అక్షరానుభవాలు!


అక్షరాలతో తొలి పరిచయం గోడ వేలాడదీసిన కాలెండర్లో తెలిసున్న వాటి పక్కనే అర్థంలేని అకారాలుగా! అక్షరమేంటో గుర్తుపట్టమన్న ప్రతీసారి పోల్చలేక, పోల్చీ చెప్పలేక తడబాటు! నల్లని పలక మీద తెల్లని బలపంతో అమ్మ గుప్పిట్లో దాగిపోయిన నా వేళ్ళు నెలపొడుపులా ఉన్న అక్షరాల్ని కాస్త నిండు పున్నమిగా చేసేయటం నా ప్రస్థానంలో మరో అడుగు. తప్పుగా రాసేసి అమ్మ తిడుతుందనే భయంతో ఎంగిలి పెట్టి వాటి తుడిపేయ్యడం. “పలక సరస్వతీ దేవి, అలా చెయ్యద్దని చెప్పానా?” అంటూ అమ్మ వేసే చిన్ని దెబ్బ! రాత్రి అయినా అలక తీరని నన్ను బొజ్జునే ముందు బుజ్జగించటానికి అచ్చమైన నల్లటి ఆకాశం మీద నక్షత్రాలను చూపిస్తూ అమ్మ చెప్పే కథలో అతిధి పాత్రలో అక్షరాలు రావాల్సిందే; “ఆఆఆ.. చుక్కనీ……ఈఈఈ చుక్కన్నీ ఇలా కలిపితే “అ” కదమ్మా!” అంటూ! సాన్నిహిత్యం ఎందాక వచ్చిందంటే పలకను తిరగేసి, కళ్ళు మూసేసుకుని చింతగింజలూ, చిన్ని రాళ్ళూ, గవ్వలూ, పల్లీలు అన్నీ అక్షరాలుగా మారిపోయాయి. అక్షరాలుగా పేర్చాక వాటి చుట్టూ ఎంత కాపలా కాసినా ఎప్పుడో చిట్టుక్కున చెరిగిపోతాయి. అక్షరాలు ఎందుకో ఊరికే చెరిగిపోతాయి మరి!

“బేబీ.. టెల్ మీ అ, బి, సి..” అని అడిగిందే తడువుగా ఏకరవు పెట్టి మరీ బళ్ళో చేరాను. అమ్మ నేర్పిన అక్షరాలే కొత్తగా పేద్ద పలక మీద టీచరు రాస్తుంటే చిన్ని పుస్తకంపై నేను రాసుకోవాలి. పెన్సిల్ తో రాస్తూ ఎంగలి కూడా అవసరం లేకుండా వత్తిడితో మాయమయ్యే అక్షరాలు, పోతూ పోతూ చేతికంటుకుపోతాయి. పేజీలు తిరగేసట్టప్పుడు మళ్ళీ పేజీల్లో దాక్కుండిపోతాయి. కానీ “నీట్”, “గుడ్” రావాలంటే ఇవేమీ చేయకూడదు కదా! ఒక్కో అక్షరం నుండి అక్షరం అక్షరం కూడుకుని చదువుకుంటూ అక్షరాల్లో మునిగి తేలి అక్షరాల్తో విడదీయరాని బంధం ఎప్పుడు ఏర్పడిందో! తెలుసున్న అక్షరాలే అయినా, రోజూ రాస్తున్నవే అయినా పెన్నులో ఇప్పుడు కొత్తగా ఉన్నాయి. నాన్న రాసే పెన్నులాంటిదే కావాలి.. ఇప్పుడు నాన్నా నేనూ ఒక్కటే మరి! బాల్ పెన్నుతో అక్షరాలు పొమ్మన్నా పోవు. బతిమిలాడుకున్నా పోవు.. జీవితంలో తప్పుల్లా అక్కడే ఉండి వెక్కిరిస్తాయి. కొన్ని చెరిపేయాలనుకున్నా చెరగవు అంతే!

ఆడపిల్ల అందం చీరలోనే అట- అమ్మ చెవిలో ఇల్లు కట్టి మరీ పోరుతుంది. అదేమో గానీ అక్షరాల అందం అంటే:  తెల్లని కాగితంపై నీలపు సిరా మనసునుండి కలంలోకి జాలువారి అక్షరాలుగా తెల్లని ఆకాశంలో నీలి నక్షత్రాలు. కామిలిన్ వాడి గొప్పో ఏమో తెలీదు కానీ మనసులో ఆలోచనలూ, కాగితం పై చేయీ, కలంలోంచి సీరా అలా సమాంతరంగా వెళ్తూ వెళ్తూ ఏదో క్షణాన సంగమించిన వేళ అరవిరిసిన చిర్నవ్వో – కరిగిన కన్నీరో ఎంత అనుభవం! జీవితపు కొలనులో కురిసిన అనుభూతల వర్షమే కదా.. ఈ అక్షర స్వాతి ముత్యాలు. అయితే ఆత్మీయ స్పర్శ లేకపోతే మనసైన అక్షరం – మనసును లాలించగలిగేవి ఈ రెండే! మార్కుల కోసమే మొదలయ్యినా విడదీయలేని ఈ అక్షరాలని నా స్నేహాలన్నింటికీ మూలం చేసేసి ఎన్నేసి ఉత్తరాలు? ఎన్నేసి రాయబారాలు? నాకోసమే ఎన్నెన్ని మైళ్ళు పోయిరాలేదు, కాగితాన్ని చుట్టుకుని! తడిచిపోయి- మాసిపోయి-పల్చనైపోయి-ముక్కువాసన కొట్టీ అయినా ఇప్పటికీ అలానే ఉండిపోలేదూ?

ఎలా అయినా అక్షరాలు మాయమయ్యిపోతూనే ఉంటాయనుకుంటుండగా కంప్యూటర్ వచ్చింది. అంజర్జాలంలో మొదట తెలుగు చూసిన వేళ – ఆనంద హేళ! ఇంకేం డిజిటల్ అక్షరాలు ఎప్పటికీ దాచేసుకోవచ్చు- ఎక్కడికీ పోవనుకుంటూ మర్చిపోయిన పాత ఫ్రెండుకి కొత్త పేరిచ్చి ఇక్కడ ఇలా! ఇప్పుడూ పోతాయి – ఒక క్రాష్, ఒక బ్రేక్ డౌన్ అంతా మళ్ళీ మాయం. అక్షరాలెప్పుడూ చెరిగిపోతాయెందుకు? అక్షరాలు అక్షయం కా(లే)వా? ఏమో.. దానికి నా దగ్గర సమాధానం లేదు కానీ అక్షరాలు తెచ్చే అనుభూతులు మాత్రం ఎప్పటికీ అక్షయమే! కేవలం అక్షరపునాది పైన ఎన్నెన్ని అనుబంధాల సౌధాలు నిలబడ్డాయో! అక్షరాల వెనుక మనస్సుని ఎన్నెని హృదయాలు చదువుతాయో! అక్షరాలతో నా స్నేహం ఇంకెన్ని కొంత పుంతలు తొక్కుతుందో.. కాలమే చెప్పాలి. అందాకా అక్షరాలు మీద ఆప్యాయత ఇలా వచ్చీ రానీ అక్షరాల్తో ప్రకటించుకోవడమే నేను చేయగలిగింది. ఇంకొన్ని అక్షరాలు అక్కరికి వస్తే బాగుణ్ణు కదూ!!

