స్పందన


ఏంటలా పరగ్గా వెళ్ళిపోతున్నారు? నేనున్నాని గమనించరేం? పొరపాటునైనా?

సర్లేండి. పదండలా నడుస్తూ మాట్లాడుకుందాం. ఆకాశం చెక్కిలి మీద ఎరుపెలా తేలిందంటారు? ఎవర్ని కలవబోతున్నందుకో ఆ సిగ్గులకెంపులు? సంద్రాన్ని చూడండి.. ఏరి? అలా బిగుసుకుపోతారేం? ష్… జాగ్తత్తగా వినండి. కిశోర్ కుమార్ వద్ద ఏకలవ్య శిష్యరికం చేసినట్టు, గాలి ఈలలేస్తోంది. మీ పరధ్యానం మీదేనా? అవున్లే, మీ పరధ్యానం మీది కాకపోతే నాదవుతుందా? పదండి, మీరెటు పోతే, నేనూ అటే..

నిర్మానుష్యపు వీధిలో మానవాకరం. అటు తిరిగి నుంచున్నారెవరో? స్త్రీ? అవును.. స్త్రీయే! అదో పైట. ఆవో కురులు. గాలందిస్తున్న లయకు తాండవిస్తున్నాయి. ఈ వేళలో, ఇక్కడ? ఎవరై ఉంటారు? చూద్దామా? నాలుగడుగులు వేసిన పుణ్యానికే, ప్రసాదంగా ఆమె పరిమళ సుగంధం! ఒక్క క్షణం ఆగండి.. ఆఘ్రాణించమనీ చెప్పాలా? చోద్యం కాకపోతే?! ఇదేమిటి? అపశృతి. ఏడుపు. ఎవరిది? మనిషిదే! అంటే ఆమెదా? ఆ ప్రశ్నార్థకం అనవసరం. పదండి..పదండి.. ఆడకూతురికి ఏ ఆపదొచ్చిందో ఏమిటో? ఏమయ్యిందో కనుక్కోండి. అపరిచితమేలెండి. కాదనేవారెవ్వరున్నారని? అందుకని? పట్టించుకోరా?! సాటి మనిషి బాధలో ఉంటే.. ఆ, ఈ ఊపిరితిత్తుల మధ్య గుండెకాయని ఒకటుంటుందే మనుషులకూ? “మనిషేనా?”అనడిగితే పొడుచుకొస్తుందిగా! అందుకే. ఆమె ఊరుకోవటం లేదే?! అసలు విషయమేమయ్యుంటుందో?!

అడగండి. ఆగండి. అడగమంటే అదిలించి, బెదిరించమని కాదు. కాస్త సౌమ్యంగా. కష్టంలో ఉందాయె! బావిలో నీళ్ళు తోడినట్టు, భళ్ళున కాదు. కన్నీటి చుక్కకూ, చుక్కకూ మధ్య మీ ఆర్ద్రత వాక్యమైపోవాలి. నిట్టూర్పుకీ నిట్టూర్పుకి మధ్య కథ ఒదిగిపోవాలి. స్వామీ.. ఆడపిల్లా, ఆ పై కన్నీరు అని చేతులు నలుపుకుంటూ కూర్చుంటే, అవతల మనిషి ఏ అగత్యానికో ఒడిగడితే?! సంశయాలకు కూడని సమయం. అడుగేయండి. అడిగేయండి.

తెల్సుకొచ్చారా? ఏంటట? విరహోత్కంఠిత? అనుకున్నానులే వాలకం బట్టి. వివరాలడిగారా? చెప్పిందీ! చెప్తుందిలే! చెప్పకేం చేస్తుంది. దాచాలనుకున్నవన్నీ దాగవు కదా! కొన్ని చెప్పుకోడానికి అయినవాళ్ళకన్నా అపరిచితులైతేనే అన్ని విధాల మేలు. ఓహో. ముందు తమరి జాతకం తెల్సుకున్నాకే మనసు విప్పిందా? ఎందుకట? అబ్బో, వడపోతలే?! పరిచయమే?! ఆర్చి రమ్మంటే వార్చొచ్చావా, నాయన? (మనది మాత్రం నాలుగు పేరాల అనుబంధం కాదేంటి? ఆ మాత్ర్రం చనువు నాకు లేదేంటి?)

***********

హలో..అబ్బాయ్! ఏం కథ? ఇవ్వాళ పరాగ్గా కాక, కంగారుగా ఉన్నావ్? పద.. ఈ రోజు ఇంకో తీరానికేసి నడుద్దాం. అక్కడ, నుస్రత్ ఫతె అలీ ఖాన్ కంఠంలా వీస్తుంది గాలి. దా.. పోదాం? ఓయ్య్.. నేను మాట్లాడుతూనే ఉన్నా, ఎటెళ్ళిపోతున్నావ్? నిదానంగా.. ఎవరో లాగుతున్నట్టు, పరాధీనంలో ఉన్నట్టు..? వినిపిస్తోందా? హలో.. హలో?

***********

’ఆమె వచ్చేస్తుంది. వచ్చేస్తోంది.’ – ఆఆ.. ఏంటా తత్తరపాటు? ఎవరామె? ఎందుకు వస్తోంది? ఏంటీ చెమ్మ? కన్నీళ్ళే? ఇన్నే? నీవే? హయ్యో.. ఇప్పుడేమయ్యిందని? ఆమెవరు? బేరం బెడిసికొట్టిందా?

నువ్విలా విలవిల్లాడితే నాకూ ఏం తోచదు. దా.. ఇలా తలవాల్చు. కాస్త ఊరడిల్లు. అసలేం జరిగింది?

ఆమె. ఆ రాత్రి. ఓ గుప్పిట మూసి, తదేకంగా చూస్తూ భోరుమంటూ ఉంది. ఏం జరిగిందని అడిగాను. పట్టుకోలేకపోతున్నా, పట్టువదల్లేకపోతున్నా అంది. విలువైంది. చేజార్చుకోకూడనిదంది. మూసున్న గుప్పిట కంపిస్తోంది. నా చేతులు మీకన్నా పెద్దవనంటూ, నా దోసిట్లో ఆమె గుప్పిట ఒదిగేలా ఏర్పాటు చేసాను. చేతిలో చేయి. భుజానికి భుజం. ఆమె పైట్ నా మొహం మీద రెపరెపలాడగానే, మనసు ఇళయరాజ సంగీతం విన్నట్టు తాద్మాత్యం చెందింది. నా గుండె దూదిపింజెలా ఎగిరిపోతుంటే, పట్టుకోడానికి, ఒక చేతిని వెనక్కి తీసుకున్నాను. ఎందుకనడిగింది. చెప్పేసాను. సంగ్ధిధావస్థనుండి తేరుకొని, బహుశా, నేను నీదాన్ననంది. ఒంటిచేతిలో ఉన్న ఆమె గుప్పిటకు పూర్తి సంరక్షణ అందించే బాధ్యతనెత్తినేసుకొని, రెండో చేతిని (గుండె ఉందందులో) తెచ్చి, ఆల్చిప్పను మూస్తున్నట్టు అరచేతి మీద మరో అరచేయిని బోర్లించబోతుండా.. ఆ కంఠం వినిపించింది. ఆమె ఎగిరిపోయింది. నా గుండె చేజారిపోయింది..

హతవిధీ! ఎంతటి కష్టం? పగవానిక్కూడా వద్దీ కష్టం. పాపిష్టిదాన్ని, ఆ పూట నిను అటువేపుగా తీసుకెళ్ళకపోయుంటే..

అవును. ఈ పాపం నీదే! నా గుండెలో చిచ్చుకు కారణం నువ్వే. ఏం చేసానని ఈ శిక్ష? ఎందుకు నాపై కక్ష?

అన్నావూ?! ఎప్పుడెప్పుడంటావా? అని కాచుక్కూచున్న. నన్ను తోలుబొమ్మకి కట్టిన తాళ్ళనుకో, అచ్చైన కథలో మరి సరిచేయలేని వాక్యాలనుకో, నిను వీడని నీడనుకో, లేక నీ బుద్ధనుకో.. నువ్వెక్కడెక్కడు పోయి, ఏమేం నిర్వాకాలు చేసుకొచ్చినా, వాటి పర్వవసానాలు ఎంత విపరీతంగా ఉన్నా, నువ్వు బతికినన్నాళ్ళూ నాతోనేగా ఉండాలి, ఊరడిల్లినా, ఊసురోమన్నా! ఊరుకో.. ఏడ్వకు.

గాయమన్నాక, గాయమంటూ అయ్యాక మానకుండా ఉండదుగా. మరుపు మనిషికున్న గొప్ప వరం. కాలం ఎటూ మందేయకుండా ఉండదు. వికటించిందే అనుకుందాం. అన్నాళ్ళు అలవాటయ్యాక, కొత్తేముంటుంది? పీడలందు మధుర పీడలు వేరయా అని నువ్వు వేదాంతం గుమ్మరించకపోతావా? నేను వినకపోతానా?

ఇదో.. ఇలా వచ్చి కాస్త కుదుటపడు. పడ్డానికి ప్రయత్నించు. వెక్కి వెక్కి ఏడ్చావ్‍గా, ఇంకా ధార ఆగిపోతుందిలే! నువ్వు కాసేపు అలా పడుకో, ఈ లోపు కన్నీళ్ళు ఊరతాయి. మెలకువతోటే కొత్త కన్నీరు.

జో అచ్యుతానంద.. జో జో ముకుందా..

(ఈ పైత్య ప్రకోపానికున్న నేపధ్యం. నిన్న మళ్ళీ వైట్ నైట్స్ చదివాను. ఎంత చెడ్డా, సంజయ్ లీల బన్సాలీ అంత కాదన్న ధైర్యంతో ఇలా! మూడేళ్ళ క్రితం నాకీ రచన పరిచయంచేసి, ఈ-పుస్తకం ఇచ్చినవారికి థాంక్స్!)

Advertisements

పుస్తకం.నెట్‍తో రెండో ఏడాది..పండగే పండగ!


“నా పేరు పూర్ణిమ.” అన్న వాక్యం పూర్తి కాకుండనే, “నాతో చాలా కొంచెం బోలెడు జాగ్రత్త!” అని కూడా విన్నవించుకుంటాను. అయిననూ, ప్రాక్టీసు లేకుండా బౌన్సీ వికెట్ల మీద చేతులెత్తేసే టీంలు టాస్‍నూ, పిచ్‍లనూ ఆడిపోసుకున్నట్టు, నన్నూ అంటుంటారు.

ఏదో సైటు మొదలెట్టామా? పెట్టాక, ఏదో కొత్త బులబాటం కాబట్టి ఆరంభశూరత్వం ప్రదర్శించామా? ఆ మాత్రం దానికే నా ఫ్రెండొకడు, “పుస్తకంని అడ్డం పెట్టుకొని పండగ చేసుకుంటున్నావు కదా!” అన్నాడు.

సరే ఆ మాటను నేనెందుకు తప్పని నిరూపించడమని, పుస్తకం రెండో ఏడాదిలో కూడా విజృభించాను. పుస్తకం.నెట్‍కు కలిగిన పురోగతిని లెక్కల్లోనూ, అందరి మాటల్లోనూ లెక్కేసుకోవచ్చునేమో గాని, ఈ ఏడాది పుస్తక పరంగా మాకు కలిగిన అనుభవాలు అన్నీ, ఇన్నీ కాదు. “వురేయ్య్ దేవుడా! ఎవరి సీన్లు ఎవరికిచ్చావో, ఓ సారి చూసుకో. నిజం కలలా ఉన్నప్పుడు, మేల్కోవాల్సి వచ్చినప్పుడు చాలా దారుణంగా ఉంటుంది. అట్లాంటి పాపం చేయకు.” అని అరవాలనిపించేంత అబ్బురాలు జరిగాయి.

దేవుడు వరమందిస్తే…

దేవుళ్ళ సాక్షాత్కారం సాధ్యమేననీ, అలా కనిపించినప్పుడు చేతులు జోడించి, ఆపకుండా అప్పటిదాకా నేర్చుకున్న పజ్జాలూ, శ్లోకాలూ గట్రా గుక్క తిప్పుకోకుండా అప్పజెప్పేసి, “ఏం వరం కావాలో కోరుకో నాయనా!” అననగానే అడిగేసుకోవచ్చునని, బోలెడు తెలుగు సినిమాల్లో చూసాను. సినిమాల్లో చూపే అనేక విషయాల్లానే ఇదీ ఉత్తిత్తిదే. నిజంగా, మన దేవుళ్ళని చూసే అవకాశం వచ్చినప్పుడు, నోరెండిపోతుంది, చేతులు వాతంటవే నలుపుడు కార్యక్రమం పెట్టుకుంటాయి. నిద్రపట్టదు. ఊపిరాడదు. పట్టలేనంత దుఃఖం వస్తే ఏడ్వచ్చు. భరించలేని ఆనందం వస్తే మాత్రం ఏం చేయాలో తోచి చావదు.

కొన్ని వేల క్షణాలను ఉత్కఠంగా ఈదుతూ, అసలైన తీరం చేరుకున్నాక, సాక్షాత్తూ వారే ఎదురుగా కూర్చున్నాక, నోటి నుండి వెలువడే తొలి పలుకులు;

“నాకేం అర్థం కావటం లేదు. ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలీటం లేదు. నాక్కాస్త సమయం కావాలి.”

కొన్ని నిముషాల తర్వాత అంతా మామూలయ్యిపోతుంది. ఎవరో మనకి బాగా తెల్సిన వాళ్ళతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. కొన్ని గంటలు పోయాక, అదో సర్వసాధారమైన విషయమైనట్టూ, చిన్నప్పటి నుండీ అక్కడే ఆడుకున్నట్టూ అనిపించేలా గడిచాయి.

పేరుప్రఖ్యాతలు కొంత మందికి ఉత్త పుణ్యానికి వస్తాయి. కొందరికి తమ నైపుణ్యం కారణంగా వస్తాయి. చాలా మంది వాటిని మోయటానికి నానా తిప్పలు పడతారు – పెడతారు. “మీరు ఎందుకూ పనికిరారోచ్!” అన్న ఫీలింగ్ అవతలి వాళ్ళల్లో కల్పిస్తేగాని వీళ్ళకి గొప్పన్న ఫీలింగ్ రాదు. అలాంటిది, తెలుగువారి హృదయాల్లో విశిష్టస్థాయి అందుకున్న బాపూ-రమణ అంటే గుండె చేసిన హోరుని నేటి సంగీత దర్శకులు కూడా కొట్టలేరు.

బాపూ అంటే ప్రముఖ చిత్రకారుడూ, సినీ దర్శకుడూ, రమణ అంటే ప్రఖ్యాత తెలుగు రచయిత అన్న factsని ఇప్పుడు గుర్తుచేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళతో ఉన్నంత సేపూ బాపూ-రమణ, ది మనుషులను చూశాము. వాళ్ళ గొప్పతనం వారికీ బరువు కాదు, మాకూ అవ్వలేదు. హాయిగా, సరదాగా గడిచిపోయాయి. ఇద్దరి పుస్తకప్రియులతో మాట్లాడినట్టు ఉందే కాని, గొప్పన్న వాళ్ళతో మాట్లాడినట్టు అనిపించలేదు.

వాళ్ళ లైబ్రరీల్లో, ఐస్‍క్రీం షాపుల్లో వదిలేయబడ్డ చిన్నపిల్లల్లా ఆడుకున్నాం. బాపూ గారికి ఓ పుస్తకం తీసుకెళ్తే, “ఏం పుస్తకం ఇదీ?!” అంటూ తెరచి, పేజీలు తిప్పుతున్నప్పుడు ఆయన కళ్ళల్లో మెరిసిన కాంతిని, నేనూ, సౌమ్య ఒక జీవితకాలం దాచుకుంటాం. బాపూగారని కాదు, అసలో వ్యక్తి ఒక పుస్తకాన్ని చూస్తే వజ్రవైఢూర్యాలను చూస్తున్నప్పుడు, వాటి కాంతి కళ్ళల్లో ప్రతిబింబించినంతగా ఆ కళ్ళు  మెరిస్తే, is it not a moment to be photographed in mind, forever?

అదృష్టం, విత్ ఫెవికాల్..

