Flush!


కడుపులో మెలితిప్పుతోన్న బాధ వల్ల పనిపై ఏకాగ్రత ఉన్నట్టు నటించటం కూడా వీలుపడ్డం లేదని గ్రహించింది ఆమె. మళ్ళీ రెస్ట్ రూంకేసి వెళ్తే, చూసే వాళ్ళు ఏమనుకుంటారోనన్న ఆలోచన ఆమెను సీటుకు అతుక్కునే చేసింది. ఇంతలో ఓ కొలీగ్ సీటు దగ్గరకు వచ్చాడు. చిన్న పనే కదా అని అతడితో మాట్లాడ్డం మొదలెట్టింది. రెండు నిముషాలు అనుకున్నది కాస్తా పావుగంటయ్యింది. బాధ తీవ్రత క్షణక్షణానికి పెరగటంతో ఆమె సీట్లోనే అసహనంగా కదులుతోంది. అతడింకా మాట్లాడుతూనే ఉన్నాడు. తన్నుకొచ్చేస్తోంది. ఊపిరి బిగబెట్టి అతడు చెప్పే దానిపై ధ్యాస పెట్టటం ప్రారంభించింది. ఆపుకోవటం వల్ల పరిస్థితి కఠినమైంది. పరిస్థితి విషమించడం వల్ల, ఆపుకోవటం కష్టమైంది. మొహంలో చిరాకు సుస్పష్టంగా కనిపించేస్తున్నా, ఆమె మాటమాటకీ నుదిటిపై వేళ్ళతో రుద్దుతున్నా, అతడేం గమనించనట్టు మాట్లాడుతూనే ఉన్నాడు. ఉగ్గబెట్టుకోడానికి మరింతగా ప్రయత్నించింది. కాని లాభం లేదని తెల్సిపోయింది. ఇంకాసేపు ఆగితే, అంతా ఇక్కడే అయ్యిపోయ్యేట్టు ఉందని, ఒక ఉదుటున సీటులో నుండి లేచి, అతడి మొహం కూడా చూడకుండా “ఎక్స్ క్యూస్ మీ!” అననంటూ రెస్ట్ రూం కేసి పరిగెత్తింది. లోపలకెళ్ళి, నడుమును కరిచిపెట్టుకొన్న ఫాంటు బటన్ తీసి, టాయిలెట్ సీటుపై కూర్చుంది. బయటకి శబ్దాలు వినిపించకుండా, ఫ్లష్ ను తెరిచింది. ’గేట్లు ఎత్తగానే వరద నీరు తన్నుకొచ్చినట్టు’.. ఫ్లోర్ పై పడుతున్న చుక్కల్ని చూస్తూ అనుకుంది! కాసేపటికి ఉపశమనం కలిగింది. కాని అనుమానమూ వచ్చింది. ఎందుకన్నా మంచిదని ఇంకాసేపు కూర్చోంది. ఇంకా వస్తుందేమోనని వేచి చూసింది. రాకపోయేసరికి బయటకు వచ్చేసింది.

“హే.. ఆర్ యు ఒకే?!” – అప్పుడే రెస్ట్ రూంలోకి వస్తున్న కొలీగ్.
“యా.. యా!”
“నీ కళ్ళేంటి ఏడ్చినట్టున్నాయ్?”
“ఐ మీన్.. బాగా ఏడ్చాక, కళ్ళు ఉబ్బి, ఎర్రగా అవుతాయే.. అలా ఉన్నాయి.”
“ఓ అదా.. ” అంటూ, కళ్ళుమూసుకొని మొహం పై నీళ్ళు జల్లుకుంది. “too much strain యార్.. కాసేపు సిస్టం ముందుంటే, ఇలా ఎరుప్పెక్కిపోతున్నాయ్.. డాక్టర్ ఏవో మందులు ఇచ్చారనుకో..” మొహం మీద నీళ్ళు జల్లుకుంటూనే ఉంది.
“హమ్మ్.. టేక్ కేర్! కాని నీ కళ్ళు ఎంత బావుంటాయో.. I wish I had them! ఏ మస్కారా వాడుతావ్?”

ఇంకేముంది? మరో అరగంట పాటు మార్కెట్లో ఉన్న అన్నీ మస్కారాల మీదా, మేకప్ ఐటెమ్స్ మీదా  చర్చించుకున్నారు – అని  వేరే చెప్పాలా?

Advertisements

న్యాయం?!


ప్రియమైన ముఖ్యమంత్రిగారికి,

నమస్కారాలు!

