అందుకు!

అన్ని ప్రమదావనాలు ఒక్కలా ఉండవు ;-)


06.09.2008 నాడు జరిగిన ప్రమదావనం మీటింగు రిపోర్ట్ /మినిట్స్ !

అతిధులు: సాలభంజికల నాగరాజు గారు, చదువరి గారు, నెటిజన్ గారు

ముందుగా జ్యోతిగారు, సుజ్జిగారు మీటింగ్ కి వచ్చారు. కాసేపటికి నేను, నెటిజన్ గారు, జ్ఞానప్రసూన గారు వచ్చాము. సుజ్జిగారి బ్లాగు లంకె ఇవ్వగా, ఆ బ్లాగును చూశారు, ఇది వరకూ తెలియని వారు.

ఇంతలో జ్యోతిగారు, ఈ కింది ప్రశ్న అడిగారు:
జ్యోతి: నెటిజన్, poornima, సిబిరావుగారు అన్నట్టు మహిళా బ్లాగులలో అంతా సోది రాస్తారా?

దానికి వచ్చిన అభిప్రాయాలు:
నెటిజన్: లేదు, అలా అనిపించలేదు ఎప్పుడు.
sujji :  పూర్ణిమ గారి బ్లాగు చూస్తే ఎవరూ అలా అనరు. అలా అంటే మేల్ బ్లాగర్ల నుండే ఎక్కువ సోది చదువుతాము.
నెటిజన్ :  జ్యోతి, పూర్ణిమ గారి గురించి సీ బా రావు గారి చక్కటి పరిచయం వ్రాసారు, అందులో సోది ఐతే రాయకపోదురేమో
poornima :  నన్నడిగితే మన అభిరుచులను బట్టి, అబిప్రాయాలను బట్టి మనకి నచ్చినవి, నచ్చనవి అని చెప్తాం. నచ్చని వాటిని సోదనో, చెత్తనో అనకోవచ్చు.. అది వారి స్వంత అభిప్రాయమే కానీ, మనం ఏమీ చెప్పలేము
నెటిజన్: sujji, మీకు ఏ మగవారి బ్లాగులో సోది కనపడింది?
sujji : అలా చెప్పటం బాగుండదు ఏమో! పైగా, నా టేస్ట్ ని బట్టి, నాకు సోది అనిపించవచ్చు.

“మాటలు కదలడం లేదో” అని అప్పటికే జ్ఞానప్రసూన గారు అంటూ ఉన్నారు, ఇంతలో మాలతి గారు వచ్చారు. వెనువెంటనే సాలభంజికల నాగరాజు గారు కూడాను. చదువరి గారి కోసం ఎదురు చూపులతోనే కుశల ప్రశ్నలు, పరిచయాలు జరిగాయి.

జ్యోతి : సాలభంజికలు, మీ గురించి కాస్త చెప్పండి
సాలభంజికలు :   జ్యోతి – చెప్పడం కంటే, చెప్పుడు మాటలే బావుంటాయి 🙂
poornima : సాలభంజికలు, చెప్పుడు మాటలు ఎక్కువగా వినిపించాలి అంటే, మనం , మన బ్లాగూ ఆక్టివ్ గా ఉండాలి ఏమో!
జ్యోతి : మీ బ్లాగు ఎందుకు మూసేసారో చెప్పండి .
నెటిజన్ : సాలభంజికలు, రాగానే మొదలెట్టారు, సీ బీ రావు గారు స్త్రీ లా బ్లాగులలో సోది ఉంటుంది అని అంటున్నారు అని 🙂
poornima : సాలభంజికలు, ఇప్పుడూ కొత్త వారికి మీరు మీరుగానే పరిచయం అవ్వాలి కదా!
జ్యోతి :   రాయకపోతే మూసేయడమే..
నెటిజన్  : poornima, మీరు చెప్పేది నిజం
సాలభంజికలు :   ఓ — అదంతా ఓ దీనగాధ, గొప్ప మహిళా చిత్రం. ఇప్పుడదంతా చెప్తే పాపం మీరంతా కొంగులతోనో, చున్నీలతోనో కళ్ళొత్తుకొని – త్యాగశీలివయ్యా, బాబూ అంటూ కోరస్ ఎత్తు కుంటారేమో..

మేమంతా సినిమాకి రెడీ అవుతుంటే, మాలతి గారి నెట్ ఫట్ మని, ఆవిడ నిష్క్రమించారు. అటు తర్వాత సాలభంజికల కథ విని కాసేపు తల్లడిల్లిపోయాను. వ్యక్తిగత కారణాల వల్ల వారు ప్రస్తుతానికి బ్లాగు మూసేసినా, త్వరలోనే తిరిగి ప్రారంభిస్తారని, ఈ లోపు మనతో పాటు ఇలానే కొనసాగుతారని ఆశిద్దాం. ఆ ఆశకి చిన్న ఆశ పుట్టేలా ఉన్నాయి ఈ మాటలు:
నెటిజన్ :  సాలభంజికలు – కాని మీరు ఆ ౧౨౩, ఎన్ ఎస్ జీ తరువాయి భాగం కూడ ముగిస్తే బాగుండేది.
సాలభంజికలు :  నెటిజన్ – చూస్తానండీ, వీలుంటే రాసి పొద్దుకి పంపుతా. ఆ వ్యాసం ఎలాగూ చాలా వరకూ పూర్తి చేసాను. కాస్త తుది మెరుగులు దిద్దాలి.