“ఏంటసలు? మనకి అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది? ఏంటమ్మాయ్య్ అసలు” అని సౌమ్య మదనపల్లి వీధిలో గింజుకుంది. ఏం చెప్తాం? ఒక ప్రముఖ చరిత్ర పరిశోధకురాలు మాతో మాట్లాడానికి అంగీకరించి, మాకు మూడు గంటల సమయం కేటాయించి, బోలెడు కబుర్లు చెప్పి, “మీరు నాతో కల్సి భోంచేస్తే కాని, నేను చెయ్యను!” అని మాతో కల్సి తిని, బయలుదేరినప్పుడు వీధిలోకి వచ్చి, ఆటో ఎక్కించే అదృష్టం కలిగితే ఇంకేమనుకోడానికి మిగులుతుంది? అసలు ఆవిడ ఎంత ఘనత వహించిన వ్యక్తి అన్నది పూర్తిగా వేరే కథ, మమల్ని ఆదరించిన తీరు, ఆప్యాయతగా చూసుకున్న విధానం.. వావ్! అలానే, శ్రీదేవి ముళ్ళపూడి గారు కూడా మమల్ని ఆదరించిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే!

చిట్టిపొట్టి ఆనందాలు..

కొత్తపల్లి, మంచి పుస్తకం వాళ్ళ గురించి తెల్సుకున్నప్పుడు నాకు goosebumps కలిగాయి. ఏదైనా చేయడానికి ప్రతికూలాంశాలను భూతద్దంలో చూపి భయపెడతారు గాని, ఉన్న పరిమితులకు లోబడి నెరిపే కార్యక్రమాలు ఎంతటి తృప్తికరమైన విజయాలను సాధించగలరని మరో సారి చూపించారు.

వైదేహిగారి నాన్నగారి పుస్తకం ఆవిష్కరణ సభలో నేనూ, సౌమ్య పలకరించబడ్డ విధానం తల్చుకుంటుంటే ఉబ్బితబ్బవుతూ ఉంటాను. అలానే, రానారె గారి పెళ్ళిలో మాకివ్వబడ్డ రిసెప్షన్ కూడా.

కల్తీలేని బడాయండయ్య..

ఇప్పుడవన్నీ చెప్పుకుంటూ పోతే, “బడాయి కాకపోతేనూ..” అన్న సన్నాయి నొక్కులు వినిపించక మానవు. “అసలు పుస్తకం.నెట్ ఊడపీకింది ఏంటట? ఓ నలుగురు కల్సి చేతకాని రాతలు రాయడానికే విర్రవీగపోవడమేనా?!” అన్న విమర్శలు కూడా కర్ణాకర్ణిగా వినిపిస్తాయి. అందుకని, ఈ పోస్ట్ రాయడమనే ఉద్దేశ్యాన్ని విరమించుకుందామనుకున్నాను.

అప్పుడే బ్లాగులకున్న నిర్వచనం గుర్తొచ్చింది. బ్లాగులనగా వ్యక్తిగత అభిప్రాయ వేదిక. అనగా, రోడ్డు మీద కనబడ్డ అమ్మాయి అంగాంగ వర్ణన, భేధాభిప్రాయాలు కలిగినప్పుడు “వారి మొహం. వారు చేతగానివాళ్ళు, పరమ మూర్ఖులు” అని స్టేట్మెంట్లు ఇవ్వటం, మనకు నచ్చనివి చెప్పినప్పుడు “అలాక్కాదు, ఇదిగో ఇలా..” అని ఫీస్ లేకుండా కోచింగ్లు ఇవ్వటం అన్నమాట. కనీసం ఇప్పటికైనా నా బ్లాగునూ ఆ నిర్వచనానికి అనుగుణంగా మార్చాలన్నదే కొత్త ఏడాది తీర్మానం.

అందుకని, నేను కాసేపు, నిఖార్సైన బడాయి పోయినా, ప్రత్యేకంగా వచ్చే నష్టం లేదు. మహా అయితే, కొందరి చేయితిరిగిన వాళ్ళు మూతులు కూడా తిరుగుతాయి.

ఇక ఇప్పుడు కొన్ని కామెడి బిట్స్..

(కామెడి బిట్స్ = మా ఆఫీసులో కాఫీ బ్రేకని పొద్దున్న పదకొండింటికి సమావేశం ఏర్పాటు ఉంటుంది. ఉన్న ఐదారుగురిలో ఎవళ్ళో ఒకళ్ళని ఏవో చిన్నా చితకా కష్టాలుంటాయి. అవి మాతో పంచుకుంటున్నప్పుడు, విని ఊరుకోకుండా.. నవ్వి పెడుతూ ఉంటాం. నవ్వు infectious కదా, ఆళ్ళూ నవ్వేస్తారు, ఏడ్వలేక. )

సరస్పతి తోడు.. పుసతకాలంటే?
పరుచూరిగారి పుణ్యమా అని ఎపి ఆర్కైవ్స్, ఓరియంటల్ మాన్యుస్రిప్ట్స్ ఆఫీసులకు ట్రిప్పులు వేశాం. ఎపి ఆర్కైవ్స్ వారు, సాదరంగా ఆహ్వానించి ఆదరించారు. ఆ రంగు కళ్ళద్దాలు పెట్టుకొని ఓ.యూలోని మాన్యుస్ర్కిప్ట్స్ వారి దగ్గరకు వెళ్ళాం.

“అయ్యా.. ఫలానా ఎక్కడ…. ” అనగానే వేలు ఓ వైపుకి చూపిస్తుంది. అక్కడికి పోయి, “అమ్మా… ఫలానా..” అంటాం. ఆ వేలు మరో వైపుకి. “అయ్యా / అమ్మా..” అంటాం, “చెయ్యి ఖాళీ లేద”ంటారు. “అది కాదండి.. మరేమో.. ఫలానా ఎక్కడ…” అంటాం. మళ్ళీ వేలు, మళ్ళీ వైపు. అలా కిందకీ పైకీ, వెనక్కీ ముందుకీ, బయటకీ లోపలకీ ఫాస్ట్ ఫార్వాడ్ లో ఊహించుకోండి. తిరిగి తిరిగి మొదలెట్టిన చోటికే వస్తాం.

పుస్తకాలకు సంబంధించిన పనులు చేస్తూ కూడా, పుస్తకాల పేరెత్తగానే దిక్కులు చూసే స్టాఫ్ అంటే, సౌమ్యకి పరమ మంట. తిట్టుకుంటూ ఉంటుంది. నేను నా శాయశక్తులా నవ్విపెడుతుంటాను, తిట్లకి తాళం అన్నమాట!

బిగ్ బాస్? 😛

“నేను పూర్ణిమ, ఫలానా పుస్తకం.నెట్ అనీ..” అని నేను చెప్తుండగానే, అవతలి వైపు నున్న వ్యక్తి, “తెల్సునండి.. అది ఫలానా వారిది కదా? మీరు వారి కింద పనిజేస్తారా?” అని అడిగింజుకుంటున్నప్పటి నవ్వు కన్నా, “హే.. ఇది చెప్పలేదు కదూ.. ” అని తెల్సిన వాళ్ళకి చెప్పినప్పుడు వచ్చిన నవ్వు! ఆహా!

నేరం నీది కాదు.. ప్రేమది..
నాకు కాఫ్కా అంటే ఇష్టం. ఆయన రచనలంటే ఇష్టం. కాల్పనిక సాహిత్యం ఎంతగా ఇష్టమో, ఆయన లెటర్స్, డైరీస్ నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా, కలవరపెట్టినా అంతే ఇదిగా చదువుకుంటూ ఉంటాను. ఒక వ్యక్తిగా కాఫ్కాతో నాకు సవాలక్ష సమస్యలున్నాయి. అయినా, మేమిద్దరం ఒకటే కాలానికి సంబంధించినవారం కాదు కాబట్టి, మా మీద ఏదో బంధాన్ని నిర్వర్తించే బాధ్యత లేదు కాబట్టి, ఆ సవాలక్ష సమస్యలకూ అస్తిత్వం లేదు. అందుకని ఎంచక్కా, ఆ రచనల్ను చదివేసుకొని కాలం గడిపేస్తాను.

ఆయన రాసిన “మెటమార్ఫసిస్” అన్న కథ నాకు బాగా నచ్చిన కథల్లో ఒకటి. నాకు చాలా దగ్గరైన కథ. దీన్ని మొదటిసారి చదివినప్పుడు ఉత్సాహంగా నా ఫ్రెండుకు ఈ కథ పరిచయం చేశాను. ఓ వారం తర్వాత, ఆ కథ చదివిన ఫ్రెండ్ అన్న మాటలు, “ఏముంది అసలా కథలో? టైం వేస్ట్! అసలు, ఆ కథ నచ్చడానికి ఒక్క కారణం చెప్పు! కామెడి కాకపోతే.. నువ్వు ఓహో, ఆహా అన్నావ్ అని చదివా!” అని అన్నాడు.

ఆ మాటలు వినగానే నా కాళ్ళ కింద భూమి కంపించలేదు. నా ఎదురుగా ఉన్న మానిటర్‍ని బద్దలుగొట్టాలనిపించలేదు. నా గుండె పగిలిపోలేదు. “నిన్ను చంపేస్తాన్రోయ్య్” అని వాడి కాలర్ పట్టుకోవాలనిపించలేదు. ఇప్పటికీ, నేను “కాఫ్కా” అననగానే, వాడు నన్ను చూసి వెక్కిరిస్తున్నట్టు నవ్వుతాడు. అందుకని “నువ్వు నా స్నేహితుడివి కావు!” అని చెప్పాలనిపించలేదు.

కాని హాలీ రాసిన చివరకు మిగిలేది? కి వచ్చిన స్పందనలు చూశాక, నేనెంత తప్పు చేశానో అర్థమయ్యింది. అసలు సరైన పీనల్ కోడ్లు లేవుగాని, అది వేసినందుకు గానూ మాకు ఉరి శిక్ష అమలు పరిచేవారనుకుంట.

అంటే, ఎవరన్నా మనుషులని అనేటప్పుడు, “మీ మొహం తగలెయ్య.. మీరూ, మీ వెధవాయితనం” అని అనీ అన్నట్టు అనాలి. మనుషుల మీద సెటైర్లు వేయచ్చు. ఎందుకనగా, మనుషులకి sense of humour ఉంటుంది కనుక.

“ఈ రచన పరమ నీచ నికృష్ఠపు రచన” అన్నట్టు రాస్తే ఫర్వాలేదు గాని, “హిహిహి.. ఈ రచన, ఒక తెలుగు సినిమాను తలపించింది.” అని రాయడం ఎంత అవమానకరం.. (సినిమాకా? అని అడక్కూడదు మీరు!) పుస్తకాల మీద సెటైర్లు వేయరాదు. కరెష్టు.. పుస్తకాలకు సెన్సాఫ్ హ్యూమర్ ఉండదు కదా మరి. పుస్తకాలు చదివేవారికి ఉంటుందనుకోండి.. కాని, పుస్తకాలని ప్రేమించేవారికి ఉండదండి. భలే! భలే! మీరు అసాధ్యలు బాబోయ్.. ప్రేమ గుడ్డిది కదా! అని ఎంత ఠక్కున చెప్పేసారు.  అదన్న మాట సంగతి! ఏదో పుణ్యాత్ములు, “ఓహ్.. నీకు చదవడమే రాదు.” అంటూ, క్యాట్ ఎగ్జామ్ కోచింగ్ సెంటర్ పెట్టినవాడు, విద్యార్థులకు ముందుగా “ఎ”, “బి”, “సి” లను గుర్తుపెట్టడానికి, పలకలిచ్చి దిద్దించిన అమృతం సీరియల్‍లో ఎపిసోడ్ తలపించే విధంగా, పెద్దోళ్ళ ట్రైనింగ్లు ఇచ్చారు కాబట్టి సరిపోయింది గాని, లేకుంటేనా?

చదువర్లందు పుస్తకప్రేమికులు వేరయా! వీళ్ళేది చేసినా ఆ ప్రేమ కారణంగానే! వీరు తక్క ఎవరేం చేసినా, అది పనీపాటా లేక చేయటమన్న మాట!

తెలుగు సాహిత్యం కేరాఫ్..

ఇహ తెలుగు సాహిత్యపు బాగోగులను భుజాన వేసుకోవటం చాలా తేలిక! మీకు ఓపికుంటే చెప్పండి.. పెద్దగా చెయ్యాల్సిందేమీ ఉండదు. మీకు వాగ్పటిమ ఉండాలి. ఆ తర్వాత వ్యంగ్యం, నిష్ఠూరం మీ శైలి అవ్వాలి. ఊరుకూరికే పాతను పొగడాలి. కొత్తను తెగడాలి. ఇందులో సబ్సిడీ ఏంటంటే, మీకు నచ్చినవాళ్ళు ఉంటే, మీరు వారి భజన చేసుకోవచ్చును. తక్కిన వాళ్ళల్లో, ఎక్కడైనా ఎప్పుడైనా ఎవ్వళ్ళైనా బిక్కుబిక్కుమంటూ తెలుగు కథో, తెలుగు కాకరకాయో అని అనీ అనగానే, మీరు ఉరిమి ఉరిమి మంగళం మీద కాక, అక్కడే పడాలి. హంతే! అప్పుడప్పుడూ నోరూరుకోని వారు తగులుకున్నా, “అబ్బే.. మీరెవరో నాకు తెలీదు!” అని తప్పేసుకోవచ్చు.

తిరుగుళ్ళు-తిరనాళ్ళు..

చెన్నై, బెంగళూరు, మదనపల్లి, తిరుపతుల్లో బాగా తిరిగాము. “పుస్తకం.నెట్ పనులూ..” అనగానే ఎగాదిగా చూసిన ఇంట్లోవాళ్ళూ, స్నేహితులూ ఇప్పుడు, “సరే.. ఇదో రకం పిచ్చి” అననుకొని “క్షేమంగా వెళ్ళి, లాభంగా రా!” అంటున్నారు. కొందరేమో, మా బాగోగుల కన్నా, మేం కలవబోయే వారి బాగోగుల గురించి కలవరపడుతూ ఉంటారనుకోండి.  ఏ ఊరెళ్ళినా కడుపునిండా తిండి పెట్టి, హాయిగా నిద్రపోవటానికి వీలుగా ఏర్పాట్లు చేయడమే కాక, మా ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని ఎవరెవర్ని కలిస్తే బాగుంటుందో, ఏయే ప్రదేశాలకు వెళ్ళాలో సూచించేవాళ్ళూ… అదృష్టం కాకపోతే ఏమిటిది?

పనిలేక చేస్తున్న పనులివి అని కొందరు తీర్మానించేసినా, “ఆఫీసులో పని! కాస్త ఈ ఆర్టికల్ టైపు చేసిస్తావా?”, “పుస్తకంలో వేయడానికి ఆర్టికల్స్ లేవు, మీకేమన్నా రాయడానికి వీలు పడుతుందా?”, “రేపు ఊరెళ్తున్నా. ఇవ్వాళ వంట్లో బాలేదు. అక్కడికెళ్ళి, అది తెచ్చిపెట్టాలి.” – ఇలా అడిగీ అడగ్గానే సాయం చేసే స్నేహితులు. గంటలకొద్దీ లాప్‍టాప్ మీదున్నా విసుక్కోని ఇంట్లో వాళ్ళు.

రాండీ హెడ్‍ఫేక్ ఫిలాసఫీలో చెప్పుకుంటే, పుస్తకాల గురించి తెల్సుకునే మహత్తర అవకాశం, మంచి మంచి వ్యాసాలను ముందే చదివే అవకాశం, కొంచెం టైం మానేజ్‍మెంట్, బొలెడంత ఫన్, కొత్త ప్రదేశాలు, కొత్త మనుషులు, కొన్ని ఇబ్బందులూ, కాస్త విసుగూ, అలసట.. కాని బోలెడంత హాయి. ఇదీ నా ప్రస్థానం పుస్తకంలో ఈ ఏడాది.

ఇదీ నేను చేసుకున్న పండుగ! హమ్మ్.. ఇది చదివి నా ఫ్రెండ్ ఏమంటాడో? చూద్దాం! 🙂

వేటూరి గారి, “ప్రాప్తమనుకో ఈ క్షణమే బతుకులాగా. పండెననుకో ఈ బతుకే మనసు తీరా” నాకు తారకమంత్రం కాబట్టి, మున్ముందు ఎలా ఉన్నా, ఇప్పటికి ఇన్ని అమూల్యమైన క్షణాలు నా ఖాతాలో వచ్చినందుకు, వాటిని నాతో పంచుకున్నందుకూ అందరికీ కృతజ్ఞతలు.

నూతన సంవత్సర శుభాకాంక్షలు!

Sowmya’s post here.

Pustakam.net’s recap post here.

