పుస్తకం.నెట్ అట..


హే .. పుస్తకాలకి ఏదో సైట్ పెడుతున్నారట కదా?
ఓ తెల్సిందా?! అవును.. పుస్తకం.నెట్ అనీ.. జనవరిలో ప్రారంభమవుతుందది.

పుస్తక సమీక్షలూ గట్రా ఉంటాయా?
ఊ..

పుస్తక సమీక్షలూ అవీ అంటే అబ్బో బా చదివేవారికోసం కానీ.. 
సమీక్షలనే కాదు, పుస్తకాలతో ఏ చిన్ని అనుభవమున్నా అందులో రాసుకోవచ్చు.

అనుభవాలా? అక్కడెందుకూ? బ్లాగులున్నాయి కదా!
నచ్చిన పుస్తకమనో.. మెచ్చని రచననో ఆనందావేశాలలో రాసేసి బ్లాగుల్లో పెడతాం.  ఓ రెండ్రోజుల్లో అది మరుగున పడిపోతుంది. ఆ తర్వాత దాన్ని విశ్వప్రయత్నంతో వెతకచ్చనుకోండి.. అదే కొత్త వాళ్లకయితే అదీ తెలీదు. అందుకే తెలుగు బ్లాగుల్లో రాసే ఏ పుస్తకం గురించయినా ఒక చోట పెట్టుకుంటే బాగుంటుంది కదా అన్న ఆలోచనతోనే మొదలయ్యింది ఈ ప్రయత్నం. బ్లాగర్లలో పుస్తకాల గురించి టపాలు బానే వస్తున్నాయి. వాటికి “one stop” arrangement అన్న మాట!

ఓహ్.. అయినా నేనెక్కువ పుస్తకాలు చదవను.. టైం ఉండదులే..
అయినా ఫర్వాలేదు! ఈ సైటులో వచ్చే టపాలు చూస్తూ ఉండండి. మీకేదైనా రాయాలనిపించినప్పుడు రాయండి.. తక్కిన వేళల్లో మీ అభిప్రాయాలనో విమర్శలనో చెప్పి వెళ్ళండి. 

పుస్తకం కొని చదవనప్పుడూ.. ఇంకెందుకమ్మాయ్ ఇవి చదువుకోవడం? అనవసరంగా ఊరి ఊరి ఊరుకోవడం..
అదీ నిజమేనేమో. కానీ నాకు పని వత్తిడి వల్ల చదవలేని పరిస్థుతుల్లో సమీక్షలు చదివి అట్టే పెట్టేసుకునేది. సమయం దొరికినప్పుడు ఏం చదవాలో ఎక్కువ వెత్తుక్కోనవసరం లేకుండా! అనుకోకుండా తగలాల్సినవి తగులుతూనే ఉంటాయి. స్వానుభవం చెప్తున్నా.. చదవి తీరాలీ అని కాదు.

నేను అడపదడపా ఓ పుస్తకం చదివినా, అలాంటి పుస్తకాల మీద ఇంటెరెస్ట్ ఉంటుందో లేదో జనాలకి..
ఓహ్.. మన ఫ్రీక్వెంన్సీకి మాచ్ అయ్యే వాళ్ళందరూ మనకి తెలీదులెండి. ఎప్పుడో చట్టుక్కున తగులుతారు. అందుకే మరో ఆలోచనలేకుండా రాసేయ్యండి.

అదే.. అటు చేసి, ఇటు చేసి, “రాయండి.. రాయ(లే)కపోతే కనీసం చదవనైనా చదవండీ” అంటావ్..
మరీ అంత సూటిగా ఎలా అంటాను? అలా కాదు గానీ… ఇంకో మాట అనుకుంద్దాం..

అదేలే.. చదవడం అలవర్చుకోండి.. కనీసం రాయడం కోసమైనా చదవండీ అంటావ్..
అయ్యోయ్యో.. రాయడం కోసం ఎప్పుడూ చదవకోడదండీ! చదవడం..చదవడం కోసమే.. for the sheer pleasure of it.

సరే.. నువ్వే చెప్పు..
చదువండి.. ఆ అనుభవాలు పంచుకోవాలంటే ఈ సైటుందని గుర్తుంచ్చుకోండి..

సరే.. చూద్దాం..
అదే అంటున్నా, చూడ్డం ఒక్కటే సరిపోదు

సరే.. చదువుద్దాం, రాద్దాం
ఆ మాత్రం మాటిస్తే చాలు… ఇహ చూస్కోండి..

ఉండనా మరి?
ఒకె.. చదువుతూండండి, రాస్తూండండి 🙂

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు !

Advertisements

BRB…


madhurimak: ఓయ్య్.. ఉన్నావా?
techie.kiran: ఉన్నా..
madhurimak:
ఏం చేస్తున్నావ్?
techie.kiran: అమ్మాయి గారి రాక కోసం వేయి కళ్ళతో వేయిటింగ్ ఇక్కడ!
madhurimak:
అబ్బా.. ఛ! అంతుందా?
techie.kiran: ఏంటి ఉందా? ఇదో BRB అని అంటూ వెళ్ళావ్.. ఎంత సేపటికీ రావేం?
madhurimak:
ఓహ్.. సారీ కిరణ్. లీడ్‍కి అప్‍డేట్ చేద్దామని వెళ్ళానా, ఇంకేదో టాపిక్ స్టార్ట్ అయ్యింది..మాట్లాడుతూ ఉన్నాం. అందుకే లేట్! అయినా నవ్వు విండో ఓపెన్‍గా పెట్టి, నా (రాక) కోసం దాన్నే  చూస్తూ ఉన్నట్టు అంత బిల్డప్ అవసరమా?!
techie.kiran: బిల్డప్ ఏంటి? నిజంగానే చూస్తూ ఉన్నా! దాన్నే తీక్షణంగా.. దీక్షణంగా!! అయినా ఇలా రోజుల తరబడి రాదల్చుకోలేనప్పుడు BRB కొట్టకూడదమ్మాయ్.. బై చెప్పేస్తే మా విరహ వేదనేదో మేం పడి ఏడుస్తాం.
madhurimak: మహా ప్రభో.. మన్నించు! ఒక ఇరవై నిమిషాలు రాలేదని ఇన్ని క్లాసులా?
techie.kiran: ఇరవై నిముషాలు దాటి ఒక సెకన్! నీకలానే ఉంటుంది.. నీ అక్షరాలు రాకపోతే నాకెమవ్వుతుందో నాకేం అర్థమవ్వదు.. 😦
madhurimak: ఓహో.. అంతదాకా వచ్చిందా?
techie.kiran: వచ్చింది.. ఇంకెందాకా పోతుందో?!
madhurimak:
రేపు సినిమాకెళ్తున్నా నేను..!
techie.kiran: ఎవరితో?
టాపిక్ భలే మారుస్తావ్!
madhurimak:
నా కాలేజ్ మేట్స్.. ఒక ఫ్రెండ్ పెళ్ళికని వచ్చారు. సో.. ఒక సినిమా చూద్దామని ఫిక్స్ అయ్యాం. డిన్నర్ కూడా..
:)… టాపిక్ మార్చటం భలే నేర్పించావ్!
techie.kiran: ఓహో..
madhurimak: పెళ్ళి తెల్లవారు ఝామున. 😦 రాత్రంతా మేల్కోవాలి. మర్నాడు ఆఫీసులో ఇంపార్టెంట్ మీటింగ్. లీవ్ ఆప్రూవ్ కాలేదు. రావాలి 😦
techie.kiran: ఓహ్! ఎగ్గొట్టేయ్య్.. కడుపు నొప్పని చెప్పు..
madhurimak:
హహహ.. కడుపునొప్పి!! :))
అయినా పెళ్ళిళ్ళు ఇంత untimelyగా పెడతారేంటి? నిద్రలు పాడేయ్యేట్టూ..
techie.kiran: మరే! కాఫీ బ్రేక్‍లో ఎంగేజ్‍మెంట్.. లంచ్ బ్రేక్‍లో పెళ్ళీ పెట్టుకోమనాల్సింది.. లీవ్ కూడా అక్కర్లేకుండా!
madhurimak:
హిహిహి.. not a bad idea, i say! 😉 మనం ట్రై చేద్దామా?
techie.kiran: NO WAY.. our marriage would be celebrated in the most grandest of ways, and that is FINAL!!
madhurimak:
నాకు పెళ్ళిళ్ళు సింపుల్‍గా ఉంటేనే ఇష్టం. 
techie.kiran:
అయినా సరే.. I wanna celebrate.. నా జీవితంలోకి నీ రాకను నేను సెలబ్రేట్ చేసుకోవాలి.
You’re special in my life.
madhurimak:
🙂
techie.kiran: blushing?
madhurimak:
అంత లేదు బాబూ… ఒక స్పెషల్‍కే?! ఆహా!!
అయినా.. మీ వాళ్ళింకా ఎవరూ ఏ మాటా చెప్పలేదట, నిన్న రాత్రి నాన్న అంటుంటే విన్నాను. మీ వాళ్ళకి నేను నచ్చలేదా? వస్తారు కదా కిరణ్?
techie.kiran: నువ్వేం ఆలోచించద్దూ.. మనం పెళ్ళి చేసుకుంటున్నాం అంతే!
madhurimak: మీ వాళ్ళు కాదంటే! జాతకాలూ.. అవీ కలవాలి కదా..
techie.kiran:
ఎదిరించి పెళ్ళి చేసుకోవడమే..
madhurimak: అబ్బో.. అప్పుడు మనదీ చరిత్రలో మరో ప్రేమ కథ అవుతుంది. మరో సినిమా తీయ్యచ్చు..
techie.kiran: హహహ..jokes apart, వాళ్ళ సమక్షంలోనే నిన్ను మొదట చూశాను. అప్పుడే చెప్పాను నువ్వు నచ్చావని. ఇప్పుడు కాదూ కూడదూ అంటే నా వల్ల కాదు.
madhurimak:
హమ్మ్..
techie.kiran: మన లవ్ స్టోరీకి పేరు ఆలోచించిస్తూ ఉండు.. ఇప్పుడే వస్తా..
madhurimak:
ఏం?? ఎక్కడికి?? 
techie.kiran: నేనొచ్చేవరకూ ఈ విండోని అలానే చూస్తూ ఉండు.
madhurimak: మన లవ్ స్టోరీలో మొదటి సీస్ జీటాక్ విండోతోనే స్టార్ట్ అవుతుంది 😛
techie.kiran: 🙂 నువ్వలా నాకోసం చూస్తూ ఉన్నట్టా ఆ సీన్‍లో?
madhurimak: దీక్షణంగా.. తీక్షణంగానా? 😉
techie.kiran: అబ్బబ్బా.. వాహ్! క్యా సీన్ హై!
madhurimak:
ఇది అన్యాయం కిరణ్.. కేవలం నన్ను పరీక్షించడానికే వెళ్తున్నావ్ కదా!
techie.kiran: హే లేదు..
madhurimak: చెప్పు మరి.. ఎక్కడికెళ్తున్నావ్?
techie.kiran: అదీ..
madhurimak:
ఊ.. అదీ..
techie.kiran: తల్లీ.. రెస్ట్ రూంకి వెళ్ళాలి.. అది నీతో ఎలా చెప్పేది? మీ అమ్మాయిలతో ఇదే తంటా.. ప్రేమించడానికీ, వేధించడానికీ తేడా ఉండదు..
madhurimak: ఛీ.. పో! పెద్ద వచ్చాడు.. girls psychologist..
techie.kiran:
పోతున్నా.. BRB
madhurimak: 🙂 నేను చూస్తూనే ఉంటాను..

madhurimak: ఓయ్య్.. ఎంత సేపూ?

madhurimak: ఇంకానా? ఏం చేస్తున్నావ్ బాబూ?

madhurimak: seems like you’re caught up with something. ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు. సరే.. నేనిక ఇంటికెళ్తున్నా! ఫోన్ చెయ్యి.. ఫ్రీ అవ్వగానే.. బై!

ఆ విండో close అయ్యింది, ఇంకో కొత్త విండో ఎప్పటికీ తెరచుకో(లే)దు. రెస్ట్ రూంలో జారిపడ్డం వల్ల తలకి గాయమై కిరణ్ క్షణాల్లో గుడ్‍బై చెప్పేశాడు. కొన్ని గంటల తర్వాత అది ముధురిమకి చేరింది. చూసి చూసి విండో క్లోస్ చేసినట్టు, ఎప్పటికో కిరణ్ కూడా జ్ఞాపకాల నీడల్లో దాగిపోతాడు. అప్పుడప్పుడు.. ఉలిక్కిపడేలా గుర్తొస్తూనే ఉంటాడు. 

ఎడబాటు


శీతాకాలం సాయంత్రం; చలీ-చీకటీ పాత స్నేహితులైయ్యినట్టు చేతిలో చేయి వేసుకుని వచ్చాయి. “బై..టేక్ కేర్” అని చెప్పేక కూడా ఇంకా ఏవైనా మాటలు పుట్టుకొస్తాయేమో అని కట్ చేయకుండా ఇద్దరం వేచి చూసిన ఆ క్షణాల్లోని నిశ్శబ్ధంలోనే ఉన్నానింకా, ఫోన్ డిస్‍కనెక్ట్ చేసి ఐదు నిముషాలవుతున్నా! నా పరధ్యానాన్ని ఆసరా చేసుకుని కొంటె గాలి చుట్టూ చేరి నన్నల్లుకుపోయ్యింది. ఒక్కసారి ఉల్లిక్కిపడిన భుజాలకి చేతులను ఆసరా ఉండమని పురమాయిస్తే. అవి కాస్తా మృదువైన చున్నీ తగిలేసరికి కాసింత గతి తప్పాయి. స్పర్శ  కలిగించే తన్మయత్వంలో అప్రయత్నపు స్పందనలా చున్నీ ఒక్కసారి అలా గాల్లోకి తేలి, తనలో కలిగిన గిలిగింతలతో నిన్ను ఉక్కిరిబిక్కిరి చేయ్యాలని ఉబలాటపడి, నీ జాడకై కాసేపు రెపరెపలాడి మళ్ళీ భుజాల మీద నిరసంగా జారిపోయింది.  నీ గొంతులోని కొంటెతనం నాలో కలిగించిన భావావేశాన్ని మాటల్లో తర్జుమా చేసి నీదాకా చేర్చలేక నీరసించిపోయిన నాలా ఉంది నా చున్నీ ఇప్పుడు.

