జరగని కథ


“గోపాలం చాలా బావుండడు.” – వాక్యం చదివీ చదివగానే కిసుక్కుమన్నాడు, చదివినవాడు.

“అలా కిసుక్కులూ, కసక్కులూ అంటూ ఉంటే పనులు జరగవు. గబగబా చదివేసి, ఏదోటి రాసేయ్య్..” అంటూ చేతికింద పనివాడు ఉండడం అలవాటులేని బ్రహ్మదేవుడు చురచురలాడాడు, “రాయమన్నా కదా అని ఉన్నదున్నట్టు రాయకు. నీ తెలివి కూడా చూపించు. తలరాతలేసుకొని కూర్చొనే మగడు దొరకటం తన తలరాత అని ఒహటే నస! జనాభా అలా పెరిగిపోయింది, నేనేం చేయను? అంటే అదీ మీ నిర్వాకమేగా అంటుంది. యు డోంట్ లవ్ మి అనీ మోర్! అనేసింది మొన్న! అందుకని నీకీ పనిజెప్పి నేను ఆ పని చూసుకోవాలి. జాగ్రత్త సుమా! జీవితాలూ..”

ప్రతీ ఉద్యోగి తన పై అధికారి మాటలు విన్నంత శ్రద్ధగా విన్నాడు కొత్త బ్రహ్మవాడు. అంతే శ్రద్ధగా వాటిని మర్చిపోయాడు. ఇలా రాసుకొచ్చాడు.

గోపాలం నుదిటన:
అనగనగా ఓ నువ్వు. నువ్వు చాలా బావుండవు. నీకో రాధ. రాధ చాలా బావుంటుంది.

రాధమ్మ నుదిటన:
అనగనగా ఓ నువ్వు. అంతకు మునుపే ఓ గోపాలం. గోపాలం చాలా బావుండడు. నువ్వు కూడా బావుండవు. (కొంచమైనా మార్చాలనీ..)

తలరాతలపై సీల్ వేసేసాడు.

పాతికేళ్ళ తర్వాత రాధా, గోపాలం కలిసారు; విధివశాస్తూ. రాధ గోపాలాన్ని గుర్తించింది. మనసిచ్చింది. గోపాలం బావుంటుందన్న బండగుర్తుతో (ఈ) రాధను చూళ్ళేదు.

కథ అయిపోయింది – జరగకుండ!

Advertisements

చిట్టి ప్రేమకథలు


(ఈ పురుగు నా మెదళ్ళోకి ఎలా చేరిందో తెలీదు – బహుశా, నా స్నేహితుడొకడు, నేను రాసినవి చదివనప్పుడల్లా, ఎకానమీ ఆఫ్ వర్డ్స్ అనేది ఒకటుంటుందని అదే పనిగా గుర్తుచేయటం వల్లననుకుంటా – గానీ, ఇలా తక్కువలో అతి తక్కువ పదాలు వాడి ఏదైనా రాద్దామా? అనుకున్నప్పుడు, ఇది (https://pisaller.wordpress.com/2011/01/06/luvs/) తట్టింది. తర్వాత అలా ఆలోచిస్తూ పోతే, ఇంకొన్ని వచ్చాయి. ప్రేమకథలే ఎందుకూ? అంటే సినిమాల్లో, పుస్తకాల్లో, జనాల్లో ఎక్కడ చూసినా అదే గోలగా.. అందుకని ప్రాక్టిస్ తేలికవుతుందని దాన్ని ఎన్నుకున్నాను. రాం గోపాల్ వర్మ కొన్ని ప్రేమకథలు అర్థం కావంటాడు. నన్నడిగితే కొన్నింటికి అసలు అర్థాలే ఉండవు. అలా కాక, జనజీవన విధివిధానాల్లో బాగా పాతుకుపోయినవే ఇక్కడ రాసా! ఇందులో మీకు తెల్సిన సినిమాలూ, పుస్తకాలూ ఉండచ్చు. చదువుతూ, చదువుతూ ఆ ఆటా ఆడుకోండి.)

*******

నాకూ ఒక ప్రేమకథ ఉంది; రామాయణం – రావణుని జాతి అంతరించినందుకు, రామునిలో రావణుడు,  అయోధ్యలోనే ఆశోకవనం.

*******

నాకూ ఓ ప్రేమకథ ఉంది; దేన్నీ కాదనలేడు – మనసిస్తే తిరగివ్వలేదు, నాది కూడా!

********

నాకూ ఓ ప్రేమకథ ఉంది; ఆత్మకథ – కవర్ పేజీపై ఆమె.

