పౌర్ణమి మైనస్ వెన్నెల =


కనిపిస్తే కాల్చివేత. ఇంగ్లీషులో కర్ఫ్యూ.
కనిపించిందల్లా కాల్చివేస్తే… ఇంగ్లీషులో హాపీ వాలెంటైన్స్ డే! (హాపీ సైలెంట్. వాలెంటైన్ సైలెంట్+డంబ్+మ్యూట్…)

ప్రాణస్నేహితుడనగా ప్రాణం మీదకు తీసుకొచ్చేవాడు, ప్రాణాలు తోడేసేవాడు, ప్రాణాలు తీయాలన్న కోరికను బలపరిచేవాడు, ఇలా ఎన్ని అర్థాలైనా చెప్పుకోవచ్చు. నాలాంటి అమాయక, అర్భక, ప్రేమానాథ జీవి ఇట్లాంటి రోజుల్లో బయటకు రాకూడదని తెల్సి కూడా, ఆ వెధవగాడు “సాయం” పేరుతో నన్నిలా ఇరికించాడు. మాటిచ్చాక, వెనకడుగేయడం మా ఇంటా ( మా ఇంటోనర్ పుణ్యమా అని)  ఉన్నా, నేను వచ్చి చచ్చాను. వాడింకా చావలేదు.

“దార్లో ఉన్నానురా! ఒక పావుగంట..”

పావుగంట? జీవితం చిన్నదన్న వెధవ్వెవడూ? డర్బన్ పిచ్ పై స్టీన్ సచిన్‍కు బౌలింగ్ వేస్తుంటే బాల్‍కి బాల్‍కి మధ్య కొన్నివందల వేల యుగాలు గడిచినట్టనిపిస్తుందే! వాడేసే పది ఓవర్లూ ఓ వంద ఓవర్లతో సమానంగా అనిపిస్తాయ్. ఇప్పుడీ పావుగంటా, పాత సినిమాల్లో గౌన్‍లాంటి డ్రస్సేసుకొని కత్తి యుద్ధం చేసే కాంతారావు కూడా ఎదుర్కోనన్ని గండాలు ఎదుర్కోవాలి నేను. ఎటు చూసినా అందాలే! అన్నీ అందనివే! దీనికన్నా, గున్నేనుగులాంటి గీత (టీంలోకి చేరుతుందని తెల్సిన్పప్పుడు గీతంటే సన్నగా, నాజూగ్గా నటరాజ్ పెన్సిల్‍తో గీసిన గీతలా ఉంటుందని ఊహించుకున్నాను. నల్లటి తారురోడ్డు మీద లావుగా, దిట్టంగా, పొట్టిగా పెయింట్ వేసే లేన్ లైన్‍లా ఉంటుందనుకోలేదు) మమతా బెనర్జీకి చుడిదార్ వేసినట్టుండే రిచా మధ్యన కూర్చొని, రోజులో నాలుగు గంటలు పనిచేయాల్సి వచ్చినా ఇంత నరకం అనిపించదు.

మాల్ అంతా ఒకటే జాతర్లా ఉంది. ప్రేమ జాతర. ఇచ్చుట ప్రేమలు అమ్మబడునూ, కొనబడునూ, అద్దెకు ఇవ్వబడునూ, అప్పివ్వబడునూ. ఈ పూట, మగాళ్ళ పర్సులు పల్చబడిపోతాయి. ఆడాళ్ళ మేకప్‍లు దళసరవుతాయి. చేతుల్లో చేతులేసుకొని, భుజం భుజం రాసుకుంటూ, అడుగులో అడుగేసుకుంటూ మైమర్చిపోతుంటారు. ఒక్కసారి పైకి చూడండి, వెర్రినాగలన్నల్లారా! గాల్లో వేలాడదీసిన హార్ట్ షేప్ బలూన్స్. చిన్నప్పటి మొసలి-కోతి-గుండెకాయ కథలోలా, మనం వేసిన వలపు వలల్లో పడినట్టే పడి, మనక్కావాల్సిందేంటో తెలీగానే, “ఓహ్.. మొసలి బావ! నీక్కావాల్సింది అదేగా?! దాన్దేం భాగ్యం. కానీ అనవసరపు మోతని కొమ్మకే వేలాడదీసొచ్చాను. పద.. తెచ్చుకుందాం!” అని ఒడ్డుకు చేర్పించుకొని నిండా ముంచేస్తారు. అందుకే ఈ విషయంలో జాన్ నాష్ కీ జై కొట్టాలని నా సిఫార్సు.

ఎదురుగా ఫాస్ట్ ట్రాక్ వాడిది చిన్న కొట్టు కనిపిస్తే, అందులోకి దూరాను. “కళ్ళగంతద్దాలు ఉన్నాయా? యు నో… అవి పెట్టుకోగానే ఇంకేం కనిపించకూడదు. అలాంటివి?” అని అడుగుదామన్న చిలిపి ఆలోచన కలిగింది. నాకన్నా చిలిపిగా, “మేడం కె లియె కుచ్..??” అనడిగాడు. నా మొహం చూసి, నాకో మేడం ఉందని వాడికనిపించినందుకు తెగ సంబరపడిపోయి, “రాజా…పో, నువ్వు పండగ చేసుకో! నేను నీ కొట్టు చూసుకుంటా..” అని కళ్ళనీళ్ళు పెట్టుకోబోయాను, సంతోషంలో. “లేటెస్ట్ మొడల్.. మస్త్ హై..” అంటూ ఒకటి చూపించాడు. అదేంటో ఇంకా చూడకముందే, ఇంకోటి. వార్నాయనోయ్.. ఏదో ఒకటి కొనేదాక వదిలేలా లేడు. అహా! మేడం చేయెంత లావుగా ఉంటుందో చెప్పాలంట. “రాజా.. అదిగో, వైట్ షార్ట్స్, మెరూన్ టాప్.. ఆ అమ్మాయి చేయంత నాజూగ్గా ఉంటుంది. పిల్చుకొని రా.. వాచ్ ఆ చేతికి పెడితే ఎలా ఉంటుందో మనకో ఐడియా వస్తుంది.” అననబోయేలోపు, అమ్మాయి మాయమయ్యింది. ఇంకో క్షణమున్నా, వీడి చేతిలో క్షవరమని అక్కడి నుండి జంప్ కొట్టాను.