అప్పుడే చదువరి గారు ఎంట్రీ ఇచ్చారు. ప్రమదావనానికి దారి తెలీక, కూడలి కబుర్రుల్లో ఉంటే ఎవరైనా వచ్చి తీసుకెళ్తారేమో అని ఎదురు చూశారట. ఇక ప్రశ్నల పరంపర కొనసాగాయి. వాటిలో కొన్ని కారాలు, చమత్కారాలు.

చదువరి :   సాలభంజికలు, ఎలా ఉన్నారు?
సాలభంజికలు :   చదువరి – ఏదో మీ దయ.
చదువరి  :  నా దయా? ఇక్కడికొచ్చాక నా దయా మీ దయా చెల్లదయా!

జ్యోతి : సాలభంజికలు, మీరు నెట్ లో తెలుగు ఎలా రాయడం మొదలుపెట్టారు.
జ్యోతి:  బ్లాగు ఎందుకు మొదలెట్టారు
సాలభంజికలు:   జ్యోతి – చేత్తోనే.
జ్యోతి:  సాలభంజికలు అని పేరు పెట్టడానికి కారణం ఏంటి
జ్యోతి : మేము చేసేది అదే

నెటిజన్: సాలభంజికలు: మీకు ఇబ్బంది లేక పోతేనే సుమా!
సాలభంజికలు :  ఇబ్బందా – అబ్బే, అలాటిదేం లేదు.
జ్యోతి: ఇబ్బందిగా ఉన్న ప్రశ్నలకు పాస్ అంటే సరి
సాలభంజికలు :  ఇబ్బందిగా ఉన్న ప్రశ్నలకి పకడ్బందీ సమాధానాలుంటాయిగా 🙂
poornima : సాలభంజికలు, అంటే.. ఇబ్బంది పెట్టమంటారు, పెద్దగా ఇబ్బంది పడకుండా.. అంతేనా?

ఇంతలో జ్ఞానప్రసూన గారు సెలవు తీసుకున్నారు.
gnanaprasuna :  మరి నే వెడుతున్నా! అందరికీ సెలవు, మళ్ళీ సొంతూరొచ్చి మాట్లాడుకుందాము.

అడిగిన ప్రశ్నల్నీ కలిపి జవాబు ఇద్దామని సాలభంజికలు గారు చదువరి గారికి ప్రతిపాదించారు. కుదరదని జ్యోతిగారన్నారు. ఒప్పించటానికి నాగరాజు గారు ప్రయత్నిస్తుండగా, ఆ ప్రశ్నలపై సర్వ హక్కులూ నాగరాజు గారివే అని, తనకే సంబంధం లేదనీ చదువరి చెప్పటంతో..

poornima: సాలభంజికలు, ఈ బ్లాగు ప్రపంచానికి మీరేమి ఇచ్చారు? ఏమి తీసుకున్నారు?
చదువరి  :  poornima, భలే ప్రశ్న!
చదువరి  : సాలభంజికలు, నాక్కూడా సమాధానం తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది.
(కానీ ఈ ప్రశ్న తర్వాత మాటల్లో పూర్తిగా మిస్స్ అయ్యిపోయింది :-(( )

కాసేపు చదువరి గారిని బిజీ చేద్దామని,

poornima :  చదువరి, వరూధిణి గారు బ్లాగు మొదలెట్టడం లో మీ పాత్ర ఎంత?
poornima :  నాకు తెలిసిన వాళ్ళని బ్లాగులు మొదలెట్టమని పోరు పెడుతున్నా.. నా మాట వినటం లేదు. 😦
చదువరి:  poornima, , తను మొదలుపెట్టింతరవాత గానీ నాకు తెలీలేదండి.
poornima: చదువరి, మీ ఇంట్లో బ్లాగు చర్చలు జరుగుతాయా? ఇక్కడున్నంత వేడిగా వాడిగా కాకపోయినా?
సాలభంజికలు:  పూర్ణిమ – చదువరి పాత్ర, వరూధిని పదార్థం. 🙂
poornima:  మంచి సినిమా చూసి నచ్చిందీ, నచ్చనిదీ మాట్లాడుకున్నట్టు.. బ్లాగుల గురించి మాట్లాడుకుంటారా అని?
poornima : సాలభంజికలు, కొంచెం గట్టిగా నవ్వవచ్చునా?
చదువరి:  అంటే.. టెం’ప్లేట్ల’ పని నాది కంటెంటు పని ఆవిడదని
చదువరి:  poornima, మాట్లాడుకుంటాం
సాలభంజికలు:  చదువరి – అదిరింది. వేసుకోండి వీరతాళ్ళు. మీకు కొటేషన్లని సనాయి నొక్కుల్లా వాడటం బాగా తెలుసు.
నెటిజన్ : చదువరి, చెంబులు తపేళాలు మనవినూ, వంట గింటా వారిదనా?
చదువరి : నెటిజన్, ఔనౌను! 🙂

