న్యాయాన్ని ఆశ్రయిస్తే..


First published on patrika.kinige.com
(హరిశంకర్ పార్సాయి (1924-1995) హింది సాహిత్య జగత్తులో వ్యంగ్యహాస్య రచయితగా సుప్రసిద్ధి చెందినవారు. కేంద్రసాహిత్య ఎకాడెమీ అవార్డు గ్రహీత. అలతి పదాలతో, నిరాడంబర శైలిలో కొనసాగే వీరి రచనలు సమాజంలో పేరుకుపోయిన కుళ్లును కళ్ళకు కట్టినట్టు చూపిస్తాయి. ఉపరితలంలో హస్యం ఉబికినట్టు కనిపించినా, వీరి రచనల్లో అంతర్లీనంగా కనిపించేది సమాజం పట్ల బాధ్యత. “షికాయత్ ముఝె భీ హై” అనే వీరి వ్యాసాల సంపుటి నుండి “న్యాయ్ కా దర్వాజా” వ్యాసానికి తెలుగనువాదం ఇది.)

సామెతల్లో చెప్పినట్టు ఏం జరగటంలేదు ఈ మధ్య.

సామెతల ప్రకారం – అబద్ధానికున్నముసుగును తొలగిస్తే నిజం నగ్నంగా కనిపిస్తుంది. అబద్ధానికన్నా నిజానికి సిగ్గెక్కువ.

ఇప్పుడు న్యాయం తలుపు తట్టాక ఈ సామెతలకు విరుద్ధమైనవి కనుగొన్నాను. కొంతమంది పేదవాళ్లపై అబద్ధపు కేసు బనాయించబడింది. మేము వాళ్ళ తరపున న్యాయస్థానం తలుపులు తట్టాము. న్యాయం తలుపు దగ్గరే డ్యూటీ మీద కూర్చుంటుందనీ, ఇలా తలుపు తట్టగానే అలా న్యాయదర్శనం అవుతుందనీ అనుకున్నాము. ఎంతసేపటికి తలుపు తెరుచుకోకపోయేసరికి ఆందోళన మొదలైయ్యింది. ఏమయ్యింది? న్యాయం “సిక్ లీవ్” గానీ తీసుకొనిపోలేదు గదా? అసలే, ముసలితనం కావటంతో తరచూ జబ్బు పడే అవకాశం ఎక్కువ.

చివరికి మేమే తలుపులు బద్దలుగొట్టుకొని లోపలికి ప్రవేశించాము. అంతా ఖాళీగా ఉంది. బాత్రూం తలుపు నెడితే, ఒకడు నగ్నంగా స్నానం చేస్తూ కనిపించాడు.

మేం అడిగాం – నువ్వు న్యాయానివి కదూ? త్వరగా బట్టలు వేసుకో. నీతో మాట్లాడాలి.

అతను అన్నాడు – నేను న్యాయాన్ని కాదు, అన్యాయాన్ని. నగ్నంగానే ఉంటాను. అన్యాయానికి సిగ్గేంటి: న్యాయానికి కవల సోదరుడిని. ఒకేలాంటి మొహం. జనాలు అతడనుకొని నన్ను కలుస్తుంటారు.

మేం అడిగాం – ఇద్దరి మధ్య ఏదో ఒక తేడా అయినా ఉండాలే!

అతను అన్నాడు – ఆ, ఉంది. చూడు, నాకు మెల్ల. ఎటో చూస్తున్నానని నువ్వు అనుకుంటావ్, కానీ నేను నిన్నే చూస్తున్నాను. మా సోదరుడు న్యాయం ఒంటి కన్నువాడు. ఒకవైపే చూస్తాడు. ఇప్పుడు వాడికి చెవుడు కూడా వచ్చింది.

మేం అడిగాం – మరి తలుపు కొట్టినప్పుడు ఎవరు తీస్తారు?

అతడు అన్నాడు – నేనే తెరుస్తాను. అదే కదా మజా. జనాలు నన్ను న్యాయమనుకుంటారు.

మేం అడిగాం – మీరిద్దరూ ఎవరి పిల్లలు?

అతడు అన్నాడు – “ఎవిడెన్స్ ఆక్ట్” మా నాన్న. “ఇండియన్ పీనల్ కోడ్” మా అమ్మ.

మేం అడిగాం – మేము న్యాయాన్ని కలవాలి. అతనేడీ?

అతనన్నాడు – ఇప్పుడే పెరటి గుమ్మం నుంచి పోలీస్ స్టేషన్‍కు వెళ్ళాడు. వచ్చేస్తుండచ్చు.

ఏం బాబూ, ఖలీల్ జిబ్రాన్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నావా? లేదు. న్యాయస్థానపు గుట్టు రట్టు చేస్తున్నాను. న్యాయం తలుపు తట్టేవాళ్లారా, మీరేమో ముందు గుమ్మం తలుపు తడుతుంటారు, అదేమో పెరటి గుమ్మం గూండా పోలీసుల ఆజ్ఞలు పాటించడానికి వెళ్ళిపోతుంది. న్యాయానికి చెవుడు. తలుపు కొట్టేది కూడా వినిపించదు. తలుపు కొట్టగానే తెరిచే ఆ మెల్లకన్ను వ్యక్తి అన్యాయం. తలుపు కొట్టినంత మాత్రాన దొరికేది అన్యాయమే. తలుపు బద్దలుగొడితే గానీ న్యాయం దొరకదు.

ఏం బాబూ, ఇప్పుడు నక్సలైటు అవుదామని ప్రయత్నిస్తున్నావా? లేదు. ఇది పెద్ద ప్రయత్నించకుండానే వచ్చి అంటుకునే బిరుదు. ఈ మధ్య నేను ఒక పత్రికలో, పోలీసులు హాస్టల్‍లో చొరబడి అమాయకులైన విద్యార్థులను ఎందుకు కొట్టారని రాస్తే, నేను నక్సలైట్ ఐపోయాననే గుసగుసలు వినబడ్డాయి. నల్లులు కుట్టినా అది నక్సలైట్ల పనే అనిపిస్తోందిప్పుడు. పిల్లవాడు పాలకోసం ఏడ్చినా తండ్రి వాడి తల్లితో అంటాడు – “పాలు పట్టీయకు. వాడికి ఆకలీ లేదు పాడూ లేదు. నక్సలిస్టయి కల్లోలం సృష్టిస్తున్నాడు.”