********

నాకూ ఓ ప్రేమకథ ఉంది; అక్షరాల సావాసంతో అంకురించిన ప్రేమ. నేను రాసింది ఆమెకు పంపితే, అటు నుండి వచ్చిన సమాధానం: ’వావ్! మతి పోయింది. నమ్మలేకపోతున్నా. చాలా బా రాసావ్. ఏ పత్రిక్కు పంపుతున్నావ్? ఇదో అబ్బాయ్.. నా పేరు వాడుకున్నందుకు మాత్రం పార్టీ!’ అది నా మొదటి ప్రేమలేఖ!

**********

నాకూ ఒక ప్రేమకథ ఉంది; నేను ప్రేమించాను – ఆమె పెళ్ళాడింది వేరొకరిని.

*********

నాకూ ఒక ప్రేమకథ ఉంది; ఇద్దరం ఒకటయ్యాం – ముగ్గురవ్వబోతూ ఒక్కడినే పోయాను, మిగిలి.

**********

నాకూ ఒక ప్రేమకథ ఉంది; మగ వ్యాకరణానుసారం, ’అమ్మాయి’ ఉండదు, ’అందమైన అమ్మాయే’ ఉంటుందన్న ఇంపొజిషన్ రాసాను.

***********

నాకూ ఒక ప్రేమకథ ఉంది; సత్యభామలా నన్ను తూకానికేసింది. ఏకపత్నీవ్రతుణ్ణి కాపాడ్డానికి రుక్మిణి లేదు.

***********

నాకూ ఒక ప్రేమకథ ఉంది; ఐపాడ్‍లో పాటలకు మల్లే, అతడికి సవాలక్ష ప్రేమలు. నా వంతు రాకపోతుందా అని నిరీక్షణ.

************

నాకూ ఒక ప్రేమకథ ఉంది; ఛత్.. ఐపాడ్‍లో ఎన్ని పాటలుంటే ఏం లాభం? ఆ ఒక్క పాటే లోప్ లో ఉండగా..ప్ఛ్..

************

నాకూ ఒక ప్రేమకథ ఉంది; నేనతడికి కంఠతా వచ్చిన వర్డ్స్ వర్త్ పోయెమ్ని.. అర్థమే కాను.

************

నాకూ ఒక ప్రేమకథ ఉంది; చెహోవ్ రాసిన “కిస్” కథ మలిముద్రణ దేవుడు నా నుదిటి మీద వేసాడు.

************

నాకూ ఒక ప్రేమకథ ఉంది; ఏం? హీరోయిన్ అందంగా లేకపోతే ఆడకుండా అడ్డంగా తన్నేస్తుందని భయపడ్డానికి నా జీవితమేమన్న విడుదల కానున్న తెలుగు సినిమానా?

************

నాకూ ఒక ప్రేమకథ ఉంది; పాస్‍వర్డ్ మార్చాననీ తెల్సు, కొత్తది వాడకపోతే లాగిన్ అవ్వలేననీ తెల్సు.. అయినా వేళ్ళు పాతదే కొట్టి వెక్కిరించబడతాయి.

************

మాకూ ప్రేమకథ ఉంది; అదేంటో తెల్సుకోవాలంటే వేయాల్సిన ప్రశ్న ’ఎలా కలిసార”ని కాదు. “ఎలా కలిసున్నార?”ని.

************

నాకూ ఒక ప్రేమకథ ఉంది; నాకై ఆమె ప్రేమ పొంగుతుంటే, ఎక్కడ పొర్లిపోతుందోనన్న హైరానాలో నీళ్ళందక, పిండుతున్న నిమ్మరసం చిలకరించాను. అంతే!

************

నాకూ ఒక ప్రేమకథ ఉంది; సెహ్వాగ్‍ను ఆవహింపజేసుకుంటూ మలి పరిచయంలోనే “సరి అనవా? వరమిడవా?” అంటూ గాల్లోకి లేపాను. ఫియాన్సే అట, గల్లీ లో షార్ప్ కాచ్ పట్టాడు.

*************

నాకూ ఒక ప్రేమకథ ఉంది. నేను ప్రేమన్నా, వాడు ఫ్రెండన్నాడు.  నేను ఫ్రెండన్నాను, వాడు ప్రేమన్నాడు. నేనేమీ అనలేదు. అనటానికి వాడికస్సలేం మిగల్లేదు.

*************

నాకూ ఒక ప్రేమకథ ఉంది; రెక్కలు తెగిన సీతాకోకచిలుక నా మీద వాలి, నే వేసిన మందుకు కుదుటపడుతూ, నయం అవ్వగానే తుర్రుమంది.

************

నాకూ ఒక ప్రేమకథ ఉంది; అదెందుగ్గానీ? రోజూ అదే ప్లాట్‍ఫాం. అదే ట్రైన్. కమల్ హాసన్. కానీ, శ్రీదేవెందుకు రాదు?