ఇంతలో జ్యోతిగారి నెట్ ఫట్ట్ అన్న సమాచారం తెలిసి, దిక్కు తోచని పరిస్థితుల్లో మెదడు ఏదంటే అది వినేసి,


poornima: ఒక సీరియస్ ప్రశ్న అడిగేదా, అందరనీ?
సాలభంజికలు:  ప్రొసీడైపోండి మరి.
poornima : ఓ రెండేళ్ళ కిందట, తెలుగు చాలా దయనీయ స్థితిలో ఉందంటే.. అవునూ అంటే నేనూ మూలిగేదాన్ని, తెలుగు బ్లాగులు చదువుతున్న దగ్గర నుండీ.. తెలుగుకి వచ్చిన నష్టం ఏమీ లేదనిపిస్తోంది. తెలుగు బ్లాగుల వల్ల తెలుగెంత మేలు జరుగుతుందీ అని నా ప్రశ్న!

ఆ ప్రశ్న ఒక సీరియస్ చర్చకి దారి తీసింది. దానిని యధావిధిగా ఇక్కడ పొందుపరుస్తున్నాను. చర్చ జరుగుతున్నప్పుడే రాధిక గారూ వచ్చారు.

చదువరి: సాలభంజికలు, నెటిజెన్ – మీరు చెప్పండి, చివరగా నేను.
సాలభంజికలు: నాకైతే – ఇది (బ్లాగుల వల్ల భాష పరిరక్షించబట్టం, తెలుగుకి “మేలు” చెయ్యటంలాటివి) – ఏరొగన్స్ అనిపిస్తుంది. ఇది కేవలం అభిప్రాయం.
నెటిజన్ : తెలుగులో చాలా విషయ సామగ్రి, వికి ద్వారా తెలుగు మాత్రమే తెలిసిన వారి కి అందుబాటులోకి వచ్చింది.
నెటిజన్: కొంత మేరకి సాలభంజికలు గారితో ఏకిభవిస్తాను.
సాలభంజికలు:  ఏదైనా మనకి తెలియనంత కాలం – మనకి తెలియదుకాబట్టి,  అది ప్రమాదంలో ఉందనో, దానినెవ్వరూ ఉద్దరించటంలేదనో మనం అనేసుకొంటుంటాం. ఒకసారి – తెలుగు చదవటం మొదలెడితే – ఎందరో దానిలో కృషి చేస్తున్నారానీ, అది ఎప్పుడూ సజీవంగానే ఉందని అనిపిస్తుంది – ఇది చాలా విషయాలలో నా స్వానుభవం. ఇంకోటి – తెలుగు వాళ్ళు ఉన్నంత కాలం తెలుగు ఉంటుంది. అది మనకి నచ్చినట్టు ఉంటుందా, లేదా అన్నది వేరే ప్రశ్న.     ఇహపోతే – ఇప్పుడు వికీలు, బ్లాగులు, తెలుగులో తిరిగి కొత్త సాహిత్య సృష్టి గురించి… ఎకనామిక్స్ లో మార్కెట్ గురించి ఒక చిత్రమైన వివరణ ఉంటుంది.
మార్కెట్టంటే – 1. the ability of the people to innovate and create new products and services.
                     2. the capacity and willingness of the people to purchase.
ఈ రెండు కండిషన్లు ఉంటేనే అది మార్కెట్టవుతుంది. ప్రస్తుతానికి, ఒక సాంస్కృతిక విప్లవానికి ఈ రెండు కండిషన్లు ఉన్నట్టున్నాయి. ఎందుకంటే – ఇంతకు ముందులా, తెలుగులో రాయటం అనేది కవులకీ, తెలుగు పండితులకీ, జర్నలిస్టులకీ ఇప్పుడు పరిమితం కాలేదు. నవతరంగంలో సీరియస్ హాబీయిస్టులు రాస్తున్న సినిమా వ్యాసాలు, గట్రా..
చదువరి: సాలభంజికలు, ఆ రెండో పరిస్థితి ఆశాజనకంగా ఉందంటారా? ఆదరించేవారు!
సాలభంజికలు:  చదువరి –  ఆదరించేవారు ఎప్పుడూ ఉంటారు కదా? వారి పరిధిని పెంచటం అనేది ఈ ఇంటర్నెట్ మాధ్యమంలో ఆర్థిక, సామాజిక సమస్య కాదు కదా – అది కేవలం సాంకేతిక సమస్య మాత్రమే.
చదువరి : సరిగ్గా ఇక్కడే నా సమాధానం మొదలెడతాను, నెటిజెన్ గారు చెప్పేసాక!
నెటిజన్ : సాలభంజికలు, చదువరి గారి చెబుతున్నది నిజం. థామస్ ఫ్రీడ్‌మాన్ ఒక The world is flat అని ఒక పుస్తకం రాసాడు. అందులో అంటాడు;  జాలం  ఏర్పడిన తరువాత సాంకేతిక విజ్ఞానం ఎల్లలు చెరిపేసి అందరికి అందుబాటులోకి వచ్చిందని. అందులో భాగమే, బ్లాగింగ్. ఇంతకు మునుపు సాలభంజికలు అన్నట్టు, తెలుగులో వ్రాయడం ఏ కొద్దిమందికో పరిమితమయ్యింది.  ఇప్పుడు అందరికి అందుబాటులోకి వచ్చింది. సాలభంజికలు ఉదహరించిన నవతరంగం అందులో ఒక భాగం
poornima:  నెటిజన్, అది నిజమండీ.. తెలుగు బ్లాగుల్లో ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇక్కడ కొత్తగా రాసేవారికి దొరికే ప్రోత్సాహం
నెటిజన్:  అవును, ఆ ప్రోత్సహమే, వారి ఆలోచనలకు పదును పెడుతుంది. ఔత్సాహికులను ప్రోత్సాహించలనుకున్నప్పుడు, ఒకొక్కసారి, కొన్ని పొరబాట్లు గూడ జరుగుతున్నవి. చదువరి గారు మీ అభిప్రాయం?
చదువరి: నెటిజన్, సాంకేతిక విజ్ఞానం తెలుగును ప్రజలకు మరింత చేరువ చేసింది; సందేహం లేదు. కానీ.. అసలు తెలుగు రాని వారికి అదేమి ఉపయోగం!!? లక్షల్లో ఉంటారు రోజూ కనీసం రెండు మూడు గంటలపాటు జాలంలో గడిపేవాళ్ళు. కూడలికి వచ్చే వాళ్ళు కొన్ని వందలు -మహా అయితే వెయ్యి! ఎందుకంటే తెలుగు చదవగలిగి, రాయగలిగే వాళ్ళు ఉండేకొద్దీ తగ్గిపోతున్నారు..
నెటిజన్ :  ఐతే..
చదువరి : రాబీయే రోజుల్లో తెలుగు చదవగలొఇగే వాళ్ళు ఇంకా తగ్గిపోతారు, ప్రభుత్వం పనుల మూలంగా. అప్పుడు సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా ప్రయోజనం ఏంటి? బ్లాగుల వలన (మరీ ముఖ్యంగా జాలంలో తెలుగు వలన) మేలు జరిగింది.. అది నిర్విదావమైన అంశం.
సాలభంజికలు:  చదువరి – మీరన్న దాంట్లో వాస్తవం ఉందేమో గాని, పూర్తిగా ఒప్పుకోలేను. 15% of India’s GDP comes from Cultural Products.
చదువరి :   ..కానీ తెలుగు చదవగలిగే వాళ్ళు, ఆసక్తి ఉన్నవాళ్ళు మాత్రమే దాన్ని అందిపుచుకున్నారు, మనలాగా!
సాలభంజికలు:  Language is THE vehicle for culture. if there is an economic support structure – then it would grow, develop, metamorph, transform and ultimately will prevail. As an example of what i was referring to earlier – i was invited to give a presentation on the Indian Language Learning and Reference Market to one of the largest publishers of Language Refernce Content in the world. They wouldn’t have thought about it such a move even ten years ago.

