కొన్న కొన్ని తెలుగు పుస్తకాలు


నిన్న విశాలాంధ్ర వారేదేదో పుస్తక ప్రదర్శన పెట్టారనగానే షరా మామూలుగా దాడి చేశాను. నేను ఏ తెలుగు పుస్తకాలు (ఆ మాటకొస్తే ఈ మధ్యన చదువుతున్న చాలా పుస్తకాలు) బ్లాగర్ల సిఫార్సులే! అందుకే చెప్పిన వారికి ధన్యవాదాలు చెప్తూ తెలుసుకోగోరే వారితో పంచుకున్నట్టూ ఉంటుందని ఇక్కడ ఇలా ఓ టపా పెడుతున్నాను.

ఇప్పుడే మువ్వల సవ్వడి చూసొస్తున్నా.. అప్పుడప్పుడూ చూస్తాను. మనం సాధారణంగా ఆడుకునే “dumb charades” ఆటలాంటి ఒక రౌండుందిలో! ఒకరు అభినయిస్తూ ఉంటే మరొకరు ఆ పదాలను గుర్తుపట్టి, ఆ వాక్యం పూర్తి చేయాలి. ఒక అమ్మాయి “లంబోదర.. అంబాసుత” అభినయించి. అవతలి అమ్మాయి బాగానే గుర్తు పట్టింది కానీ, “బొజ్జ గణపయ్య, బొజ్జ గణపయ్య” తప్పించి చెప్పలేకపోయింది. ఆ అమ్మాయి అభినయించాల్సిన వంతు వచ్చేసరికి “తెలుగు చదవటం వచ్చునా?” అని అడిగేశారు ప్రభగారు. నిజంగానే తెలుగులో మాటలు కష్టమయ్యిపోతున్నాయి.

తెలుగులో మాట్లాడేటప్పుడు హాయిగా, వచ్చిన ఆంగ్లపదాలకు తెలుగుతో దోస్తీ చేయించేసి గట్టెక్కేస్తాము. అక్కడో తెలుగు పదం ఆలోచించాలనిపించదు. (కనీసం నాకు) ఇంకొన్ని సార్లు వచ్చిన తెలుగుపదాలు అంతా వాడేస్తున్నారు కదా అని నేనూ వాడేయడమే! తెలుగు భాషపై పట్టు సాధించడానికి కొన్ని పుస్తకాలు:

  • ఆధునిక వ్యవహార కోశం బూదరాజు రాధాకృష్ణ: వాడుకంలో మనం ఉపయోగించే అనాకానేకమైన ఆంగ్ల పదాలకి తెలుగులో సమానాంతర పదాలున్నాయి. నూట యాభై రూపాయల ఈ పుస్తకాన్ని కొని పెట్టుకుంటే చాలా అక్కరకు వస్తుంది.
  • వీరిదే తెలుగు జాతీయాల పుస్తకం కూడా, ఏ ఏ జాతీయాలు ఎందుకు ఎలా ఏర్పడ్డాయి, ఏ అర్థంలో ఎప్పుడు వాడుకోవాలనుంటాయి. సుమారు రెండొందల పేజీల్లో చాలా జాతీయాలను విశీదికరించారు. అంతర్జాలంలో తెలుగు జాతీయాలు నిధి మాత్రం ఈనాడే!
  • వ్యావహారిక భాషావికాసం కూడా వీరిదే. మాసిపోయి దుమ్ముపట్టేసిన ఈ పుస్తకంలో కొన్ని వ్యాసాలున్నాయి, చదివితే గానీ చెప్పలేను వాటి గురించి.
  • మాటలూ-మార్పులూలో మాటల అర్థాలేమిటి, అవెందుకు మార్పుచెందాయి అని వివరించారు.

అసలు, బూదరాజుగారి ఏ పుస్తకమైనా వదిలిపెట్టకుండా కొనాలనుకున్నాను. చాలా విని ఉన్నాను. చదువరిగారి అప్పుడో పుస్తకాన్ని పరిచయం చేసిన గుర్తు, అక్కడే తొలి పరిచయం!

