అమ్మా! బొమ్మ కొనిస్తా, నాతో ఉంటావా?

మృదుల సోఫాలో రెండు కాళ్ళు పైకి పెట్టి కూర్చుని, రెండు చేతులతో మోకాళ్ళని చుట్టి, తలను దాచేసుకుని ఏడుస్తోంది. శరత్ రెండడుగుల దూరంలో అసహనంగా, ఆయాసంగా కదులుతున్నాడు. ఆమె కన్నీరాగడం లేదు, అతని కాళ్ళాడడం లేదు. ఓ రెండు మూడు నిముషాలు అలాగే తిరిగాక, ఇక లాభం లేదనకుని, ఆమె ఎదురుగా నేల మీద కూర్చున్నాడు ఆమె తలను నిమురుతూ. తన బాధ అతడిని నిలువనివ్వటం లేదని గుర్తించి, పొంగి వస్తున్న దుఃఖానికి ఎలాగోలా ఆనకట్ట వేయాలని కన్నీటిని తుడుచుకుంటూ అతణ్ణి చూడ్డానికి ప్రయత్నించింది మృదుల.

“మృదూ, ప్లీజ్! ఏడ్వకూ” అన్నాడు అనునయంగా, కలిసిన చూపులు విడిపోయే లోపు. వద్దనే కొద్దీ కట్టలు తెంచుకుని మరీ ప్రహవించే గంగమ్మను ఆపలేక, కంటిలోని నీటి పొరను బిందువులుగా చెక్కిలిపై నెట్టడానికి రెప్పలు వాల్చింది.

“నేను వాడితో మాట్లాడుతాను కదా? ఊరుకో..” అన్నాడు ఆమె చెక్కిలిపై కన్నీటిని తానే తుడుస్తూ. “వద్దు.. మాట్లాడేందుకు ఏమీ లేదు” అని ఆమె అనలేదు కానీ అతడి చేతిని మాత్రం బలంగా పక్కకు నెట్టేసి, రెండు కాళ్ళు నేల మీద పెట్టి,  పక్కన పడున్న దిళ్ళని గట్టిగా పట్టుకుని, తనలోని వత్తిడినంతా వాటికి సరఫరా చేసింది.

“చిన్నపిల్లాడు, వాడి మాటల్ని నువ్వింతిలా పట్టించుకుంటే ఎలా?” ఆమె పడుతున్న వేదనకి కారణమైన విషయమేమంత పెద్దది కాదు అన్న భావన కలిగించడానికి, అంతకన్నా ఏమనాలో తెలియక అనేశాడు.

“వాడు అన్నాడని కాదు, శరత్” బాధలో మాటలూ కొట్టుకు పోతున్నాయి. ఒక్కొక్కటే ఏరుకోవాల్సి వస్తుంది.

“వాడు అన్నాడని కాదు నా బాధ, వాడు అన్నది గుర్తు వస్తుంటే నాకు మతి పోతోంది.” అంటున్న మాటల్లో స్పష్టత కూడా లోపించింది. అడ్డుకట్ట వేయలేక మాటలని తనలోనే ఉంచుకుని, మరింత బాధను బయటకు పంపించింది. కాసేపటికి తేరుకుని, ఇక ఏడవటానికి నీళ్ళు కూడా లేవని నిర్ణయించేసుకున్నట్టు, అరచేతితో కళ్ళని, చెక్కిళ్ళని గట్టిగా తుడుచుకుని, దిళ్ళని వదిలేసి, అతని చేతుల్ని వణుకుతున్న వేళ్ళతో చుట్టి, ఒక్కో మాట, ఒక్కో మాట ఇలా అంది.

“బాబు అన్నాడనే నా బాధ. వాడు అలా అనకూడదని కాదు. అయినా వాడితోనే అనిపించుకునేంత వరకూ వచ్చానంటే, తల్లిగా నా పాత్ర ఏ మాత్రం నిర్వర్తిస్తున్నానో నువ్వే చెప్పు” నిలదీసిందో, బతిమాలిందో తెలీకుండా అనేసింది.

“నువ్వు కాస్త ఎక్కువ ఆలోచిస్తున్నావేమో ఈ విషయమై?!” విషయం నుండి ఆమె దృష్టి మరల్చడమే ధ్యేయంగా అన్నాడతను.

“నీకు వాడన్న దాంట్లో ఏం అనిపించటం లేదా? మొన్న వాడు స్కూల్లో ఒక అబ్బాయితో గొడవ పడితే, నువ్వెళ్ళి ఆ తగాదా తీర్చావా? పోయిన నెల ఆ పిల్లాడిది పుట్టిన రోజున నువ్వే ఒక గిప్ట్ కొని ఇచ్చి, వాళ్ళింట్లో పార్టీకి పంపవా?”