Life of Pi


( “అబ్బా మళ్ళీ ఇంకో పుస్తకమా? చదివేయటం.. రాసేయటం! ఇప్పుడు చదవాలా? ఎందుకు చదవటం.. ఎటూ పుస్తకాలు కొని చదివేంత లేదు! అదీకాక ఇలా పనులు కానీ పనులు పెట్టుకుంటే.. అసలైన పనుల పనేంగానూ?” అనుకుంటూ మీరీ టపా చదవకుండా వదిలేస్తే ఒక రకంగా మీరు అదృష్టవంతులు. కానీ ఈ పుస్తకం చదవకపోతే మీరెంతో కొంత మిస్సవుతారని రూఢీగా చెప్పగలను. )

నిద్రపోతున్నప్పుడు కలలు వస్తాయి. (మన ప్రమేయం పెద్దగా లేన్నట్టనిపిస్తుంది!) “అమ్మ పక్కనే కూర్చుని తలనిమురుతుందన్నట్టు” కలొస్తే అమందానందాలు. ” రైలెక్కి ఎవరో వెళ్ళిపోతున్నట్టు” కలొస్తే తీవ్ర దుఃఖం, నిరాశ. “ఎవరో వెంటపడి చంపడానికి వస్తున్నార”నే కలలో అంతులేని భయం, ఆవేశం, ఆయాసం! కల వాస్తవానికి చాలా దూరం, కలలు నిజమయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువ, అయినా కలలు మనల్ని అంతలా కదిలించడానికి కారణం “కలలో మనం కలకంటున్నామని మనకి తెలియక పోవటం!” ఉలిక్కి పడి లేచిన తర్వాత, పట్టిన చమటను తుడుచుకుంటూ, తడారిపోయినా గొంతులో కాసిన్ని నీళ్ళు పోసుకోడానికి పడుతూ లేస్తున్న వేళ గుచ్చుకుంటున్న కళ్ళల్లో నిద్ర కాస్త మాయమయ్యి, తెలివొచ్చి “ఓహ్.. కలే కదా!” అనిపించినా అప్పటి వరకూ పడిన  అనుభవం ఎక్కడికి పోతుంది? నిజం కాకపోయినా, మనం దానిని జీవించేశాము. సాక్ష్యాలుండవు కానీ, కొన్ని అనుభూతులో.. అలాంటివేవో మనతో నిలిచిపోతాయి. నిజం కాకపోయినా, కరిగిపోయేదైనా కలకున్నంత బలం మళ్ళా కలానికే ఉందేమో అన్నట్టుగా ఉందీ పుస్తకం నాకైతే! ఉన్న తెలివిని పక్కకునెట్టేసి రచయిత చేస్తున్న పదాల గారడీని నిజమని నమ్మించే ఒక రచన ఇది.

కథ: “ఓహ్.. ఒక కల గురించిన పుస్తకమా ఇది!” అని నిర్ణయానికి వచ్చేయద్దు. కథకీ కలకీ అసలు సంబంధమే లేదు. ఈ కథని క్లుప్తంగా చెప్పాలంటే – జూ వాతావరణంలో పెరిగిన ఓ కుర్రాడు, తల్లిదండ్రులతో కొన్ని జంతువులని తీసుకుని సముద్రం మీద వెళ్తుండగా, పడవ ప్రమాదానికి గురై అంతా మునిగిపోగా, ఒక పెద్ద పులి, ఒక జీబ్రా, ఒక చింపాజీ లాంటి జంతువు, ఒక కొరనాసిగండు (hyena) తో పాటు ఇతనూ ఒక బోటులో మిగిలిపోతారు. ఆ జంతువుల మధ్య, నడి సముద్రంలో ఈ కుర్రాడు ఎన్నాళ్ళు, ఎలా బతికాడు, అసలు తప్పించుకోగలిగాడా అన్నదే కథాంశం.

ఈ కథ మొదట్లో “దేవుడిపై నమ్మకం కలిగించే కథ” అని ఉంటుంది. “ఓహ్.. పుస్తకం పూర్తయ్యే సరికి నేను మహాభక్తురాలయ్యిపోతాను.. కాసుకో!” అని  కాసేపు మా అమ్మను ఉడికించి మరీ ఈ పుస్తకం చదవటం మొదలెట్టాను. చివరి దాకా చదవేను గానీ, నాకెక్కడా దేవుడి మీదకి దృష్టి పోలేదు. ఈ పుస్తకం గురించి ఒక్కటే ఒక్క మాట చెప్పాలంటే… “Man is a social animal” అని అర్థం అయినా కాకపోయినా  ప్రైమరీ తరగతుల నుండీ “చదువుకున్న”  ఆ ఒక్క వాక్యమూ చెప్తాను. ఈ పుస్తకంలో కథానాయకుడు ఒక పెద్ద పులితో ఉండడానికి ఒప్పుకుంటాడు కానీ ఒంటరిగా ఉండలేనంటాడు. ఇక ఆకలి మించినదేదీ లేదని.. విపరీత పరిస్థితుల్లో మనిషికీ, జంతువుకీ పెద్ద తేడా లేదని తెలుస్తుంది. దేవుడి మీద నమ్మకం అటుంచితే, మానవ మెదడనే పదార్థం ఆలోచించగలిగితే ఎంతటి విపత్కర పరిస్థితుల్లో అయినా బయటపడచ్చు అని తెలుస్తుంది.

రచనా విధానం:
నాకీ కథ చెప్పిన విధానం యమ గందరగోళంగా అనిపించింది. రచయిత చెప్పిన మాటగా ఈ పుస్తకం మొదలవ్వటంతో “పై” అనే వ్యక్తి జీవితంలో జరిగిన యధార్ధ గాధ అనుకున్నాను. తీరా చూస్తే మొదటి భాగంలో అక్కడక్కడా ఏదో చెప్పి మాయమయ్యిపోయి, మరలా చివర్లో వస్తాడు రచయిత. ఈ లోపు “పై”యే తన కథ మనకు చెప్పినట్టుంటుంది కథా శైలి. ఎందుకో అవసరం లేకపోయినా రచయిత కథలో దూరడానికి శతవిధాల ప్రయత్నించాడనిపించింది. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఫిక్షన్‍లో తాను చెప్పాలనుకున్నదంతా సాధ్యాసాధ్యాల ఆలోచనే రానివ్వకుండా తన పదాలవెంటే మనం పరుగులు తీసేలా చేయగలడు రచయిత. పుస్తకం చదివేశాక వెళ్ళి నా కొలీగ్స్ కి కొందరికి కథలో ఏమేం జరుగుతుందో చెప్పాను. వాళ్ళేదో కామెడీ సీను చెప్తున్నట్టు ఒకటే నవ్వు! నిజంగానే ఇది అతి అసాధారణమైన కథనం, నమ్మశక్యంగాని రచన. కానీ రచన చదివేటప్పుడు వీటికి అతీతంగా కేవలం రచయిత మాయలో పడిపోతాం.

ఎన్నో రోజులుగా ఆహారం లేని మనిషి తిండి ఎలా తింటున్నాడు అని చెప్పటం, గత్యంతరం లేక మనిషి వేట ఎలా నేర్చుకునేది, ఎలా చేపల్ని తినటం మొదలెట్టిందీ, అలా కొనసాగించి తనూ ఓ జంతువు తిన్నట్టు ఎలా తింటున్నదీ! ఆనంతమైన సముద్రాన్ని, అనంతాకాశాన్ని, నక్షత్రాలనీ, చేపల్నీ, పడవల్నీ, ప్రకృతినీ, మానవ మనో సంఘర్షణనీ, జంతువుల సహజ వ్యవహారికాన్ని అన్నింటినీ ఈ రచనలో అద్భుతంగా సృష్టించాడు. ఒక చోట ఒక పోలిక చెప్తాడు: “మనం అడవిలోనైనా సరే ఒక జీపులో వెళ్తూ అడవంతా చూసేసామనుకుంటే పొరపాటే. అడవిని పరిశీలించాలంటే కాలినడకనే వెళ్ళాలి. పసిఫిక్ పైనా పడవలో వెళ్తే దాని అసలు జంతు సంపదను చూడలేము. ఇక్కడా కాలినడకల్లే కొనసాగాలి” అని. ఈ పుస్తకం ఎంచుమించు అలానే కొనసాగి మనకి చాలా విషయాలు చెప్తుంది.

  అప్పటిదాకా చీకటిలో మగ్గిపోయున్న అతడు, తెల్లారి వెలుతురులో చూసిన సముద్రాన్ని ఇలా వర్ణిస్తాడు: “The calm sea has opened around me like a great book” అని. నాకైతే ఈ పుస్తకమే ఓ మహాసముద్రంలా నా మనోకాన్వాస్ పై విస్తరించి ఒక “అద్భుతాన్ని” నా కళ్ళముందు సృష్టించింది. అందులో జాలి, కరుణ, భయం, బాధ, చావు, ఆకలి, నమ్మకం, ఆశ, నిరాశ, భక్తి, యుక్తి లాంటివన్నీ ఒక్కోటే నన్ను చుట్టుముట్టి వాటి విశ్వరూపాన్ని చూపెట్టాయి. ఈ పుస్తకం మానసికమైన వత్తిడి కలగజేస్తుంది, ఒక పీడ కలలానే! అంతగా భయపెట్టినందుకు బాధపడాలో, కల మాత్రమేలే అని ఊరట చెందాలో తెలీనివ్వదు. అసలు పుస్తకమంతా చదివేశాక ఏది నిజమో, ఏది కాదో తెలీని అయోమయ స్థితి కూడా ఏర్పడవచ్చు. చదవాలనుకుంటే మాత్రం వీలైనంత సమయం చూసుకుని తీరిగ్గా చదువుకోవాల్సిన పుస్తకం. Like it or not, it would leave an impact on you!

ఒక ఉలిపికట్టె కథ..


పోయిన వారాంతం విశాలాంధ్ర మీద దాదాపు దాడి లాంటిది చేసి మరీ కొన్న అనేకానేకమైన పుస్తకాల్లో, డా|| కేశవ రెడ్డి రచించిన “సిటీ బ్యూటిఫుల్” అత్యంత తక్కువ పేజీలు కలదీ, అంతే చవకా కూడా! అప్పుడెప్పుడో నవీన్ రాసిన “అంపశయ్య” పుస్తకం ఒక యాభై పేజీలు చదివి మళ్ళా ముట్టుకోలేదు. ఈ పుస్తకం “ముందు మాట”లో దాని ప్రస్తావన చూసి హడలిపోయాను. ఉన్నవే తొంభై పేజీలన్న ధైర్యంతో మొదలెట్టాను. కథ విషయానికి వస్తే దాదాపు అంపశయ్య కథే! ఇరవై యేళ్ళ వయసున్న ఒక మెడికో జీవితంలో ఓ రెండు రోజులు పాటు జరిగిన పరిణామాలు, వాటి పర్యవసానాలు! అంతే కథ.

 ఈ పుస్తకం మొదట్లో రచయిత తన మాటగా చెప్పుకుంటారు, “అస్తవ్యస్తంగా, అర్థరహితంగా, తలక్రిందులుగా ఉన్న సమాజ విలువల్నీ, కట్టుబాట్లనీ, కొందరు పూర్తిగా ఆమోదిస్తారు, వారికి ఈ సమాజం ఎప్పుడూ అక్కున చేర్చుకుంటుంది. కొందరు మాత్రం దీనికి ఐచ్ఛికంగానో, యాధృచ్ఛికంగానో ఆమోదించక ఎదురు తిరుగుతారు, వాళ్ళ జీవితాలు నరకప్రాయం చేయడం సమాజం వంతు” అని! ఇప్పుడు మనం ఒక వేళ పూర్తిగా సమాజాన్ని ఆమోదించేసినట్టయితే ఈ పుస్తకం సిటీ బ్యూటిఫుల్ కాదు, సిటీ హిల్లారియస్ అవుతుంది. ఎందుకంటే ఉన్న విలువలకి ఎదురుతిరిగే ఒక ఉలిపికట్టె కథ, అతని వ్యథ, అతని చిరాకు అన్నీ నవ్వు తెప్పిస్తాయి. ఒక వేళ మనం పూర్తిగా సమాజానికి వ్యతిరేకం అయితే, అతడి పై సానుభూతో, సహానుభూతో కలిగి అయినా పట్టువదలని అతడి నుండి కాస్త ధైర్యం కలగవచ్చు ఏమో! అప్పుడీ పుస్తకం సిటీ బ్రావో కావచ్చు!

కానీ అటూ కాక, ఇటూ కాక ఉండే నా లాంటి వారు చదివితే మాత్రం, అప్పుడప్పుడు కస్సుక్, కిస్సుక్ మని నవ్వులు , మరి కొన్ని సందర్భాల్లో విపరీతంగా కెలికే ఇబ్బంది. చూసీ చూడనట్టు చేసుకుపోయే చాలా వెధవ పనుల్ని రికార్డు చేసి ఎవడో ముందు పెట్టి రి-ప్లే చేస్తున్నట్టుంటుంది. ఉదా: మన హీరో మెడికల్ కాలేజీ ఎంట్రన్స్ ఇంటర్వ్యూ కి వెళ్ళినప్పుడు, “ఎందుకు మెడిసన్” అన్న ప్రశ్న, “మా నాన్న వెళ్ళమన్నాడు” అన్న సమాధానం చెప్తాడు. ఇలా సమాధానం చెప్తే ఆ మనిషి మనమెలా “ట్రీట్” చేస్తామో, అక్కడున్న పేనల్ కూడా అలానే “ఇమ్మెచ్యూర్” అని నవ్వుకుంటుంది. మనం చిన్నప్పటి నుండీ శతకాల్లో, పద్యరత్నాల్లో వల్ల వేసిన నిజాయితీ మనం పెరిగే కొద్దీ “మెచ్యూర్” అయ్యిపోతుందేమో! అవతలి వారి అనువుగా ఉండేవి చెప్పాలి, నిజం కాకపోయినా. మన హిరో బయటకి వచ్చి వేరే వాళ్ళతో మాట్లాడితే గానీ తెలీదు, ఆ ప్రశ్న “నేను పేదలకు సేవ చేస్తాను”, “నేను కాన్సర్ కి ఒక నివారణ మందు కనుక్కుంటాను, ప్రపంచాన్ని కాపాడతాను” లాంటి లౌక్యమైన సమాధానాలు చెప్పాలి అని. అందుకని ఆ ఒక్క క్షణం అలా అవలీలగా నటించేసేవారికి ఈ పుస్తకం చెంప చెల్లుమనిపిస్తుంది. సిటీ స్కేరీ గా మారుతుంది.

ఇక ఒంటిరితనం గురించి! మొన్న ఎవరో “నా ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోతున్నారు, ఇక లోన్లీ గా ఉండాలి” అనగానే “అందరూ ఉండగా కూడా ఫీల్ అయ్యే లోన్లీ కన్నా ఇది చాలా నయం” అన్నాను. ఒక్కోసారి చుట్టూ మనుషులు ఎక్కువయ్యే కొద్దీ మనంలోని ఒంటరితనం ఎక్కువవుతుంది.  చాటు నుండి మాటు వేసి మరీ “దిగులు” మనల్ని దాడి చేస్తే నిశ్శబ్దం, నిస్తబ్దత, నిస్సత్తువ కలగలిపి మనతో బంతాట ఆడుకునే వేళ, ప్రపంచమంతా మనకి శత్రువులానే ఉంటుంది. అందుకే దూరంగా పారిపోవాలనుంటుంది. మన హీరో మరీ ఒక అడుగు ముందుకేసి, “అందర్నీ మెషీన్ గన్ తో చంపేస్తాను” అని ప్రతిన పూనుతాడు, బీచి మీద ఏకాంతంగా కాసేపు గడుపుదాము అని వచ్చేసరికి అంతా జనం ఉండటం చూసి. మన జీవితంలో ఇలా జరిగిన ఏ సంగతో లేక సందర్భమో గుర్తొస్తే సిటీ బ్యూటిఫుల్ కాస్త, సిటీ alienated అయ్యిపోతుంది.