Advertisements

అమ్మా.. నాన్నని చూడు..


“భూఉఉఉఉఉఉ…..”

“అమ్మో.. !” “ఇహిహి..హహ.. భయపడ్డావ్..భయపడ్డావ్!”

“పో రా.. నేన్నీతో మాట్లాడను పో! నాతో ఏం ఆటలాడక్కరలేదు.”

“ఏం?.. ఊ?”

“ఏంట్రా బెదిరిస్తున్నావ్? అమ్మ ఒక్కత్తే పని చేసుకుంటుందే, చెల్లి చిన్నారి నీళ్ళల్లోకి వెళ్ళిపోతుందే.. కాస్త దాన్ని ఆడిద్దాం అని ఏమన్నా సాయం చేస్తావా? నాతో మాట్లాడక..”

“నువ్వేమో టామ్ ఆన్ జెర్రీ వస్తున్నప్పుడే పిలుస్తావ్? ఓన్లీ థర్టీ మినిట్స్ కదమ్మా!”

“మనకి నీళ్ళొచ్చేదీ ఆ థర్టీ మినిట్సే కద నాన్న!”

“…”

“ఏంటో.. అంతగా ఆలోచిస్తున్నావు?”

“అదే.. నీళ్ళు, టామ్ ఆన్ జెర్రీ ఒక్కసారి రాకపోతే నేను చెల్లిని ఆడించచ్చు కదా?”

“ఊ.. నిజమే! కానీ ఎలా?”

“ఏముందీ నువ్వు నాకు అన్నీ టామ్ అన్ జెర్రీ సి.డీలు ఇంకా ప్లేయరూ కొన్నిచ్చెయ్యి.. అప్పుడు.. ”

“అహా.. తెలివి!! తిరిగి తిరిగి అక్కడికొచ్చావ్ మాట.”

“మా ఫ్రెండ్స్ అందరి దగ్గరా ఉన్నాయమ్మా.. ప్లీజ్ నాకూ కొనివ్వవూ”

“హమ్మ్.. ఇప్పుడు కాదు. మీ నాన్న వచ్చాక కొనుక్కుందువులే!”

“….”

“మళ్ళీ ఏదో మాస్టర్ ప్లానా ఆ బుర్రలో!?”

“ఛా.. ఎందుకలా నా జుట్టు చెరిపేస్తావ్? మళ్ళీ నీట్ బాయ్ కాదంటావ్!”

“తప్పైపోయింది.. ఇంకెప్పుడూ నీ జుట్టు చెరపనులే..”

“అదో… చెరపనన్నావ్! నాన్న ఎపుడొచ్చేదీ?”

“వచ్చేస్తారులే.. అన్నం తింటావా?”

“ఊ! నాన్న చాలా రోజులు ఊరెళ్ళిపోతారేం? రిషీ వాళ్ళ నాన్న చూడు రోజూ ఇంటికొచ్చేస్తారు.”

“మీ నాన్న చేసే ఉద్యోగం అలాంటిది. ఇదో గ్లాసుతో నీళ్ళు తీసుకుని ముందు గదిలోకి పద! నేను అన్నం పెట్టుకుని వస్తా”

“నేను టివీ చూస్తూ తింటా..”

“సౌండ్ ఎక్కువ పెట్టకూ.. చిన్ని తల్లి లేచిపోతుంది. అమ్మగారు లేస్తే ఒక పట్టాన ఏడుపాపదు”

“అమ్మా… చూడు.. నాన్న ఫోటో టివిలో!”

“నాన్న ఫోటో టివీలో ఎందుకొస్తుందీ? మళ్ళీ ఆట్లాడుతున్నావా?”

“లేదమ్మా.. నిజంగానే! నాన్న ఫొటో.. మన నాన్నే!”

ఫ్లాష్.. ఫ్లాష్.. బ్రేకింగ్ న్యూస్: కరీంనగర్ శివార్లో ఒక పోలీసు మృతదేహం లభ్యమయ్యింది. ఇది ఎస్సై రామచంద్రం బాడీ అని గుర్తించారు. చనిపోయి ఇప్పటికే 24 గంటలు గడిచుంటాయని అనుమానిస్తున్నారు. నిన్న జరిగిన ఎదురుకాల్పుల్లో.. ”

“అమ్మా.. అమ్మా.. ఏమయ్యిందీ?.. లే అమ్మా..”

Life of Pi


( “అబ్బా మళ్ళీ ఇంకో పుస్తకమా? చదివేయటం.. రాసేయటం! ఇప్పుడు చదవాలా? ఎందుకు చదవటం.. ఎటూ పుస్తకాలు కొని చదివేంత లేదు! అదీకాక ఇలా పనులు కానీ పనులు పెట్టుకుంటే.. అసలైన పనుల పనేంగానూ?” అనుకుంటూ మీరీ టపా చదవకుండా వదిలేస్తే ఒక రకంగా మీరు అదృష్టవంతులు. కానీ ఈ పుస్తకం చదవకపోతే మీరెంతో కొంత మిస్సవుతారని రూఢీగా చెప్పగలను. )

నిద్రపోతున్నప్పుడు కలలు వస్తాయి. (మన ప్రమేయం పెద్దగా లేన్నట్టనిపిస్తుంది!) “అమ్మ పక్కనే కూర్చుని తలనిమురుతుందన్నట్టు” కలొస్తే అమందానందాలు. ” రైలెక్కి ఎవరో వెళ్ళిపోతున్నట్టు” కలొస్తే తీవ్ర దుఃఖం, నిరాశ. “ఎవరో వెంటపడి చంపడానికి వస్తున్నార”నే కలలో అంతులేని భయం, ఆవేశం, ఆయాసం! కల వాస్తవానికి చాలా దూరం, కలలు నిజమయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువ, అయినా కలలు మనల్ని అంతలా కదిలించడానికి కారణం “కలలో మనం కలకంటున్నామని మనకి తెలియక పోవటం!” ఉలిక్కి పడి లేచిన తర్వాత, పట్టిన చమటను తుడుచుకుంటూ, తడారిపోయినా గొంతులో కాసిన్ని నీళ్ళు పోసుకోడానికి పడుతూ లేస్తున్న వేళ గుచ్చుకుంటున్న కళ్ళల్లో నిద్ర కాస్త మాయమయ్యి, తెలివొచ్చి “ఓహ్.. కలే కదా!” అనిపించినా అప్పటి వరకూ పడిన  అనుభవం ఎక్కడికి పోతుంది? నిజం కాకపోయినా, మనం దానిని జీవించేశాము. సాక్ష్యాలుండవు కానీ, కొన్ని అనుభూతులో.. అలాంటివేవో మనతో నిలిచిపోతాయి. నిజం కాకపోయినా, కరిగిపోయేదైనా కలకున్నంత బలం మళ్ళా కలానికే ఉందేమో అన్నట్టుగా ఉందీ పుస్తకం నాకైతే! ఉన్న తెలివిని పక్కకునెట్టేసి రచయిత చేస్తున్న పదాల గారడీని నిజమని నమ్మించే ఒక రచన ఇది.