తప్పు చేసిందని టీచరు తిట్టాక బాధతో ఏడుస్తూ, పాఠం మళ్ళీ అప్పచెప్పడానికి ప్రయత్నించే చిన్నారిలా ఉంది ఆమె ఇప్పుడు. ఒక్కొక్కటే గుర్తు చేసుకుంటూ చెప్తుంటే అవునన్నట్టు ఊ కొడుతున్నాడు శరత్. “అప్పటినుండీ వాళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారంట” ఇక పూడుకుపోతున్న గొంతును సవరిస్తూనే కొనసాగించింది. “ఇప్పుడు నీకూ అలా ఒక బొమ్మ కొనిస్తానమ్మా, నాతో ఉంటావా? నాతో ఆడుకుంటావా? నీకు కావాల్సొస్తే ఇంకా పెద్ద బొమ్మ కొనిస్తా. కానీ నాతో ఉండమ్మా.. ప్లీజ్! ఎందుకు నువ్వెప్పుడూ నాతో ఉండవని వాడు నన్ను నిలదీస్తుంటే, ఏమని చెప్పను? అసలు వాడిముందు నిలబడలేకపోతున్నాను తెలుసా? ఏమీ లేదంటావేమిటి?” చెప్పాలనుకున్నది చెప్పేశాక, అప్పటిదాకా ఆగిపోయిందనుకున్న కన్నీరు ఇంతలోనే అంతగా ఎలా ఊరిందో తెలీదు గానీ, అతడిని గట్టిగా పట్టుకుని, తనివి తీరా ఏడుస్తోంది. 

శరత్ కి ఆ బాధ అర్థం అవుతోంది. ఇక చిన్నపిల్లల్ని బుజ్జగించేటప్పుడు అసలు బాధనుండి దృష్టిని మరల్చి, వేరే వాటిని ధ్యాస కుదురేలా చేయటం లాంటి ప్రయత్నాలు ఇప్పుడు ఆమెతో అసంభవం అని నిర్ణయించుకున్నాడు. ఆ బాధను కాస్త అనుభవిస్తేనే మంచిది అనుకుని, ఆమెతో పాటు సోఫాలో కూర్చుని ఆ ఆవేదనను తానూ అనుభవిస్తున్నాడు. ఆమె శిరస్సు అతడి భజం పై, అతడి చెంప ఆమె తల పై, వణుకున్న ఆమె చేతి వేళ్ళు అతడినెలా మెత్తగా తాకుతున్నాయో, వణుకుతున్న ఆమె స్వరం మాత్రం అతడి హృదయాన్ని అంత తీవ్రంగా తాకుతున్నాయి. ఉన్నట్టుండి తలపైకెత్తి, కాస్త వాడిగా , “ఇక నేనీ ఉద్యోగం మానేస్తాను, శరత్!” అని ఆమె అంది. అతడు ఏదైతే భయపడుతూ ఉన్నాడో అదే జరిగింది.

“ఇప్పుడేమీ ఆలోచించక, కాసేపలా పడుకో! రాత్రంతా ఫ్లైట్లో ఉన్నావ్ కదా, ఆ బడలిక తీరాకా మాట్లాడుకుందాం!”

“లేదు, నేను ఇక ఈ ఉద్యోగం చేయలేను. వారంలో నాలుగు రోజులు ప్రయాణానికే సరిపోయే ఈ ఉద్యోగం నాకొద్దు”

“ఈ ఉద్యోగం కోసం నువ్వెన్ని కలలు కన్నావో! ఎంత శ్రమించి ఈ స్థానానికి వచ్చావో! వాటన్నింటినీ ప్రయాణం వంకతో మానేస్తావా?”

“జాబ్ లో ఎంత వత్తిడైనా భరించగలను. కానీ బాబుకి దూరమయ్యిపోతున్నా అన్న నిజం నన్ను తినేస్తుంది శరత్. వాడికి నేనుండీ లేనట్టుగా అయ్యిపోతున్నా”

“నువ్వెక్కువ ఆలోచిస్తున్నావు. నా మాట విని పడుకో కాసేపు”

“ఊ..హూ! ఈ సమస్య తేలాల్సిందే. అయినా ఇదసలు సమస్యే కాదు. కాసిన్ని డబ్బులకోసం మనం సృష్టించుకుంటున్న కాంప్లికేషన్. వాడికి అమ్మని లేకుండా చేస్తున్నాం” అన్న ఆమెను అపక తప్పలేదతడికి.

“నువ్వు రెంటినీ కలిపి చూస్తున్నావు. నీ కెరీర్ ని వాడిని కలిపి చూడడం మానెయ్యి. డబ్బు మాటెత్తుకు ప్లీజ్! డబ్బులు కోసమే అయితే నేనూ నీలా ఊర్లు పట్టుకుని తిరిగే ఉద్యోగం చేస్తూ లక్షలు సంపాదిస్తూ, వీడిని ఏ బోర్డింగ్ స్కూల్లోనో పడేసే వాళ్ళం..” అతని మాటలు శ్రద్ధగా వింటోంది. అతడు కొనసాగించాడు, ” సో, డబ్బు మాట చెప్పి మనల్ని మనం కించపర్చుకోవద్దు. నీకీ జాబ్ ముఖ్యం, ఇన్నాళ్ళ నీ శ్రమకి ఫలితం ఇది. ఎందుకు చేజార్చుకోవడం? ఇంకొన్నాళ్ళు పోతే నీ మీద వొత్తిడి తగ్గుతుంది, అందాకా ఓపిక పట్టు”.

