ఘాతకం


పున్నమి నాటి సముద్రంలా ఉంది మెదడు. చెవులు మూసుకునే కొద్దీ పెరుగుతున్న ఘోష. కల్లోలం నుండి పుట్టికొస్తున్న అలలు, తీరాల్ని చేరలేక,  కొండరాయిని ఢీ కొట్టుకొట్టినట్టు పుర్రెకేసి కొట్టుకోడవంతో తల్లోని ప్రతి నరం తీవ్ర వత్తిడికి లోనయ్యింది.  సూది మొన తో ఛాతిని తవ్వుతున్నట్టు అనిపిస్తోంది. మెడనరాల్ని పట్టిలాగినట్టు ఉంది. కళ్ళల్లో నుండి నీరు కారుతూనే ఉంది. మాడు వేడి పెనంలా ఉంది. నిశితంగా పరిశీలిస్తుంటే, అసలు శరీరంలో ప్రతీ భాగం వేదనతో ఉందనిపిస్తోంది. ఊపిరాడ్డం కూడా మానేసేట్టుంది! ఒక్క పట్టున దుప్పటి తీసేసి, లేచి కూర్చున్నాను.

ఎందుకింత బాధ? అసలేమయ్యిందని? ఏమో! కాని, ఈ రాత్రి గడిచేట్టు లేదే! బాబోయ్.. ఈ బాధ నన్ను బతకనివ్వదా? అంటే చచ్చిపోతానా?  వెన్నులో ఒక్కసారిగా వణుకు పుట్టుకొచ్చింది. వెంటనే పక్కనున్న మనిషిని లేపేద్దామనిపించింది. లేపినా లాభమేంటి? “అబ్బా.. పడుకో, అదే తగ్గిపోతుంద”నో, లేక “పద.. హాస్పిటల్ కి” అనో తప్ప ఇంకేం ఆశించచ్చు, సమాధానంగా?! దే.. వు.. డా! ఏం జరుగుతుంది? అవును.. దేవుడు! ఉన్నాడా అసలు? ఎందుకు లేడు? ఇదో నా పక్కనే పడుకొనుంటే? పెళ్ళినాడు, ముగ్గురు మనుషులు, బొమ్మలా నిల్చున్న నన్ను ముస్తాబు చేస్తుంటే, పట్టుచీర కుదరక, గోళ్ళకి వేసిన రంగు ఆరక, జడలో గుచ్చిన పూలు నిలువక ఓ పక్క విసుగుస్తుంటే, “అమ్మాయ్.. తెమలాలి” అని అందరూ కంగారు పెట్టేస్తున్నప్పుడు, చుట్టాల్లో పెద్దావిడ ఒకరు, “ఇక నుండీ అతనే నీ దేవుడు!” అనగానే, కనుబొమను వింటెగా లాగి విసిరిన చూపు, అవహేళనగా! పెళ్ళైన ఆర్నెళ్ళో ఎంతటి జ్ఞానం. మూడు గంటల నుండీ, అరడుగు దూరం నుండి వస్తున్న ముక్కుచీదుళ్ళు వినిపించుకోలేని వాణ్ణి ఏమనాలి? దేవుడే! ఉలకడూ, పలకడూ, ఉన్నట్టే అనిపిస్తాడు, ఉన్నాడా అని అనుమానం వచ్చేలా చేస్తాడు! నవ్వైనా, ఏడుపైనా మోనో ఆక్టులయ్యాయి! దేవుడు! మాయదారి దేవుడు! నా దేవుడు!

అసలేమయ్యింది నాకు? ఏంటి ఈ పాడు ఆలోచనలు? ఎక్కడ నుండి పుడుతున్నాయి? మెదడకు అలుపుండదా? నిద్ర?! అవును.. నిద్రేదీ? ఏ దిక్కుమాలిన దిగులు, నా నిద్రను పొట్టనుబెట్టుకుంది? ఇలా ఏడుస్తూ ఎంత సేపు మంచం మీద దొల్లేది? టివి చూస్తూ సరిపోతుందేమోనని హాల్ లోకి వచ్చాను. టివిలో ఏదో చెత్త వస్తూనే ఉంది. ఈ దేశానికొచ్చాక, టివి, ఫోన్ తప్ప దిక్కులేకుండా పోయింది. అసలెక్కడున్నా టివి, ఫ్రెండ్స్ తప్ప నాకు మరో లోకం తెలీదు! ఇదే పరిస్థితిలో రవిగాడైతే గీటార్ తీగలు తెగేదాకా వాయిస్తాడు, జోత్స్న స్క్వాష్ ఆడుతుంది, శంకర్ ఎవరికీ కనిపించకుండా పోతాడు కొన్ని రోజులు, ఇక రమ్య – అదైతే ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. అంతలేసి ఆనందాలు ఏముంటాయో ఏమో గాని. టివి ముందు కూర్చొని కూడా ఇవ్వన్నీ గుర్తొస్తున్నాయంటే, టివి నా పై పని చేయడం లేదన్న మాట!