కథ: “ఓహ్.. ఒక కల గురించిన పుస్తకమా ఇది!” అని నిర్ణయానికి వచ్చేయద్దు. కథకీ కలకీ అసలు సంబంధమే లేదు. ఈ కథని క్లుప్తంగా చెప్పాలంటే – జూ వాతావరణంలో పెరిగిన ఓ కుర్రాడు, తల్లిదండ్రులతో కొన్ని జంతువులని తీసుకుని సముద్రం మీద వెళ్తుండగా, పడవ ప్రమాదానికి గురై అంతా మునిగిపోగా, ఒక పెద్ద పులి, ఒక జీబ్రా, ఒక చింపాజీ లాంటి జంతువు, ఒక కొరనాసిగండు (hyena) తో పాటు ఇతనూ ఒక బోటులో మిగిలిపోతారు. ఆ జంతువుల మధ్య, నడి సముద్రంలో ఈ కుర్రాడు ఎన్నాళ్ళు, ఎలా బతికాడు, అసలు తప్పించుకోగలిగాడా అన్నదే కథాంశం.

ఈ కథ మొదట్లో “దేవుడిపై నమ్మకం కలిగించే కథ” అని ఉంటుంది. “ఓహ్.. పుస్తకం పూర్తయ్యే సరికి నేను మహాభక్తురాలయ్యిపోతాను.. కాసుకో!” అని  కాసేపు మా అమ్మను ఉడికించి మరీ ఈ పుస్తకం చదవటం మొదలెట్టాను. చివరి దాకా చదవేను గానీ, నాకెక్కడా దేవుడి మీదకి దృష్టి పోలేదు. ఈ పుస్తకం గురించి ఒక్కటే ఒక్క మాట చెప్పాలంటే… “Man is a social animal” అని అర్థం అయినా కాకపోయినా  ప్రైమరీ తరగతుల నుండీ “చదువుకున్న”  ఆ ఒక్క వాక్యమూ చెప్తాను. ఈ పుస్తకంలో కథానాయకుడు ఒక పెద్ద పులితో ఉండడానికి ఒప్పుకుంటాడు కానీ ఒంటరిగా ఉండలేనంటాడు. ఇక ఆకలి మించినదేదీ లేదని.. విపరీత పరిస్థితుల్లో మనిషికీ, జంతువుకీ పెద్ద తేడా లేదని తెలుస్తుంది. దేవుడి మీద నమ్మకం అటుంచితే, మానవ మెదడనే పదార్థం ఆలోచించగలిగితే ఎంతటి విపత్కర పరిస్థితుల్లో అయినా బయటపడచ్చు అని తెలుస్తుంది.

రచనా విధానం:
నాకీ కథ చెప్పిన విధానం యమ గందరగోళంగా అనిపించింది. రచయిత చెప్పిన మాటగా ఈ పుస్తకం మొదలవ్వటంతో “పై” అనే వ్యక్తి జీవితంలో జరిగిన యధార్ధ గాధ అనుకున్నాను. తీరా చూస్తే మొదటి భాగంలో అక్కడక్కడా ఏదో చెప్పి మాయమయ్యిపోయి, మరలా చివర్లో వస్తాడు రచయిత. ఈ లోపు “పై”యే తన కథ మనకు చెప్పినట్టుంటుంది కథా శైలి. ఎందుకో అవసరం లేకపోయినా రచయిత కథలో దూరడానికి శతవిధాల ప్రయత్నించాడనిపించింది. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఫిక్షన్‍లో తాను చెప్పాలనుకున్నదంతా సాధ్యాసాధ్యాల ఆలోచనే రానివ్వకుండా తన పదాలవెంటే మనం పరుగులు తీసేలా చేయగలడు రచయిత. పుస్తకం చదివేశాక వెళ్ళి నా కొలీగ్స్ కి కొందరికి కథలో ఏమేం జరుగుతుందో చెప్పాను. వాళ్ళేదో కామెడీ సీను చెప్తున్నట్టు ఒకటే నవ్వు! నిజంగానే ఇది అతి అసాధారణమైన కథనం, నమ్మశక్యంగాని రచన. కానీ రచన చదివేటప్పుడు వీటికి అతీతంగా కేవలం రచయిత మాయలో పడిపోతాం.

ఎన్నో రోజులుగా ఆహారం లేని మనిషి తిండి ఎలా తింటున్నాడు అని చెప్పటం, గత్యంతరం లేక మనిషి వేట ఎలా నేర్చుకునేది, ఎలా చేపల్ని తినటం మొదలెట్టిందీ, అలా కొనసాగించి తనూ ఓ జంతువు తిన్నట్టు ఎలా తింటున్నదీ! ఆనంతమైన సముద్రాన్ని, అనంతాకాశాన్ని, నక్షత్రాలనీ, చేపల్నీ, పడవల్నీ, ప్రకృతినీ, మానవ మనో సంఘర్షణనీ, జంతువుల సహజ వ్యవహారికాన్ని అన్నింటినీ ఈ రచనలో అద్భుతంగా సృష్టించాడు. ఒక చోట ఒక పోలిక చెప్తాడు: “మనం అడవిలోనైనా సరే ఒక జీపులో వెళ్తూ అడవంతా చూసేసామనుకుంటే పొరపాటే. అడవిని పరిశీలించాలంటే కాలినడకనే వెళ్ళాలి. పసిఫిక్ పైనా పడవలో వెళ్తే దాని అసలు జంతు సంపదను చూడలేము. ఇక్కడా కాలినడకల్లే కొనసాగాలి” అని. ఈ పుస్తకం ఎంచుమించు అలానే కొనసాగి మనకి చాలా విషయాలు చెప్తుంది.

  అప్పటిదాకా చీకటిలో మగ్గిపోయున్న అతడు, తెల్లారి వెలుతురులో చూసిన సముద్రాన్ని ఇలా వర్ణిస్తాడు: “The calm sea has opened around me like a great book” అని. నాకైతే ఈ పుస్తకమే ఓ మహాసముద్రంలా నా మనోకాన్వాస్ పై విస్తరించి ఒక “అద్భుతాన్ని” నా కళ్ళముందు సృష్టించింది. అందులో జాలి, కరుణ, భయం, బాధ, చావు, ఆకలి, నమ్మకం, ఆశ, నిరాశ, భక్తి, యుక్తి లాంటివన్నీ ఒక్కోటే నన్ను చుట్టుముట్టి వాటి విశ్వరూపాన్ని చూపెట్టాయి. ఈ పుస్తకం మానసికమైన వత్తిడి కలగజేస్తుంది, ఒక పీడ కలలానే! అంతగా భయపెట్టినందుకు బాధపడాలో, కల మాత్రమేలే అని ఊరట చెందాలో తెలీనివ్వదు. అసలు పుస్తకమంతా చదివేశాక ఏది నిజమో, ఏది కాదో తెలీని అయోమయ స్థితి కూడా ఏర్పడవచ్చు. చదవాలనుకుంటే మాత్రం వీలైనంత సమయం చూసుకుని తీరిగ్గా చదువుకోవాల్సిన పుస్తకం. Like it or not, it would leave an impact on you!

