గతం గతః


పదేళ్ళ కిందట..

“మోసం” అనే పదం అనుభవంలోకి వచ్చింది. “వెన్నుపోటు” అంటే తెలిసొచ్చింది. “నిఘా” పనితీరుని గొల్లవాడి కన్ను వెక్కిరించింది. “అమానుషం” అనేది కళ్ళ ముందు కుళ్ళిన శవాల రూపంలో సాక్షాత్కరించింది. “కడుపుకోత”ను గూర్చి ఎదిగిన కొడుకులను పోగొట్టుకున్న తల్లి చెప్పుకొచ్చింది. “కర్తవ్య నిర్వహణ”ను భర్త భౌతికకాయానికి సెల్యూట్ కొట్టిన భార్య నేర్పింది. “మానవత్వం” అంటే శత్రువుల దహన సంస్కారం కానిచ్చిన తీరు స్పష్టం చేసింది. “రాజకీయం” అంటే ఏమిటో నేతల కల్లబొల్లి మాటలు నిరూపించాయి. శిఖరాలు జయించినా “వినమ్రం”గా ఉండడం సైన్యానికే సాధ్యం అయ్యింది.

“అజాగ్రత్త” వల్ల కలుగు అనర్థాలకు మూల్యం ఎలా చెల్లించుకోవాల్సి వచ్చిందో చరిత్రలో పుటగా నిల్చిపోయింది, “కార్గిల్” అనే పేరుతో!

పది నెలల వరకూ..

టీవీ షోలు, పేపర్లో, సినిమాలూ, సాహిత్యంలోనూ “కార్గిల్” హవా నడిచింది. కథలు, వ్యథలు ఎన్నో షికారు చేశాయి. కొందరు నవ్వుతూనే పోతూ పోతూ దేశాన్ని ఏడిపించారనీ, కొందరు అదరలేదూ, బెదరలేదూ అనీ, కొందరు దేశం సంరక్షణ కోసమే పుడతారనీ, కొందరు మాత్రమే “అసలైన హీరో”లనీ వేన్నోళ్ళ పొగిడారు. ప్రతీ ఒక్కరిలోనూ “భారతీయత” ఒప్పొంగింది. ప్రతీ ఒక్కడూ “దేశభక్తి”ని నిరూపించుకున్నాడు, “హయ్యో.. ఏంత కష్టం” అని అనుకొని అయినా సరే! అవార్డులూ, రివార్డులూ అని ప్రభుత్వం “హంగామా” చేసింది. అవి అందనే లేవని, బాధిత కుటుంబాలు వాపోయాయి.

పది నిముషాల క్రితం..

కార్గిల్ యుద్ధం జరిగి, ఇది పదో ఏడు అనే ఈ-మెయిల్ చదివాక గానీ స్ఫురించలేదు. గతమంతా కళ్ళ ముందు రీళ్ళుగా తిరిగింది. “జో షహీద్ హువె హె, ఉన్‍కీ జర యాద్ కరో కురుబానీ” అంటూ నెమరువేసుకున్నాను. “జర ఆంఖ్ మె బర్ లో పానీ” — కన్నీళ్ళన్నీ వేరొకరు రిజర్వ్ చేసేసుకున్నారట, కుదరవు అన్నాయ్! ఓ భారమైన నిట్టూర్పు విడుస్తూ అనంతమైన ఆలోచనలలో ఈదుతుండగా..

“హే.. ఆర్ యు ఒకె?” అన్న పిలుపు విని పైకి తేలాను.
“ఏమయ్యింది? అదోలా ఉన్నావ్?”
“కార్గిల్ మెయిల్ చూసి, ఏవో ఆలోచనలూ..”
“ఓహ్! అది సరే “లవ్ ఆజ్ కల్” పాటలు సూపర్ అట”
“అవునా.. ఏదీ ఇటు ఇవ్వు..”

పది క్షణాల్లో..