మన సమక్షంలో విరిసిన క్షణాలీపాటికి కాలాగమనంలో అంతర్థానమయ్యినా, వాటి తాలూకూ సువాసనలింకా నాకు ఊపిరి అవుతూనే ఉన్నాయి. అందుకేనేమో ఈ ఉలికిపాటు, ఉబలాటం, అర్థంలేని ఆశ, అర్థమవుతున్నా అర్థం చేసుకోనని మొండిపట్టు. గంటల తరబడి ఫోన్లూ, ఎడతెరిపి లేని ఛాటింగులూ కూడా పూరించలేని ఈ ఎడబాటులోని  ప్రతి చర్యా  నాలో ఉన్న “నిన్ను”ని రేపుతోంది. 

I miss you, not because of your absence here, but because I lose my presence when not with you! 

******************************************************************************

ఈ ఊహకి ముఖ్య ప్రేరణ, ఈ కింది కవిత:

Your absence has gone through me
Like thread through a needle.
Everything I do is stitched with its color.

— W.S. Merwin

నాకు అనువాదాలు చేతకావు, నాకే భాష మీదా పట్టులేదు. భావావేశంలో మాత్రం అప్పుడప్పుడూ స్పందనలని పట్టుకోవాలని ప్రయత్నిస్తాను, సీతాకోక చిలుక కోసం తాపత్రయపడే చిన్నారిలా! పర్యవసానం అందరికీ తెలిసిందే! 

ఈ ఆంగ్ల కవితకి భైరవభట్లగారు ప్రయత్నించిన అనువాదం, ఇక్కడ మీ అందరి కోసం:

వెలితి
—–
నీ వెలితి
సూదిలో దారంలా నాలోంచి దూసుకుపోయింది.
ఇక నా ప్రతీ చేష్టలో
ఆ రంగే అల్లుకుంటుంది

Any more takers? 😉

Camకి చిక్కని చిత్రాలు!


గడచిన వారాంతంలో చేసిన ప్రయాణంలో డిజికామ్ అక్కరకు రాలేకపోయినా, మనోనేత్రంలో స్థిరపడిపోయిన కొన్ని ఛాయాచిత్రాలను అక్షరాలలోకి తర్జుమా చేసే ప్రయత్నం.  చూద్దామా మరి?

అటో నక్షత్రమైన తీరు:
మా వాళ్ళేదో కౌంటర్ వేశారు నా మీద అనిపించి పుస్తకంలో నుండి తేలి, వాళ్ళవంక రుసరుస చూద్దామని తలపైకెత్తా! తీరా చూస్తే కౌంటర్ పొట్లంలో పొగడ్త పెట్టారని గ్రహించి, నవ్వుకోలేక, నవ్వు ఆపుకోలేక ముఖం పక్కకు తిప్పుకునేసరికి, వెన్నెలలో బయటంతా బూడిద రంగులో ఉంది. బూడిద కూడా కాదు, అదో గమ్మత్తైన నలుపు.. మొద్దుబారిన పెన్సిల్ ములుకుని అడ్డంగా వాలుస్తూ కాగితం మీద బాగా రుద్దాక, ఒక చిన్ని కాగితం ముక్క తీసుకుని పైపైన రుద్దితే వచ్చే నలుపు కాని నలుపులా ఉంది. అక్కడున్నది పచ్చని పైరో, ఖాళీ స్థలమో నిర్ణయించుకునే లోపు మా రైలు వెళ్తున్న దారికి ఓ ముప్పై డిగ్రీల ఆంగిల్ చేస్తూ ఉన్న మట్టి దారి మీద ఒక ఆటో వెళ్తూంది. హైద్‍లో కనిపించే సెవెన్ సీటర్ కన్నా చిన్నది, మామూలు ఆటో కన్నా పెద్దది. జనాలున్నారు, డ్రైవర్‍తో పాటు. రైలు వేగంతో ఆ ఆటో నా కంటికి దూరమవుతూ ఉంది. ఇంతలో, ఆ ఆటో ఉన్న వాళ్ళు ఈ ట్రైన్‍ని చూసి ఏమనుకుంటున్నారో అన్న చిన్ని ఊహ! ఏ చిన్నారికో.. “చూడురా.. రైలెళ్తోంది” అని ఏ నాన్నో చూపిస్తున్నారా? లేక ఆ చిన్నారే.. “నా..న్నా… అదో లైలు.. బేద్ద లైలు” అని చెప్తుందా? పరిగెత్తే రైలు వెనుక పరిగెత్తని మనసు ఉంటుందా? లేక చీకటి రాత్రి నిశ్శబ్దాన్ని బద్దలు చేస్తున్నందుకు విసుక్కుంటారా? ఈ ఆలోచనలతో నేను ఎక్కడికో వెళ్ళిపోవాల్సింది. కానీ కళ్ళు ఆటోనే వెంబడిస్తున్నాయి. ఆటోలో మనుషులు మరుగయ్యారు, చక్రాలు కనిపించడం లేదు, కాసేపయ్యాక అసలు అక్కడ ఆటో ఉందని ఎవరికీ చూపించే వీలు లేదు. ఓ రెండు నిమిషాల నుండి చూస్తున్న ఆ ఆటో ఇంకా ఇప్పుడు నా “దృష్టిలో” ప్రాణంతో ఉండడానికి కారణం దాని హెడ్‍లైట్! పూర్తి ఆకారం చీకటిలో కలిసిపోయినా ఆ హెడ్‍లైట్ నా కంటికి దాని ఉనికి చాటుతూనే ఉంది. కాసేపటి వరకూ ఒక నక్షత్రంలా మెరుస్తూ ఉంది. నేలమీద నడుస్తున్న నక్షత్రంలా! ఇంకాసేపటికి రాలి… పోయింది నక్షత్రం!!