అర్థం లేని అహాలు, అబద్ధపు ప్రతిష్టలు, బూటకాలు, నాటకాలు ఇవేవి కొత్తగా ఈ పుస్తకం కొనీ, చదివీ తెలుసుకోవాల్సిన పని లేదు. మనం చూసిన జీవితాల్లో అలాంటివి కోకొల్లలు! ఇందులో నాకు striking అని అనిపించింది మాత్రం, ఈ అబ్బి ఎడమ చేతి వాటం కావటం. అందులో విడ్డూరం ఏమిటని అనిపించచ్చు. ఈ కథలో రచయిత దాన్ని సమాజాన్ని ఎత్తి చూపటానికి చేసిన ప్రయత్నమల్లే కనిపిస్తుంది. ఈ పాత్రకి అన్నీ ఎడం చేత్తోటే, ఆఖరికి అన్నం తినడం కూడా. కథ మధ్యలో ఒకటి రెండు సార్లు “నేను లాబ్ లో ఎక్విప్ మెంట్ విరగొట్టా” అని చెప్తుంటే, చాలా అజాగ్రత్త మనిషి అనుకున్నాను. తీరా చూస్తే ఆ లాబ్ లో అన్నీ “కుడి చేతి వాటం” వారికి అనువుగా ఏర్పాటు చేయటం వల్ల వచ్చిన ఇబ్బంది. మనం కొన్నింటికి ఎంతలా అలవాటు పడిపోతామంటే, ఇంక వేరేలా కూడా చేయవచ్చు అని ఊహించలేమేమో అన్న దిశగా రచయిత నన్ను ఆలోచింపజేయడంలో సఫలమయ్యాడు.

తెలుగు సరళంగాను, సులువుగాను ఉండి, గజిబిజి లేని శైలి అవ్వటంతో ఈ పుస్తకం చదవటం చిటుకులో అయ్యిపోయింది. కాకపోతే, ప్రధాన పాత్రధారి చీటికీ మాటికీ  “ఇంబసైల్” అనటం, ఎవరికైనా “గాడు” తగిలించటం” కాస్త చిరాకుగ్గా అనిపించాయి. నా టపా చదివి ఇదేదో మోరల్ స్టోరీ అనుకునేరు, ఇది ఒక సామాన్య యువత కథ, నచ్చిన దానికీ, చేయాల్సిన దానికీ నలిగిపోయే అతి సామాన్యమైన కథ! అయినా నవ్వుకోడానికి బోలెడు అవకాశం. బాపూ గారేసిన ముఖ చిత్రం చెప్పకనే చెప్తుంది కథ మొత్తం! సింపుల్ గా చెప్పాలంటే, ఎప్పటికప్పుడు పరిస్థులకీ, మనుషలకీ అనుగుణంగా ఒక చక్కనైన అందమైన ముసుగు వేసుకోకపోతే, మనల్ని నిజం ఎంతలా కాల్చేస్తుంది అనే కథ!

ఈ రచన చేయడానికి హెమ్మింగ్వే “ఫేర్వెల్ టు ఆమ్స్” మరియు సలింగర్ “కాచర్ ఇన్ ది రయ్” ప్రేరణ అని రచయిత పేర్కొన్నారు. నా అనంతమైన “చదవాల్సిన” జాబితాలో అవీ ఉన్నాయి!

పుస్తకం వివరాలు:
పేరు: సిటీ బ్యూటిఫుల్
రచయిత: డా|| కేశవ రెడ్డి
పబ్లికేషన్స్: నందిని పబ్లికేషన్స్
పేజీలు: 92
వెల: రూ. 50
నేను కొన్నది: విశాలాంధ్ర (అబిడ్స్)

The Last Lecture నోట్స్ కావాలా? :-)


“వీకెండ్ ఏం చేశావు?” అని అడుగుతుంటే ఒక పుస్తకం చదివాను అని చెప్పాలి అసలైతే, కానీ “క్లాసు లో ఉన్నా ఇంత సేపూ” అని అనాలి అనిపించేంతగా ఉంది ఈ పుస్తకం. మరి క్లాసు అటెండ్ అయితే నోట్స్ ఉంటుంది కదా? అదే ఈ టపా! ఒక్కప్పుడైతే మన నోట్స్ కి తెగ ఫాన్ ఫాలోయింగ్ ఉండేది, అన్ని చోట్ల. ఇప్పుడు పూర్తిగా అలవాటు తప్పిపోయింది.

క్లాస్: The Last Lecture book
లెక్చరర్: Randy Pausch

* Somehow, with the passage of time, and the deadlines that life imposes, surrendering became the right thing to do – రాండీతో పరిచయం ఈ వాక్యంతోటే. చదవగానే “అబ్బా.. మరీ నిర్వేదం. ఎందుకు లొంగిపోవడం? ఎదురు తిరగాలి గాని? ఏం బాలేదు” అని అనుకుంటూనే అసలు అన్నవారి గురించి తెలుసుకుందామని గూగుల్లో వెతికితే, Randy Pausch ఒక అమెరికన్ కంప్యూటర్ ప్రొఫెసర్ అనీ, చిన్న వయస్సులోనే పాంక్రియాటిక్ కాన్సర్ బారిన పడి. జూలై 25, 2008 న మరణించారు అనీ. తాను మరణించబోతున్నారు అని తెలుసుకుని, కడసారిగా తన యూనివర్సిటీలో ఇప్పటిదాకా తన ప్రయాణాన్ని పునశ్చరణ చేసుకునేలా “Really Achieving Your Childhood Dreams” అన్న లెక్చర్ ని ఇచ్చారనీ, (వీడియో ఇక్కడ లభ్యం) అటు తర్వాత The Last Lecture అనే పుస్తకాన్ని రాశారనీ అని తెలిసింది.

* తరగతి గదిలో మహరాజులు/ మహరాణుల్లా కూర్చుని, మన ముందు నిలుచున్న వ్యక్తి వైపు తదేకంగా చూస్తూ పాఠాలు వింటున్నప్పుడు “క్లాసు రూం లో తపస్సు చేయిట వేస్టురా గురూ” అని అనిపిస్తుంది. బయటున్న ప్రపంచంలోకి వచ్చేసరికి మహారాజులం కాస్త సామాన్య ప్రజానీకం అయ్యిపోతాం. ఇప్పుడు మనల్ని ఆడించడం జీవితం వంతు. చాలానే నేర్పిస్తుంది జీవితం కూడా, కాకపోతే వీలైనన్ని తిప్పలు పెట్టి మరీ. అందుకే ఒక్కోసారి మళ్ళీ క్లాసుల్లోకి వెళ్ళిపోవాలనిపిస్తుంది నాకు. నాకు అర్ధమయ్యే స్థాయికి దిగి వచ్చి, నాకర్ధమయ్యే వరకూ ఓపిగ్గా చెప్పేవారుండడం కూడా అదృష్టం కదా?

* రాండీ అనగానే ఇక పై నాకు గుర్తు వచ్చేది కాన్సర్ కాదు. Imagineer (Imagination+Engineer) అన్న ఆంగ్ల పదం. రాండీకి చిన్నప్పటి నుండి వాల్ట్ డిస్నీలో పని చేయాలని కోరిక ఉండేది. అక్కడ పని చేసే వారిని ఇమాజనీర్స్ అని అంటారు. అబ్బుర పరిచింది ఆ పదం నన్ను. Engineering is not about perfect solutions; it’s about the best you can do with limited resources. ఉన్న పరిమితులని పడగొట్టటంలో ఊహలకున్నంత బలం అంతా ఇంతా కాదు. ఈ రెంటినీ సమపాళ్ళల్లో కలిపితే ఎన్ని అందాలను ఆవిష్కరించవచ్చు కదా! రాండీ ఎంచక్కా తనని తాను “ఇమాజనీర్” అనేసుకుంటారు, డిస్నీతో పని చేశారు కావున. నేను డిస్నీతో పని చేసే అవకాశం ఒక్కటే లేదు! ఉన్న ఇంజనీరింగ్ డిగ్రీ, నా ఊహలూ సరిపోతే బాగుణ్ణు ఆ పేరు పెట్టేసుకోవడానికి అని అనిపిస్తుంది. ప్చ్! 😦 (మరీ మనసును ఊరించేస్తుంది ఆ పేరు :-(( )

*ఇప్పుడో ఫుట్ బాల్ ఆటలో ఓ అబ్బి కాలి దగ్గర బాల్ ఉంటే, అతడు తల ఎటు వైపుకి తిరిగి ఉంటే అటే కొట్టేస్తాడేమో అని అనుకుంటాము కదా? కానీ అలా కాకుండా అతడి నడుము భాగాన్ని చూస్తే, ఖచ్చితంగా ఏ వైపుకి కొడతాడో చెప్పవచ్చునట. దీన్నే Head Fake అంటారు. ఈ పదాన్ని రాండీ “ఒకటి నేర్చుకుంటున్నాము అనుకుని దాన్ని అభ్యసిస్తున్నప్పుడు, మనం వేరేవి బాగా నేర్చుసుకుంటాము” అనే ప్రక్రియకి కూడా ఉపయోగిస్తారు. (indirect learning) మనం ఒక ఆట ఆడుతుంటే, మనం ఆ ఆటనే నేర్చుకుంటున్నాము అనుకుంటుంటాము, కానీ  అసలు నేర్చుకునేది శ్రమకోర్చడం, టీం వర్క్, పట్టుదల, కష్టాలను అధిగమించడం లాంటివి. ఇప్పుడూ నేను తెలుగు బ్లాగులు రాయడంలో కూడా “భాషా, భావ వ్యక్తీకరణ” మెరుగుపడాలి అని అనిపించినా, టైం మానేజ్ మెంట్, నచ్చని అభిప్రాయాలతో వినమ్రంగా విభేదించటం, నా అనుభవంలోకి రాని జీవితాన్ని చదివి ఆకళింపు చేసుకోవడం, ముఖపరిచయం కూడా లేని వాళ్ళతో ఆప్తులుగా కలిసిపోగలగడం లాంటివి తెలుగు బ్లాగుల వల్ల నేను నేర్చుకున్న(కుంటున్న) అసలైన జీవితం. హైడ్ ఫేక్ అంటే అర్ధం అయ్యిందిగా? మీ అనుభవాలు చెప్పండి మరి?

* “నువ్వింకో మూడు నెలల్లో చనిపోతావు, ఇక మేము చేసేది కూడా ఏమీ లేదు” అని ఒక డాక్టర్ ఓ మనిషితో చెప్తే నేల కింద భూమి కంపించినట్టు, ఓ పెద్ద అల వచ్చి శిలని కొట్టినట్టు అని నేను వర్ణించకపోయినా ఆ బాధ మీకు తెలుసు. బాధ, భయం, ఆశ, ఆవేశం, నిస్పృహ, అసహనం అన్నీ కలిసి ఒక్కసారిగా చుట్టుముట్టేస్తాయి. మెదడు పని చేయటం మానేస్తుందేమో అని అనిపిస్తుంది. కానీ రాండీ బుర్ర చకచకా పని చేస్తుంది ఇలాంటి సమయాల్లోనూ. ఇక లాభం లేదన్న మాట వినగానే కుప్పకూలిన భార్యని ఓదారుస్తున్న డాక్టర్ మాటల్లో “మందు”ని రాండీ ఇలా చెప్తాడు.
“..he isn’t putting his arm around her shoulder, I understand why. That would be too presumptuous. But he’s leaning in, his hand on her knee. Boy, he’s good at this.”
మాటల్లో ఎంత శక్తి కదా? ఒక అందమైన అనుభవాన్ని, అంతులేని అగాధాన్ని ఒక మాటతో సృష్టించవచ్చు. “నాకు మాటలంటే భయం” అని జనాలెందుకు దూరంగా పరిగెడతారో ఇప్పుడు అర్ధం అవుతోంది.

* “ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు/ప్రియుడు అంత కఠినం” అని బాధపడుతున్న అబ్బాయిలకీ, అమ్మాయిలకీ ప్రేమ క్షీర సాగరాన్ని మధించిన రాండీ ఓ బహు చక్కని ఉపదేశం ఇస్తున్నాడు. 🙂
“..the most inpenetrable bricks walls are made of human flesh. And the brick walls are there to stop the people who don’t want it badly enough. They are there to stop the other people.”
ఏ మనిషిలోనైనా మంచి అనేది ఉంటుందనీ, అది చూసే ఓపిక, సహనం లేకే మనం మనుష్యులని దూరం చేసేసుకుంటామని అని రాండీ అభిప్రాయం.

* ఇక ఈ తరం ఉద్యోగాలు చేస్తున్న అమ్మాయిలకు మరో గొప్ప మంత్రం. (తన కూతురికి ఈ విషయం చెప్పాలని రాండీ కోరిక. పాపకింకా నాలుగేళ్ళే!)
When it comes to men who are romantically interested in you, it’s really simple. Just ignore everything they say and only pay attention to what they do.

* Insurances ఎందుకో మనకి తెలుసు. మన తదనంతరం కూడా మన వాళ్ళకి ఆర్ధక ఇబ్బందులు లేకుండా చూడడం కోసం. రాండీ ఇంకో అడుగు ముందుకేసి, emotional insurance గురించి చెప్తారు. మనం పోతాం సరే, తర్వాత మనవాళ్ళు ఎలా బ్రతుకుతారు, మనం లేకుండా? మనిషిగా మిగలకపోయినా, మిగితా అన్ని రూపాల్లో మనం వారి దగ్గరుండేలా జాగ్రత్త పడాలి, ఫోటోల్లో, వీడియోల్లో, ఉత్తరాల్లో, వీలైనన్ని జ్ఞాపకాలని వదిలి వెళ్ళాలి అంటారు.

* తాను బ్రతికుండగా భార్య ఆఖరి పుట్టినరోజుకి ఒక పార్టీ ఏర్పాటు చేస్తారు రాండి. ఆవిడ ( పేరు జే) స్టేజీ మీదకు వచ్చీ రాగానే భర్తను గట్టిగా పట్టుకుని ఏడుస్తూ “please don’t die” అని అంటుంది. మన రాండీకి ఏదో హాలివుడ్ డైలాగు గుర్తు వస్తుంది. కానీ ఆమె అన్నది అవే పదాలు. మనకి తెలియకుండానే కొన్ని పదాలు ఎడా పెడా వాడేసి, వాటి విలువ తగ్గించేస్తామేమో అని అనిపించింది. “నిన్నే ప్రేమిస్తున్నాను”, “నువ్వు లేక నేను లేను”, “నీ కోసం”, “నిన్ను చూడకుండా ఉండలేను” లాంటివన్నీ ఇప్పుడు సినిమా టైటిల్లేనా? ఏమో!

* తనకే ఆక్సిడెంటో అయ్యి లేక గుండె పోటో వచ్చి ఉంటే, చివరి నెలల్లో జీవితాన్ని ఆనందించేవాడిని కాదని, తన వాళ్ళకోసం అంతా సంసిద్ధం చేయలేకపోయే వాడిననీ, ఒక రకంగా చూస్తే కాన్సర్ కూడా అదృష్టమే అని అంటారు. ఇది అక్షరాల నిజం అని ఒప్పుకుంటాము. ఎందుకంటే పుస్తకం మొదలెట్టినప్పుడు ఎంత భయంకరమైన మూడ్ లో మొదలెట్టానో, రాండీ కథ చదువుతుండగా, మనం ఊరెళ్ళాలి అంటే ఎంత హడావిడి ఉంటుంది: ఒక పక్క అన్నీ సర్దుకోవాలి, ఏదీ మర్చిపోకూడదు, మన బాధ్యతలని వేరే వారికి అప్పగించాలి, మనం వెళ్తున్నామని అమ్మ ఏడుపు మొదలెడితే ఊరుకోబెట్టాలి.. రాండీ ఈ లోకం నుండి ఇంకో లోకానికి వెళ్ళడానికి అలానే సిద్ధమయ్యారు. నాకు తెలీకుండానే నేను ఆ పనుల్లో మునిగిపోయాను.
రాండీకి కనీసం ఇన్నాళ్ళని టైం అన్నా ఉంది, మనకి అదీ లేదు. ఏ క్షణాన్న ఏ విపరీతానికి బలి అవుతామో తెలీదు. అంటే మనమెంత రెడీగా, preparedగా ఉండాలి అన్న ఆలోచన నన్ను తొలిచేస్తుంది.

అసలు క్లాసు అటెండ్ అవ్వాల్సిందే ఇందుకు. మనకి చెప్పే సబ్జెక్ట్ తో పాటు లెక్చరర్లు తన జీవితపు విశేషాలను చెప్తుంటే మనం వారి అనుభవాలనుండి నేర్చుకోవటం. నేను చెప్పినవి కాక, ఈ పుస్తకంలో ఇంకా చాలా విషయాలున్నాయి, ఎన్నో సూక్తులు, ఆదర్శాలు, మంచి మాటలు, ప్రేమలూ, అప్యాయతలూ, ఆలోచనలూ. కలలు నిజం చేసుకోవటమల్లే అనిపించినా కానీ రాండీ నేర్పించే అతి పెద్ద పాఠం.. “ఈ క్షణాన్ని ఆస్వాదిద్దాం”! Live in the moment! Time is all you have. And you may find one day that you have less than you think. పుస్తకాలు ఇందుకే చదవాలి, మనకి తెలియనవి తెలుసుకోవటం కాదు, తెలిసీ మర్చిపోయినవి గుర్తుచేస్తాయి అందుకు!

