మాట – మౌనం (వైట్ ఆండ్ బ్లాక్)


“వైట్ ఆండ్ బ్లాక్? అచ్చు తప్పు!” అని మీరనుకునే లోపు దాని పై ఓ రెండు ముక్కలు. బ్లాక్ ఆండ్ వైట్ లో బ్లాక్ ని వైట్ గా వైట్ ని బ్లాక్ గా చూపించడమే. అంటే పాత్రల రోల్ రివర్సల్ మాట!

**************************************************************************

ఆ ఊరిలో అన్ని కుటుంబాల్లానే అదీ ఒక కుటుంబం. చింతల్లేని కుటుంబమా? కాదా? అన్నది మున్ముందు తెల్సిపోతుంది, తొందర పడి ఓ మాటనేసుకుంటే మళ్ళీ అవ్వాక్కవ్వాల్సి రావచ్చు. ఆ కుటుంబంలో ఒక అమ్మా, ఒక నాన్నా, ఒక నాన్నమ్మ, ఒక తాతయ్యా ఉన్నారు. అత్తలూ, మామలూ, పెద్దమ్మలూ, పెద్దనాన్నలూ, బాబాయిలూ, పిన్నులూ అంతా కల్సి, జనాభా లెక్కలు రాసుకోడానికి అరగంట సమయం పట్టేంత మంది ఉన్నారు. ఇంత మందున్న ఇంట్లో మరో ముఖ్యమైన నివాసి “సందడి”. అందరూ నిద్రపోయాక, ఎవ్వరూ నిద్రలేవని కాసేపూ సందడి కూడా నిద్రిస్తుంది. మిగితా అన్ని వేళలా సందడే సందడి.

మనమనుకున్న ఒక అమ్మా, ఒక నాన్న పిల్లలు మాటా – మౌనం. మౌనం మళ్ళీ అక్కే ఇక్కడ కూడా, కానీ ఇక్కడ మాత్రం మాటే రాజ్యం. పది మందీ తిరుగుతూ ఉండే ఈ సావిట్లో మౌనానికి స్థానమేదీ? ఏ మూల వసారాలోనో కూర్చొని ఉంటుంది. మాట మాత్రం కాళ్ళకున్న మువ్వల సవ్వడి, గాజుల గలగలతో ఇల్లంతా చకచకా తిరిగేస్తుంటుంది. పొద్దున్నే సుప్రభాతపు గీతంతో పాటు “లే.. పొద్దు పొడిచింది” అంటూ మొదలుకుని, స్నానాల గది దగ్గర “నే ముందంటే.. నే ముందు” అంటూ, పూజల వ్యవహారంలో “ఆ పళ్ళెం అందుకో, ఈ ప్రసాదం తీసుకో” అని మంత్రాల మధ్యన, కూరగాయలమ్మతో బేరాల్లో, ఫలహారాల వేళ “తిను సరిగ్గా.. మళ్ళీ పొద్దు పోయే దాకా రావు” అన్న నాజుకైన మందలింపులో, పరుగు పరుగున పనులకెళ్తున్న వాళ్లకి అప్పగింతల్లో, పాలెర్ల మీద కేకలేస్తూ, భోజనాలయ్యాక ఆడవాళ్ళ కుబుర్లో, బడి నుండి వచ్చిన పిల్లల అల్లర్లలో, పిల్లల బదులు దెబ్బాడుకునే తల్లుల తిట్లల్లో, సాయంత్రం వేళే మొదలయ్యే వంట పనుల్లో, అలసి తిరిగొచ్చేవారిని ఆప్యాయతగా అక్కున చేర్చుకోవడంలో, రాత్రుల భోజనాల్లో, వీధి అరుగున కూర్చుని లోకాభిరామాయణంలో, నిద్రపుచ్చుతున్న పాపలకి కథల్లో, అన్ని చోట్లా, అన్ని వేళలా ఆ ఇంట్లో అందరి తలలో నాలుకా “మాటే”. సంతోషమైనా విషాదమైనా ఆ ఇంట “మాట”దే రాజ్యం.

మౌనం ఎప్పుడైనా సరదా పడి ఏ ఒక్కరికి జత కుదిరినా, “ఏమైంది? అలా ఉన్నావ్?” అనుకుంటూ మాట ముసిరేస్తుంది. కాస్త మొండికేసి పలకకపోతే “ఏదో అయ్యింది? ఏంటది?” అంటూ నిలదీస్తుంది. “ఏం జరిగిందంటే నే చెప్పలేను” అని అందుకుంటే “ఏ కాలేదంటే నేనొప్పుకోనూ” అని నస పెడుతుంది. ఏం జరిగిందో చెప్పలేక, మాటతో కలవడానికి మనస్కరించక, కాస్త ఏకాంతాన్ని ఆశ్రయిస్తే, “ఏదో అయ్యింది, ఏదో అయ్యిపోయింది” అంటూ మూకుమ్మడి దాడి చేసే మాటలను అధిగమించే ఏకైక అస్త్రం నిద్రను నాటకంలో ముఖ్యపాత్రను చేస్తే “ఏదో అయ్యింది.. చెప్పటం లేదు పిచ్చి వెధవా” అంటూ తలనిమురుతూనే ఉంటుంది మాట.

కేవలం కొన్ని క్షణాల మౌనం అంతే! అంతరాంతరాల్లో ఉన్న అలజడులన్నీ సర్దుకుపోతాయి. ఆ క్షణాలు కూడా మౌనానికి దక్కవు. మౌనం అంటే బాధకి పర్యాయపదమని వార భావన. మౌనం తన ఉనికి చాటుకునేది ఒకే ఒక వేళ, కొత్తగా పెళ్ళై గూటికి చేరిన జంటకి జంటగా. బిడియం, సిగ్గూ, భయం, అనుమానం కలిసొచ్చి మాట నోరు కట్టేసిన వేళల్లో, మౌనం వారిద్దరి మధ్య వారధి వేస్తూ ఉంటుంది, అందరినీ తప్పించుకుంటూనే. కానీ వాళ్ళు కూడా “ఛా.. మాటలు ఆడుకునే మాటే” లేదు అని విసుక్కుంటారు, కలిసీ కలవగానే.

మాటలతోనే పంచుకున్నా, తెంచుకున్నా! మాటల్లోనే బంధాలూ, ఒప్పందాలు! మాటలే గుర్తుంచుకున్నా, గాలికి వదిలేసినా! మాటలే – చిన్నబుచ్చినా, మైమరపించినా! మాట అందరినీ కలుపుతూ అందరిలో ఒక్కరిలా ఇల్లంతా కలియతిరుగుతుంది. మౌనం మాత్రం ఏ నిద్ర లేని చీకటి రాత్రి కోసమో ఎదురుచూస్తూ ఉంటుంది డాబా మీద.

Advertisements

ఓడినా.. ఓడించినా..