ముందుగా, నా మాట మన్నించి నన్నో సురక్షిత ప్రదేశానికి తరలించి, నేను అజ్ఞాతంలో ఉండేలా చూసినందుకు మీకు వేలవేల నమస్కారాలు! ఈ ప్రపంచం నుండి కాపాడినందుకు మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలీడం లేదు. “మాటలకే కాదు తల్లీ, మౌనానికీ నానార్థాలూ, విపరీతార్థాలూ తీయగలదీ ప్రపంచం! నిన్ను మాట్లాడమని బలవతం పెట్టను. కాని నీ మనసేమిటో తెల్సుకోవాలనుకోవడం అవమానవీయం మాత్రం కాదు!” అన్న మీ మాటలు పదే పదే నా చెవుల్లో మ్రోగుతున్నాయి. అందుకే ఈ ఉత్తరం! దీన్ని మీకూ, మీ పేరిట ఈ రాష్ట్ర ప్రజానీకానికి రాస్తున్నాను.

టివి వాళ్ళు నన్ను “మోస్ట్ వాంటెడ్” లా తరుముతున్నారు. “నేనీ విషయం పై మాట్లాడను” అని చెప్తే వాళ్ళకి అర్థం కాదేం? మీ అందరిలో ఒక్కరిగా ఉండాల్సిన నేను, మీ అందర్నుండీ ఎందుకు దాక్కోవాల్సి వస్తుంది? చెప్పండి? నేనేం చేయ్యాలి? మీలా ప్రవర్తించాలా? ఓ నిండు ప్రాణాన్ని ఉరి తీస్తున్నందుకు మీరంతా కేరింతలతో డప్పులు వాయిస్తుంటే, నేనొచ్చి అతగాడి శవం మీద ఆటవిక నృత్యం చేయాలా? ఏం ఆశిస్తున్నారు మీరంతా? ఎందుకు మనుషులు మనుషులే అన్న అనుమానం తెప్పిస్తూ ఉంటారు?

ఆడపిల్లగా పుట్టటం – నా తప్పు కాదు!
అందంగా ఉండడం – నా తప్పు కాదు!
నేను రోజూ స్కూలుకు పోవడం, రావడం వల్ల ఒకడి కంట్లో పడ్డం – నా తప్పు కాదు!
వాడికి నా మీద కోరిక కలగటం – నా తప్పు కాదు!
ఉన్నట్టుండి ఓ పూట, వాడు ఇంట్లోకి జొరబడి నా గొంతు కోయడానికి ప్రయత్నించటం – నా తప్పు కాదు!
అడ్డొచ్చిన అమ్మానాన్నలు వాడు కౄరాతి కౄరంగా చంపుతుంటే, చిన్న వయస్సులో ఉన్న నా తోబుట్టువులు చూడ్డం – నా తప్పు కాదు!
అమ్మా, నాన్న చనిపోవటం – నా తప్పు కాదు!
నేను బతికిపోవటం – నా తప్పు కాదు!

నా తప్పు కాదు! కాదు! కాదు!

నాదే తప్పేమోనని అపరాధభావంతో కుమిలి కుమిలి ఏడ్చాను. నేనంటూ పుట్టక పోయుంటే, మా వాళ్ళకి ఈ దుర్గతి పట్టేది కాదుగా అని వెక్కివెక్కి ఏడ్చాను. నేనింకా బతికుండడం మూలాన మిగిలిన నా వాళ్ళకి ప్రమాదమోనని చావటానికీ ప్రయత్నించాను. జరిగిన ఘోరంలో, నా ప్రమేయం లేకున్నా ప్రధాన పాత్ర నాదవ్వటం వల్ల, నాది ప్రేక్షక పాత్రే అయినా, జీవితకాలపు శిక్షను అనుభవిస్తున్నాను. క్షణకాలం ఊపిరి తీసుకొని, “హమ్మయ్య.. ఈ క్షణం గడిచిపోయింది!” అనుకుంటూ బతకటం ఎంతటి శిక్షో మీలో ఎందరికి తెల్సు? “ఇదంతా పీడకల. నేనిప్పుడే నిద్రలేచేస్తాను!” అనుకొన్న ప్రతీసారి నిజం వెక్కిరిస్తుంటే, అదెంతటి శిక్షో మీకేం తెల్సు? సాటి మనిషిని, ముఖ్యంగా మగవాడిని చూడంగానే ఉల్లిక్కిపడి, బెదిరిపోయి, పారిపోవాలనిపించే క్షణాల్లో, “లేదు! మనిషే! మనిషిలానే ప్రవరిస్తాడు!” అని నచ్చజెప్పుకోవాల్సి రావటం ఎంతటి శిక్షో మీకు తెల్సా?