“కానీ, ఇంతలోపు బాబు నా మీద ద్వేషం పెంచుకుంటే? నాకు పూర్తిగా దూరమయ్యిపోతే? అమ్మని అయ్యుండి కూడా వాడికి నేనొక స్ట్రేంజర్ లా మిగిలిపోతే?” ఆ కంఠంలో బాధ స్థానాన్ని భయం పూర్తిగా ఆక్రమించింది.

“హమ్మ్.. దాని గురించి ఆలోచిద్దాం. ఏదో ఒకటి చేద్దాం. ఇంట్లో ఉన్నంత సేపూ నీతోనే ఉండేలా లేక, అంతగా పని వత్తిడి లేని ట్రిప్స్ కి మేమూ నీతో రావడమో, ఏదో ఒకటి చేద్దాం!” ఎంత సర్ది చెపుదామనుకున్నా, సమస్య తీవ్రత అతణ్ణి నిలనివ్వటం లేదు. “ఏమో.. నాకూ ఏమీ తోచడం లేదు. అమ్మకి కొన్నాళ్ళు దూరంగా ఉంటే పూర్తిగా దూరమైపోతామేమో అన్న బాధ నాకు తెలుసు. అమ్మని చూడాలనిపిస్తుంది” అంటూ ఆమె భుజంపై తల ఆన్చాడు, అప్పటి వరకూ కనిపించిన ధైర్యం ఇప్పుడు బెంగగా వాలిపోవడంతో ఏమీ చేయలేక మృదుల అలానే ఉండిపోయింది.

సెల్లో రిమైండైర్ టోను మోగేసరికి, ఇద్దరి మధ్య నిశ్శబ్ధం బద్దలయ్యింది. ఆన్-లైన్ మీటింగు ఉందంటూ శరత్ లాప్ టాప్ వైపుకి నడిచాడు. ఏడ్చి ఏడ్చున్న కళ్ళు నిలువలేమంటుంటే, వాటితో పాటు తనువునూ వాల్చడానికి మృదుల మంచం వైపుకి నడిచింది.

Advertisements

48 comments on “అమ్మా! బొమ్మ కొనిస్తా, నాతో ఉంటావా?

 1. బాగుంది …బాగా రాసారు.

  వ్యక్తిగత జీవితాన్ని..కెరీర్ ని Balance చేయటం కూడా
  అంత సులభం కాదు.

 2. పూర్ణిమ గారు చాలా , చాలా (ఈ ” చాలా ” లు చాలవు ) బాగా రాశారు. ఇంతకన్నా మాటలు ఏమి రావటం లేదు.

 3. is that so difficult to manage career and home?, those whoever are working, i mean all working mothers’children are suffering with this? is this not seeing a problem under maginifying glass like all NRI stories or old parents-old age home stories? Nah, i am not trying to criticise this story, but just trying to think…….

 4. వాస్తవికత ఉట్టిపడుతోంది మీ రచనలో. చక్కటి దృశ్య చిత్రణ, పాత్రల మనో చిత్రణ. సమస్యకి పరిష్కారం సూచించకుండా వొదిలెయ్యడం మీలో రచయిత పరిణతి చెందడాన్ని చూపిస్తోంది. అభినందనలు.

 5. బాగా వ్రాసారు. జీవితంలో కొన్ని సార్లు నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం !

 6. బాగుందని ప్రత్యేకంగా చెప్పఖరలేదనుకుంటాను. ఇటువంటి అర్బన్ డైలమాల గురించి నువ్వురాస్తే చాలా అధికారికంగా (authentic) కనబడుతాయి.

  ఒక సూచన. కథ శీర్షిక కథలోని “పంచ్ లైన్” అవ్వటం మూలంగా రావాల్సిన ‘కిక్’ కొంచెం తగ్గినట్లనిపిస్తోంది. కథాగమనంలో ఆ మాట విన్నప్పుడు ఒక్కసారి గుండె గుభేలు మనాలి. అది జరగడం లేదు. అందుకే కాస్త కథనంలో దాని ప్రాముఖ్యతని మరింత పెంచడమో లేక శీర్షికను కొంచెం మార్చడమో చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించు.

 7. టైటిల్, పాత్రల ఆవిష్కరణ చాలా బాగున్నాయి పూర్ణిమ..

  అమ్మకు దూరం అయిపోతున్నా అనుకునేందుకు చాలా కారణాలే ఉంటాయి పిల్లాల్లో…. తోటి పిల్లలతో వాళ్ళ అమ్మలు, నాన్నలు ఎలా ఉంటున్నారూ అనేది కంపేర్ చేసుకుని కూడా ఒక్కో సారి ఇలాంటి అభద్రతలకు లోనవుతారు. భవిష్యత్తులో జరిగే సంఘటనల బట్టి వాళ్ళు ఎలా మారతారనేది డిసైడ్ అవుతుంది. క్రమశిక్షణలో పెంచాలి అనుకున్న తల్లులకు ఇదో గట్టీ సవాల్. చాలా సున్నితైమైన కాన్సెప్ట్ ఇది. ఆ దూరం కెరీర్ పరంగా పెరిగినప్పుడూ దాన్ని కరిగించటం చాల తేలికే అని అనిపిస్తుంది నాకు. అదే మానసికంగా ఐతే…..?! ఆ భావం మనసులోంచి ఎప్పుడు, ఎలా తొలిగేది?? ఊహకే భయంగా అనిపిస్తున్న ఇలాంటి సందర్భాలూ నిజ జీవితంలో ఎన్నో ఉన్నాయి.

