irctcయాడు వింత నాటకమ్ము..


రైలు కదలటం మొదలెట్టింది. అతడి కళ్ళల్లో ఇంకా ఆశ, ఆమె వస్తుందేమోనని..

***

irctc.co.inలానే విధి కూడా బలీయమైనది. ఆ విధే ఆ అమ్మాయిని, అబ్బాయిని కలిపింది.

కాంపస్ రిక్రూట్‍మెంట్లంటే అంత. మనమేం రైలు ఎక్కుతున్నాం?, అది ఎప్పుడు బయలుదేరుతుంది?, ఎక్కడెక్కడ ఆగుతుంది?, ఎక్కడికి చేరుకుంటుంది?, ఎన్నాళ్ళు ప్రయాణిస్తుంది? మొదలైన వివరాలేమీ అక్కర్లేదు. ఫలనా టైంకు, ఫలానా ప్లాట్‍ఫారం ఒకటే బండగుర్తు చాలు. వాళ్ళిద్దరూ ఒకే ప్లాట్‍ఫారంపై కూర్చొని ఎంతో సేపు “ఆఫర్” అనే టిక్కెట్టు పట్టుకొని “ఉద్యోగమ”నే రైలు కోసం ఎదురుచూశారు, ఒకళ్ళ గురించి ఒక్కళ్ళకి తెలీకుండా. ఎట్టకేలకు రైలొచ్చాక ఎదురెదురు సీట్లలో కూర్చున్నారు, ఒకరినొకరు పలకరించుకోకుండా! చూపులు కలుస్తున్నా నవ్వులు పుట్టలేదు. ప్రయాణం అలా జరుగుతుండగా..

“ఉద్యోగం” రైలు ఆగిపోయింది, ఆగాల్సిన అవసరం లేని చోట. “ఏదోలే!” అనుకున్నారంతా! ఊరుకున్నారు. బండి మాత్రం ఎంతకీ కదల్లేదు. “ఇంజిన్ ఫెయిల్” అని గాలి కబురు మోసుకొచ్చింది. ఉసురోమన్నారంతా. ఊరికే ఉన్నారు. సమయం ఆగుతుందా? తిండికి, నీటికి కూడా సమస్య మొదలైంది. “పర్లేదు.. బాగయిపోతుంది” అన్నారు కొందరు. “దీనికన్నా కాలినడక త్వరగా చేరుకుంటాం.” అన్నారు ఇంకొందరు. ఆమెకేమీ పాలుపోలేదు. అతడు మాత్రం బింకంగానే ఉన్నాడు. ఆమెకు ఆశ్చర్యమేసింది. అతడిపై అనుమానం కలిగింది. ఆపై నమ్మకం కుదిరింది. వారిద్దరి పరిచయం, వైయా స్నేహం, ప్రేమ మజిలి చేస్తున్నప్పుడెప్పుడో “ఉద్యోగం” బండి కూడా గాడిన పడి, వేగమందుకుంది.

ప్రేమంటే సికింద్రాబాద్‍కు ముందొచ్చే మోలాలీ స్టేషన్ లాంటిది. “ఆల్మోస్టు వచ్చేశాం” అని అనుకోడానికేగానీ, వచ్చినట్టు లెక్కకు రాదు. అక్కడివరకూ ఎంత సూపర్‍ఫాస్ట్ గా వచ్చినా, ఇక్కడికి వచ్చాక లైన్‍లోకి రావాల్సిందే!
వీళ్ళిద్దరకి స్కూలు, కాలేజీలకు ఇంట్లోవాళ్ళే రిజర్వేషన్లు చేశారు. ఉద్యోగానికి కాలేజివాళ్ళు చేశారు. కానీ ప్రేమించుకున్నాక “పెళ్ళి” అనే రైలెక్కడానికి వీళ్ళిద్దరూ స్వయంగా పూనుకోవాల్సిన అగత్యం. వెరసి వీళ్ళిద్దరి టికెట్లూ వెయిటింగ్ లిస్టులో..