ఉన్నట్టుండి సత్యపు గుట్టు కూడా రట్టయిపోతూంటుంది. దేవునిపై ప్రమాణం చేసి న్యాయస్థానాల్లో ఎన్ని అబద్ధాలు చెప్తారో అన్ని దేవుని వీపు వెనుక అయినా చెప్పరు. నరుడు కరుడుగట్టిపోయి నారాయణుని ముందే అబద్ధాలు చెప్పటానికి అలవాటు పడిపోయాడు. ధర్మం మంచివాళ్ళని పిరికివాళ్ళ గానూ, చెడ్డవాళ్ళని ధైర్యస్తులుగానూ చేస్తుంది. అసత్యం కొద్దిపాటి పవిత్రత సాయంతో సత్యపు బెర్తు ఆక్రమించేస్తుంది. ఆ సాయం గంగామాత కావచ్చు, జంధ్యప్పోగు కావచ్చు, ధర్మమే కావచ్చు, లేక ఈశ్వరుడే కావచ్చు.

 

ఇప్పుడిక్కడ సాక్ష్యం ఇచ్చేందుకు బోనులో నించున్న వ్యక్తి భగవంతుణ్ణి సాక్షిగా చేసేసుకున్నాడు – ప్రభూ, రా, నేను నీ ముందు అబద్ధమాడాలని ఉబలాటపడుతున్నాను. వాడు చదువూ, సంస్కారం, అందంగల వాడు. పోలీసులకు ఇలాంటి దొంగ సాక్షి దొరికాడంటే పోలీస్ లైన్‍లో హనుమంతుని ముందు కొబ్బరికాయలు పగులుతాయి. హనుమంతునిది మరో వింత. ఆయనకు ఎన్నో పేర్లు  – ‘శత్రు వినాశక హనుమాన్’, ‘సంకట మోచన హనుమాన్’, ‘పోలీసు మహావీర్’. పూనాలో వేశ్యవాడల్లో ఉన్న హనుమంతుని పేరు – “వగలాడి మారుతి”.  భారతీయుడు ఓ అద్భుతం. అతగాడి దగ్గర వగలాడి మారుతీ ఉన్నాడు, నపుంసకుల మసీదూ ఉంది. సరే, మనం మాట్లాడుకుంటున్నది హనుమంతుని గురించి కాదు, దొంగ సాక్షి గురించి. వాణ్ణి వెంటబెట్టుకుని ఇప్పటిదాకా ఇనస్పెక్టరు తాను దొంగ సాక్ష్యానికి  పట్టుకొచ్చింది సాక్షాత్తూ సత్యహరిశ్చంద్రుణ్ణే అన్నంత దర్పంగా వరండా అంతా తిరిగాడు.

నిజాయితీపరునిగా కనిపించటానికి ఆ సాక్షి పూర్తి ప్రయత్నం చేస్తున్నాడు. అబద్ధాన్ని పద్ధతిగా చెబితే చాలు, దాన్నే నిజమనుకుంటారు. వాడు గుండెల నిండా ఆత్మవిశ్వాసాన్ని నింపుకుని చుట్టూ చూస్తున్నాడు. ఆత్మవిశ్వాస పూరితమైన అబద్ధం నిజమనిపించుకుంటుంది. నమ్మకంగా చెప్పని నిజం కూడా అబద్ధమైపోతుంది. నిజంలా కనిపించటానికి అబద్ధానికి ‘మేకప్’ కూడా కావాలి. వాడు మొహానికి స్నో పౌడర్ పూసుకున్నాడు. మంచి సూటు తొడుక్కున్నాడు. అసలు నిజం అంటే ఏమిటి? మంచి బట్టలేసుకున్న అబద్ధం.

వాడి మొహం కేసి చూశాను. పెదాలు బాగా పగిలున్నాయి.  పళ్లు బయటకు కనిపించడానికి తొందరపడుతూ ఉన్నాయి. అబద్ధాలకోరుదీ, వాగుడుకాయదీ నోరు ఇలానే తయారవుతుంది. అబద్దాలకోరుల్లో మళ్లా రెండు రకాలు: మితభాషి, లొడలొడవాగేవాడు. మితభాషి పరిణతి చెందిన అబద్ధాలకోరు. అతను ఒకట్రెండు వాక్యాలలో అబద్ధాన్ని సర్దేస్తాడు. లొడలొడవాగేవాడు మాత్రం ఇంకా తన అబద్ధం అతకలేదని అనుకుంటాడు. అందుకని మరో  పది మాటలు లొడలొడా వాగేస్తాడు. ఈ దెబ్బకి దవడలు సాగిపోతాయి. వీడి దవడలు కూడా అలానే సాగిపోయున్నాయి. వీడి నోరు అబద్ధాల చీముతో ఉబ్బిన కణితిలా ఉంది. కాస్త పొడిస్తే చాలు చీమంతా బయటకు పొర్లిపోతుంది.

వాడు ఇప్పుడు దగ్గి గొంతును సవరించుకున్నాడు. జేబు రుమాలుతో నోరు తుడుచుకున్నాడు. చూస్తుంటే, సాక్ష్యం ఇవ్వడానికి వచ్చిన వాడిలా లేడు, న్యాయపు కూతురిని  పెళ్ళాడ్డానికి వచ్చిన పెళ్ళికొడుకులా ఉన్నాడు.

ప్రభుత్వ వకీలు అడిగిన ప్రశ్నలే అడిగాడు. అతగాడు చెప్పిన సమాధానాలే చెప్పాడు. ఫలానా వ్యక్తి మృతుణ్ణి లాఠీతో కొడుతుండగా అతను చూశాడు.

అతనికి లాఠీని చూపించారు. ఏదో పాత మిత్రుణ్ణి గుర్తుపట్టినట్టు గుర్తుపట్టాడు దాన్ని.

అతనికి ఒక రాయి ముక్క చూపించారు. అతను దాన్ని కూడా గుర్తుపట్టేశాడు – అదే రాయి, అక్కడ పడి ఉన్న రాయి.

నేను పక్కనే కూర్చున్న వకీలు దోస్తుతో అన్నాను – ఏరా, ఇదేంటి? వీడు రాయిని ఎలా గుర్తుపట్టగలడు?

అతనన్నాడు – గమ్మునుండు, ఎవిడెన్స్ ఆక్ట్ ప్రకారం అది సబబే!

సాక్షికి రక్తం కలిసిన మట్టిని చూపించారు. అతను మట్టిని కూడా గుర్తుపట్టేశాడు.