 8. ఏమి చేస్తాం? సమాధానాలు లేని ప్రశ్నలు – ఆలోచించడానికి సమయం ఇవ్వని పరుగులు – తరచి చూసుకోడానికి పడే భయాలు – ముందుకు పరిగెడుతున్నామనే భ్రమలు – గమ్యం తెలియని గాభరాలు – అన్నీ కలిపితే నవీన నగర నరులు.
  పూర్ణిమగారూ – అభినందనలు.

 9. very good narration..

  అమ్మా!! నేను కామెంటు రాస్తా…కాస్త ఫ్రీక్వంట్ గా బ్లాగ్ చెయ్యవా??:P

  –Vamsi

 10. బావుంది. ఇదే మొదటి రచన అని అనుకొంటా. అయినా చెప్పాలనుకొన్న విషయం చాలా సుతిమెత్తగా, హృదయాన్ని తాకేలా ఉంది. చదువుతున్నంతసేపు ఆ సంఘటన నా కళ్ళ ముందే జరుగుతున్నట్లుగా ఉంది. కాకపొతే కొంచెం (?) లాజిక్కులు ఆలోచించకుండా చదివితే బావుంటుందని నా అభిప్రాయం. ఒక లాజిక్కు చెప్పనా? (మృదుల సోఫాలో రెండు కాళ్ళు పైకి పెట్టి కూర్చుని, రెండు చేతులతో మోకాళ్ళని చుట్టి, తలను దాచేసుకుని ఏడుస్తోంది. శరత్ రెండడుగుల దూరంలో అసహనంగా, ఆయాసంగా కదులుతున్నాడు. ఆమె కన్నీరాగడం లేదు, అతని కాళ్ళాడడం లేదు. ఓ రెండు మూడు నిముషాలు అలాగే తిరిగాక, ఇక లాభం లేదనకుని, ఆమె ఎదురుగా నేల మీద కూర్చున్నాడు ఆమె తలను నిమురుతూ.) కింద కూర్చొని పైన కూర్చొన్న వారి తల నిమరడం ????. ఇదేదో తప్పులెంచే ప్రయత్నం కాదు అని అర్ధం చేసుకోగలరని మనవి.

 11. పూర్ణిమ గారూ!,
  “ఏమో.. నాకూ ఏమీ తోచడం లేదు. అమ్మకి కొన్నాళ్ళు దూరంగా ఉంటే పూర్తిగా దూరమైపోతామేమో అన్న బాధ నాకు తెలుసు. అమ్మని చూడాలనిపిస్తుంది” అంటూ ఆమె భుజంపై తల ఆన్చాడు”
  ఈ వాక్యం నాకు బాగా నచ్చింది. ఈ భావాన్ని ఈ కథలో మీరు అనవసరం గా వాడేశారే అనిపించింది. ఈ కథకి ఈ వాక్యం లేకపోయినా పర్లేదు. ఎందుకంటే పిల్లాడిలో వున్నది exact గా ఈ భావం కాదు. అయితే శరత్ లో వున్న ఈభావాన్ని కథాంశంగా తీసుకుని మరో కథ వ్రాస్తే బాగుంటుంది కదూ!

 12. చాలా బాగుంది. అస్మిత గారి కామెంటు వద్ద ఆలోచనలు మరో మలుపు తిరిగినయ్.
  కేరీర్ నీ, మాతృత్వాన్ని బాలన్స్ చేయటం ఒక్కోసారి కత్తిమీద సామే.
  ఈ ప్రక్రియలో ఎంతమంది తల్లులు, పిల్లలు మానసికంగా నలిగిపోతున్నారో. ఇది మాత్రం పచ్చిం నిజం.

  ఈ డైలమ్మా ని చాలా అద్బుతం గా ఆవిష్కరించగలిగారు.

  పరిష్కారాలు చెప్పకపోవటం కూడా కధాగమనంలో ఒక టెక్నిక్కే కదూ. ఎవరి దృక్కోణాలు, అనుభవాల ఆధారంగా అన్వయించుకొనే అవకాశం ఉంటుంది.

  ఎప్పుడో ఒక కవితలో అన్న మాట (సొంత డబ్బా అనుకోకూడదు మరి)

  ఏకకాలంలో మంచుపూల వర్షాన్ని
  వడగాడ్పుల ఉక్కపోతనీ సృష్టించగల
  సంక్లిష్టతలజీవనాన్ని ఎదుర్కోవటానికి
  ఇంత తెంపరితనం అవసరమేనేమో!