అనుకోకుండా శ్రీపాద గారు తగిలారు. శుక్రవారం పూటే ఫోన్ చేసి అడిగితే, శ్రీపాద వారివి కొత్త ప్రింట్లేమీ రాలేదన్నారు. పూర్తిగా ఆశ వదులుకుని వెళ్ళాను గానీ, నా దగ్గర లేని “పుల్లంపేట జరీ చీర” అనే కథల సంకలనం, “విషభుజంగము“, “రక్షాబంధనం” నవలలున్న పుస్తకం కనిపించాయి. ఇంకా మిగితావి ఎక్కడ ఎప్పటికి దొరికేనో! “అనుభవాలు-జ్ఞాపకాలు” ఇంకా రెండు నెలల తర్వాత వస్తుందట!

“శ్రీపాద ఎవరు?”, “ఎందుకు చదవాలి?”, “అంత బాగా రాస్తారా?” అన్న ప్రశ్నలు ఆయన ప్రస్తావన వచ్చిన ప్రతీసారి ఎదురవుతున్నాయి. నేనింకా ఆ తేనెని నాలుక కొస మీద పెట్టుకున్నానంతే, అందుకే “తప్పక చదవాల్సినవి” అని తప్పించి ఇంకేమీ చెప్పలేను. ఎందుకు తప్పదో, పెద్దలు ఎవరైనా వివరిస్తే బాగుంటుంది. పరిచయం చేస్తే, కలవడం సులువనిపిస్తుంది!

రవిగారు చెప్పినా కూడా ఏదో ఆశతో తిరుమల రామచంద్ర గారి రచనల గురించి అడిగాను. “హంపీ నుండి హరప్ప దాకా” తప్పించి, మరేమీ దొరకలేదు. దొరకవని మూలెక్కడో అనిపిస్తున్నా, కాస్త నిరుత్సాహపడ్డాను.

శ్రీరమణ గారి పేరడీలు కొన్నాను, కాస్త చదివాను కూడా! నేనిప్పటికే చదివున్నవారి పేరడీలు మనసుకి తగిలాయి (striking)! అలానే “రంగుల రాట్నం” కూడా తీసుకున్నాను. దీని టాగ్‍లైన్ “చమత్కారాలు-మిరియాలు-అల్లం బెల్లం-మురబ్బాలు” అని చాలా ఆసక్తికరంగా ఉంది. ఇంకా వీరి రచనల పేర్లు చెప్పగలరు, తెలిసినవారు.

మిరియాలంటే, మల్లాది రామకృష్ణశాస్త్రిగారి “చలవ మిరియాలు” గుర్తొచ్చాయి. కొన్ని వ్యాసాల సంకలనం ఇది. కొనేటప్పుడు శ్రీపాద, చలం గురించి ఉందనగానే మారు ఆలోచనలేకుండా కొన్నాను పోయిన సారి. కొన్ని చదివటం జరిగింది. శ్రీపాద గురించి వారి మాటల్లో, “చదువరులకు చదువు చెప్పగలిగినది ఆయన రచన – విద్యాబుద్ధులున్న అహంకారులకు కనువిప్పు చేసినది ఆయన వచనము! తీయందనపు-తీయందనము చవులిచ్చిదాయన శైలి”. ఈ మధ్య కాలంలో నేను చదువుతున్న తెలుగుని తెలుగంటే, ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఏమిటా అని అనుమానం వస్తుంది. మల్లాదివారి “నవలలు-నాటికలు” కొన్నాను.

అమరావతి కథలు చెప్పారు కదా అని కొనేశాను, ఏముంటుందందులో అని కూడా చూడకుండా. ఇందాకే చూశాను, చిట్టి చిట్టి కథలున్నాయి. ఎంత చిట్టిగా అంటే పొద్దున లేచి ఆఫీసుకి తయారయ్యే హడావిడిలో ఓ ఐదు-పది నిముషాలు కేటాయిస్తే అయ్యిపోయేంత. ప్రింట్ సూపర్. పైగా బాపూ బొమ్మలూ.పక్కకు పెట్టాలనిపించటం లేదు.