సైడ్ లోవర్ బర్త్ సీనరీ:
“సైడ్ లోవర్ బర్త్  అనెడి నాన్‍సెన్స్” అని రాయాల్సిన ఈ పేరాకి ఆ శీర్షిక పెట్టడానికి ఒకే ఒక్క కారణం, విజయవాడ స్టేషనులో రాత్రి మూడున్నరకి మా వాడినొక్కడిని తిట్టుకుంటూ లేచినా కళ్ళప్పగించి చూసిన ఒక మనోహర దృశ్యం. ఏవో కొన్ని లైట్లు కనిపిస్తే బిగించేసిన కిటికీ తలుపులు తెరిచాను. ఎత్తుగా ఉన్న వీధి దీపాల వల్ల తెల్సింది, అక్కడ ఓ కొండ ఉందని. “ఏదో కొండ.. ఏవో కొన్ని దీపాలు.. చల్..” అనుకుని ముసుగుపెట్టి పడుకుందామనుకుంటుండగా, కనిపించాయి, రెండు కొండలు మరీ దగ్గర దగ్గరగా! ఇప్పటికి కూడా ఆ ఆకారం నా కళ్ళల్లో మెదలాడుతున్నా అక్షరాల్లో పెట్టడం నా వల్ల కాదు. ఒకరి తలపై ఒకరు తల వాల్చి కూర్చున్నప్పుడు ఏర్పడిన ఏ ఇద్దరి నీడలానో ఉండచ్చు.. ఉండకపోనూ వచ్చు! మనకి కావాల్సింది మాత్రం ఆ రెండు కొండల ( లేక ఒకటే కొండ ఏమో.. ) మధ్యన అర్థచంద్రాకారం ఏర్పడడం.. అక్కడే నిండు పున్నమి చంద్రుడు! కళ్ళంటూ ఉంటే చూడాల్సిన సీను అనుకున్నా మనసులో!! బాక్‍గ్రౌండ్ మొత్తం చీకటి.. అదే ఆ బూడిద రంగు చీకటి. ఓ రెండు కొండలు.. లేక కొండల్లాంటి ఆకారాలు, ఇంచులు కొలిచి మరీ మధ్యన “ప్లేస్” చేశారనిపించేలా ఒక నిండు చందమామ, చందమామకి అక్కడక్కడా ఎర్రని షేడ్ చేసినట్టూ! ఆ మసక వెలుతురు.. ఆ నిండు జాబిలీ.. వేగాన్ని పుంజుకుంటున్న రైలు, ఒకే లైటు వెలుతురులో నిద్రపోతున్న కంపార్ట్ మెంట్, చలి గాలికి భుజాలను చుట్టేసిన చేతులూ, వాలడానికి ససేమీరా అని నిరాకరించే కనురెప్పలు! It was breathtaking, if not anything else.

ఆ కొండమీద నుండి రైలుతో పాటు చంద్రుడు కూడా రాసాగాడు; వెన్నక్కి వెన్నక్కి ఉంటూ.. ఆచి తూచి అడుగులేస్తున్నట్టు. రైలు నెమ్మదిగా పోతుంటే.. తానూ నిదానమైపోతాడు. రైలు పరిగెడితే.. తానూ పరుగందుకుంటాడు. ఆఖరికి ఏదో క్షణాన ఓటిమి ఒప్పేసుకుని కనుమరుగవుతాడు. అచ్చు.. ఇష్టపడిన పిల్ల వెంట వెళ్ళలేక, ఆగలేక తికతికపడే ఓ టీనేజీ కుర్రాడిలా!

మంచులో కోనసీమ – కోనసీమలో మంచు:
“హా.. ఆ గయా.. ఆ గయా.. ఛలో ఉఠో..” అంటూ ప్రాణాలు తోడేసినవాడిని కసి తీరా కొట్టడానికని లేచాము. కానీ ఎక్కడ? అప్పుడే తెలతెలవారుతున్న వెలుతురులో పచ్చని పొలాలన్నీ మంచు దుప్పటి ముసుగు తన్ని మరీ పడుకున్నాయి. కోనసీమలో అంత మంచు ఉంటుందని ఊహించలేదు.. ఆశ్చర్యం వల్లనేమో ఆనందం ఇంకా హెచ్చింది. అప్పటి దాకా, ఓ కొబ్బరి చెట్టు ఆకుల్లో ఈనులు లెక్కపెట్టేంత స్పష్టంగా ఉంటుంది. చూస్తూ చూస్తూ ఉండగానే మసకలో కరిగిపోతూ, “అసలక్కడ ఏమీ లేదే” అన్నట్టు మారిపోవడం. “ఓ గంట ముందు ఏం చేశావ్?” అని అడిగితే మెదడులో ఉన్న మబ్బంత మంచక్కడ! ఇంకా మంచుపట్టిన ప్రాంతాల్ని చూశాను. కానీ ఇది ఎందుకో ప్రత్యేకం అనిపించింది. రైలు కిటికీ ఎంత చిన్నదో మొదటిసారి తెల్సొచ్చింది. డోర్ దగ్గర నిలబడి చూస్తున్నప్పుడు ఎలా ఉంది అంటే: తెల్లని దుప్పటి వేసిన మంచం మీద, తెల్లని బట్టలు చుట్టేసిన నెలల పసికందు నిద్రపోతున్నప్పుడు.. కాస్త దూరం నుండి చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. పాపాయి మొహం మాత్రమే కనిపిస్తూ నిద్రలో ప్రశాంతంగా, ఆ ప్రశాంతత వలన చుట్టూ ఉన్న తెలుపు ఇంకా తెల్లగా అవుతుంది. ఉదయం ఆరవుతున్నా.. కోనసీమ ఇంకా మత్తుగా నిద్రపోతూనే ఉంది. 
   
మలిప్రేమ! 😉
మొదటిదెప్పూడూ తీయ్యనిది, తొలిప్రేమా.. తొలిముద్దూ.. తొలి ప్రేమలేఖ అంటూ ఓ మెలికలు తిరిగిపోతాం కానీ, is there something like falling for, all over again? గోదావరిని చూసేశాను కదా అని ఏ మాత్రం ఎక్సైట్ కాకుండా వెళ్ళానా.. అయినా ఏం లాభం, కొండల మధ్య వంపులు తిరుగుతున్నా గాంభీర్యంగా కనిపించే గోదారి నది చూస్తూనే పడిపోయాను.. మళ్ళీ! ఆ పడ్డం కూడా మామూలుగా పడ్డం కాదు, ఎత్తైన కొండ చివర్న నుంచుని, చేతులు చాచి.. పడుతున్నా అన్న పూర్తి స్పృహతో.. అది ఇచ్చే స్వేచ్చా ఆనందాలతో పడ్డటం మాట! గోదావరిలో ఏదో ఉంది.. ఏంటో వెత్తుక్కోలేదు, ఆ గమ్మత్తు ఏంటో గానీ, మత్తు మాత్రం భలే ఉంటుంది. ఇప్పటికే ఈ నది మీద కవిత్వాలూ, కథలూ బాగా వచ్చి ఉన్నాయి, నేనూ అందులో అతి సామాన్య ప్రేక్షకురాలనుకుంటా!