  అభినందనలతో
  బొల్లోజు బాబా

 13. John Lennon said “You may say I’m a dreamer… but I’m not the only one..”

  The problem with your characters is… they don’t exist in real world.
  They seem to belong to some kind of “Utopian” world.

  Hope someday the world’ll join us 😛

 14. అప్పుడెప్పుడో, ఎవరో ఆంధ్రజ్యోతిలో రాసిన కధ మీద పెద్ద చర్చ జరిగింది. అందులో ఒక చిన్న పిల్ల, “నేను” పాత్రలు. ఆ పిల్ల ద్వారా కులం గురించి చర్చ. ఇక్కడ ఈ శీర్షిక చూడగానే, ఆ కధ మదిలో మెదిలి, మళ్ళీ ఆ గొడవ ఎందుకని మూడు, నాలుగు సార్లు, కూడలి లో కనపడినా ధెయిర్నం చెయ్యలేక అటు నుంచి అటే..వంశీ గారి వ్యాఖ్య ఇప్పుడు ఇక్కడికి లాక్కొచ్చింది. పెద్దలు అందరూ తమ తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. ఇంత ఉపోధ్గాతం ఎందుకంటే పూర్తిగా చదివించింది. ఇంకా బాగా వ్రాయవచ్చు. ఆపేయ్యవద్దు.సరేనా?

 15. బాగా రాసావు పూర్ణిమా. వ్యక్తిగత జీవితాన్ని, వృత్తి జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ సాగటం ఆడవారికి కత్తిమీద సామే.

  అస్మిత గారు, ఇదేం బూతద్దం లోంచి చూడటం కాదు, ఉద్యోగం చేసే ప్రతి స్త్రీకి ఇలాంటి సమస్యలు ఉంటాయని కాదు కాని ఇలాంటి సమస్యలు ఉండే స్త్రీలు కూడా ఉంటారు. ఇలాంటివి చాలా సున్నితమైనవి.

 16. మంచి కధ. బాగా రాసారు.

  ఇలాంటి కధల్లో పరిష్కారాలు చెపితే కధ మొత్తం తేలిపోయే ప్రమాదం ఉంది.

  good work.

 17. చాలా బాగా రాసారు.చాలా బాగా రాసారు.ఇటువంటి సమస్యలనుండి బైట పడడానికి కొన్ని “టైం మేనేజెమెంట్” కోర్సులు తప్పనిసరి.

 18. అద్భుతం గా రాసారు పూర్ణిమా.నేనలా కాదులే అని ఎంత అనుకున్నా ఎక్కడో అపరాధ భావం నన్ను వెంటాడుతుంది.

 19. సమస్య కొత్తది కాకపోయినా అది చెప్పిన తీరు చాలా బావుంది పూర్ణీ! ఈ సమస్యకి పరిష్కారం ఎదురుగా కనబడుతూనే ఉంటుంది.. కానీ అది ఆచరించడానికి కుదరని కారణాలు ఒక్కో కుటుంబానికి ఒక్కోలా ఉంటాయి.. అలా ఏ ముగింపూ ఇవ్వకుండా వదిలేయడం ఇంకా నచ్చింది! Good job!

 20. రిషి, చైతన్య, పఫుల్ల, మురారి, ఉమా శంకర్, శ్రీ : వ్వాఖ్యాన్నించినందుకు నెనర్లు!

  అస్మిత: A magnifying glass is surely a bad option, just as overlooking such sensitivities is. Are you sure that a problem is a problem, only when all face it? Let me know your thoughts.

  కొత్తపాళీ గారు: Tell you what, it is some work not to let the big, fat EGO walk into the story. 🙂 ధన్యవాదాలు!

  మహేశ్ గారు: మీ సూచన గురించి ఆలోచించాను. కథలో మాత్రం ఆ వాక్యాన్ని అంత కన్నా నొక్కి వక్కాణించి చెప్పదలచుకోలేదు. శీర్షిక శ్రద్ధ పెట్టుండాల్సిందన్నది వాస్తవం. నెనర్లు!

  మోహన: నువ్వన్న ఆ మానసిక దూరాన్ని గురించి ఆలోచించి ఉన్నాను ఇప్పటికే! బుర్రలో ఊరుతోంది ఆ విషయం.

  చివుకుల గారు: బాగా చెప్పారు. ముఖ్యంగా ఈ రెండు..
  తరచి చూసుకోడానికి పడే భయాలు – ముందుకు పరిగెడుతున్నామనే భ్రమలు
  నెనర్లు!

 21. వంశీ: Amidst all of the chaos the day had in store for me, your comment has lit up the constant smile on my face. In ways, it is hilarious. Thank you!

  ప్రతాప్: లాజిక్కులు లేకుండా చదవాలన్న అభిప్రాయం పై నేనేమీ చెప్పదల్చుకోలేదు, నాకే అయోమయం కనుక. హమ్మ్.. మీ అనుమానానికి జవాబు, ఒక పొడగరి నేల మీద నీల్ డౌన్ చేస్తే, సోఫా పై తల వాల్చుకూర్చున్న ఆమె తల నిమిరేంత ఎత్తులో ఉండగలడనుకున్నాను. దృశ్య చిత్రనలో తడబడినట్టున్నాను. ధన్యవాదాలు.