“కార్గిల్” అన్న పదం హృదయాంతరాళంలోకి, తవ్వితే గానీ రానంత లోపలికి! పులుముకున్న నవ్వుల్లోకి నేను!

Advertisements

సముద్ర తీరాన..


“సాగర్ కినారే.. దిల్ యె పుకారే.. ” కిషోర్ దా మొదలెట్టాడు పాడ్డం. ఆ సమ్మోహనాస్త్రానికి దాసోహం అనేదాన్నే, “సముద్ర తీరాన నేను” అనే జ్ఞాపకాల తుట్ట కదలకపోయుంటే!

కొన్ని మన అనుభవంలోకి వచ్చి దూరమవుతాయి. దగ్గరున్నప్పటి క్షణాలు ఎలా వచ్చిపోయాయో మనం గ్రహించే లోపే అవి మాయమయ్యిపోతాయి. అవి దూరమయ్యాక, కలిసి గడిపిన క్షణాల జాబితా రాసుకొని, నెమరవేసుకుంటూ, ఆ క్షణాలకున్న స్వచ్ఛతకి ఈ క్షణపు రంగును పులిమి ఓ కొత్త చిత్రం తయారుచేసుకుంటాము. కానీ ఒక్కోసారి అసలెప్పుడూ అనుభవించని వాటి గురించి, అనుభవజ్ఞులు చెప్తుంటే ఊహలు రెక్కలు తొడిగేసి, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఇచ్చే ప్రదర్శనలోలా గాల్లో రంగురంగుల ఆకారాలు గీయిస్తుంటాం. గాల్లో ఆ చిత్రాల ఆయువు క్షణికం, మనసులో మాత్రం శాశ్వత ముద్రలు. కలిసేదాకా కలేగా అనుకుంటుండగా, కథ మలుపు తిరిగింది.

సీన్ కట్ చేస్తే, నేను సముద్రానికి అతి దగ్గరలో ఉన్నాను. అనంతమైన సాగరం, కళ్ళ ముందు, కళ్ళల్లో నింపుకోలేనంతగా! ఉక్కిరిబిక్కిరి అయ్యాను. ఆనందంతో ఊపిరి ఆగిపోతుందేమో అన్న ఆలోచనతో పాటు నవ్వూ వచ్చింది. సాగర ఘోష వినిపించటం లేదు. నా మనసు రొద ఎక్కువయ్యిపోయింది. “ఇదే మొట్టమొదటి సారి నేను చూడ్డం, నన్ను అన్నీ గమనించనీ” అంటూ మెదడు మందలించింది. మనసు కాస్త లొంగింది. నేను నాలుగు అడుగులేశాను.

“జాగ్రత్తగా ముందుకెళ్ళు, పర్లేదు!” అంది మెదడు. అదిచ్చిన ధైర్యంతో ఇంకో నాలుగు అడుగులు వేశాను. ప్రాణమున్న చిత్తరువు.  సుతారంగా తాకిపోయే గాలి, తడి ఇసుకను అపురూపంగా తాకుతున్న పాదాలు.  సర్వేంద్రియాలు సాగరం పాలు అయ్యిపోతున్నాయి.

“పదపద.. ఇంకా ముందుకెళ్ళు” మనసు ఘోషలో సాగరడు కూడా నిశ్శబ్ధమనిపించాడు. నేను ముందుకెళ్ళాలో లేదోనన్న అనిశ్చితిలో ఉండగానే ఓ అల చల్లగా వచ్చి మెల్లిగా తాకింది. తొలి స్పర్శ! అల తాకిన తరుణం శరీరంలోని అప్పటి వరకూ లేని ఏవో కొత్త సంకేతాలు మొదలయ్యాయి. అది వెనక్కి వెళ్ళేటప్పుడు నాలోని ఏదో భాగాన్ని తీసుకెళ్ళిపోతుందన్న భావన కలిగి, అప్రయత్నంగా రెండు అడుగులు వేశాను.