radhika :  ఖశ్చితం గా బ్లాగుల వల్ల తెలుగుకు మేలు జరుగుతుంది అనుకుంటున్నాను.

సాలభంజికలు:  however, i understand you point. I was talking about this topic (language computing, language related products and services and technologies) with one of my fellow researchers yesterday. And, he made an interesting comment. he said that the Possibility is a function of Potential, Problems and Politics.
అంటే ఆయన ఉద్దేశం – మీరన్నట్టుగా – ఎంతమందికి తెలుగు చేరువ అవగలదు అనే “పాసబిలిటీ’ సమస్యలు, రాజకీయాలు, మొత్తం సామర్ధ్యం అనే మూడు అంశాల వల్ల ప్రభావితం అవుతుంది అని. సమస్యలు, రాజకీయాలు – పాసబిలిటీ శాతాన్ని తగ్గించగలవే గాని, తుడిచెయ్యలేవు – అదీ నేను చెప్పదలచుకొన్నది.

చదువరి: తెలుగు నేర్పే దగ్గర శ్రద్ధ వహించాలి అని న ఉద్దేశ్యం. అప్పుడు సాంకేతిక పరిజ్ఞానం అక్కరకొస్తుంది. మనకు తెలుగు రాకపోతే బ్లాగులు రాయగలిగే వాళ్ళమా, చదవగలిగే వాళ్లమా?
నెటిజన: సాలభంజికలు అన్నట్టు..commercials need not necessarily influence language..always.
చదువరి: నా పేసంగం కూడా అయిపోయింది. ఇక రాధిక గారు
radhika: చదువరి, అదే అనిపిస్తూ వుంటుంది నాకు.మన తరం వరకు తెలుగు ఓకే.తరువాతి తరం వాళ్ళు తెలుగు మాట్లాడగలరేమో గానీ రాయలేరని నా అభిప్రాయం. ఏదేమయినా ప్రాధమిక పాఠశాలల్లో తెలుగుని తప్పనిసరి చేస్తే అంతో ,ఇంతో బాధపడో,కష్టపడో నేర్చుకుంటారు.

