If you’ve cared for this blog..


I’m hoping you haven’t opened this page, just out of curiosity. There seem to be a set of people who care for this blog and what’s being written in it. That, despite my antics. That, from people I least expect to be around. This post is exclusively for them.

First things first, I’m not a great believer of communication. When all is said and done, it sucks to communicate! Then why communicate, అంటే ఒక పిట్ట కథ చెప్తా.

మాకు పదో తరగతిలో బారిష్టరు పార్వతీశం నవల సప్లిమెంటరిగా ఉండేది. మా బాచ్ అప్పుడే కొత్త్త పాఠ్యాంశాలు రావడంతో, తెలుగు రెండో పేపరులో అంతకు ముందు కనీ వినీ ఎరుగనివన్నీ పెట్టారు, ప్రశ్నలుగా. అందులో ఒకటి, బారిష్టరు పార్వతీశం ఫలానా సందర్భంలో ఫలనా చేస్తాడు. అదే మీరైతే ఏం చేస్తారు – అన్న టైపు ప్రశ్నలు. అందులో ఒక ప్రశ్న, పార్వతీశం చెన్నపట్నంలో బస చేసినప్పుడు అక్కడ ఆహారపు విషయాల్లో అరవవాళ్ళకుండే అలవాటులను ఎద్దేవా చేస్తాడు. మీరేం చేస్తారుకి మా వాళ్ళు, “అలా ఒకళ్ళని అనకూడదు. తిని వచ్చేస్తా..”, “అక్కడ ఎంత చెత్తగా ఉన్నా, నేను ఆంధా పద్ధతిలోనే తింటా..” లాంటివి రాసారు. నేనూ… నా తలపొగరంతా చూపిస్తూ, “నాకక్కడ తినటం నచ్చలేదు కాబట్టి ఏం తినకుండా, బయటకొచ్చేస్తా. కావాలంటే ఏ బిస్కట్లో కొనుక్కు తింటా” అని రాసాను. దానికి మా తెలుగు టీచరు, సుబ్బరంగా సున్నా వేసారు. వేసూరుకోక, ఎందుకు వేసారో కూడా చెప్పారు.

“ఉన్నవాటితో ఏదో విధంగా సర్దుకుపోవాలి గాని, నేను అసలుకే చేయనని మొండికేయడం ఏంటి? పక్క రాష్ట్రంలోనే ఇబ్బంది పడితే, విదేశాల్లో ఎలా నెగ్గుకొస్తావ్?” అనన్నారు. అయినా నేను జవాబు మార్చనన్నాను. మళ్ళీ ప్రశ్న వచ్చింది. మళ్ళీ అదే రాసాను. మళ్ళీ సున్నా. ఇప్పటికీ అలాంటి సున్నాలకు కొదవలేదు.

స్టీవ్ టోల్జ్ పాత్రకొకటి విసుక్కుంటుంది ఓ చోట, “నిలువు కాళ్ళు, నున్నటి చర్మం రాగానే మన evolution ఎందుకు ఆగిపోయింది? ఆ కాడికి అవేవో మనిషికుండే సమస్యలన్నింటినీ తీర్చేసేట్టు.” అన్న అర్త్థంలో. భాష విషయంలో నా పేచీ కూడా అదే! ఓ భాష ఒంటబట్టాలంటే ఎంత కష్టం? అంత కష్టపడీ నేర్చుకొని, దాంట్లో రాసో / మాట్లాడో అవతలి వాళ్ళకి మన భావం అందించాక, అవతలి వాళ్ళకి అర్థమయ్యేది ఆవగింజలో అరపాతిక సగం. అయినా, మనకున్న ఏకైక సాధనం అదే కాబట్టి.. బ్లాంక్ పేపర్ ఇవ్వకుండా, బరికి ఇవ్వడం. అందుకని కమ్యూనికేట్..

సరే.. ఇంతకీ ఉన్న పళాన ఇదంతా ఎందుకంటే, గత నెలా, నెలన్నరలో నేను రాసిన పోస్ట్లులకి భీభత్సమైన అభిప్రాయాలు వస్తున్నాయి.  దాని గురించే ఓ రెండు ముక్కలు. అవి చెప్పడానికి ముందు నా నేపధ్యం కొంతా, బ్లాగు నేపధ్యం కొంతా..

నాకు చిన్నప్పటి నుండి పుస్తకాల మీద ఆసక్తి ఉన్నా, అదెప్పుడూ ఒక full-fledged hobbyగా ఉండేది కాదు. ఇహ, రాతల విషయానికొస్తే మార్కుల కోసం తప్ప రాసింది లేదు.

తెలుగంటే నాకు ఇష్టం. ఇంత అని చెప్పలేనంత ఇష్టం. నా భాషని కాదు గానీ, నా భాషయ్యినందుకు తెలుగక్షరం మీద తలకట్టంత పొగరు ఉంటుందిలే నాకు. నాకు వేరే భాషలు బోలెడు వచ్చని కాదు. అయినా తెలుగేతురులైన చాలా మంది కొలీగ్స్, మాతో అంటుండుండే వారు.. “we can’t get a thing of what you’re talking. But boy, it has such a rhythm. We can just keep listening!” అని.

And one fine day, it dawned upon me, that I’m losing *my* language once for all! Since I’m always hooked to internet, even when sky’s falling onto me.. my ultimate choice was blogging. స్కూల్లో ఉన్న అనుభవం పెట్టుబడిగా పెట్టి, పండుగ చేసుకుంటుంటే, ఒక అమ్మాయొచ్చి, “యాక్.. నీ తెలుగు!” అంది.

కొన్నాళ్ళకు ధైర్యం చేసి, కూడలిలో కలిపాను. అక్కడ నుండి.. things have been uphill for me, to-date. I might have been too slow in picking up language and it’s nuances, but I received tremendous encouragement. And if I start naming the people who were / are there for me, it would be a huge list! Then, for reasons that can’t be communicated, I had to delete my blog. ఎందుకు చేసానో, చేస్తున్నానూ అని కూడా చెప్పకుండా డిలీట్ చేసాను. ఓ ఏడాది అజ్ఞాతం తర్వాత బ్లాగర్ లో బాకప్‍ను రిస్టోర్ చేస్తే, కమ్మెంట్లు పోయాయి. అందుకని, ఈ గూటికి చేరాను. కొన్నాళ్ళు పబ్లిక్ చేయలేదు. కాని, వాళ్ళకీ, నాకూ ఇన్విటేషన్లతో ఇబ్బందిగా ఉందని పబ్లిక్ చేసేసాను.

కలం కలలూ, కల్హారాలూ, తోటరాముళ్ళూ, వాగ్విలాసాలు లాంటి వారుండగా నా బ్లాగ్ నాకు పెద్దగా లెక్కల్లోకి వచ్చేది కాదు. అయితే, గీతే వీళ్ళంత బా రాయాలి అని తీర్మానించుకొని ఓ ఏడాది పాటు నేను నిర్విరామంగా, నిరాటంకంగా బొజ్జున్నా! ఇలా అయితే కాదని, ఏదోటి రాస్తే, కనీసం ప్రయత్నమైనా మిగులుతుంది కదా అని కొంచెం బద్ధకం వదిలించుకొని రాయటంపై  శ్రద్ధ పెట్టాను. ఎంచుమించు అదే సమయంలో, ఒర్హాన్ పాముక్, స్టిఫన్ కింగ్ లను చదవటం వల్ల, రాయటంలో ఉన్న సాధకబాధకాలు బాగా బోధపడి.. చాలా భయపడి, ఆనక స్థిమిత పడి.. వీలైనంతగా ప్రయత్నిద్దాం అని అనుకున్నాను.

రాయటంలో కనీసం రెండు అంశాలుంటాయి. ఒకటి ఏం రాస్తున్నాం? రెండు ఎలా రాస్తున్నాం?