నీ మీద గెలుద్దామంటే నీ ఓటమి నా ఓటమయ్యి కూర్చుటుంది. నేను ఓడిపోదామనుకుంటే నా ఓటిమికి నేను తప్ప దిక్కుండదు. ఓడిస్తూ నెగ్గలేక, నెగ్గుతూ ఓడిపోలేక ఈ ఆటను ఆడలేను. అలా అని వదలి వెళ్ళిపోలేను. ఆటలో ఆసక్తి హెచ్చేకొద్దీ గాయాలకీ అవకాశం పెరుగుతూ పోతుంటే నిన్ను కాపాడుకోవాలనే తాపత్రయానికీ నేను ఓడిపోకూడదన్న తపనకీ మధ్య “మనం” నలుగుతున్నాం. ఆ నలుగు నిగారింపుకే అనిపిస్తుంది ఓ పక్క. అనవసరపు ఒత్తిడి అనిపిస్తుంది మరో పక్క. పక్కకు తప్పుకోలేక, పక్కపక్కన ఉండలేక ఎన్నాళ్ళీ ఘర్షణ? అంటే నా ఓటిమి నీదయ్యినప్పుడు. లేదా మరుపు నా మీద గెల్చినప్పుడు.

మాట – మౌనం (బ్లాక్ ఆండ్ వైట్)


రాముడూ -భీమూడు”, “సీతా ఆవుర్ గీతా” సినిమా లైన్స్ మీద “మాటా-మౌనం” (పేర్లల్లో ప్రాస కుదరకపోయినా) అనే బ్లాక్ ఆండ్ వైట్ చిత్రం ఉందనుకుందాం. అదెలా ఉంటుందంటే..
*********************************************************************************

మాటా – మౌనం తోడబుట్టినోళ్ళనుకుంటే, అప్పుడు మౌనం పెద్దక్క అన్నమాట. నోట్లో నాలుక లేనిది. గంజి పెట్టి ఇస్త్రీ చేసిన తెల్ల రంగు కాటన్ చీర కట్టుకుని (వీలుంటే వీణ వాయిస్తున్న ఫోజులో) జుట్టుని గట్టి ముడిగా బిగించి ఓ రకమైన హుందాతనం, ఠీవి, రాజరికం, దైవత్వం లాంటి భారీ పదాలన్నింటికీ చిరునామాలా ఉంటూ ఉంటుంది. మౌనం అంటే ఊర్లో అందరికీ గురి. ఎప్పుడో కానీ ఆమె అందరికీ చేరువగా రాదు కాబట్టి, ఆమెను గురించి తెగ మాట్లాడేసుకుంటుంటారు, “హెంత ఘోప్ప అనుకున్నావ్” అనీ, “అబ్భో.. ఆమె సాంగత్యం మహామునులకే సాధ్యమట” అనీ. ఆమెను చేరుకోడానికి చాలా మంది యాగాలు చేసినంత పని చేస్తారు. ఆమె పాదరవిందాలు చేరాలని తపన “పడి”పోతారు.

పూర్తిగా తెరను ఆక్రమించేసిన ఈ పాత్రను కాస్త పక్కకు జరిపితే, వీలున్నంత చోటులో హాయిగా అల్లుకుపోయే చిట్టి చెల్లెలు “మాట” మన ముందుకొస్తుంది. ఈమె పాపం, మౌనం కన్నా చాలా చిన్నది, అందుకే లోకం పోకడ తెలీని వెర్రి వెంగళ్ళప్పలా చూస్తుంటారు చాలా మంది. ఉండడానికి అనుకవ, ఖచ్చితత్వం, కలివిడతనం, సరదా అన్నీ ఉన్నా, అక్కగారితో ఈమెన పోలుస్తూ “అబ్బే.. చెల్లి ఉత్త డొల్ల, మాటలంతే!” అంటూ కొట్టిపారేస్తుంటారు. ఎంచక్కా చుడీదార్ వేసుకుని రోజుకో కొప్పు పెట్టే మాటను చెంగు చెంగున గెంతుతూ ఏ కొండనూ ఢీకొట్టని నదిలా ఉరకలేస్తుంటే కళ్ళార్పకుండా మంత్రముగ్ధులై చూసేసి, “ఆడంబరం, ఢాంభికం! అక్కను చూసి కూడా నేర్చుకోదాయే! నక్క ఎక్కడా? నాకలోకం ఎక్కడా?” అంటూ చెవులు కొరుకుంటారు.

మాటను మాటల్లోనే ఆడిపోసుకుంటారు. మౌనాన్ని అర్చించడానికీ మాటనే వాడుకుంటారు. మొహమాటస్తురాలైన మాటేమో ఎవరి మాటా కాదనలేదు. “నాకంత లేదు బాబోయ్య్.. నన్నో చట్రంలో ఇరికించేసి, పైన మాటలతో బంధించేసి మీరేదేదో అనేసుకుంటున్నారు” అనే మౌనఘోషను వినగలిగే ధీరులెవ్వరని? మౌనమే సంభాషించాలని ఉబలాటపడితే అప్పటికప్పుడు తను చెల్లెల్ని జత తీసుకెళ్ళి తన తరఫున మాట్లాడమనాలి. అక్క మాట తీయలేక ఏదో చెప్పబోయినా, మాటకి విలువేదీ?

భీకర విషాద సంగీత నేపధ్యంలో తలుపుపై జారీ జారని పైటతో నీరసంగా దిగాలుబడ్డ భుజాలను జార్చి, కంట తడి బయటకి రానివ్వకుండా శూన్యంలోకి చూస్తూ భారీ నిటూర్పులు విడుస్తూ మౌనం ఒక పక్క, చున్నీతో ముక్కు చీదుకుంటూ అడ్డొస్తున్న జుట్టును విసురుగా పక్కకు తోస్తూ కన్నీళ్ళాగక, ఓపిక లేక మంచానికి అడ్డం పడ్డ మౌనం ఒక వైపు తెర స్థలాన్ని చెరి సగం పంచుకుంటాయి.

కోట బయట మాత్రం, “మౌనానికీ జై, మౌనానికీ జై” అన్న జయజయధ్వానాలు వినిపిస్తూనే ఉంటాయి.
***********************************************************************************

మాటా – మౌనం ( వైట్ ఆండ్ బ్లాక్) – అతి త్వరలో..
మాటా – మౌనం ( నా వెర్షన్) – త్వరలో..

నా క్షణాలు


మొన్న ఎవరో, “అబ్బో.. నువ్వు చాలా సీరియస్ మనిషివి. కాంప్లికేషన్స్ ఎక్కువ!” అనే సరికి మనసు చివుక్కుమంది ఒక్క క్షణం. ఆ మనిషి అలా అనడానికి కారణం తెలీగానే మాత్రం నవ్వాగలేదు. నేను నవ్వుతున్నానన్న విషయం గ్రహించిన మరుక్షణం మరో జ్ఞాపకం కళ్ళముందు కదలాడింది. ఆ మొన్నకు మొన్న మరెవరో, “మీరు చాలా సంతోషంగా గలగలాడుతూ ఉంటారు” అని అంటే, “అబ్బే లేదండీ! మీరు నన్ను చూసింది తక్కువ కాబట్టి అలా అనేస్తున్నారు కాని, నేను చాలా సీరియస్ మనిషిని. అసలు పెద్ద కష్టాలేవీ లేకపోయినా ఎందుకో బాధ పడిపోతూ ఉంటాను. సంతోషంగా ఉండడానికి ప్రత్యేక ప్రయత్నాలేవీ చెయ్యను. I know that” అంటూ వాగిన వాగుడు “నాకు నేను నా గురించి పరస్పర విరుద్ధంగా చెప్పుకుంటున్నానా?” అన్న అనుమానం కలిగించగానే ఉలిక్కి పడ్డాను. ఆ ఉలిక్కిపాటును ఓ చిర్నవ్వు వెనుక చాటేసి “ఎవరో”తో కాసేపు మాట్లాడుతూ కూర్చున్నాన్న మాటే కానీ ఆలోచనలు మాత్రం ఆగలేదు.