బ్లాగు ప్రయాణం లో నేను: పూర్ణిమ


నా ఉద్యోగానుభవాన్ని ఓ రెండు ముక్కల్లో చెప్పమంటే “Extended College” అని చెప్తా. ఇంకో రెండు ముక్కలు జత చేసుకోవచ్చు అంటే “Extended College minus Internals” అని ముగిస్తా.:-))
నా బ్లాగానుభవాన్నీ అలానే చెపచ్చు, “Back to the School” అని! బడిలో ఏం చేస్తామో తెలియనిదెవ్వరికీ? పాఠాలు (తెలుగు నేర్చుకుంద్దాం అనుకున్నా, జీవితం కూడా తెలుస్తోంది కొంచెం కొంచెం గా) కాక ఆటలూ-పాటలూ (ఇక్కడ fun కీ, pun కీ ఏం కొదవని?), పాట్లూ ( నొప్పింపక తానొవ్వక నడవటం … బాబోయ్!) అంతా మళ్ళీ చెప్పకరలేదు కదా! కాకపోతే చిన్ని twist ఎంటి అంటే ఇక్కడ అన్నీ కంప్యూటర్ మీద కనిపించేకొన్ని అక్షరాలా ద్వారానే సాధ్యమవుతున్నయీ. మాటల్లో బోలెడు పవర్ ఉందని నమ్మే నాకే హాశ్చర్యం కలిగించేంత!

Thanks to one and all, who came my way as part of this journey! ఊహలన్నీ ఊసులుగా మార్చే ఈ ప్రయత్నాన్ని అభినందించీ, ప్రోత్సహిస్తున్న ప్రతీ ఒక్కరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు!

పూర్ణిమ

ట్రాఫిక్ జాం


మళ్ళీ ట్రాఫిక్ జాం! యుద్ధంలో అయితే భీరువో, వీరుడో, విజేతో ఎవరో ఒకరిగా మిగలచ్చు. చదరంగంలోనైనా, సరిహద్దుపైనైనా సిపాయికి వెనుకడుగుండదట. ట్రాఫిక్ లోనూ అంతే. కాకపోతే వారికి ముందుకెళ్ళే వెసలుబాటుంటుంది —  చంపడానికో, చనిపోవడానికో! ఇక్కడలా కుదరదు, ఒక్కటే సాధ్యమిక్కడ – ఇర్రుక్కోవటం! ముందో బెంజు కారూ, దాని పక్కనో డొక్కు వానూ. బైక్ మీద యువ జంట, పొగలు కక్కుతున్న ఆటో , పక్కనే ఉన్న కిక్కిరిసిన బస్సు ఒక మిని గ్లోబు. కారద్దంలో కనిపించే వాహనాలు వెంటాడే గతంలా. ఇంతలో ఏ సైకిలోడో, ఆంబీషియస్ బైకోడో మన చేతగానితనాన్ని మరీ ఎత్తి చూపిస్తుంటాడు. పాములా సరసర పాకెళ్ళిపోగలనే వాడి ఫోజు ఏ కారు అద్దానికో, డివైడరుకో ఘాట్టిగా తగిలి ముక్కలవ్వాలని మనసారా శపించనూలేము. దాని మూలాన చిన్న సైజు యుద్ధం మొదలైతే అపరాధ భావంతో దూకేయడానికి కదల్లేం. చచ్చినా కదల్లేం!! “ట్రాఫిక్ లో ఉన్న మీ కోసం ఈ పాటంటూ” ఎఫ్.ఎం వొలకబోసేది, “వస్తా, లేస్తా, రాస్తా, చస్తా” లాంటి పదాలని తిప్పి తిప్పి రాసిన అసలు సిసలు తెలుగు పాట. భరించాలి — అందర్నీ! అన్నింటినీ!!  చేతులకి స్టీరింగ్ తో ఆటలాడేంత నేర్పుంటుంది, కాళ్ళకి క్లచ్, బ్రేక్, ఆక్సిలరేటర్ మీద గుత్తాధిపత్యం ఉంటుంది. ఉండీ.. ఏం లాభం?

కదల్లేక అసహనం, కదలలేని అసహాయత, కదల్లేనే అని నిరాశ, కదల్లేకపోతున్నందుకు కోపం! గాలిలా పొగ, కీకీ మనే కాకిగోల హార్నల్లు, గలాటాలు, పాటల హోరూ, చమటా, ఉక్కా తల బద్దలయ్యిపోతుంది నాకు. మెదడులోని నరాలను సూదులతో గుచ్చుతున్నట్టంటూ వర్ణించలేని బాధ! ఆకాశానికి మొత్తం ఎర్రరంగు పులమలేక నీరసించి సూర్యుడెళ్ళిపోతున్నా, ఈ రెడ్ లైట్ మాత్రం ఎదుట నిలిచి వేధించే “ప్రస్తుతం”లా కళ్ళనీళ్ళు రాకుండా ఏడిపిస్తుంది. అది దారిచ్చిన క్షణాన మాత్రం కదిలే బొమ్మల్లా ఉన్న నా కాళ్ళకీ, చేతులకీ యాంత్రికంగా “కీ” ఇచ్చేసే నా మెదడు, ఇక ఆగాగియైనా ముందుకు పోవాలన్న నిశ్చయాన్ని వాటికి తెలుపుతుంది.   

రోడ్డు మీద సర్రున్న పోతున్నా, జాంలోనే ఉన్నాను. వాహనాలు కాదు నిలిచిపోయ్యింది, నా ఆలోచనల స్రవంతే స్థంభించిపోయింది! ఒక ఆలోచనా, మరో ఆలోచనా, ఇంకేదో ఆలోచనా – ఆతిధ్యమిచ్చినవి కొన్ని, పూర్తి అపరిచుతుల్లా కొన్ని, కొన్నైతే అనామకులుగా నాలోకి చొచ్చి, ఇరుక్కుగా ఉన్నా పర్లేదంటూ ఒకదాని పక్కన ఒకటి ఓర్పుగా నేర్పుగా నడుస్తున్నట్టే నడుస్తూ ఇర్రుక్కుపోయాయి. ఒకదాని మీదకి మరోటి ఎగపాకుతోంది! ఓ “భారీ నిజం” హైడలైట్లు కళ్ళల్లోకి కొట్టడంతో ఓ ఆలోచన అదుపు తప్పి”పోయ్యింది”. “భయం” చేసే రాష్ డ్రైవింగ్ కి ఇంకొన్ని ఆలోచనలు చెల్లా చెదురై కొన్నింటికి అడ్డంగా నిలిచాయి. సైలెంటుగా చీకటినే రాంగ్వేలో వచ్చిన “దిగులు” పొట్టను పెట్టుకున్న ఆలోచనలకి లెక్కలేదు. రావడమే స్వభావమైన కొత్త ఆలోచనలన్నీ అసలేం జరుగుతుందో ఆలోచించలేక బిక్కు బిక్కుమంటూ ఆగిపోయాయి. కదల్లేక, ఆగలేక వాటికి ఊపిరాడక, జీవితం ఒక్కసారి నిలబడిపోయినట్టనిపిస్తుంది! 