ఇప్పటికి దాకా నేనేం రాసానంటే, ఒక ఫిక్షనల్ కారెక్ట్రర్, విపరీత పరిస్థితుల్లో కూడా ఎంత ideal గా ఉండచ్చు అన్నది, ఊహించుకునే రాసాను.

ఇకపై రాసే వాటిలో fictional characters తో పరమ సాడిస్టుగా ఉండాలని. I plan to get as realistic as possible with my imagination. And as Calvin puts it, reality ruin lives. 😛

ఎవరో ఒక ఉన్మాది చేతిలో దారుణంగా బలైన అమ్మాయి ఆవేదన రాస్తే అంతగా పట్టించుకునేవారుండరు. ఏదో ఒక నిట్టూర్పు వదిలి ఊరుకుంటారు. అదే, నేను వాలెంటైన్ డే నాడు, ఒకడు ఫలనా అన్నీ అనుకున్నాడు అని రాస్తే.. వచ్చిన స్పందనలతో నాకేం సమస్యల్లేవు కాని, ఇక పై వచ్చేవన్నీ ఎంచుమించు అలానే ఉంటాయి. The characters could be psychic, narcissist, chauvinist, crazy, maniacs.. all possible! How much of them would you relate to me or see in me is purely your choice and I won’t be influencing you, in anyway. వెతుక్కున్న వాళ్ళకి వెతుక్కున్నంత మహదేవ!

ఎవర్నైనా “యు..ఇడియట్!” అని తిట్టాలంటే, ఆ మనిషిని పిల్చి “యు..ఇడియట్!” అని అనటం బెస్ట్! ఆ మాత్రం దాని కోసం ఒక ఫిక్షనల్ పోస్టు రాసే ఓపిక నాకుండదు. నేను రాసినదేదో, అచ్చు మీ గురించే అనిపిస్తే.. వాన్‍గట్ స్టైల్లో, all living is purely co-incidental అనుకోవటమే! భావుకత్వం, ఫెమినిజం లాంటి పదాలకు మీ డిక్షనరీ అర్థాలు నాకు తెలీవని గమనింప ప్రార్థన. I don’t write with pseudonyms.

I write what I wanna write. You read what you wanna read. (But if we plan to exchange our notes, we may be in for some serious differences.)

And to help you, in all the ways possible,

1. This blog would be purely fictional, hence forth. No musings kinda post, after this.

2. Comments won’t be replied, as far as possible. Just to make sure I’m not meddling too much. Bouquets and brickbats would be treated on their merit!

3. Since this is an experimenting stage, this blog will not be part of any blog aggregators.

ఇంత బిల్డప్ ఇచ్చానని నేనేదో చించి ఉతికారేస్తానని కాదు. Full tosses won’t be defended. That’s the only guarantee. If it’s there to be hit, it would be hit! I could mess it.. but it would be messed up with all sincerity!

Thanks for your time. And before you leave, let me remind you..

Expect the unexpected. No expectations is such a blissful state, anyway.

Regards,

Purnima

Advertisements

When your friend writes a book..


When you win, I feel like a champion! – రోజర్ ఫెదరర్ గెలిచిన ప్రతిసారి గొంతు చించుకొని మ్యూట్ గా నేను అనుకునే మాటలు.

మన ఫ్రెండ్స్ విషయంలో కూడా అలానే అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళేదో ప్రపంచాల్ని గెలిచేయాలని కాదు గాని, ఉన్న అవాంతరాలను అధిగమిస్తూ సాధించుకున్న ఏ చిన్న విజయాలైనా చాలు! అందులో మన వంతుగా కాస్త నవ్విస్తూ, కాస్త విసుక్కుంటూ, న-సాధిస్తూ, బ్రేక్‍లిస్తూ, పళ్ళు నూరుతూ, గోళ్ళు కొరుక్కుంటూ, దొంగలకలు అభినయిస్తూ వాళ్ళ చేత పనిజేయిస్తే, ప్రతిఫలంగా పని పూర్తయ్యాక ఆనందాతిశయాలకన్నా ముందు “హమ్మయ్య!” అని నిట్టూర్చటంలోని అనుభూతి తెలిసొస్తుంది. ఆ అనుభవమేదో నాసొంతం చేసినందుకు సౌమ్యకు థాంక్స్!

మా జనాభా మొత్తానికి (ఈనాడు పుణ్యమా అని నేను తెలీనివారికి కూడా) సౌమ్య తెల్సుకాబట్టి, అందరి తరఫున మూకుమ్మడి కంగ్రాట్స్!

Oh..by the way, witnessing your friend writing a book – in fact, when (s)he goes against tide to achieve something – is as thrilling as a Tendulkar’s 100th run or a Federer’s championship point! Excruciating pleasure!

అందుకని ఫ్రెండ్స్ ద్వయంలో టాలెంటుతో పాటు చేయాలన్న తపనున్న మనుషులు చెలరేగి విజృంభిస్తే, “పార్టీ.. పార్టీ!” అని గోల చేయడానికి మాబోటివారలం సర్వసన్నద్ధం అని సభాముఖంగా తెలియజేస్తున్నాం.

వెదురు ముక్కలమ్మా.. వెదురు ముక్కలు!


నా కృష్ణుడెవ్వరో నాకు తెలీకపోవటం నాకున్న శాపమేమో! నాణేన్ని అటు తిప్పితే ఈ తెలీకపోవటమేదో కూడా నాకు అనువుగానే ఉంది. వాడి పుట్టినరోజును మర్చిపోతానన్న హైరానా అక్కర్లేదు. అత్యుత్తమైనదేదో బహూకరించాలన్న తపస్సూ చేయనవసరం లేదు. బుద్ధి పుట్టినప్పుడు వాడే అటకెక్కి చూసుకుంటాడు. ఆనక, వాడి చిత్తం, నా ప్రాప్తం!*

(బాగా రాయగలిగే చాలామంది, రాసుకునేందుకు ఇష్టపడతారుగాని రాయడానికి జంకుతారు. ఆలోచించినప్పుడల్లా, వాళ్ళకున్నంత కార్యదక్షత, ఓపిక, పరిశ్రమించే గుణం నాకు లేవనుకున్నాను. అనుకుంటున్నాను. అయినా ఇంకా జంకురాదే? ఎవరేమనుకుంటారోనన్న భయంలేదే? బహుశా, అటకెక్కిన వేణువులకన్నా, వేణువు తయారీలో ఉన్న అద్వితీయానందం.. నాకు మాత్రమే సొంతమైన ఆనందం, అనుభవించేశాక, అంతటి ఆనందాన్ని ఇచ్చిన వాటిని మూలపడేయబుద్ధికానందుకేమో?!)

నోట్: మా బాపూ గీసిన అందమైన బొమ్మను ఖూనీ చేస్తావా? అని కయ్యానికి రాకండి. ఇవిగో, ముందస్తుగానే నా క్షమాపణలు!

*ముళ్లపూడి ’కానుక’ కథ చదవనివారికి, నాలోని తిక్క తెలియనివారికి ఈ సొద అర్థం కాదు. నవ్వుకోడానికీ, నవ్వడానికీ అనుమతి ఇవ్వబడింది. 🙂

what the…


What I usually try in this blog with fictional pieces is: I pick a subtle point that catches my attention and try to blow it up in my imagination to put the same point across.

As an example, it’s only few months back that I wrote a fictional letter under the title Nyayam! One or two years ago, there was this love-turned-murder episode  in AP,  in which a gal’s parents were killed and the gal herself was severely injured. Not that such episodes come as total surprise. Somehow, it has become a normality with the frequency on rise. This particular episode kind of disturbed me. My worry was not that she lost her parents or was injured. My fear was how she would cope up with life, with a nightmare like reality haunting her all through. In fact, my worst fear was she wouldn’t be let to forget what had happened with her. That in mind, I attempted a tiny fictional piece on how she pleads the society to leave her alone.

