ఆర్య 2


అచ్చ కొత్త తెలుగు సినిమాలకి తప్పనిసరై ఉండాల్సిన టాగ్‍లైన్ ఆర్య 2 కి కూడా ఉంది..ట! (“బేబీ.. హి లవ్స్ యు” అని నాతో పాటు సినిమా చూసిన జీవి జ్ఞానోదయం చేశాక తెల్సింది.)

కాకపోతే ఈ సినిమాకి అంతకన్నా స్టైలిష్ టాగ్‍లైన్ పెట్టచ్చు – the psycho unleashed, for you baby అని.

పరీక్షకు బ్లాంక్ మైండ్ తో హాజరైన విద్యార్థి, ప్రశ్నాపత్రం చూడగానే మైండ్ బ్లాక్ అయ్యి వెర్రిచూపులు చూడక, ఎంచక్కా “ధైర్యే additionalsఏ మార్కులు” అని దణ్ణం పట్టుకొని రీఫుల్లకు రీఫుల్లు పేపరు మీద కక్కించేసిన చందాన ఉన్న స్క్రీన్ టైం ని నింపడానికి ఇష్టం వచ్చిన ఆలోచనల్లా తెరకెక్కించేసి, “ఇందులో కథను కనుక్కోండీ.. చూద్దాం” అని ప్రేక్షకుల మీదకు వదిలేయటం పరిపాటి. ఆర్య – రెండు (అనకూడదా?!) అందుకు పరాకాష్ఠ.

“హై.. ఐ ఆమ్ ఆర్య” అనగానే “బట్… నేను ఆర్య టు కోసం వచ్చేనే?!” అందాం అనిపించింది.

తెలుగునాట సాప్ట్ వేర్ అంటేనే సభ్యసమాజంలో పరమ లోకువ. దేన్నైనా కాష్ చేసుకోవడంలో వస్తాదులైన సినిమా వాళ్ళు ఈ లోకువని ఎలా వదులుకుంటారు? ఒక డిగ్రీ కూడా లేనోడే సాప్ట్ వేర్ లో ఉద్యోగం సంపాదించేస్తాడు. వాడు కంపనీలోకి చేరగానే, ఇహ సెటైర్లు గుప్పించేయడం. ఆ పై హీరోయిన్ ఎంట్రీ.. ఆ భామ కోసం ఎగబడ్డం, తెగనరుక్కోవడం, మెలోడ్రామాలు, మధ్య మధ్యన తలకమాసిన కామెడీ బిట్స్… సినిమా మొదట్లో పేర్లు ఇచ్చేటప్పుడు ఎవడి పేరు అయితే ముందొస్తుందో, వాడికీనూ – తెరపై అత్యధిక భాగం కనిపించిన సుందరాంగికీ పెళ్ళి అయ్యినట్లో, అవ్వడానికి గల అన్ని అడ్డంకులూ తీరిపోయినట్టో చూపిస్తే – అంతే, మీ ముందో తలకమాసిన యాబ్రాసి సినిమా రెడీ!

ఇహ.. ఆర్య characterization. నాకు నచ్చింది. ఇలాంటి వాళ్ళు లేకపోలేరు. స్నేహాలూ, ప్రేమలూ, అప్యాయతలూ, అనురాగాలూ – ఇచ్చిపుచ్చుకుంటేనే అందం, అందులోనూ మనస్ఫూర్తిగా ఇచ్చిపుచ్చుకుంటేనే అందం అని గమనించనివాళ్ళు. “నేను ప్రేమిస్తున్నా కదా.. అది చాలదా?!”, “నేను నీకు ఫ్రెండ్ అయితే, నువ్వు నాకు ఫ్రెండ్ -” (as in, if a = b then b=a) అనేసుకొని అవతలి వాళ్ల ఇష్టా-అయిష్టాలను గుర్తించక తమ భావోద్వేగంలో పడి కొట్టుకుంటూ, చుట్టూ ఉన్నవాళ్లకి ఓ చిన్న సైజు నరకం సెట్టేసి చూపిస్తారు. ఆర్య కూడా ఆ కోవ చెందినవాడే! కాకపోతే ఆ పాత్రని మన హీరోగారు పోషించేశారు కాబట్టి, ఇహ వాడేం చేసినా అది మంచిదే, ఏదో బలమైన కారణం ఉన్నందుకే అలా చేస్తున్నాడు అనేట్టు చూపించటం. తనని గౌరవించని (గౌరవం అంటే మీరూ, గార్ల పిలుపులు కావు) వ్యక్తితో ఏర్పడే ఏ బంధం నిలవదని తెల్సుకోకుండా, వెంటపడి, వేధించి.. “వాడు, నేనూ ఫ్రెండ్స్! నేను మంఛి ఫ్రెండ్, వాడు చెడ్డ ఫ్రెండ్” అనే ముక్తాయింపు ఇచ్చేసినందుకు మాత్రం చిరాకేసేసింది.
ఒక హీరోజం కోసం వెంపర్లాడక, ఒక పాత్రను స్వభావాన్ని బట్టి కథ మల్చుంటే బాగుండేది.