***********

నాకూ ఒక ప్రేమకథ ఉంది; పెళ్ళి కాకముందే విడాకులు.

***********

నాకూ ఒక ప్రేమకథ ఉంది; అతడి జీవితపు పుస్తకంలో కనీసం ఓ వాక్యమవుదామనుకుంటే, ’అనవసరం’ అంటూ ఎడిటర్ కొట్టిపారేసాడు.

***********

When your friend writes a book..


When you win, I feel like a champion! – రోజర్ ఫెదరర్ గెలిచిన ప్రతిసారి గొంతు చించుకొని మ్యూట్ గా నేను అనుకునే మాటలు.

మన ఫ్రెండ్స్ విషయంలో కూడా అలానే అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళేదో ప్రపంచాల్ని గెలిచేయాలని కాదు గాని, ఉన్న అవాంతరాలను అధిగమిస్తూ సాధించుకున్న ఏ చిన్న విజయాలైనా చాలు! అందులో మన వంతుగా కాస్త నవ్విస్తూ, కాస్త విసుక్కుంటూ, న-సాధిస్తూ, బ్రేక్‍లిస్తూ, పళ్ళు నూరుతూ, గోళ్ళు కొరుక్కుంటూ, దొంగలకలు అభినయిస్తూ వాళ్ళ చేత పనిజేయిస్తే, ప్రతిఫలంగా పని పూర్తయ్యాక ఆనందాతిశయాలకన్నా ముందు “హమ్మయ్య!” అని నిట్టూర్చటంలోని అనుభూతి తెలిసొస్తుంది. ఆ అనుభవమేదో నాసొంతం చేసినందుకు సౌమ్యకు థాంక్స్!

మా జనాభా మొత్తానికి (ఈనాడు పుణ్యమా అని నేను తెలీనివారికి కూడా) సౌమ్య తెల్సుకాబట్టి, అందరి తరఫున మూకుమ్మడి కంగ్రాట్స్!

Oh..by the way, witnessing your friend writing a book – in fact, when (s)he goes against tide to achieve something – is as thrilling as a Tendulkar’s 100th run or a Federer’s championship point! Excruciating pleasure!

అందుకని ఫ్రెండ్స్ ద్వయంలో టాలెంటుతో పాటు చేయాలన్న తపనున్న మనుషులు చెలరేగి విజృంభిస్తే, “పార్టీ.. పార్టీ!” అని గోల చేయడానికి మాబోటివారలం సర్వసన్నద్ధం అని సభాముఖంగా తెలియజేస్తున్నాం.

వెదురు ముక్కలమ్మా.. వెదురు ముక్కలు!


నా కృష్ణుడెవ్వరో నాకు తెలీకపోవటం నాకున్న శాపమేమో! నాణేన్ని అటు తిప్పితే ఈ తెలీకపోవటమేదో కూడా నాకు అనువుగానే ఉంది. వాడి పుట్టినరోజును మర్చిపోతానన్న హైరానా అక్కర్లేదు. అత్యుత్తమైనదేదో బహూకరించాలన్న తపస్సూ చేయనవసరం లేదు. బుద్ధి పుట్టినప్పుడు వాడే అటకెక్కి చూసుకుంటాడు. ఆనక, వాడి చిత్తం, నా ప్రాప్తం!*

(బాగా రాయగలిగే చాలామంది, రాసుకునేందుకు ఇష్టపడతారుగాని రాయడానికి జంకుతారు. ఆలోచించినప్పుడల్లా, వాళ్ళకున్నంత కార్యదక్షత, ఓపిక, పరిశ్రమించే గుణం నాకు లేవనుకున్నాను. అనుకుంటున్నాను. అయినా ఇంకా జంకురాదే? ఎవరేమనుకుంటారోనన్న భయంలేదే? బహుశా, అటకెక్కిన వేణువులకన్నా, వేణువు తయారీలో ఉన్న అద్వితీయానందం.. నాకు మాత్రమే సొంతమైన ఆనందం, అనుభవించేశాక, అంతటి ఆనందాన్ని ఇచ్చిన వాటిని మూలపడేయబుద్ధికానందుకేమో?!)

నోట్: మా బాపూ గీసిన అందమైన బొమ్మను ఖూనీ చేస్తావా? అని కయ్యానికి రాకండి. ఇవిగో, ముందస్తుగానే నా క్షమాపణలు!

