పన్నెండు గంటలు

Posted by

రానున్న ఇరవై నాలుగు గంటలూ ఎలా గడపాలో ప్రణాళికాబద్ధంగా నిర్ణయించుకొని కొన్ని నెలలు అయ్యాయి. ఇంకో అరగంటలో.. అంటే, ముఫ్పై నిముషాల్లో, పన్నెండు దాటుతుంది, కొత్త రోజు మొదలవుతుంది. అప్పటి నుండి రేపు రాత్రి ఇదే సమయం వరకూ అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. కొంచెం అటూ, ఇటూ అయినా, నన్ను నేను క్షమించుకోలేనంత తప్పిదం చేసినదాన్ని అవుతాను.

మొబైల్ స్విచాఫ్ పెట్టేశాను. కాని, దాన్ని ఎలా స్విచ్ ఆన్ చేయాలో తెల్సునే నాకు! ప్చ్! ఏదో బలహీనమైన క్షణంలో దాన్ని వాడేస్తానేమోనన్న భయాన్ని నాలోనే తొక్కిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాను. నెట్ కనెక్షన్ ఊడపీకేసాను. ఇప్పుడిక నేనేం చేసినా రాదు. కాస్తలో కాస్త అదో ఊరట. ఇంకేం మార్గాలున్నాయి? ఇంతేననుకుంటా. టివికి ఛాన్సే లేదు. ఇప్పటికిప్పుడు ఫ్లైట్ ఎక్కి ఎగిరే ఉద్దేశ్యం నాకున్నా… ఉన్నా ఏంటి? నాకలాంటి ఉద్దేశ్యాలు లేవు. దేశ సరిహద్దులు దాటడానికి బోలెడు తతంగం ఉన్నట్టు, దేశం లోపల కూడా వీసాలుంటే బాగుణ్ణు. అప్పుడు జనాలిలా తుర్రుమని పిట్టల్లా ఎగిరిపోరు..

ఇంతేనా? నిజంగా, ఇంతేనా? ఇక నేనేం చేయకపోతే, ఏం కానట్టేగా? ఖచ్చితంగా? ఏదీ ఒకసారి చూడనీ.. ఊ, సెల్ స్విఛాఫ్‍లోనే ఉంది. నెట్ రావటం లేదు. నా పాస్‍పోర్ట్.. డోన్ట్ బి సిల్లీ! హమ్మయ్య.. ఇక ప్రశాంతంగా పడుకోవచ్చు. ఇంకో ఇరవై నాలుగు గంటలంతే! నా పని అయ్యిపోతుందని. అయినా, నిన్న కాక మొన్న జరిగినట్టే ఉంది. మళ్ళీ అప్పుడే ఏడాది గిర్రున తిరిగేసింది. ఇలా చీటికీ మాటికీ వస్తే ఎలా కుదురుతుంది? ఊపిరి ఆడద్దు? అయినా, ఇలాంటి వన్నీ ఎన్నికల్లా ఐదేళ్ళకోసారి రావచ్చుగా. ప్రతీ ఏడాదీ అంటే కష్టం కదూ..

ఉండు.. సెల్ తీసుకెళ్ళి పరుపు కింద పెట్టేస్తాను. అది ఎదురుగా కనిపిస్తే, మళ్ళీ ఎదవ గోల! ఏదో బలహీనమైన క్షణంలో ఆన్ చేసినా చేసేస్తాను. ఎక్కడ పెడుతున్నానో మర్చిపోగలిగితే బాగుణ్ణు. మనకి కావాల్సినవే గుర్తుండి, మనకి నచ్చనవన్నీ మర్చిపోతే ఎంత బాగుంటుంది. అమ్మో.. అలా వద్దు. అప్పుడు, నేను ఈ పాట్లేం పడకుండా, సిగ్గు ఎగ్గూ లేకుండా, పళ్లికిలించుకుంటూ పలకరించేస్తాను. అప్పుడు నా పరిస్థితి.. నో! ఊహకే బాలేదు. అయినా తప్పు చేసినా, చేయకపోయినా, నేనే ఎందుకు కిందపడాలట? ఏం? నాకు మాత్రం హృదయం లేదా? అది మాత్రం గాయపడదా?