ఎవరితోనైనా మాట్లాడాలి! లేకపోతే, ఈ రాత్రి గడవటం కష్టమయ్యిపోతుంది. ఎవరితో? అన్న సెర్చ్ కి మెదడు, dumb bell  చూపిస్తూ ఉంది చాలా సేపు. అమ్మ.. అమ్మ ఇక్కడుంటే ఎంత బాగుణ్ణు? అమ్మ దగ్గరకెళ్ళి, ఒళ్ళో తల పెట్టుకొని ఏడిస్తే, అసలెంత హాయిగా ఉంటుందని? అమ్మకా? నో! నా గొంతు ఇట్టే పసిగట్టేస్తుంది.. మళ్ళీ గోల! ఇంకెవరూ? అక్కడున్న వాళ్ళంతా ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. నేనే! ఇక్కడికొచ్చి – జాబ్ లెస్ అయ్యా! సమయం.. సమయం.. అంత సమయం! ఏం చేసుకోడానికీ పాలుపోనంత! అందుకే ఈ పాడు ఆలోచనలేమో! రేపొద్దున్న నుండీ, అతనితో పాటు నేనూ జిం చేస్తా.. అది రేపటి కథ.. ఈ రాత్రికెలా? కళ్ళు మూసుకొన్నాను, ఆలోచించాను. ఒక్కటే పేరు పదే పదే గుర్తొచ్చింది. “నీకు ఇప్పుడు కాల్ చెయ్యనా? నీతో మాట్లాడాలి!” అని ఆ పేరుకే మెసేజ్ పెట్టాను. అనుకున్నట్టే, ఒక ఐదు నిముషాల్లోపు కాల్ వచ్చింది.

“మమల్ని గుర్తుచేసుకున్నారే.. మేడం!”

“క్రిష్… ”

“నాకేదో అవుతోంది.. చాలా భయంగా ఉంది. నన్నేదో తినేస్తుంది.”

“హహహహ.. మీ ఆయనేం చేస్తున్నాడు? 911 నెంబరు వెతుకుతున్నాడా?”

నాకు ఒళ్ళు మండింది. ఒకటి, మా ఆయణ్ణి అన్నాడని, రెండు, ఆ 911 జోక్ మేం ఇద్దరం కల్సి పడీ పడీ నవ్వుకున్నాం అని గుర్తొచ్చి.. ఏడుపులో, సంతోషపు క్షణాలు గుర్తొస్తే, ఇంకెంత ఏడుపొస్తుందో!

“క్రిష్.. నిజంగానే.. నన్నేదో తినేస్తుంది.. నాకు చాలా భయం వేస్తోంది.”

“తానానే.. తనాననే.. తానానే…”

“ఏంటి మాల్గుడి డేస్ చూస్తున్నావా?”

“యెస్.. బేబీ!”

నాకిక్కడ నరాలు తెగిపోతున్నాయంటే, వాడక్కడ ఈల వేసుకుంటూ ఆటలా మాట్లాడతాడా? ఇక లాభం లేదనుకొని బ్రహ్మాస్త్రం వదిలాను.. పొంగుకొస్తున్న దుఃఖాన్నంతా కన్నీళ్ళగా మార్చేశాను. ముక్కు ఎగరేయడం, మధ్య మధ్య గుక్కతిప్పుకోవటం తప్ప మరేం వినిపించకపోవటంతో అవతలి వైపు నుండి నిశ్శబ్దమే బదులుగా వినిపించింది. ఒక ఐదు నిముషాల పాటు, ఏకధారగా ఏడ్చాను. అంత సేపూ, ఒక్క మాట కూడా అనకుండా ఉన్నాడు.

“అసలేం జరిగింది?”

“నాకు తెలీదు.. తెలీటం లేదు.”