ఆరుబయట మంచం మీద పడుకొని నక్షత్రాలు చూసినట్టుంది, ఇక్కడున్న అమ్మాయిలను చూడ్డం. ఎవర్ని చూడాలో, ఎవర్ని చూస్తున్నానో అంతుపట్టటం లేదు. అంతలోకి ఒక చందమామ! అమ్మకు చూపిస్తే, ’చిదిమి దీపం పెట్టుకోవచ్చురా!’ అనంటుంది. చీర కట్టుకుంది. జడల్లుకుంది. పూల్లెట్టుకుంది. పిచ్చెక్కించేస్తుంది. మాల్ అంతా అదృశ్యమైపోయి, కాలువ గట్టున చందమామను చూస్తూ నడుస్తున్నట్టుంది నాకైతే. ఆమె ఎస్కలేటర్ ఎక్కింది. ఆమె ఎక్కుతుందని ముందే ఊహించిన ఈ మేధావి, ఎస్కలేటర్ ఎక్కున్నాడు. గాజులు కూడా వేసుకుంది, గలగలలూ.. సరిగమలూ..! ఆమె ఫోన్ మోగింది. ఆమె గొంతు పలికింది. నా గుండె గిటారు శృతి తప్పింది.

“మాల్‍లో.. సినిమాకి.. నన్నడక్కూ. పిచ్చిదానిలా గంతులు వేసా అర్థరాత్రి. సొ..లిటేర్ ఇచ్చాడు.. యా..యా.. ఇదో పెట్టుకున్నా. చీరలో ముద్దొస్తావ్ అన్నాడు. ఇప్పుడు చీర కట్టుకునే తిరుగుతున్నా… చాలా ఇబ్బందిగా ఉంది.. అయినా, సోలిటేర్.. యు సీ..” ఆమె నవ్వుతోంది, నిండు చందమామలా. నా మనసంతా అమావాస్య చీకటి.

నాలాంటి వాడు ఒక్కడైనా ఉంటాడేమోననుకున్నాను. లేడు. అందరూ ఆనందంగా ఉన్నారు. కనీసం, ఉన్నట్టు కనిపిస్తున్నారు. అవి స్వచ్ఛమైన నవ్వుల్లో, పులుముకున్న నవ్వుల్లో, లాఫింగ్ క్లబ్‍లోని బలవంతపు నవ్వుల్లో తెలీదు. నేనొక్కణ్ణే ఏడుస్తున్నాను. ఎందుకు?  అర్రె.. ప్రేమలు తప్పించి వీళ్ళకింకేం కష్టాలు లేవా? సాటి జీవి దుఃఖంలో ఉన్నప్పుడు, సంబరాలు చేసుకోకూడదనే ఇంగితం కూడా లేని పోయేకాలపు ఆనందాలూ, వీళ్ళూనూ.. వెధవ జానాభా! నాకో వాలెంటైన్‍ని ఇవ్వలేని ఈ సభ్యసమాజం మీద తిరుగుబాటు లేవదీస్తా..

అయినా, నాకు మాత్రం ఎందుకీ ఏడుపు? ఇక్కడింత మంది అమ్మాయిల్లో ఒక్క అందమైన, తెలివైన అమ్మాయి వచ్చి “ఐలవ్యూ” అని చెప్పి నన్ను తీసుకుపోవచ్చుగా! నేనేం కాదంటానా? ఉదాహరణకి, ఆ ఎదురుగా ఉల్లిపొట్టు రంగు డ్రస్స్ వేసుకొని, జుట్టు విరబోసుకున్న అమ్మాయి – లక్ష్మణ్ ఆడే మిడ్-వికెట్ బౌండరీ అంత అందంగా ఉంది. ఆ అమ్మాయే రావచ్చుగా. పిచ్చిపిల్ల, ఇంతటి జనాభాలో నేనే తన కలల రాకుమారుణ్ణి అని ఎలా కనిపెడుతుంది? నేనూ కొంచెం సాయం చేయాలిగా.. పాపం.

నేను అటుగా నడుచుకుంటూ వెళ్తుంటాను. ఆ అమ్మాయి నా వేపు వస్తూ ఉంటుంది. మధ్యలో అదిగో, ఆ చంటోడు అడ్డొస్తాడు. ఇద్దరం గుద్దుకుంటాం.

కుంటే? “సారీ” అని నేను చెప్పాక, “ఇట్స్ ఓకే” అని పైకని, “ఇడియట్” అననుకొని పక్కకు వెళ్ళిపోతుంది.

నెక్ట్స్.. చంటోడు కింద పడబోతాడు. నేను వాణ్ణి పడకుండా పట్టుకుంటాను. అప్పుడు?

వాళ్ళమ్మొచ్చి “థాంక్స్!” అంటుంది. వాడికీ మాటలొస్తే, “థాంక్స్.. అంకుల్” అన్నా అంటాడు. డేంజర్!