నా గురించి నాకు ఎవరైనా చెప్పటం ఇష్టం లేక వచ్చిన స్పందనలా అవి? నన్ను చదివేస్తున్నారేమో అన్న భయంతోనా? నన్ను అర్థం చేసుకోవటం చాలా కష్టమని గొప్పగా చెప్పుకునే అహం దెబ్బతినటం వల్లనా? లేక, అప్పటి మనఃపరిస్థితి అంత బాగోక అన్న పై పై మాటలా? ఇవ్వన్నీ సరే.. అసలు నాకు నేను తెల్సన్న నమ్మకం ఏమయ్యినట్టు? లాభం లేదు, దీని అంతేదో చూడాల్సిందే అనుకుంటూ.. పూర్తిగా అంతర్ముఖంగా మారిపోయాను.

ఇప్పుడు నేనెలాంటి మనిషో తేల్చుకోవాలంటే, ఇన్నేళ్ళనూ ఒక గాటిన కట్టి, నేను ఎక్కువ భాగం ఎలా ఉన్నానో, నేను అలాంటి మనిషినే అని నిర్ధారించుకోవాలా? అలా చేయాలంటే బతకున్న ఇన్నాళ్ళ ప్రతీ క్షణంలో నేనెలా ఉన్నానో చిట్టా రాసుకుంటూ పోవాలి. అసలు బతికేసిన ఇన్ని రోజులే గుర్తు లేవు, ఇంకందులో క్షణాలెలా తూకం వేసేది? పోనీ, జ్ఞాపకాల మీద ఆధారపడదామనుకుంటే అవీ ఖచ్చితమైన భరోసాని ఏమీ ఇవ్వలేను. అందులోనూ కొన్ని జ్ఞాపకాలు భలే మొసం చేస్తాయి. స్నేహంతో గొడవపడిన క్షణాలు తవ్వుకున్నప్పుడల్లా, మొట్టమొదట వేసుకున్న చేదు మందు రుచి మనసు నిండా నిండిపోతుంది. అదోలా అయిన పోయిన మనసు, ఆ గొడవను అధిగమించిన విధానం, ఆ గొడవ ద్వారా ఒక్కరిపై ఒకరికి పెరిగిన అవగాహనని, తడబడినా, పొరబడినా నెగ్గుకొచ్చిన క్షణాలని ఎందుకనో గుర్తు చేయలేదు, వెంటనే! జ్ఞాపకాలను తవ్వుకోవటమేమో కానీ, పూడ్చుకోవటం మాత్రం అంత సులువు కాదు.

అనంత కాల ప్రవాహంలో నా చెంతకు చేరే క్షణాలను ఎలా ఆదరిస్తానన్న దాని మీదే “నేనెలాంటి మనిషిని?” అన్నదానికి జవాబు ఉందనుకుంటాను. నాకు ప్రాప్తించే క్షణాలు ఖాళీ కాగితాల్లాంటివనుకుంటే వాటి మీద నేనేదో ఒక రంగు పూసి పంపిస్తాను. ఇప్పుడు నేను వాడే రంగులేమిటి అన్న దాన్ని బట్టి నన్ను నిర్ధారించవచ్చునేమో! నలుపా? తెలుపా? నీలమా? ఎరుపా? గులాబీ రంగా? పుసుపు పచ్చా? అనేది ఇధిమిత్తంగా చెప్పలేను. ఏ ఒక్క రంగుపై ప్రత్యేక ఆకర్షణ లేదు. కానీ ఖచ్చితంగా చెప్పగలిగేది మాత్రం: ఏ క్షణానికా క్షణపు అనుభూతి రంగును నిక్కచ్చిగా నింపేస్తాను. నలుపుగా ఉన్న క్షణాలను తెలుపు పూయ ప్రయత్నించి ఎటూ కానీ బూడిద రంగు వచ్చే అవకాశం నాతో చాలా తక్కువ. అలానే క్షణాల్లో నలుపు మరకలు పడే అవకాశాలూ చాలా తక్కువ. ఏ క్షణానికా క్షణం ఓ రంగులో ముంచి లేవదీస్తాను. ఒక్కోసారి కోటి రాగాలు ఒక్కసారిగా పలికే వేళ ప్రతీ రంగూ ఒకదాని పక్కన ఒక్కటి నిలిచిపోయి బహుళ వర్ణాల ఇంద్రధనస్సులు ప్రత్యక్షమవుతాయి. అందుకే నేనేదో ఒక్క గాటిన కట్టిపారేయడం కష్టం. నేను అదీ కానూ, ఇదీ కానూ! క్షణాల్లో నా తాలూకూ అనుభూతులు మాత్రం మనసారా కనిపిస్తాయి.

हो सके तो इस में ज़िन्दगी बितालो, पल ये जो जाने वाला है!

Space


“అసలేమయ్యిందో చెప్తే కదా నాకు తెల్సేది? ఏం చెప్పకుండా అలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా చెప్పు?” అమ్మ ఏదో అంటోంది ఇంకా..

“please mom! will you go from here? I wanna my space” దుఃఖం, కోపం కలగలసిన గొంతుతో అరవాలనే అసఫల ప్రయత్నం చేశాను.

“ఎందుకూ? ఇంకా చిందర వందర చేసిపెట్టటానికా? నీకు ఒక గది కాదు, ఓ ఊరు రాసిచ్చినా సరిపోదు! ఆ పుస్తకాలు చూడు, అసలు చదువుతున్నావా వాటిని? ఎక్కడంటే అక్కడ అవే. ఆ నెట్ కేబుల్ చూశావా? కాళ్ళకి తగిలి పడాతావెప్పుడో! ఆ లాప్‍టాప్ క్లోజ్ చేయ్యవేంటి? బట్టలూ.. నీ బట్టలకి మాత్రం అంతు లేదు! సర్దుకోవేంటి నీ వస్తువులూ? మొన్నా హెడ్ ఫోన్స్ తెచ్చావా, అవి చూడు ఎలా వేలాడుతున్నాయో! వెయ్యి పోసి కొనేశావ్, నేను చెప్తూనే ఉన్నా అంతవి దండగా అనీ.. పాటలు వింటావు సరే.. వినేసాక జాగ్రత్త చేసుకోవాలని తెలీదూ? ఎవరైనా పొరపాటున ఆ గదిలోకొస్తే భయపడి చస్తారు! ఇంకా స్పేస్. స్పేస్ అంటావు? ఉన్నంతలో సర్దుకోవాల్రా.. అంతే కానీ..” సందర్భంలేకపోయినా, సమయం కాకున్నా నాకు ఇవ్వాల్సిన లెక్చర్స్ కి నాన్న ఎప్పుడూ సిద్ధం.