లవ్ ఇన్ ది టైమ్ ఆఫ్ కలరా!


(గమనిక: ఈ టపా ముఖ్యోద్దేశ్యం, Gabriel García Márquez రచించిన Love in the Time of Cholera అనే పుస్తకం చదువుతున్నప్పుడు గానీ, చదవడం పూర్తయ్యాకా గానీ నాలో కలిగిన ఆలోచనలు ఇక్కడ పెట్టడం మాత్రమే. దీన్ని సమీక్ష అని నేననుకోవటం లేదు. పైగా ఇవి ఈ క్షణానివి. మున్ముందు ఇవి మారే అవకాశం ఉంది. ఈ పుస్తకాన్ని ఇది వరకే చదువున్న వారు, తమ అభిప్రాయాలని తెలిజేస్తే నా ఆలోచనా పరిధిని విస్తరించుకునే అవకాశం ఉంటుందనే స్వార్ధంతో కూడిన ప్రయత్నం)

కథేంటంటే:
మొదట ఈ రచన గురించి తెలిసినప్పుడు, “ప్రేమకథే కదా!” అని పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. ఇంక్కొంచెం తెలుసుకునే సరికి “ప్రేమ కథే అయినా ప్రయత్నించచ్చు” అనుకున్నా. తీరా యెడా పెడా దీని గురించే వెతికే సరికి “ప్రేమకథే.. కానీ రొటీన్ కి భిన్నమైనది” అని గుర్తించి పుస్తకం మొదలెట్టా! ఒక అబ్బాయి తన టీనేజ్ లో ఒక అందమైన అమ్మాయిని చూసీ చూడగానే మనసు పారేసుకుంటాడు. వెంటపడతాడు, ప్రేమించి పెళ్ళాడమని అర్ధింస్తాడు. ముందు కాదూ కూడదు అన్న అమ్మాయి మెల్లి మెల్లిగా అతడి వైపు మొగ్గు చూపుతుంది. ఇంట్లో ఈ విషయం తెలిస్తే కష్టం కావున రహస్యంగా ఉత్తరాల ద్వారా సంభాషించుకుంటుంటారు. ఇది అమ్మాయి తండ్రికి తెలిసి పోతుంది. అందంలోనూ, ఆస్తిలోనూ, కుటుంబ గౌరవంలోనూ తనకి తగడని తెలిసి అబ్బాయిని బెదిరిస్తాడు. ఫలించక అమ్మాయిని దూర ప్రాంతాన్నికి తీసుకెళ్తాడు. విరహాగ్నిలో మండుతున్న మనసులను టెలిగ్రాములు కలుపుతాయి! నిరీక్షణ ఫలించి ఆమె సొంత ఊరికి వచ్చిందని తెలిసిన హీరో ఆమెను ఆటపట్టించాడానికి చాటుగా ఫాలో అయ్యి, ఆ అమ్మాయిని సర్ ప్రైజ్ చేద్దామనుకుంటాడు. ఆ అమ్మి “నిన్నా నేను ప్రేమించింది? ఛీ పో” అంటుంది. ఇతగాడి హృదయం ముక్కలవుతుంది. కొంత కాలాని పేరున్న డాక్టర్ తో అంతగా ఇష్టం లేకపోయినా ఆ అమ్మి పెళ్ళయ్యిపోతుంది. హీరో పిచ్చివాడై తిరుగుతుంటాడు. ఆమెను మర్చిపోలేకపోతాడు, అయినా ఇతర స్త్రీల నుండి తనకి కావాల్సింది పొందుతూనే ఉంటాడు. హీరోయిన్ వైవాహిక జీవితం కాస్త ఒడుదుడుగలతో, కాస్త ఆనందం, మరి కాస్త అసహనంతో అటూ ఇటూ అయినా, “అన్యోన్య దాంపత్యం” అని అనిపించుకునేలా నిలబడుతుంది. ఈ క్రమంలో యాభై ఏళ్ళు గడిచేసరికి, డాక్టరు గారు మరణిస్తారు. అప్పుడు మన హీరో వెళ్ళి “ఈ రోజు కోసమే ఇంత కాలం వేచి చూశాను, మనం పెళ్ళి చేసుకుంద్దాం” అని అంటాడు. ఆవిడ (డైబ్బై ఏళ్ళ ఆమెను ఇక అమ్మాయి అనలేము కదా!) మళ్ళీ “ఛీ పో” అంటుంది. హీరో మళ్ళీ ఉత్తరాలు రాస్తాడు, ఈ సారి టైపు మెషీన్లో! ఫోన్లో కూడా! మొత్తానికి ఈ సారి తను ఒప్పుకుని వారిరువురూ కలిసి సహజీవనం కొనసాగిస్తారు.

అస్సలూ.. కథేంటంటే:
ఇదే కథ అని తెలుసుంటే నేనీ పుస్తకాన్ని ముట్టుకునే దాన్ని కాదు. తెలిసే సరికి ఆలస్యం అయ్యింది. అప్పటికే నేను పుస్తకంలో మునిగి పోయాను. ఈ రచనని మొదలెట్టడమే మన చేతుల్లో ఉంది. అటు తర్వాత మనల్ని తనకిష్టం వచ్చినట్టు ముందుకీ వెనక్కీ ఓ శతాబ్ద కాలంలో తిప్పుతాడు రచయిత. ఎప్పుడు ఏ విషయమైనా చెప్పేస్తాడు. ఊరించడు, టెన్షన్ పెట్టడు, కానీ ఊపిరి ఆడనివ్వడు. అంతా అయ్యిపోయాకా “ఇదా కథా?” అని బిక్కమొహం పెట్టలేదు, “అసలేంటీ కథా?” అంటే నాకర్ధమయ్యిందేంటంటే It is (just) NOT a love story! If at all love has a story for itself, it is this. Love in all kinds, in all forms and in all disguises. ఇది కేవలం ప్లొరెంటినో, ఫెర్మినా ప్రేమ కథే అనుకున్నా రచయిత శైలి వల్ల బాగుందనిపిస్తుంది, నాకు ఈ వచనం కొత్తగా, హాయిగా అనిపించింది. ఈ ఇరు పాత్రలపై సానుభూతి, సహానుభూతి, జాలి, కరుణ వైగారా లన్నీ పుష్కలంగా పుట్టుకొస్తాయి. ముఖ్యంగా ఫ్లొరెంటినో పిచ్చితనం, మొండితనం గురించి చదువుతున్నంత సేపూ నాకు పిచ్చి ఎక్కింది. అతడి బాధను చూసి (చూపిస్తాడు రచయిత) ఏం చెప్పాలో, ఏం అనాలో తెలీక నిస్సహాయంగా ఉండిపోయాను. (ఇది ఒక నవలలో కాల్పనిక పాత్ర కాబట్టి నా స్పందన కాస్త అతిగా అనిపించచ్చు. కానీ నిజజీవితంలో కూడా ఎప్పుడైనా ఎవరైనా ప్రేమ బారిన పడితే వారిని ఓదార్చలేము, అలా అని వదిలేసి ఊరుకోలేము. అప్పటి వరకూ వాళ్ళ జీవితంలో మనది అతి ముఖ్య పాత్ర అయినా ప్రేమ విషయానికి వచ్చేసరికి కేవలం “ప్రేక్షక పాత్ర” కి పరిమితం అవుతాము. ఆ పరిస్థితిని ఎలా వర్ణించాలో నాకు తెలీటం లేదు.) ఇక వారు జీవిత చరమాకంలో తీసుకున్న నిర్ణయం కాస్త (విశాలంగా) ఆలోచిస్తే సహేతుకమనిపిస్తుంది. పూర్తిగా నమ్మశక్యంకాని పాత్రను కూడా మనస్పూర్తిగా ఒప్పేసుకోవచ్చు. కాకపోతే ఈ రచనలో ఇంకా చాలా విషయం ఉంది.

కథ యొక్క కథ ఏటంటే:
ఇప్పుడు జమ్మూ నుండీ కన్యాకుమారి వరకూ ఒక నాన్-స్టాప్ రైలు ఉందనుకోండి. జమ్మూ లో ఎక్కేసామనుకోండి. మార్గంలో భారత దేశాన్ని చాలా వరకూ చూడచ్చు. ఎన్నో వింతలూ, విశేషాలూ, గట్లు, చెట్లు, పుట్టలు, కొండలు కోనలూ అన్నీ కనిపిస్తుంటాయి. కాసేపు ఆగి చూసుకోవాలనిపిస్తుంది. వీలుంటే దిగి ఫోటోలు తీసుకోవాలనిపిస్తుంది. కానీ రైలు ఆగదు. అది, దానితో పాటు మనం వెళ్తూనే ఉంటాము. మన మనస్సులో వీటన్నింటి స్నాప్ షాట్స్ మాత్రమే మిగులుతాయి. ఈ పుస్తకం ఒక నాన్-స్టాప్ రైలు బండి అనుకుంటే మనం తిరొగొచ్చేది “ప్రేమ“ను మాట. చూపించాల్సినవి చూపిస్తూనే ఎక్కడా ఎక్కువ సేపు నిలిచిపోకుండా రచయిత మనల్ని తీసుకెళ్తుంటాడు.
ఉదాహరణలు: ప్రేమ కోసం చావడాలు, చంపుకోడాలు మనికి కొత్త కాదు. కానీ “చావులోనే నాకు ఆనందం” అన్న ప్రియుణికి దగ్గరనుండి చనిపోడానికి సహకరించే ప్రియురాలు ఉందంటే విస్తుపోయే సమయం ఉండదు. వధూవరులిద్దరూ చిటికెన వేళ్ళు పట్టుకుని వైవాహిక జీవితాన్ని మొదలెడతారు. కొత్త ప్రపంచంలో అమ్మాయికి అన్నింటికీ ఆ అబ్బాయి మార్గదర్శకం. ఎన్నో ఉడుదుడుకులు ఎదుర్కొటున్నా జీవన నౌక మాత్రం సాఫీగా సాగటం వీరి ప్రధమ లక్ష్యం. బాధ్యతలన్నీ తీరి జీవన సంధ్యలో ఉండగా వయస్సు మీద పడి, వృద్ధాప్యంలో మళ్ళీ బాల్యం చూసుకుంటూ అతడిని కాపాడుకోవటం ఇప్పుడామె వంతు. For a husband, wife is the first daughter అని ఎక్కడో చదివాను. ఈ నవల చదివేటప్పుడు And for a wife, husband is the last son అని పొడిగించాలి ఏమో అనిపిస్తూ ఉంది, కానీ ముందుకెళ్ళక తప్పలేదు. ఆమె వంటి పరిమళం తనలో ఇమిడిపోవాలని, ఆ పరిమళానికి దగ్గ్రరగా ఉండే పూరేకుల రసాన్ని తాగి వాంతి చేసుకున్న పద్దెనిమ్మిదేళ్ళ అబ్బిని తిట్టుకోవాలో, జాలిపడాలో తేల్చుకునే లోపు బండి సాగిపోతుంది. ఇక కొన్ని రకాల ప్రేమలు చదువుతున్నప్పుడైతే పుస్తకాన్ని నేలకేసి కొట్టాలి అనేంత విరక్తి కలిగింది. కొట్టేలోపే, వాటిని దాటి పోవాల్సి వచ్చింది. రైలు కదులుతుండగానే ఫొటోలు తీసినట్టు, ఈ రచనలో కొన్ని వర్ణనలను, పంక్తులను మార్కు చేసుకున్నాను. కానీ వాటి వల్ల ఎంత ఉపయోగమో చూడాలి.  విడిగా రాయడానికి ప్రయత్నిస్తే బాగుంటుందనిపించింది.

కథ వెనుక కథేంటి?
“ఇరవయ్యోకటో శతాబ్దంలో ఇరవయ్యో పడిలో ఉన్నవారు ప్రేమ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ప్రేమంటే ఏమిటసలు? మనతో పాటు మన సమాజానికీ నచ్చితే అది ప్రేమ, లేకపోతే ఏదో ఒక అనకూడని పదాలు వాడేసి తప్పించుకుంటున్నామా? మనం ప్రేమను, ఏ ముసుగూ లేకుండా, ఆహ్వాన్నించగలమా? ప్రేమంటే రొమాంటిక్ ఇంకా ఫీల్ గుడ్ మాత్రమేనా?” లాంటి ఆలోచనలతో కాసేపు కొట్టుకుని, నాకెక్కిన పిచ్చి కనపడిన ప్రతీ వారినీ ప్రశ్నిస్తూ వారికి కొంచెం కొంచెం పంచుకుంటూ, కాసేపటికో కొన్నాళ్ళకో పక్కకి పెట్టేయడం మామూలుగా జరగాల్సినవి. కాకపోతే, ఎందుకో తెలీదు కానీ, I want to reverse engineer, this piece of art! రచయిత ఎందుకు అలానే రాశాడు అన్నది నన్ను వేధిస్తున్న ప్రశ్న. రెండు అంగుళాలు కూడా లేని  చిట్టి పాదాలు ఓ పెద్ద మనిషి చెప్పులు వేసుకుని నడవడమల్లే ఉంటుంది నేనీ ప్రయత్నం చేస్తే! అయినా చేస్తా!
నాకయితే ఇందులో ఉన్న ముఖ్య పాత్రలు అమ్మాయి, అబ్బాయి, ఇంకా అమ్మాయి భర్త:  ఆ అబ్బాయి ప్రేమకి పరాకాష్ఠ కాదు, మనుష్యాకారం ప్రేమకి. అందుకే అతని ఆకారం తికమక పెట్టించేలా ఉంటుంది, ఊరూ పేరూ, సమాజ గౌరవం లాంటివేవీ ఉండవు. చీదరించుకున్నా ఎవ్వరూ అతడిని తప్పించుకోలేరు. ఆ అమ్మాయి భర్త పెళ్ళికీ, లేకపోతే మన వ్యవస్థకీ ప్రతీక. అందుకే అన్ని హంగులూ ఉంటాయి అతనికి, డబ్బు, పరపతి, హోదా వగైరా వగైరా! ఒకచోట ఆ ఆమె అనుకుంటుంది, “ఇన్ని ఉన్నా ఇతడు చాలా వీక్” అని, అచ్చు వ్వవస్థలానే! ఇక ఆ అమ్మాయి ఒక సామాన్య మనిషి. ప్రేమకీ వ్యవస్థకీ మధ్య నలిగే ఒక సాధారణ మనిషి. ఈ రచనకి సంబంధించి వ్యాసాలు, రచయిత ఆలోచనలూ చదివితే ఏమైనా తెలుస్తుందేమో! కానీ అందాకా నా ఊహలను ఆపటం కష్టం.
ఇంకో తమాషా ఊహ ఏంటంటే, చిన్ని పిల్లలు చేయద్దు అన్న పనులు చేస్తే తల్లిదండ్రులు తిట్టడమో, కొట్టడమో చేస్తారు. అదే తాతయ్యలూ అమ్మమ్మలూ బుజ్జగిస్తూ కథ చెప్తూ ఆ కథలోనే పిల్లలకి చేరాల్సిన విషయం చేరేలా చూస్తారు. అందులోనే చెంపదబ్బలు ఉంటాయి, కానీ మనకి తగలవు. విశ్వజనీయమైన ప్రేమను వ్యవస్థ బంధనాల్లో ఇరికించే సమాజం / మనుష్యులు / ఆలోచనల మీద ఒక సటైర్ ఈ రచన అని నాకనిపిస్తోంది.

ఈ పుస్తకం చదవాలా?
నా ఆలోచనలతో ఇంకా ఉన్నందుకు ముందుగా ధన్యవాదాలు. ఈ పుస్తకం చదవాలా వద్దా అని ఆలోచిస్తుంటే ఒకటి చెప్పనా? వెన్నెలంటే అందరకీ ఇష్టమే! కాకపోతే there is a darker side of the moon as well. ఆహ్లాదం కలిగించే వెన్నెల నుండీ అమావాస్య తెచ్చే చిమ్మ చీకటని వరకూ  అన్నీ “భరించగలరు” అని అనుకుంటే ఈ పుస్తకాన్ని చదవండి. లేకపోతే లైట్! 😉 ఇంకా ఎంతో రాయాలని ఉంది, ఈ ఆలోచనల తూఫాను తగ్గాక ప్రయత్నిస్తా, I’m not done yet, neither with the book, nor its author!