Today, I came to know that the gal’s convict was handed with a life sentence, which resulted in bringing the gal’s family into news and discussions. Agitated for being in news for all wrong reasons, the gal’s younger sister committed suicide.. successfully!

Call me an emotional fool.. but this news has brought tears to my eyes. This is depressing for me. I’m not sorry for the family, anymore. I’m sorry for myself.. because of the society I live in.

I’m sorry for myself, because I’ve seen my worst fears in action.

PS: To anybody with a question as to why I should think so hard about it, why should I be spoiling my time and in turn, your time by writing this:  buzz off! I damn your presence here.

Aside

రోడ్ నెం. 12, బంజారా హిల్స్ ..
ఉదయం పది గంటల సమయం..

రెడ్ సిగ్నల్ పడ్డం వల్ల ట్రాఫిక్ ఆగింది. నిముషం తర్వాత పుస్తకంలోంచి తలపైకెత్తి చూస్తే నా కుడివైపు ఆ అబ్బాయి.

కన్నార్పకుండా ట్రాఫిక్ లో ఎవర్నైనా చూస్తూ ఉండిపోయామంటే, అవతల వ్యక్తి అయితే ఆకర్షణీయంగా ఉన్నట్టు అర్థం. లేకపోతే ఆసక్తికరంగా ఉన్నట్టు అర్థం.

ఈ అబ్బాయి బైక్ మీద ఉన్నాడు. ఎంచక్కా హాండిల్ మీద తల వాల్చేసాడు. “నిద్రపోతున్నాడా?” అన్న అనుమానంతో కార్ విండో పేన్ తొలగించి చూశాను. దూరం ఎక్కువ కాకపోవటంతో, కంటి కొసల చివర్నుండి చూసి, నేను అతణ్ణి గమనిస్తున్నానని అతడికి అర్థమయ్యి, ఠక్కున లేచి కూర్చున్నాడు. సిగ్నల్ తొలగడానికి ఇంకో నలభై సెకన్లు ఉండి ఉంటాయి. నేను చూడ్డం ఆపలేదు. అలా ఎలా బైక్ మీద తలవాల్చి పడుకున్నాడో నాకు అంతుపట్టటం లేదు. అవతల పార్టీ మాత్రం క్లాసులో కునుకు తీస్తుండగా పక్కనున్న పిల్ల చూసి పళ్ళికిలిస్తే కలిగేంతటి ఇబ్బంది కలగింది.

ఆకుపచ్చని రంగు పడగానే అతడు రయ్య్ మంటూ నేరుగా వెళ్ళాడు. నేను ఎడమ వైపుకి వెళ్ళిపోయాను.

నాకా సంఘటన మరుపుకి రావడానికి చాలా రోజులు పట్టింది. ఆ అబ్బి నిద్రపోలేదు, కాని నిద్ర తప్పించి ఇంకేదీ అలా తలవంచేలా చేయగలదు అనుకోలేదు. అసలు, కాస్త సందు దొరికినా నిద్రాదేవిని ఆహ్వానించటం తప్ప మరో ఆలోచన రాని నాకు, నిద్రే కారణం అని బలంగా అనిపించింది. రోజులకు తరబడి నిద్రపోని, పోలేని వాళ్ళు పరిస్థితి ఇలానే ఉంటుందనేసుకొని, దాని ఆధారం ఒక కథ / స్కెచ్ రాయడానికి ప్రయత్నించాను.

ఆ తర్వాత, జీవితం ముక్కు పిండి మూడు చెరువులు తాగిస్తుంటే, అప్పుడు తెల్సింది, నిద్రలేమి వల్ల కన్నా, ఆలోచనా భారం వల్ల తలవాలిపోతూ ఉంటుందని. బహుశా, అతనిదీ అలాంటిదేదో కథ అయ్యుంటుంది. లేదూ.. ఇంకేదో అయ్యుంటుంది. నాకు మాత్రం ఇదో బైక్ విన్యాసం.

Whoever that guy may be, he left an indelible impression!

Impression..

పుస్తకం.నెట్‍తో రెండో ఏడాది..పండగే పండగ!


“నా పేరు పూర్ణిమ.” అన్న వాక్యం పూర్తి కాకుండనే, “నాతో చాలా కొంచెం బోలెడు జాగ్రత్త!” అని కూడా విన్నవించుకుంటాను. అయిననూ, ప్రాక్టీసు లేకుండా బౌన్సీ వికెట్ల మీద చేతులెత్తేసే టీంలు టాస్‍నూ, పిచ్‍లనూ ఆడిపోసుకున్నట్టు, నన్నూ అంటుంటారు.

ఏదో సైటు మొదలెట్టామా? పెట్టాక, ఏదో కొత్త బులబాటం కాబట్టి ఆరంభశూరత్వం ప్రదర్శించామా? ఆ మాత్రం దానికే నా ఫ్రెండొకడు, “పుస్తకంని అడ్డం పెట్టుకొని పండగ చేసుకుంటున్నావు కదా!” అన్నాడు.

సరే ఆ మాటను నేనెందుకు తప్పని నిరూపించడమని, పుస్తకం రెండో ఏడాదిలో కూడా విజృభించాను. పుస్తకం.నెట్‍కు కలిగిన పురోగతిని లెక్కల్లోనూ, అందరి మాటల్లోనూ లెక్కేసుకోవచ్చునేమో గాని, ఈ ఏడాది పుస్తక పరంగా మాకు కలిగిన అనుభవాలు అన్నీ, ఇన్నీ కాదు. “వురేయ్య్ దేవుడా! ఎవరి సీన్లు ఎవరికిచ్చావో, ఓ సారి చూసుకో. నిజం కలలా ఉన్నప్పుడు, మేల్కోవాల్సి వచ్చినప్పుడు చాలా దారుణంగా ఉంటుంది. అట్లాంటి పాపం చేయకు.” అని అరవాలనిపించేంత అబ్బురాలు జరిగాయి.

దేవుడు వరమందిస్తే…

దేవుళ్ళ సాక్షాత్కారం సాధ్యమేననీ, అలా కనిపించినప్పుడు చేతులు జోడించి, ఆపకుండా అప్పటిదాకా నేర్చుకున్న పజ్జాలూ, శ్లోకాలూ గట్రా గుక్క తిప్పుకోకుండా అప్పజెప్పేసి, “ఏం వరం కావాలో కోరుకో నాయనా!” అననగానే అడిగేసుకోవచ్చునని, బోలెడు తెలుగు సినిమాల్లో చూసాను. సినిమాల్లో చూపే అనేక విషయాల్లానే ఇదీ ఉత్తిత్తిదే. నిజంగా, మన దేవుళ్ళని చూసే అవకాశం వచ్చినప్పుడు, నోరెండిపోతుంది, చేతులు వాతంటవే నలుపుడు కార్యక్రమం పెట్టుకుంటాయి. నిద్రపట్టదు. ఊపిరాడదు. పట్టలేనంత దుఃఖం వస్తే ఏడ్వచ్చు. భరించలేని ఆనందం వస్తే మాత్రం ఏం చేయాలో తోచి చావదు.

కొన్ని వేల క్షణాలను ఉత్కఠంగా ఈదుతూ, అసలైన తీరం చేరుకున్నాక, సాక్షాత్తూ వారే ఎదురుగా కూర్చున్నాక, నోటి నుండి వెలువడే తొలి పలుకులు;

“నాకేం అర్థం కావటం లేదు. ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలీటం లేదు. నాక్కాస్త సమయం కావాలి.”

కొన్ని నిముషాల తర్వాత అంతా మామూలయ్యిపోతుంది. ఎవరో మనకి బాగా తెల్సిన వాళ్ళతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. కొన్ని గంటలు పోయాక, అదో సర్వసాధారమైన విషయమైనట్టూ, చిన్నప్పటి నుండీ అక్కడే ఆడుకున్నట్టూ అనిపించేలా గడిచాయి.