“నాన్ సెన్స్! అలా ఎప్పుడూ జరగదు, అవ్వన్నీ అర్థం లేని భ్రమలు, ఊహలు, అపోహలు, భయాలూ.. ఇంకా అలాంటివేవో.. అంతే!” అంటూ నాకు నేనో అర్థంలేని అర్థాన్నిచ్చుకుంటాను. మిగితా ప్రపంచానికేదీ కనిపించదు (కనిపించనివ్వను) కనుక అసలు జాం లేనే లేదు. కానీ దాచే కొద్దీ కనిపెట్టేసే ఒక్క ఆత్మీయం దగ్గర మాత్రం, కరిగి కన్నీరయితే – ఆ మాటల జడిలోనో, స్పర్శ తడిలోనో ఈ జాం క్లియర్ అయ్యిపోతుంది. ఆలోచనలు సరదాగా లాంగ్ డ్రైవ్ కి వెళ్ళచ్చు! కానీ అది సాధ్యం కాదు ఎందుకంటే అక్కడే ఇదే పరిస్థితి ఇంచుమించు!

ఆశలూ, ఆశయాలు, ఆదర్శాలూ, ఆప్యాయతలూ, అనురాగాలు, అనుమానాలు, అభద్రతలూ, అపనమ్మకాలూ, ఆవేశాలు నియంత్రణలో ఉన్నంత వరకే – కాస్త అటు ఇటు అయినా ట్రాఫిక్ జాం!

దీనర్థమేమిటో .. ??!!


ఇవ్వాల ఊసుపోక ఏదో గూగిల్లి మరేదో చదువుతుంటే, ఈ కింది వాక్యం తగిలింది. “ఆహా!” అనేసుకుని జీటాక్ స్టేటస్ మెసేజ్ గా అయితే పెట్టుకున్నాను గానీ, ఆహా కాస్త “అవునా?” కి పయనిస్తూనే ఉంది. కాసేపు ఆలోచించి, ఇంకాస్సేపు చర్చించి, ఇక లాభం లేదని, మీ అందరి సహాయార్థం ఇక్కడ పెడుతున్నాను.

We all know that Art is not truth. Art is a lie that makes us realize the truth, at least the truth that is given to us to understand.
Pablo Picasso 

పికాసో ఎందుకన్నారో, ఏ సందర్భంలో అన్నారో ఎంత వెతికినా దొరకటం లేదు. ఈ వాక్యంలో అర్థాన్ని, నా చిట్టి బుర్రకి అర్థం అయ్యేలా చెప్పగలరా, దయచేసి! కనీసం, మీ మీ అభిప్రాయాలను పంచుకుంటే, అవగాహన పెరిగే అవకాశం ఉంది. 

నెనర్లు! 
 పూర్ణిమ

ఒక ఉలిపికట్టె కథ..


పోయిన వారాంతం విశాలాంధ్ర మీద దాదాపు దాడి లాంటిది చేసి మరీ కొన్న అనేకానేకమైన పుస్తకాల్లో, డా|| కేశవ రెడ్డి రచించిన “సిటీ బ్యూటిఫుల్” అత్యంత తక్కువ పేజీలు కలదీ, అంతే చవకా కూడా! అప్పుడెప్పుడో నవీన్ రాసిన “అంపశయ్య” పుస్తకం ఒక యాభై పేజీలు చదివి మళ్ళా ముట్టుకోలేదు. ఈ పుస్తకం “ముందు మాట”లో దాని ప్రస్తావన చూసి హడలిపోయాను. ఉన్నవే తొంభై పేజీలన్న ధైర్యంతో మొదలెట్టాను. కథ విషయానికి వస్తే దాదాపు అంపశయ్య కథే! ఇరవై యేళ్ళ వయసున్న ఒక మెడికో జీవితంలో ఓ రెండు రోజులు పాటు జరిగిన పరిణామాలు, వాటి పర్యవసానాలు! అంతే కథ.

 ఈ పుస్తకం మొదట్లో రచయిత తన మాటగా చెప్పుకుంటారు, “అస్తవ్యస్తంగా, అర్థరహితంగా, తలక్రిందులుగా ఉన్న సమాజ విలువల్నీ, కట్టుబాట్లనీ, కొందరు పూర్తిగా ఆమోదిస్తారు, వారికి ఈ సమాజం ఎప్పుడూ అక్కున చేర్చుకుంటుంది. కొందరు మాత్రం దీనికి ఐచ్ఛికంగానో, యాధృచ్ఛికంగానో ఆమోదించక ఎదురు తిరుగుతారు, వాళ్ళ జీవితాలు నరకప్రాయం చేయడం సమాజం వంతు” అని! ఇప్పుడు మనం ఒక వేళ పూర్తిగా సమాజాన్ని ఆమోదించేసినట్టయితే ఈ పుస్తకం సిటీ బ్యూటిఫుల్ కాదు, సిటీ హిల్లారియస్ అవుతుంది. ఎందుకంటే ఉన్న విలువలకి ఎదురుతిరిగే ఒక ఉలిపికట్టె కథ, అతని వ్యథ, అతని చిరాకు అన్నీ నవ్వు తెప్పిస్తాయి. ఒక వేళ మనం పూర్తిగా సమాజానికి వ్యతిరేకం అయితే, అతడి పై సానుభూతో, సహానుభూతో కలిగి అయినా పట్టువదలని అతడి నుండి కాస్త ధైర్యం కలగవచ్చు ఏమో! అప్పుడీ పుస్తకం సిటీ బ్రావో కావచ్చు!

కానీ అటూ కాక, ఇటూ కాక ఉండే నా లాంటి వారు చదివితే మాత్రం, అప్పుడప్పుడు కస్సుక్, కిస్సుక్ మని నవ్వులు , మరి కొన్ని సందర్భాల్లో విపరీతంగా కెలికే ఇబ్బంది. చూసీ చూడనట్టు చేసుకుపోయే చాలా వెధవ పనుల్ని రికార్డు చేసి ఎవడో ముందు పెట్టి రి-ప్లే చేస్తున్నట్టుంటుంది. ఉదా: మన హీరో మెడికల్ కాలేజీ ఎంట్రన్స్ ఇంటర్వ్యూ కి వెళ్ళినప్పుడు, “ఎందుకు మెడిసన్” అన్న ప్రశ్న, “మా నాన్న వెళ్ళమన్నాడు” అన్న సమాధానం చెప్తాడు. ఇలా సమాధానం చెప్తే ఆ మనిషి మనమెలా “ట్రీట్” చేస్తామో, అక్కడున్న పేనల్ కూడా అలానే “ఇమ్మెచ్యూర్” అని నవ్వుకుంటుంది. మనం చిన్నప్పటి నుండీ శతకాల్లో, పద్యరత్నాల్లో వల్ల వేసిన నిజాయితీ మనం పెరిగే కొద్దీ “మెచ్యూర్” అయ్యిపోతుందేమో! అవతలి వారి అనువుగా ఉండేవి చెప్పాలి, నిజం కాకపోయినా. మన హిరో బయటకి వచ్చి వేరే వాళ్ళతో మాట్లాడితే గానీ తెలీదు, ఆ ప్రశ్న “నేను పేదలకు సేవ చేస్తాను”, “నేను కాన్సర్ కి ఒక నివారణ మందు కనుక్కుంటాను, ప్రపంచాన్ని కాపాడతాను” లాంటి లౌక్యమైన సమాధానాలు చెప్పాలి అని. అందుకని ఆ ఒక్క క్షణం అలా అవలీలగా నటించేసేవారికి ఈ పుస్తకం చెంప చెల్లుమనిపిస్తుంది. సిటీ స్కేరీ గా మారుతుంది.