* This book is so easily available in the pdf format on net, but is not advisable to read it there. 🙂

హైద్ లో ఓ సాయంత్రం, సముద్ర తీరాన!


కల కాదుగా నిజమే కదా, నిను చూస్తున్నా
సంతోషమై కెరటానిగా పడి లేస్తున్నా

నిజ జీవితంలో కూడా నేపధ్య సంగీతం పాటలూ ఉంటే, ఇలాంటి పాటలన్నీ ఏరుకుని మరీ “ప్లే” చేసుకోవాల్సిన సందర్భం అది నా జీవితంలో! నేను ఇన్నాళ్ళు చూడని, ఎప్పటికి చూస్తానో తెలియని “సముద్రం” నా కళ్ళముందు నిలవడం, ఒక మరుపురాని అనుభూతి. మా తొలి ముఖ పరిచయానికి కోవళం వేదికగా మారింది. నేనొచ్చానని తెలిసి సముద్రం మరీ ఉత్సాహంగా ఉరకలు వేస్తుందోమో అన్న ఊహా రాకపోలేదు. 🙂 ముఖ పరిచయం ఇప్పుడే అయినా, సముద్రం నాకెన్నాళ్ళగానో తెలుసునన్న ఫీలింగ్. నేను చిన్నప్పటినుండీ బాగా చూసిన నీటి సమూహం అంటే హుస్సేన్ సాగరే!! అంతకు మించి నదులని కానీ, సముద్రాలనీ కానీ చూసే భాగ్యం లేకపోయింది. అయినా అవెందుకో నా మనసులో ప్రత్యేకంగా నిలిచిపోయాయి. నగర జీవితం అంటేనే సహజ సిద్ధమైన ప్రకృతికి దూరంగా ఉంటుంది. అయినా సముద్రుడు నాకు అత్యంత ఆప్తుడు అన్న భావన కలగడానికి నేను “ఊహించుకోవడమే” కారణం. వాస్తవికతకు దూరంగా ఉండే ఊహల వల్ల ఏంటి ప్రయోజనం అని చాలా మంది అభిప్రాయం. ఊహలంటే ఊసుపోక చెప్పుకునేవి, వాటి వల్ల ఒనగూరేది ఏమీ లేదనిపించచ్చు. Some men see things as they are and say why, I dream things that never were and say “Why not” అన్న కోట్ చదివినప్పుడల్లా వాస్తవికతంటూ మనకి కనిపించనవి, అనిపించనవి ఉన్నాయని తెలుసుకోకుండా, మనల్ని మనమే బంధించేసుకోకుండా కాపాడేవి ఇవే అనిపిస్తుంది.

మా వాళ్ళు నా చేతిలో ఒక డిజీ కామ్ పెట్టేసి, “అదో అలా వస్తున్న అల ఇలా ఈ రాయిని ఢీకొట్టినప్పుడు, నువ్వులా క్లిక్ మనిపించేయ్” అని చక్కా చెప్పి ఫోజులిచ్చి నిలబడ్డారు. నేనూ సిద్ధమే, అల సిద్ధమే, మా వాళ్ళూ సిద్ధమే, ఇక క్లిక్ మనిపించటమే తరువాయి అన్న క్షణాన చట్టుకున్న ఓ మోస్తారుగా ఉన్న అలలు  రెండు ఇరువైపులనుండీ వచ్చి చూట్టేసాయి. అంత చల్లని నీరు ఒక్కసారిగా అంత ఉదృతంగా తాకేసరికి “వాఆఆవ్” అంటూ నేను అరుస్తూ గెంతులు వేయడం, ఫోజు భంగపడిన మా వాళ్ళు నన్ను తిట్టుకోవాలో, అలలను తిట్టుకోవాలో తికమకపడుతుండగా, వెనుక నుంచి మరో పెద్ద అల. “బీ రెడీ.. బీ రెడీ” అన్న హడావిడి, ఫోజులూ, మళ్ళీ అలలు, మళ్ళీ కేరింతలూ. “రా, రా” అని పిలిస్తే అలలు రావు. “ఇప్పుడు కాదు” అంటే వినవు. అచ్చు ఆలోచనలానే! “ఇది ఎలా చేయటం అబ్బా” అని తల పట్టుకుని కూర్చున్నప్పుడు ఆలోచనలు రావు. ఏ కిశోర్ కుమార్ పాటలో మునిగిపోయినప్పుడో, అన్నీ సర్దేసుకుని నిద్రకు ఉపక్రమిస్తున్న వేళకో చట్టుకున్న మెరుస్తుంది ఐడియా నాకైతే. మీకలా అనిపించిందా?

హమ్మ్.. సముద్రంతో ఆటలూ, పాటలూ అన్నీ అయ్యాక గూటికి చేరాను. నా సముద్రం (అంతర్జాలం)లో ప్రయాణం షరా మామూలుగా కొనసాగుతూ ఉన్న వేళ, “నాకైతే తిలక్ లో కొద్దిగా hemingway లక్షణాలు కనిపిస్తాయి” అన్న అభిప్రాయం విని, కాసేపు గూగిల్లాను. వచ్చిన టన్నులకొద్దీ ఇన్ఫో ని చూసి చట్టుకున్న టాపిక మార్చేశాను. అయినా “పరిచయాలు” ఏర్పడాలీ అన్న సమయానికి ఏర్పడుతూనే ఉంటాయి. తప్పించుకునే మార్గం ఉండదేమో! “The Old man and the Sea” అన్న పుస్తకం మీరు చదివారా? అన్న ప్రశ్నను మర్నాడు జీటాక్ తేలిగ్గా మోసుకొచ్చేసింది. “లేదే.. చూడాలి” అని ఈ సారి గూగిల్లితే నిన్న రాత్రి “ఇప్పుడు కాదులే” అనుకున్న hemingway!  ఈ పుస్తకం ఒక నొవెల్లా అనగానే ఆశ పెరిగి బద్ధకాన్ని పక్కకు తోసేసింది. చిటికేసే లోపు పి.డి.ఎఫ్ ఫార్మాట్ దొరకడం, ఎడమ చేతి వేళ్ళతో చిటికె వేయడానికి ఓ పది సార్లు ప్రయత్నించే లోపు ప్రింట్ ఔట్లు రావడం, ఈ వీకెండ్ సముద్రంతో నా డేట్ ని మళ్ళీ ఫిక్స్ చేశాయి. ఈ సారి హైద్ వేదిక. 🙂

మొదలెట్టాను చదవటం, పుస్తకం పేరులో ఉన్న “ఓల్డ్ మాన్” 80 రోజుల నుండీ ఒక్క చేపను కూడా పట్టలేకపోయి, నీరసించి ఉన్న జాలరి. నిరాశ, అదృష్టలేమిని పక్కకు తోసి మళ్ళీ సముద్రంలో వేటకు పోతాడు. అతను చేపలు పట్టడం నేర్పిన శిష్యుడు తోడు రాకపోవటంతో ఒంటరిగా బయలుదేరుతాడు. పడవలో ప్రయాణం మొదలెట్టాక, కథంతా ఆ ముసలతనూ, సముద్రమూ మాత్రమే పాత్రలు. సముద్రాన్ని మచ్చిక చేసుకుంటూ ఓపిగ్గా చేప పడుతుందేమో అని వేచి చూస్తూ ఉంటాడు. కాళ్ళూ చేతులూ సహకరించకపోయనా, తనతో పాటు మరో వ్యక్తి సాయం లేకపోయినా తదేక దీక్షతో తన పని చేసుకుంటాడు. శారీరిక శ్రమను, మానసిక ఆందోళనను పట్టించుకోకుండా పడ్డ శ్రమకు తగ్గ ఫలితంగా అతని ఒక చేప పడుతుంది. అది మామూలు చేప కాదు, చాలా బరువుగా, పెద్దగా అందంగా ఉండే చేప. తన గాలానికి చిక్కిన చేపను చంపగలిగాడా? ఒక్కడే ఒడ్డుకి తీసుకురాగలిగాడా? అమ్ముకుని అన్ని రోజుల దరిద్రాన్ని పోగొట్టుకున్నాడా? ఇన్ని రోజులుగా దోబూచులాడిన “లక్” ఇప్పుడైనా అతనికి సాయం చేసిందా?  అన్నదే తక్కిన కథ! రెండు ముక్కల్లో కథ మొత్తం చెప్పేయచ్చు, కానీ చదివితేనే బాగుంటుంది. 🙂

కథ చదువుతూ కొన్ని సార్లు కునిపాట్లు పడ్డాను. అది నాకు విపరీతంగా నిద్ర వస్తుందా? లేక రచన కొంచెం డల్ గా ఉందా? చెప్పాలంటే నేనింకోసారి చదవాల్సిందే! మరీ ఊపిరి బిగపెట్టి చదివించేలా లేదనే అనిపించింది. కానీ ఎప్పటిలాగే రచనలో ఎలా చెప్పారు కన్నా, ఏం చెప్పారు అన్నదే నాకు ముఖ్యం కనుక ఈ కథ నాకు బాగా నచ్చింది. ఈ రచనలో సముద్రాన్ని  “as feminine and as something that gave or withheld great favours, and if she did wild or wicked things it was because she could not help them” వర్ణించడం కొత్తగా అనిపించింది. నేనెప్పుడూ సముద్రాన్ని పుఃలింగంలోనే చెప్తారనుకున్నాను. ఈ కథనుండి నేర్చుకోవాల్సిన నీతి ఏమనగా “నీ ప్రయత్నం నువ్వు చేస్తూనే ఉండు. ఏమి / ఎవరు కలసి వచ్చినా రాకపోయినా!” ఎంత ప్రయత్నించినా ఒక్కోసారి మనకి కావాల్సిన ఫలితాలు రావెందుకో? అయినా ప్రయత్నించడం మాత్రమే మానకూడదు. ఇందులో ఒక చోట ముసలతను అనుకుంటాడు “అదృష్టం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు. కానీ అది వచ్చేటప్పకి మనం పూర్తిగా సిద్ధమై ఉండాలి. మన ప్రయత్నంలో ఎక్కడా లోపం ఉండకూడదు” అని. Jonathan Livingston Seagul తర్వాత చాన్నాళ్ళకి ఒక మంచి కథ చదివాను అనిపించింది.

ఇది చదవడానికి సిద్దమవుతుండగా తారసపడిన వ్యక్తిని “మీరు చదివారా?” అని అడిగాను. “ఇది చదవలేదు కానీ  Iceberg Theory ఈ రచయితదే. తెలుసునా?” అని ప్రతిగా నన్ను అడిగారు. నాకు వారు వివరణ ఇచ్చిన దాని బట్టి, వికీలో చదివి కాసేపు ఆలోచించిన దాని బట్టి కొంచెం కొంచెం అర్ధమవుతూ ఉంది. నేరుగా చెప్పకపోయినా పాఠకుడుకి ఆ విషయం తెలిసేలా రాయడం.. హమ్మ్! ఇంటెరెస్టింగ్. వీలైనంత త్వ్రరగా అలాంటి రచనలు చదవాల్సిందే!

ఒక అల వచ్చి తీరం తాకగానే నెమ్మదిగా నిష్క్రమించి మరో అలకి దారి ఇస్తుంది. అలానే ఒక ఆలోచన మరో ఆలోచనకి దారిచ్చి మరుగున పడుతుంది. ఒక లింక్, ఇంకో లింక్ కి దారి చూపిస్తుంది. సో.. ఏ విధంగా చూసుకున్నా ఈ ఆదివారం సాయత్రం నేను సముద్రంతో హాయిగా గడిపేశాను. ఇంతకీ ఈ పుస్తకాన్ని మీరు చదివారా?? 

తిలక్ కథలు – 1


ఓ శనివారం మధ్యాహ్నం పూట కోఠికి వెళ్ళాను, ఒక స్నేహం కొన్ని తెలుగు పుస్తకాలు కావాలంటే తీసుకొద్దామని. కావాల్సినవి కొని బయటకి వస్తుండుంగా, ఇరుగ్గుగా ఉన్న ఆ కొట్టులో, ఓ వ్యక్తిని దాదాపుగా గుద్దబోయి ఎలానో సంభాళించుకున్నాను. “క్షమించండి” ని నవ్వుగా మార్చి మాట కలిపాను. కొత్త పరిచయాలన్న బెరకు ఎటూ తక్కువ కాబట్టి ఏవేవో మాట్లాడుకున్నాము చాలా సేపు!! మధ్యలో “అతని” ప్రస్తావన వచ్చింది. “ఆ తెలుసులే..అయినా నాకవన్నీ పెద్దగా ఎక్కవు” అన్నట్టు విన్నాను. ఆయన చెప్తూనే ఉన్నారు, వినలేదనుకున్నాను గాని, విచిత్రంగా అతని గురించే ఆలోచనలు, నాకు తెలీకుండానే నా మస్తిష్కంలో అతడు పాతుకుపోయనట్టు. ఇక లాభం లేదు, అతని ఊహలతో ఉక్కిరిబిక్కిరి అయ్యే కన్నా నేరుగా కలిస్తే పోలే అని నిర్ణయించేసుకున్నాను!! కాస్త భయమూ వేయలేకపోలేదు. కానీ భయాన్ని మించినదేదో నన్ను తన వైపుకి అడుగులు వేసేలా చేసాయి. “ఏదో” కాదు, అతడు ఎప్పుడో అన్నప్పుడు నేను విన్న మాటలు: “స్వార్ధం కన్నా గొప్ప శక్తి లేదు. ఈ ఆదర్శాలు, ఆశయాలు అన్నీ ఆ ప్రాధమిక స్వార్ధానికి అంతరాయం కలిగించనంత వరకే!!” మరో ఆలోచన లేకుండా నడుస్తున్నాను, పూర్తి స్వార్ధంతో!!

“నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు” – అతనితో నా తొలి పరిచయం!! ఆ పరిచయం నా ఊహలకు కొత్తగా రెక్కలు కట్టి ఎక్కడెక్కడికి తీసుకుపోలేదనీ!! గాంభీర్యమో ప్రశాంతతో తెలియన్నివ్వకుండా ప్రవహిస్తున్న గోదావరి, ప్రపంచపు దృష్టి నుండి మిమల్ని కాపాడుతా అన్నట్టు అభయమిస్తున్న ఎత్తైన పాపికొండలు, ఆ తీరాన ఉన్న ఇసుక వెన్నెల్లో వెండిగా అనిపిస్తుంటే ఆడపిల్లలందరూ ఓ చోట చేరి నడుస్తుంటేనే ఆ మువ్వల సవ్వడి ఎంతటి హృదినైనా తట్టి లేపదా?? అలాంటిది ఇక ఆటపాటలతో అమ్మాయిలంతా ఆనందిస్తుంటే, గాజుల గలగలలూ నవ్వుల సరిగమలూ ఏ మనసైనా “ఆహా” అనకుండా ఉండగలదా?? హమ్మ్.. వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు!! అతని అక్షరాలు!!

సరే కలిసాను, “హే.. ఇస్ థిస్ తిలక్?” అంటూ కరచాలనం చేయవచ్చు!! కానీ ఎందుకొచ్చినదని మర్యాదగా “నమస్కారమండీ” అని పలకరించాను. భలేంటి ఆకారం, చూడ ముచ్చటైన ముఖం కానీ ఏదో తెలియని “గాంభీర్యం” ఆ కళ్ళల్లో చూసి నేరుగా చెప్పాలనుకున్నది చెప్పేసా. “మీరు కథలు కూడా రాస్తారని మొన్నే తెలిసింది. మీరు రాసిన కవితలు నేను చదవలేదు. ఎందుకో కవితలంటే అంత త్వరగా మనసు పోదు!! కథలు చెప్పండి, వింటాను” అన్నాను.