  శ్రీ వల్లీ రాధిక గారు: 🙂 వృధా అని నేననుకోవటం లేదు, మీకంతలా నచ్చేశాక అది వృధాగా ఎందుకు పోయింది? ఊ.. దాని మీద కథ మాత్రం ఖచ్చితంగా రాయచ్చు!

  బాబా గారు: వాహ్.. వాహ్!(మీ కవితకు)

 22. Motorolan: >> Hope someday the world'll join us 😛

  You mean the characters in the story would join your (our, if u included me) world?

  అదే అయితే జనజీవన స్రవంతిలో కలిసే ఉద్దేశ్యం ఇప్పటిలో లేదు అధ్యక్షా! (జల్సా సినిమా చూసి కూడా) :-))

  సీరియస్ గా చెప్పాలంటే, మీరింక్కాస్త ఉప్పందిస్తే గానీ, మీ సూచన గురించి నేను ఆలోచించలేను.

  వరూధిని గారు: నమస్తే!

  రాధిక గారు, నిషీ: థాంక్స్!

 23. పూర్ణిమ గారు నా బ్లాగ్ లోంచి మీ బ్లాగ్ కు లింక్ ఇచ్చుకోవచ్చా? మీరు అనుమతి ఇస్తారా ?

 24. నెటిజన్ గారికి: మీకీ టపా చూసి, ఆ కథా-చర్చ గుర్తు రావటం ఆశ్చర్యంగా ఉంది. ఏది ఏమైతే మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు.

  కథ ఇంకా చాలా బాగా రాయచ్చు. ఆ విషయంలో నాకెలాంటి అనుమానాలు లేవు.

  ఇక రాయడం ఆపద్దు అన్న దాని మీద నేనేమి చెప్పలేను. సమయం, మనసూ ఉన్నంత వరకూ ప్రయత్నిస్తాను. మీ వ్యాఖ్యకి మరోసారి ధన్యవదాలు!

 25. చాలా బాగా వ్రాశావు పూర్ణిమా, అందరూ చెప్పేసారు నాకు చెప్పడానికి ఏమి మిగలలేదు. అయినా అవే మాటలు మళ్ళీ చెప్తా… మహేష్ అన్నట్లు శీర్షిక వేరే పెట్టి ఉంటే ఇంకొంచెం గట్టిగా తగిలేది. అలానే పరిష్కారం చెప్పకుండా ముగించడం చాలా బావుంది.

 26. Hmm, that means hope the world joins us “the dreamers”, someday.

  I know that isn’t going to happen, nevermind 🙂

  (Sorry took the liberty of including you in ‘us’)

  నాక్కూడా ఇప్పట్లో జనజీవన స్రవంతిలో కలిసే ఉద్దేశ్యం లేదు 🙂

 27. చాలా బావుంది పూర్ణిమా,
  తల్లి పడే వేదన కళ్ళకు కట్టినట్టుగా ఉంది. అది చదువుతుంటే నాకు ఏడుపు వచ్చేసింది తెలుసా?

  @ప్రతాప్, నువ్వు తెలుగు సినిమాలు చూడవా? అవి చూసే వాళ్ళు లాజిక్కులు ఆలోచించడం మర్చిపోతారు. అయినా ఇంత మంచి పాయింటుని చూడక లాజిక్కులు అంటూ మాట్లాడుతావేంటి నువ్వు?

 28. కథానిక చాలా బాగుంది. మొదటి కొన్ని వాక్యాల్లోనే పాత్రలు కళ్లముందు కనిపించేలా బాగా రాశారు.

  ఇలాంటి నాణ్యమైన టపా ఏదైనా రాశాక, ప్రచురించే ముందు ఒక సారి జాగ్రత్తగా చదివితే పాఠకులకు మరింత మంచి అనుభూతిని అందించవచ్చు అని తెలిసినా నాకా ఓపికుండదు.

  మీరూ అలాంటి పనే చేశారనిపించింది. ఉదా:
  “అప్పటి వరకూ కనిపించని ధైర్యం …”
  “ఏడ్చి ఏడ్చున్న కళ్ళను నిలవలేమంటుంటే …”

 29. రానారె గారు: ప్రత్యేక ధన్యవాదాలండీ! కారణాలు ఏవైనా ఇలాంటి క్షమార్హం కావు. ఓప్పిగ్గా చదివి పంచుకున్నందుకు ధన్యవాదాలు.

  “నాణ్యమైన..” ?? – I’m dumb 🙂

  వేణూ, కల, సిరి, అనానిమస్( rare honour of being the first anonymous in my blog 😉 ): ధన్యవాదాలు!

  motorolan: 🙂

 30. Are you talking about the same generation of parents who have been converted from loving and caring parents to “RESPONSIBLE” parents….

  look at the sentence “నువ్వు రెంటినీ కలిపి చూస్తున్నావు. నీ కెరీర్ ని వాడిని కలిపి చూడడం మానెయ్యి. డబ్బు మాటెత్తుకు ప్లీజ్! డబ్బులు కోసమే అయితే నేనూ నీలా ఊర్లు పట్టుకుని తిరిగే ఉద్యోగం చేస్తూ లక్షలు సంపాదిస్తూ, వీడిని ఏ బోర్డింగ్ స్కూల్లోనో పడేసే వాళ్ళం..”
  Wow parents are doing great favors to children these days.
  any way conclusion is simple. You get what you give………..