అతడికో అక్క. ఆమెకు సంబంధాలు కుదరటం లేదు. అది అయితే గానీ ఇతడి టికెట్ “కన్‍ఫర్మ్” కాదు.
ఆమెకో చెల్లి. చెల్లికి పెళ్ళి. ఆమె టికెట్ ఇక “కన్‍ఫర్మ్” అవ్వక తప్పని పరిస్థితి.

ఎన్నో యుగాలుగా ఇట్లాంటి జటిల సమస్యలకు తోచిన పరిష్కారాలు ఇస్తూ విసిగిపోయిన విధి, irctcకే వీటిని ఔట్‍సోర్స్ చేయటం మొదలుపెట్టింది.

“partial waitlist అంటే?”, “ఒకరి టికెట్ కన్‍ఫర్మ్ అయ్యి, ఇంకొకరిది కాకపోతే? ఇద్దరినీ పంపుతారా?” — చాలా తర్జనభర్జనలు జరిగాయి. వీల్లేనప్పుడు ఎవరి జుట్టు వాళ్ళు, కుదిరినప్పుడు ఒకరి జుట్టు ఒకళ్ళు పీక్కున్నారు.

“ఎవరి టికెట్టు కన్‍ఫర్మ్ అయితే వాళ్ళే వెళ్ళాలట – మిగితా వాళ్ళకి నో ఛాయిస్ అట – అలా ఎలా కుదురుతుంది? – పోనీ నువ్వెళ్ళిపో – మరి నువ్వు? – నా చావు నే చస్తా – మరప్పుడు కల్సిబతుకుదామని ఎందుకన్నావ్? – బుద్ధి గడ్డి తిని! – ఇహ అదే గడ్డి నా బుద్ధి తినదులే” మాటామాటా పెరిగింది. గొడవ జరిగింది.

గొడవయ్యాక తలపట్టుకొని కూర్చున్నాడు అతడు. ఆమె అలా నిలవలేకపోయింది. రుసరుసలాడుతూ వెళ్ళి, చరచరా తన టికెట్టు కాన్సిల్ చేసేసింది.

***

రైలు స్టేషన్ను ఎప్పుడో దాటేసి సిటి బయటకు వచ్చేసింది. ఊపందుకున్న రైలులో నుండి దూకేయ… రైలు తలుపులు వాటంతటవే మూసుకుపోయాయి. ఆర్.ఎ.సి టిక్కెట్టు మీద ప్రయాణిస్తూ, బెర్తు లేక టాయిలెట్ల కంపు దగ్గరే కూర్చున్న ఓ పెద్దమనిషి అతడి అయోమయాన్ని చూసి ముసిముసిగా నవ్వాడు. “ఈ రైల్లో ఎక్కటం నీ చేతుల్లో – ఉన్నట్టు అనిపించినా – లేనిది. ఈ రైల్లోంచి దిగటం, దూకటం కూడా నీ చేతుల్లో లేనివి. దొరికింది జానాబెత్తుడు జాగానా? లేక రాయల్ కోచ్? అన్నది కాదు సమస్య. సమస్యల్లా ఉన్నదానిని నువ్వెంత అందిపుచ్చుకుంటావన్నదే!” అని వాయించాడో నాలుగు గంటలు.

తల దిమ్మెక్కి ఉన్న అతడు, తన అప్పర్ బెర్తు చేరుకొని కాళ్ళు బార్లా చాపుకొని సుబ్బరంగా పడుకున్నాడు. అతడి బెర్తుకు అటువైపున్న బెర్తుల్లో ఒకదాంట్లో “తత్కాల్”లో టిక్కెట్టు కొన్న ఆమె, ఆమె భర్తా కొత్తగా పెళ్ళైనవాళ్ళకే అర్థమయ్యే అర్థంకాని గుసగుసలేవో ఆడుకుంటున్నారు.

విధిన్నూ, irctcనూ విచిత్రమైనవి.

Advertisements