మళ్ళీ ఏమయ్యిందని అడిగితే బాగుణ్ణు, ఉన్నదంతా కక్కేస్తానేమో. ఊహు.. అడగలేదు. “ఏమనిపిస్తోంది?” అంట! చాలా చెప్పుకొచ్చాను, “నన్ను తినేస్తుంది!” అని చివర్న తగిలిస్తూ, ముగించాను.

“సరే.. నిన్ను తినేది, ఎక్కడుంది?”, టివిలో? – నో!, పుస్తకాలేవైనా? – నో!, నీ గదిలో?” – నో!, నీ ముందు? – నో! నీ పక్కనా? – నో! నీ వెనుక? – అదీ… వెనక్కి తిరిగితే, ఆయనున్నాడు.. కాని ఆయనేం అనలేదు, చేయలేదు.. నో!

“నీలో?”

“వినిపిస్తోందా? అది నీలో ఉందా?”

“ఊ”

“హమ్మ్.. లోపలికి చూడు..”

“నాకు భయం వేస్తోంది.”

“అయినా.. మీ ఆయణ్ణి లేపు.. భయం, గియం అన్నీ పోతాయ్”

“ఇలా అర్థం పర్థం లేని వాగుడు ఆయనకి ఎక్కదు.”

“నీకు పడ్డాడు కదా.. అందుకనేగా చేసుకున్నావ్! ఇప్పుడు ఎక్కక పోవటమేంటి?”

నాకు తెల్సు, వీడు అక్కడికే వస్తాడని. అవును.. అందరూ పడ్డట్టే, ఆయన ప్రేమలో పడ్డాడు. నన్నేమో, ఆయన ప్రేమలో ముంచేశాడు. అందరూ అసూయపడేంత ప్రేమ మాది. అందుకే వీడికి కుళ్ళు! చూడలేడు. అందుకే ఈ డొంకతిరుగుడు.

“ఓ పక్క నేను చచ్చిపోతున్నా అన్నా.. పట్టదేం నీకు?!”

“అదేదో.. నీలో ఉందన్నావ్! అది నీలో ఉంటే, నేనేం చేయగలను? బయట నుండి మద్దత్తు ఇవ్వటం తప్ప!”

“సరే.. ఏం చెయ్యను?”

“కళ్ళు మూసుకో.. బోలెడు ఆలోచనలు వస్తాయి.. వాటిని పక్కకు బలంగా తోసేస్తూ ఉండు.. ఏదో ఒక ఆలోచన పక్కకు జరగదు. ఇంత వరకూ చెయ్యి ముందు..”

కళ్ళు మూసుకొన్నాను. వాడి మాటలు పదే పదే గుర్తొచ్చాయి.. ఆ తర్వాత ఎడతెగని ఆలోచనలు. ఒక్కోదాన్ని పక్కకు నెడుతూ, తుంచేస్తూ ఉన్నాను. ఒక దగ్గర, వాడు చెప్పినట్టే ఆగిపోయాను. ఆగానని వాడికి చెప్పాను.

“గుడ్.. ఇప్పుడు అదే ఆలోచన ఎందుకు వస్తుందో కనిపెట్టు.. కాస్త కష్టమే, అసలు కారణం దొరకాలంటే.. నిజాయితీగా ఉండు..”

“నిజాయితీ” అన్న పదం వినగానే ఉక్రోషం కలిగింది. అంటే, నాకా మాత్రం నిజాయితీ లేదనా? హహ్! నా ఆలోచల్ని నాకే కొత్తగా పరిచయం చేద్దామనుకుంటున్నాడా! నాన్‍సెన్స్.. నాకు తెల్సు, నాకెందుకు ఇంత బాధో! ఎవరు కారకులో!

“దొరికింది.”

ఏంటది అని అడుగుతాడని గంపెడు ఆశతో చూశాను. అడగలేదు సరి కదా, “దాన్ని చంపేయ్య్..” అన్నాడు. ఎంత పొగరు! నా జీవితంలో ఏం జరిగినా పట్టించుకోకూడదని! తెల్సుకోకూడదని. కావాల్సిన సమయాల్లో, “ఫ్రెండ్”గా మాటసాయం మాత్రమే చేయాలని. బయట నుండి మద్దతివ్వటం తప్ప మరేం చేయకూడదని.

“చంపేశావా?”

“నో.. దాన్ని నేను చంపుకోలేను. అది నా మనసు. నా ఆరోప్రాణం. దాన్ని చంపుకునే సమస్యే లేదు.. అదేగా ఏడుపు.”