ఇహ, మేడ మీద నుండి దూకేయబోతున్నవాడికి, ఒకడి మీద కోపం వస్తే ఇంకోడికి “ఐ లవ్ యూ”లు చెప్పటమే అమ్మాయిల వ్యక్తిత్వం అని నిర్ణయిచ్చేస్తారు ఈ సినిమాలు. ఎటు గాలి వీస్తే అటు ఊగిసలాడే చిగురుటాకలనుకుంటారో ఏమో?! దీని గురించి రాస్తే ఇప్పటికయ్యేది కాదు.

వెళ్ళి చూసొచ్చింది కాక, ఇప్పుడు మళ్ళీ ఎందుకు బుర్రబద్దలు గొట్టుగోవడం అంటే, అవును నిజమే! ఆపేస్తున్నా..

Advertisements

క్షణాలు.


ఇద్దరం కలిసి ఒడ్డున్న కూర్చున్నాం, ఎదురెదురుగా! ఎంత సేపని, మొహమొహాలూ చూస్తూ కూర్చోగలం కనుక! అసలే కొత్తాయే! బిడియం, తత్తరపాటు, భయం, సిగ్గు లాంటివన్నీ “ఆయ్.. శనగల్, శనగల్”, “బాఠాణీలు.. బఠాణీలు” అంటూ తోచనివ్వని అమ్మకందారుల్లా మొహం మీద ముసురుతున్నాయి. ఇలానే మరికాసేపుంటే లోలోతుల్లో నిక్షిప్తమై ఉన్న నిజాలన్నీ బయటకొచ్చేస్తాయి. మాటల మాటునయితే ఉన్న నిజాలను కప్పేయటచ్చు, లేని అబద్ధాలకు ఆయువునివ్వచ్చు. అందుకే తెలివిగా ఒకర్ని చూసుకుని ఒకరం చిర్నవ్వు ఇచ్చి పుచ్చుకున్నాం. నవ్వుకున్నాక ఏం చేయ్యాలో తోచక ఒక ఆట మొదలెట్టాం.

“ఏంటా ఆట?” అంటే ఏమంటారో మరి? మాకూ తెలీదు! ఆడుతున్నాం అనే తెలిసే సరికే ఆటలో మునిగిపోయాం. ఎప్పుడెలా మొదలెట్టామో, అది కాస్తా ఇలా, ఇలా అయ్యిపోయ్యింది.

“ఎలా? ఎలా?” అంటే..

మా ముందు అనంతమైన సంఖ్యలో “క్షణాలు” రాశిగా పోసుంటాయి మాట. అనంతమైన అంటే లెక్కపెట్టే ఓపిక లేనన్ని మాత్రమే! కానీ “అమ్మో” అనిపించే అన్ని క్షణాలన్న మాట. ఇప్పుడు ఈ ఆటలో ఆ అనంతమైన వాటిలో మేము చాలా కొన్ని, కొన్నంటే కొన్ని మాత్రమే పంచుకోవాలి. ఇద్దరమూ కలిసి వాటితో “ఏమైనా” చెయ్యచ్చు. ఆ క్షణాలని ఎంత బాగా ఆదరించి, ఆస్వాదించగలిగితే మేం అంత బాగా ఆడగలుగుతున్నాం అని లెక్క!

ఇద్దరం కలవగానే క్షణాలు ఒక్కొక్కటిగా మా మధ్య నుండి వేగంగా దూసుకుపోతాయి. ఇద్దరి మధ్య నుండి గాలి వెళ్ళినంత సావకాశంగా వెళ్ళిపోతాయి. కానీ వెళ్తూ, వెళ్తూ ఆ క్షణాలు సంక్షిప్తమై జ్ఞాపకాలుగా మెదడులో తిష్ఠ వేస్తాయి. క్షణాలలో గాఢతను బట్టి జ్ఞాపకాల మొండితనం ఏర్పడుతుంది. ఈ లెక్కలో అసలు తిరకాసేటంటే, ఓ క్షణం వెళ్ళిపోతూ మిగిల్చే అనుభూతులతో కూడిన జ్ఞాపకం ఇద్దరి దగ్గరగా ఉన్నా, ఎవరి కాపీలు వాళ్ళవి. ఆ రెండు కాపీలూ ఒక్కటే కావచ్చు, పూర్తిగా వేరూ అవ్వచ్చు.ఈ క్షణాల మాయ ఎలా ఉంటుందంటే.. ఏది యాధృచ్చికమో, ఏది కల్పనో, ఏది నిజమో, ఏది నమ్మకమో ఏమీ చెప్పలేం.