మరెలాంటి ప్రశ్నా లేకుండా, మొదటి కథ మొదలయ్యింది. పేరు “లిబియా యెడారిలో”. చిన్ని కథే!! యుద్ధానంతరం ఛిద్రమై చిందరవందరగా పడి ఉన్న సైనికుల శరీర భాగాలు మాట్లాడుకుంటున్నట్టు ఆ కథ. అందులో ఒక సైనికుడి చేయి మాటి మాటికీ “నా భార్య, నా పిల్లలూ” అంటూ ఉంటుంది. “నా ప్రత్యణువులోనూ నువ్వున్నావు ప్రియా” అన్న మాట నిజమైతే ఇలానే ఉంటుందా అనిపించింది. ప్రేమను చావుకూడా చంపలేదేమో కదా!! కథలో యుగయుగాలు మనిషి చేస్తున్న వ్యర్ధ ప్రయత్నాన్ని, దిగులుని, చావునీ, అర్ధం లేని జవాబు రాని ప్రశ్నని అన్నింటినీ చెప్పీ చెప్పకుండానే చెప్పేస్తారు. మనిషంతే అనుకున్నా, మనిషి గురించి నాకు మహా తెలిసినట్టు!! అందుకే దాని గురించి ప్రశ్నలు వేయకుండా, “బాగుందండీ కథ!! అదే నేనయితే ఏదో ఒక అవయువంతో ఓ స్వగతం చెప్పించి ఊరుకునేదాన్ని!! మీరు భలే కథలా చెప్పేరే!! మనిషి పోయినా, మనిషి భాగాలు అతడిలానే ప్రవర్తిస్తాయేమో అన్న ఊహ భలేగా ఉంది.” అన్నాను.

రెండో కథ మొదలయ్యింది. “కదలే నీడలు”. ఇదీ యుద్ధం గురించే, కాకపోతే వీళ్ళు చనిపోలేదు, అంతకన్నా భయంకరమైన ఒంటరితన్నాన్ని అనుభవిస్తున్నారు. ఊరు కాని ఊరిలో అయిన వాళ్ళకి, ఇష్టమైన వాటికి దూరమై, బిక్కు బిక్కుమంటూ యుద్ధంలో పోరాడుతున్నవారికి మనో”గతం” ఎలా ఉంటుంది?? ఆమెను భర్త వదిలేశాడు, అతనికి పెళ్ళికాక ముందే భార్య చనిపోయింది (అవును, సరిగ్గానే రాశాను, మీరూ సరిగ్గానే చదివారు). వారిద్దరి మధ్యా ఓ కృష్ణపక్షపు గుడ్డి వెన్నెల్లో అడుగులతో పాటు మాటా మాట కలిస్తే?? “వాహ్.. వాహ్” అనేసాను ఉత్సాహం ఆపుకోలేక, “ఫ్రాంక్ గా చెప్పనా, తెలుగు కథలు అంటే ఇలాంటి సబ్జెక్ట్ ఉంటుందని ఊహించలేదు. నాకు చెప్పటం రావటం లేదు కానీ, ఒక మనసుకి ఇంకో మనసు తోడవ్వడం, ప్రపంచం పెట్టిన ఆంక్షలను దాటిపోయేలా..” అంటూనే ఉన్నాను, మూడో కథ మొదలయ్యింది.

“అద్దంలో జిన్నా” కథ పేరు. పొలిటికల్ లీడరు కథ. “మనిషి మాటను సృష్టించాడు. మాట మనిషిని బంధించింది” అన్నదానికి నిలువెత్తు తార్కాణం ఈ కథ. స్వార్ధంతోటే, అహంతోనే ఒక్కసారి మాట ఇచ్చి నమ్మించేశాక, అది అబద్ధం అని చెప్పినా ఎవరూ నమ్మరు. “మనిషిలో ఉండే అహం, పతనానికీ, ఔన్నత్యానికీ, పరిశ్రమకీ, పరిణామానికీ కారణభూతమైన మూల శక్తి!! అలగ్జాండరినీ, గజినినీ, సముద్రాలూ, భూములూ, పర్వతాలు దాటించిన బలీయ స్వభావం అది!!” అని తిలక్ చెప్తూ ఉంటే, “నిజం!! నాదీ అదే అభిప్రాయం. అసలు “నేను” అంటూ లేకపోతే నా చూట్టూ ఎవరుంటారు?? నాతోనే కదా అందరూ!! మీరన్నది నిజం, నిజం!!” అని తలూపాను. ఈ అహాన్ని చంపేయడం వల్లే మనలో చాలా మంది ప్రతీ దానికి తలవంచుకుపోయే స్వభావం అలవర్చుకుంటారు. మరికొందరు, దానికి లొంగిపోయి, తానా అంటే తందానా అంటారు. కానీ “అహం” మనిషికి మూలం!!

“హోటల్లో” నాలుగో కథ!! ఒక మనిషి ఐదు రోజులు పొందుపరుచుకున్న వ్యక్తిగత దినచర్యగా ఈ కథ చెప్తున్నాడు తిలక్!! “నన్ను ప్రేమించీ, నాకోసం త్యాగం చేసిన ఆమెను ప్రత్యుపకారంగా చంపేసాను” అనే భర్త కథ తెలుస్తుంది మనకు. సైకో కాదతడు. మానసిక రుగ్మతలేవీ లేవసలు, “ఆకలి” తప్ప. “ఐదు రూపాయలు” అప్పు తీర్చలేక పట్టిన అగత్యం అది. మనిషికి కొన్ని నగ్న సత్యాలుంటాయి, ఎంత నేర్చినా కొన్నింటికి అతడు తలొగ్గక మానడు. ఆకలి జయించి తీరాలి, ఇంకో మార్గం లేదు. ఎవరిని చంపైనా తనని తాను బ్రతికించుకోవాలి!! ఆకలి నిత్య సత్యం. కథ పూర్తి కాగానే, నాకేదోలా అనిపించింది. “ఐదు రూపాయలు”, “ఐదు రూపాయలు” అనుకుంటూ ఉండిపోయాను. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, నేనూ మనిషినే!! నేనూ ఆ “ఐదు రూపాయలు ఇచ్చి ఉండేదాన్ని కానేమో!!” ఇలా ఆలోచిస్తూ ఉంటే ఆలోచనలెప్పుడూ ఒక కొలిక్కి రావని ముందుకు పదమన్నాను తిలక్ ని!!

“ఆశాకిరణం” – పేరు కాస్త ఆశావహకంగా ఉంది. ఊపిరి పీల్చుకున్నాను!! దారుణమైన సంఘటన చూసిన మనసుకి కొంచెం ఆశ పుట్టింది. ఇది ఒక స్కూల్ టీచరు కథ. వింటున్న కొద్దీ అసమర్ధుని జీవయాత్రలో సీతారామారావు వద్దన్నా గుర్తు వచ్చాడు. కానీ ఇందులో పాత్ర కనీసం సీతారామారావులా “false prestige” కూడా లేదు. ఏమిటో ఈ మనిషీ?? అప్పటికీ దుర్భరమైన దరిద్రాన్ని భరించలేక, ఇంటిలో భార్య సూటిపోటి మాటలు పడలేక, దొంగతనం చేయబోయి దెబ్బలు తింటాడు. ఏం చేయాలో తోచని పరిస్థితిల్లో ఇక ఆత్మహత్య చేసేసుకుందామా అన్న ఆలోచనలో ఉండగా, అతనికి ఆ చల్లని వార్త చెవిన పడుతుంది. తానింక చనిపోనక్కరలేదని తెగ సంబరపడి, ఇంటికెళ్ళి ఆ కుటుంబాన్ని దేవతలా కాపాడిన పెద్ద కూతురుని అభినందించబోతాడు. సంప్రదాయం గల కుటుంబంలో పెరిగీ, కేవలం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలన్న తపనతో తనని తాను అమ్ముకొచ్చిన “ఆశాకిరణం” వెక్కి వెక్కి ఏడవడం చూసి “ఏడుపు ఆపేశాకా చెప్తాలే” అనుకుంటాడు. మనిషి పతనానికి పరాకాష్ట!!  లేక పరిస్థితులు అంత బలీయమైనవా?? ఆలోచనలు కదలటం లేదు, కడుపులో చేయి పెట్టి దేవినట్టుంది.

కానీ ఇప్పుడా పాత్ర  నా కళ్ళముందుకొస్తే “ఛీ.. తూ!!” అననేమో?? జాలి పడతానేమో?? అసలెందుకు అతనికి అంత దారుణమైన పరిస్థితి?? ఎందుకు అంత దిగిజారాలి?? మనిషి పతనమయ్యిపోడానికి కారణాలేంటి? అతని భార్య కాస్త ధైర్యాన్నిస్తే పుంజుకునేవాడేమో?? ముందునుండే కూతురిని చదివించుకునుంటే ఆ పిల్ల సంసారపక్షంగా సంపాదించేదేమో?? కేవలం మూర్ఖత్వం ద్వారా ఉద్యోగాన్ని పోగట్టుకుని అందమైన ముగ్గులాంటి ఆమె జీవితం మీద ఇతనెందుకు బురద కాళ్ళేసుకుని తచ్చాడుతున్నాడు?? మనిషేనా అసలు?? ప్రశ్నల పరంపర ఆగటం లేదు. “ఏంటీ ప్రశ్నలు?” అని అడిగా!! “నీ ప్రశ్నలు, నీకే తెలియాలి మరి” అని పెదాలు కొద్దిగా విచ్చుకున్నాయి!! 

చిన్నగా చిట్టిగా చిట్టుకున్న అయిపోతున్నాయి కథలు. భాష తేలికగా, కథనం ఇంకా హాయిగా త్వరగా సాగించేలా ఉంది. కానీ ప్రతీ కథలోని భావం మాత్రం “గొంత్తుక్కి అడ్డుపడ్డట్టు” నాకు జీవితం పైనున్న romantic notions కి అడ్డుపడుతున్నాయి. ఊపిరాడడం లేదు నా ఊహలకు. వాస్తవానికి నేనంత దూరంలో ఉన్నాయో చూపించసాగాయి. ఆకలికి మించిన సత్యం లేదనీ, అహానికి మించిన విషం లేదనీ, ముసుగులు తొడుక్కున్న మన అసలు మొహాలను చూపించే అద్దాలలా ఉన్నాయి ఒక్కో కథ. భరించలేకపోతున్నాను.

ఓడిపోతున్నానన్న ఉక్రోషం తన్నుకొచ్చింది. “వెన్నెల్లో ఆడపిల్లలు నా అక్షరాలు అన్నది నమ్మి మోసపోయాను. ఇక్కడంతా చీకటేనా?? మనిషి ఎంత కంపుకొడతాడో చూపించడమేనా?? అసలు ఆ వర్ణనలో కూడా వెన్నెలను కృత్రిమైందిగా, ఆడవాళ్ళను బాధకు ప్రతిరూపంలా వచ్చే అర్ధంలో వాడారా?? కవిత్వం అంటే ఇందుకే నచ్చదు, అందమైన పదాల అల్లికలో ఎంత భయకరైన భావాన్నైనా దాచేయచ్చు. నా వల్ల కాదు. నేను వినలేను. నే పోతున్నా” అంటూ అడుగు ముందుకి వేయగానే ఆగిపోయింది. చేయి రానిదే నేను కదలేను అని చెప్పింది. వెనక్కి తిరిగి చూస్తే నా మణికట్టు అతడి చేతిలో ఉంది. పట్టీ పట్టకుండా ఉందా పట్టు. కాస్త బలం ఉపయోగిస్తే చేయి విడిపించుకోవటం కష్టం కాదు, కానీ మరలా ఏదో నన్ను ఆపింది. “ఇంకొక్క కథే, నచ్చకపోతే పోదువు” అన్నట్టున్న ఆ ముఖాన్ని చూసి…

(సశేషం)
**************
పుస్తకం వివరాలు:
పేరు: తిలక్ కథలు
రచయిత: దేవరకొండ బాల గంగాధర్ తిలక్
వెల: రూ. 120
ప్రతులకు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, అబిడ్స్ హైదరాబాద్!!
ఈమేల్: visalaandhraph@yahoo.com

స్వామీ, అతని మిత్రుల కథ చెప్పనా??


ఓసోస్.. ఆ కథా?? దాని గురించి మాకూ బోలెడు తెలుసు… స్వామీ అనే చిన్న కుర్రాడు.. మాల్గుడి అనే మనోహర పట్టణంలో తన తల్లిదండ్ర్రులతో ఉండేవాడు. ప్రాణప్రదంగా చూసుకునే ఒక బామ్మ కూడా.. నాన్న చలా స్ట్రిక్ట్.  అతగాడికి మణి, రాజన్ అనే స్నేహితులు ఉంటారు. వారితో అతని ఆటపాటలు, చిలిపి చేష్టలు, అమాయకపు భయాలు ఇవ్వనీ చదవని వారుండచ్చు.. చూడనివారుండొచ్చు. కానీ రెండూ చేయని వారి చాలా అరదు, అని అంటారా? సరే.. కాదనను.. కానీ నేను చెప్పదలుచున్న స్వామీ వేరు, అతని మిత్రులు వేరు.. అర్.కె. నారాయణన్ రాయలేదు.. వీరిది మాల్గుడి కాదు. వీళ్ళు కనిపించేది.. “సలాం హైదరాబాద్” అనే తెలంగాణ నవలలో. రాసింది లోకేశ్వర్.. ఆ కథేమిటో చూద్దామా…

* ఇందులో ముఖ్యపాత్రధారి, స్వామీ. అతని కథతోనే మొత్తం హైదరాబాద్ కథ (చరిత్ర) చెప్తాడు.. రచయిత. ఇతని చుట్టూనే కాదు.. హైదరాబాద్ లో ఏ కొద్ది సేపు గడిపిన వారికైనా తను ఇలానే అల్లుకుపోతుంది. తన నుండి విడిపోని బంధం కలిగిస్తుంది. ఈ రచన చదవండి.. కాదనిపించకపోతే నాకు చెప్పండి.

* ఆర్.కె.నారాయణ్ రాసిన స్వామీ ఆండ్ హిస్ ఫ్రెండ్స్ లోలా ఈ స్వామీకీ ప్రాణ స్నేహితులు ఉన్నారు. పేరుకే కాదు.. నిజంగా వీరు “ప్రాణాలిచ్చే” స్నేహితులు. మాల్గుడిలో గట్లెమ్మటా.. పుట్లెమ్మటా.. ఆ స్వామీ వాళ్ళు ఆడుకుంటే.. గల్లీలలోనూ, కాలేజీ గ్రౌండ్లలోనూ వీళ్ళు ఆడుకున్నారు జీవితాలను పణంగా పెట్టి!! బాల్యం ఆ స్వామీకి స్నేహం కుదిరిస్తే.. యవ్వనంలోని ఉడుకు రక్తం ఈ స్వామీ స్నేహ రహస్యం. ఓ విషయం చెప్పనా?? మీకూ నాకూ లాగానే.. స్వామీకి  ఆర్.కె.నారాయణ్ రాసిన స్వామీ ఆండ్ హిస్ ఫ్రెండ్స్ భలే ఇష్టం.

* రాజన్ వాళ్ళ నాన్నకి ట్రాంస్ఫర్ అయ్యి వెళ్ళిపోతుంటే ఆ స్వామీ ఏడుస్తాడు కదా.. అలానే ఈ స్వామీ ఏడుస్తాడు తన మిత్రులు బ్రతుకు తెరువు కోసం వెళ్ళిపోయినప్పుడు. Professional అన్న టాగు, మెడలో ఐ.డీ తగిలించుకున్నా క్లోజ్ కోలీగ్స్ వెళ్ళిపోతుంటే నేనూ మూలుగుతా!! “హర్ ములాఖత్ కా అంజామ్ జుదాయి క్యోం హోతీ హై??” ప్రతీ కలయికా.. వీడ్కోలే గమ్యమంటూ ఎందుకు పరిగెడుతుంది?? 😦

*ఒక తల్లి తన బిడ్డను కోల్పోతే ఆ బాధ వర్ణణాతీతం. తన బిడ్డ పోయాడన్న నిజం నమ్మలేక.. అతడు తన కళ్ళముందు కనపడక పడే వేదన, బాధకు పరాకాష్ఠ అనిపిస్తుంది. కానీ ఈ పుస్తకం చదివితే ఇంకా హృదయవిదారక సందర్భాలున్నాయని తెలిసింది. వరుసగా ముగ్గురిని పోగట్టుకున్న ఓ తల్లి, తన నాలుగో బిడ్డకు కూడా అనారోగ్యం చేసి మంచం పడితే.. అతడి ప్రతీ కదలికలో ఆమెకు చావు సూచనలు కనిపిస్తాయి. మృత్యువుతో ఆమెకు అంత సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఒకరకంగా ఆమె మృత్యువుకి అలవాటు పడిపోయి.. బిడ్డ చనిపోయిన నాలుగు రోజుల వరకూ ఏడవలేదు!! నన్ను చాలా కష్టపెట్టిన ఘట్టం ఇది.