కమాన్.. కాస్త బెటర్‍గా ఆలోచించాలి. నాలోని తెలుగు సినిమా కథకుడు ఏమయ్యాడు? సరే.. నేను వెళ్తుంటాను.. ఆ అమ్మాయి వస్తుంటుంది. మా ఇద్దరి మధ్య మూడడుగుల దూరం ఉండగా, చంటోడి రయ్య్ మంటూ రేలింగ్ వైపుకు దూసుకుపోయి, అందులో ఇరుక్కుపోయి.. కిందపడబోయి..

రేయ్య్ పాపాత్ముడా! నీ మొహానికి పడేయడం చేతకాకపోతే ఊరుకో, అంతేగాని పసోడి మీద పాపిష్టి ఆలోచనలు చెయ్యకు – అంతరాత్మ దులిపి ఆరేసింది.

సరే! బ్లాంక్ పేపర్ ఇచ్చి వెళ్ళిపోవటం ఎందుకు? ఏదోటి గెలికితే కొన్ని మార్కులన్నా రాకపోవా అని, అటుగా నడవటం మొదలెట్టాను. వెళ్తున్నా, వెళ్తున్నా, వెళ్ళిపోయా. కనీసం చూడను కూడా చూడలేదు. ఓరేయ్య్.. దేవుడా! నా స్క్రిప్ట్ లో లవ్ సీన్స్ రాయడానికి నీకింత బద్ధకం, అలక్ష్యం ఏంటసలు? నీకు కుదిరి చావకపోతే, నాకే ఔట్‍సోర్స్ చెయ్యి, నేనే వేరే ఎవరిచేతనైనా రాయించుకుంటాను.

వీడింకా చావలేదు..

“ఒర్రేయ్య్.. ఎక్కడ చచ్చావ్?”
“వస్తున్నా.. ఒక్క ఐదు నిముషాలు.”
“వచ్చావో సరే సరి.. లేదా, అవే నీ చివరి ఐదు నిముషాలు, ఈ భూమ్మీద..”

ఆకలి! ఇన్ని పాట్లు పడ్డాక, సాపాటు గుర్తురావటం పరిపాటి. అలసిపోయాను. ఒక మాంచి కాఫీ తాగితే అమృతం కూడా అనవసరం అనిపిస్తుంది. కాఫీ షాపులో అమ్మాయిలెవ్వరూ లేరు! కాఫీ? అబ్బా.. చేదు! పైగా ఆరోగ్యానికి హానికరం. తీయటి, చల్లటి జ్యూస్ ఉందక్కడ. (=అమ్మాయిలున్నారు.) ఒక్కటే జ్యూస్ ఉందట. రెండొందలు దొబ్బి, ముదురు ఎరుపు రంగులో ఉన్నదేదో నా మొహాన కొట్టాడు. వాసన చూడగానే, ఆ కంపుకి కడుపులో ఉన్నదంతా కదిలింది. ఒక గుటకేయ్యంగానే కదిలినదంతా బయటకు రావడానికి సిద్ధపడింది. అదక్కడే పాడేసి, రెండు బేక్డ్ సమోసాలు ఆర్డర్ ఇచ్చి  కూర్చున్నాను. ఓ రెండు టేబుళ్ళ దూరంలో కూర్చున్న అమ్మాయిలు ఎందుకో నవ్వుకుంటున్నారు, అప్పుడప్పుడూ నన్ను చూస్తున్నట్టు అనిపించింది. వెంటనే తలను టేబుల్‍లోకి దూర్చేసినట్టు తల దించుకున్నాను. వీళ్ళు చూస్తే ఒక బాధ, చూడకుంటే మరో బాధ. వీడేంటో స్నేక్స్ ఆండ్ లాడర్ పెట్టాడు టేబుల్ మీద. అబ్బో.. డైట్ ఫర్ హెల్త్ స్నేక్స్ ఆండ్ లాడర్! కూల్‍డ్రింక్స్, పిజ్జాలు పాములు. ఇందాక వాడిచ్చిన దిక్కుమాలిన జ్యూస్, చెప్పులరిగేదాకా నడవడం, ఇవీ నిచ్చెనలు. సమోసాలు వచ్చాయి.. నోటినిండా పెట్టుకొని, కడుపారా తిన్నాను, అక్కడున్న పాముల్నే నమిలి మింగేస్తున్న ఫీలింగ్‍తో.

ప్రేమ పద సోపానం అని కూడా ఒకటుంటే! ఎంత చకచకా పైపైకి ఎక్కేసాను, ఒక్క పాము బారిన కూడా పడకుండా. ఎనభై మూడో గడిలో పేద్ద పాము నన్ను నమిలి మింగేయటం, నేను మొదటికి రావటం, క్షణాల్లో జరిగిపోయాయి. పేకమేడలే కాదు, కళ్ళల్లో కట్టుకున్న అద్దాల కలల మేడలూ “ఉఫ్” అన్నంతలో కూలిపోతాయి. అప్పట్నుండీ, రెండో వరుస – అంటే అమ్మాయిల్ని చూసి మనసు పారేసుకోవడం – దాకా వెళ్ళి, కాసేపటికి పడిపోయిన జేబురుమాలు తీసుకున్నట్టు మనసునూ తీసేసుకుంటున్నాను.

అమ్మాయిలింకా నన్నే చూస్తున్నారు. నవ్వుతున్నారు. చిరాకులో ఇలా ఏవేవో అనిపించాయి. ఆడవాసన లేని చోటుకు వెళ్ళాలి? ఎక్కడ? సాధ్యమా? ఓహ్.. యెస్.. యెస్‍స్‌‍స్‍స్..

ఏర్ ఫ్రెష్నర్ వాసన గుప్పుమంటోంది. హాయిగా ఉంది. ఇక్కడే, ఇలానే ఇంకో గంటుండమన్నా ఉంటాను..

“హలో..ఎక్కడ్రా?”

“వాహ్….ష్‍రూం..”

