Move on..


నేనీ మధ్యనే ఒక ఒంటి గది ఇంట్లోకి మారాను. నేను కలలు కన్న ఇల్లు. అసలు ఇన్నాళ్ల జీవితమే ఈ ఇంటికోసమే!

గదే లోకంగా మారిపోయిన వేళ, బాహ్య ప్రపంచంతో సంబంధం పూర్తిగా తెగుతున్న వేళలో ఎవరో తలుపు కొట్టారు.  వెళ్లి చూడక తప్పలేదు.

వెళ్ళాను. చూశాను. ఇందాకో సారి తలుపు కొడితే, “చేతులు ఖాళీ లేవ”న్నాను. మళ్ళీ కొడితే, “ఇప్పుడు కాదు, కాసేపు ఆగి రా” అన్నాను. అయినా వెళ్ళలేనట్టు ఉంది. గట్టిగా మందలిద్దామని తలుపు తెరవగానే, చేతుల్లో ఉన్నవేవో చూపించబోయింది. తనతో పాటున్న వాళ్ళెవ్వరినో పరిచయం చేయబోయింది. గది నుండి బయటకు రమ్మని చేయందించింది. మధ్యాహ్నం పూట మంచి నిద్రలో ఉండగా తలుపుకొట్టే సేల్స్ మాన్ ని విసుకున్నట్టు విసుకున్నాను, గడప దాటకుండా, ఏమీ చూడకుండా, వినిపించుకోకుండా.

గడియ పెట్టేశాను. తలుపును కొడుతున్న శబ్ధం ఇంకా వినిపిస్తోంది. నేను లక్ష్యపెట్టలేదు.

కాలం గడిచేకొద్దీ గదిలో ప్రాణవాయువు తక్కువవుతూ ఉంది. నాకు ఊపిరి ఆడ్డం కష్టంగా మారింది. కాస్త తలుపు తీస్తే గాలి వేయ్యొచ్చేమోనన్న ఆలోచన రాలేదు. తలుపొకటి ఉందని. దాన్ని తెరిస్తే గది బయటకు పోవచ్చుననీ మర్చిపోయి చాన్నాళ్ళయ్యింది.

ప్రాణవాయువు తగ్గుతూ పోయింది. ఏం చెయ్యాలో పాలుపోక, ఆలోచించే శక్తి లేక ఓ మూల కూలబడ్డాను. సమయం గడిచేకొద్దీ మరీ కష్టం అవుతోంది. భయం వేసింది, చచ్చిపోతానని. ఆశ పుట్టింది, బతకాలని. కదల్లేని పరిస్థితుల్లో, బతకాలన్న సంకల్పంతో గోడల్ని అయినా బద్దలుకొట్టి బయటపడాలనుకున్నాను. అదృష్టం. తలుపు కనిపించింది. గడియ తీయాలని గుర్తొచ్చింది.

గడియ తీసీతీయంగానే ఒక్కసారిగా బయటకు దూకాను. అరుగు మీద కూలబడ్డాను. ఇప్పటి దాకా ప్రాణవాయువు లేక ఊపిరాడకపోతే, ఇప్పుడొక్కసారిగా ప్రాణవాయువు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆయాసం, పొడిదగ్గూ కూడుకొని వచ్చాయి. వళ్ళంతా విపరీతమైన బాధలో ఉంది.

ఎవరో నా వీపు నిమురుతున్నట్టు అనిపించి, పక్కకు చూశాను. మొదట్లో తలుపు కొట్టింది తనేనని గుర్తుపట్టగలిగాను. ఆశ్చర్యపడ్డాను.

కాస్త ఊపిరాడ్డం మొదలెట్టగానే, మళ్ళీ గదిలోకి వెళ్ళాలనిపించింది. లోపల అడుగుబెట్టబోయాను. దగ్గింకా తగ్గలేదు. ఇప్పటిదాకా పడిన బాధంతా గుర్తొచ్చింది. మరో మాటు లోనికి పోవాలన్న ఆశ చావకున్నా, వెనక్కి తిరిగి రాలేనన్న నమ్మకం నన్ను నివారించింది.

గదికి దూరంగా పోతుంటే కళ్ళ నీళ్ళు నిండాయి, నా చేయి పట్టుకొని నా వెంట నడిచింది తను. నన్ను ఎక్కడెక్కడికో తీసుకెళ్ళింది. ఎన్నెన్నో వింతలు చూపింది. జ్ఞాపకాలతో బరువెక్కిన తల తన భుజాన్నే ఆశ్రయించేది. నేను నవ్వినప్పుడు, తనూ నవ్వేది. నేను ఏడ్చినప్పుడు మాత్రం నిశ్శబ్ధంగా చూస్తూ ఉండేది.

“అవునూ.. నేను తలుపు మూసేసినా నువ్వు వెళ్లకుండా అక్కడే ఎందుకున్నావ్? నేనంటే అంత ఇష్టమా?” అనడిగాను ఉన్నట్టుండి.

“ఇష్టమో, ఏమో కానీ, నిన్ను విడిచి నేను దూరంగా పోలేను కదా!”

“ఓహ్.. “నిను విడిచి నేనుండలేనూ” అన్నదా నీ-నా ప్రేమకథ పేరూ?”

“యు ఆర్ ఎ సెంటిమెంటల్ ఫూల్! మొహం మీద తలుపేసేస్తే, దులుపుకొని చక్కా పోవాలి, అలా అరుగు మీద పాతుకుపోకూడదు. యు గాట్ టు మూవ్ ఆన్, ఐ సే!”

“యెస్.. వన్ గాట్ట మూవ్ ఆన్” – సన్నగా నసిగింది.

“ఏం? ఏం మాట్లాడవూ? నిజం చెప్పు, నేను ఎప్పటికీ ఆ గది నుండి రాకపోయుంటే?”

“ఒక వేళ నేను గదిలోనే పోయుంటే?”

“నువ్వు పోయే దాకా నేనూ ఉంటాను. నువ్వు పోయాక, నేను ముగుస్తాను.”

“వై?”

“నేను జీవితాన్ని.. నీ జీవితాన్ని!”

Advertisements