“జాగ్రత్త!” మెదడు వారిస్తోంది. “భయం వలదు” మనసు ఉరకలేస్తోంది. అనిశ్చితి నన్ను కమ్మేస్తోంది.

ఇంతలో మరో అల. ఎప్పుడొచ్చిందో, ఎలా వచ్చింది. కాలి కింది ఇసుకను లాక్కుపోయింది. పడబోయాను. సంభాళించుకున్నాను.

“నువ్వు ముందుకెళ్ళకపోతే, అదే నీ దగ్గరకి వస్తుంది తెల్సా! చూడు నీ మీదెంత ప్రేమో” మనసు తాను నెగ్గిందనుకుంది.

“కాళ్ళు సరిగ్గా ఆన్చు. గట్టిగా నిలబడు. కాస్త కళ్ళు పైకెత్తి వచ్చే అలలను చూస్తూ ఉండు. ఎంత ఉదృతిలో వస్తున్నాయో అంచనా వేసుకుంటే, మనం జాగ్రత్తపడచ్చు” అని మెదడింకా ఏవో సూచనలు ఇస్తూనే ఉంది. ఇంతలో మరో అల మోకాలి పై వరకూ నన్ను తడిపేసింది. ఆనందాశ్చర్యాల్లో నేను. మనసు ఫక్కున నవ్వింది. “నన్ను నమ్ము” అంటూ దీనంగా మెదడు. నమ్మాలనిపించలేదు. స్వర్గపు ముఖద్వారంలో ఉండగా ఐడెంటిటీ ప్రూఫ్ చూపించమన్నంత చిరాకేసింది. మనసు ఆ విషయం కనిపెట్టేసింది. అడ్డూ అదుపూ లేనందుకు గెంతులేసింది. నా చేతా గెంతులేయించింది. బాగుందనిపించింది. అంతలోనే కథలో మరో మలుపు.

మనసు ఆటలో నాకు తెలీని నియమాలు తెల్సొస్తున్నాయి. “రా, రమ్మ”ంటే అల రాదు. “వద్దుపో” అంటే చట్టుక్కున చుట్టేస్తుంది. వేచి చూసినంతసేపూ హేళన చేస్తుంది. అహం దెబ్బతిని మూతి ముడుచుకుంటే నిలువెళ్ళా ముంచేస్తుంది. ప్రతీ తాకిడిలో కొత్త జీవం ఇస్తుంది. పోయే ప్రతీ సారీ ప్రాణం తోడేస్తుంది. నచ్చతుందో, నచ్చటం లేదో కూడా తెలీలేదు. దానికి తోడు మనసు ఎప్పుడు ఎగురుతుందో, ఎప్పుడు పడుతుందో తెలీటం లేదు. ఉన్నపలాన ఉప్పెనలా ఉత్సాహం, ఉన్నట్టుండి నీరు గారే నిరూత్సాహం.  నవ్వుకి, కన్నీళ్ళకి విభజన కుదరడం లేదు. ఇది వరకెప్పుడూ ఎరుగని “నన్ను”ని చూసుకొని అయోమయం మొదలయ్యింది. తర్వాత భయమేసింది. నాలోని అపరిచిత వ్యక్తిని చూసి గుక్క తిప్పకుండా ఏడ్వడం మొదలెట్టాను. ఆ ఏడుపులో కొట్టుకుపోతానేమో అనేంతగా! మెదడు నన్ను చూసి జాలిపడి ఊరుకోక, నా కన్నీరాగే వరకూ ఓపిక పట్టి, నన్ను తనతో తీసుకెళ్ళి ఓ పట్టీ చూపించింది. కన్నీళ్ళు తుడుచుకొని చూస్తే, అదేదో గ్రాఫ్! అదేమిటో అర్థమయ్యేలోపు ఇంకో గ్రాఫ్ దాని పక్కనే పెట్టింది. తికమకలోనూ వాటిలో ఒక సారూప్యం కనిపించింది. ఆ రెండూ ఒకటేలా ఉన్నాయి.