బేతవోలు రామబ్రహ్మం గారి “పద్యారామం” కూడా కొనేశాను. “ఏంటి పద్యాలే!” అని సక్కిలించనక్కరలేదు, పద్యాలు రాకపోతే ఏముందిలే అనుకున్నాను గానీ, అమ్మో.. సౌరవ్ ని ఎట్టా మిస్స్ అయ్యేది? రాహుల్, సచిన్ క్యూలో ఉన్నారాయే! అందుకే.. ఇక నేర్చుకోవాల్సిందే! ఈ పుస్తకం పద్యాలు నేర్చుకోడానికే కాక, ఆస్వాదిండానికీ కూడా ఉపయుక్తంగా ఉంటుందని తెలిసింది. పద్యాలకై కొనాలనుకున్న చాలా పుస్తకాల దొరకనే లేదు, ఇది తప్పించి.

ఆరుద్రగారి “గేయాలు-గాయాలు” తప్పించి నా దగ్గర ఏమీ లేవు. ఈ సారి కొన్న పుస్తకాలు “రాముడికి సీత ఏమవుతుంది?” – అదో వెర్రి ప్రశ్న అనుకుంటారు గానీ, దానిలో చాలా విషయం ఉందనీ, దానిపైనే ఈ వ్యాసాలన్నీ అట. ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం కూడా కొనేశాను, ఇప్పుడే చదివే ఉద్దేశ్యం లేకపోయినా. మన “complete references – java / C/ whatever” ఉన్నంత పరిణామంలో ఉన్న ఈ పుస్తకాల వెల మాత్రం రూ.250 మాత్రమే! చెప్పేది సమగ్రమైన చరిత్రైనా, చదివిన ఒకట్రెండు పెజీల్లోని తెలుగు ప్రలోభపెట్టింది. (tempt చేసింది, ఆధునిక వ్యవహార కోశం సంప్రదించటం (refer) ఇదప్పుడే పదోసారి)

ముణిమాణిక్యం కాంతం కథలూ దొరికాయి. ఇది కాస్త పెద్దగా ఉండే ఏ అరచేతిలోనైనా ఇమిడిపోగలంత చిన్ని పుస్తకం, చాలా తక్కువ పేజీలు కూడా ఉన్నాయి. చిన్ని హాండ్ బాగులో పెట్టేసుకుని, ఏ దారిలోనే చదువుకోవచ్చు. అలానే చలం గీతాంజలి, ఆరుద్ర కూనలమ్మ పదాలు కూడా. (అంతర్జాలంలో కొన్ని పదాలు ఇక్కడ ) ఏదీ యాభై రూపాయలకు మించదు.

ముళ్ళపూడి వెంకటరమణ గారి “కదంబ రమణీయం” తీసుకున్నాను. నిన్నంతా దాన్నేసుకుని నవ్వుతూ కూర్చుని ఈ టపా రాయటం ఆలస్యం చేశాను. వెనుకా ముందూ ఆలోచించకుండా “సాహితీ సర్వస్వం”లోని అన్ని భాగాలూ కొనిపెట్టేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆయన రచనలు మనం చదవక్కరలేదు, ఆయనే చదివించుకుంటారు. నిజం!