పేరుప్రఖ్యాతలు కొంత మందికి ఉత్త పుణ్యానికి వస్తాయి. కొందరికి తమ నైపుణ్యం కారణంగా వస్తాయి. చాలా మంది వాటిని మోయటానికి నానా తిప్పలు పడతారు – పెడతారు. “మీరు ఎందుకూ పనికిరారోచ్!” అన్న ఫీలింగ్ అవతలి వాళ్ళల్లో కల్పిస్తేగాని వీళ్ళకి గొప్పన్న ఫీలింగ్ రాదు. అలాంటిది, తెలుగువారి హృదయాల్లో విశిష్టస్థాయి అందుకున్న బాపూ-రమణ అంటే గుండె చేసిన హోరుని నేటి సంగీత దర్శకులు కూడా కొట్టలేరు.

బాపూ అంటే ప్రముఖ చిత్రకారుడూ, సినీ దర్శకుడూ, రమణ అంటే ప్రఖ్యాత తెలుగు రచయిత అన్న factsని ఇప్పుడు గుర్తుచేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళతో ఉన్నంత సేపూ బాపూ-రమణ, ది మనుషులను చూశాము. వాళ్ళ గొప్పతనం వారికీ బరువు కాదు, మాకూ అవ్వలేదు. హాయిగా, సరదాగా గడిచిపోయాయి. ఇద్దరి పుస్తకప్రియులతో మాట్లాడినట్టు ఉందే కాని, గొప్పన్న వాళ్ళతో మాట్లాడినట్టు అనిపించలేదు.

వాళ్ళ లైబ్రరీల్లో, ఐస్‍క్రీం షాపుల్లో వదిలేయబడ్డ చిన్నపిల్లల్లా ఆడుకున్నాం. బాపూ గారికి ఓ పుస్తకం తీసుకెళ్తే, “ఏం పుస్తకం ఇదీ?!” అంటూ తెరచి, పేజీలు తిప్పుతున్నప్పుడు ఆయన కళ్ళల్లో మెరిసిన కాంతిని, నేనూ, సౌమ్య ఒక జీవితకాలం దాచుకుంటాం. బాపూగారని కాదు, అసలో వ్యక్తి ఒక పుస్తకాన్ని చూస్తే వజ్రవైఢూర్యాలను చూస్తున్నప్పుడు, వాటి కాంతి కళ్ళల్లో ప్రతిబింబించినంతగా ఆ కళ్ళు  మెరిస్తే, is it not a moment to be photographed in mind, forever?

అదృష్టం, విత్ ఫెవికాల్..

“ఏంటసలు? మనకి అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది? ఏంటమ్మాయ్య్ అసలు” అని సౌమ్య మదనపల్లి వీధిలో గింజుకుంది. ఏం చెప్తాం? ఒక ప్రముఖ చరిత్ర పరిశోధకురాలు మాతో మాట్లాడానికి అంగీకరించి, మాకు మూడు గంటల సమయం కేటాయించి, బోలెడు కబుర్లు చెప్పి, “మీరు నాతో కల్సి భోంచేస్తే కాని, నేను చెయ్యను!” అని మాతో కల్సి తిని, బయలుదేరినప్పుడు వీధిలోకి వచ్చి, ఆటో ఎక్కించే అదృష్టం కలిగితే ఇంకేమనుకోడానికి మిగులుతుంది? అసలు ఆవిడ ఎంత ఘనత వహించిన వ్యక్తి అన్నది పూర్తిగా వేరే కథ, మమల్ని ఆదరించిన తీరు, ఆప్యాయతగా చూసుకున్న విధానం.. వావ్! అలానే, శ్రీదేవి ముళ్ళపూడి గారు కూడా మమల్ని ఆదరించిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే!

చిట్టిపొట్టి ఆనందాలు..

కొత్తపల్లి, మంచి పుస్తకం వాళ్ళ గురించి తెల్సుకున్నప్పుడు నాకు goosebumps కలిగాయి. ఏదైనా చేయడానికి ప్రతికూలాంశాలను భూతద్దంలో చూపి భయపెడతారు గాని, ఉన్న పరిమితులకు లోబడి నెరిపే కార్యక్రమాలు ఎంతటి తృప్తికరమైన విజయాలను సాధించగలరని మరో సారి చూపించారు.

వైదేహిగారి నాన్నగారి పుస్తకం ఆవిష్కరణ సభలో నేనూ, సౌమ్య పలకరించబడ్డ విధానం తల్చుకుంటుంటే ఉబ్బితబ్బవుతూ ఉంటాను. అలానే, రానారె గారి పెళ్ళిలో మాకివ్వబడ్డ రిసెప్షన్ కూడా.

కల్తీలేని బడాయండయ్య..

ఇప్పుడవన్నీ చెప్పుకుంటూ పోతే, “బడాయి కాకపోతేనూ..” అన్న సన్నాయి నొక్కులు వినిపించక మానవు. “అసలు పుస్తకం.నెట్ ఊడపీకింది ఏంటట? ఓ నలుగురు కల్సి చేతకాని రాతలు రాయడానికే విర్రవీగపోవడమేనా?!” అన్న విమర్శలు కూడా కర్ణాకర్ణిగా వినిపిస్తాయి. అందుకని, ఈ పోస్ట్ రాయడమనే ఉద్దేశ్యాన్ని విరమించుకుందామనుకున్నాను.

అప్పుడే బ్లాగులకున్న నిర్వచనం గుర్తొచ్చింది. బ్లాగులనగా వ్యక్తిగత అభిప్రాయ వేదిక. అనగా, రోడ్డు మీద కనబడ్డ అమ్మాయి అంగాంగ వర్ణన, భేధాభిప్రాయాలు కలిగినప్పుడు “వారి మొహం. వారు చేతగానివాళ్ళు, పరమ మూర్ఖులు” అని స్టేట్మెంట్లు ఇవ్వటం, మనకు నచ్చనివి చెప్పినప్పుడు “అలాక్కాదు, ఇదిగో ఇలా..” అని ఫీస్ లేకుండా కోచింగ్లు ఇవ్వటం అన్నమాట. కనీసం ఇప్పటికైనా నా బ్లాగునూ ఆ నిర్వచనానికి అనుగుణంగా మార్చాలన్నదే కొత్త ఏడాది తీర్మానం.

అందుకని, నేను కాసేపు, నిఖార్సైన బడాయి పోయినా, ప్రత్యేకంగా వచ్చే నష్టం లేదు. మహా అయితే, కొందరి చేయితిరిగిన వాళ్ళు మూతులు కూడా తిరుగుతాయి.

ఇక ఇప్పుడు కొన్ని కామెడి బిట్స్..

(కామెడి బిట్స్ = మా ఆఫీసులో కాఫీ బ్రేకని పొద్దున్న పదకొండింటికి సమావేశం ఏర్పాటు ఉంటుంది. ఉన్న ఐదారుగురిలో ఎవళ్ళో ఒకళ్ళని ఏవో చిన్నా చితకా కష్టాలుంటాయి. అవి మాతో పంచుకుంటున్నప్పుడు, విని ఊరుకోకుండా.. నవ్వి పెడుతూ ఉంటాం. నవ్వు infectious కదా, ఆళ్ళూ నవ్వేస్తారు, ఏడ్వలేక. )

సరస్పతి తోడు.. పుసతకాలంటే?
పరుచూరిగారి పుణ్యమా అని ఎపి ఆర్కైవ్స్, ఓరియంటల్ మాన్యుస్రిప్ట్స్ ఆఫీసులకు ట్రిప్పులు వేశాం. ఎపి ఆర్కైవ్స్ వారు, సాదరంగా ఆహ్వానించి ఆదరించారు. ఆ రంగు కళ్ళద్దాలు పెట్టుకొని ఓ.యూలోని మాన్యుస్ర్కిప్ట్స్ వారి దగ్గరకు వెళ్ళాం.

