ప్రేమాయణం


రామాయణమట!

ఓ రాముడట! అతగాడికి చక్కని చుక్క సీత జంటట! లోకం కన్నుకుట్టి కాపురం అడవులపాలాయ్యెనట! కామం కాటేసిన రక్కసునికి సీత చిక్కెనట! మహాభయంకర బలశాలిని గడ్డిపోచతో ఎదిరించి, శోకతప్త సీత రామునిపై అపార నమ్మకంతో ఎదురుచూసెనట! విరహాగ్నినికి ఆహుతి కాక, రాముడు వానర మూక సాయంతో సంద్రాన్నే దాటేనట! అరవీర శూరులని రణాన ఓడించెనట! విధి విడదీసిన సీతారాములు, రాముని పరాక్రమంతో, సీత అచంచల విశ్వాసం వలన మరల జంటైనారట!

యుగాలు గడిచినా చెక్కుచెదరని మనోహరగాధ – రామాయణం.

ఈనాటి ప్రేమాయణంలో..

రాముడున్నాడు. సీతా ఉంది. ఇద్దరికీ జత కుదిరింది.
రాక్షసులు లేరు; అయనా సీతా రాములకు ఎడబాటు తప్పలేదు.
తీరిగ్గా కూర్చొని శోకించేందుకు ఆశోకవనాలు లేవు సీతకి..
రాముడు వారధులు కట్టడానికి మధ్యనున్నవి సంద్రాలు కావు, అంతుతెలీని అగాధాలు! పూడ్చుకునేవి కావు, విస్మరించడానికి వీలు కాదు.
ప్రతీ క్షణం పరోక్ష యుద్ధాలు, గాయాలు మాత్రం ద్విగిణీకృతం.
యుద్ధాలు ఒకరితో ఒకరికి కాదు, ఎవరితో వారికే!

అగాధాలను అధిగమించే అప్యాయతో, అహాలను బూడిద చేయగల అనురాగమో, ఆత్మాభిమానాన్ని గుర్తించగల విచక్షణో, లోపాలను అనునయించుకోగల ఆత్మస్థైర్యమో వీరిని బహుశా కలపగలదు. కానీ సమయం వీరికి సాయపడేనా? రామునికే ఎరుక!

Advertisements