*ముళ్లపూడి ’కానుక’ కథ చదవనివారికి, నాలోని తిక్క తెలియనివారికి ఈ సొద అర్థం కాదు. నవ్వుకోడానికీ, నవ్వడానికీ అనుమతి ఇవ్వబడింది. 🙂

School teacher


నిన్న సాయంత్రం మీ అమ్మగారు నాతో మాట్లాడారు. నేను నీ గురించి ఏమేం వింటున్నానో తెల్సా? నువ్వసలు సరిగ్గా తినడం లేదంట, ఇంట్లో? పావని వాళ్ళు నువ్వు స్కూల్లో కూడా తినడం లేదని చెప్తున్నారు? రోజూ బాక్స్ అలానే పట్టుకెళ్తున్నావ్ అట? ఏంటి నీ సమస్య? డైటింగ్?

ఆడపిల్లంటే అందంగా కనిపించాలని నూరిపోస్తారు గాని, ఆరోగ్యం లేనిదే అందమెలా వస్తుంది? లావుగా ఉన్నా ఆరోగ్యంగా ఉంటే అదో నిండుతనం. సన్నగా, పాలిపోయి, పీక్కుపోయినట్టుంటే ఎవరూ మొహం చూడరు. తినాలి. బాగా తినాలి. అంతగా లావైపోతానని బెంగైతే, బాగా తిని, బాగా గెంతులెయ్య్! మళ్ళీ తిను. మళ్ళీ ఎగురు. అంతే కాని, కడుపు మాడ్చుకోకు. ఇది తినాల్సిన వయసు.

అయినా, ఒకటి అడుగుతా చెప్పు.. do you wanna give birth to at least one baby? Yes? అది కావాలనుకుంటే బలంగా ఉండాలి. బోలెడు శక్తి కావాలి. ఇప్పుడు సినిమాల్లో, హీరోని విలన్ కాల్చేస్తుంటే, హీరోయిన్ అడ్డెళ్ళి బులెట్ తగిలి చచ్చిపోతుంది? అది నథింగ్ అసలు, when you can give your man, his baby! You wanna go through that phase, then stop dieting and start eating! ఇంకోసారి డైటింగ్ అన్నావంటే అసైన్మెంట్‍లో మార్క్స్ కట్ చేసేస్తా!

************

పావని మీద నీకెందుకు కోపం వస్తోంది? నువ్వు తనకి చాలా క్లోజ్ కాబట్టి, తనో అబ్బాయిని ఇష్టపడుతున్నట్టు నీతో షేర్ చేసుకుంది. అందులో నువ్వు అప్‍సెట్ అవ్వాల్సింది, ఏముంది? మీరున్న వయస్సులో ఇలాంటి స్నేహాలు చాలా కామెన్. మన ఇళ్ళల్లో ఇలాంటివి ఒప్పుకోరుగాని, ఆకర్షించడం – ఆకర్షింపబడ్డం ఈ వయస్సులో సహజం. వాటి మత్తులో పడి చదువులు నాశనం చేసుకోవడం తప్పు గాని, పెద్దవాళ్ళకు తలనొప్పిగా మారటం తప్పు గాని, అసలు అబ్బాయిలంటే అసహ్యించుకోవాలని ఏముంది? వాళ్ళతో హద్దులు మీరని స్నేహాలు చేస్తే తప్పేంటి? Loving or seeking love, as such, is not a derogatory act. But yes, దాని వల్ల విపరీత పరిస్థితుల్లో చిక్కుకోకుండా ఉండగలగాలి.

Also, friendship, to that matter any relationship, is like reading a book while its being written. మొదట్నుండీ చివరదాకా చదివేసి, బట్టీయం వేసేసి ’అంతా తెల్సు’ అన్నట్టు వ్యవహరించడానికి మనుషులేం అచ్చైన పుస్తకాలు కాదు కదా! ’జరిగిన కథ’ మాత్రమే తెల్సు మనకు. దాన్ని బట్టి ’జరగాల్సిన కథ’ ఇలా ఉండాలని నిర్ణయించేసుకొని, అవతలి వాళ్ళు అలానే ఉండాలని ఆశ పెట్టుకోవటం తప్పు. కొన్ని రోజుల్లో పావనికి అయితే పట్టరాని సంతోషం, లేదా తట్టుకోలేని దుఃఖం రావచ్చు. ఆ రెంటిలోనూ, ఒక ఫ్రెండ్‍గా నువ్వు తోడుగా ఉండాలి.

************

 “అందంగా లేకపోతే ఎవరూ ప్రేమించరా? ఎవరు చెప్పారు నీకు? నన్ను ప్రేమించారే..”

“You ARE beautiful, Ma’m.”

“ఆగు. ఆ వాక్యం నిజం అనిపించుకోడానికి కొంత సరిచేయాలి. ’You’re beautiful, to me, Ma’m!’ నీకందమైనది నాకు కాకపోవచ్చుగా! Beauty is in… ”

“the eyes of the beholder Mam!”