“అబ్బా.. మీరు ఊరుకోండీ! దానికెందుకో మనసు బాలేనట్టుంది ఇవ్వాళ..” అంటూ అమ్మ అడుగు బయటకెయ్యగానే, తలుపు చట్టుకుని మూసేసి, గొళ్ళెం పెట్టేసి దానికే ఆనుకుని నిల్చుండిపోయాను కళ్ళు మూసుకుని ఒక ధీర్ఘ శ్వాసతో. ఎక్కడి నుండి పుట్టుకొచ్చేస్తున్నాయిన్ని? “స్పేస్” లేదంటూ అవీ చెక్కిళ్ళ మీద జారిపోతున్నాయి! ఏడుస్తున్నప్పుడు కళ్ళు తెరచి చూడ్డం నాకు భలే సరదా! కళ్ళనిండా నీళ్ళు పెట్టుకుని మసక మసకగా అన్నీ కలయచూడ్డం అంటే అదో ఆనందం. కానీ, ఇప్పుడసల, కళ్ళల్లో నీళ్ళు ఆగుతుంటే కదా? ఎక్కడ నుండి పుట్టుకొచ్చేస్తున్నాయి? ఎవరి కోసం? చట్టుక్కున ఏదో స్ఫురించింది. ఛ.. నిజంగానే నా గది ఎంత భయంకరంగా ఉంది? పొరపాటున ఎవరైనా వచ్చి చూస్తే ఏమనుకుంటారు నా గురించి? అసలు ఒక్క వస్తువూ సరైన చోట లేదు! అందుకే ఇలా మాటలనిపించుకుంటూ ఉంటాను. కోపం – నన్ను అంతా అంటున్నారని! కోపం – అనిపించుకునేంత వరకూ తెచ్చుకుంటున్నానని! కోపం వేళ్ళకొసల్లోకి చేరి కన్నీళ్ళను గట్టిగా తుడిచేశాయి. అవే వేళ్ళు జుట్టులోకి చొరబడి, వెంట్రుకలని బిగువుగా లాగి, క్లిప్ పెట్టాయి.

బట్టలు, చకచకా మడత పెట్టేశాను. అంత కన్నా వేగంగా బిరువాలో తోసేయడానికి దాని తలుపు తీసాను. లోపలంతా చిందర వందరగా ఉన్నాయి. వాటిన్నంటినీ బయటికి తీసేసి, అన్నీ సర్దేసి చక్కగా ఒక పద్దతి ప్రకారం, వరుసగా పెట్టాను. నలుపు కూడా కలిసున్న ఓ కొత్త ఇంద్రధనస్సును అమర్చిన ఆ అరలను చూస్తుంటే నా పనితనం మీద నాకే ముచ్చటపడ్డాను! ఇప్పుడా బిరువా తెరిచిన ఎవ్వరైనా, “ఎంత పనిమంతురాలో అమ్మాయీ?” అనుకోరూ?! నేనెప్పుడూ ఇంతే.. నాది constructive aggression అని నాకు నేనే ఇచ్చుకున్న కితాబు. బట్టలతో సాధించిన ఊపును మంచం మీద పడున్న వస్తువులపైకి మళ్ళించాను. పుస్తకాలూ, సిడీలూ, లాప్‍టాప్, సోఫా కుషన్లూ, పెన్సిల్లూ, పెన్నులూ, చాక్లెట్ వ్రాపర్లూ, కాగితాలూ, క్లిప్పులూ – అన్నీ చకచకా వాటి వాటి “హోల్డర్ల”లోకి వెళ్ళిపోయాయి కిమ్మనుకుండా! దుప్పటిని కసితీరా దులిపి పక్క వేసి, దిండ్లు రెండూ నాకు నచ్చినట్టు ఎత్తుగా పెట్టేసరికి, దుప్పటి మీదున్న రెండు గులాబీలూ “ఫర్ యూ లేడీ..” అని అభినందించాయి. వాటికో “థట్స్ మీ!” లుక్‍ను ఇస్తూ సన్నని నవ్వును మాత్రం ఆపలేకపోయాను. మంచిదే.. సిడీల పని చూడ్డానికి ఈ సున్నితత్వం కాస్త అయినా పనికొస్తుంది. ఆట ముగిసాక చిందరవందరగా ఉన్న పేక ముక్కల్ని క్షణాల్లో వేళ్ళమీద ఒక దొంతరలా మార్చగల నైపుణ్యం కూడా నా నేర్పు చూసి ఈర్ష్య చెందెలా వాటిని రాక్ లో పెట్టేశాను క్షణాల్లో.

ఇక పుస్తకాలు! ఇవ్వొక్కటీ అయ్యిపోతే నా విజయం పూర్తయ్యినట్టే! ఆఖరి మెట్టు అన్నింటకన్నా కష్టం ఎందుకంటే, లక్ష్యం అంత దగ్గరగా ఇంతకు మునుపెప్పుడూ కనిపించుండదు. కవ్విస్తూ అది ఉంటే, అడుగులు తడబడడం మామూలే! నాకన్నా ఈ గదిలో వాటి ఉనికి ఎక్కువైన పుస్తకాలు, నాతో పాటు నాలా స్వేచ్ఛగా నివసించే పుస్తకాలకి నేను ఇప్పుడో “వరుస” నేర్పించాలి. ఇన్నాళ్ళు “ఇలా, అలా” అని ఒప్పందాలేవీ లేని వాటికి ఇప్పుడు, “ఇలానే, ఇలా అంటే ఇలానే” అని నిర్భంధించాలి. ఇంకాసేపట్లో నేనూ, అవి స్వయంగా విధించుకున్న వరసల్లో ఇమిడిపోవాలి. అయినా సరే, వాటినీ సర్దేయాలి. మోండికేస్తాయేమో అన్న భయం ఉంది. అయినా చనువుతో వచ్చే ప్రత్యేక అధికార హోదాలో, నా అమాయకత్వం పాళ్ళు కలిపితే కరగకుండా ఉండగలవా అనుకుంటూ మొదలెట్టాను. ఇప్పుడే వరుసలో పెట్టాలి? పుస్తక విషయంపై సర్దుదామనుకున్నా! కాదు, ఏ భాషకా భాష ఉంటే బాగుంటుంది! అలా కాదు, ఏ భాషైనా రచయితల ప్రకారం సర్దితే వెత్తుక్కోడానికి సులువు. ఇష్టమైన పుస్తకాలూ, చాలా ఇష్టమైనవీ, అసలు నచ్చనివీ అలా సర్దితే? ఛ! మరీ మొహం మీద నువ్వు నాకు నచ్చలేదు అని చెప్పాక్కూడా, ఇప్పుడు మళ్ళీ వేరు చేసి చూపటం దేనికి? ఏవో పడున్నాయి కదా అలానే, ఉండనీ! అన్నట్టూ.. పుస్తకాలు అడ్డంగా పెట్టనా? నిలువుగానా? ఎలా అయితే బా కనిపిస్తాయో అని కొని సర్ది చూశాను. నా చూపుకి అవెప్పుడూ ఆనందమే? కాని వేరే వాళ్ళకీ అలా కనిపించాలి కదా? ఎవరైనా చూడగానే ఆకట్టుకునేలా, “ఎన్ని పుస్తకాలు చదువుతుందో.. హమ్మ్.. రియల్లీ గ్రేట్” అనుకునేలా సర్దాలి! ఎలా? ఎలా? గూగుల్? వెతకనా?