నేను వకీలు దోస్తుతో అన్నాను – ఇది మరీ విడ్డూరం. వీడు మట్టిని కూడా గుర్తుపట్టేస్తున్నాడు.  అతనన్నాడు – మాట్లాడకు. ఎవిడెన్స్ ఆక్ట్!

నాకేమనిపించిందంటే – ఇప్పుడు వకీలు ఇతనికి గాజు సీసాలో బంధించిన ఈగను చూపిస్తాడు. అడుగుతాడు – ఈ ఈగను గుర్తుపట్టగలవా నువ్వు? సాక్షి అంటాడు – ఇది అదే ఈగ, కొట్లాట సమయంలో అక్కడ చక్కర్లు కొట్టిన ఈగ . నేను గుర్తుపట్టేశాను. దీని మొహం మా అమ్మలా ఉంది.

అంతా ఎవిడెన్స్ ఆక్ట్ మహత్యం!

హరిశ్చంద్రుడు తన కలలో ఎవరికైతే దానం ఇచ్చాడో ఆ బ్రాహ్మణుడే గనక ఆస్తుల స్వాధీనం విషయంలో కోర్టుకెక్కాల్సి వస్తే, అప్పుడు అతను కూడా ఇద్దరు ముగ్గురు ప్రత్యక్ష సాక్షులను తీసుకొచ్చి నిలబెట్టి ఉండేవాడు. అప్పుడు వాళ్లనేవారు – మా ముందే ఈ విప్రునికి హరిశ్చంద్ర మహారాజు దానం ఇచ్చారు. వకీలు అడిగేవాడు – ఆ సమయంలో మీరు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు చెప్పుండేవారు –  మేం కూడా రాజావారి కలలోనే  ఉన్నాము.

డిఫెన్సు న్యాయవాది ‘క్రాస్ ఎగ్జామినేషన్’ చేయడానికి లేచి నుంచున్నాడు. ఇది దడపుట్టించే విషయం. ఒకసారి నన్నూ గడగడలాడించాడు. అప్పుడు నేను చెప్తూన్నది నిజమే, అయినా వకీలు రెండు నిమిషాల్లో ఆ నిజానికి చెమటలు పట్టించాడు.

 

సాక్షి సన్నద్ధమయ్యాడు. నోరు తుడుచుకున్నాడు. ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ నింపుకున్నాడు.

వకీలు అడిగాడు – సంఘటనా స్థలం నుండి నువ్వెంత దూరంలో ఉన్నావు?

అతడు ఇంకా నోరు తెరవకుండానే వకీలు మళ్లీ అన్నాడు – తొందరేమీ లేదు. ఆలోచించుకొని చెప్పు.

‘ఆలోచించుకొని చెప్పు’ – ఈ సూచన సాక్షిని కంగారుపెడుతుంది. అతడికి తాను అనుకున్నంత తేలిక వ్యవహారం కాదిది అని తెలుస్తుంది. ప్రశ్న కష్టమైనది. ఆలోచించాలి.

అతడు ఇందాక ప్రభుత్వ వకీలుకు తాను పదడుగుల దూరంలో ఉన్నాడని చెప్పాడు.

ఇప్పుడు ఆలోచించుకొని చెప్పాడు – పది – పదిహేను అడుగుల దూరం.

వకీలు – అలాగా, పదడుగుల దూరంలో ఉన్నావా?

సాక్షి – అదే, పదిహేను – ఇరవై అడుగుల దూరం.

వకీలు – అయితే పదిహేను – ఇరవై అడుగుల దూరంలో ఉన్నానంటావ్.

సాక్షి – ఆ, ఇరవై – ఇరవై అయిదు అడుగుల దూరం అనుకోండి.

మూడు ప్రశ్నల్లో అతడు పదిహేను అడుగుల దూరం జరిగిపోయాడు. ఒకవేళ వకీలు ప్రశ్నలు అడుగుతూనే ఉండుంటే, అతడు సంఘటనా స్థలానికి ఐదు మైళ్ళ దూరానికి వెళ్ళిపోయేవాడు. కానీ అతనికి మాత్రం సంబరంగానే ఉంది, వకీలుని “కన్ఫ్యూజ్” చేసినందుకు.

– నువ్వు సంఘటనస్థలానికి ఎన్ని గంటలకు చేరుకున్నావ్?

– తొందరేమీ లేదు. ఆలోచించుకొని చెప్పు.

– ఒంటిగంటన్నర – రెండు.

– అలాగా, ఒంటిగంటన్నర – రెండు గంటలకు వచ్చావేం.

– అవును, అదే రెండూ – రెండున్నర గంటల మధ్య.

– ఒహో, రెండూ – రెండున్నర గంటల మధ్య చేరావన్నమాట.

– అదే, రెండున్నర – మూడు గంటలనుకోండి.

– మృతుని వయస్సు ఎంత?

– ఇరవై ఐదు – ముప్ఫై ఏళ్ళు.

– అలాగా, ఇరవై ఐదు – ముప్ఫై ఏళ్ళవాడా!

– అవును, ముప్ఫై- ముప్ఫై ఐదు ఏళ్ళవాడు.

– అంటే అతడి వయస్సు ముప్ఫై – ముప్ఫై ఐదు ఏళ్ళు ఉండచ్చన్నమాట.

– అదే, ఒక ముప్ఫై ఐదు – నలభై ఏళ్ళు అయ్యుండచ్చు.

కొన్ని రోజుల పాటు నేనీ సాక్ష్యాల ఆటను చూస్తూనే ఉన్నాను. నాకు మతిపోయింది. బయట ఎంత వెతికినా నిజాయితీ గల మనిషీ ఒక్కడూ దొరకడు, కానీ న్యాయస్థానాల్లో మాత్రం ఇంతమంది నిజాయితీపరులు ఏయే  మూలల్లోంచి వచ్చి పోగవుతున్నారో అర్థం కాలేదు. అబద్ధం చెప్పడానికి అన్నింటి కన్నా సురక్షితమైన చోటు న్యాయస్థానం. ఇక్కడ రక్షణ కోసం దేవుడూ, న్యాయమూర్తి హాజరవుతూ ఉంటారు.

నా వకీలు-దోస్తు అన్నాడు – ఇదంతా చట్టపరిధిలోనే జరుగుతుంది. ఒకవేళ న్యాయమూర్తి సాక్షిని నమ్మితే, ఉరిశిక్ష. నమ్మకపోతే, విడుదల.