పుస్తకాలన్నీ అరలో సర్దుకున్నాక, అందరి కన్నా ఎత్తుగా, అందరికీ ఆధారమల్లే నిల్చున్న పుస్తకం “మా సలపూడి కథలు”, వంశీది. గోదావరి యాసకి ఓ జిందాబాద్ కొట్టి ఇటొచ్చానో లేదో నాకీ పుస్తకంతో పరిచయం అయ్యింది. రెండొందల యాభై రూపాయల ఈ పుస్తకం హార్డ్ బౌండ్ చేయబడుంది. పుస్తకంలో కథలూ – కథల్లో గోదావరి యాసా ఏమో గానీ, ఈ పుస్తకానికి ప్రధాన ఆకర్షణ మాత్రం బాపూ బొమ్మలే. ఇవి కూడా ఎక్కువ ప్రతులు లేనట్టున్నాయి, ఎక్కడో మూలనపడేసి అవశాన దశలో ఉన్న ఒక కాపీ ఇచ్చారు. చిన్నప్పుడు కొన్ని పుస్తకాల్లో కేవలం బొమ్మలకోసం తిరగేసేవాళ్ళం కదా ఒక ముక్కా చదవకుండా, ఈ పుస్తకం అలానే ఉంది. కథలు చదవాలంటే బాపు బొమ్మలమీద యావ తగ్గించుకోవాలి.

అసలు ఈ పుస్తకమే కాదు, ప్రతీ పుస్తకంలోనూ బాపూ హవా అలానే ఉంది. ఈ సారి ఎక్కువగా కథల పుస్తకాలు తీసుకోవడం కూడా కారణమేమో! “భారతంలో చిన్ని నీతి కథలు” – ప్రయాగ రామకృష్ణ గారిదొకటి తీసుకున్నాం! మా చెల్లి తనకు తాను ఓ తెలుగు పుస్తకం కాసేపు చదివి ఎన్నుకున్న పుస్తకంగా దీనికో కొత్త రికార్డు వచ్చేసింది. హమ్మ్.. చూడాలి చదువుతుందో లేదో!

ఇవ్వన్నీ ఎప్పటికి చదవటమయ్యేనో అని ఓ పక్క ఉన్నా, మన ఇంట్లో ఉన్న వీరితో సాన్నిహిత్యం త్వరగానే పెరిగుతుందనే ఆశ. “ఇంతటి మహానుభావుల్ని ఊరికే వదిలేయడం సాధ్యపడుతుందా!” అని నమ్మకం, వారి మీదా, నా మీదా! 🙂

సినిమాలకై నవతరంగం ఉన్నట్టు, పుస్తకాల కోసం కూడా ఒకటేదైనా ఉంటే బాగుణ్ణు అనిపిస్తుంది. తెలుగు పుస్తకాలపై వచ్చిన టపాలన్నీ ఓ చోటుంటే “ఎవరే పుస్తకం గురించి రాసారు” అని గుర్తుపెట్టుకోనక్కరలేదు. ఆయా బ్లాగులకెళ్ళి వెత్తక్కకరలేదు. ఇప్పుడిప్పుడే తెలుగు సాహిత్యాన్ని తెలుసుకోవాలనే వారికి అనుకూలంగా ఉంటుంది. A one stop for all posts written about books! ఏమంటారు?

ఏది ఏమైనా బ్లాగులు రాయడం మొదలెట్టి ఉండకపోతే, నేను చాలా అజ్ఞాతంలో బతికేసేదాన్ని. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు!