ప్రస్తుత బ్లాగు పరిస్థితులపై రాధిక తన ఆవేశాన్ని, ఇలా తెలియజేసారు.
radhika:  ఇంతకు ముందు తెలుగు పీపుల్ వంటి సైట్లలో తెలుగువారితో ముచ్చటిస్తూ వుండేవాల్లు చాలా మంది.అక్కడి వాగ్వివాదాలు,గొడవలు,వ్యక్తి దూషణ వంటివి ఎక్కువయిపోవడం వల్ల జనానికి విసుగొచ్చి ఆ సైఉకి దూరం గా వుండడం మొదలు పెట్టారు.ఇప్పుడు బ్లాగుల్లో కూడా అది మొదలవుతూ వుంది.శైశవ దశలోనే వుంది కానీ జాగ్రత్త పడకపోతే బ్లాగులకు కూడా అదే గతి పడుతుంది

దీని పై చర్చ మొదలెట్టడానికి నిదానంగా ఉన్న కూడలి చాట్ రూం సహకరించలేదు. చచ్చేంత నెమ్మదిగా ఉన్న కూడలి చాట్ రూమ్ లో కూడా, ఓపిక, ఉత్సాహం నశించిపోతున్నా ఈ చర్చ కొనసాగింది. మెర్సీ కిల్లింగ్ కి అన్ని విధాల అర్హత ఉన్నా, చాట్ నుండి వైదొగలకుండా చదువరి, నాగరాజు, నెటిజన్ చాలా ఓపిగ్గా చర్చించారు.

radhika :  అవును ఎవరూ లేరేమిటి ఈ రోజు? ఒక్క క్షణం నాకు అర్ధం కాలేదు కూడలి కబుర్లలో వున్ననో, ప్రమదావనం లో వున్నానో తెలియలేదు. ఇదేనా స్పెషల్.నాగరాజు గారు,నెటిజన్ గారూ,చదువరి గారూ…పెద్దలనదరూ వచ్చారు.మరి మనవాళ్ళేరి?

రాధిక అలా అడిగిన తీవ్రతో, మరేదో వెంటవెంటనే జ్యోతిగారు, తెరిసా, పద్మ, రమణి అంతా వచ్చారు. ఇంత మందిని చూసిన ఆనందంలో చాట్ రూం కూడా కొంత ఉత్సాహం గా మారింది. కానీ అప్పటికే ఎనిమిది గంటలు కావటం వల్ల అతిధులు వెళ్ళడానికే నిశ్చయించుకున్నారు. పోదాం అంటే పోదాం అని వారనుకుంటుంటే, “కాసేపు ఉండకూడదూ” అని అతివలు, “ఇది దారుణం. మేము రాగానే వెళ్ళిపోతున్నారు” అని ఒకరంటే, ఏది దారుణం, మమ్మలని పిలిచి, గుమ్మంలో మూడు గంటలు నిలబట్టడమా? లాంటి మాటలు నిత్య తెలుగు వాకిళ్ళల్లో జరిగే సంభాషణలా ఉన్నాయి. సాలభంకిలు మూతపడ్డానికి గల “ఇన్-సైడ్ స్టోరీ” తెలుసుకోవాలన్న అందరి ఆత్రుత, అలాగే మిగిలిపోయింది.

వెళ్తూ, వెళ్తూ నెటిజన్ గారు, poornima: you are bubbly and energetic, without your company this would have such a bore అని అన్నారు. రమణిగారు నేనేదో బరువు మోసాసాను ఒక్కదాన్నే అని కంగారు పడ్డారు. “నేను మోయలేదు..” అని చెప్పాను. ఈ పాటికి అర్ధమయ్యే ఉంటుంది, నేను మోయలేదని. తెరిస్సా  “నాక్కిక్కడ ఏం జరిగిందో తెలియాలంటే తెలియాలి. వీలైనంత త్వరగా సమగ్రంగా నివేదిక ద్వారా తెలియజేయమన్నారు. అంతగా సహకరించని పరిస్థుతుల్లో నాకు తోచిన విధంగా రాశాను. “స్పెషల్ ప్రమదావనం” స్పెషల్ అనిపించిందే అనుకుంటున్నాను.

పూర్తిగా చదివినందుకు ధన్యవాదాలు.

పూర్ణిమ

లవ్ ఇన్ ది టైమ్ ఆఫ్ కలరా!


(గమనిక: ఈ టపా ముఖ్యోద్దేశ్యం, Gabriel García Márquez రచించిన Love in the Time of Cholera అనే పుస్తకం చదువుతున్నప్పుడు గానీ, చదవడం పూర్తయ్యాకా గానీ నాలో కలిగిన ఆలోచనలు ఇక్కడ పెట్టడం మాత్రమే. దీన్ని సమీక్ష అని నేననుకోవటం లేదు. పైగా ఇవి ఈ క్షణానివి. మున్ముందు ఇవి మారే అవకాశం ఉంది. ఈ పుస్తకాన్ని ఇది వరకే చదువున్న వారు, తమ అభిప్రాయాలని తెలిజేస్తే నా ఆలోచనా పరిధిని విస్తరించుకునే అవకాశం ఉంటుందనే స్వార్ధంతో కూడిన ప్రయత్నం)