“అయ్యా.. ఫలానా ఎక్కడ…. ” అనగానే వేలు ఓ వైపుకి చూపిస్తుంది. అక్కడికి పోయి, “అమ్మా… ఫలానా..” అంటాం. ఆ వేలు మరో వైపుకి. “అయ్యా / అమ్మా..” అంటాం, “చెయ్యి ఖాళీ లేద”ంటారు. “అది కాదండి.. మరేమో.. ఫలానా ఎక్కడ…” అంటాం. మళ్ళీ వేలు, మళ్ళీ వైపు. అలా కిందకీ పైకీ, వెనక్కీ ముందుకీ, బయటకీ లోపలకీ ఫాస్ట్ ఫార్వాడ్ లో ఊహించుకోండి. తిరిగి తిరిగి మొదలెట్టిన చోటికే వస్తాం.

పుస్తకాలకు సంబంధించిన పనులు చేస్తూ కూడా, పుస్తకాల పేరెత్తగానే దిక్కులు చూసే స్టాఫ్ అంటే, సౌమ్యకి పరమ మంట. తిట్టుకుంటూ ఉంటుంది. నేను నా శాయశక్తులా నవ్విపెడుతుంటాను, తిట్లకి తాళం అన్నమాట!

బిగ్ బాస్? 😛

“నేను పూర్ణిమ, ఫలానా పుస్తకం.నెట్ అనీ..” అని నేను చెప్తుండగానే, అవతలి వైపు నున్న వ్యక్తి, “తెల్సునండి.. అది ఫలానా వారిది కదా? మీరు వారి కింద పనిజేస్తారా?” అని అడిగింజుకుంటున్నప్పటి నవ్వు కన్నా, “హే.. ఇది చెప్పలేదు కదూ.. ” అని తెల్సిన వాళ్ళకి చెప్పినప్పుడు వచ్చిన నవ్వు! ఆహా!

నేరం నీది కాదు.. ప్రేమది..
నాకు కాఫ్కా అంటే ఇష్టం. ఆయన రచనలంటే ఇష్టం. కాల్పనిక సాహిత్యం ఎంతగా ఇష్టమో, ఆయన లెటర్స్, డైరీస్ నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా, కలవరపెట్టినా అంతే ఇదిగా చదువుకుంటూ ఉంటాను. ఒక వ్యక్తిగా కాఫ్కాతో నాకు సవాలక్ష సమస్యలున్నాయి. అయినా, మేమిద్దరం ఒకటే కాలానికి సంబంధించినవారం కాదు కాబట్టి, మా మీద ఏదో బంధాన్ని నిర్వర్తించే బాధ్యత లేదు కాబట్టి, ఆ సవాలక్ష సమస్యలకూ అస్తిత్వం లేదు. అందుకని ఎంచక్కా, ఆ రచనల్ను చదివేసుకొని కాలం గడిపేస్తాను.

ఆయన రాసిన “మెటమార్ఫసిస్” అన్న కథ నాకు బాగా నచ్చిన కథల్లో ఒకటి. నాకు చాలా దగ్గరైన కథ. దీన్ని మొదటిసారి చదివినప్పుడు ఉత్సాహంగా నా ఫ్రెండుకు ఈ కథ పరిచయం చేశాను. ఓ వారం తర్వాత, ఆ కథ చదివిన ఫ్రెండ్ అన్న మాటలు, “ఏముంది అసలా కథలో? టైం వేస్ట్! అసలు, ఆ కథ నచ్చడానికి ఒక్క కారణం చెప్పు! కామెడి కాకపోతే.. నువ్వు ఓహో, ఆహా అన్నావ్ అని చదివా!” అని అన్నాడు.

ఆ మాటలు వినగానే నా కాళ్ళ కింద భూమి కంపించలేదు. నా ఎదురుగా ఉన్న మానిటర్‍ని బద్దలుగొట్టాలనిపించలేదు. నా గుండె పగిలిపోలేదు. “నిన్ను చంపేస్తాన్రోయ్య్” అని వాడి కాలర్ పట్టుకోవాలనిపించలేదు. ఇప్పటికీ, నేను “కాఫ్కా” అననగానే, వాడు నన్ను చూసి వెక్కిరిస్తున్నట్టు నవ్వుతాడు. అందుకని “నువ్వు నా స్నేహితుడివి కావు!” అని చెప్పాలనిపించలేదు.

కాని హాలీ రాసిన చివరకు మిగిలేది? కి వచ్చిన స్పందనలు చూశాక, నేనెంత తప్పు చేశానో అర్థమయ్యింది. అసలు సరైన పీనల్ కోడ్లు లేవుగాని, అది వేసినందుకు గానూ మాకు ఉరి శిక్ష అమలు పరిచేవారనుకుంట.

అంటే, ఎవరన్నా మనుషులని అనేటప్పుడు, “మీ మొహం తగలెయ్య.. మీరూ, మీ వెధవాయితనం” అని అనీ అన్నట్టు అనాలి. మనుషుల మీద సెటైర్లు వేయచ్చు. ఎందుకనగా, మనుషులకి sense of humour ఉంటుంది కనుక.

“ఈ రచన పరమ నీచ నికృష్ఠపు రచన” అన్నట్టు రాస్తే ఫర్వాలేదు గాని, “హిహిహి.. ఈ రచన, ఒక తెలుగు సినిమాను తలపించింది.” అని రాయడం ఎంత అవమానకరం.. (సినిమాకా? అని అడక్కూడదు మీరు!) పుస్తకాల మీద సెటైర్లు వేయరాదు. కరెష్టు.. పుస్తకాలకు సెన్సాఫ్ హ్యూమర్ ఉండదు కదా మరి. పుస్తకాలు చదివేవారికి ఉంటుందనుకోండి.. కాని, పుస్తకాలని ప్రేమించేవారికి ఉండదండి. భలే! భలే! మీరు అసాధ్యలు బాబోయ్.. ప్రేమ గుడ్డిది కదా! అని ఎంత ఠక్కున చెప్పేసారు.  అదన్న మాట సంగతి! ఏదో పుణ్యాత్ములు, “ఓహ్.. నీకు చదవడమే రాదు.” అంటూ, క్యాట్ ఎగ్జామ్ కోచింగ్ సెంటర్ పెట్టినవాడు, విద్యార్థులకు ముందుగా “ఎ”, “బి”, “సి” లను గుర్తుపెట్టడానికి, పలకలిచ్చి దిద్దించిన అమృతం సీరియల్‍లో ఎపిసోడ్ తలపించే విధంగా, పెద్దోళ్ళ ట్రైనింగ్లు ఇచ్చారు కాబట్టి సరిపోయింది గాని, లేకుంటేనా?

చదువర్లందు పుస్తకప్రేమికులు వేరయా! వీళ్ళేది చేసినా ఆ ప్రేమ కారణంగానే! వీరు తక్క ఎవరేం చేసినా, అది పనీపాటా లేక చేయటమన్న మాట!

తెలుగు సాహిత్యం కేరాఫ్..

ఇహ తెలుగు సాహిత్యపు బాగోగులను భుజాన వేసుకోవటం చాలా తేలిక! మీకు ఓపికుంటే చెప్పండి.. పెద్దగా చెయ్యాల్సిందేమీ ఉండదు. మీకు వాగ్పటిమ ఉండాలి. ఆ తర్వాత వ్యంగ్యం, నిష్ఠూరం మీ శైలి అవ్వాలి. ఊరుకూరికే పాతను పొగడాలి. కొత్తను తెగడాలి. ఇందులో సబ్సిడీ ఏంటంటే, మీకు నచ్చినవాళ్ళు ఉంటే, మీరు వారి భజన చేసుకోవచ్చును. తక్కిన వాళ్ళల్లో, ఎక్కడైనా ఎప్పుడైనా ఎవ్వళ్ళైనా బిక్కుబిక్కుమంటూ తెలుగు కథో, తెలుగు కాకరకాయో అని అనీ అనగానే, మీరు ఉరిమి ఉరిమి మంగళం మీద కాక, అక్కడే పడాలి. హంతే! అప్పుడప్పుడూ నోరూరుకోని వారు తగులుకున్నా, “అబ్బే.. మీరెవరో నాకు తెలీదు!” అని తప్పేసుకోవచ్చు.