*************

 “మీకు తెల్సా ఇవ్వాళ బైయాలజీ క్లాస్ ఎంత క్రేజీగా ఉండిందో? చచ్చిపోయాం.. టాపిక్ ఏమో, హ్యూమెన్ అనాటమీ! Naked man and woman chart hanging on blackboard. మేడమేమో, ’చూడండి, ఇటు చూడండి’ అంటారు. మేమేమో డెస్క్ ల్లోకి తలలు దూర్చేసాం.

“పూర్ శోభా మా’మ్! ఎంత ఇబ్బంది పెట్టామో ఈ రోజు. అసలావిడ ఏం చెప్తున్నారన్నదానికి సంబంధం లేకుండా ముసిముసి నవ్వులు. Reproduction గురించి చెప్పడానికి ఆవిడ, “when a dog, wagging its tail, approaches an another dog!” అని మొదలెడతారు. పూజ లేచి, “Why always dogs? Why not a man and a woman?” అనడుగుతుంది.”Yes Ma’m.. dogs are boring! ఊహించుకోడానికి యక్‍గా ఉంది..” అని నందిని.

“మేడం నవ్వుతూ, “ఒక ఐదారేళ్ళు ఆగండి. నాకన్నా బా చెప్పేవాళ్ళతోనే చెప్పించుకోవచ్చు” అనన్నారు. అంతే! అర్థం కాని వాళ్ళు బిక్కమొహాలేసారు. అయిన వాళ్ళల్లో చాలా మంది, “ఛీ!” అంటూ సిగ్గుపడిపోయారు. ఇంతలో విద్య లేచి, “అవి ప్రాక్టికల్స్ మామ్! థియరీ ముందవ్వాలిగా!” అని.. ఆ సరికి శోభా మేడం కూడా గట్టిగా గట్టిగా నవ్వేస్తున్నారు. అలా కాసేపు నవ్వి, “అబ్బాయిలకీ ఈ లెస్సెన్స్ చెప్పాను నా సర్వీసులో! బుద్ధిగా వింటారు వాళ్ళు. ఇలా అల్లరి చెయ్యరు. ఈ క్లాసులో ఓ పదిమంది అబ్బాయిలుండుంటే, ఈ పాటికి పారిపోయేవాళ్ళు! I pray for the well being of boys in your life..”

************

“సిలబస్ అయ్యిపోతోందిగా.. టీచర్లందరూ, మెసేజ్‍స్ ఇస్తున్నారు. ఎప్పుడూ తిట్టే తెలుగు టీచర్, “అమ్మాయిలన్నాక గలగలా మాట్లాడుతూ, కిలకిలా నవ్వుతూ కళకళాడుతూ ఉండాలి. వాగటం మానకండి. నవ్వటం ఆపకండి. హాయిగా, ఆనందంగా ఉండండి.” అన్నారు. ఎప్పుడూ క్లాసులో గోలగా ఉంటామని తిట్టే ఆవిడ!

“హిందీ టీచరేమో.. “तुम लोगों को दुल्हनॊ की तरह सजाया हम! दुनिया ससुराल है.. जरा सम्भल्के” అని అన్నారు.

“మాథ్స్ టీచర్, “ఏదైనా చేయండి.. కానీ ఎంజాయ్ చేస్తూ..” అనీ.. “ఇలా ఒక్కోరూ, ఒక్కోలా! బాధగా ఉంది, వదిలిపోవాల్సి వస్తున్నందుకు.”

“ఎప్పుడూ ఒకే phaseలో ఉంటే ఎలా? Transitions are as beautiful as phases themselves.

You just gotta have an eye for them!”

**************

 వావ్! You’re in love! Congrats, my gal! మనల్ని ప్రేమిస్తున్నారా? కన్నా కష్టమైన ప్రశ్న, మనం ప్రేమిస్తున్నామా? అని తేల్చుకోవటం.ఒకటి మాత్రం చెప్పగలను. మీ షారుఖ్ ఖాన్ సినిమాలోల్లా మాత్రం ఉండదు.