కథేంటంటే:
మొదట ఈ రచన గురించి తెలిసినప్పుడు, “ప్రేమకథే కదా!” అని పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. ఇంక్కొంచెం తెలుసుకునే సరికి “ప్రేమ కథే అయినా ప్రయత్నించచ్చు” అనుకున్నా. తీరా యెడా పెడా దీని గురించే వెతికే సరికి “ప్రేమకథే.. కానీ రొటీన్ కి భిన్నమైనది” అని గుర్తించి పుస్తకం మొదలెట్టా! ఒక అబ్బాయి తన టీనేజ్ లో ఒక అందమైన అమ్మాయిని చూసీ చూడగానే మనసు పారేసుకుంటాడు. వెంటపడతాడు, ప్రేమించి పెళ్ళాడమని అర్ధింస్తాడు. ముందు కాదూ కూడదు అన్న అమ్మాయి మెల్లి మెల్లిగా అతడి వైపు మొగ్గు చూపుతుంది. ఇంట్లో ఈ విషయం తెలిస్తే కష్టం కావున రహస్యంగా ఉత్తరాల ద్వారా సంభాషించుకుంటుంటారు. ఇది అమ్మాయి తండ్రికి తెలిసి పోతుంది. అందంలోనూ, ఆస్తిలోనూ, కుటుంబ గౌరవంలోనూ తనకి తగడని తెలిసి అబ్బాయిని బెదిరిస్తాడు. ఫలించక అమ్మాయిని దూర ప్రాంతాన్నికి తీసుకెళ్తాడు. విరహాగ్నిలో మండుతున్న మనసులను టెలిగ్రాములు కలుపుతాయి! నిరీక్షణ ఫలించి ఆమె సొంత ఊరికి వచ్చిందని తెలిసిన హీరో ఆమెను ఆటపట్టించాడానికి చాటుగా ఫాలో అయ్యి, ఆ అమ్మాయిని సర్ ప్రైజ్ చేద్దామనుకుంటాడు. ఆ అమ్మి “నిన్నా నేను ప్రేమించింది? ఛీ పో” అంటుంది. ఇతగాడి హృదయం ముక్కలవుతుంది. కొంత కాలాని పేరున్న డాక్టర్ తో అంతగా ఇష్టం లేకపోయినా ఆ అమ్మి పెళ్ళయ్యిపోతుంది. హీరో పిచ్చివాడై తిరుగుతుంటాడు. ఆమెను మర్చిపోలేకపోతాడు, అయినా ఇతర స్త్రీల నుండి తనకి కావాల్సింది పొందుతూనే ఉంటాడు. హీరోయిన్ వైవాహిక జీవితం కాస్త ఒడుదుడుగలతో, కాస్త ఆనందం, మరి కాస్త అసహనంతో అటూ ఇటూ అయినా, “అన్యోన్య దాంపత్యం” అని అనిపించుకునేలా నిలబడుతుంది. ఈ క్రమంలో యాభై ఏళ్ళు గడిచేసరికి, డాక్టరు గారు మరణిస్తారు. అప్పుడు మన హీరో వెళ్ళి “ఈ రోజు కోసమే ఇంత కాలం వేచి చూశాను, మనం పెళ్ళి చేసుకుంద్దాం” అని అంటాడు. ఆవిడ (డైబ్బై ఏళ్ళ ఆమెను ఇక అమ్మాయి అనలేము కదా!) మళ్ళీ “ఛీ పో” అంటుంది. హీరో మళ్ళీ ఉత్తరాలు రాస్తాడు, ఈ సారి టైపు మెషీన్లో! ఫోన్లో కూడా! మొత్తానికి ఈ సారి తను ఒప్పుకుని వారిరువురూ కలిసి సహజీవనం కొనసాగిస్తారు.

అస్సలూ.. కథేంటంటే:
ఇదే కథ అని తెలుసుంటే నేనీ పుస్తకాన్ని ముట్టుకునే దాన్ని కాదు. తెలిసే సరికి ఆలస్యం అయ్యింది. అప్పటికే నేను పుస్తకంలో మునిగి పోయాను. ఈ రచనని మొదలెట్టడమే మన చేతుల్లో ఉంది. అటు తర్వాత మనల్ని తనకిష్టం వచ్చినట్టు ముందుకీ వెనక్కీ ఓ శతాబ్ద కాలంలో తిప్పుతాడు రచయిత. ఎప్పుడు ఏ విషయమైనా చెప్పేస్తాడు. ఊరించడు, టెన్షన్ పెట్టడు, కానీ ఊపిరి ఆడనివ్వడు. అంతా అయ్యిపోయాకా “ఇదా కథా?” అని బిక్కమొహం పెట్టలేదు, “అసలేంటీ కథా?” అంటే నాకర్ధమయ్యిందేంటంటే It is (just) NOT a love story! If at all love has a story for itself, it is this. Love in all kinds, in all forms and in all disguises. ఇది కేవలం ప్లొరెంటినో, ఫెర్మినా ప్రేమ కథే అనుకున్నా రచయిత శైలి వల్ల బాగుందనిపిస్తుంది, నాకు ఈ వచనం కొత్తగా, హాయిగా అనిపించింది. ఈ ఇరు పాత్రలపై సానుభూతి, సహానుభూతి, జాలి, కరుణ వైగారా లన్నీ పుష్కలంగా పుట్టుకొస్తాయి. ముఖ్యంగా ఫ్లొరెంటినో పిచ్చితనం, మొండితనం గురించి చదువుతున్నంత సేపూ నాకు పిచ్చి ఎక్కింది. అతడి బాధను చూసి (చూపిస్తాడు రచయిత) ఏం చెప్పాలో, ఏం అనాలో తెలీక నిస్సహాయంగా ఉండిపోయాను. (ఇది ఒక నవలలో కాల్పనిక పాత్ర కాబట్టి నా స్పందన కాస్త అతిగా అనిపించచ్చు. కానీ నిజజీవితంలో కూడా ఎప్పుడైనా ఎవరైనా ప్రేమ బారిన పడితే వారిని ఓదార్చలేము, అలా అని వదిలేసి ఊరుకోలేము. అప్పటి వరకూ వాళ్ళ జీవితంలో మనది అతి ముఖ్య పాత్ర అయినా ప్రేమ విషయానికి వచ్చేసరికి కేవలం “ప్రేక్షక పాత్ర” కి పరిమితం అవుతాము. ఆ పరిస్థితిని ఎలా వర్ణించాలో నాకు తెలీటం లేదు.) ఇక వారు జీవిత చరమాకంలో తీసుకున్న నిర్ణయం కాస్త (విశాలంగా) ఆలోచిస్తే సహేతుకమనిపిస్తుంది. పూర్తిగా నమ్మశక్యంకాని పాత్రను కూడా మనస్పూర్తిగా ఒప్పేసుకోవచ్చు. కాకపోతే ఈ రచనలో ఇంకా చాలా విషయం ఉంది.