How to organize your bookshelf?
How to organize your bookshelf to please people?
??
Hang on..

ఏం చేస్తున్నాను? నా పుస్తకాలని బుక్ ఎగ్జిభిషన్‍లో పెట్టడం లేదు కదా?! మరెందుకు ఒక మూసలో సర్దడం. ఎంత చిందరవందరగా ఉన్నా, అనుకున్న వేళలో కావాల్సిన పుస్తకం దొరక్క విసుకున్నా, వెతుక్కునా, దొరకగానే ఆనందపడినా, అన్నీ నాకే కదా సొంతం? మరెందుకు మరెవ్వరికోసమో సర్దడం? దేనికి? గది బయటకెళ్తే అటు వాళ్ళని నొప్పింపక, నేను నొచ్చుకోకుండానే నెగ్గుకొచ్చే అక్కర ఎటూ తప్పదు. ఈ చిన్ని గదిలో నా “స్పేస్”లో నేనూ, నావన్న ప్రతీ వస్తువూ మాకు నచ్చిన రీతిలో ఉండకూడదూ? కనీసం, పడుండకూడదూ?! అడవిలా ఉంటుందా అప్పుడు? ఉండనీ.. క్రోటెన్ అందాలు కావాలనుకుంటే బయటే, బాల్కనీలోనే ఉంటారు. ఈ గదిలోకి రావాలంటే నాతో సహవాసం కాదా? నా మీదే ఏ ఆంక్షలూ ఉండకూడదూ! వేటి మీదా నేను పెట్టను. నేను ఇంతే కదా!

ఓహ్.. ఇదే నా బాధా? ఇందుకేనా ఇందాకట్నుంచి ఆపకుండా ఏడుస్తున్నాను? నీ మీద ఆంక్షలు పెట్టాను కదూ? నువ్వు నాతో ఉంటే సరిపోదూ, ఇలా ఉండాలి, ఆ “ఇలా” ఏ స్నేహమో, ప్రేమో, బంధమో, మరేదో.. ప్రపంచం ఏది ఆమోదిస్తే అదే అయ్యుండాలన్న వెర్రి తపన. నిన్ను అలానే ప్రపంచానికి పరిచయం చేయలేకపోతే, నన్ను నీకు దూరం చేసేస్తారని భయం. మన చెలిమికి అందుకే నామకరణ మహోత్సవం పెట్టదలిచాను. నన్నేం చెయ్యమంటావు? అలా చేయకపోతే ఈ కన్నీళ్ళకి కూడా నీ పేరివ్వలేను. ఇదో మళ్ళీ మొదలయ్యాయి, ఆగటం లేదు! కన్నీళ్ళు నీ గుండెను చేరలేక, ఇక్కడ, ఇలా.. ఆలోచనలు కన్నీళ్ళని ఇంకా రెచ్చగొడుతున్నాయి. ఆపలేక, ఆపుకోలేక, దిండులో మొహం దాచుకుని, మంచానికడ్డంగా బొర్లా పడిపోయాను. ఏడ్చే కొద్దీ సన్నగా వణుకుతున్న శరీరంలో తీవ్రత ఎక్కువైయ్యి తల బరువెక్కిపోతోంది. క్లిప్పు తీసి మంచం ఏ మూలకో విసిరాను. జుట్టు ఊపిరి తీసుకోవడంతో కన్నీళ్ళు ఇంకాస్త హాయిగా బయటకొస్తున్నాయి. నా వెక్కిళ్ళు బయటకి వినిపిస్తే కష్టమన్న స్పృహ రాగానే, మెల్లిగా లేచి మ్యూకిక్ ఆన్ చేశాను. ఇప్పుడు విషాద సంగీతంకావాలనుకుంటే అన్నీ ఆనందభైరవులే తగులుతున్నాయి. నాక్కావాల్సిన కిషోర్ దొరికేసరికి సిడీలన్నీ కొత్త కొత్త స్థానలను ఆక్రమించాయి, రాక్ బయట. లో వాల్యూమ్ సెట్ చేసి, ఆన్‍లైన్ వస్తే మనసేమన్నా ఊరుకుంటుందేమోనని లాప్‍టాప్ ముందేసుకున్నా, పడుకునే! ఊహు, మనసును మభ్యపెట్టలేను. లాపీని పక్కకు తోసి మరో దిండు కూడా పక్కలో వేసుకుని, ఏదో పుస్తకం తెరచి చదువుదామనుకుని. తెరిచాను.. చదవటంలేదు. అక్కడే పెట్టుకుని, మన చివరి సంభాషణ రీప్లే చేసుకుంటుంటే, హాయిగా ఉంది. కన్నీళ్ళు కూడా సన్నని ధారగా వస్తున్నాయి, ఆ హాయిని పాడు చేయకుండ!

ఆ హాయిలో కళ్ళు మూసుకున్నాను. “అందరిలో ఒక్కడిలా నిన్ను వదల్లేక, నా వాడిగా ప్రపంచానికి పరిచయం చేయలేక నేను నలిగిపోతూ, నిన్నూ నిలువనివ్వటం లేదు. నా భావలను ఓ మనసుపై అనవసరంగా రుద్దేసి..” ఆలోచనల సుడిగాలిలో కొట్టుకుంటున్నాను. “నువ్వు మమల్నే కట్టిపడేయ(లే)వు. ఇంకో మనసు ఎలా కట్టేస్తావు? నీ వల్ల తనకి ఏ ఇబ్బందీ లేదు.. పడుకో కాసేపు” అంటున్నట్టు, తెరిచిన పుస్తకంలో కాగితాలు రెపరెపలాడుతూ తల నిమిరాయి.

కట్టిపడేయలేకపోవటం – నా బలమా? బలహీనతా?