“సీ.. నువ్వు దాన్ని చంపకపోతే.. అది నిన్ను చంపుతుంది. చస్తావా? చంపుతావా? అన్నది నీ ఛాయిస్.”

“నాకెంతో ఇష్టమని చెప్తుంటుంటే…”

“డోంట్ బి ఇన్ ఎమోషనల్ ట్రాప్.. ఆల్ థిస్ ఇస్ ట్రాష్!”

“నువ్వు ఎప్పటికీ బాగుపడవా? నువ్వు మనిషిలా కనిపించే రాయివి కాబట్టి, నీకసలు మనసంటూ లేదు కాబట్టి, నువ్వు పళ్ళికిలిస్తూ తిరిగేస్తావ్, ఎమోషన్స్ అన్నీ చంపుకొని.. మనసులని చంపటం తప్ప నీకేమొచ్చు గనక! నువ్వు చేసిందే కాక, అందర్నీ చేయమంటావా? పాపం రా… అయినా నీకు చెప్పి దండుగ! నువ్వు బాగుపడవ్!”

“…”

“ఐ హేట్ యూ… ఇంత అర్థరాత్రి నీకు ఫోన్ చేశా చూడూ.. ఐ హేట్ యూ!”

ఛ! ఎందుకు కెలికాను? ఈ ఏడుపేదో నేనే ఏడిస్తే సరిపోయేదిగా! బా ఏడుద్దామనిపించింది. కాని తోడడానికి ఇంకేం మిగలకపోయే సరికి, ఆలోచనలు పొంగుకురాలేదు. అపూర్వంగా నా మనఃస్థితి మెరుగుపడింది. కూర్చున్న చోటే నడుం వాల్చాను. ఆలోచలనలేవీ రావటం లేదు. నిద్ర నన్ను కరుణించింది.

********************************************************************************************

“డ్యూడ్.. ఏంటింత లాంగ్ కాల్? గర్ల్ ఫ్రెండ్?”

“గర్ల్ ఫుల్ స్టాప్ ఫ్రెండ్ ఫుల్ స్టాప్”

Advertisements

నేనూ.. నా OA*


మా అమ్మకి జంధ్యాల గారన్నా, ఆయన సినిమాలన్నా చాలా ఇష్టం. పైగా నా చిన్నతనంలోనే ఆయన కామెడీ సినిమాలు బాగా వచ్చాయి. అందుకని మా ఇంట్లో జంధ్యాల మార్కు కామెడీ తిట్లే వినిపిస్తుంటాయి.. ఇప్పటికీ! ఉదాహరణకు, కూరల్లో కూరగాయలన్నీ తీసి పక్కకు పెట్టేస్తుందని మా చెల్లిని “పప్పుచారులో కందిపప్పును ఏరి పక్కకు పెట్టే పిడత మొహం నువ్వూనూ” అని తిడుతుంది. నాకూ అలాంటి అక్షింతలు చాలానే పడుతుంటాయి. నా బద్ధకానికి, నా అజాగ్రత్తకూ సరిపడేలా, “చెంపిన్ను నుండి చెప్పులు దాకా నీకన్నీ use-n-throw ఉండాలి.” అని అంటుంది. నేను వ్యవహరించే తీరు కూడా అలాంటిదే! ఏదన్నా సరే, పారేసుకునో, పోగొట్టుకునో, కాసేపు బాధపడేసి, ఆనక హాయిగా మర్చిపోతుంటాను. నా లాప్‍టాప్ చేతులెత్తేసినప్పుడు కూడా, కాస్త బాధ పడినట్టు అనిపించినా కొత్తది కొనుక్కోవచ్చనే ఆశ విరహింపజేస్తూనే ఉంది.

నేనీ బ్లాగు డిలీట్ చేసినప్పుడు కూడా చాలా వినాల్సి వచ్చింది. “సరే.. బ్లాగు ఎటూ డిలీట్ చేసేశావ్ కాబట్టి, కాసేపు సుబ్బరంగా ఏడు.. కావాలంటే ఒక elegy లాంటిదేదో రాసుకో. కాని ముందు ఏడు.. సరిగ్గా ఏడు. అది నీకెంత ప్రత్యేకమో నీకు తెల్సు కనుక, అందుకు సరిపడా ఏడు” అన్న సలహా మాత్రం నాతో ఎప్పటికీ నిల్చిపోయుంటుంది. ఇప్పుడు రాసేదానికి, పై సలహాకి అంత పొంతన కనిపించకపోవచ్చు, అయినా, ఇదీ ఒక రకం ఏడుపే.. !