కథ యొక్క కథ ఏటంటే:
ఇప్పుడు జమ్మూ నుండీ కన్యాకుమారి వరకూ ఒక నాన్-స్టాప్ రైలు ఉందనుకోండి. జమ్మూ లో ఎక్కేసామనుకోండి. మార్గంలో భారత దేశాన్ని చాలా వరకూ చూడచ్చు. ఎన్నో వింతలూ, విశేషాలూ, గట్లు, చెట్లు, పుట్టలు, కొండలు కోనలూ అన్నీ కనిపిస్తుంటాయి. కాసేపు ఆగి చూసుకోవాలనిపిస్తుంది. వీలుంటే దిగి ఫోటోలు తీసుకోవాలనిపిస్తుంది. కానీ రైలు ఆగదు. అది, దానితో పాటు మనం వెళ్తూనే ఉంటాము. మన మనస్సులో వీటన్నింటి స్నాప్ షాట్స్ మాత్రమే మిగులుతాయి. ఈ పుస్తకం ఒక నాన్-స్టాప్ రైలు బండి అనుకుంటే మనం తిరొగొచ్చేది “ప్రేమ“ను మాట. చూపించాల్సినవి చూపిస్తూనే ఎక్కడా ఎక్కువ సేపు నిలిచిపోకుండా రచయిత మనల్ని తీసుకెళ్తుంటాడు.
ఉదాహరణలు: ప్రేమ కోసం చావడాలు, చంపుకోడాలు మనికి కొత్త కాదు. కానీ “చావులోనే నాకు ఆనందం” అన్న ప్రియుణికి దగ్గరనుండి చనిపోడానికి సహకరించే ప్రియురాలు ఉందంటే విస్తుపోయే సమయం ఉండదు. వధూవరులిద్దరూ చిటికెన వేళ్ళు పట్టుకుని వైవాహిక జీవితాన్ని మొదలెడతారు. కొత్త ప్రపంచంలో అమ్మాయికి అన్నింటికీ ఆ అబ్బాయి మార్గదర్శకం. ఎన్నో ఉడుదుడుకులు ఎదుర్కొటున్నా జీవన నౌక మాత్రం సాఫీగా సాగటం వీరి ప్రధమ లక్ష్యం. బాధ్యతలన్నీ తీరి జీవన సంధ్యలో ఉండగా వయస్సు మీద పడి, వృద్ధాప్యంలో మళ్ళీ బాల్యం చూసుకుంటూ అతడిని కాపాడుకోవటం ఇప్పుడామె వంతు. For a husband, wife is the first daughter అని ఎక్కడో చదివాను. ఈ నవల చదివేటప్పుడు And for a wife, husband is the last son అని పొడిగించాలి ఏమో అనిపిస్తూ ఉంది, కానీ ముందుకెళ్ళక తప్పలేదు. ఆమె వంటి పరిమళం తనలో ఇమిడిపోవాలని, ఆ పరిమళానికి దగ్గ్రరగా ఉండే పూరేకుల రసాన్ని తాగి వాంతి చేసుకున్న పద్దెనిమ్మిదేళ్ళ అబ్బిని తిట్టుకోవాలో, జాలిపడాలో తేల్చుకునే లోపు బండి సాగిపోతుంది. ఇక కొన్ని రకాల ప్రేమలు చదువుతున్నప్పుడైతే పుస్తకాన్ని నేలకేసి కొట్టాలి అనేంత విరక్తి కలిగింది. కొట్టేలోపే, వాటిని దాటి పోవాల్సి వచ్చింది. రైలు కదులుతుండగానే ఫొటోలు తీసినట్టు, ఈ రచనలో కొన్ని వర్ణనలను, పంక్తులను మార్కు చేసుకున్నాను. కానీ వాటి వల్ల ఎంత ఉపయోగమో చూడాలి.  విడిగా రాయడానికి ప్రయత్నిస్తే బాగుంటుందనిపించింది.