జ్ఞాపకాలతో నడక


“A walk to remember” సినిమాలో హిరోయిన్ “నాకు ఏక కాలంలో రెండు చోట్ల ఉండాలని కోరిక!” అని చెప్పినప్పుడు హీరో మామూలుగానే విని ఊరుకుంటాడు. కానీ ఉన్నపలనా ఒక రాత్రి ఆ అమ్మాయిని బయటికి తీసుకెళ్ళి నడిరోడ్డు మీద నుంచోబెట్టి, రోడ్డు పై నున్న లావాటి తెల్ల గీతకు రెండు వైపులా కాళ్ళు ఎడంగా పెట్టమని చెప్పి, అక్కడే ఉన్న బోర్డు చూపిస్తూ “చూడు.. నువ్విప్పుడు రెండు ప్రదేశాల్లో ఒకేసారి ఉన్నావు” అంటాడు. ఆ అమ్మి, తాను నుంచున్నది రెండు ఊర్ల సరిహద్దు గీతకు అటు ఇటు అని గ్రహించీ గ్రహించగానే ఆ అబ్బిని చుట్టేస్తుంది. “హే.. ఇది చీటింగ్! నేను అన్నది ఇలా కాదు.. ఈ బౌండరీలన్నీ మనం సృష్టించుకున్నవి, అలా కాకుండా నిజంగా రెండు వేర్వేరు ప్రాంతాల్లో నేను ఒకేసారి ఉండాలబ్బాయ్.. చూపించు నీ బడాయ్!” అని ఒక్కసారైనా వాదులాటకి దిగుతుందేమో అనుకుంటాను. ఊహు.. ఎన్ని సార్లు సినిమా చూసినా ప్రతీ సారి ఆ అబ్బాయి మీద ప్లాట్ అయ్యిపోతూనే ఉంటుంది. ఆ విషయం కాస్త పక్కకు పెడితే, నాకు ఈ సీను చాలా నచ్చటానికి కారణం, this is a practical guy’s approach to a dreamy’s challenge. “నాకు ఏక కాలంలో రెండు చోట్ల ఉండాలని కోరిక!” ఎంత అసంబద్ధంగా, అలోచనారహితంగా అనిపిస్తుందో, ఆ అబ్బాయి చర్య వల్ల చట్టుక్కున తెలివైన కోరికగా మారిపోతుంది. కొందరి సాంగత్యంలో మన వెర్రితనంలో కూడా కొత్త అందాలు కనిపిస్తాయి.

“हे बच्चू तुम सुनले मेरा दिल का एक आर् डर्” (ఓయ్..నా మనసు ఆర్డర్ విను..) అనే అవకాశం నాకూ ఉంది కావున, “ముందుకెళ్తూ వెనక్కి వెళ్ళాలి” అని ఆర్డర్ పాస్ చేశాను. “ముద్దపప్పు, రాగి సుద్ద, మట్టి బుర్ర” అని నా నమ్మకం కాబట్టి పాపం చాన్నాళ్ళే పడుతుందిలే, ఆర్డర్ సర్వ్ చేయటానికనుకున్నా. కానీ ఒక శనివారం మధ్యాహ్నం పూట. కోఠీ బుక్ సెంటర్ లో ఏదో ఎగ్జిబిషన్ అనేసరికి ఎటే వెళ్ళాలని డిసైడ్ అయ్యాం. ఈ లోపు అమ్మ, “లేదు నాకు బేగం బజార్ లో పనుంది, మీ ఇద్దరితోనూ..” అని బాంబు పేల్చింది. చేసేది లేక, మొహం వేలాడేసుకునే బయలుదేరాం.

పాత బస్తీ!! ఆ గాలిలోనే ఏదో ఉంటుంది. చిన్నప్పుడు అగ్గిపెట్టలతో ఇల్లు కట్టేవాళ్ళం. పేక ముక్కలయితే మరీ త్వరగా కూలిపోయేవి. అగ్గిపెట్టలు, లేక నోటు పుస్తకాల అట్టలతో చేస్తే కనీసం తనివి తీరా చూసుకునేంత సేపైనా ఆగుతాయి. నాలుగు అగ్గిపెట్టల్తో ఒక ఇల్లు అయ్యిపోయేది. అలా వరుసగా ఒకే రకం ఇల్లు. ఒక్కో చోట మాత్రం రెండంతస్థులు. మధ్యన మరీ ఇరుకుగా ఉండేలా కొన్ని పెట్టటం -ఇవి షాపులు. పల్చని అట్టముక్కలు తీసుకుని ఒక తలుపు ఒక కిటికీ ఆకారాలు చేస్తే, ఇళ్ళు పూర్తి స్థాయిలో తయారయ్యేవి. అటూ ఇటూ ఇళ్ళు, షాపులు కట్టేసాక, మధ్యన ఒక నల్ల కాగితం పెట్టేదాన్ని, అది రోడ్డు! అంటే ఒక వీధి పూర్తయ్యిందన్న అన్న మాట. (మొహమాటపెడితే, గల్లీ అంటాను.) ఇరుకైన రోడ్డుకి ఇరువైపులా చిన్న చిన్న గదులతో ఇళ్ళు మాత్రమే నా నమూనాలో ఉన్నాయి. వాటిలో జీవం చూడాలంటే మాత్రం పాత బస్తీలో సారి తిరగాల్సిందే. హడావుడిగా పరిగెత్తే వాహనాలు, అంతకన్నా హడావుడి పడే చిట్టి పాపాయిలు, క్రికెట్ట్ ఆడే వీరులూ, సరుకులు కట్టించుకుని వయ్యారంగా నడిచిపోయే బుర్ఖా భామల గాజుల, గజ్జెల గలగలలూ, గల్లీ చివర్న సైకిల్ మీద బీటేసే కుర్రకారు, అరుగు మీదో లేక నాలుగు కూర్చీలేసుకునో లోకాభిరామాయణం చెప్పుకునే చాచాజాన్ లు.. వాహ్! ఇక అక్కడే ఏ ఇరానీ ఛాయ్ కొట్టో, బేకరీనో, మిరపకాయ బజ్జీ బండో ఉంటే… సుభాన్ అల్లా!! హమ్మ్.. వీటితో పాటు ఒక్క గుడిలో హారతి కర్పూరం వాసన, దగ్గర్లో మసీదు దరిదాపుల్లో అగరొత్తుల వాసన! మత్తెక్కించి వదుతాయి. మా ప్రయాణం ముందుకే సాగుతోంది… నా జ్ఞాపకాలు మాత్రం వెనక్కే వెళ్తున్నాయి.

బేగం బజార్ లో పని చూసుకుని కోఠి చేరాం. హైద్ లో నాకిష్టమైన ప్లేస్ అంటే ఇదే చెప్తానేమో. ఇప్పుడంటే మాల్స్ అంటూ తిరుగుతున్నా కానీ ఆ వీధుల్లో ఎన్ని చెప్పులు అరగదీయలేదని?! (అహ.. ఉద్యోగాల కష్టాలు అవీ కాదు, షాపింగులు చేసి చేసి.. :P) పద్మవ్యూహం లాంటి ఆ రోడ్ల మీద రాయటం కోసం ఎన్ని పదాల గుమ్మరించినా, అనుభవంలోకి రావు. “మా కొట్టుకి రండి” అంటూ బెదిరింపుల్లాంటి అభ్యర్థనలు. “కొనండి” అని అడుగుతారే కానీ వినిపించడానికి అది “కొంటావా?చస్తావా?”! సైకిల్ అంత వేగంగా పోయే కారు, దాని సైరను, ఈ లోపు ఎదో నచ్చి ఉన్న గుంపులో ఒకరు ఆగిపోవటం, ముందేదో బాగుందనుకుంటే ఇంకోరు వెళ్ళిపోవటం, “ఎక్కడ?ఎక్కడ??” అన్న వెతుకులాటలు; ఇవ్వన్నీ చాలానే మంది చూసుంటారు. ఈ గోలలేమీ లేకుండా, ఇంకా పూర్తిగా ఎండ కూడా రాని ఉదయం వేళ, ఖాళీ వీధుల్లో మూసేసిన కొట్లన్నీ, నిద్రపోతున్న బిచ్చగాళ్ళని చూస్తూ, కొన్ని చోట్ల “తీస్తారా? తీయ్యరా?” అని గదామాయించి మరీ చేసిన షాపింగ్స్! “ఇంకో మాట.. ఇంకో మాట” అంటూ బోణీ బేరాలు! మార్నింగ్ షో సినిమాకి కాలేజీ బంక్ కొట్టి ఓ ఉదయం పూట కోఠీ అంతా కలయతిరిగిన వైనం ఆరేళ్ళవుతున్నా అంతే స్పష్టంగా ఉంది. నడుస్తూ నడుస్తూ పొరపాటున ఒక అమ్మాయి నా కాలు తొక్కి నాకు సారి చెప్పలేదని నేను చేసిన రాద్ధాంతం! నాకు కావాల్సిన పుస్తకం ఎవరూ అమ్మటం లేదన్న ఉక్రోషంలో చేసిన భీషణ ప్రతిజ్ఞలూ! ముందుకే కదా నడుస్తున్నానూ అని గుర్తుతెచ్చుకోవాల్సినంత వెనక్కి ఆ వీధుల్లో పరిగెడుతున్నా, అప్పటికీ ఇప్పటికీ వచ్చిన ప్రతి చిన్న మార్పూనూ గమనించగలుగుతూ అడుగులు ముందుకి సాగాయి.