“అదేదో, వాషింగ్‍టన్ డిసి అన్నట్టు ఆ ఆనందమేమిట్రా నీయంకమ్మా? ఏ ఫ్లోర్?”

“ఏరా? ఎంతసేపు చేస్తావ్? నాకసలే టైం లేదు..” – నేను కనిపించగానే వాడన్న తొలి మాటలు. మొహం బద్దలగొడదామన్నంత కోపం వచ్చింది. ఎంగేజ్మెంట్ ఫోటోల్లో    కన్ను లొట్టపోయినట్టుంటే,  వాళ్ళావిడకు కష్టమని ఊరుకున్నాను.

“ఏం పెళ్లో ఏమోరా నాయనా! అసలింకా ఏం మొదలు కాకముందే వాచిపోతుంది. ఒక్క చావు కాదనుకో..”

“ఉహుహహుహహుహహుహ.. దూల తీరుతోందా బాగా? నువ్వు చావు. నన్ను దొబ్బకు. అయినా షాపింగ్ అంటే నాకెంత చిరాకో తెల్సి కూడా..”

“బాబ్బాబు.. నీకు పుణ్యం ఉంటుంది. ఆ మాటనకు. ఆ ఇంట్లో, ఈ ఇంట్లో నా పెళ్లి బట్టలు నీ చేతులు మీదగా ఇప్పించాలని నీ చిన్నప్పటి కలని కలరింగ్ ఇచ్చాను. నువ్వు హాండ్ ఇస్తే, ఆడమేళంతో షాపింగ్.. బాబోయ్… అల్ట్రా స్లో మోషన్ టార్చర్ అది!” కళ్ళనీళ్ళు పెట్టకుండా, గుక్కతిప్పకుండా ఏడ్చేసాడు, యదవ!

“మనం ఇంజినీరింగ్‍లో కద కలిసాం.. చిన్నప్పటి కల ఎలా అవుతుంది బే?”

నా వేపు నీరసంగా చూసాడు. పాపం అనిపించి వీపు మీద గట్టిగా కొట్టి సరిపెట్టుకున్నాను. ఇద్దరం మెన్స్ షోరూంకి వెళ్ళాం. తలుపు నెట్టగానే, “హాపీ వాలెంటైన్స్ డే సర్!” అని ఒక అందమైన అమ్మాయి గులాబి నవ్విచ్చి, పువ్వింది.. అందమైన అమ్మాయని కదూ అన్నాను, కాదు! అందానికి మించి ఉంది. ఎలా ఉంది? ఎలా ఉంది? పోలిక కావాలి.. పోలిక! ఏమో తెలీటం లేదు. కాని, ఇష్కియా ప్రోమోలో విద్యా బాలన్‍ని తొలిసారి చూడగానే ఓ రెండు నిముషాలు ఊపిరాడనివ్వనట్టు, ఇప్పుడు కూడా నా పరిస్థితి. అందంకాదది.. ఆడతనం! స్త్రీత్వం! అలాంటివేవో..

వీడేడీ? ఓహ్..షాపింగ్ చేయాలి కదూ! ఓ నాలుగైదు డ్రస్సులు సెలెక్ట్ చేసుకొని, వాడు ట్రయల్ రూంలోకి వెళ్ళాడు. ఆ అమ్మాయి కనిపించేట్టుగా నేను నించోని ఉన్నాను. నన్ను చూడ్డం లేదు. షాపుకు వచ్చే పోయే వాళ్ళని నవ్వుతూ పలకిరిస్తూ పూలిస్తోంది. అలసటగా ఉందనుకుంటా, అప్పుడప్పుడూ నీరసంగా పెట్టేస్తోంది మొహం. అయినా, బాగుంది.

“ఎలా ఉంద్రా?” – నా సౌందర్యారధనకు తపోభంగం కలిగిస్తూ వాడి ప్రశ్న. అక్కడే ఉన్న సేల్స్ మాన్ మొహం చూపించాను. మారు మాట్లడకుండా లోపలికెళ్ళాడు.

నన్ను చూడదేం? ఒక్కసారైనా? దాహంగా ఉందని చెప్పి మంచినీళ్ళడగనా? ఆమె స్వహస్తాలతో ఇస్తే అవి నాకు అమృతంతో సమానం కావా?! చూడు, ఒక్కసారి చూడు నన్ను. నన్ను కాకపోతే, ఇటు వేపు చూడు. హాంగర్‍కు వేసున్న సూట్స్ ని కెలుతూ, కొన్ని కింద పాడేసాను. శబ్ధం వచ్చింది. అయినా చూడలేదు. ఇంకోడెవ్వడో వచ్చి, “నిలబడ్డం కూడా చేతనవ్వటం లేదా?” అన్నట్టు నన్ను చూసి అవి పైన పెట్టి వెళ్ళబోతుంటే, ఎడమచేతి వైపున్న బట్టలన్నీ కిందపడేలా స్టాండ్‍ని తోసాను. మానేజర్ వంక “ఐ యామ్ సారీ” అన్నట్టు చూసాను. “థట్స్ ఫైన్.. నో ఇష్యూస్” అనుకుంటూ నవ్వాడు. సేల్స్ వాడు ఏడ్చాడు. ఆమె మాత్రం చూడదేం?!

“ఇది రా?” అనడిగాడు. నా నుండి ఉలుకు పలుకు లేకపోయేసరికి, “మాట్లాడవేం?!” అని కసిరాడు. “నా మొహంలా ఉంది.” అని నేనూ కసిరనట్టే చెప్పాను. లోపలికి వెళ్ళిపోయాడు?