ఉన్నది ఒక్కడే సాక్షి, కానీ అతని వల్లే ఒక వ్యక్తికి ఉరి ఐనా పడవచ్చు, లేదా విడుదలైనా కావచ్చు. అదే సాక్ష్యం ఆధారంగా ఆ వ్యక్తిని ఒక న్యాయమూర్తి ఉరిశిక్షకు అర్హుడుగా భావించవచ్చు, అతణ్ణే ఇంకొక న్యాయమూర్తి నిర్దోషిగా భావించవచ్చు.

నేను వకీలు దోస్తుతో అన్నాను – మనిషికున్న ఈ న్యాయవ్యవస్థను  యంత్రం ఎక్కువ రోజులు సహించదు. ఏదోరోజున ఇక్కడ న్యాయస్థానం బదులు ఒక పెద్ద కంప్యూటర్ ఉంటుంది. అందులో మీ న్యాయవాదులనీ, సాక్షులనీ, న్యాయమూర్తిని అందరిని కలిపి వేస్తారు. కంప్యూటర్ నడిచి, మీలో ఒకరి తోలుమీద నిర్ణయం ముద్రితమై బయటకు వస్తుంది.

అన్యాయంగా కేసులో ఇరికించబడ్డ ఈ ముగ్గురు నలుగురు వ్యక్తులూ రోడ్డు పక్కన మురుక్కాలవ అవతల గుడిసెలు వేసుకుని బతుకుతున్నారు. వీళ్లు ఉరికంభం పై వేలాడటానికి ఖర్చు కూడా చేశారు – వకీళ్లను నియమించుకున్నారు, పోలీసులకు డబ్బు తినిపించారు.

అంతే కాదు, ఇక్కడ యేసు తన శిలువను తానే తయారుచేసుకుంటున్నాడు, లేదా ఉరికంభం మీద వేలాడుతున్నాడు. యేసుకి తన కాళ్ళ మీద తనే మేకులు కొట్టుకోక తప్పని పరిస్థితి కల్పిస్తున్నారు. ఆయన అంటున్నాడు – తండ్రీ, వీళ్ళని ఎట్టిపరిస్థితుల్లో క్షమించకు. ఎందుకంటే, ఈ వెధవలకి, వాళ్ళేం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలుసు.

Advertisements

పోలీసు మంత్రి దిష్టిబొమ్మ (पोलीस-मंत्री पुतला)


ఒక దేశంలోని ఒక నగరంలో ప్రజలపై పోలీసుల జులం చేసినందుకు వారంతా కల్సి పోలీసు-మంత్రి దిష్టిబొమ్మను దహనం చేయాలని తీర్మానించుకున్నారు.

దిష్టిబొమ్మ మొహాన్ని వికృతంగా, భయానకంగా తయారుజేశారు.

కానీ సెక్షన్ 144 అమలుపరచి, పోలీసులు దిష్టిబొమ్మను స్వాధీనపరచుకున్నారు.

ఇప్పుడు పోలీసులకో సమస్య వచ్చిపడింది, దిష్టిబొమ్మను ఏం చేయాలి? అని. పోలీసోళ్ళు పెద్ద ఆఫీసర్ల దగ్గరు వెళ్ళి అడిగారు, “సార్! ఈ దిష్టిబొమ్మ అందరికి అడ్డుగా ఎంతకాలం ఉంటుంది? దీన్ని తగలెట్టటమో, లేదా ద్వంసమో చేసేసేదా?”

ఆఫీసర్లు అన్నారు, “మతిపోయిందా? మంత్రిగారి దిష్టిబొమ్మ ఇది. దీన్ని మనమెలా తగలెడతాం? ఉద్యోగంపై ఆశలు లేవా?”

ఇంతలో రామ్‍లీల రోజులు వచ్చాయి. ఒక పెద్ద పోలీసు ఆఫీసర్‍కు “బ్రెయిన్ వేవ్” వచ్చింది. రామ్-లీల్ వాళ్ళని పిలిపించి చెప్పాడు, “దసరా రోజున కాల్చడానికి రావణుడి దిష్టిబొమ్మ కావాలిగా మీకు? దీన్ని తీసుకుపోండి. దీనికి కేవలం తొమ్మిది తలలు తక్కువ, అవి మీరు పెట్టేసుకోండి.”

మైత్రి (मित्रता)


Translated version of HariShankar Parsai’s मित्रता

****

ఇద్దరు రచయితలు ఉన్నారు. ఇద్దరికీ అసలు పడేదికాదు, ఏవో గొడవలు. ఒకరినొకరు కిందకు లాగడానికి ప్రయత్నించేవారు. నేను వాళ్ళిద్దరి మధ్యా నెయ్యం కుదర్చాడానికి చాలా ప్రయత్నించాను కానీ, ఫలించలేదు.

నేనో రెండు మూడు నెలలు ఊర్లో లేను. తిరిగొచ్చి చూసేసరికి ఇద్దరూ పాలూ-నీళ్ళలా కల్సిపోయారు. ఒకేచోట కూర్చున్నారు. కలిసి టీ తాగుతున్నారు. గంటలకొద్దీ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇద్దరి మధ్యా ప్రేమ పొంగింది.

ఒక మనిషిని, నేను అడిగా – “ఏం గురూ, వీళ్ళ మధ్య ఇంత గాఢమైన స్నేహం ఎలా? ఈ ప్రేమ వెనుక రహస్యమేంటి?”

జవాబు వచ్చింది – “వీళ్ళిద్దరూ కల్సి మూడో రచయితను కిందకు లాగటానికి ప్రయత్నిస్తున్నారు.”

కులం (जाती)


Translation from Hindi. Original: HariShankar Parsai’s जाती.

****

కార్ఖానా మొదలయ్యింది. కార్మికుల బస్తీ తయారయ్యింది. నాయుడుపాళెం నాయుడుగారూ, బ్రాహ్మణపురం దీక్షితులగారూ కార్ఖానా పనులు చేసుకుంటూ, ఎదురుబొదురు బ్లాక్లలో ఉండడం మొదలెట్టారు.

నాయుడిగారి అబ్బాయి, దీక్షితులగారి అమ్మాయి వయసులో ఉన్నారు. ఇద్దరి మధ్య పరిచయం కలిగింది. పరిచయం ఇద్దరూ ఒకరినొకరు పెళ్ళి చేసుకోడానికి సిద్ధపడేంతగా పెరిగింది.

