ప్రేమగాని ప్రేమ


ఎవరో ముక్కు చీదుతున్నట్టు అని-వినిపించింది అతగాడికి గానీ, ఎవరో అనుకొని ఏకధాటిగా మాట్లాడుతూనే ఉన్నాడు. ఆ అమ్మాయి ఏకంగా తలదించుకొని, చున్నీతో కళ్ళలు తుడుచుకుంటుందని ఎవరో దారినపోయే వాళ్ళు వీళ్ళకేసి వింతగా చూసేంత వరకూ గ్రహించనేలేదు. నడిరోడ్డున మర్డరు చేసి రెడ్ హాండెడ్‍గా పట్టుబడిపోయినవాడిలా దొంగచూపులు చూశాడు. “అర్రె.. ఏమయ్యింది? ఎందుకు బాధపడుతున్నారు?” అని ఓ పక్క అడుగుతూనే, ఇంకో పక్క ఆమె తక్కువలో తక్కువమందికి కనిపించేలా ఆమెకు అడ్డంగా నుంచున్నాడు. “ప్లీజ్.. ఏడుపాపండీ!” అని బతిమాలుకున్నాడు. ఆమె అతనికేసి సూటిగా చూసి, ఆపినట్టే ఆపి మళ్ళీ అందుకుంది.

“సరే.. ఏడవండి!” అంటూ ఆమె పక్కనే కూలబడ్డాడు. “ఇప్పుడు ఎవడో వస్తాడు. నేను మిమల్ని ఏదో చేసేశాననీ, అందుకని మీరిలా బాధపడుతున్నారనీ గోల చేస్తాడు. ఓ పదిమంది పోగుబడతారు.. పర్లేదు.. మీరు కానివ్వండి..” అంటూ ఓసారి చుట్టూ కలియజూసి తలవంచుకొని, గడ్డి మధ్యలోని మట్టిలోంచి వస్తున్న చీమలను తదేకంగా చూస్తూ కూర్చున్నాడు, ఆ చీమకెప్పుడైనా తనలాంటి పరిస్థితి వచ్చి ఉంటుందా అని ఆలోచిస్తూ..

“నేను మీతో మాట్లాడాలి..” అని అంది. “నిజమా?” అన్నట్టు చూశాడు. “కానీ ఏడుపు వచ్చేస్తుంది.” అంది. అతడు లేచి, బయలుదేరుదామన్నట్టు సంకేతం ఇచ్చాడు. “నేను ఇప్పుడు ఇవ్వాళే మాట్లాడాలి మీతో. కానీ మా ఇంట్లో కుదరదు. మీ ఇంట్లో అవకాశమే లేదు. ఇక్కడా బాలేదు. మన ఇద్దరికి కొంచెం ప్రవసీ ఉండేలాంటి చోటు??” అని ఆమె ఇంకా పూర్తి చేయకముందే, “హోటెల్!” అన్నాడు. అని నాలుకు కర్చుకున్నాడు. ఇప్పుడే వస్తానంటూ సైగ చేసి, పక్కకెళ్ళి కాల్ చేసి వచ్చాడు. “మా ఫ్రెండ్ ఇళ్ళు ఇక్కడికి దగ్గరే! అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి.” అని బైక్ మీద ఆమెను తీసుకెళ్ళాడు.

“మీ ఫ్రెండ్ ఇంట్లో వాళ్ళూ?”

“వాళ్ళ నాన్న ఊర్లో లేరు. అమ్మ గుడికి వెళ్ళిందంట. వాళ్ళ చెల్లి కోచింగ్కు వెళ్తుంది. ఇంకో రెండు గంటల్లో వస్తారు వాళ్ళు. ఈ లోపు మీరు చెప్పాల్సింది అయిపోతుందిగా?”

ఆమె సమాధానం ఇచ్చిందో లేదో, అతడికి మాత్రం వినిపించలేదు.

ఫ్రెండ్ సాదరంగా ఆహ్వానించాడు. ఇద్దరికి మంచినీళ్ళిచ్చి, టీ -బిస్కెట్స్ అక్కడే పెట్టి, బయట పనేదో వచ్చిందని జారుకున్నాడు.

“ఇప్పుడు చెప్పండి..”

“నేను మీకు నిజంగానే నచ్చానా? నేనసలు ఈ పెళ్ళిచూపులకి ఒప్పుకుందే వచ్చినవాళ్ళు కాదంటారేమోనన్న ఆశతో. నాకీ పెళ్ళి ఇష్టం లేదు.”

అతడేం మాట్లాడలేదు.

“ఐ యామ్ సారి. ఇదంతా చాలా చెత్తగా తయారవుతుంది. ఇందుకే చెప్పాను మా ఇంట్లోవాళ్ళతో ఇవ్వన్నీ ఇప్పుడు పెట్టద్దొని. మీ నాన్నగారికి మాట ఇచ్చేశారని, నన్ను తొందరపెట్టారందరూ..”

అతడింకా ఏం మాట్లాడలేదు.