“ఒకటి నీ గుండె చప్పుడు. రెండోది అల. ఏమన్నా అర్థమవుతోందా? నువ్వు అలతో ఎంత అల్లుకుపోయావంటే, నీ గుండె సవ్వడి కూడా దానినే అనుకరిస్తుంది.”

కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాను వాటివంక. నాకు తెలీకుండా ఒకరికి నా మీద ఇంత అధికారమా?! “అధికారం కాదది, అనురాగం వల్ల వచ్చిన కొత్త పరిణామం… అంతే!” మనసు తన వాదన మొదలెట్టింది. “ప్రేమ నైజమే అంత! కవ్విస్తుందీ, నవ్విస్తుందీ, కన్నీట ముంచుతుందీ. అంత మాత్రన అలతో నీ బంధం, బంధం కాకుండా పోగలదా?”

“అది ప్రేమ అవునో కాదో తెలీదు కానీ, అల నైజం మాత్రం నీ కళ్ళముందుంది!” మెదడు ఏదో చెప్పుకొస్తోంది. ఏవీ వినిపించుకోను అని మొండికేశాను. నన్ను నేను కోల్పోతున్న వైనంలో ప్రపంచం ఉన్నా లేకున్నా ఒకటే అనిపించింది. ఎవ్వరినీ ఖాతరు చెయ్యనని తీర్మానించుకున్నాను. అందర్నీ వెలివేశాను. నా కోపం పోయే వరకూ ఎదురు చూసింది మెదడు. ఆ తర్వాత మెల్లిగా..

“లేదు లే! మనసు చెప్పే దాంట్లో కూడా నిజముంది. నీలో నిక్షిప్తమై ఇప్పటి వరకూ ఏ కన్నూ ఎరుగని అందాన్ని ఈ సముద్రం ఆవిష్కరించచ్చు. నిన్ను కవ్వించీ, ఉడికించీ నీతో ఆటలాడచ్చు. పసిపాపాయిలా నిన్ను తనలో దాచుకోవచ్చు. కాకపోతే, ఇవేవీ జరక్కుండానే నువ్వు వెనుదిరగాల్సి రావచ్చు.”  ఆశ పెట్టినట్టే పెట్టి చంపేసింది మెదడు.

“మరిప్పుడెలా?” అన్నా నేను.

“ఏమీ లేదు. ఇక్కడే ఉండు. ఇలానే ఆడుకో. ఆడుకోనివ్వు. అల తాకినప్పుడు సంబరపడు. వదిలిపోతుంటే. నీ ప్రాప్తం అనుకో.”

“ఎన్నాళ్ళిలా?”

“కుదిరినంత కాలం! ప్రపంచం నిన్ను వెన్నక్కి పిల్చినప్పుడు వెనక్కి వెళ్ళిపోదువు. ఈలోపు సముద్రం నిన్ను తనలో కలిపేసుకుంటే సరే సరి!”

ఒప్పందం నచ్చింది. మనసుకి అవధులు లేని ఆనందం. ముగిసిపోతుందని ముందే తెలీటం ద్వారా ఎంత అభద్రత కలుగుతుందో, ఆస్వాదించటం కూడా అంత మెరుగుపడుతుంది. నేను ఇప్పుడున్నది ఆనంద సాగరం. నాదీ-నీదీ, నవ్వూ-బాధ, చీకటి- వెలుతురు, ప్రేమ-ద్వేషం అనే ద్వంద్వాలను దాటుకొని, విభజించలేనివి కొన్నుంటాయని తెల్సొచ్చిన లోకం. బంధంలో బంధించడం కన్నా, ఏ బంధనాలు లేని వాటిలోని రమ్యత స్పష్టమయ్యింది. నన్ను నేను కోల్పోకుండానే అనంత సాగరాన్ని ఆశ్రయమిచ్చాను.