కథ వెనుక కథేంటి?
“ఇరవయ్యోకటో శతాబ్దంలో ఇరవయ్యో పడిలో ఉన్నవారు ప్రేమ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ప్రేమంటే ఏమిటసలు? మనతో పాటు మన సమాజానికీ నచ్చితే అది ప్రేమ, లేకపోతే ఏదో ఒక అనకూడని పదాలు వాడేసి తప్పించుకుంటున్నామా? మనం ప్రేమను, ఏ ముసుగూ లేకుండా, ఆహ్వాన్నించగలమా? ప్రేమంటే రొమాంటిక్ ఇంకా ఫీల్ గుడ్ మాత్రమేనా?” లాంటి ఆలోచనలతో కాసేపు కొట్టుకుని, నాకెక్కిన పిచ్చి కనపడిన ప్రతీ వారినీ ప్రశ్నిస్తూ వారికి కొంచెం కొంచెం పంచుకుంటూ, కాసేపటికో కొన్నాళ్ళకో పక్కకి పెట్టేయడం మామూలుగా జరగాల్సినవి. కాకపోతే, ఎందుకో తెలీదు కానీ, I want to reverse engineer, this piece of art! రచయిత ఎందుకు అలానే రాశాడు అన్నది నన్ను వేధిస్తున్న ప్రశ్న. రెండు అంగుళాలు కూడా లేని  చిట్టి పాదాలు ఓ పెద్ద మనిషి చెప్పులు వేసుకుని నడవడమల్లే ఉంటుంది నేనీ ప్రయత్నం చేస్తే! అయినా చేస్తా!
నాకయితే ఇందులో ఉన్న ముఖ్య పాత్రలు అమ్మాయి, అబ్బాయి, ఇంకా అమ్మాయి భర్త:  ఆ అబ్బాయి ప్రేమకి పరాకాష్ఠ కాదు, మనుష్యాకారం ప్రేమకి. అందుకే అతని ఆకారం తికమక పెట్టించేలా ఉంటుంది, ఊరూ పేరూ, సమాజ గౌరవం లాంటివేవీ ఉండవు. చీదరించుకున్నా ఎవ్వరూ అతడిని తప్పించుకోలేరు. ఆ అమ్మాయి భర్త పెళ్ళికీ, లేకపోతే మన వ్యవస్థకీ ప్రతీక. అందుకే అన్ని హంగులూ ఉంటాయి అతనికి, డబ్బు, పరపతి, హోదా వగైరా వగైరా! ఒకచోట ఆ ఆమె అనుకుంటుంది, “ఇన్ని ఉన్నా ఇతడు చాలా వీక్” అని, అచ్చు వ్వవస్థలానే! ఇక ఆ అమ్మాయి ఒక సామాన్య మనిషి. ప్రేమకీ వ్యవస్థకీ మధ్య నలిగే ఒక సాధారణ మనిషి. ఈ రచనకి సంబంధించి వ్యాసాలు, రచయిత ఆలోచనలూ చదివితే ఏమైనా తెలుస్తుందేమో! కానీ అందాకా నా ఊహలను ఆపటం కష్టం.
ఇంకో తమాషా ఊహ ఏంటంటే, చిన్ని పిల్లలు చేయద్దు అన్న పనులు చేస్తే తల్లిదండ్రులు తిట్టడమో, కొట్టడమో చేస్తారు. అదే తాతయ్యలూ అమ్మమ్మలూ బుజ్జగిస్తూ కథ చెప్తూ ఆ కథలోనే పిల్లలకి చేరాల్సిన విషయం చేరేలా చూస్తారు. అందులోనే చెంపదబ్బలు ఉంటాయి, కానీ మనకి తగలవు. విశ్వజనీయమైన ప్రేమను వ్యవస్థ బంధనాల్లో ఇరికించే సమాజం / మనుష్యులు / ఆలోచనల మీద ఒక సటైర్ ఈ రచన అని నాకనిపిస్తోంది.

ఈ పుస్తకం చదవాలా?
నా ఆలోచనలతో ఇంకా ఉన్నందుకు ముందుగా ధన్యవాదాలు. ఈ పుస్తకం చదవాలా వద్దా అని ఆలోచిస్తుంటే ఒకటి చెప్పనా? వెన్నెలంటే అందరకీ ఇష్టమే! కాకపోతే there is a darker side of the moon as well. ఆహ్లాదం కలిగించే వెన్నెల నుండీ అమావాస్య తెచ్చే చిమ్మ చీకటని వరకూ  అన్నీ “భరించగలరు” అని అనుకుంటే ఈ పుస్తకాన్ని చదవండి. లేకపోతే లైట్! 😉 ఇంకా ఎంతో రాయాలని ఉంది, ఈ ఆలోచనల తూఫాను తగ్గాక ప్రయత్నిస్తా, I’m not done yet, neither with the book, nor its author!

* This book is so easily available in the pdf format on net, but is not advisable to read it there. 🙂