 31. vaastavikatanu chakkagaa vivarinchaaru. chala mandi angeekarinchaka povachhu kaani, vaastavaaniki Stree yokka pradamika bhadyata….Talli post.
  ee rojullo adi venuka tattu tadutundi. anduke samaajam gati tapputundi

 32. పూర్ణిమా,
  ఏం చెప్పాలో తెలీడం లేదు. ఇటువంటి డైలమాలో పడి ఒక పీజీ, ఒక ICWA చదివి కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చి(100 శాతం నా ఇష్టంతో, వ్యక్తిగత స్వేచ్చతో) హోం మేకర్ గా స్థిరపడ్డ నేను ఏం రాయాలో తెలీని డైలమా లో కూడా పడ్డాను ఇప్పుడు. దీనిమీద ఒక టపా రాయలనిపిస్తోంది. ఉద్యోగం వదిలి గృహిణులుగా మిగిలిన వారి హృదయ స్పందన గురించి!

 33. Rajesh: I’m not talking about any “generations” here. It’s all about two individuals and their problem. Now, if that doesn’t seem a problem or you don’t like it, it should be absolutely fine with you and as well as me.

  Wow parents are doing great favors to children these days – I can read only sarcasm in this. Was that so?

  Well, I liked your conclusion, yes, you get what you give. Just like, you see, what you want to see.

  Thanks for the comment.

  శ్రీపాద వల్లభ: ఇప్పటి స్త్రీలకి కుటుంబం ఎంత ముఖ్యమో, కెరీర్ కూడా అంతే ముఖ్యం. నా ఉద్దేశ్యం ప్రకారం స్త్రీల కాంట్రిబ్యూషన్ సమజానికి అవసరం. కాకపోతే ఈ సర్దుబాటులో అప్పుడప్పుడూ తడబడవచ్చు. This was all about lingering in a moment. ఆ తర్వాత ముందుకే పోతాము.

 34. సుజాత గారు: వేచి చూస్తాను మీ టపా కోసం. ఇది కేవలం నా ఊహ మాత్రమే! నిజంగా ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుంది.

 35. పూర్ణిమగారు,
  హత్తుకొనేలా ఉంది కథ.
  ఈ విషయంలో అనేక కోణాలున్నాయి. వ్యక్తిగత, సామాజిక అంశాలు రెండూ ఉన్నాయి. అది దీని సంక్లిష్టతకి కారణం. పైపెచ్చు “అసలిది ఒక సమస్యా?” అన్న సందేహం కూడా ఇప్పుడిప్పుడు పుడుతున్నదే.
  :సొండ మొదలు
  మీ అంత బాగా(మనసుకు హత్తుకొనేలా) రాసానని చెప్పలేను కాని, ఈ విషయమై మరికొన్ని కోణాలు నా చిలక-గోరింక కథలో ఆవిష్కరించడానికి ప్రయత్నించాను. ఆసక్తి ఉంటే చదవండి.
  :సొండ అంతం

 36. Balancing career and life of a woman might be difficult, but not impossible. And these wither winds is what makes it more satisfying, to be successful, both as a carer woman and as a mother. And, I guess it has got to do more with the up bringing, in letting the children to look upto their parents and understand their responsibilities too.

  Somehow, I cannot help but say that the story lacked completion. But, that is just a feeling.

  The narration is fabulous though. Just the anguish of a mother, in simplistic words.

 37. Thanks…thanks for visiting my blog and leaving you comment..
  అసలు నేను బ్లాగ్ స్టార్ట్ చెయ్యడానికి కారణం మీ..”ఊహలన్నీ ఊసులై”.. ఎన్నో సార్లు కామెంట్స్ పోస్ట్ చేద్దామనుకున్నా… కాని కొంచెం బద్దకం ఎక్కువ..(క్షమించాలి).. ఇవ్వళ కూడా మీ ‘అమ్మా! బొమ్మ కొనిస్తా, నాతో ఉంటావా?’ చదివానండి, చాలా బాగుంది. సమకాలీన సమస్యల్ని మీరు భలే చెప్పేస్తారు.. ఉపమానాలతో.. 🙂
  భలేగా ఉంది చూసారా..!
  మీ పేరు నా పేరు… రెండింటి భావాలు ఒకటే..నో చీకటి… 🙂

 38. I expected the same response.I think we are looking at same coin from different sides. But i know there is a other side too.

  anyway that thing i said pure sarcasm only.bcoz that sentence irritated me like anything. Because father is not doing any favor by not putting son in hostel. He will be the one who will be lost then. I cant be diplomatic with friends hence i wrote sarcastically.
  take care

 39. A true mirror image of present day situation . This is something every working mother has to face . It is very sad when we see people in such situations . Narration is good . But it doesn’t hit hard . Do not stop at this . You have it in you . Read , read , read , read and keep reading and you will definitely come out with better presentation .