కోఠీలో తినడం అంటే గోకుల్ చాట్! అక్కడికి చేరగానే గుండె నీరు కారింది. ఊసురుమంటూ గోకుల్ చాట్ వెనక్కి వెళ్తే స్వేచ్ఛగా విహరించే పావురాలు. వాటిని చూస్తుంటే భయాలూ, అభద్రతా భావాలూ కూడా అలానే చిటుక్కున ఎగిరిపోయాయి. నా పక్కనే నలుగురి అమ్మాయిల గాంగ్! “గోకుల్ బాక్ ఎంట్రెన్స్ లేదా?” అన్న ప్రశ్న వినిపించేసరికి వాళ్ల లోకం నుండి బయటికి వచ్చి హుందగా సమాధానం ఇచ్చి, మళ్ళీ ఆ కబుర్ల లోకంలో మాయమయ్యిపోయారు. కోఠీ వీధుల్లోనే సాధ్యమేమో, చట్టుకున్న ఎదురుపడ్డ అపరిచుతురాలు, అంతే టక్కున “డ్రెస్సు భలే ఉంది..ఎక్కడ కొన్నారు?” అనో లేక, “హే.. చూడు, చూడు తన డ్రెస్స్” అని చెవులు కొరుక్కోవడమో వినిపించేది. అమ్మాయిలతో మాటా మాటా కలిసి, షికారులూ, షాపింగులూ చేసే అవకాశాలున్నాయి. అదే అబ్బాయిలు ఈ ముక్కంటే, మొహం మీద తిట్లు, వెళ్ళిపోయాక మురిసిపోడాలు! అబ్బాయిలెక్కువగా ఉపయోగించే “కలర్స్” కోఠీలో పుష్కలం. కానీ అది వాళ్ల బట్టల వచ్చింది కాదు, అందానికి మించిన ఆత్మవిశ్వాసం, దానికి ఏ మాత్రం తగ్గని చిలిపితనం వల్లా వచ్చుండచ్చు. బ్రతుకింకా భయపెట్టకపోవటం వల్ల వచ్చిన నిర్భీతి కూడా అయ్యుండచ్చు. ఏదేమైనా ఇక్కడ “అందాలే వేరులే!”

ఇక తిరుగు ప్రయాణం! ఒకే క్షణంలో ప్రస్తుతాన్ని, గతాన్ని జీవించేసి హాయిగా తిరుగొస్తుంటే ఒక సుమనోహర దృశ్యం. “ఇంకో రెండు గంటల్లో బడి వదిలేస్తారు” అన్న ఆనందంలో ఉన్న సూర్యుడు, కాస్త ఉత్సాహంగానే ఉన్నాడు. నేరుగా చూసే సాహసం చేయలేనంత తీక్షణంగానే ఉన్నాడు, ఒక మసీదుకున్న రెండు మినార్ల మధ్య. నీలి మేఘాల మధ్య నిలబెట్టున్నట్టుగా కనిపించే రెండు తెల్లని మినార్లూ, మధ్యన నారింజ పండు రంగు సూర్యుడూ ఏదో పేటింగ్ లా కనిపిస్తుంటే, ఆ చిత్తరవుకి ప్రాణం పోస్తున్నట్టుగా టపటపా రెక్కలనాడించుకుంటూ ఎగిరిన పక్షి.. మాయచేసిందో ఏమో కళ్ళు దాన్నే వెంబడించాయి. అది కాస్తా, ఓ కరెంట్ తీగ మీద వాలింది కాస్త ప్రయాణానికే. అదే తీగకు వేలాడుతున్న పతంగూ, దానికున్న దారాన్ని పట్టుకున్న చూపు అక్కడో మైదానం ఉందనీ, ఇద్దరు చిన్నారులు ఆ గాలిపటానికేసే చూస్తున్నారనీ గమనించి నా చిన్నప్పుడో ఏం జరిగిందో చెప్పటానికి ఉపక్రమించిన మెదడుని “హే.. ఇక ఆపు! మళ్ళీ ఎంత దూరం తీసుకుపోతావ్?” అని అనాలనుండీ అనలేక, మరో క్షణం మరో జ్ఞాపకంలో, కళ్ళ ముందున్న నిజంలో ఒకేసారి నేను! ఇక్కడుంటూనే, అక్కడా ఉన్నాను!

బొమ్మరిల్లు – నా సోది!


బొమ్మరిల్లు సినిమాకి ప్రత్యేకమైన స్థానం ఉంది నా దృష్టిలో. ఈ సినిమాకి నేను నా స్నేహితులతో వెళ్ళాను. అది పేద్ద విషయం కాదు మామూలుగా అయితే! కానీ ఈ స్నేహితులు నాకు చాలా ప్రత్యేకం. “గానం పుట్టుక గాత్రం చూడాలా?” అన్నట్టు స్నేహం పుట్టకకు మనం గుడ్డి సాక్షులం అనుకుంటాను. కలిసి పంచుకునే క్షణాల్లో ఎప్పుడో చట్టుకున్న పుట్టేస్తుంది. అలా పుట్టిందని కొన్నాళ్లకి మనకే ఎరుకలోకొచ్చి, అప్పటి నుండి దాన్ని పెంచి పోషించే కార్యక్రమం పెట్టుకుంటాం – అప్పుడప్పుడూ ఫోన్ కాల్స్, క్షేమ సమాచారాలు, గ్రీటింగ్ కార్డ్స్ ఇలాంటివేవో. ఈ పోషించే కార్యాలు క్రమంలో కొనసాగుతూ ఉండాలంటే అటు-ఇటు రాకపోకలుండాలి. ఆ రాకపోకలకి చార్జీలు పెట్టుకునేది, ఇంతకు ముందే కలిసి పంచుకున్న సమయం. ఆ సమయంలోని గాఢత, అనుబంధం. కొన్ని సార్లు ఏమవుతుందంటే, ఓ రైల్వే భోగీలో ప్రయాణిస్తున్నప్పుడు మాటా మాటా కలిసి మనసూ మనసూ వికసించి, ఆత్మీయ సంభాషణకి బీజం పడుతుంది. ఎవరి స్టేషన్ దగ్గర వాళ్ళు దిగిపోతారు. అప్పడా సంభాషణ ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోడానికి గుండెలో ఒక పత్యేక స్థానంలో నిలిచిపోతుంది. ఏదో ఒక క్షణాన జరిగిన కకాళతీయం కాదు మన పరిచయం, అది ఓ జీవితానికి సరిపడా స్నేహం అని మాకు మేం ఇచ్చుకున్న “గిఫ్ట్” బొమ్మరిల్లు!