ఇక ఒంటిరితనం గురించి! మొన్న ఎవరో “నా ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోతున్నారు, ఇక లోన్లీ గా ఉండాలి” అనగానే “అందరూ ఉండగా కూడా ఫీల్ అయ్యే లోన్లీ కన్నా ఇది చాలా నయం” అన్నాను. ఒక్కోసారి చుట్టూ మనుషులు ఎక్కువయ్యే కొద్దీ మనంలోని ఒంటరితనం ఎక్కువవుతుంది.  చాటు నుండి మాటు వేసి మరీ “దిగులు” మనల్ని దాడి చేస్తే నిశ్శబ్దం, నిస్తబ్దత, నిస్సత్తువ కలగలిపి మనతో బంతాట ఆడుకునే వేళ, ప్రపంచమంతా మనకి శత్రువులానే ఉంటుంది. అందుకే దూరంగా పారిపోవాలనుంటుంది. మన హీరో మరీ ఒక అడుగు ముందుకేసి, “అందర్నీ మెషీన్ గన్ తో చంపేస్తాను” అని ప్రతిన పూనుతాడు, బీచి మీద ఏకాంతంగా కాసేపు గడుపుదాము అని వచ్చేసరికి అంతా జనం ఉండటం చూసి. మన జీవితంలో ఇలా జరిగిన ఏ సంగతో లేక సందర్భమో గుర్తొస్తే సిటీ బ్యూటిఫుల్ కాస్త, సిటీ alienated అయ్యిపోతుంది.

అర్థం లేని అహాలు, అబద్ధపు ప్రతిష్టలు, బూటకాలు, నాటకాలు ఇవేవి కొత్తగా ఈ పుస్తకం కొనీ, చదివీ తెలుసుకోవాల్సిన పని లేదు. మనం చూసిన జీవితాల్లో అలాంటివి కోకొల్లలు! ఇందులో నాకు striking అని అనిపించింది మాత్రం, ఈ అబ్బి ఎడమ చేతి వాటం కావటం. అందులో విడ్డూరం ఏమిటని అనిపించచ్చు. ఈ కథలో రచయిత దాన్ని సమాజాన్ని ఎత్తి చూపటానికి చేసిన ప్రయత్నమల్లే కనిపిస్తుంది. ఈ పాత్రకి అన్నీ ఎడం చేత్తోటే, ఆఖరికి అన్నం తినడం కూడా. కథ మధ్యలో ఒకటి రెండు సార్లు “నేను లాబ్ లో ఎక్విప్ మెంట్ విరగొట్టా” అని చెప్తుంటే, చాలా అజాగ్రత్త మనిషి అనుకున్నాను. తీరా చూస్తే ఆ లాబ్ లో అన్నీ “కుడి చేతి వాటం” వారికి అనువుగా ఏర్పాటు చేయటం వల్ల వచ్చిన ఇబ్బంది. మనం కొన్నింటికి ఎంతలా అలవాటు పడిపోతామంటే, ఇంక వేరేలా కూడా చేయవచ్చు అని ఊహించలేమేమో అన్న దిశగా రచయిత నన్ను ఆలోచింపజేయడంలో సఫలమయ్యాడు.

తెలుగు సరళంగాను, సులువుగాను ఉండి, గజిబిజి లేని శైలి అవ్వటంతో ఈ పుస్తకం చదవటం చిటుకులో అయ్యిపోయింది. కాకపోతే, ప్రధాన పాత్రధారి చీటికీ మాటికీ  “ఇంబసైల్” అనటం, ఎవరికైనా “గాడు” తగిలించటం” కాస్త చిరాకుగ్గా అనిపించాయి. నా టపా చదివి ఇదేదో మోరల్ స్టోరీ అనుకునేరు, ఇది ఒక సామాన్య యువత కథ, నచ్చిన దానికీ, చేయాల్సిన దానికీ నలిగిపోయే అతి సామాన్యమైన కథ! అయినా నవ్వుకోడానికి బోలెడు అవకాశం. బాపూ గారేసిన ముఖ చిత్రం చెప్పకనే చెప్తుంది కథ మొత్తం! సింపుల్ గా చెప్పాలంటే, ఎప్పటికప్పుడు పరిస్థులకీ, మనుషలకీ అనుగుణంగా ఒక చక్కనైన అందమైన ముసుగు వేసుకోకపోతే, మనల్ని నిజం ఎంతలా కాల్చేస్తుంది అనే కథ!

ఈ రచన చేయడానికి హెమ్మింగ్వే “ఫేర్వెల్ టు ఆమ్స్” మరియు సలింగర్ “కాచర్ ఇన్ ది రయ్” ప్రేరణ అని రచయిత పేర్కొన్నారు. నా అనంతమైన “చదవాల్సిన” జాబితాలో అవీ ఉన్నాయి!

పుస్తకం వివరాలు:
పేరు: సిటీ బ్యూటిఫుల్
రచయిత: డా|| కేశవ రెడ్డి
పబ్లికేషన్స్: నందిని పబ్లికేషన్స్
పేజీలు: 92
వెల: రూ. 50
నేను కొన్నది: విశాలాంధ్ర (అబిడ్స్)

నిశి, నిశాంతంలో పూర్ణిమ


“గిటారై మోగుతున్నది యద” – ఊహ! హృదయమే ఒక వాయిద్యంగా మారి, సుతారంగా మీటిన ప్రతీ స్పర్శకీ స్పందించి సంగీతాన్ని వినిపిస్తుందన్న ఊహ. ఊహకందని అనుభవం ఏమిటో కానీ, ఊహించుకున్న అద్భుతం ప్రత్యక్షానుభవంలోకి వస్తుందంటే మాత్రం ఉద్వేగంతో ఊపిరికి ఊపిరాడదు. మనో నేత్రానికి చిరపరిచితమైన చిత్ర పటం, కళ్ళ ముందు సజీవంగా  ప్రాణంతో నిలుస్తానంటుంటే వెన్నులో జలదరింపు ప్రాణం పోసుకుంటుంది. గొణ్ణం తీస్తున్న నా వేళ్ళు వణుకుతున్నాయి: చూడాలన్న ఆత్రుత, చూడగలనా అన్న సంకోచం, చూస్తే కదా తెలిసేది అన్న తర్కము, చూడకుండా ఉండగలనా అన్న అనుమానం! గిటారైన నా యద ఇప్పుడు వినిపిస్తుంది – సంగీతమో, రొదో!