మైమర్చిపోయుండగా, ప్రపంచం తన ఉనికి చాటుకోవడానికన్నట్టు నన్ను పిల్చింది. నేను పట్టించుకోలేదు. కాసేపటికి అమ్మ నుండి పిలుపు. తప్పలేదు. వెళ్ళాలి. లేచాను. మనసు మారాం చేస్తుందనుకున్నాను, వదిలేస్తున్నందుకు. ఏదో స్తబ్ధతలో ఉండిపోయిందది, కలల సౌధం కుప్పకూలిపోయినందుకు. బయలుదేరాను. ఒక్కో అడుగూ ముందుకెళ్తుంటే అలలు వెంబడించాయి. “ఆగిపోదామా?” అని బతిమిలాడింది మనసు. “సమయం మించిపోయింది” అని మెదడు చిన్ని ఆశ నడుం విరిచేసింది. వెనక్కి తిరిగి చూడకుండా నేను నడుస్తూనే ఉన్నాను.

“కఠినాత్మురాలా!” మనసు ఉక్రోషం చూపించడానికి విశ్వప్రయత్నం చేసింది. స్థిమితంలేక, మరో క్షణంలో “నాదే తప్పు. నేనే ఆశపడ్డాను! అదే అన్నింటికీ అనర్థం!” అని మధనపడింది.

“ఆశ పడ్డం నీ నైజం. నిన్ను అదుపులో పెట్టడం నా నైజం. నువ్వు చేసినదాంట్లో తప్పు లేదు. నేను చేసింది తప్పో ఒఫ్పో ఎవరూ నిర్ణయించలేరు. ఉండుంటే ఏం జరిగేదో ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేనప్పుడు, వచ్చేయటం కూడని పని అని ఎలా చెప్పగలరు? కలలెంత ముఖ్యమో, కాలమూ అంతే! జరగవచ్చునేమోనన్న కలలో జరుగుతున్న కాలాన్ని విస్మరించలేను!” మెదడు తర్కవితర్కాల్లోకి వెళ్ళిపోయింది.

“ఏమో.. నాకివ్వన్నీ తెలీదు” అంది మనసు.

“నీకు తెలీకూడదులే ఇవి. కానీ ఒక్కటి మాత్రం నిజం నువ్వనుకున్నది జరిగితే బాగుణ్ణు అని నాకు బలంగా అనిపించింది. ప్చ్.. జరగలేదంతే!”

ఉల్లిక్కిపడ్డాను,  తను ఆశపడుతూ కూడా నా క్షేమాన్ని తన నెత్తినేసుకుందే అని! నిట్టూర్చాను! నా క్షేమం కోరే వాళ్ళందరినీ గుర్తుతెచ్చుకున్నాను. సముద్రమూ మదిలో మెదిలింది. సన్నని నవ్వు పెదాలపై మెదిలింది.

ఇంటికెళ్ళగానే అమ్మ అడిగిన మొదటి ప్రశ్న, “సముద్రం నచ్చిందా?”.
“ఓహ్.. బ్రహ్మాండంగా!” అని కాస్త ఆగి, “సునామీ అంటే ఏంటో చెప్పనా? ఓ పేద్ద అల. ఎంత పెద్దదంటే ఓ ఇరవై ముప్ఫై అంతస్తులంత పెద్ద అల, అంతే! అంతకన్నా ఏమీ లేదు!”
అమ్మ ఆపకుండా నవ్వుతోంది.. ఎందుకో!

ప్రేమించటం కష్టం!


ప్రేమించటం కష్టం!