ఇన్నెందుకు? అసలు పోయిన నా పుట్టినరోజుకు ఏం విషెస్ పంపాడో మర్చిపోతానా? “విష్ యు ఎ వెరీ హాపీ బర్త్ డే! మే యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ.. బీ హాపీ!” అంతే! ఇంకో ముక్క లేదు. పైన నా పేరు. కింద వాడి పేరు. మధ్యలోది ఎక్కడో కాపీ పేస్ట్ అన్న మాట. నా పేరు తీసేసి, ఇంకెవ్వరికి పంపినా, అంతే ఖచ్చితంగా అతుక్కుపోయే మెసేజ్. బహుశా, ఎప్పుడో ఆటో-డెలివరీ స్కెడ్యూల్ చేసేసి ఉంటాడు. లేకపోతే, అదే రోజున, మర్చిపోకుండా విషెస్ చెప్పాడంటే, నమ్మేసే మొద్దుననుకుంటున్నాడా?

ఇప్పుడు నేనూ చెప్పను. అస్సలు చెప్పను. చెప్తే గిప్తే చివర్లో చెప్తానేమో గాని, అంతకు ముందు మాత్రం చెప్పను. రేపొద్దున అయ్యేవరకూ చెప్పను. ఈ రాత్రికైతే అసలు సమస్యే లేదు. అందరికి అన్నా ముందు నేను చెప్పనుగాక చెప్పను.

నేను ఎన్ని అనుకున్నాను? ఏమేమో చేయాలని కలలుగనేశాను. కలలగనటం తేలికే! అవి పూర్తికానప్పుడే ఉండే బాధ ఉంటుందే, దాని గురించి మాటల్లో చెప్పలేం. వాడికి విశ్వనాథ్ గారి సినిమాలంటే ప్రాణం. పోయిన ఏడాది పోగా, కనీసం ఈ ఏడాదైనా ఆయనకు సంబంధించినవేవో ఇద్దామనుకున్నాను. ఏవో వస్తువులు ఇవ్వటం కూడా కాదు. వాళ్ళ అమ్మగారు, వాడికెప్పుడూ వటపత్రసాయికీ.. అనే లాలి పాడేవారట. వాడు పుట్టిన ఏడాదే ఆ సినిమా వచ్చిందని! నేనూ అలాంటిదేదో చేద్దామనుకున్నాను. అమ్మని కాదుగా! అందుకని, “సిన్ని సిన్ని  కోరికలడగా..” పాటలో, చిరంజీవిని ముస్తాబు చేసినట్టు చేయాలనుకున్నాను.  కానీ, వాడు నాకావకాశం ఇస్తే గదా! ఇవ్వడు. నాకెప్పుడూ దూరంగా ఉండాలని చూస్తాడు. వాడికేనా ఏం? నాకు లేదూ.. ఫొగరు? నాకేం వాడెట్టా పోతే! పొమ్మను.. నాకేం!

ఎందుకిలా నన్నేడిపించటం? తెల్సు కదా వాడికి, వాడు లేకపోతే నాకేం తోచదనీ.. పిచ్చెక్కిపోతుందనీ. తెల్సి కూడా చేస్తాడేం? తెల్సినందుకే చేస్తాడేమో బహుశా! ఇడ్డియ..ట్! నాకు నువ్వేం నచ్చలా.. ఫో.. ఎక్కడికైనా ఫో.. నా దగ్గరకు రాకు. నన్ను మర్చిపో.. నా కన్నా నీకన్నీ ముఖ్యం కదా, అయితే పో..

గడియారం పన్నెండని చెప్పటానికి మొదటి గంట కొట్టింది. ఛ.. అనుకుంటూనే ఉన్నా, ఏదో మర్చిపోయాననీ!

రెండో గంట – అబ్బా, ఎంత చెత్త పని చేశా కీస్ తీయకుండా.
మూడో గంట – హాపీ బర్త్ డే.. డియర్.. వినిపిస్తోందా? వేస్ట్ ఫెలో..
నాలుగో గంట – వినిపించుంటుందా వాడికి? ఎదురుగా ఉండి చెప్తేనే వినిపించుకోని మాలోకం..
ఐదో గంట – నా విషెస్ కోసం కాచుకొని కూచోడుగా.. అసలే మొండిఘటం.. కూచున్నా, కూచుంటాడు..
ఆరో గంట – ఏది? నా మొబైల్ ఏది?
ఏడో గంట – వాడి నెంబర్.. ఆర్.. ఏ..
ఎనిమిదో గంట – కనెక్ట్.. కనెక్ట్
తొమ్మిదో గంట – కనెక్డ్ అవ్వూ
పదో గంట – రింగింగ్.. రింగింగ్…
పదకొండో గంట – త్వరగా.. ప్లీజ్
పన్నెండో గంట – “ఆ.. హలో..నేను! హ్యాపీ బర్త్ డే!”

5 comments

Leave a reply to kranthi Cancel reply