అసలు ఇష్టం, భయం mutually exclusive అయ్యిపోతే బాగుణ్ణు. ఇష్టముంటే భయం వేయకూడదు, భయపెట్టేదేది ఇష్టమవ్వకూడదు — ఇలాంటిదో డీల్ ఉంటే! లేకపోతే ఇష్టపడీ భయం వల్ల దూరం చేసుకోవాల్సి వస్తుంది. భయం వేస్తున్నా ఇష్టం మాయమైపోకుండా పరీక్షిస్తుంది. అసలూ ఆనందం, అందం, ప్రేమా లాంటివన్నీ సున్నితంగా అనిపించి మనం ఇష్టపడతాము కానీ, అవి కూడా దగ్గరై వాటి విశ్వరూపం కనబరిస్తే, భయం వేయక మానదు.  వాటిని ఓపలేక నరనరాలు మెలితిరిగిపోతాయి. అడుగులు తడబడతాయి. మనసు గతి మారుస్తుంది, హృదయం లయ తప్పుతుంది. ముంచేసే ఆనందం కూడా ఒక ఉపద్రవమే!

“Just open the door, Purnima” నాకు నేను గట్టిగా చెప్పుకోవాల్సిన మాటలనుకున్నా, మరో గొంతులో నమ్మకమై పలుకుతుంటే నెమ్మదిగా తలువు తెరిచాను. కీచుమంది తలుపు, దానితో పాటే చీకటి. అంతా నల్లని నలుపు, దూర దూరాల వరకూ నలుపు. కాస్త ముందుకెళ్ళాను, వీధుల్లో దీపాలు వెలుగుతున్నాయి, గదిలో ఇంకా లైటు ఉన్నా అంతా నల్లని చీకటి. “చీకటే సముద్రమయ్యిందా? సముద్రమే చీకటయ్యిందా? అవునూ.. ఆకాశమేది? అరె, సముద్రంలో భలే కలిసిపోయిందే! చీకటి అన్నింటినీ కప్పేసింది, అక్కడెన్నున్నా, వాటి అస్థిత్వం ఏదైనా, ఇప్పుడు చీకటి మైకంలో అన్నింటిన్నీ మరచి ఆదమరచి ఉన్నాయి. కానీ ఏంటీ హోరు? ఓహ్.. సముద్రం ఘోష చీకటిలో కూడా స్పష్టంగా ఉంది. ఒక అల పరుగు పరుగున వచ్చి తీరం తాకెళ్ళిపోయింది. సముద్రమంటే ఇష్టపడ్డానికిదే కారణం – ఆ అంతస్సంఘర్షణ, అలుపెరుగని పరుగులు, అంతులేని కల్లోలం, అనంతమైన కలవరం. ఎవరి కోసమో అంత తపన? ఎవరి రాకకై అసహనం? ఏ “అందాన్ని” ఆవిష్కరించటానికో ఆ పరిశ్రమ? దగ్గరిగా వెళ్ళాలనుంటుంది, కానీ భయం! మహాయితే తీరం చేరి ఆ ఇసుకల్లో ఆచితూచి అడుగులేస్తుంటే, ఏ అలో కనికరించి పాదాలు తాకి పోతే సరే గానీ, అంతకన్నా ముందుకెళ్ళే సాహసం, ధైర్యం ఎక్కడిది? అది ఇష్టమైన భయం. భయంగా మారే ఇష్టం. ప్రాక్టికాలిటీ చేతిలో దారుణంగా ఓడిపోతుంది, ఎంత రొమాంటిక్ ఆండ్ డ్రీమీ అయినా ఇలాంటి సమయంలో!

హమ్మ్..  అనంత సాగారాన్ని రెండు కన్నుల్లో నింపుకుని దాన్ని పునఃచిత్రీకరించలేకపోయినా, ఈ ఘోషను ఎక్కడదాకా అయినా వినిపించగలను అన్న ఐడియా మానవ మేధస్సు మీద గర్వంగా మారుతూనే ఇంటి నెం. డయల్ చేశాను. “అమ్మా! భారతదేశం అంటూ అంతమయ్యిపోయే భూభాగంలో ఉన్నాను. టిప్ ఆఫ్ ఇండియా! నా ముందరొక ఒక చిన్ని గట్టు, సముద్రంలో చీలికలా ఉంది. అక్కడితో ఇండియా అయ్యిపోతుంది. ఇంకంతా సముద్రం, చూసేంత వరకూ, చూస్తున్నంత వరకూ, ఇదో అలల హోరు విను..” అన్న నా మాటలకి, ” అవునా? చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. ఏమీ వినిపించటం లేదు. తెలుసా, ఇవ్వాల చిరంజీవి పార్టీ పెట్టేస్తానన్నాడు” అని అమ్మ. ఇప్పుడు నాకు చిరంజీవి అవసరమా? లోకానికి దూరంగా ఉన్నాను-వద్దు పో అంటూ డిస్కనెక్ట్ చేశాను.

“కాస్త అన్నం తిని పడుకో” అని బతిమాలుడుతున్న నేస్తానికి “ఊ..హూ” తప్ప సమాధానం లేదు. “సరే, కనీసం జ్యూస్ తాగుదువు రా, కిందకి వెళ్దాం” అన్నప్పుడు ఊ కూడా లేకుండా, బయలుదేరాము. కళ్ళల్లో ఇంకా చీకటి, నల్లని నలుపు పేరుకుపోయున్నాయి. వీధిలోకి రాగానే మాత్రం, అవే గతుకు రోడ్లు, చిన్ని గల్లీలు, అగ్గిపెట్టెల్లాంటి షాపులు, తీవ్రంగా అనిపించే లైట్లు, వ్యాపారం, వాణిజ్యం, జీవనాధారం, లాభాలు-బేరాలు, బతుకు భయం – ఓ జనారణ్యం. పక్కనే ఉన్న అనంత సాగారం ఇప్పుడెక్కడో ఉందనిపించేంత నాగరికం, ప్రకృతనంతా మడతపెట్టి పక్కకు నెట్టేసినట్టు! జ్యూస్ తాగేశాక, కాసేపు తిరుగుదామనుకుంటూ ఇంకో రెండు వీధుల్లో తిరిగాము. ఒక్కో షాపూ మూసేస్తున్నారు. “అప్పుడే” అన్న నా అశ్చర్యానికి, ” టైం పదిన్నరవుతుంది. మీ హైద్ లోనే మూసేస్తారు ఈ పాటికి” అన్న సమాచారం ఒక్కసారిగా బెంగను తట్టిలేపింది.

అవును హైద్ లో రాత్రి పదిన్నర వేళకి, ఎలా ఉంటుందో టక్కున్న కళ్ళ ముందు నిలిచింది. అప్పటి వరకూ ఉరుకులు పరుగులు తీసిన నగరం, ఇక ఇవాల్టికి ఇదే ఆఖరి పరుగు అన్నట్టు అంతగా రద్దీ లేని రోడ్లు పై వాహనాలు రయ్యిమంటాయి. ఫ్లోరోసెంట్ వెలుగుల్లో నీడలు మరీ సాగిపోతాయి, రోజంతా పడ్డ శ్రమకి తార్కాణంగా. వీలైనంత త్వరగా ఇంటికి చేరుకోవాలన్న తాపత్రయం కొందరిది, ఈ రాత్రికి ఇదే నా ఇల్లనుకుంటూ బస్సు స్టాప్పుల్లో, డివైడర్ల పై పరచిన గడ్డిలో నిద్రపోయే నిశ్చింత (?) మరికొందరిది. సద్దుమణిగే కొద్దీ నిశ్శబ్దంగానే నిశ్శబ్ధం ఆవహిస్తుంది నగరాన్ని. మత్తైన చీకటిలో హాయిగా నిదురోయి, మళ్ళీ ఓ కొత్త ఉదయాన్ని సాదరంగా ఆహ్వానిస్తుంటుంది. “ఓహ్.. హైద్!” అని నిటూర్చే లోపు, మళ్ళా హోటల్ వచ్చేసింది. “ఇక నేను పడుకుంటాను, చాలా అలసిపోయాను” అంటూ గుడ్ నైట్ చెప్పి గదిలోకి వచ్చాను.