“నేను.. నేను” అంటూ, కాస్త కాస్తగా వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ, “ఇంకొకరిని ప్రేమించాను. కానీ ఆ మనిషికి పెళ్ళి కుదిరిపోయిందని ఆలస్యంగా తెల్సుకున్నాను. అయినా అతణ్ణి మర్చిపోలేకపోతున్నాను..”

ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకున్నాడు అతడు. “ఐ కాన్ అండర్‍స్టాండ్.” అన్నాడు ఆత్మీయంగా. అంతే! ఆ ఒక్క ముక్క వినపడగానే ఆమె వెక్కివెక్కి ఏడ్చింది. గుక్కలు తిప్పుకుంటూ, మధ్యమధ్యన “నేనింకెవ్వరిని ఆక్సెప్ట్ చేయలేని స్థితిలో ఉన్నాను.” అన్నదాన్ని ముక్కముక్కలుగా విరగొట్టి చెప్పింది. మధ్యలో వీలైనన్ని చోట్ల “సారీ”లు జతజేసింది.

“డోంట్ బి సారీ! ఇందులో మీ తప్పేం లేదు. ఇలాంటివి ఎంత బాధ కలిగిస్తాయో నేను ఊహించగలను. నా గురించి మీరేం భయపడనవసరం లేదు. మీ మీదకుగానీ, మీవాళ్ళ మీదకు గానీ రాకుండా ఈ సంబంధం తప్పించే బాధ్యత నాది!” అని భరోసాతో పాటు ఆమెకు గ్లాసుడు మంచినీళ్ళు కూడా ఇచ్చాడు. ఆమె కళ్ళు తుడుచుకుని, నీళ్ళన్నీ గడగడా తాగేసింది. కొద్ది నిముషాల పాటు ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు.

అటు వైపువారికి, ఇటువైపువారికి ఇద్దరూ ఒకే అబద్ధం, అది కూడా ఎక్కడా అతుకులు కనిపించకుండా చెప్పాలని గ్రహించారిద్దరూ, ధీర్ఘాలోచనలో మునిగారు.

“ఆ అబ్బాయికి పెళ్ళి అయిపోతుందంటున్నారు. ఇవ్వాళ నన్ను కాదన్నా.. అదే, నేను కాదన్నా.. రేపు మీవాళ్ళు మరో సంబంధం తీసుకొస్తారు. అప్పుడేం చేద్దామనీ?”

“అవ్వన్నీ నేను ఆలోచించలేదు. అతణ్ణి గురించి తప్ప నేనింకేం ఆలోచించలేకపోతున్నాను.”

“మీరా అబ్బాయికి చాలా క్లోజ్ అయినట్టున్నారు.” తలూపింది, అంగీకారంగా.

“అతడికీ మీ మీద ఇంట్రెస్ట్ ఉందేమో?” పెదవి విరిచింది, తెలీదన్నట్టు.

“వివరాలు అడుగుతున్నందుకు ఏం అనుకోకండి.. మీ కొలీగా అతడు?” తలాడించింది, అనంగీకారంగా. మంచితనానికి ఫాంటూ, షర్టూ వేసినట్టున్న అతడి దగ్గర ఈ మాత్రం వివరాలు కూడా చెప్పకపోతే బాగుండదని, మెల్లిగా అందుకుంది.

“అతడు నా ఫేస్‍బుక్ ఫ్రెండ్. నాకు ఫ్లోరిస్ట్ అవ్వాలని భలే కోరిగ్గా ఉండేది. కానీ మా ఇంట్లో ఇంజినీరింగే చదవాలనేవారు. ఉద్యోగం వచ్చాక హాబీగా floristry కోర్సు చేశాను. ఒకానొక గ్రూప్ లో daffodils పూలు ఎక్కడ దొరుకుతాయి అని అడిగాడు ఈ అబ్బాయి. అవి దొరకవూ, వాటి బదులుగా ఏమేం తీసుకోవచ్చో చెప్పాను. ఈ రోజు పోయాక అక్కడ థాంక్స్ తో పాటు, నాకో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది…ఆక్సెప్ట్ చేశాను.

“అప్పుడోసారి అప్పుడోసారి పలకరించుకునేవాళ్ళం. నా ఆఫీసులో ఫేస్బుక్ బ్లాక్ చేశారు. అందుకని ఇద్దరం మా కంపెనీవాళ్ళు బ్లాక్ చేయలేని మెసెంజర్ లో మాట్లాడుకునేవాళ్ళం. అలా అలా స్నేహం మొదలయ్యి, ఎప్పుడో తెలీదుగానీ అతడంటే ఇష్టమూ మొదలయ్యింది.”

“ఎప్పుడన్నా కల్సుకున్నారా?”

“ఊహు. ఒకసారి అతనడిగాడు కలుద్దామని, అప్పుడు నేను ఆన్-సైట్ కి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకోసారి నేను అడుగుదామనుకున్నాను, అతడు ఏకంగా పెళ్ళికే రమ్మన్నాడు.”

“అంతేనా?”

“అంతే!”

“నిజంగా.. ఇంతేనా?”

“ఇంతే!”