ఇంతలో షాపులోకి ఎవరో ఇద్దరు వచ్చారు. ఆమె పూలనూ, నవ్వులనూ పిజ్జా బాయ్ కన్నా సిన్సియర్‍గా డెలివర్ చేసింది. అందులో ఒకడు, అమ్మాయి మీదకు వెళ్ళాడు. సాలే గాడు.. తాగొచ్చినట్టున్నాడు. ఒళ్ళు తెలీటం లేదు వాడికి. ఫ్రెండూ, మానేజరూ వాణ్ణి పక్కకు తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నారు. వాడు wallet తీసి అందులోంచి వెయ్యి రూపాయల నోట్లు ఒక ఐదారు తీసి, ఆమె చేతిలో బలవంతంగా పెట్టాడు. వాణ్ణి పక్కకు లాక్కుపోయారు. అమ్మాయి షాక్ నుండి తేరుకోలేదు. ఏడ్చేస్తుందేమోననుకున్నా. ఏడవకు. ఏడవకు. నీకు నేనున్నా. ఏం భయంలేదు. వాణ్ణి చంపేసి, నిన్ను నేను రక్షిస్తాను. ఏడవకేం?!

ఆ పిల్ల కంటితడి పెట్టుకొని “రాయిని ఆడది చేసిన రాముడివా?” అని నన్ను ఉద్దేశించి పాడుతున్నట్టు, నా కాళ్ళకి దణ్ణం పెడుతున్నట్టూ..”ఛ! ఛ! ఏం పనులివీ? నేను నీ వాడను. మనది జన్మజన్మల బంధం. ఈ కొట్టులో అడుగుపెట్టిన క్షణం నుండీ మొదలయ్యింది!” అని లేవదీసి, అసలే విశాలమైన నా ఛాతీ ఇంకా వెడల్పు చేసి పెట్టాను. ఆమె తలవాల్చుకుంది.

“ఏరా? ఇదీ?” – నా కలలకు కట్ చెప్తూ! “నీ మొహంలా ఉంది.” అన్నాను విసుగ్గా. అది వినగానే అద్దం ముందు మెలికలు తిరగుతూ చూసుకున్నాడు. వాణ్ణి దేంతో కొట్టాలో తెలీక, షూ విప్పబోయాను. అద్దంలో నుండి గమనించిన వాడు, గబుక్కున ట్రయిల్ రూంలోకి పారిపోయాడు.

ఇదో అమ్మాయ్! కొట్టు మూయంగానే ఇంటికి తీసుకెళ్ళి, “అమ్మా.. నీ కోడలు.” అని చూపిస్తాను. అమ్మ ఒప్పుకోదు గాని ఒప్పేసుకుంటుంది. మా అమ్మ చాలా మంచిది. నిన్ను కన్నబిడ్డలా చూసుకుంటుంది. నువ్వు కూడా మా అమ్మను బాగా చూసుకోవాలి. అమ్మను బాధపెడితే, నాకు పిచ్చ కోపం వచ్చేసి, నేనేం చేస్తానో నాకే తెలీదు. అయినా, నువ్వేం చేయవులే. నీది అందమైన మనసు కూడా అని నాకు తెల్సుగా.

నా మాటలు వినిపించాయా? నా వేపు చూసింది. నవ్వింది. ఉద్యోగపు నవ్వు కాదది. నాకోసం నవ్వు. అప్పటికే నవ్వుతున్న నా నవ్వు, ఇంకా బలపడింది. నేను నవ్వటం చూసి, నవ్వొచ్చిందా? “నీ ఛార్మ్ వర్క్ అవ్వాలే గానీ, ఎవ్వరైనా నీ వశం కావటం ఖాయం.” – నాకో అమ్మాయిచ్చిన కాంప్లిమెంట్! ఇప్పుడు అర్థమవుతోంది.

“ఇది ఆఖరు! బాగా లేకపోతే.. వేరేదగ్గరకు పోవాలి.”  సమాధానం ఇవ్వకుండా వాడికి ఆమ్మాయి చూపించాను. ముగ్గురం నవ్వుకున్నాం. అదే ఫైనల్ చేసాం.

ఇందాకటి తాగుబోతు వెధవ మళ్ళీ వచ్చాడు. వాడికి చేతిలోని డబ్బుల్ని చూపిస్తూ, “థాంక్స్” అన్నట్టు చూసింది. ట్రాష్! ఎంతలో ఎంత దూరం వెళ్ళిపోయాను. అంతా నాశనం. డబ్బు కోసం? ఛ! కావాలంటే, లక్షలు నీ మీద గుమ్మరిస్తా, వస్తావా నాతో? ఎందుకు అమ్మాయిలకు డబ్బు, సంపాదన తప్ప మగాడిలో ఇంకో లక్షణం కనిపించదు. వాణ్ణి చంపుదామన్నంత కోపం వచ్చింది. ఇప్పుడు, నిన్నే చంపేద్దామనిపిస్తోంది. ఓహ్.. హాంగ్ ఆన్! మే బీ, మీరే కరెక్ట్. కాదు! ప్రాక్టికల్. నిన్ను మా అమ్మకు చూపిస్తే, కులం, గోత్రం, నక్షత్రం, జాతకం, వారం, వర్జ్యం అంటుంది. అదే, ఓ పదివేలు నీ మొహాన కొట్టాననుకో, ఇప్పుడు, ఈ క్షణంలో నువ్వు నాదానివవుతావు. అంతేనా? నెత్తిన పెట్టుకొని పూజిస్తామన్న వాళ్ళని మీరెప్పుడూ నమ్మరు. ఊదిపారేసిన సిగరెట్‍ని కాళ్ళ కింద నలిపేలా వాడుకునే వాళ్ళకి మాత్రం దాసోహం అంటారు. చెప్పు.. నీ రేటెంత?

నా wallet తీసాను, ఒళ్ళు తెలీని ఆవేశంలో..