అందరికీ ఇలానే ఉంటుందని కాదు గానీ, నా అనుభవంలోవి చెప్తాను. ఇవ్వన్నీ కవులు బా రాస్తారు గాని, అవి కాక, నాకు ముఖ్యమనిపించినవి. అతను నిన్ను చూసినప్పుడు, నీలోని ప్రత్యణువూ నువ్వు ఆడదానివని నీకు గుర్తుచేస్తాయి. నీకిష్టం లేనివాడు నిన్నలా చూస్తే, పెట్రోల్ పోసుకొని కాల్చుకున్నట్టు అనిపిస్తుంది. కాని, అతడొక్కడు చూసినప్పుడు మాత్రం, you feel woman! అతడు నిన్ను విసిగించినప్పుడల్లా చాలా తిట్టుకొని, వీలైతే నాలుగు తన్నాక, చివరకు అతణ్ణి ముద్దు చేయాలనిపిస్తుంది. అతడు నీ కళ్ళముందుంటే చెప్పలేని ఊరట. కనపడకుండా ఉంటే కొంపలంటుకుపోయినట్టుటుంది. ముఖ్యంగా, అతడికి బాధ కలిగిన ప్రతి క్షణంలో, అతని కన్నతల్లి నువ్వైనట్టు నీ మనసు కొట్టుకుంటుంది. Wife is the first daughter for a man అననటం విన్నాను గాని, the opposite is equally true! అని నాకనిపిస్తూ ఉంటుంది.

మనమీద ఎంత ప్రేమ ఉన్నా, మనం అదే పనిగా ప్రేమ గుమ్మరిస్తూ పోతే చిరాకేస్తుంది అవతలి వాళ్ళకి. ఎప్పుడు, ఎలా, ఎంత ప్రేమించాలో, ఇంకెంత దాచుకోవాలో తెలీటమే ప్రేమలో అసలు కిటుకు.

ఐఐటిల్లో చదవడానికే తీరికుండదనుకున్నా.. ప్రేమ అన్ని సిలబస్‍ల కన్నా taxing! Do take care.

Love.

Vaishnavi

*****************

 Ma’m,

ఇక్కడికొచ్చే ముందు, లాప్‍టాప్ గురించి అతనూ, నేనూ చాలా గొడవపడ్డాం. ఇక్కడ కూడా దాన్నేసుకొని కూర్చుంటాడేమోనని నా భయం. అర్రె.. మొత్తంగా కమ్యూనికేషన్ కట్ అవ్వటం దేనికి? అవసరం పడితే? అని అతడు. Glad, he won the argument. Thanks, I’m writing to you at this odd hour.

I feel like I’m born afresh. ఇప్పుడే పుట్టిన పసిపాపలా కేర్ కేర్ అని ఏడ్వాలని ఉంది. పట్టరానంత ఆనందంగా ఉంది. Exhausting. Excruciating. Exhilarating. తట్టుకోలేకపోతున్నాను.

ఇప్పుడర్థమవుతోంది.. ఎందుకు మనిషి సృష్టించిన ప్రతి కళలోనూ, మనిషి కనే కలల్లోనూ దీనికింత importance అన్నది అర్థమవుతోంది. చెప్పుకోడానికి చాలా dirty. అనుభవిస్తే మాత్రం డివైన్! ఓ గాడ్..

నాకు మీరు తప్ప ఎవరూ గుర్తురాలేదు, ఈ మూమెంట్‍లో! సో..

లవ్,

రాధిక.

పి.ఎస్: ఇంతకీ అసలు విషయం, I came to know what happens when a dog.. err.. when a man comes closest to a woman.. 😛 😉

***************

 Ma’m.. Sorry for the awful lot of delay to this mail! Neck deep at work and then, this raakshasi at home! Sucks my energy completely.

పిల్లల్ని కనటానికి ఓపికేమో గాని, పెంచటానికి ఇంకా టన్నుల కొద్దీ బలం కావాలి. చచ్చిపోతున్నాను, దీనితో వాగలేక. వేగలేక. She’s such a bundle of energy! And, however hard I try, I can never match her! వాళ్ళ నాన్నతో ఎంత బాగుంటుందో! నన్నే! షటిల్ ఆడ్డం మానేసాను. నో జిమ్! అయినా ఫుల్ వర్క్-అవుట్! ఆఫీసులో ఉన్నంత సేపే.. ఆ తర్వాతంతా దీనితోనే..

హమ్మ్.. ఇంతకీ అసలు విషయం. ఇండియా రావటం ఖాయమైంది. కాని డేట్స్ తెలీదు. మిమల్ని కలవకుండా మాత్రం వెళ్ళను. ఎప్పుడు వస్తున్నదీ ముందుగా చెప్తాను..

I’ve to rush.. bye!

Love.

Radhika

స్పందన


ఏంటలా పరగ్గా వెళ్ళిపోతున్నారు? నేనున్నాని గమనించరేం? పొరపాటునైనా?

సర్లేండి. పదండలా నడుస్తూ మాట్లాడుకుందాం. ఆకాశం చెక్కిలి మీద ఎరుపెలా తేలిందంటారు? ఎవర్ని కలవబోతున్నందుకో ఆ సిగ్గులకెంపులు? సంద్రాన్ని చూడండి.. ఏరి? అలా బిగుసుకుపోతారేం? ష్… జాగ్తత్తగా వినండి. కిశోర్ కుమార్ వద్ద ఏకలవ్య శిష్యరికం చేసినట్టు, గాలి ఈలలేస్తోంది. మీ పరధ్యానం మీదేనా? అవున్లే, మీ పరధ్యానం మీది కాకపోతే నాదవుతుందా? పదండి, మీరెటు పోతే, నేనూ అటే..