నదిలో.. కొండ నీడన.. వాళ్ళిద్దరూ..
పాపికొండల వ్యూ పాయింట్ వచ్చే ముందే అనుకుంటా, వచ్చీ రాగానో.. సరిగ్గా గుర్తు లేదు, ఓ పేద్ద కొండ, దాని నీడన ఒక చిన్ని పడవలో (పడవ కూడా అనకూడదేమో.. దానికో పేరుండే ఉంటుంది.. బోట్ అనుకుంద్దాం) ఒక జంట. సన్నని చీలికలా ఉన్న ఆ బోటులో ఓ పక్క ఆమె.. మరో పక్క అతడు. మధ్యన వలతో తంటాలు పడుతున్నారు. దూరం నుండి చూస్తున్నా, వారిద్దరికీ వయస్సు మళ్ళిందని తెలిసిపోతుంది. ఆ పూట బువ్వ కానిచ్చుక్కుని, ఏ రాత్రికో సరంజామా సిద్ధం చేసుకుంటున్నారేమో! ఈ ప్రయాణం మొదలెట్టి ఎన్నేళ్ళయ్యిందో! సహజీవనం అంటే ఒక అరుదైన గౌరవం కలగడానికి ఇదే కారణం, జీవితపు మలి సంధ్యలోనే దాని అందం పరిపూర్ణంగా తెలుస్తుంది. పైన చెప్పిన అన్ని సందర్బాల్లోనూ cam నా దగ్గర లేదు, కారణాంతరాల వల్ల. ఈ ఒక్క సందర్భంలో నా చేతిలోనే ఉన్నా.. ఫోకస్ చేసి, జూమ్ సెట్ చేసి, క్లిక్‍మనిపించటం వాళ్ళ ప్రైవసీకి అడ్డుగా తోచింది. నేను తీయలేదు, మరెవరినీ తీయనివ్వలేదు. మా తిరుగు ప్రయాణంలోనూ కనిపించారు, అక్కడే.. పని ముగించుకుని అప్పుడే బయలుదేరుతూ.

గ్లాసు ముందా? మేం ముందా?
అదృష్టం మరీ ఎక్కువై మేం ప్రయాణించిన బోటు తిరుగు ప్రయాణం మధ్యలో చతికిలపడి, గోదారమ్మ ప్రవాహ వేగం మీద ఆధారపడింది.  ఎవరో పడేసిన ప్లాస్టిక్ గ్లాస్‍ నిటారుగా నిల్చుని ఠీవిగా పోతోంది. అంతే వేగంతో మేము కూడా! చీకటి పడడానికి అంతా సంసిద్ధమయ్యే వేళ, అలా నదిలో కొండల మధ్యన ఉండిపోవాల్సి వస్తుందేమో అన్న ఆలోచన వచ్చినప్పుడు మాత్రం గుండె పాపం, బెంబేలు పడిపోయ్యింది. Castaway సినిమాలో హీరో దగ్గర బంతిలా, ఇక ఈ గ్లాసే మనకి తోడు అన్నంతగా వెళ్ళిపోయారు మాలో కొంత మంది. ఇంజెన్ రిపేర్ అయ్యి, బోటు గాడిన పడేసరికి పందెం మేమే గెలిచేసాం.

“అయ్యో.. గ్లాసు ఒక్కటే ఉండిపోయిందే!” అనుకునే బాధ వేరుగా ఉండేది. నిజానికి ఆ గ్లాసుకి చాలా “కంపెనీ” ఉందక్కడ! తిని పారేసిన ప్లేట్లూ, లేస్ కవర్లూ, గ్లాసులూ, బెలూన్‍లూ, ఈనాడు నుండి అన్ని దినపత్రికలూ, కాగితాలూ – అవీ ఇవీ అని కాక అన్నీ అక్కడ మునగలేక, ఈదలేక కష్టాలు పడుతున్నాయి. ఈ పాపికొండల ట్రిప్ పాకేజీలూ చాలా విస్తారంగా వ్యాపారం చేయిస్తున్నాయన్నదానికి ప్రత్యక్ష సాక్ష్యాలివీ! రెండేళ్ల క్రితం గోదావరికీ, ఇప్పటికీ చాలా తేడా. అసలు మనుషులు కాలు పెట్టగలిగిన ప్రతీ చోటూ ఇలా మరకలే ఉంటాయా? హమ్మ్.. 

నిరంతర మాటల స్రవంతి..


స్థలం: ఎఫ్.ఎం స్టూడియో
సమయం: సాయంత్రం ఐదు గంటలు


హల్లో.. ఆదాబ్.. నమస్కారం.. గుడ్ ఈవెనింగ్..
వచ్చేశాను.. వచ్చేశాను.. నేనొచ్చేశాను, సాయంత్రం అయిదవ్వగానే ఎవరు వస్తారు?
వాన దేవుడు రానా వద్దా అని ఓ తెగ మొహమాటపడుతున్నాడు
మనద్దగ్గర అలాంటి మొహమాటాలేం లేవు
అందుకే మీరు వెంటనే ఎస్.ఎం.ఎస్ చేసి, మీకు నచ్చిన పాటను రిక్వెస్ట్ అడగండి. నంబర్లు గర్తున్నాయి కదా? ఏదీ నాతో పాటు చెప్పండి.. బి.ఎస్.ఎన్.ఎల్ సబ్‍స్క్రైబర్స్ 8765 కి, ఏర్టెల్ హచ్ వాళ్ళు, 7765 కి, రిలయన్స్-4362 కి ఎస్.ఎం.ఎస్ పంపించండి.
వాహ్..వాహ్!
బయట చల్ల చల్లగా ఉంది కాబట్టి వెచ్చ వెచ్చగా మీకోసం ఈ పాట
“మీ కోసం” మాత్రమే మీ ఆర్.జె స్రవంతి, ది స్మార్ట్ స్రావ్స్ వేస్తున్న పాట
వినండి.. వినండి.. ఆడుతూ పాడుతూ.. ఓన్లీ ఆన్ 96.3 ఎక్స్ ఎఫ్.ఎం!!

డోలె..డోలె యె జరజర..

నువ్వెందుకమ్మాయి మధ్యలో అంటారా? అంతే, అంతే నాలోని గాయకురాలిని ఈ పాపిష్టి లోకం ఇలానే చంపేసింది. మరీ ఎక్కువయ్యిందా? సరే..సరే.. పాట వినండి..

హాట్, హాట్ సాంగ్ విన్నారు కదా! గబగబా మీరు పంపిన మెసేజెస్ చూసేద్దాం.

“హాయ్ స్రావ్స్.. యు రాక్! నాకు నచ్చిన పాట గజినిలో గుజారిష్.. అదే టాప్ సాంగ్‍గా వేయి ప్లీజ్” అని రమేష్ పంపించారు. రమేష్.. థాంక్యూ సో మచ్!