నాకు వద్దు మొర్రో అంటున్నా నాకీ లాప్‍టాప్ అంటగట్టారు. డెస్క్ టాప్ ఉండగా దీన్నేం చేసుకోవాలో మొదట అర్థం కాలేదు. లాప్‍టాప్ ఆన్ చేసిన అరగంటలో, దీనిలో తెలుగు రాయడం వచ్చునా అని పరిశోధన మొదలెట్టాను. అప్పటికి “తెలుగు” అంటే ఉన్న కరువు అంతా ఇంతా కాదు. పదో తరగతి తెలుగు పరీక్ష రాసొచ్చాక, మళ్ళీ కాగితం మీద తెలుగు ముక్క రాయలేదు. అడపాదడపా తెలుగును ఏ వార్తాపత్రికల్లో చదవటం తప్పించి చదివినదేమీ లేదు. ఆర్కుట్ పుణ్యమా అని కంప్యూటర్లో తెలుగు రాయొచ్చునూ అని తెల్సినా, ఎలా చెయ్యాలో తెలీలేదు. మెల్లిమెల్లిగా అక్షరాలు చదవటం కూడా మర్చిపోతూ ఉన్నా ఆ సమయంలో. విదేశాల్లో ఏళ్ళతరబడి ఉన్నా కూడా, ఇంతిలా “మిస్సింగ్” ఫీలింగ్ రాదేమో! అందుకనే, లాప్‍టాప్ రాగానే ముందు దానికి తెలుగు వచ్చేలా చేశాను. తెలుగు అక్షరాలు మొనిటర్ మీద కనిపించిన మరుక్షణంలో బ్లాగటం మొదలెట్టాను. అసలేం రాస్తున్నానో అన్న స్ఫృహ కూడా లేదు.. రాయగలుగుతున్నానన్న ఆనందం తప్ప! ఇలాంటి తెలుగు రాస్తే జనాలు రాళ్ళేసి కొడతారేమోనన్న భయం చాన్నాళ్ళు ఉండేది, కాని అనుకున్నది చేసేయటం తప్ప ఇంకో ఆలోచన రానివ్వను కదా నేను!

ఎట్టకేలకు ధైర్యం కూడగొట్టుకొని కూడలిలో బ్లాగు జతపరిచాను. మొదట్లో అక్షింతలు బాగానే పడ్డా, నన్నూ వాళ్ళతో కలుపుకొని ముందుకు పోయారు, బ్లాగుజనులు! నేర్చుకోవటం బాగానే జరిగింది, దాన్ని ఎంత నేర్పుగా ప్రదర్శించాను అన్నది వేరే కథ! ఆ తర్వాత మెల్లిమెల్లిగా పరిచయాలూ, స్నేహాలూ, ఆప్యాయతలూ,అనుమానాలూ, అపార్థాలు, అలకలూ.. అన్నింటి వెనుకా ఆలోచనలూ… ఓహ్! ఒకటా? రెండా? ఎన్నెని చెప్పేది? ప్రతీది గుండె తీగలను మీటి, గొంతులోకి పొంగి, వెళ్ళపై నాట్యమాడినదే కదా! వట్టి దండుగ మారి మాటలయితే అనుకోవచ్చును. జీవితాన్ని కాచి వడపోచిన వారు, అలా కప్పులో అందిస్తూ ఉంటే.. నెస్‍కెఫే ఆడ్ లో అమ్మాయిలా నేను ఆస్వాదిస్తూ తాగిన క్షణాలు. జీవితం చేతకాక, చేతులు కాల్చుకుంటున్న వాళ్ళ బొబ్బలకు బర్నాలు రాయడాలు. నవ్వడాలు, నవ్వుకోడాలు, నవ్వించడాలు. కన్నీళ్ళొచ్చేంత నవ్వులు. నా కన్నీళ్ళు నాకే నవ్వులాటలైన క్షణాలు. నన్ను తెరిచిన పుస్తకంలా చదివిన నేస్తాలు! అర్థంకాకున్నా అపురూపంగా చూసుకునే దోస్తులు! ఒక్కొక్కరితో అనుభవం రాసుకుపోతే.. ఓ పుస్తకమవుతుంది; బీచ్ లో ఆడేసుకున్నాక, పాదాల ముద్రలను తనివి తీరా చూసుకున్నట్టు. ఆరు నవ్వులూ, అర ఏడుపూతో ఏదో జీవితం సాగిపోతుందనుకునే వేళ, పుస్తకం.నెట్ అనే సరదా.. “ఆడుతూ, పాడుతూ పని చేయటం” అంటే అనుభవంలోకి వచ్చేలా!