తిరుగుళ్ళు-తిరనాళ్ళు..

చెన్నై, బెంగళూరు, మదనపల్లి, తిరుపతుల్లో బాగా తిరిగాము. “పుస్తకం.నెట్ పనులూ..” అనగానే ఎగాదిగా చూసిన ఇంట్లోవాళ్ళూ, స్నేహితులూ ఇప్పుడు, “సరే.. ఇదో రకం పిచ్చి” అననుకొని “క్షేమంగా వెళ్ళి, లాభంగా రా!” అంటున్నారు. కొందరేమో, మా బాగోగుల కన్నా, మేం కలవబోయే వారి బాగోగుల గురించి కలవరపడుతూ ఉంటారనుకోండి.  ఏ ఊరెళ్ళినా కడుపునిండా తిండి పెట్టి, హాయిగా నిద్రపోవటానికి వీలుగా ఏర్పాట్లు చేయడమే కాక, మా ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని ఎవరెవర్ని కలిస్తే బాగుంటుందో, ఏయే ప్రదేశాలకు వెళ్ళాలో సూచించేవాళ్ళూ… అదృష్టం కాకపోతే ఏమిటిది?

పనిలేక చేస్తున్న పనులివి అని కొందరు తీర్మానించేసినా, “ఆఫీసులో పని! కాస్త ఈ ఆర్టికల్ టైపు చేసిస్తావా?”, “పుస్తకంలో వేయడానికి ఆర్టికల్స్ లేవు, మీకేమన్నా రాయడానికి వీలు పడుతుందా?”, “రేపు ఊరెళ్తున్నా. ఇవ్వాళ వంట్లో బాలేదు. అక్కడికెళ్ళి, అది తెచ్చిపెట్టాలి.” – ఇలా అడిగీ అడగ్గానే సాయం చేసే స్నేహితులు. గంటలకొద్దీ లాప్‍టాప్ మీదున్నా విసుక్కోని ఇంట్లో వాళ్ళు.

రాండీ హెడ్‍ఫేక్ ఫిలాసఫీలో చెప్పుకుంటే, పుస్తకాల గురించి తెల్సుకునే మహత్తర అవకాశం, మంచి మంచి వ్యాసాలను ముందే చదివే అవకాశం, కొంచెం టైం మానేజ్‍మెంట్, బొలెడంత ఫన్, కొత్త ప్రదేశాలు, కొత్త మనుషులు, కొన్ని ఇబ్బందులూ, కాస్త విసుగూ, అలసట.. కాని బోలెడంత హాయి. ఇదీ నా ప్రస్థానం పుస్తకంలో ఈ ఏడాది.

ఇదీ నేను చేసుకున్న పండుగ! హమ్మ్.. ఇది చదివి నా ఫ్రెండ్ ఏమంటాడో? చూద్దాం! 🙂

వేటూరి గారి, “ప్రాప్తమనుకో ఈ క్షణమే బతుకులాగా. పండెననుకో ఈ బతుకే మనసు తీరా” నాకు తారకమంత్రం కాబట్టి, మున్ముందు ఎలా ఉన్నా, ఇప్పటికి ఇన్ని అమూల్యమైన క్షణాలు నా ఖాతాలో వచ్చినందుకు, వాటిని నాతో పంచుకున్నందుకూ అందరికీ కృతజ్ఞతలు.

నూతన సంవత్సర శుభాకాంక్షలు!

Sowmya’s post here.

Pustakam.net’s recap post here.

నేనూ.. నా OA*


మా అమ్మకి జంధ్యాల గారన్నా, ఆయన సినిమాలన్నా చాలా ఇష్టం. పైగా నా చిన్నతనంలోనే ఆయన కామెడీ సినిమాలు బాగా వచ్చాయి. అందుకని మా ఇంట్లో జంధ్యాల మార్కు కామెడీ తిట్లే వినిపిస్తుంటాయి.. ఇప్పటికీ! ఉదాహరణకు, కూరల్లో కూరగాయలన్నీ తీసి పక్కకు పెట్టేస్తుందని మా చెల్లిని “పప్పుచారులో కందిపప్పును ఏరి పక్కకు పెట్టే పిడత మొహం నువ్వూనూ” అని తిడుతుంది. నాకూ అలాంటి అక్షింతలు చాలానే పడుతుంటాయి. నా బద్ధకానికి, నా అజాగ్రత్తకూ సరిపడేలా, “చెంపిన్ను నుండి చెప్పులు దాకా నీకన్నీ use-n-throw ఉండాలి.” అని అంటుంది. నేను వ్యవహరించే తీరు కూడా అలాంటిదే! ఏదన్నా సరే, పారేసుకునో, పోగొట్టుకునో, కాసేపు బాధపడేసి, ఆనక హాయిగా మర్చిపోతుంటాను. నా లాప్‍టాప్ చేతులెత్తేసినప్పుడు కూడా, కాస్త బాధ పడినట్టు అనిపించినా కొత్తది కొనుక్కోవచ్చనే ఆశ విరహింపజేస్తూనే ఉంది.

నేనీ బ్లాగు డిలీట్ చేసినప్పుడు కూడా చాలా వినాల్సి వచ్చింది. “సరే.. బ్లాగు ఎటూ డిలీట్ చేసేశావ్ కాబట్టి, కాసేపు సుబ్బరంగా ఏడు.. కావాలంటే ఒక elegy లాంటిదేదో రాసుకో. కాని ముందు ఏడు.. సరిగ్గా ఏడు. అది నీకెంత ప్రత్యేకమో నీకు తెల్సు కనుక, అందుకు సరిపడా ఏడు” అన్న సలహా మాత్రం నాతో ఎప్పటికీ నిల్చిపోయుంటుంది. ఇప్పుడు రాసేదానికి, పై సలహాకి అంత పొంతన కనిపించకపోవచ్చు, అయినా, ఇదీ ఒక రకం ఏడుపే.. !

నాకు వద్దు మొర్రో అంటున్నా నాకీ లాప్‍టాప్ అంటగట్టారు. డెస్క్ టాప్ ఉండగా దీన్నేం చేసుకోవాలో మొదట అర్థం కాలేదు. లాప్‍టాప్ ఆన్ చేసిన అరగంటలో, దీనిలో తెలుగు రాయడం వచ్చునా అని పరిశోధన మొదలెట్టాను. అప్పటికి “తెలుగు” అంటే ఉన్న కరువు అంతా ఇంతా కాదు. పదో తరగతి తెలుగు పరీక్ష రాసొచ్చాక, మళ్ళీ కాగితం మీద తెలుగు ముక్క రాయలేదు. అడపాదడపా తెలుగును ఏ వార్తాపత్రికల్లో చదవటం తప్పించి చదివినదేమీ లేదు. ఆర్కుట్ పుణ్యమా అని కంప్యూటర్లో తెలుగు రాయొచ్చునూ అని తెల్సినా, ఎలా చెయ్యాలో తెలీలేదు. మెల్లిమెల్లిగా అక్షరాలు చదవటం కూడా మర్చిపోతూ ఉన్నా ఆ సమయంలో. విదేశాల్లో ఏళ్ళతరబడి ఉన్నా కూడా, ఇంతిలా “మిస్సింగ్” ఫీలింగ్ రాదేమో! అందుకనే, లాప్‍టాప్ రాగానే ముందు దానికి తెలుగు వచ్చేలా చేశాను. తెలుగు అక్షరాలు మొనిటర్ మీద కనిపించిన మరుక్షణంలో బ్లాగటం మొదలెట్టాను. అసలేం రాస్తున్నానో అన్న స్ఫృహ కూడా లేదు.. రాయగలుగుతున్నానన్న ఆనందం తప్ప! ఇలాంటి తెలుగు రాస్తే జనాలు రాళ్ళేసి కొడతారేమోనన్న భయం చాన్నాళ్ళు ఉండేది, కాని అనుకున్నది చేసేయటం తప్ప ఇంకో ఆలోచన రానివ్వను కదా నేను!