నిర్మానుష్యపు వీధిలో మానవాకరం. అటు తిరిగి నుంచున్నారెవరో? స్త్రీ? అవును.. స్త్రీయే! అదో పైట. ఆవో కురులు. గాలందిస్తున్న లయకు తాండవిస్తున్నాయి. ఈ వేళలో, ఇక్కడ? ఎవరై ఉంటారు? చూద్దామా? నాలుగడుగులు వేసిన పుణ్యానికే, ప్రసాదంగా ఆమె పరిమళ సుగంధం! ఒక్క క్షణం ఆగండి.. ఆఘ్రాణించమనీ చెప్పాలా? చోద్యం కాకపోతే?! ఇదేమిటి? అపశృతి. ఏడుపు. ఎవరిది? మనిషిదే! అంటే ఆమెదా? ఆ ప్రశ్నార్థకం అనవసరం. పదండి..పదండి.. ఆడకూతురికి ఏ ఆపదొచ్చిందో ఏమిటో? ఏమయ్యిందో కనుక్కోండి. అపరిచితమేలెండి. కాదనేవారెవ్వరున్నారని? అందుకని? పట్టించుకోరా?! సాటి మనిషి బాధలో ఉంటే.. ఆ, ఈ ఊపిరితిత్తుల మధ్య గుండెకాయని ఒకటుంటుందే మనుషులకూ? “మనిషేనా?”అనడిగితే పొడుచుకొస్తుందిగా! అందుకే. ఆమె ఊరుకోవటం లేదే?! అసలు విషయమేమయ్యుంటుందో?!

అడగండి. ఆగండి. అడగమంటే అదిలించి, బెదిరించమని కాదు. కాస్త సౌమ్యంగా. కష్టంలో ఉందాయె! బావిలో నీళ్ళు తోడినట్టు, భళ్ళున కాదు. కన్నీటి చుక్కకూ, చుక్కకూ మధ్య మీ ఆర్ద్రత వాక్యమైపోవాలి. నిట్టూర్పుకీ నిట్టూర్పుకి మధ్య కథ ఒదిగిపోవాలి. స్వామీ.. ఆడపిల్లా, ఆ పై కన్నీరు అని చేతులు నలుపుకుంటూ కూర్చుంటే, అవతల మనిషి ఏ అగత్యానికో ఒడిగడితే?! సంశయాలకు కూడని సమయం. అడుగేయండి. అడిగేయండి.

తెల్సుకొచ్చారా? ఏంటట? విరహోత్కంఠిత? అనుకున్నానులే వాలకం బట్టి. వివరాలడిగారా? చెప్పిందీ! చెప్తుందిలే! చెప్పకేం చేస్తుంది. దాచాలనుకున్నవన్నీ దాగవు కదా! కొన్ని చెప్పుకోడానికి అయినవాళ్ళకన్నా అపరిచితులైతేనే అన్ని విధాల మేలు. ఓహో. ముందు తమరి జాతకం తెల్సుకున్నాకే మనసు విప్పిందా? ఎందుకట? అబ్బో, వడపోతలే?! పరిచయమే?! ఆర్చి రమ్మంటే వార్చొచ్చావా, నాయన? (మనది మాత్రం నాలుగు పేరాల అనుబంధం కాదేంటి? ఆ మాత్ర్రం చనువు నాకు లేదేంటి?)

***********

హలో..అబ్బాయ్! ఏం కథ? ఇవ్వాళ పరాగ్గా కాక, కంగారుగా ఉన్నావ్? పద.. ఈ రోజు ఇంకో తీరానికేసి నడుద్దాం. అక్కడ, నుస్రత్ ఫతె అలీ ఖాన్ కంఠంలా వీస్తుంది గాలి. దా.. పోదాం? ఓయ్య్.. నేను మాట్లాడుతూనే ఉన్నా, ఎటెళ్ళిపోతున్నావ్? నిదానంగా.. ఎవరో లాగుతున్నట్టు, పరాధీనంలో ఉన్నట్టు..? వినిపిస్తోందా? హలో.. హలో?

***********

’ఆమె వచ్చేస్తుంది. వచ్చేస్తోంది.’ – ఆఆ.. ఏంటా తత్తరపాటు? ఎవరామె? ఎందుకు వస్తోంది? ఏంటీ చెమ్మ? కన్నీళ్ళే? ఇన్నే? నీవే? హయ్యో.. ఇప్పుడేమయ్యిందని? ఆమెవరు? బేరం బెడిసికొట్టిందా?