ఈ ప్రస్తావన రాగానే దీక్షితులవారు అన్నారు – “ఇది ముమ్మాటికి జరగని పని. బ్రాహ్మణుల పిల్ల నాయుడింట మెట్టటమా? కులం నాశనమైపోదూ?!”

అమ్మాయి-అబ్బాయి చిన్నపిల్లలు కాదనీ, చదువుకున్నవారనీ, వాళ్ళని పెళ్ళి చేసుకోనివ్వమనీ కొందరు నచ్చజెప్పారు. ఒకవేళ పెళ్ళికి ఒప్పుకోకపోతే, వాళ్ళు చాటుమాటున కలిస్తూ, సంబంధాన్ని పెంచుకుంటూ పోతే, అది వ్యభిచారమనిపించుకుంటుందనీ చెప్పారు.

దీనికి నాయుడిగారు, దీక్షితులు ఇలా అన్నారు – “అయితే అవ్వనివ్వండి. వ్యభిచారం వల్ల కులం నాశనం అవ్వదు. పెళ్ళివల్ల అవుతుంది.”

అన్నం. (रोटी)


This is my attempt to translate Shri HariShankar Parsai’s “Roti”.

***

ప్రజాస్వామిక రాజుగారు కూడా జహంగీరులాగా తన కోట బయట ఒక గొలుసు వేలాడదీశారు. ఎవరికైనా ఏదైనా ఫిర్య్దాదు ఉంటే ఆ గొలుసు లాగితే రాజుగారే స్వయంగా ఫిర్యాదు వింటారని దండోరా వేయించాడు.

ఒక రోజు, బక్క పల్చగా, నీరసంగా ఉన్న మనిషి స్థిరంగా నిలబడలేకుండా ఉన్న స్థితిలో వచ్చి, బలంలేని చేతులతో గొలుసును లాగాడు. ప్రజాస్వామిక రాజు వెంటనే కోట బాల్కనీలోకి వచ్చి అడిగాడు – “ఫిర్యాదుదారుడా! ఏం కావాలి?”

మొరపెట్టుకునేవాడు చెప్పాడు – “రాజా, నీ రాజ్యంలో మేమంతా ఆకలితో చస్తున్నాం. తినడానికి మెతుకు కూడా లేదు. నాకు అన్నం కావాలి. నేను చాలా రోజుల నుండి అన్నం తినలేదు. అన్నం కావాలని అడగడానికి వచ్చాను.”

రాజు సానుభూతితో ఇలా అన్నాడు – “సోదరా! నీ దీనావస్థ నా హృదయాన్ని ద్రవింపజేసింది. నీ తిండి సమస్య గురించి నేను ఈ రోజే ఒక ఉపసంఘాన్ని నియమిస్తాను. కానీ నీకో విన్నపం- “ఉపసంఘం రిపోర్టు వచ్చే లోపు నువ్వు చనిపోవద్దు.”

దండన (दण्ड)


(Note: The following is my translation of Shri HariShankar Parsai’s satirical piece “दण्ड”. I came to know about this prolific writer, only this evening. And since then, have been swimming playfully in the ocean of his satire and humour. I was too excited to talk about him and ended up trying my hand at his shorter pieces. I plan to work on the longer ones too, but for now, here are a series of post.

And yeah, Jai bolo Shri Parsai saab ki..  (alright.. jaiiiiii!))

*****

 ఒక కళాకారుడు ఏదో ఘోర అపరాధం చేశాడు. అతడిని రాజుగారి ముందు ప్రవేశబెట్టారు. రాజు, మంత్రిని అడిగాడు – “ఇతడికి మూడేళ్ళ శిక్ష వేస్తే సరిపోతుందా?”

మంత్రి అన్నాడు,”అపరాధము చాలా పెద్దది. మూడేళ్ళ శిక్ష అంటే చాలా తక్కువ.”

“అయితే పదేళ్ళు సరిపోతుంది.”

“పదేళ్ళు కూడా తక్కువ శిక్షే!”

“అలా అయితే, యావజ్జీవ కారాగారం”

“లేదు. అది కూడా సరిపోదు.”

“పోనీ, ఉరి వేస్తే?”

“లేదు. ఉరి కూడా తక్కువ శిక్షే!”

రాజు విసుక్కుంటూ అడిగాడు – “ఉరికి మించిన దండన ఏముందో, నువ్వే చెప్పు!”

మంత్రి అన్నాడు – ఇతగాడిని ఎక్కడైన కూర్చోబెట్టి ఇతడి ముందు వేరొక కళాకారుని పొగడాలి.”

భయం – గుల్జార్


(చిన్నపిల్లలెప్పుడూ తమకు అత్యంత ప్రీతిపాత్రులైన పెద్దవాళ్ళను అనుకరించాలని ప్రయత్నిస్తారు. రోజూ చూసే విషయాల్లో కాకుండా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పెద్దవాళ్ళు వేరుగా వ్యవహరిస్తుంటే కారణాలు తెలీకపోయినా పిల్లలూ అలానే చేస్తారు. ఉదాహరణకు, కాలికి దెబ్బ తగిలి కుంటుతూ నడుస్తుంటే, పిల్లవాడి కాలు సుబ్బరంగా ఉన్నా అలానే కుంటుతాడు.

ఈ అనువాదం ద్వారా నేను చేసింది కూడా అలాంటి ప్రయత్నమే! ’కవితలు చెప్పి నెత్తురోడాను. కథలు రాసుకొని గాయాలకు కట్లు కట్టుకున్నాను’ అని గుల్జార్ అన్నారు. ఆయనకు కథే కట్టు అయినప్పుడు, ఆయన కథను అనువదించటం అంటే పైన చెప్పినట్టు,  నేను చిన్నపిల్లలా ఆయన కట్టుని అనుకరించటమే, అదే గాయం నాకు లేకున్నా! మరది ఉత్తుత్తి కట్టే అయినా, నాకున్న గాయానికి ఎందుకు మందేసిందో మాత్రం తెలీదు. 🙂

Thanks to everyone, who made this possible! తొలి ప్రచురణ ఈమాటలో..)

________________________________________________________

మితిమీరిన భయం వల్ల అతడి నరాలు బిగుసుకుపోయాయి. చాలా సేపటినుండి కూర్చోనే ఉండడంవల్ల అతడి మోకాళ్ళు మూర్ఛ రాబోతున్నట్టు వణికాయి.