ఒక క్షణంలో తన ఒకటంటే, నేను అదే వింటాను. ఆ క్షణం వెంబడి వచ్చే క్షణాల్లో ఉంటుంది అసలు మజా! నేను ఉడుకుంటాను, తను ఇంకా రెచ్చగొడతాడు. నేను ఏడుపు మొహం పెడతాను, తను గట్టిగట్టిగా నవ్వుతాడు. నేను లోలోపల నవ్వుకుంటూనే మొహం దాచేసుకుంటాను నా చేతుల్లో, అతను బిత్తరపోతాడు. “నిజంగా అనలేదూ” అంటూ నిజాన్ని ఒప్పుకునే క్షణంలో గట్టిగా నవ్వటం నా వంతు.

సరదాగా ఉంది కదూ! ఆటలో ఎంత సరదానో గాయపడడానికి అంత ఆస్కారమూ ఉంటుంది మరి.

అన్యమనస్కంగా ఉన్న నాతో ఏదో అంటాడు. నేను వినిపించుకోను. “ఏమయ్యింది?” అని అడుగుతాడు, “ఏం లేద”ని తప్పించుకుంటాను. “ఏమయ్యింది చెప్పు” అని తను గదమాయించలేడు. ఇంకా కొత్తే కదా! నా మీద అధికారం చూపించలేడు ఆ క్షణంలో. అంతకు మునుపే నా మీద సర్వాధికారాలూ తనకిచ్చేసానని అతనికి తెలీదు. అదే ఈ ఆటలోని అసలు మర్మం. ఒకరనుకుంటున్నది మరొకరికి తెలీదు. అనేవి మాత్రం “అన్నట్టు” వినిపిస్తాయి. అందులో ఏవో నిగుఢార్థాలూ స్ఫురిస్తాయి. కానీ వాటిని సాధికారికంగా నిరూపించలేము. విస్మరించనూ లేము. ఊపిరాడకపోతే ఒక్కటే బాధ! ఈ ఆట – ఊపిరి ఆగడానికి ఆడడానికీ మధ్యన ఊగిసలాడుతుంది. ప్రాణం తోడేస్తుంది.

“ఆడడం సరే! ఎవరు గెలిచేది? ఎలా గెలిచేది?” అంటే సమాధానం ఇక్కడ గెలవడాలుండవు.

“గెలవకపోయేట్టయితే ఇది ఆట ఎందుకవుతుంది?” అంటే.. ఆటకుండాల్సిన అన్ని లక్షణాలు ఉంటాయిందులో, ఓటమితో సహా! గెలుపొక్కటే ఉండదు.

మాకంటూ ఇంకా బోలెడన్ని క్షణాలున్నాయి. “ఇక చాలు! వద్దని” నేనూ, “లేదూ.. ఇంకా ఆడాలి” అని అతనూ. “డ్రాప్ అవుట్ అవుదామ”ని నేనంటే “అది పిరికి వాళ్ళ లక్షణం” అని అతను తిప్పికొడతాడు. “గాయపడితే కోలుకోలేము” అని నేనూ, “ఆపాక గుండే ఆగిపోతే” అని అతను.

క్షణాలున్నాయి కదా అనుకుని ఇంకా ఆడితే ప్రతీ క్షణం మా ఇద్దరినీ మరింత దగ్గరకు తీసుకొచ్చేస్తుంది. ఒక్కో క్షణంలో మనసుల్లోని ఒక్కో తీగ ముడిపడిపోతూ ఉంటాయి. ఓ గుండె మరో గుండెలో తన సవ్వడిని వెత్తుక్కోవటం మొదలెడుతుంది. ఒకరి నిశ్శబ్దం మరొకరిని నీరసింపజేస్తుంది. అవతలి వ్యక్తి మీద ఎంత ఆధారపడిపోతామంటే.. మన ఉనికే ప్రశ్నార్థకంగా మారిపోతుంది. ఆ క్షణంలో గానీ “టైం అవుట్” అని తెలియాలి! మరణాన్ని అతి దగ్గరనుండి చూసే అవకాశం అది. పోనీ దూరాలు కరిగిపోయి, పరదాలు జారిపోయి ఒకరనుకుంటున్నది మరొకరు చదివేస్తుంటే…” ఏమి హాయిలే హలా” అనుకుంటూ పాడుకోడానికి లేదు. “భయం” మొదలవుతుంది. ఆ “అనుకునేవాటి”లో నేను ఇమడగలనా అన్న భయం. ఇంకెన్ని క్షణాలున్నాయో అని భయం. ఆడి, అలసి, ఓడే కన్నా ఇప్పుడే విరిమించుకుంటే మేలు అని నా అభిప్రాయం. అందుకే క్షణాలన్నింటినీ కాళ్ళరాసి దూరంగా పరిగెత్తాలని.

“అది పిరికితనం”! అతడంటూనే ఉన్నాడు. నేను వెళ్ళిపోయాను.

మరుసటి సాయంత్రం మళ్ళీ ఒడ్డున కలిసాం. మళ్ళీ మాటలందుకున్నాం, ఆట మొదలయ్యింది. చెప్పటం మర్చిపోయాను, ఈ ఆటను మొదలెట్టటంలానే ఆపటం కూడా మన చేతుల్లో ఉండదు. ఎప్పుడు ఆగిపోతుందో అదే ఆగాలి!