ఎట్టకేలకు ధైర్యం కూడగొట్టుకొని కూడలిలో బ్లాగు జతపరిచాను. మొదట్లో అక్షింతలు బాగానే పడ్డా, నన్నూ వాళ్ళతో కలుపుకొని ముందుకు పోయారు, బ్లాగుజనులు! నేర్చుకోవటం బాగానే జరిగింది, దాన్ని ఎంత నేర్పుగా ప్రదర్శించాను అన్నది వేరే కథ! ఆ తర్వాత మెల్లిమెల్లిగా పరిచయాలూ, స్నేహాలూ, ఆప్యాయతలూ,అనుమానాలూ, అపార్థాలు, అలకలూ.. అన్నింటి వెనుకా ఆలోచనలూ… ఓహ్! ఒకటా? రెండా? ఎన్నెని చెప్పేది? ప్రతీది గుండె తీగలను మీటి, గొంతులోకి పొంగి, వెళ్ళపై నాట్యమాడినదే కదా! వట్టి దండుగ మారి మాటలయితే అనుకోవచ్చును. జీవితాన్ని కాచి వడపోచిన వారు, అలా కప్పులో అందిస్తూ ఉంటే.. నెస్‍కెఫే ఆడ్ లో అమ్మాయిలా నేను ఆస్వాదిస్తూ తాగిన క్షణాలు. జీవితం చేతకాక, చేతులు కాల్చుకుంటున్న వాళ్ళ బొబ్బలకు బర్నాలు రాయడాలు. నవ్వడాలు, నవ్వుకోడాలు, నవ్వించడాలు. కన్నీళ్ళొచ్చేంత నవ్వులు. నా కన్నీళ్ళు నాకే నవ్వులాటలైన క్షణాలు. నన్ను తెరిచిన పుస్తకంలా చదివిన నేస్తాలు! అర్థంకాకున్నా అపురూపంగా చూసుకునే దోస్తులు! ఒక్కొక్కరితో అనుభవం రాసుకుపోతే.. ఓ పుస్తకమవుతుంది; బీచ్ లో ఆడేసుకున్నాక, పాదాల ముద్రలను తనివి తీరా చూసుకున్నట్టు. ఆరు నవ్వులూ, అర ఏడుపూతో ఏదో జీవితం సాగిపోతుందనుకునే వేళ, పుస్తకం.నెట్ అనే సరదా.. “ఆడుతూ, పాడుతూ పని చేయటం” అంటే అనుభవంలోకి వచ్చేలా!

మనిషిని పియానోతో పోలిస్తే, మనుషుల మనోభావాలు పియానోలో సంగీతాన్ని పలికించగలిగే మెట్లనుకుంటే, ఆ మనిషికి జీవితకాలంలో తారసపడే తక్కిన మనుషులు పియానో వాద్యకారులు. ఇప్పుడు పియానోచేత ఎంత చక్కటి సంగీతం పలికించగలరూ అన్నది ఆయా వాద్యకారుల నైపుణ్యం మీద ఆధారపడుంటుంది కదా! ’నా రాగాలు ఇమిడున్నాయా? నేనింతటి సంగీతాన్ని పలికించగలనా?’ అని పియానో కూడా అబ్బురపడేలా పలికించే వాళ్ళూ ఉంటారు. ’నేనుత్త డొక్కునూ’ అనేంతలా వాయించే వాళ్ళూ ఉంటారు. మనకి తెలీని మనల్ని మన ముందు నిలబట్టే వాళ్ళే- వాళ్లకి మన చేసే నామకరణాలు ఏవైనా కావచ్చు; స్నేహితులని, అత్మీయులని, సన్నిహితులని, ఏరా…అనీ, నీ ఎంకమ్మా.. అని – మనల్ని సంపూర్ణం చేసేది.

ట్వైలైట్ నవల్లో స్టెఫినీ మేయర్, ఒక వాంపైర్ చేత, ఒక మనిషికి చెప్పిస్తున్నట్టు, “Your like my own personal brand of heroin.” అనిపించింది. నిజానికి ఇద్దరి మనుషుల మధ్య కూడా ఈ వాక్యానికి అంతే ఆస్కారం ఉంటుంది. కాకపోతే, ’అదెలా ఉంటుందంటే..’ అని చెప్పడానికి ఉండదు. కొన్ని అనుభవానికి రావాలంతే! అలానే మనకి తారసపడిన వాళ్ళంతా కూడా, ఏదో ఒకటి అయ్యే అవకాశం ఉంటుంది.. కొందరు చాక్లెట్లా, కొందరు డబల్ క మీటా లా, కొందరు బెనెడ్రిల్ కాఫ్ సిరప్ లా, కొందరు కాకరకాయల్లా, కొందరు మత్తుపదార్థాల్లా, కొందరు లాఫింగ్ గాస్ లా..

“Like the meeting of the seagulls and the waves we meet and come near. The seagulls fly off, the waves roll away and we depart. ”

నాకు పరిచయాలు ఇలానే ఇష్టం.. వచ్చి, పోయే అలల్లా! ఎన్నాళ్ళు ఉన్నాం అన్నది కాదు, ఎన్ని పంచుకున్నాం అన్నదే నాకు ముఖ్యం. ఇంకెన్నాళ్ళకు భద్రపర్చుకోగలం అన్నది ముఖ్యం. మనిషి మనతో పాటు ఉండకపోవచ్చు. ఉండాలనుకోవటం అత్యాశ. హైదరాబాద్ బుక్ ఫేర్ లో కొంతమంది బ్లాగర్లను కలిసి, ఇంటికొచ్చాక, మా అమ్మ అన్న మాటలు: “అనుకుంటాం గాని, దీని నెట్‍వర్క్ ఏం అల్లాటప్పా కాదు.. ఇవ్వాళ తెల్సింది”. హమ్మ్.. అలాంటి స్నేహాలను అందించింది ఈ బ్లాగు నాకు. అసలు బ్లాగు మొదలెట్టానికి కారణం లాప్‍టాప్ – ఈ క్షణం నుండి, ఈ బ్లాగులో ఉన్న ప్రతీ అక్షరం నా లాప్‍టాప్ కి అంకితం!**

** మీకు గాని నూత్ (Knuth) గారు గుర్తొచ్చుంటే, నేనేం చేయలేను మరి! 🙂
*ఓవర్ ఆక్షన్.. 🙂

అనంతపురం -2009


మరొకరి పెళ్లి. మరో ఊరు. మళ్ళీ పోస్టు. Sigh!