“your show is like sun for me, which comes at the time of sunset. It brings light and joy to me. Please play song from…” మెసేజ్ పూర్తిగా రాలేదు కాబట్టి ఏం పాటో నేను చెప్పలేను. మీ పేరు కూడా తెలీలేదు. మీరు మళ్ళీ ఎస్.ఎం.ఎస్ చేయండి.

“స్రావ్స్ అంటే నాకిష్టం, స్రావ్స్ లేకపోతే అంతా చీకటి నాకు. నీ వాయిస్ చాలా బాగుంటుంది. ప్లీజ్ మాట్లాడుతూనే ఉండవూ”  అని ఎవరో పంపించారు. దీనికి కూడా పేరు లేదు. ఇలా మాట్లాడూ, మాట్లాడూ అంటూ ఆ తర్వాత, అమ్మాయెప్పుడూ మాట్లాడుతూనే ఉంటారనడానికేం! అన్నీ తెలుసులే.. మీ గేములు.

ఇప్పుడీ పాట వినండీ.. వినండీ.. ఆడుతూ, పాడుతూ..

                                                 **************************

స్థలం: ఒహ్రీస్ బంజారా
సమయం: రాత్రి ఎనిమిది

రాజ్: ఏంటంత మూడీగా ఉన్నావ్?
స్రవంతి: బా టైర్డ్ గా ఉన్నాను. ఓపిక లేదు.
రాజ్: షోలో గొంతు చించుకుంటావ్ కదా?
స్రవంతి: చెప్తున్నా కదా రాజ్, వంట్లో బాలేదని.. ఇవ్వాళ షో అలానే చేశాను. తప్పదు కదా?
రాజ్: ఐ డోంన్ట్ నో.. నీకందరి దగ్గరా ఓపికుంటుంది. అందరికీ టైం ఇస్తావ్.. కానీ నా దగ్గర వచ్చేసరికి ఏవో చెప్తుంటావు.
స్రవంతి: ప్లీజ్ రాజ్, అర్థం చేసుకో.. ఓవర్ లోడవుతున్నా.. చాలా పనుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకో షో చేయ్యాలి. గాయత్రి రాలేదు కదా!
రాజ్: అదే అంటున్నా, నీకు అందరూ కావాలి. అందరి ప్రాబ్లెమ్స్ అర్థమవుతాయి. కానీ..
స్రవంతి: ….
రాజ్: చూడు, నా దగ్గరున్నప్పుడే నువ్వేం మాట్లాడవు. ఇంత సైలెంటుగా మూగదానిలా బొమ్మలా కూర్చుంటావు. I’m missing you, అంటే అర్థం కాదేం నీకు? అందరిలానే నేనూ నీ ప్రొగ్రాముల్లో నీ మాటలు వినాల్సిందేనా?
స్రవంతి: రాజ్.. ఐ కాన్ అండర్‍స్టాండ్ కానీ…
రాజ్: నాకు నీ explanations అక్కరలేదు..
స్రవంతి: …
రాజ్: …..
స్రవంతి: నేనిక వెళ్తాను.
రాజ్: ఆగు.. డ్రాప్ చేస్తాను.
స్రవంతి: వద్దు.. బై!
                                           ***************************

స్థలం: ఎఫ్.ఎం స్టూడియో
సమయం: రాత్రి పదకొండు

ఇయర్ ఫోన్స్ పెట్టుకుని నిద్రలోకి జోగుతున్న వారికి, లేట్ నైట్ షిఫ్ట్స్  చేస్తూ నిద్రను తరిమేయడానికి ప్రయత్నిస్తున్న వారికీ – అందరికీ “లవ్ డాక్టర్” ప్రోగ్రాంకి స్వాగతం. కమ్మని పాటల మధ్యలో మనం బోలెడన్ని మాట్లాడుకోవడానికి, మీ ప్రాబ్లెమ్స్ నాతో షేర్ చేసుకడానికి మీరు కాల్ చేయవలిసిన నెంబర్స్- 66887342, 28901234
 

ఇప్పుడు మన ఫస్ట్ కాలర్‍ని చూద్దామా!

“హలో..”
“హలో.. స్రవంతి గారు, నేను అరుణ్ “
“చెప్పండి.. అరుణ్.. ఎక్కడనుండి?”
“అమీర్ పేట నుండి.. నేను మీ ప్రోగ్రాం రోజూ చూస్తానండి”
“హహ.. నాకూ ఆ మంత్రం నేర్పించండి. ఎలా చూస్తారు? వింటారా మరి? “
“అదీ..అదీ.. మొదటి సారి లైన్ కలిసింది. కాస్త నర్వెస్ గా ఉంటే..”
“నర్వెస్ దేనికి. జస్ట్ ఒక ఫ్రెండ్‍తో మాట్లాడినట్టే మాట్లాడండి.. “
“నేనెక్కువ మాట్లాడనండీ.. ఎందుకో భయం! అందుకే నాకెక్కువ ఫ్రెండ్స్ కూడా లేరు. మీలా నవ్వుతూ, తుల్లుతూ మాట్లాడాలని ఉంటుంది. కానీ.. ఏమో.. నేనలా ఉండలేను. మీ చుట్టూ ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులండీ..”
“….. “
“మీరు వట్టి స్రవంతి కాదు, నిరంతర మాటల స్రవంతి..”
“మీరూ మాట్లాడచ్చు కదా అందరితో?”
“చెయ్యాలనిపించకపోతే నేనేం చెయ్యను అంతే”
“ఇంకేం మరి! మీకు నచ్చినవే చేస్తూ, జీవితాన్ని ఆనందించేయండి. మాట్లాడటం ఒక్కటే అన్నీ కాదు. మిమల్ని అర్థం చేసుకునే వారు మీతో ఎప్పుడూ ఉంటారు. ఇంతకీ మీకేం పాట కావాలి?”
“గోదావరి సినిమాలో “మనసా..వాచా” పాట వేయగలరా?”
“ఎందుకా పాట?”
“చాలా ఇష్టం..”
“సరే.. మీకోసం ఆ పాట.. వేస్తున్నాను.. థాంక్స్ ఫర్ కాలింగ్!”

                                                        *****************

As they say, the show must go on! Kudos to all those people, who let the show ON!
(ఇది పూర్తిగా ఊహాత్మక ప్రయత్నం. Any resemblance of whatever kind and to whomsoever is a pure co-incidence.)
 

పంచుకున్న ఆనందం..


కిక్కిరిసిన క్రికెట్ స్టేడియం అది. ఇంకా వేసవికాలం తన ఇన్నింగ్స్ డిక్లేర్ చేయలేదు. సాయంకాలం వేళ సూర్యుడు అస్తమిస్తూ కూడా తన తీవ్రతను రుచి చూపిస్తూనే ఉన్నాడు. స్టేడియం పడమటి సీటింగంతా ఇంకా వేడి పెనంలానే ఉంది. గుచ్చి గుచ్చి చూస్తున్న సూర్యుడిని తప్పించుకోడానికి  ప్రయత్నంగా చున్నీని తల మీద నుండి కప్పుకుంది వినీల. పల్చని తెల్లని షిఫాను నేత నుండి వెళ్ళి సూర్యకిరణాలు ఇప్పుడో కొత్త అందాన్ని సంతరించుకుని మరీ ఆమె మొహాన్ని తాకుతున్నాయి.