నగరంలో అల్లర్లు చెలరేగి నాలుగు రోజులయ్యింది. కర్ఫ్యూను ఉదయం కాసేపు, సాయంకాలం కాసేపు సడలిస్తున్నారు. కర్ఫ్యూ సడలించినప్పుడు కొందరు రోజూవారి జీవనానికి కావాల్సిన సరుకులు కొనుక్కోడానికి హైరానా పడుతుంటారు. మరికొందరు హడావిడిగా కత్తులు దూసో, నిప్పటించో మారణకాండ సృష్టించి, కొందరినైనా శవాలుగా మార్చి, తిరిగి కర్ఫ్యూ మొదలయ్యేలోపు ఇళ్ళకు చేరుకొని తలుపులేసుకుంటుంటారు. తాజా తాజా వార్తలూ, వేడి వేడి నెత్తురూ ఆగకుండా పారుతున్నాయి బొంబాయిలో. రేడియోల్లోనూ, టీవీల్లోనూ మాత్రం, నగరంలో పరిస్థితులు అదుపులో ఉన్నాయనీ, జనజీవనం ’నార్మల్’ అవుతుందనీ అనౌన్స్ చేస్తూనే ఉన్నారు.

పరిస్థితులు మామూలుగానే ఉన్నాయని నిరూపించడానికి పొద్దుపోయేవరకూ లోకల్ ట్రైన్లను నడపడం మొదలెట్టారు. చాలా వరకూ కంపార్ట్‌మెంట్లు ఖాళీగానే ఉన్నాయి. రైలు పట్టాలమీద పరిగెత్తుతున్న వెలుగులు కనిపించేసరికి, నాలుగురోజుల నుండి స్థిరపడిపోయిన చీకట్లలో కొంచెం కదలిక వచ్చినట్టనిపించింది. రైలు ప్రయాణిస్తుండగా వెలువడే దడదడధ్వనుల వల్ల రైల్వే ట్రాకులకు ఇరువైపులా ఉన్న బస్తీలలో కరుడు కట్టిన నిశ్శబ్దం బీటలువారి, బతుకుపై కొత్త ఆశ చిగురించింది. యాసీన్ ఈ చప్పుళ్ళన్నీ వినేవాడు. రైళ్ళ రాకపోకలనీ గమనించేవాడు. అతడు ఇంటికి వెళ్ళక రేపటికి ఐదో రోజు. ఈపాటికి ఎదురుచూపులు కట్టిపెట్టి, అతడికోసం వెతకటం మొదలెట్టుంటారు. సాయంత్రానికి అతడి ఓపిక నశించింది. ఆ పూట కర్ఫ్యూను సడలించగానే అతడు ’అంధేరి’ స్టేషన్‍కు చేరుకున్నాడు. ప్లాట్‍ఫారం నిర్జనంగా ఉంది. కానీ ఇండికేటర్‌పై రైళ్ళ రాకపోకల సమయాలు తళుక్కుమంటున్నాయి.

రైలు స్టేషన్లోకి నిదానంగా ప్రవేశించింది. రోజూ వచ్చేట్టు స్టైలుగా కాకుండా, దీనంగా, భయంగా, తత్తరపాటుతో వచ్చింది. ట్రైన్లో ఇక్కడొకరూ, అక్కడొకరూ ఉన్నారు. ఏ పెట్టెలోకి ఎక్కాలో అతడు తేల్చుకోలేకపోయాడు. అధికసంఖ్యాకులు హిందువులే కదా! గుత్తులు కట్టి విసిరేసినట్టు ఒకరిద్దరు మనుషులు అక్కడక్కడా ఉన్నారు. అతడు ప్లాట్‍ఫారం పై వేచి చూస్తూ, రైలు బయలుదేరాక ఒక ఉదుటున పరిగెత్తి ఎక్కాడు. ఎవరూ లేని పెట్టెనే ఎంచుకున్నాడు. నాలుగువైపులా చూసాడు. ఎవరూ లేరు. తర్వాత, పెట్టెలోని చివరి బెంచ్ మీద చివరి సీటులో నక్కాడు. అక్కడి నుండైతే అతడు మొత్తం పెట్టెపై కన్నేసి ఉంచగలడు. ట్రైన్ వేగమందుకోగానే అతడు కాస్త ఊపిరి పీల్చుకున్నాడు.

హఠాత్తుగా పెట్టెలో ఇంకో మూలన ఒక ఆకారం కనిపించింది. యాసీన్ మతిపోయింది. మోకాళ్ళు మళ్ళీ మూర్చరాబోతున్నట్టు వణికాయి. ఒకవేళ ఆ మనిషి ఇటువైపు గానీ వస్తే బెంచ్ కింద దాక్కోడానికి వీలుగా, ఎదుర్కోవాల్సి వచ్చినా పొజిషన్ తీసుకోడానికి అనువుగా ఉంటుందని, సీటుపై చేరగిలబడుతూ కిందకంటా కూర్చున్నాడు

పెట్టె తలుపు దూరమేమీ కాదు. అయితే నడుస్తున్న బండిలోనుండి దూకేస్తే చావును మించిన ప్రమాదం ఇంకోటి లేదు. బండి నిదానించినా… ఆ మనిషి! ఉన్నట్టుండి ఆ మనిషి ఉన్న చోటునుండి లేచి నిలబడ్డాడు. నించునే నాలుగుపక్కలా చూసాడు. కానీ అతడి మొహంలో భయంగానీ, బెదురుగానీ ఏమీ కనిపించలేదు. అతడు కచ్చితంగా హిందువు – యాసీన్ మొదటి రియాక్షన్ ఇదే! తాపీగా అటూ, ఇటూ నడుస్తూ ఆ మనిషి అవతలి వైపు తలుపు దగ్గర నించున్నాడు. గాలికి అతడి మఫ్లర్ చిరిగిన జెండాలా రెపరెపలాడింది. కాసేపు బయటకు తొంగి చూస్తూ ఉన్నాడతడు. మరికాసేపటికి ఏదో వస్తువుతో కసరత్తులు చేస్తున్నట్టు అనిపించింది. యాసీన్ కూర్చున్న చోటు నుండి స్పష్టంగా తెలియలేదు. ఏదో వస్తువును లాగుతున్నట్టున్నాడు. ఒకసారి నొక్కుతాడు. ఒకసారి ఎత్తుతాడు. మరోసారి లాగుతాడు. యాసీన్‍కు ఏదో బద్దలుగొడుతున్నాడనిపించింది. అప్పుడే ఎకాయకిన తుప్పుపట్టిన తలుపు కీచుమంటూ, పెద్దగా చప్పుడు చేస్తూ ధడాలున మూసుకుపోయింది. నయం, దడుచుకొని యాసీన్ ఏ వెర్రికేకో వేయలేదు. అయితే ఆ మనిషే ఆ శబ్దాలకు ఉలిక్కిపడ్డాడు. నాలుగువైపులా చూసాడు. యాసీన్ ఉన్న మూలకు ఎక్కువ సేపు చూస్తూ ఉండిపోయాడు. యాసీన్‌కు అనుమానం కలిగింది, అతడు తనను చూసేయలేదు కదా? అలికిడిని పసిగట్టేసాడా?