“కలరింగ్ ఇచ్చానని, బిల్ కూడా కట్టేస్తావా? నో.. నీ సెంటిమెంట్‍ను నేను కాదనను.” అంటూ నా డబ్బులన్నీ తీసుకొని బిల్ల్ కట్టేసాడు.

బిల్ కౌంటర్ దగ్గర మేం ఉండగానే అమ్మాయి అక్కడికి వచ్చింది. నాకా మొహం చూడాలనిపించలేదు. వచ్చి.. టేబుల్ మీదున్న ఛారిటీ డబ్బాలో చేతిలో ఉన్న నోట్లన్నీ వేసేసింది. “థాంక్స్.. నువ్వు గాని రియాక్ట్ అయ్యుంటే వాడికెంత గోల చేసేవాడో? ఓపిక పట్టినందుకు చాలా థాంక్స్. ఈ సమస్యను నేను సాల్వ్ చేస్తా..” అంటూ మేనేజర్, ఏదేదో మాట్లాడుతున్నాడు. మాకర్థంకాలేదు.

“పాపం. మంచి పిల్లలా ఉంద్రా!”
“నన్ను మాత్రం లాగి లెంపకాయ కొట్టిందిగా..” అనన్నాను.
“నీకు తగిన శాస్తే..” అన్నాడు, నవ్వుతూ.

వెళ్ళిపోబోతుంటే, “థాంక్యూ! హాపీ వాలెంటైన్స్ డే, సర్!” అని చెప్పింది.
“బట్ ఇట్స్ వాలెంటైన్-లెస్ డే, ఫర్ మీ. యు నో?” అనన్నాను.

ఊహించని నా ప్రేలాపనకి “వెల్..” అని మొదలెట్టి ఒక క్షణం ఆగింది. “టేక్ మీ ఆస్ యువర్ వాలెంటైన్..” అని అంటుందన్న ఆశ నన్ను కవ్వించింది.

“వెల్! విష్ యు అ వెరీ హాపీ వాలెంటైన్-లెస్ డే!” అంటూ నవ్వేసింది.

ఇందాకటి పువ్వు వెనక్కిచ్చి, “థాంక్యూ” అని నేనూ నవ్వాను, ఏడ్వలేక.

Advertisements

eulogy


హే.. నువ్వు చనిపోయావట కదా! ఇప్పుడే తెల్సింది, కాస్త ఆలస్యంగా. I’m sorry!

ఇలా చెప్పా పెట్టకుండా టపా కట్టేస్తావని ఊహించలేదు. “I’m dead. See ya at my funeral. Don’t be late. I’m not waiting.” అని మెసేజ్ పెట్టి పోతావ్ అనుకున్నాను. కొంపదీసి, అందరికీ పంపి, నాకే పంపలేదా ఏంటి?

కబురందగానే, ఇంటికి ఫోన్ చేయాలనిపించింది. నువ్వెటూ లేవుగా, అందుకని ఊరుకొన్నా. పైగా, ఇప్పుడక్కడంతా గోల, గోలగా ఉంటుంది కదా. వచ్చే జనం. పోయే జనం. ఏడుపులూ, పెడబొబ్బలూ, ముక్కు చీదుళ్ళూ. హడావిడి. ఆర్భాటం. అందులోనూ పోయింది నువ్వాయె! నిన్ను ప్రేమించే వాళ్ళకి, నువ్వెటూ ఆరాధ్యదేవతవనుకో. వాళ్ళకి అవకాశం ఇవ్వాలే గాని, నీ ఒక్క టికెట్ మీద వాళ్ళంతా కూడా ప్రయాణం కట్టేయడానికి సిద్ధంగా ఉంటారు. పాపం, రిజర్వేషన్లూ, సీట్లూ కూడా పట్టించుకోకుండా, నీతో ఉంటే చాలనుకుంటారు. వీళ్ళు కాక, నీ అభిమానులు ఎటూ ఉన్నారనుకో. వాళ్ళు గానాభజానాలు, సంతాప సభలూ ఏర్పాటు చేసి, నానా హంగామా చేస్తారు; రెండు రోజులు పోయాక, నీ లోటు అలవాటు కాక ముందు. మొత్తానికి ఏనుగు చచ్చినా వేయ్యే, బతికినా వెయ్యే అన్నట్టుంది నీ పని.

మీ ఆయన పరిస్థితే కొంచెం దారుణంగా ఉంటుంది. మొహమాటానికి, కొంచెం అన్నా గాని, చెప్పడానికి వీల్లేనంత దారుణంగా ఉంటుంది. అలవాటు ప్రకారంగా నీ పేరు పిలుస్తాడు. నువ్వు పలకలేవని గుర్తొస్తుంది. ఏదైనా నవ్వుతెప్పించే విషయం విన్నప్పుడు, నీకు relay చేస్తాడు. నువ్వు వినవని తెలుస్తుంది. నవ్వుతాడు. నీ నవ్వు కలవక, వెలితిగా అనిపిస్తుంది. ఏడుస్తాడు. నీ భుజం లేక, కృంగిపోతాడు. నువ్వు పక్కనే ఉన్నావని భ్రమిస్తూ బతకడానికి సిద్ధపడతాడు. వాస్తవం వెక్కిరిస్తుంది. మళ్ళీ భ్రమించడానికి బోలెడంత ఖర్చవుతుంది. ఆఫీసులో లేని పని కూడా చేస్తాడు. స్నేహితులతో ఇదివరకటి కన్నా ఎక్కువ సేపు గడుపుతాడు. కొత్త స్నేహాలనూ, బంధాలనూ సాదరంగా ఆహ్వానిస్తాడు. తింటాడు. తాగుతాడు. తిరుగుతాడు. అలసి సొలసి, మంచం, సోఫా, నేల అనే తేడా లేకుండా వాలిపోతాడు. మత్తుగా నిద్రపోతున్నప్పుడు, subconsciousగా కోరిక కలిగినప్పుడు, అతడి చేతులు నిన్నే వెతుకుతాయి, దగ్గరతీసుకోటానికి.