నువ్విలా విలవిల్లాడితే నాకూ ఏం తోచదు. దా.. ఇలా తలవాల్చు. కాస్త ఊరడిల్లు. అసలేం జరిగింది?

ఆమె. ఆ రాత్రి. ఓ గుప్పిట మూసి, తదేకంగా చూస్తూ భోరుమంటూ ఉంది. ఏం జరిగిందని అడిగాను. పట్టుకోలేకపోతున్నా, పట్టువదల్లేకపోతున్నా అంది. విలువైంది. చేజార్చుకోకూడనిదంది. మూసున్న గుప్పిట కంపిస్తోంది. నా చేతులు మీకన్నా పెద్దవనంటూ, నా దోసిట్లో ఆమె గుప్పిట ఒదిగేలా ఏర్పాటు చేసాను. చేతిలో చేయి. భుజానికి భుజం. ఆమె పైట్ నా మొహం మీద రెపరెపలాడగానే, మనసు ఇళయరాజ సంగీతం విన్నట్టు తాద్మాత్యం చెందింది. నా గుండె దూదిపింజెలా ఎగిరిపోతుంటే, పట్టుకోడానికి, ఒక చేతిని వెనక్కి తీసుకున్నాను. ఎందుకనడిగింది. చెప్పేసాను. సంగ్ధిధావస్థనుండి తేరుకొని, బహుశా, నేను నీదాన్ననంది. ఒంటిచేతిలో ఉన్న ఆమె గుప్పిటకు పూర్తి సంరక్షణ అందించే బాధ్యతనెత్తినేసుకొని, రెండో చేతిని (గుండె ఉందందులో) తెచ్చి, ఆల్చిప్పను మూస్తున్నట్టు అరచేతి మీద మరో అరచేయిని బోర్లించబోతుండా.. ఆ కంఠం వినిపించింది. ఆమె ఎగిరిపోయింది. నా గుండె చేజారిపోయింది..

హతవిధీ! ఎంతటి కష్టం? పగవానిక్కూడా వద్దీ కష్టం. పాపిష్టిదాన్ని, ఆ పూట నిను అటువేపుగా తీసుకెళ్ళకపోయుంటే..

అవును. ఈ పాపం నీదే! నా గుండెలో చిచ్చుకు కారణం నువ్వే. ఏం చేసానని ఈ శిక్ష? ఎందుకు నాపై కక్ష?

అన్నావూ?! ఎప్పుడెప్పుడంటావా? అని కాచుక్కూచున్న. నన్ను తోలుబొమ్మకి కట్టిన తాళ్ళనుకో, అచ్చైన కథలో మరి సరిచేయలేని వాక్యాలనుకో, నిను వీడని నీడనుకో, లేక నీ బుద్ధనుకో.. నువ్వెక్కడెక్కడు పోయి, ఏమేం నిర్వాకాలు చేసుకొచ్చినా, వాటి పర్వవసానాలు ఎంత విపరీతంగా ఉన్నా, నువ్వు బతికినన్నాళ్ళూ నాతోనేగా ఉండాలి, ఊరడిల్లినా, ఊసురోమన్నా! ఊరుకో.. ఏడ్వకు.

గాయమన్నాక, గాయమంటూ అయ్యాక మానకుండా ఉండదుగా. మరుపు మనిషికున్న గొప్ప వరం. కాలం ఎటూ మందేయకుండా ఉండదు. వికటించిందే అనుకుందాం. అన్నాళ్ళు అలవాటయ్యాక, కొత్తేముంటుంది? పీడలందు మధుర పీడలు వేరయా అని నువ్వు వేదాంతం గుమ్మరించకపోతావా? నేను వినకపోతానా?

ఇదో.. ఇలా వచ్చి కాస్త కుదుటపడు. పడ్డానికి ప్రయత్నించు. వెక్కి వెక్కి ఏడ్చావ్‍గా, ఇంకా ధార ఆగిపోతుందిలే! నువ్వు కాసేపు అలా పడుకో, ఈ లోపు కన్నీళ్ళు ఊరతాయి. మెలకువతోటే కొత్త కన్నీరు.

జో అచ్యుతానంద.. జో జో ముకుందా..

(ఈ పైత్య ప్రకోపానికున్న నేపధ్యం. నిన్న మళ్ళీ వైట్ నైట్స్ చదివాను. ఎంత చెడ్డా, సంజయ్ లీల బన్సాలీ అంత కాదన్న ధైర్యంతో ఇలా! మూడేళ్ళ క్రితం నాకీ రచన పరిచయంచేసి, ఈ-పుస్తకం ఇచ్చినవారికి థాంక్స్!)