ఆ మనిషి చూపించిన బలప్రదర్శనతో యాసీన్ గుండెల్లో విపరీతమైన భయం నాటుకుపోయింది. అతడుగానీ ఎదురుపడితే ఎదుర్కోగలడా? ఆ మనిషి తచ్చాడుతూ మరో తలుపు దగ్గర నుంచున్నాడు. బండి జోగేశ్వరి ప్రాంతంలోని నిర్జన స్టేషన్‌ను దాటుకొని దూసుకుపోతోంది. బండి ఆగుంటే అతడు దిగిపోయేవాడో, ఏంటో? కానీ ఇది కర్ఫ్యూ ఉన్న ప్రాంతం. అందుకని బండి ఆగలేదు. కర్ఫ్యూ ఉన్న ప్రాంతమే ఎక్కువ సురక్షితంగా ఉంటుంది. కనీసం పోలీసులైనా ఉంటారు. ఇప్పుడైతే మిలిటరీని కూడా రప్పించారు నగరంలోకి. అల్లర్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఖాకీ వాహనాలు నడుస్తూ కనిపిస్తున్నాయి. అదే రంగు దుస్తులు వేసుకున్న సిపాయిలు, తమ రైఫిళ్ళనూ, తుపాకీలను బయటకు చూపెడుతూ తిరుగుతున్నారు. పోలీసులు పనికిరాకుండా పోయారు. ఇప్పుడు వాళ్ళని చూసి ఎవరూ భయపడ్డం లేదు. రౌడీ మూకలు నిర్భయంగా వాళ్ళపై రాళ్ళూ, సోడా నీళ్ళ సీసాలు విసిరేవాళ్ళు. ఇప్పుడేమో, ఆసిడ్ నింపిన బల్బులు కూడా. పోలిసులు టియర్‌గాస్ ప్రయోగిస్తే, అల్లరిమూకలో కొందరు తడిసిన జేబురుమాళ్ళతో పోలీసులను తిరిగి కొట్టారు. ’సాకీనాకా’లో తను పనిచేసే బేకరిని తగలెట్టినప్పుడు పోలిసులేం చేశారని? దూరంగా నుంచుని చోద్యం చూస్తుంటే, వీళ్ళేమో ఇరుకు సందుల్లో నుండి ప్రాణాలను కాపాడుకుంటూ, విరిగి ముక్కలై, డొక్కుల్లా మిగిలిన పాడుబడ్డ కార్లున్న గారేజి వైపుకు పరిగెత్తారు. ప్రాణాలరచేత పట్టుకొని పరిగెత్తారు. వాళ్ళు ఎనిమిది పది దాకా ఉండి ఉంటారు. భాఁవూ కడుపు చల్లగా ఉండాలి. అతడే పరిగెత్తుతున్న తన చొక్కా పట్టుకొని టీకొట్టు పక్కన ఉన్న షెడ్డులోకి లాగేసాడు. తాను ముస్లిమని భాఁవూకి తెల్సు. కానీ భాఁవూ హిందువు. మరి అతనెందుకు పరిగెత్తాడు? భాఁవూ అన్నాడు – రక్తపిపాసులైన మూకలు పేర్లు కనుక్కోడానికి ఆగరని. వాళ్ళ దాహం రక్తంతోనో, నిప్పుతోనో తీరుతుంది. తగలబెట్టో. చంపో. నరికో. వాళ్ళ కోపం చల్లారేది ఎదురుగా ఇంకేం మిగలనప్పుడే.

రెండో తలుపు నుండి పెద్ద చప్పుడు వినిపించటంతో అతడు ఉలిక్కిపడ్డాడు. పెట్టెకు ఒకవైపు రెండు తలుపులనూ ఆ మనిషి మూసేసాడు. యాసీన్ దాక్కున్న మూలకే చాలా సేపటి నుండి చూస్తున్నాడు. మళ్ళీ అతడు భయం గుప్పిట్లో చిక్కుకుపోయాడు. ఆ మనిషి తలుపులన్నీ ఎందుకు మూసేస్తున్నాడు? తనని చంపేసి, నెత్తుటి మడుగులో తన శవాన్ని అక్కడే వదిలేసి వచ్చే స్టేషన్లో దిగిపోతాడా? రైలు ఇప్పుడు నిదానిస్తోంది. ఏదో స్టేషన్ వస్తోంది. ఆ మనిషి అడుగుల్లో ఇంతకు ముందుకన్నా ఇప్పుడు ఎక్కువ నిబ్బరం కనిపిస్తోంది. మెల్లిమెల్లిగా నడుస్తూ తన వైపుకే వస్తున్నాడు. యాసీన్‌కు ఊపిరి తీసుకోవటం భారమయ్యింది. నుదురుపై పుట్టుకొస్తున్న చెమటచుక్కల చల్లని చెమ్మ అతడికి తెలిసింది. విపరీతంగా భయం వేసింది. ఊపిరాడలేదు. గుటక పడలేదు. సీటుకింద దాక్కున్న అతడికి ఎక్కిళ్ళు వస్తే? అతడు దగ్గితే?