మొదట్లో మరీ పిచ్చెక్కిపోతుంది గాని, రాను రాను అదే అలవాటయ్యిపోతుందిలే! మనం విడిపోయిన కొత్తల్లో, ఓ అర్థరాత్రి తాగొచ్చి, నువ్వుంటున్న మీ ఫ్రెండ్ ఇంటికొచ్చి, నానా రభసా చేసాను గుర్తుందా? నన్ను లోపలికి తీసుకెళ్ళి, పడుకోబెట్టి, తెల్లారాక తాగినదంతా దిగేదాకా ఓపిక పట్టి, నేను చేసిన వెధవ పనికి నొచ్చుకుంటూనే, నిన్ను విడిచి ఉండలేకపోతున్నానీ, ఇంటికొచ్చేయమనీ బతిమిలాడితే, ఆసాంతం విని, నిట్టూర్చి, కిటికీ లోంచి బయటకు చూస్తూ,

“నన్ను మర్చిపో.. శ్రీ” అన్నావ్.
“అది కుదిరి చస్తే, ఈ రభసంతా దేనికి? మనం గొడవలు పడ్డది నిజం. ఒకర్నొకరం అసహ్యించుకున్నది నిజం. Our marriage is a disaster అన్నది నిజం. కాని, నిన్ను నేను మర్చిపోలేకపోతున్నా.. నువ్వు లేకుండా, ఉండలేకపోతున్నా..” అని ఏడ్చాను, వెక్కి వెక్కి.
“నేను తిరిగి రావటం జరగని పని.”
“అయితే, నన్నెలా చావమంటావ్?”

“నీ చావు, నువ్వు చావు. నన్నెందుకు చంపటం?” అన్నది నీ సమాధానం అయ్యుంటే, బహుశా, నువ్వంటే నాకంత ఇష్టం ఉండేది కాదేమో.

కాని, నా దగ్గరకు వచ్చి, సూటిగా నా కళ్ళల్లోకి చూస్తూ, “How difficult would it to be to delude yourself of my sudden death?” అని నన్ను సమాధానపర్చకపోయుంటే, నిన్ను ఇంత ద్వేషించేవాణ్ణి కాననుకుంట.

Have a good death! The real  one, of course.

పన్నెండు గంటలు


రానున్న ఇరవై నాలుగు గంటలూ ఎలా గడపాలో ప్రణాళికాబద్ధంగా నిర్ణయించుకొని కొన్ని నెలలు అయ్యాయి. ఇంకో అరగంటలో.. అంటే, ముఫ్పై నిముషాల్లో, పన్నెండు దాటుతుంది, కొత్త రోజు మొదలవుతుంది. అప్పటి నుండి రేపు రాత్రి ఇదే సమయం వరకూ అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. కొంచెం అటూ, ఇటూ అయినా, నన్ను నేను క్షమించుకోలేనంత తప్పిదం చేసినదాన్ని అవుతాను.

మొబైల్ స్విచాఫ్ పెట్టేశాను. కాని, దాన్ని ఎలా స్విచ్ ఆన్ చేయాలో తెల్సునే నాకు! ప్చ్! ఏదో బలహీనమైన క్షణంలో దాన్ని వాడేస్తానేమోనన్న భయాన్ని నాలోనే తొక్కిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాను. నెట్ కనెక్షన్ ఊడపీకేసాను. ఇప్పుడిక నేనేం చేసినా రాదు. కాస్తలో కాస్త అదో ఊరట. ఇంకేం మార్గాలున్నాయి? ఇంతేననుకుంటా. టివికి ఛాన్సే లేదు. ఇప్పటికిప్పుడు ఫ్లైట్ ఎక్కి ఎగిరే ఉద్దేశ్యం నాకున్నా… ఉన్నా ఏంటి? నాకలాంటి ఉద్దేశ్యాలు లేవు. దేశ సరిహద్దులు దాటడానికి బోలెడు తతంగం ఉన్నట్టు, దేశం లోపల కూడా వీసాలుంటే బాగుణ్ణు. అప్పుడు జనాలిలా తుర్రుమని పిట్టల్లా ఎగిరిపోరు..

ఇంతేనా? నిజంగా, ఇంతేనా? ఇక నేనేం చేయకపోతే, ఏం కానట్టేగా? ఖచ్చితంగా? ఏదీ ఒకసారి చూడనీ.. ఊ, సెల్ స్విఛాఫ్‍లోనే ఉంది. నెట్ రావటం లేదు. నా పాస్‍పోర్ట్.. డోన్ట్ బి సిల్లీ! హమ్మయ్య.. ఇక ప్రశాంతంగా పడుకోవచ్చు. ఇంకో ఇరవై నాలుగు గంటలంతే! నా పని అయ్యిపోతుందని. అయినా, నిన్న కాక మొన్న జరిగినట్టే ఉంది. మళ్ళీ అప్పుడే ఏడాది గిర్రున తిరిగేసింది. ఇలా చీటికీ మాటికీ వస్తే ఎలా కుదురుతుంది? ఊపిరి ఆడద్దు? అయినా, ఇలాంటి వన్నీ ఎన్నికల్లా ఐదేళ్ళకోసారి రావచ్చుగా. ప్రతీ ఏడాదీ అంటే కష్టం కదూ..