ఆ దుర్మార్గుని చావును అనుక్షణం కోరుకున్నాను. వాడిని ఉరికంభం ఎక్కించటం కన్నా, నా జీవితంలో నేను సాధించేది ఏదీ లేదనుకున్నాను. దేవుడు నన్నందుకే తీసుకెళ్ళిపోకుండా ఉంచాడని అంతా అంటుంటే, నిజమని నమ్మాను. వాడు జైలునుండి తప్పించుకొని వస్తే మా ఎవ్వరినీ బతకనివ్వడన్న భయంతో, అమ్మానాన్నలు పొట్టను బెట్టుకున్నాడన్న కసితో, నాలా ఇంకెవ్వరూ బలవ్వకూడదన్న పంతంలో.. వాడి చావు కోరుకున్నాను. కాని, నాకిప్పుడు వాడి చావు అక్కరలేదు. “వాడొస్తే నన్ను చంపేస్తాడు సారు, వాణ్ణి బయటకి రానివ్వకండీ!” అని పోలిసోళ్ళ కాళ్ళు పట్టుకుంటే, “కోర్టు ఏం చెప్తే అదే చేస్తాం!” అన్నారు. “అయ్యా.. నా వాళ్ళని పొట్టనబెట్టుకున్నాడు. వాణ్ణి చంపేయండయ్యా” అని కోర్టులో ఏడిస్తే, వాయిదా పై వాయిదా వేసుకొచ్చారు. పదిహేన్నేళ్ళు గడిచాక, ఇప్పుడొచ్చి, “నీకు న్యాయం జరిగింది.. చూసుకో” అంటే, నాకు కళ్ళు మూసుకుపోతున్నాయి, నవ్వూ, ఏడుపూ కట్టగట్టుకొని రావటం వల్ల!

నాకు చావంటే భయం పోయింది. బాధ పోయింది. ఆందోళన పోయింది. ఎవ్వరి చావైనా! జీవఛ్ఛవంలా బతుకుతూ చావును అతి దగ్గరగా చూడ్డం వల్ల అది అలవాటైయ్యిపోయింది. అందుకే, అతని ఉరిశిక్ష నాకు ఊరటనివ్వలేదు. ఇప్పుడతగాడికి ఆ శిక్షేసీ మీరేం సాధిస్తున్నారో నాకర్థం కావటం లేదు. తీర్పు వచ్చింది కనుక, శిక్షను అమలుపరచి, “న్యాయం గెల్చింది” అని నినాదాలు చేసి, నీరసించిన గొంతులో గుక్కెడు నీళ్ళు పోసుకుంటున్న సమయాన.. వీలైతే ఓ క్షణం ఆలోచించండి – జరిగిన నేరమేంటి? భాద్యులు ఎవరు? బాధితులు ఎవరు? ఇంతటి దారుణాలు ఎలా జరుగుతున్నాయి? పునరావృతం కాకుండా ఉండడానికి ఏం చేయగలిగాం? నేరస్థుడిని జైల్లో ఉంచాం, మరి నేరం సంగతో? – ఇవీ ఆలోచించండి. కనీసం, మీ మీ పిల్లలను బాధ్యులుగానో, బాధితులగానో మిగలకుండా చూసుకోండి.

మీరంతా “న్యాయం జరిగింది. నిజం నెగ్గింది” అనంటుంటే, నాకూ న్యాయం కావాలనిపిస్తోంది. నన్నూ, నా తోబుట్టువులనూ మళ్ళీ ఆ సాయంత్రానికి తీసుకెళ్ళి, అక్కడ అమ్మానాన్నలకు అప్పగించగలరా? ఆ ఆనంద కుటీరం ఈసారన్నా కూలకుండా చూడగలరా? నాకు నా జీవితాన్ని తిరిగివ్వగలరా? పోనీ, నాలా మరెవ్వరి బతకూ బండలు కాకుండా చూసుకోగలరా? ఇదీ నాక్కావాల్సిన న్యాయం. ఇప్పుడూ, దాన్ని నెగ్గించగలరా?

మీ వల్ల కాకుంటే, కనీసం, నా మానాన నన్ను బతకనిస్తారా? మీ టిఆర్పీల కోసమో, మహిళా సంఘాల కోసమో, న్యాయవ్యవస్థ విజయసభలకోసమో నన్ను వెంటాడక, మీరు మనుషుల్లా మిగలుతారా? PLEASE…

మీ,
నీలిమ