మనిషిని పియానోతో పోలిస్తే, మనుషుల మనోభావాలు పియానోలో సంగీతాన్ని పలికించగలిగే మెట్లనుకుంటే, ఆ మనిషికి జీవితకాలంలో తారసపడే తక్కిన మనుషులు పియానో వాద్యకారులు. ఇప్పుడు పియానోచేత ఎంత చక్కటి సంగీతం పలికించగలరూ అన్నది ఆయా వాద్యకారుల నైపుణ్యం మీద ఆధారపడుంటుంది కదా! ’నా రాగాలు ఇమిడున్నాయా? నేనింతటి సంగీతాన్ని పలికించగలనా?’ అని పియానో కూడా అబ్బురపడేలా పలికించే వాళ్ళూ ఉంటారు. ’నేనుత్త డొక్కునూ’ అనేంతలా వాయించే వాళ్ళూ ఉంటారు. మనకి తెలీని మనల్ని మన ముందు నిలబట్టే వాళ్ళే- వాళ్లకి మన చేసే నామకరణాలు ఏవైనా కావచ్చు; స్నేహితులని, అత్మీయులని, సన్నిహితులని, ఏరా…అనీ, నీ ఎంకమ్మా.. అని – మనల్ని సంపూర్ణం చేసేది.

ట్వైలైట్ నవల్లో స్టెఫినీ మేయర్, ఒక వాంపైర్ చేత, ఒక మనిషికి చెప్పిస్తున్నట్టు, “Your like my own personal brand of heroin.” అనిపించింది. నిజానికి ఇద్దరి మనుషుల మధ్య కూడా ఈ వాక్యానికి అంతే ఆస్కారం ఉంటుంది. కాకపోతే, ’అదెలా ఉంటుందంటే..’ అని చెప్పడానికి ఉండదు. కొన్ని అనుభవానికి రావాలంతే! అలానే మనకి తారసపడిన వాళ్ళంతా కూడా, ఏదో ఒకటి అయ్యే అవకాశం ఉంటుంది.. కొందరు చాక్లెట్లా, కొందరు డబల్ క మీటా లా, కొందరు బెనెడ్రిల్ కాఫ్ సిరప్ లా, కొందరు కాకరకాయల్లా, కొందరు మత్తుపదార్థాల్లా, కొందరు లాఫింగ్ గాస్ లా..

“Like the meeting of the seagulls and the waves we meet and come near. The seagulls fly off, the waves roll away and we depart. ”

నాకు పరిచయాలు ఇలానే ఇష్టం.. వచ్చి, పోయే అలల్లా! ఎన్నాళ్ళు ఉన్నాం అన్నది కాదు, ఎన్ని పంచుకున్నాం అన్నదే నాకు ముఖ్యం. ఇంకెన్నాళ్ళకు భద్రపర్చుకోగలం అన్నది ముఖ్యం. మనిషి మనతో పాటు ఉండకపోవచ్చు. ఉండాలనుకోవటం అత్యాశ. హైదరాబాద్ బుక్ ఫేర్ లో కొంతమంది బ్లాగర్లను కలిసి, ఇంటికొచ్చాక, మా అమ్మ అన్న మాటలు: “అనుకుంటాం గాని, దీని నెట్‍వర్క్ ఏం అల్లాటప్పా కాదు.. ఇవ్వాళ తెల్సింది”. హమ్మ్.. అలాంటి స్నేహాలను అందించింది ఈ బ్లాగు నాకు. అసలు బ్లాగు మొదలెట్టానికి కారణం లాప్‍టాప్ – ఈ క్షణం నుండి, ఈ బ్లాగులో ఉన్న ప్రతీ అక్షరం నా లాప్‍టాప్ కి అంకితం!**

** మీకు గాని నూత్ (Knuth) గారు గుర్తొచ్చుంటే, నేనేం చేయలేను మరి! 🙂
*ఓవర్ ఆక్షన్.. 🙂