ఉండు.. సెల్ తీసుకెళ్ళి పరుపు కింద పెట్టేస్తాను. అది ఎదురుగా కనిపిస్తే, మళ్ళీ ఎదవ గోల! ఏదో బలహీనమైన క్షణంలో ఆన్ చేసినా చేసేస్తాను. ఎక్కడ పెడుతున్నానో మర్చిపోగలిగితే బాగుణ్ణు. మనకి కావాల్సినవే గుర్తుండి, మనకి నచ్చనవన్నీ మర్చిపోతే ఎంత బాగుంటుంది. అమ్మో.. అలా వద్దు. అప్పుడు, నేను ఈ పాట్లేం పడకుండా, సిగ్గు ఎగ్గూ లేకుండా, పళ్లికిలించుకుంటూ పలకరించేస్తాను. అప్పుడు నా పరిస్థితి.. నో! ఊహకే బాలేదు. అయినా తప్పు చేసినా, చేయకపోయినా, నేనే ఎందుకు కిందపడాలట? ఏం? నాకు మాత్రం హృదయం లేదా? అది మాత్రం గాయపడదా?

ఇన్నెందుకు? అసలు పోయిన నా పుట్టినరోజుకు ఏం విషెస్ పంపాడో మర్చిపోతానా? “విష్ యు ఎ వెరీ హాపీ బర్త్ డే! మే యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ.. బీ హాపీ!” అంతే! ఇంకో ముక్క లేదు. పైన నా పేరు. కింద వాడి పేరు. మధ్యలోది ఎక్కడో కాపీ పేస్ట్ అన్న మాట. నా పేరు తీసేసి, ఇంకెవ్వరికి పంపినా, అంతే ఖచ్చితంగా అతుక్కుపోయే మెసేజ్. బహుశా, ఎప్పుడో ఆటో-డెలివరీ స్కెడ్యూల్ చేసేసి ఉంటాడు. లేకపోతే, అదే రోజున, మర్చిపోకుండా విషెస్ చెప్పాడంటే, నమ్మేసే మొద్దుననుకుంటున్నాడా?

ఇప్పుడు నేనూ చెప్పను. అస్సలు చెప్పను. చెప్తే గిప్తే చివర్లో చెప్తానేమో గాని, అంతకు ముందు మాత్రం చెప్పను. రేపొద్దున అయ్యేవరకూ చెప్పను. ఈ రాత్రికైతే అసలు సమస్యే లేదు. అందరికి అన్నా ముందు నేను చెప్పనుగాక చెప్పను.

నేను ఎన్ని అనుకున్నాను? ఏమేమో చేయాలని కలలుగనేశాను. కలలగనటం తేలికే! అవి పూర్తికానప్పుడే ఉండే బాధ ఉంటుందే, దాని గురించి మాటల్లో చెప్పలేం. వాడికి విశ్వనాథ్ గారి సినిమాలంటే ప్రాణం. పోయిన ఏడాది పోగా, కనీసం ఈ ఏడాదైనా ఆయనకు సంబంధించినవేవో ఇద్దామనుకున్నాను. ఏవో వస్తువులు ఇవ్వటం కూడా కాదు. వాళ్ళ అమ్మగారు, వాడికెప్పుడూ వటపత్రసాయికీ.. అనే లాలి పాడేవారట. వాడు పుట్టిన ఏడాదే ఆ సినిమా వచ్చిందని! నేనూ అలాంటిదేదో చేద్దామనుకున్నాను. అమ్మని కాదుగా! అందుకని, “సిన్ని సిన్ని  కోరికలడగా..” పాటలో, చిరంజీవిని ముస్తాబు చేసినట్టు చేయాలనుకున్నాను.  కానీ, వాడు నాకావకాశం ఇస్తే గదా! ఇవ్వడు. నాకెప్పుడూ దూరంగా ఉండాలని చూస్తాడు. వాడికేనా ఏం? నాకు లేదూ.. ఫొగరు? నాకేం వాడెట్టా పోతే! పొమ్మను.. నాకేం!

ఎందుకిలా నన్నేడిపించటం? తెల్సు కదా వాడికి, వాడు లేకపోతే నాకేం తోచదనీ.. పిచ్చెక్కిపోతుందనీ. తెల్సి కూడా చేస్తాడేం? తెల్సినందుకే చేస్తాడేమో బహుశా! ఇడ్డియ..ట్! నాకు నువ్వేం నచ్చలా.. ఫో.. ఎక్కడికైనా ఫో.. నా దగ్గరకు రాకు. నన్ను మర్చిపో.. నా కన్నా నీకన్నీ ముఖ్యం కదా, అయితే పో..

గడియారం పన్నెండని చెప్పటానికి మొదటి గంట కొట్టింది. ఛ.. అనుకుంటూనే ఉన్నా, ఏదో మర్చిపోయాననీ!

రెండో గంట – అబ్బా, ఎంత చెత్త పని చేశా కీస్ తీయకుండా.
మూడో గంట – హాపీ బర్త్ డే.. డియర్.. వినిపిస్తోందా? వేస్ట్ ఫెలో..
నాలుగో గంట – వినిపించుంటుందా వాడికి? ఎదురుగా ఉండి చెప్తేనే వినిపించుకోని మాలోకం..
ఐదో గంట – నా విషెస్ కోసం కాచుకొని కూచోడుగా.. అసలే మొండిఘటం.. కూచున్నా, కూచుంటాడు..
ఆరో గంట – ఏది? నా మొబైల్ ఏది?
ఏడో గంట – వాడి నెంబర్.. ఆర్.. ఏ..
ఎనిమిదో గంట – కనెక్ట్.. కనెక్ట్
తొమ్మిదో గంట – కనెక్డ్ అవ్వూ
పదో గంట – రింగింగ్.. రింగింగ్…
పదకొండో గంట – త్వరగా.. ప్లీజ్
పన్నెండో గంట – “ఆ.. హలో..నేను! హ్యాపీ బర్త్ డే!”