Sweet Dream.

’తల్లీ, నేను మహా సంతోషంగా ఉన్నట్టు. మనం కలిసి కులాసాగా కబుర్లాడుకుంటున్నట్టూ స్వీట్ డ్రీమ్స్ కనచ్చుగా, నాయందు దయుంచి. గుడ్‍నైట్!’

నా కలత నిద్రతో వేగలేక నిద్రచాలని కళ్ళతో కొంచెం విసుక్కుంటూ, కొంచెం ముద్దుచేస్తూ నువ్వన్న మాటలు. నువ్వెప్పుడూ నా కళ్ళముందే ఉంటున్నా నువ్వు తప్పిపోయావన్న కలలే. నీకేదో అయిపోతున్నట్టూ, చూస్తూ కూడా నేనేం చేయలేకపోతున్నట్టూ, నా చేతిలో నుండి నువ్వు చేఆరిపోతున్నట్టూ.. గుండె దడదడమనేలా, నోరు పిడచకట్టుకుపోయేలా, కాళ్ళూ చేతులు ఆడక, కలలో పెడుతున్న కేకలు పైకి మూల్గులై నీ నిద్రను చెడగొట్టేవి. నన్ను దగ్గరకు తీసుకొని, అనునయిస్తూ ’Just a dream. It’s ok. Now, calm down, my gal! See, I’m good.’ అనేవాడివి. నీ లాలనలో నాకెప్పుడో నిద్ర పట్టేసేది. నీకు మాత్రం జాగారమే!

గాల్లో వేలాడుతున్నప్పుడే పడిపోతామేనన్న భయం. నేలమీద పాదాలు ఆనాక, ఇంకా వేలాడుతున్నామన్న భ్రమ కలిగించుకోవచ్చునేమో గానీ, భయం మాత్రం వేయదు.

ఇప్పుడు నావన్నీ స్వీట్ డ్రీమ్స్! నా కలలోకి నువ్వే వస్తావ్. బోలెడు కబుర్లు చెప్తావ్. నవ్విస్తావ్. ప్రేమిస్తావ్. నిజం. నిన్న రాత్రి కల చెప్పనా, కావాలంటే?

ఎక్కడో పబ్లిక్ ప్లేస్‍లో మనం ఎదురుపడతాం. నువ్వు నన్ను గుర్తుపట్టి నవ్వుతావ్. గుండు కొట్టించిన కొన్ని వారాలకు మొలిచిన వెంట్రుకులతో, అలవాటులేని గెడ్డంతో ఉన్న నిన్ను నేను పోల్చోలేకపోతాను. నీ నవ్వు అది నువ్వే అని రూఢీ చేస్తుంది. కలసిన కళ్ళను బలవంతంగా దారి మళ్ళించటానికి నేను ప్రయత్నిస్తుంటే, నువ్వు అప్యాయంగా పలకరింస్తావు. పొడిపొడి సమాధానాలిచ్చి తప్పించుకోవాలని ప్రయత్నిస్తాను. కుదరదు. కబుర్లాడుకోడానికి పక్కనే ఉన్న కాఫెలోకి వెళ్తాం.

పైకి సరదాగా అనిపిస్తున్నా నీ వాలకం నాలో అనుమానాలను కలిగింపజేస్తుంది. సంభాషణను దారి తప్పించటానికి నువ్వు ప్రయత్నిస్తావు. నీ గాయాలని వివస్త్రంగా చూసే నా పాడు అలవాటు! సూటిగానే అడుగుతాను అడగాల్సింది, లాండ్‍-మైన్ మీద అడుగు వేసినట్టు. జవాబుగా ఒక భారీ విస్ఫోటనం జరుగుతుందని, అందులో నువ్వూ, నేనూ కొన్ని లక్షల ముక్కలమైపోతామని నాకు తెలీక కాదు. అలా పోయాక కూడా మళ్ళీ మనం మామూలుగా అయిపోగలమని నా నమ్మకం. ఆశ్చర్యంగా, ప్రశ్నను దాటవేసే ప్రయత్నాలు చేయకుండా నువ్వు నా చేయి పట్టుకొని మెల్లిగా చెప్పటం మొదలెడతావు. కాసేపటికి నోట మాట పెగలక, కంటనీరాగక నీలోని అగ్నిపర్వతాలేవో బద్దలవుతున్న వేళ నేను నిన్ను గట్టిగా పట్టేసుకుంటాను. నిన్ను కాపాడడానికో, లేక నీతో పాటు నేనూ చెల్లాచెదురు అయిపోవటానికో? చిత్రంగా, లాండ్‍ -మైన్ బద్దలవుతుంది, కానీ మన ఇద్దరికి ఏమీ కాదు. గండం గడిచాక నీ తల నిమిరితే, నాకు వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చే నీ చిర్నవ్వు ప్రాప్తిస్తుంది.

Such a sweet dream! కలలో నువ్వు అరువిచ్చిన నవ్వు ఇంకా నా పెదాలపైన ఉండగానే మెలకువ వస్తుంది. జరిగినదంతా కలని తెలుస్తుంది. నువ్వు లేవనీ, రావనీ వాస్తవం నన్ను ఏడిపిస్తుంది. కాసింత ఊరటనివ్వడానికి నా బుర్ర పన్నిన ఉచ్చు ఆ కలని అర్థమవుతుంది. నేను నన్నే మోసం చేసుకుంటూ, నువ్వు ఎక్కడో హాయిగా, ఆనందంగా ఉన్నావనీ భ్రమిస్తూ, నటిస్తూ జీవితాన్ని గడిపేస్తున్నానని నిరూపించబడుతుంది. మంచం మీద నుండి లేచి మొహం కడుక్కోడానికి బాత్రూంలోకి పోతే, అద్దంలో నా మొహం నాకే అసహ్యమనిపిస్తుంది. ఎన్ని సినిమా డైలాగులు కొట్టాను. ఎన్ని కవిత్వాలు కూసాను. తీరా నువ్వు దూరమవ్వగానే.. చూడూ… tailor made for good health కలలు కంటున్నాను. Packaged sweet dreams!

అయినా, పీడకలని దేన్ని అనాలి? భయపెట్టి, వణికింపజేసి మెలకువ రాగానే మొహం కడుక్కుంటే మరుపుకొచ్చేసే కలనా? లేక ఊరడించి, మాయజేసి, రెప్ప తెరుచుకోగానే ఇచ్చిన ఆనందాన్ని నిర్దాక్షిణ్యంగా లాగేసుకోవడమే కాక, మరుగున పడుతున్న గతాన్ని తిరగతోడే కలనా?

Advertisements

One comment on “Sweet Dream.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s