బండి ఆగింది. ఏదో స్టేషన్ వచ్చింది. ఆ మనిషి తాపీగా ప్లాట్‍ఫారం వైపున్న తలుపు దగ్గర నుంచున్నాడు. అతడి చేయి ఒకటి అతడి జేబులో ఉంది. జేబులో ఏదో ఆయుధం ఉండే ఉంటుంది. తుపాకియో? కత్తో? పరిగెత్తుకొని వెళ్ళి అవతలి వైపునుండి దూకేద్దామా? అనుకున్నాడు యాసీన్. కానీ తాను నక్కిన మూలనుండి బయటపడేసరికే ఆ మనిషి తన పొట్టను చీల్చేస్తాడు. పొట్టనేం ఖర్మ! పీకే కోసేస్తాడు, అరిచే అవకాశమివ్వకుండా. దొంగచాటుగా తొంగి చూసాడు. ఆ మనిషి బయటకేసే చూస్తున్నాడు. ప్లాట్‍ఫారంపై ఎవరూ లేదు. అడుగుల అలికిడి కూడా లేదు. ఎవరైనా వస్తే బాగుణ్ణని యాసీన్ ఎంతగానో అనుకున్నాడు. కానీ ఎవరు వస్తారో ఎవరికి తెల్సు? హిందువో? ముస్లిమో? ఇంకో హిందువే అయినా పర్లేదు, భాఁవూలాంటి మంచివాడైతే. భాఁవూ తనకు జంధ్యం వేసి, టీకొట్టునుండి అతడుండే గదికు తీసుకెళ్ళాడు. నాలుగురోజులు ఆశ్రయమిచ్చాడు. అతడు అన్నాడు కదా –

“నేను మరాఠాను. కానీ రోజూ మాంసం తినను. నీకు కావాలంటే తీసుకువస్తాను. ఎలా దొరుకుతుందో నాకు తెలీదు. హలాల్, బలాల్ వంటివి తెలియవు. బయటున్న పరిస్థితుల్లోనేమో కూరగాయలు కుళ్ళిపోతున్నాయి. అమ్మేవాడు ఎవడూ లేడాయె! కొల్లగొట్టుకున్నవాడికి కొల్లగొట్టుకున్నంత!” రేడియోలో మాత్రం నగరంలో పరిస్థితులు నార్మల్ అవుతున్నాయని మళ్ళీ మళ్ళీ ప్రకటిస్తూనే ఉన్నారు. వాహనాలు నడుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో బస్సులను కూడా నడపడం మొదలెట్టారు. ఈ నాలుగు రోజుల్లో అతడికి ఇంట్లోవాళ్ళ మీద బెంగపట్టుకుంది. ఇంట్లోవాళ్ళూ తన గురించి ఆందోళన పడుతూ ఉండుంటారు. దానికితోడు కొత్త భయమొకటి మొదలయ్యింది. ఫాతిమా అతణ్ణి వెతుక్కుంటూ బేకరి అడ్రస్ తీసుకొని అక్కడికి పోతుందేమోనని. దాక్కున గదిలో నుండి రైలు పట్టాలు కనిపించేవి. రైళ్ళు కూడా కనిపించసాగాయి. కానీ భాఁవూ అతడిని వెళ్ళనివ్వలేదు.

బండి కుదుపు వల్ల యాసీన్ గదిలోనుండి పెట్టెలోకి వచ్చిపడ్డాడు. ఆ మనిషి ఎడంచేతితో రాడ్ పట్టుకొని, చాలా నిబ్బరంగా నించున్నాడు. కుడిచేయి ఇంకా జేబులోనే ఉంది. కొంతదూరం నుండి బండి నత్తనడక నడుస్తోంది. ఈ బండి ఎందుకు వేగమందుకోవటం లేదూ? సిగ్నల్ పడే అవకాశమూ లేదే?! పట్టాలపై ట్రాఫిక్ సమస్యే లేదు ఈవేళ. ఇప్పటివరకూ ఒక్క బండి కూడా ఎదురురాలేదు. అయినా బండి బొత్తిగా నత్తనడకే నడుస్తోంది! ఒక చోట ఆగింది. అది భాయందర్ అనే వంతెన. కింద సముద్రం వల్ల ఏర్పడిన అఖాతం ఉంది. ఇక్కడినుండే శవాలను వెలికితీసారంటూ వార్తాపత్రికల్లో కథనాలను అచ్చువేస్తూ ఉంటారు.

యాసీన్‌కు ఊపిరాడ్డం లేదు. ఈ భయంతో బతకటం దుర్భరమనిపించింది. పైగా ఆ మనిషి జేబులోంచి చేయి తీయడేం? అతడి వాలకం బట్టి అతడు దాడి చేస్తాడనే అనిపిస్తోంది. అతడు దాడికి దిగితే ఏమవుతుంది? బయటకు రమ్మని అడుగుతాడా? లేక జుట్టును చేతబట్టుకొని ఈడుస్తూ, పీకమీద కత్తి పెడతాడా? ఏం చేస్తాడతడు? అసలింతకీ, ఇంకా ఏం చెయ్యడేం?

అప్పుడే ఆ మనిషి జేబులోనుండి చేయి తీసాడు. మళ్ళీ బలప్రదర్శన చేయడం మొదలెట్టాడు. మూడో తలుపు కూడా మూసేస్తున్నాడు. ఇప్పుడిక తప్పించుకునేందుకు దారులన్నీ మూసుకు పోతున్నాయి. కిందేమో అఖాతం ఉంది. దూకేస్తే చావు తప్పదు. భయం హద్దులు మీరుతోంది. గుహ మూసుకుపోతోంది.

తటాలున దూకి, ముందుకొచ్చాడు. ఆశ్చర్యపడి చూసాడా మనిషి. అతడి చేయి జేబులోకి వెళ్ళింది. ఎక్కడి నుండి వచ్చిందో తెలీదు కానీ, యాసీన్‌కు బోలెడు బలమొచ్చింది. “యా అలీ!” అంటూ ఆ మనిషిని కాళ్ళ సందులో నుండి ఎత్తి, బయటకు పారేసాడు. పడిపోతూ, పోతూ ఆ మనిషి పెట్టిన కేక – “అల్లాహ్!”

యాసీన్ చేష్టలుడిగి నిలబడి పోయాడు. బండి కదిలింది. యాసీన్ నివ్వెరపోయాడు. “అతడూ ముస్లిమా?” కానీ భయం గుప్పిట్లో నుండి బయటపడ్డం మృత్యుముఖం నుండి తప్పించుకొనొచ్చినట్లు అనిపించింది.

ఆ రాత్రి, అతడు ఫాతీమాతో అన్నాడు ,”ఒకవేళ అలా జరక్కపోయుంటే, నేనైనా ముస్లిమని ఏ రుజువు చూపించేవాణ్ణి అతడికి? గుడ్డలిప్పా?”

(గుల్జార్ వ్రాసిన హిందీ కథ కౌఫ్ కు తెలుగు సేత)