“లేదు రా మామ.. ఇంకా టాస్ వేయలేదు.. ఆ.. వాడు లేడన్నారు గా? ఇంకా తెలీద్రా ఆడుతున్నాడో లేదో..” అంటూ మాట్లాడుతున్నాడు రవి.

“సరే రా.. బై.. మల్లా కాల్ చేస్తా..” అంటూ కట్ చేసి, “రమేష్ గాడి ఫోన్.. రాలేనందుకు చాలా ఫీల్ అవుతున్నాడు వాడు.. ఛా.. వాడుండాల్సింది” అని వినీలకి చెప్పాడు. చున్నీని సుతారంగా వెనక్కి తీస్తూ, కళ్ళల్లోకి నేరుగా పడుతున్న సూర్యకిరణాల తీవ్రతకి మూసేసిన రెప్పలను బలవతంగా తెరవడానికి ప్రయత్నిస్తూ అతడి వైపు చూసింది.

“ఇంకా ఎంత సేపు మొదలవ్వడానికి?” అడిగింది ఏ మాత్రం ఆతృత లేకుండా!

“ఏంటి? అప్పుడే బోర్ కొడుతుందా?” అన్న తన సమాధానం బదులో ప్రశ్నవేసి, దానికి ఆమె బదులేమిస్తుందో అన్న ఆసక్తి కూడా లేకుండా, కూర్చున్న మెట్టు మీదే నిల్చుని సాగి మరీ ఆటగాళ్ళని చూసే గుంపులో గోవిందుడయ్యిపోయాడు.

“వో.. ధెఖో..” ఎవడో ఒకడి గొంతు ఓ వంద కళ్ళను ఒకే వైపు తిప్పింది.  

“గుండుగాడు.. గిబ్‍స్ రా వాడు”
“ఆ జుట్టు ఫెలో.. ఇషాంత్, ఇక్కడ నుండి కూడా మస్త్ స్ట్రైకింక్ ఉన్నడు లే”
“హే.. లుక్ ఎట్ హిమ్! రో..హిత్.. గాడ్! హిస్ చో.. క్యూట్”

వార్మ్ అప్ అవుతున్న ఆటగాళ్ళని చూస్తూ అందరూ సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు. కిక్కిరిసిన క్రికెట్ స్టేడియం – అదో వింత లోకం. కళ్ళకి సాంత్వన కలిగించే పచ్చటి గ్రౌండ్ మధ్యలో! చుట్టూ మాత్రం మానవ హోరు జోరీగ నసలా ఒకలాంటి శబ్ధం, సున్నితమైన కర్ణభేరిని కాస్త ఇబ్బంది పెడుతూనే ఉన్నా మనస్సులో రేగుతున్న ఉత్సాహంలో అది కూడా కమ్మని పాటలా ఉంటుంది. ఇక్కడ తీరాన్న ఉన్న మానవ అలల జోరు, నడి మధ్యనున్న వాళ్ళని సూటిగా తాకుతుంటుంది. ఉవ్వెత్తున్న లేచే ఆనంద కెరటం! కేరింతలూ, పలవరింతలూ, ఆనంద హేళలూ; కుదరని పక్షంలో నిరాశా నిస్పృహలు, నిశ్శబ్దాలు, విప్లవాగ్నులు అన్నీ సాధ్యం. అదో మత్తు, ఒకే మత్తులో ఉన్నాళ్ళందరితో కలిసి పంచుకునే గమ్మత్తైన అనుభవం. ఆమె ఇదివరకెప్పుడూ చూడని ఓ వింత.

టాస్ వేయడం, ఫీల్డింగ్ టీం రావటం, బాట్స్ మెన్ వడివడిగా నడవటం, అంపైర్లు ప్లేకి లాంఛనంగా అనుమతివ్వడం, ఆట మొదలవ్వటం అన్నీ త్వరత్వరగా జరిగిపోయాయి.

“ఓహ్.. నో! అవుట్.. షిట్..” అంటూ అందరూ కూలబడిపోయారు రవితో సహా, ఫీల్డింగ్ జట్టు ఎగురుతూ ఎగురుతూ “pause” చేసినట్టు ఆగిపోవటంతో “హే.. నో బాల్! అంటే ఫ్రీ హిట్ కూడా!” అంటూ అతడిని భుజాన్ని కుదిపి మరీ చెప్పింది వినీల. అయినా అతడింకా “షాక్”లోనే ఉన్నాడు. “బౌండరీ వస్తే బాగుణ్ణు.. మన రన్-రేట్ చాలా తక్కువగా ఉంది” అంటూ వేళ్ళు పిసికేసుకుంటూ చూడసాగింది, కూర్చున్న చోటున నిల్చుని సాగి మరీ! బాల్-బాట్‍ని కలిసీ కలవగానే గాల్లో తేలుతూ జనంలోకి వస్తూనే, పట్టుకోవాలని ప్రయత్నించాయి ఎన్నో చేతులు. “సిక్సర్” అంటున్న ఆమె చేతులు మాత్రం అతణ్ణి చుట్టేశాయి.

“హే.. వావ్!”

“నిజంగా సూపర్ షాట్ కదా!”

“అది కాదు. నువ్వు.. ఫ్రీ హిట్? రన్ రేట్??!! ”

“మాకూ క్రికెట్ తెల్సు బాబూ! కొంచెం, కొం..చెం”

“రూల్స్ తో సహా!??”

“అదా.. మొన్న నువ్వు  టూరెళ్ళినప్పుడు, వీకెండ్ ఏమీ తోచక నీ క్రికెట్ డి.వి.డీస్, నువ్వు రాసుకునే నోట్స్ చూశాను. చూ..స్తూ..నే ఉండిపోయాను. బాగుణ్ణాయనిపించవన్నీ చూసేశాను. కొన్ని రూల్స్ అప్పుడే తెలిసాయి”

“……”

“కానీ ఈ ఫీల్డ్ ప్లేసింగ్స్ చాలా తికమకగా ఉన్నాయి.. ఇప్పుడు ఆ మనిషి మిడాఫ్ లో ఉన్నట్టా?” అంటూ చేతిని చాచింది. అతడేదో చెప్పేలోపే “ఏదో ఒకటిలే..ఇప్పుడొద్దు. వీ ఆర్ మిస్సింగ్ మాచ్!” అంటూ క్లాసులో ఏ కొంచెం కూడా మిస్స్ కాని మొదటి బెంచ్ విద్యార్థినిలా క్రికెట్ మీద దృష్టి పెట్టింది. అతగాడేమో లాస్ట్ బెంచ్ విద్యార్థిలా ఆమె వంకే చూస్తూ ఉండిపోయాడు.