ముడతలు పడిపోయి, ఊసురోమంటూ ఉన్న నిర్జీవమైన ఊదని బుడగను తీసుకొని దానికి ఊపిరిపోయటంతో ప్రారంభమవుతుంది కథంతా! కొన్ని సందర్భాల్లో మనకే అంత ఊపిరిచ్చే ఓపిక ఉండదు. కళ్ళముందు అది ఆకారం దాల్చుతుందే కానీ అట్టే ఎక్కువ కాలం నిలువదు. బుగ్గలు నొప్పెట్టి, ఊపిరి తిత్తులు సహకరించక మనమే వదిలేస్తాం.  ఇంకొన్ని సార్లు మనం ఊపిరినిస్తున్న కొద్దీ బుడగ పెద్దవుతూ సంతృప్తి కలిగిస్తూనే ఉన్నా, మనం కాస్త ఊపిరి తీసుకునేలోపు మళ్ళీ నీరసపడిపోతుంది. మళ్ళీ గాలిపోస్తాం. మళ్ళీ ప్రాణం వచ్చినట్టుంటుంది. మనం ఊపిరి పీల్చుకుంటాం. అది మళ్ళీ ఊసురోమనడం మొదలవుతుంది. “ఎందుకిలా?” అన్న అలోచన రాదు. వచ్చే లోపు చాలా ఆలశ్యం జరిగిపోవచ్చు. ఆ బుడగకి చిల్లు పడిందని గ్రహించేలోపు మన మనసుకి తూట్లు పడ్డం ఖాయం. బహుశా ఎప్పుడో ఈ మనసులానే దానికి కూడా తూట్లు పడుండచ్చు. ఏమో?

ప్రేమించటం చాలా కష్టం!

అన్నీ కలిసొచ్చి బుడగా మంచిది దొరికి, మనమూ దానికి ఊపిరినిచ్చి ఓ అందమైన ఆకారాన్నిచ్చి ముడి వేసుకుని, పట్టుకునే వీలుగా తాడు కూడా సమకూర్చుకున్నాం అనుకోండి. మన కళ్ళ ముందే గాల్లో తేలుతూ మనల్నీ తేలియాడిస్తుంది. నేలజారక మబ్బు చాటు దాగున్న చినుకుల్ని అనుమతైనా అడగకుండా సూర్యకిరణాలు తాకినప్పుడు ఆవిష్కరింపబడే ఇంద్రధనస్సంత అద్భుతంగా ఉంటుందది. సాధారణంగా సినిమాల్లో “ది ఎండ్” వచ్చేది ఇక్కడే! అందుకే ప్రేమ అంటే మత్తుగా, గమ్మత్తుగా, మగతగా ఉంటుందనుకుంటుంటాం.

అనుకోడాలతో జీవితాలు అయ్యిపోవు కదా! అప్పుడే మొదలవుతుంది తిరకాసు. హృదయాంతరాళ్ళల్లో దాచుకున్నదంతా ఆయువుగా పోసేశాక ఒక ఉనికిని సంతరించుకొని, అది మన గుప్పేట్లో సజీవంగా ఉన్నదాన్ని చూస్తుంటే ముద్దొచ్చేస్తూ ఉంటుంది. మనసైనది మనసుకు హత్తుకోవాలనిపిస్తుంది. ప్రేమావేశంలో దాన్ని కాస్త గట్టిగా కౌగిలించుకున్నామా? అంతే సంగతులు. ఊపిరాడక ఉరేసేసుకుంటుంది. దగ్గరకి తీసుకుంటే దూరమవుతుందనే భయంతో, దూరంగానే ఉండనిచ్చామా? “ఉఫ్” అన్నప్పుడు వచ్చే గాలికి కూడా చలిస్తుంది. “పట్టుక్కుని కూర్చున్నానా?” అన్న అనుమానమూ రేకెత్తిస్తుందని వదిలేస్తే దిక్కూ, మోక్కూ లేక చచ్చే దిక్కుమాలిన చావుకి వదిలేసిన పాపం మనకంటుకుంటుంది.

పట్టుకోవాలి, విడిపించుకుని వెళ్ళలేనంతగా!  విడిచిపెట్టాలి, పట్టుకోల్పోనంతగా!

చెప్పానా? ప్రేమించటం చాలా కష్టమని. హమ్మ్..

(ప్రేమించబడ్డం గురించి మరో సారి! )