గదిలోకి వచ్చాను సరే, ఇప్పుడెలా ఉండడం? సముద్రం భయపెడితేనో! లైట్ అలానే ఉంచి, టి.వీ పేట్టేసుకుని పడుకుంటే సముద్రం ఉనికి కోల్పోదూ కాసేపటికి! ప్రయత్నించా. అనవసరమనిపించింది. మళ్ళీ కాసేపెళ్ళి బాల్కనీ నుండి సాగరాన్ని చూశాను; చూస్తూనే ఉండిపోయాను. నిద్ర ఇంక ఒపిక పట్టేట్టు లేదు, తప్పదని లైట్లు తీసేసి, టీ.వీ కట్టేసి, అలల హోరు జోల పాడుతుంటే హాయిగా నిద్రకి లొంగిపోవటం.. బానే ఉంటుంది. నిద్రతో కూడా యుద్ధం చేస్తూ మెలకువకి, నిద్రాస్థితికి మధ్య మనోఫలకం అనే కాన్వాస్ పై ఆది, అంతం లేని ఆలోచనల బొమ్మలు గీయడం, ఊహలకి జీవం పోయటం – ఒక అందమైన అనుభూతి. నిద్రెటూ గెలిచేస్తుంది, ఆ గెలుపుని ఆలస్యం చేస్తూ అనంత ఊహా లోకంలో విహరిస్తూ ఉండడం ఆనందం. సముద్రంలోనూ, నా నిద్రలోనూ ఒకటే కలవరం. మెలుకువ వచ్చేసరికి మూడయ్యింది. ఇంకా అంతా చీకటే!  మళ్ళీ కాసేపటికే నిద్ర గెలిచేసింది.

ఆరవ్వడానికింకా కాసేపుందన్నంగా లేచాను. కిటికీ తీస్తే అంతే చీకటి, ఏ మాత్రం పల్చబడలేదు. అసలింత దూరమొచ్చిందే సూర్యుడెలా నిద్ర లేస్తాడా అని చూడడానికి. అంతా సిద్ధమై సూర్యుడి కోసం పడిగాపులు కాస్తున్నాం. సూర్యుడికి మరీ ఇంత మొహమాటం అనుకోలేదు, ముబ్బులను కప్పుకుని మరీ మెల్లి మెల్లిగా వస్తున్నాడు. నింగీ, సాగరం ఎక్కడ కలిసాయో తెలీడం లేదు కానీ, ఒక చోట మాత్రం రెండూ కాస్త ఎర్రబడ్డాయి. చీకటి తప్పుకుంటూ దారిస్తుంది సూర్యుడికి. సముద్రంపై కెరటాల్లా, మబ్బులు కాస్త అల్లరి పెడుతున్నా, దీక్షగా దినకరుడు పైకి వస్తూనే ఉన్నాడు. చూస్తూ చూస్తూ ఉండగా చీకటి శూన్యంలో కలిసిపోయింది, అంతటా వెలుగులు నిండిపోయాయి. పొద్దెక్కితే వీర ప్రతాపం చూపించే సూర్యుడు ఇప్పుడు మాత్రం ఆహ్లాదంగా, సంపూర్ణంగా ఉన్నాడు. హనుమంతుడికి సూర్యుడో పండులా కనిపించాడంటే నిజంగా అలానే ఉంటాడు మరి. జీవితంలో ఒకసారి కలిగే అనుభవమేమో ఇది, కనుచూపు మేర జలనిధి, నిదానంగా ఉదయిస్తున్న సూర్యుడు. పకృతి స్వహస్తాలతో గీసే అరుదైన చిత్రలేఖనం, ఈ ఉషోదయం!

“హైద్ లో నిశాంతాల మజాయే వేరు.  ఇంకా మత్తు వదలని సూర్యుణ్ణి కూడా మేల్కొల్పేలా నమాజ్ ప్రార్థనలు, గుడిలో నుండి సుప్రభాత గీతికలు కలగలసి వేకువ రాగం వినిపిస్తుంటాయి. అలా బయటకి రాగానే చల్లని గాలి ఒక్కసారిగా చుట్టుముట్టేస్తుంది. రోడ్డుపై అడుగులు శబ్దం నిశ్శబ్ధాన్ని చీలుస్తుంటే, హుషారుగా గాలితో పందెం పెట్టుకునే పేపరు/ పాలు అబ్బాయిలు సైకిళ్ళ మీద. సూర్యుడెటు నుండి వస్తున్నాడో తెలియక పోయినా, నూతనోత్తేజం మాత్రం మనసునీ శరీరాన్ని ఒక్కసారిగా ఆవహిస్తుంది. రాలిన ఆకుల్ని తుడిచే చీపురు ధ్వనిలో కూడా ఏదో లయ వినిపిస్తుంటుంది. ఇక అప్పడప్పుడే తెరిచే టీ కొట్లోనో, ఓ మూలనున్న పూరి గుడిసెలోనో పొయ్యి ముట్టిస్తే, ఆ వాసన మత్తు అంతా ఇంతా కాదు. అడుగులో అడుగేసుకుంటూ, చేతిలో చేయిని జాగ్రత్తగా పట్టుకుంటూ నడిచే వృద్ధ జంటల నుండీ, క్రమశిక్షణగా కవాత్తు చేస్తున్నట్టు పరుగు తీసే మిలిటరీ జవాన్లు వరకూ అందరి నడకలో సూర్యుడూ కలుస్తాడు. చదువుల బరువులు చిరునవ్వులతో మోస్తూ కోచింగ్ లకు వెళ్ళే యువత. చీకటిని సైతం బేఖాతరని చీల్చుకు వచ్చే బస్సుల్లో డ్రైవరుకీ, కండెక్టరికీ అప్పుడే రోజులో కొంత భాగం అయ్యిపోయ్యుంటుంది. కానీ హైద్ అంటే గుర్తు రావాల్సింది, అస్తవ్యస్తమైన ట్రాఫిక్కూ, గతుకుల రోడ్లూ, అరకొర రవాణా సంస్థా కానీ, ఇలాంటి మానవ లిఖితమైన సౌదర్యం కాదులే! ఎవరికైనా చెప్తే “అవునా, ఆ హైద్ ఏ లోకంలో ఉంటుంది” అని వెటకరిస్తారు” అన్న ఆలోచనల్లో పడి లేస్తుంటే, “Hey, Dreamy! Let’s go” అన్న పిలుపు విని సూర్యుడినో సారి మళ్ళీ కళ్ళారా చూసుకుని వెనక్కి తిరిగాను.  

అలా కన్యాకుమారిలో ఒక నిశీ, నిశాంత వేళ ఈ పూర్ణిమ! ఎందుకో ఇప్పుడీ నిశీలో ఇలా ఊసులాడడం!?