“ఫోర్..” ఆమె గట్టిగా అనడంలో ఆశ్చర్యం నుండి తేరుకుని, ఆ ఆనందంలో మునిగిపోయాడు. ఆసక్తికరంగా జరుగుతున్న ఆ మాచ్‍ని కలిసి ఆస్వాదిస్తున్నారు. రెండు చేతులతో చప్పట్లు మానేసి, నాలుగు చేతులు కలిసిన ధ్వనిలో ఆనందాన్ని శ్రుతి కలిపారు. “అయ్యో!” అంటూ జారిపోయే భుజాలను ఒకదానికొకటిగా ఆసరాగా నిలబెట్టారు. “హు.. హ, హు..హ” అంటూ అరుస్తున్నప్పుడు అతడి గంభీర స్వరం, ఆమె నాజుకైన గొంతూ కలిసి ఓ కొత్త “జుగల్బందీ” అయ్యింది. ఇద్దరూ “ఆహా!” నుండి “అయ్యో” వరకూ ప్రతీ అనుభూతిని కలిసి పంచుకున్నారు. చేతులు పట్టుకుని నీటి మడుగులో గెంతులేసే చిన్న పిల్లల్లా వాళ్ళు మారిపోయారు.

సన్నగా, చిన్నగా వాన చినుకులు మొదలయ్యాయి. కనీ కనిపించకుండా అప్పుడో సారి, అప్పుడో సారి గిల్లి పోతున్నాయి.

“అబ్బా.. ఇప్పుడు వానేంటి? చిరాగ్గా..” అన్నాడతడు మొహం చిట్లించుకుంటూ. “మన వాళ్ళు మాచ్ గెలుస్తారన్నప్పుడే పడి చస్తుంది.. ఛా!”

“Rain, at any given moment is beautiful!”

“చెత్త వాన, దరిద్రపు వాన.. ” అతడు కొనసాగిస్తూనే ఉన్నాడు. సన్నని తుపర పడుతూనే ఉంది. కాస్త జల్లు ఎక్కువయ్యేసరికి అంపైర్లు ఒక చోట మంతనాలు మొదలెట్టారు. “ఛాస్.. ఇంత అందమైన సాయంత్రంలో ఈ వాన వచ్చి కంపు కంపు చేస్తోంది” అని మొహం మాడ్చుకుని మరీ అంటూ ఆమె వంక చూశాడు. కళ్ళు గట్టిగా మూసేసుకుని, మొహం ఆకాశం వైపు పైకెత్తి వాన చినుకుల స్పర్శలో తన్మయత్వాన్ని అనుభవిస్తుంది. వాన మీద కోపం, వానకి ఆతిధ్యమిస్తున్న ఆమె మీద కూడా చూపించబోయాడు. ఇంతలో ఆట మళ్ళీ మొదలయ్యే సరికి,  ఇద్దరికీ ధ్యాస మారిపోయింది. మొత్తానికైతే మాచ్ ఆటంకాలతో నడిచింది. ఎంతలోపు ఎంత  కొట్టాలో ఎవ్వరికీ సరిగ్గా తెలీక గందరగోళంగా మారింది. వినీలకి మరీ అగమ్యగోచరంగా ఉండి, దిక్కులు చూడసాగింది. రవి అంత ఉత్కంఠలోనూ తనకి తెలిసిన నాలుగు ముక్కలూ ఆమెకి వివరించాడు. బాల్, బాల్ కి లెక్కలు పెట్టుకుంటూ ఎలా అయితేనే మాచ్ మాత్రం పూర్తయ్యింది.

“కాస్త చూసుకుని నడవండమ్మా!” అని ఉచితంగా ఓ సలహా ఇస్తూనే తోసుకుపోయారెవరో, మాచ్ పూర్తయ్యాక స్టేడియం మెట్లు దిగుతుంటే.

“ఆర్ యు ఒకె, వినీ?”

“ఊ..” అంటూ అలసిన గొంతుతో సన్నగా మూలిగి, అడుగు ముందుకేయబోయి తూలిపడింది. “నొప్పొస్తుంది రవీ” అంటూనే తన నడుం చుట్టుకుని వచ్చిన అతడి చేతిలో తన చేతిని నిలిపి, మరో చేతిని అతడి నడుం చుట్టూ చుట్టి మెల్లిగా అడుగులు వేయడానికి ప్రయత్నించింది. ఆమెను నడిపిస్తూ ఉన్న బాధ్యతలో చినుకులు పడుతున్నాయి మళ్ళీ అన్న సంగతి గమనించలేదు. ఆ స్పృహ వచ్చిన తర్వాత వాన చినుకులు తాకిడి కొత్తగా అనిపించింది. కళ్ళు గట్టిగా మూసుకుని, మొహం పైకెత్తి వాన చినుకులు మీద పడుతుంటే, పెదాల మధ్య నవ్వు పుట్టుకొచ్చింది రవికి.

“అయ్యో.. వాన ఎక్కువయ్యేట్టుంది. ఇదో ఇది తల మీద వేసుకో..” అంటూ చున్నీని అందించబోయిన ఆమెను వారించాడు. మెల్లిగా నడుచుకుంటూ పార్కింగ్ ప్లేస్‍కి వెళ్ళేసరికి ఇద్దరూ దాదాపుగా తడిచిపోయారు.

“కాసేపాగి వద్దామంటే విన్నావు కాదు. చిర్రాగ్గా ఉందా?” అన్నది ఆమె మంద్రంగా అనునయంగా.

“హమ్మ్.. పర్లేదు. వానలో తడిస్తే బానే ఉంది. ఏదోలా ఉంది. నాట్ బాడ్!” అంటూ, ఒక్కసారి ఆమె వైపుకి తిరిగి సూటిగా చూస్తూ, “ప్లీజ్.. ఏ వాయుగుండమో తీరం దాటేటప్పుడు మనం పిక్నిక్ చేసుకుందాం అని అడగకు. నేను కొట్టుకుపోతాను” అన్నాడు కొంటెగా నవ్వుతూ.

“ఊ.. ఊ.. నువ్వు నన్ను “డక్-వర్త్ లూయిస్ రూల్* పనిచేయు విధానం వివరింపుడీ” అని అడగనంత వరకూ..” అని ఆమె ఇచ్చిన జవాబు, వాళ్ళిద్దరూ మనసారా నవ్విన నవ్వులో ఎక్కడో మరుగునపడిపోయింది. పంచుకునే కొద్దీ పెరిగే ఆనందం వాళ్ళ సొంతమయ్యింది.

******************************************************************************
* డక్‍వర్త్ లూయిస్ రూల్, వాన పీడత మాచ్‍లను కుదించడానికి అమలు పరిచే విధానం. క్రికెట్ ఆటలో అత్యధికంగా అర్థం అవ్వని రూల్ అంటే ఇదేనేమో!