 40. “ఇంకా ఎక్కువ సేపు ఉంటే నేను వీడిని విడిచి పోలేను, వాడిని తీసుకొని నువ్వు వెళిపో అమ్మా” అంటూ నా చెల్లి రెండు నెలల పసిగుడ్డును అమ్మ చేతిలో పెట్టి తన ఉద్యోగం నిలుపుకునేందుకు బెంగుళూరు వెళ్ళినప్పుడు, అంతకు ముందు వాడికి పోత పాలు అలవాటు చేయాలని ఒక రోజంతా గుక్క పెట్టి ఏడుస్తున్నా పట్టించుకోక పాలు “పట్టక”, కంట నీరు గుక్కుకున్నప్పుడూ –చూసా ఈ బాధా ఈ వ్యదాను-మళ్ళీ ఇప్పుడు.

 41. ఈ రకం నైజం ….అంటే అది, ఇదీ రెండూ కావాలి అని అనుకొనే వాళ్ళనే, ఈ మన తరం వాళ్ళనే, నేను “సంధి కాలం మనుషులు” అని అంటాను. దాని మీద నేను రాసిన కథ ఇక్కడ.

  http://drbr1976.blogspot.com/2008/01/blog-post_23.html
  (చాలా వరకు సొంత డబ్బానే కొట్టుకున్నా నాకు ఈ విషయం పై తోచిన కొన్ని అభిప్రాయాలను ఇక్కడ కెలికేసాను.)

  ఇక్కడ అమ్మ లోటు తెలుస్తోందంటే నా ప్రకారం కొంత తండ్రి “తన వంతు” చేయక పోవటం కూడా కారణమే అని నా అభిప్రాయం. ఈ “తన వంతు” ఎంత, ఏమిటి, అనేది ఆ ఆలు మగలు కలిసి నిర్ణయించుకోవాల్సినది.

  నిజమే, రచనలలో సమస్యా పరిష్కారం చూపెట్టకపోవటం కూడా గొప్పతనమే—-ఇప్పుడు అర్థమయింది ఆలోచిస్తే. ముఖ్యంగా ఇలాటి పర్సనల్ సమస్యలకు one size fits all పరిష్కారం అంటూ ఉండదు. ఎవరికీ వారు, తమకు తాము ఏర్పాటు చేసుకోవాల్సినదే కదా. మంచి పాయింటును గమనించి రచయితలకు ఎత్తి చూపిన కో పా గారికి థాంక్స్.

 42. చాలా చక్కని కథనం. శ్రద్ధగా చదివేందుకు ఇన్నాళ్ళు పట్టింది. అలాగే చదవాలి మరి.
  థాంక్స్.

 43. కామేశ్వర రావు గారు: టపా చదివి వ్యాఖ్యాన్నించినందుకు ధన్యవాదాలు. మీ కథ చదివానండి. “ఇది కూడా సమస్యేనా?” అని పరిస్థితిని అదుపులో ఉంచుకున్న వాళ్ళు అంటే ఫర్వాలేదు. కానీ ఇది అసలు సమస్యే కాదని “ignore” చేస్తే మాత్రం కష్టమే!

  మహి: హమ్మ్.. కథ మధ్యలో అయితే ఆపలేదు, అలా అనిపిస్తే మాత్రం అది నా తప్పు! 🙂

  నిశాంత్: Now, that’s a huge compliment! All the very best, with your blog!

  చారుమతి గారు: వ్యాఖ్యాన్నించినందుకు ధన్యవాదాలు! చదువుతున్నానండీ, రాయడానికి కాదు.. రచనలు ఆస్వాదించడానికే! మరో మారు నెనర్లు!

  గీతాచార్య: నెనర్లు!

 44. భావకుడన్ గారు: మీ మొదటి వ్యాఖ్య నా ప్రయత్నానికి నిజంగా దగ్గరగా ఉంది. నేనిక్కడ తడబడ్డానో లేక ఇలాంటి వాటికి “respond” అవ్వటం మెలొడ్రమాటిక్ అనుకుంటున్నారో, ఇప్పుడు నేను అర్థంచేసుకోవాల్సిన విషయం. నేనొక సీను డెపిక్ట్ చేయకుండా, full fledge characters ని డెవెలప్ చేసుంటే ఇన్ని అనుమానాలు రాకపోను.

  ఇక “సంధి కాలం” మనుషుల గురించి, ఈ టపా నేను చదవలేదు కానీ, మీరే ఒక చోట అన్నారు మీ టపాల్లో “ఇది మీతో మొదలయ్యింది కాదు, మాతో ఆగేది కాదు!” అని, పట్న వాస వలసల గురించి అనుకుంట. ఎంచుమించు అదే ఇక్కడా చెప్పుకోవచ్చు, ఇలా అంటే ఇలాంటి ప్రశ్నలే కాకపోయినా, ప్రతీ తరానికి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు తప్పవు. మీ టపా చదివి చెప్తా నా మిగితా అభిప్రాయం.

  వ్యాఖ్యాన్నించినందుకు నెనర్లు!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s