* “There’s nothing in hyderabad man.. not even strikes. I know how many holidays we used to get due to issues in B’lore” షేర్ ఆటోలో వెళ్తుంటే ఓ ఇంజనీర్ మనోగతం ఇలా బయటపడింది. హైదరాబాద్ లో గొడవలు ఆషామాషీగా జరగవు తండ్రీ.. తలలు తెగిపడతాయి.. ఊర కుక్కల్ని వేటాడినట్టు గల్లీల్లో తరిమి తరిమి కాలుస్తారు.. బయట నుంచుని పిల్లాడికి అన్నం తినిపిస్తున్న తల్లి ఏ తుపాకీ గుండెకైనా బలికావచ్చు. పండు ముసలిదాని ముక్కుపుడకకోసం ముక్కే కోసికెళ్ళగలరు. నమ్మాలనిపించకపోతే.. 60, 90 దశకాలలో హైదరాబాదును చూసిన వారిని అడగండి.. హైదరాబాద్ అంటే వెన్నులో ఎందుకు వణుకు పుట్టేదో!! అంతలా రక్తసిక్తమైనది ఈ నేల. ఆ రక్తాన్ని మనకి అంటుకోకుండా ఈ పుస్తకాన్ని పూర్తి చేయలేము.

* అరెరే.. 1960లలో జరిగిన తెలంగాణ పోరాటం.. ఇంత దారుణంగా నీరు కారిపోయింది. ఇప్పుడా చనిపోయిన వాళ్ళ త్యాగాలంతా వృధా అని కాసేపు విచారించాను. ఆ మర్నాడు మా డాక్టర్ రెసెప్షన్ లో ప్రజా సాహితీ పుస్తకం తిరగేస్తుంటే.. ఈ వాక్యం కనిపించింది. “విప్లవాలకు విఫలం అవ్వడం అంటూ ఉండవు.. అవి జరగటమే విజయమని”. అసలు ప్రత్యేక తెలంగాణ గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు.. కానీ ఈ పుస్తకం చదివిన తర్వాత.. అప్పుడన్ని ప్రాణాలు ఒక ఆశయం కోసం పోరాడితే.. ఇప్పుడది పదవుల పాకులాటగా మారిందనిపిస్తుంది.

* “చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్” అన్న సినీ కవి ఎవరో గాని.. జీవితాన్ని కాచి వడబోశారు. తెలంగాణ విప్లవంలో ప్రాణాలు పోగొట్టుకున్న ఓ యువకుడి చావును రచయిత వర్ణించిన తీరు చెప్పడానికి నాకు మాటలు సరిపోవు. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు మా కాలనీలో ఓ పదిహేనేళ్ళ అబ్బాయి.. బావిలో పడిన చిన్న పాపను రక్షించబోయి చనిపోయాడు. కాలనీ అంతా ఏకమై ఏడ్చింది ఆ రోజు. చిన్నదాన్ని కావున అమ్మ బయటకు రానివ్వలేదు. నువ్వప్పుడు చూడలేదు కదా ఇప్పుడు చెప్తా విను అంటున్నట్టు అనిపించింది ఈ ఘట్టం చదువుతుంటే!!

* ఈ మధ్య పుస్తకాల కొట్టుకు వెళ్ళిన ప్రతీ సారి.. ఓ అందమైన ముస్లిం అమ్మాయి కనిపిస్తుంది, White Mughals అన్న పుస్తకం మీద. చరిత్ర నాకెందుకులే అని వదిలేస్తున్నా!! తీరా చూస్తే అది పాట్రిక్, ఖైరున్నిసా అనే హైదరాబాదీల ప్రేమకథ. కులీ కుతుబ్ షాహ్.. ప్రేయసి.. భాగమతిది మతాంతర ప్రణయం అయితే.. ఈ నేలపై మరో మనోహర ప్రేమకథ ఉందని, అది ఖండాంతరాలు దాటిందని “సలాం హైదరాబాద్” లోనే తెలిసింది. ఇది ఒక హృదయవిదారకమైన ప్రేమకథ. చదివితేనే తెలుస్తుంది.

* హైదరాబాద్ లో ఎక్కువగా వినిపించే “తీన్ మార్” సంగీతం.. ఆఫ్రికన్ జాతీయులు పరిచయం చేసిందని తెలుసా?? ఇక్కడి హలీం పర్షియా నుండి వచ్చింది. ఇక్కడి బంగారం, వజ్రం వ్యాపారులు ఉత్తరభారతం నుంచి వలస వచ్చిన వారు. విభిన్న సంస్కృతలను తనలో కలుపుకుని నిత్య స్రవంతి హైదరాబాద్. దాన్ని అర్ధం చేసుకోవాలే గాని, “భాష ఏమిటి.. నీరు ఏమిటి?” అని ప్రశ్నిస్తే అది మన అవివేకమే అవుతుంది.

*మొన్నో ఆదివారం పూట అంతా కలిసి పాతబస్తీ తిరిగి రావాలని నన్నూ పిలిచారు. నేను కుదరద్దన్నాను. వాళ్ళు వెళ్ళి చార్మినార్, మ్యూజియం, మక్కా మస్జీద్ ఇంకా చూసొచ్చారు. నేను ఇంటిలోనే ఉండి.. ఈ పుస్తకం చదివుతూ.. వారి చూసినవాటితో పాటు.. గత నాలుగువందల సంవత్సరాల చరిత్ర అనుభవించాను.

* హైదరాబాద్ మారిపోతోంది. ఒక ప్రేమనగరం ఉండి మహానగరం వరకూ తన ప్రస్థానం అమోఘం. కానీ కొన్ని అందమైనవి దూరమైపోతున్నాయి. ఇప్పుడా laidbackness లేదు, గాలిలో ఆ షాయరీ లేదు, రోడ్డు మధ్యలో పెద్ద చెట్లు లేవు, హాయిగా ఉండే అంత “ఆంగన్”లు లేవు, మనస్సంతా చేయిగా చేసి సలాం చెప్పే సర్వర్లు లేరు, జోకులేసుకుంటూ షాపింగ్ కి వచ్చిన అందరనీ ఆకట్టుకునే కొట్టువాళ్ళూ తగ్గిపోయారు. మార్పు సహజం. అందుకే వాటి స్థానే వచ్చిన వాటిని అలవాటు చేసుకోక తప్పదు.

ఇదంతా చదివి మీకు పుస్తకం చదవాలి అనిపిస్తుందో లేదో నాకు తెలియదు. కానీ ఈ కింది విషయం గురించి మాత్రం ఆలోచించండి.

మనం ఎవరైనా ఇంటికి అతిథిగానో, ఆప్తుని గానో, చుట్టం చూపుకో, పలకరింపుకో.. మరిదేనికో వెళ్ళామనుకోండీ.. మన సంస్కారం అక్కడ ఉన్న వసతులు కాదు వారి ఆప్యాయతలు, అభిమానాలు చూడాలి అని చెప్తుంది. అది డబ్బు కట్టి ఉండే హోటల్ కాదు కాబట్టి.. నచ్చినా, నచ్చకపోయినా కలసిపోయే ప్రయత్నం చేయాలి గాని ఇలా ఉండాలి అని నిర్దేశించే అధికారం లేదు. వారి తాహతు తగ్గట్టు గుడిసెలో ఉన్నా.. మిద్దెలో ఉన్నా.. వారి మనసులే మనకు ముఖ్యం కదూ?? అలాంటి చాలా ఇళ్ళు కలిస్తేనే ఊరు అవుతుంది. అంటే.. ఇంటికి వ్యక్తిత్వం ఆ ఇంటి మనషుల బట్టి వచ్చినట్టే.. ఊరికి వ్యక్తిత్వం ఇచ్చేది ఆ మనుషులే!! అంగులు ఆర్భాటాలు బట్టి .. అది ఒక మారు మాల గ్రామమా? లేక మహానగరమా అని తేడా ఉన్నా.. వాటికీ అస్తిత్వం ఉంటుంది. మనకి కొన్ని పద్ధతులు నచ్చలేదనో.. మనకి ఆ ఊర్లో సౌకర్యంగా లేదనో ఆ ఊరిని హేళన చేయడం, తెగడడం.. నాగరికులు చేసే పని కాదు. అలా చేస్తే.. ఏ ఊరు క్షమించదు.. ఉప్పెనల్లే మీదకు ఉరుకుతుంది.

హైదరాబాద్ అనే కాదు.. మీరీ టపా ఏ ఖండం నుంచి చదువుతున్నా.. అది ఈ లోకంలో భాగమే. మిమల్ని అక్కున చేర్చుకుంది. కాబట్టి ఆనందించండి. అనుభవించండి. ఇది నచ్చలేదంటూ గోల చేసేముందు.. నచ్చిన వాటికోసం వెతకండి. మన వ్యక్తిగత ఇష్టాయిష్టాలను ఇంకో వ్యక్తిపై రుద్దడం ఎంత అనాలోచితమో.. ఒక నగరం పై రుద్దడం కూడా అంతే!!

హైదరాబాదీలే కాదు, ప్రతీ ఒక్కరూ చదవాల్సిన పుస్తకం. ఇది ఒక జీవితం గురించి కాదు. కొన్ని వందల సంవత్సరాల్లో జీవించిన ప్రతీ ఒక్కరి కథ.. “సలాం హైదరాబాద్”!!

********************

ఈ పుస్తక కొనుగోలు వివరాలు:
పేరు: సలాం హైదరాబాద్ (తెలంగాణ నవల)
రచయిత: లోకేశ్వర్
ప్రచురణ: గాంధీ ప్రచురణ
వెల: 99
పుటలు: 250

విశాలాంధ్ర వంటి అన్ని ప్రముఖ పుస్తక కొట్లల్లో దొరుకుతుంది
అంతర్జాలంలో ఈ పేజీలో చూడండి: http://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=192

బాబా గారికి, NETIZEN వారికి ధన్యవాదాలు!!


న్యాయంగా ఈ టపాకి సీతారామారావు Vs డోరియన్ గ్రే అని శీర్షిక పెట్టి ఎప్పటిలానే నా సోది మొదలెడితే… ఎవరు చదువుతారో చదవరో గాని, నేను కృతజ్ఞతలు చెప్పాలనుకున్న బాబా గారు, నెటిజెన్ వారు చూడకపోతే ఈ టపా ఇక్కడ రాసి దండగ!! వీరెవరో బ్లాగ్లోకానికి నేను చెప్పనవసరం లేదు. అందుకే సీతారామా రావు, డోరియన్లను పరిచయం చేసుకుందాం.

సీతా రామారావు.. త్రిపురనేని గోపిచంద్ రాసిన “అసమర్ధుని జీవయాత్ర” అనే తెలుగు నవలలో కథానాయకుడు. డోరియన్ గ్రే.. ఆస్కర్ వైల్డ్ రచించిన ఇంగ్లీషు నవల “ది పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే” లో నాయకుడు. నేను అసమర్ధుని జీవయాత్ర పై రాసిన టపా కి బాబా గారు “ఎక్కడో చదివాను ఈ పుస్తకానికి డోరియన్ గ్రే కి సారూప్యం ఉండని ఆ వివరాలు ఎవరైనా తెలుపగరలరా?” అని వ్యాఖ్యానించారు. “నాకు తెలియదండీ” అని చేతులెత్తేసే ప్లానులో ఉండగా.. ” ఎవరండీ,అన్నది, డొరియన్ గ్రేకి, అసమర్ధుని జీవయాత్రకి కధలో పోలికలున్నవని? నక్క ఎక్కడ, నాగలోకం ఎక్కడ?” అన్న నెటిజన్ వారు ఈ ప్రశ్నకు సమాధానమల్లే కనిపించారు. “చెప్పండి.. చెప్పండి” అని వెంటబడితే చెప్పేస్తారనుకున్నాను. రెండు పుస్తకాలకీ లంకెలిచ్చి.. చుదువుకో అని చెప్పకనే చెప్పారు.

ఇక చేసేది ఏమీ లేక.. డోరియన్ గ్రే గురించి కాస్త తెలిస్తే.. పుస్తకం కొనాలో లేదో నిర్ణయించుకోవచ్చునని మొదలు పెట్టా!! నవల పూర్తి చేయగానే.. పేజీ మధ్యలో మడత పెట్టి ఒక భాగం లో సీతారామారావని, మరో దాంట్లో గ్రేని పెట్టి.. 1, 2, 3 అని వారిలో తేడాలు రాసేసి.. “నాకర్ధమియ్యిందీ” అని ఓ టపా రాయాలన్న ఆశయంతో మొదలుపెట్టినా.. చదువుతున్నంత సేపూ ఇక ఏ ఇతర ఆలోచనా రాకుండా ఈ రచనలో మినిగిపోయా. నవల పూర్తి అయ్యింది. ఇప్పుడు ఈ కథానాయకుల సారూప్యం చూద్దామా??

ఈ ఇద్దరూ నవలా కాలంలో బోలెడన్ని మార్పులకు గురవుతారు. మొదట్లో.. అందరి లానే ఉంది.. ఒక సుఖవంతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆనందిచడానికి పూర్తి అవకాశం ఉన్న వీరిద్దరూ.. నవల ముగిసేసరికి ఒక భయంకరమైన విఫలంగా మిగిలిపోతారు. ఇద్దరూ.. ఆత్మహత్య చేసుకుంటారు. ఇలాంటి మనుషులూ ఉంటారా అని అనుమానం కలిగేలా ఉంటుంది వీరి ప్రవర్తన.. కానీ నిజానికి వీరిద్దరూ మనందరిలో చిన్ని చిన్నిపాళ్ళల్లో అయినా ఉంటారు. వీరిద్దరి అధోగతికి మాత్రం కారణాలు వేరు.. ఒకరు తన comfort zone వదిలి బయటకు రాక.. మరొకరు అవతలి వారి comfort గమనించక అసమర్ధులుగా మిగిలిపోతారు. ఒకరు false prestigeకి చిరునామాగా మారితే.. మరొకరు youth and pleasureకి బానిసవుతాడు. ఇద్దరి జాతి, మతం, వ్యవహార శైలి, ఆలోచనా సరళి, జీవితాన్ని జీవించిన విధానం, విఫలమనిపించుకోడానికి కారణాలు చాలా చాలా విభిన్నం. ఈ పాత్రల ద్వారా ఆయా రచయితలు చెప్పాలనే విషయాలకు.. నిజంగానే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా!! ఈ రెండూ నేను చదివిన విభిన్న పుస్తకాలు. నాకు నచ్చిన పుస్తకాలు. నాలా quotation collection hobby ఉన్నవారికి ఈ పుస్తకాలు.. ఖజానాలు.

ఇదీ నాకర్ధమైన విషయం. మీరు ఏకీభవించక పోతే.. కారణాలు తెలుపగలరు. ఒక సందేహం కూడా ఉంది. నాయకుడు.. ప్రతినాయకుడూ అన్న పదాలు తరుచుగా ఎవరిని ఉద్ధేశ్యించి అంటామో మనకి తెలుసు. ఈ రెండు కథలలోనూ lead character (అసలు కథ ఎవరి గురించో వారు..) ప్రతినాయకుడల్లే అనిపిస్తూ.. ఒక disaster లా కనిపిస్తారు. వీరిని కూడా “కథానాయకులు” అని వ్యవహరించవచ్చా?? లేక ఇలాంటి పాత్రలను వేరేగా అనాలా?? సందేహం నివృత్తి చేయగలరు.

ఎలాంటి పుస్తకాన్ని (హార్డ్ కాపీలు మాత్రమే) అయినా సరే ఏకబిగువ చదివే నాకు, ఈ పుస్తకం వల్ల రెండు విజయాలు కలిగాయి.. ఒకటి.. 230 పేజీలున్న ఈ నవలను పూర్తిగా ఆన్-లైన్ లో చదవటం.. రోజులో కొన్ని ముఖ్య పనులకు మధ్య ఉండే ఐదు-పది నిమిషాల వ్యవధిని ఉపయోగిస్తూ నవలను పూర్తి చేయటం. అందుకు నాకు నేనే ఓ చిన్ని పార్టీ ఇచ్చుకోవాలేమో. 😉

ఈ పుస్తకాలను చదవదలచిన వారు, కింది లంకెలను చూడగలరు.
అసమర్ధుని జీవయాత్ర

The Picture of Dorian Gray.

పుస్తకాన్ని పరిచయం చేసిన బాబాగారికి, చదివేలా చేసిన నెటిజన్ వారికి మరో మారు హృదయపూర్వక ధన్యవాదాలు.