ఇంతకీ ఇవ్వాళ బొమ్మరిల్లు చూశాను – మళ్ళీ! మొన్నా మధ్య ఓ స్నేహితురాలితో మాటల మధ్యలో నాకు హాసిని నచ్చదు అన్నాను. ఇర్రుక్కుపోయాక బయటకు రావాలి కాబట్టి నా శాయశక్తులా ప్రయత్నించి బయటపడ్డాను. ఇవ్వాళ సినిమా చూస్తుంటే ఆ సంభాషణ గుర్తొచ్చి ఆలోచనలు ఎటు వైపే పోయాయి.

నాకు ఈ సినిమాలో హాసిని నచ్చదు. నచ్చకపోగా విసిగొస్తుంది. తన అమాయకత్వాన్ని కూడా ఆడంబరంగా చూపించాడనిపించింది. నవ్వుతూ – తుళ్ళుతూ అమ్మాయిలుండచ్చు, అదే సమయం there should be a sense of the world around too. “నేను ఇంట్లో ఒకలా – బయట ఒకలా నటించలేను” అంటుంది. బస్స్ లో ఎవడో కాలు తొక్కి, వెంటనే సారీ అని ఆత్రుతగా మన కోసం బాధ పడితే, “పర్లేదండీ.. నొప్పి లేదు” అని అంటాం నొప్పి వస్తున్నా. దీన్ని వాడిని చీట్ చేయడమో, మనం చీట్ చేసుకోడమో కాదు. పొరపాటున జరిగిన పరిణామంలో ఓ మనిషిని ముద్దాయిగా నిర్ణయించడం దండగ కాబట్టి. మనమెప్పుడూ మనమే! కానీ అవతలి వాళ్ళతో ఉన్నప్పుడు కొన్ని fine tunings తప్పవు. నేను చాలా సరదా అమ్మాయినంటూ నా స్కూల్ ప్రిన్సిపల్ భుజం మీద చేయి వేసి మాట్లాడలేను కదా! నాకు కొత్తా-పాతా లేదంటూ దారీ పోయిన వాడిని అప్పు అడగలేను కదా! ఓ అమ్మాయిని epitome of happiness గా చిత్రీకరించడానికి ఆమె చేత ఏదైనా చేయ్యించడేమేనా? చివర్లో తనకేం కావాలో ఖచ్చితంగా చెప్పగలిగే హాసిని అంటే నాకు కొంచెం గౌరవం. మనసుని, మనసులోని అలజడిని స్పష్టంగా వ్యక్తికీరించగలిగే ఏ వ్యక్తికైనా ఇచ్చే గౌరవం. లేకపోతే ఏ అతిధిలో ఏ పూరీలానో, హాసిని కూడా రిజిస్టర్ అయ్యుండేది కాదు.

ఇక సిద్ధూ! సినిమాలోని కారెక్టర్లని ప్రేక్షకులు ఏమైనా చేసుకోవచ్చు అంటే, ఈ అబ్బికి ఆపకుండా అరగంట లెక్చరర్ ఇస్తాను. వీడితో నాకొచ్చే ప్రధాన సమస్య – “హాసిని నా పక్కన ఉంటే లైఫ్ అంతా హాపీ”, “ప్రేమిస్తున్నాను కదా నిన్ను, ఇంకేంటి? ఆలోచించటం లేదంట… ” అనే ప్రతీ సారి, లాగి నాలుగు చివాట్లు పెట్టాలనిపిస్తుంది. మనం సంతోషంగా ఉండటం కోసం మరో వ్యక్తి అవసరమేమిటో? సంతోషానికి ఒక source ఉంటుందా? అక్కడి నుండి ఎప్పుడూ ఓ ప్రవాహం అలా పొంగుతూ మనలో ప్రవేశించడానికి? ఓ మనిషిని మన source of happinessగా నిర్ణయించేసుకుని, దానికి “ప్రేమ”ను ఎరగా వేసేసి, ఆ మనిషి నుండి ఏ మాత్రం ఆ ఉదృతి తగ్గినా ఉరి తీసేసంత కోపంతో ఊగిపోతూ – NONSENSE! అసలా సుబ్బలక్ష్మి వచ్చి, “నీతోనే నా సంతోషం” అని “ప్రేమ”గా అంటే వీడేం చేసేవాడో! అవతలి మనిషిని పూర్తిగా స్వీకరించనిదే ప్రేమని ఎలా నిర్ణయానికొచ్చేస్తారో!?

ఓ మనిషి స్నేహం, సాన్నిహిత్యంలో మన మీద ఎంతో కొంత ప్రభావం చూపుతూ ఉంటాయి. ఆ ప్రభావం కాలక్రమంలో ఎంత గాఢంగా మనలో ప్రస్ఫుటమవుతాయన్నదే ఆ స్నేహానికి / ఆ సాన్నిహిత్యాకి అసలైన నిదర్శనం. హాసిని, సిద్ధూ పెళ్ళి చేసుకోవడం సరే! అన్నీ కుదరాయి కనుక, మనకి పెళ్ళి క్లైమాక్స్ అవ్వాలి కనుక! ప్రకాష్ రాజ్ ని సెమీ-విలన్ గా క్రియేట్ చేసేసి ఆ సమస్య తీరిపోవడంతో సినిమా సుఖాంతం అనిపిస్తాడు. కానీ వీళ్ళు నిజ జీవితాల కారెక్టర్లైతే – సిద్ధూ హాసినితో నిజంగా “హాపీ”గా ఉండగలడా అన్నది సందేహమే! ఏదో ఒక కార్పొరేట్ పార్టీలో హాసిని ఎవరి తలనో గుద్దుతానంటే? కొత్తగా ఏర్పడ్డ స్నేహితుల మధ్య “బిహేవ్” చెయ్యమని బెదిరిస్తే? హమ్మ్.. సినిమా కదా! “ది ఎండ్” అన్నాక ఆలోచించకూడదు. అదే జీవితమైతే.. ఐతే?! జీవితంలో అసలెప్పుడూ ఆలోచించకూడదు.. go along the tide! అయినా Thanks Heaven that Love is Blind, for ignorance is truly bliss!

(The unusual rant in my blog! Did I finally pick the art of blogging? :P)