అప్పటిదాకా లోలోపల అణుచుకుంటున్న నవ్వంతా ఒక్కసారిగా కట్టలు తెచ్చుకొని వచ్చేసింది అతడికి. అప్పటిదాకా ఎదురుగా కూర్చొని ఆలకించిన అతడు, పక్కకొచ్చి కూర్చున్నాడు. “మొన్న మీ నాన్న, “మా అమ్మాయి అమాయకురాలండీ” అంటుంటే ఏమో అనుకున్నా. మరీ ఇంత పిచ్చి మొద్దువా?” అని తల మీద మెల్లిగా మొట్టాడు. ఏం అర్థంకాక ఆమె దిక్కులు చూసింది.

“ఇంకా నయం. నీ మాటలు పట్టుకొని నేనీ సంబంధం కాన్సిల్ చేసుకోలేదు. అయినా ఫేస్బుక్ లో ఎవడో తీయగా మాట్లాడితే, పడిపోవటమేనా?” ఆమె చూసేసిన దిక్కులనే మళ్ళీ మళ్ళీ చూస్తోంది.

“సరే.. పో, ఆ రైట్ లో బాత్రూమ్ ఉంటుంది. మొహం కడుక్కొనిరా పో..ఇక బయలుదేరుదాం. ఆకలేస్తుందా? ఏదన్నా తింటావా?”

ఆమె దిక్కులతో పనికావటం లేదని తేల్చుకొని, సూటిగా అతడినే చూస్తూ, “You aren’t getting it. I love him.” అని ఇంగ్లీషులో ఏడ్చింది.

“It’s you who aren’t getting it. This ain’t love, baby!”

అమెకి ఇప్పుడు ఇంతకు ముందు కనిపించని దిక్కులేవేవో కూడా కనిపించసాగాయి. ఆమె పరిస్థితి అర్గం చేసుకొన్న అతడు, ఆమెకు కొంచెం దగ్గరగా జరిగి, చుటూ చేయి వేసి, “చూడు అమ్మడూ. ఇది మహా అయితే infatuation అయ్యుంటుంది. అంతే! నువ్వేదో ఊహించేసుకొని, అదే నిజమనుకుంటున్నావ్. అతడికి నువ్వంటే ఇష్టమే ఉంటే వెళ్ళి వేరే వాళ్ళని పెళ్ళిచేసుకోడు కదా! అతడేదో కాస్త ఫ్రెండ్లీగా మూవ్ అయ్యేసరికి నువ్వు ఎట్రాక్ట్ అయిపోయుంటావ్.”

“కానీ.. అతనితో మాట్లాడేటప్పుడు అంత ఆనందంగా ఎందుకు అనిపించేది? అతనితో మాట్లాడలేని రోజుల్లో ఎందుకంత దిగులుగా ఉండేది. అతడి ఆఫీసులో జరిగిన క్రికెట్ టోర్నీలో అతడు గెలిస్తే నాకెందుకంత సంబరమేసేది? అతడికి చిన్నదెబ్బ కూడా తగలకపోయినా, అతడి కార్‍కి ఆక్సిడెంట్ జరిగిందంటే నాకెందుకెంత భయం వేసింది?”

“ఎందుకంటే, నువ్వుత్త వెర్రి మా తల్లివి కాబట్టి..” అని ఇంకా దగ్గరకు తీసుకున్నాడు ఆమెను.

“నేను ఇంకొకరిని ప్రేమించానని తెల్సి కూడా నన్ను పెళ్ళి చేసుకుంటారా?”

“మళ్ళీ అదే మాట. ఫస్ట్ నైట్ జరగని పెళ్ళి పెళ్ళికానట్టూ, ఒకరినొకరు చూసుకోకుండా, మనసు విప్పి మాట్లాడుకోకుండా సాగే పరిచయం కూడా ప్రేమ కిందకు రాదు. తప్పనిసరిగా బైక్ మీద తిరగాలి, ఒక కోక్ లో రెండు స్టాలు వేయాలని అని అననుగానీ, నువ్వు చెప్పినవేటినీ మాత్రం ఖచ్చితంగా ప్రేమ అనరు.”

ఆమెకు దుఃఖం మళ్ళీ పొంగుకొచ్చింది. ఈసారి అతడినే కావలించుకొని ఏడ్చింది. ఆ కన్నీళ్ళు దేనికో ఆమెకే అర్థం కాలేదు – తను ఇన్నాళ్ళూ భ్రమలో బతికినందుకా?  తనది ప్రేమగాని ప్రేమ అని ఇప్పుడన్నా తెల్సుకున్నందుకా? అతడి దగ్గర ఈ వాగుడంతా వాగి లోకవైపోయినందుకా? లోకువైనా అతడు తనని అంగీకరించినందుకా? ఇప్పుడు ఇదైనా నిజమేనా, లేక ఇదింకో రకం భ్రమా?

వెచ్చని కౌగిలి, మెల్లిగా ఊయల ఊగుతోంది. ఆమె అతడిని ఇంకా ఇంకా గట్టిగా పట్టుకుంటోంది. అందివచ్చినదాన్ని వదులుకునేంత వెర్రిదేం కాదు ఆమె.

 

Advertisements