Advertisements

ప్లాట్‍ఫాం


ఆ ప్లాట్‍ఫాం పై లేని శబ్దమంటూ ఏమీ లేదు. ఓ వయ్యారి వేసుకున్న హైహీల్స్ చేసే టక్..ఠఖ్, ఇంపోర్టెడ్ షూస్ నుండి వెలువడే సన్నని “కిచ్..కిచ్” శబ్దం, అరిగిపోయిన జోళ్ళల్లోని మేకులు నేల రాపిడికి చేస్తున్న “కర్రర్” అనే శబ్ధం – ఇవ్వన్నీ బరువుతో పాటు కాళ్ళీడుస్తున్న పాదాలకింద నలిగిన శబ్దమల్లే  అణిగిపోయాయి. అప్పుడే బుడిబుడి అడుగులేసుకుంటున్న చిన్నారి “క్విఈక్..క్విఈక్” మాత్రం ప్రస్ఫుటంగా వినిపిస్తుంది. ఆ చిన్నారిని పట్టుకోడానికి మందీ మార్బలం చేసే ప్రయత్నాల హోరు – వెంట పరుగులు, నవ్వులు, అలిగినట్టు నటనలు, అబద్ధపు బెదిరింపులు, అట్టహాసాలూ – మాటల సునామీలో మనిషి కొట్టుకుపోవచ్చు. “అదో.. టివీలో ఆంటీ చూడు” అని చేతచిక్కిన వాడి ధ్యాస మరల్చే వరకూ అక్కడో టివీ, ఉన్న గొంతంతా వేసుకుని అరుస్తోందని తెలీదు. ఆ గుసగుసల బాతాఖానీని చెవులు నిక్కపొడుచుకుని వింటున్న వారి దగ్గర “ఆఅ.. ఛాయ్.. కాఫీ.. ఆ.. ఛాయ్” అని కేకేస్తున్నోడినే కాదు, “ఆఆ.. నేనూఊ.. స్టేషన్‍లో ఉన్నా.. ఆఆ.. ఏంటీ? సరిగ్గా వినిపడ్డం లేదూ? గట్టిగా చెప్పరా!” అని గావుకేక పెడుతున్నవాడూ బతికేస్తాడు. కాస్త దూరంలో ఉన్న కాంటీనులో గిన్నెల హడావిడి, పక్కనే ఉన్న టీకొట్టులో ఉన్న రేడియోని డామినేట్ చేస్తుంటే, పుస్తకాలు మాత్రం మూగబోయే ఉంటాయి.

ఉన్నట్టుండి కలకలం.. ఇప్పటివరకూ చెవులే శ్రమపడ్డాయి. ఒక్కసారిగే ఎగసే ఉద్వేగాలూ: కలిసిన చేతులు విడిపోతున్నాయనే బాధ, కులుస్తున్నామని హర్షాతిరేకాలు, తప్పించుకుంటున్నామనే ఆనందం, తప్పనిసరై వెళ్తున్నందుకు దుఃఖం, తప్పైపోయిందన్నా వెనక్కి తీసుకోలేని నిర్ణయాలు, తప్పేది కాదులే అనే నిర్వేదం, తప్పులేకపోయినా పడిన శిక్షలూ, పాత గూటికి చేరేడానికి కిలకిలమంటున్న పక్షులూ, కొత్తగా రెక్కలు చాచుకుంటున్న రెక్కల్లో లేలేత భయాలు! నాన్న చేతిని వదిలించుకుని (!) అతడి చిటికెను వేలే ఆధారంగా అడుగులేసే కొత్త పెళ్ళికూతురిలా ఆ ఉద్విగ్న క్షణాలని అనుభవిస్తున్న మనసు, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడాలనుకున్నా, ప్రస్తుతమనే కన్నీటితో మసకబారిన చూపు చేసేదేమీ లేక ముందుకే అడుగేస్తుంది. తప్పదు మరి, ఈ క్షణం చేజారిపోతే మళ్ళీ రాదు. ఈ ప్లాట్‍ఫాం పైకి రావడమే కానీ, వచ్చిన దారినే తిరిగి పోవటం సాధ్యపడదు!  అపరిచితులతో కొత్త పరిచయాల జోరులో పాత పరిచయాలు అపరిచితులుగా మౌనమైపోతున్నా – అడుగులని వెనక్కి మరలలేవు.

అంతే కాదు, ” అక్కడ నుండి ఇక్కడికి వెళ్ళే ఫలనా నెంబరు బండి కొద్ది సేపట్లో ప్లాట్‍ఫాం నెంబర్ ఫలానా నుండి బయలుదేరడానికి సిద్ధముగానున్నది” అనే అనౌన్సుమెంట్లు/హెచ్చరికలూ/బెదిరింపులూ  లేకుండా, ఏ క్షణానైనా   ప్రణయాణికో, మరే ప్రళయానికో ఉరుకులపరుగులతో ప్రయాణం కట్టించేసి ఆనందాతిశయాలూ, ఆవేదనావేశాలూ కలిగించే ఈ ప్లాట్‍ఫార్మ్ పేరు – జీవితం!

Amidst all the chaos, life still continues to be a beautiful platform!