“.. if you plucked a special moment from life and framed it, were you defying death, decay and the passage of time, or were you submitting to them?” అని ఒర్హాన్ పాముక్ నిలదీశారు మొన్నే ’ఇస్తాన్‍బుల్’ లో! క్షణాలని బంధించటం  అంటే కాలపు ప్రవాహంలో కొట్టుకుపోతూనే దానికి ఎదురునిలువటం. ఈ క్షణాన్ని రాబోయే ఎన్నో క్షణాలు ఆర్తితో చూసుకునే వీలు కలిపించటం. ఈ క్షణంలో ఆగిపోయే వెసులుబాటు లేక, అలా అని దాని అస్థిత్వాన్ని మర్చిపోయే ప్రమాదాన్ని విస్మరించలేక, ఉన్న పరిమితుల్లో చేసే ప్రయత్నం! కెమరాతో నచ్చినవి బంధించటం ఒక కళ. అందులో నాకు ఓనమాలు రావు సరి కదా, ఆ కళలో ఒక ప్రాధమికమైన ఇబ్బందిని ఎదుర్కుంటూ ఉంటాను. కళ్ళు మూసుకొని నాకు ప్రీతి కలిగించే క్షణాలు నెమరవేసుకుంటున్నప్పుడు, అవి కాస్తా నేను లెన్స్ లో నుండి చూసినట్టు గుర్తొస్తే.. నచ్చదు. అందుకే నేను ఫోటోలకి దూరం. కాకపోతే బంధించాలన్న యావ పోక, ఇలా అక్షరాలను ధారపోయడం. అదీ కాక, రాత్రి పూట చిమ్మ చీకటి విశేషాలను ఏ కేమరా బంధించగలదు కనుక అని రవ్వంత పొగరు కూడానూ.

బస్సు ప్రయాణం అనగానే నిద్ర బస్సెక్కి కూర్చుంటుందేమో, రమ్మన్నా రాదు. నిద్ర పోకపోవడం వల్ల కలిగే ఏకైక ప్రయోజనం స్వీయ దర్శకత్వాన కలలు కనడం. బస్సంతా చీకటి, ఎక్కడో ఒకటీ-అర లైట్లతో నిశ్శబ్ధం కప్పుకొన్నట్టుంది బస్సు. అర్థరాత్రి కావస్తోంది కాబట్టి, వీధి దీపాలు తప్పించి మరో వెలుతురు లేదు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా నిద్రావస్థలో ఉన్నాయి. మూసేసిన కొట్ల షటర్లపై తేలిపోయే నారింజపండు రంగు వెలుతురు పడుతూ ఉంది. ఫుట్‍పాతులు “మేమున్నాం ఇక్కడా” అని ఏకరవు పెట్టేంత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎక్కడో చోట ఏదో హోటెల్ తప్పించి నగరం మొత్తానికి బిస్తరేసేసింది. అలసిసొలసి కాసేపు ఆదమరచి నిద్రపోతుంది.

ఊరు దాటాం! ఇప్పుడిక ప్రతీదీ వింతే నాకు. విశాలమైన మైదానాలు – రాళ్ళూ రప్పలూ, అడ్డదిడ్డంగా మొలచిన గడ్డి మీద నిండు పున్నమి వెన్నల – అబ్బ, చూసి ఊరుకోవాలి కానీ, ఇప్పుడు చెప్పితీరాలనుకుంటే ఎన్ని పదాలను అందంగా అమర్చగలగాలి.  చిటికెడు కటిక నలుపు రంగులో ఓ రెండు మూడు చుక్కల తెలుపు రంగుని కలిపితే వచ్చే వర్ణం – అందులో ఏదీ స్పష్టం కాదు. అలా అని చీకట్లోనూ కలిసిపోవు. ఆకారాలు తెలుస్తాయి, మసగ్గా – ఇది రాయి, అది చెట్టు, అది కొండ, అక్కడో దారి – ఇలా అన్నింటినీ గుర్తుపట్టచ్చు. నలుపులో ఉన్న అందాన్ని ఆవిష్కరించడానికే రాత్రి ఉంటుందేమో. కనుచూపుమేర కనిపిస్తున్న మైదానం ఓ చోట ఆగిపోతుంది. అక్కడ నుండి ఆకాశం! చూస్తున్న కొద్దీ ఆకాశం. ముసుగు తన్ని పడుకోవడం చాలా మందికి ఇష్టమై ఉండచ్చు. కానీ నాకు ముసుగులో కూర్చునో, పడుకొనో ఏదైనా చెయ్యాలీ అని. చీకట్లో చదువుకోగలిగితే ఎంత బాగుణ్ణు కదూ! భూమి కూడా ఆకాశమనే ముసుగులో (a dome of blue glass) ఉన్నట్టు అనిపించింది.  కాకపోతే, మరీ మొహం మీదొకొచ్చి ఊపిరాడనివ్వని ముసుగు కాదు, ఆ ముసుగులో అనంత జీవ కోటి ఊపిరిపీల్చుకునేంతగా!

ఆకాశానికేసి చూస్తూ ఉంటే నిండైన చందమామ. నిజం చెప్పాలంటే నిండుగా అవ్వటానికి ఒక్క స్ట్రోక్ తక్కువ అయిన చందమామ! నేను చూడనంత సేపూ ఏం చేస్తాడో ఏమో కానీ, చూస్తే పాపం, ఆట మొదలు. కాసేపు ముందుకెళ్ళి పోయి, కాసేపు వెనక నుండి గబగబా పరిగెడుతూ, కొద్ది సేపు మేఘాల చాటున, మరి కొద్ది సేపు నాకంటికి కనిపించడానికి వీలు లేకుండా! ’పోయాడులే’ అనుకొన్న క్షణాన ప్రత్యక్షమవుతాడు.’ఇక్కడే ఉన్నాడ’న్న ధీమాతో ఉన్నప్పుడు మాయమైపోతాడు. మర్చిపోవటానికి ప్రయత్నించటం ఓ నరకం. ఎదురుచూస్తూ ఉండిపోవడం మరో నరకం. ఏది చెయ్యాలో తెలీక, మరుస్తూనే ఎదురుచూడ్డం, ఎదురుచూస్తూనే మరుపుకి లొంగిపోవడం – ఓ చిత్రమైన నరకం.

చంద్రుణ్ణి మరచిన క్షణాల్లో, నాకంట బడింది ఒక చుక్క, చంద్రుణ్ణి అత్యంత చేరువలో ఉందది. ఈర్ష్య కలిగింది. క్షణంలో ఏదో నిర్వేదం. నాది కా(లే)నప్పుడు, దాని మీద ఎంత ఇష్టముంటే ఏం లాభం! రెప్పవాలితే కలలెక్కడ వేధిస్తాయోనన్న భయంతో బయటకి చూస్తూనే ఉన్నాను. మధ్య మధ్య కొండలు కనిపించాయి. ’పెద్ద పెద్ద రాళ్ళన్నీ ఓ గుమ్ముగూడిన సమూహమే కొండలూ’’అనుకున్నాను. ఒక పద్ధతి పాడూ లేకుండా, ఎవరూ పట్టించుకోకుండా వదిలి వెళ్ళినట్టు పడున్నాయి కొండలు. ’ప్రపంచాన్ని సృష్టించేటప్పుడు ముడి సరకులను పెట్టుకోడానికి కొండల్ని ఉపయోగించి, పనయ్యాక వాటిని అలానే వదిలేశాడు’ అనిపించింది. “కొండకొకటీ, కోనకొకటీ” అని విన్నాను కానీ, అదేంటో ఈ కొండల్ని చూస్తుంటే అనాధలైపోయి బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా ఉన్నాయే అని బాధేసింది. “ఈ దేవుడున్నాడే..” అంటూ మొదలెట్టబోయే ముందే, ఒక హైవే పాయింట్ వచ్చింది. బోలెడంత వెలుతురు. పనిచేస్తున్న యంత్రాంగం. కొద్దిసేపటి మళ్ళీ చీకటి. దేవుడే ఎటుబడితే అటు పారేసిన కొండల్ని చదును చేసుకొని తనకునుగుణంగా మార్చుకున్నాడు. అడ్డురాని వాటిని అట్టే వదిలేసాడు. “ఈ మనిషనే వాడు ఉన్నాడే..” అనుకుంటూ తల తిప్పి అవతలి కిటికేసి చూశాను.

“ఓహ్.. ఇదేదోలా ఉంది? ఏంటది?” – కిటికీలో నుండి నాకు కనిపించిన దృశ్యం నన్ను అమితంగా ఆకర్షిస్తున్నా, కన్ను ఆర్పకుండా ఆ చిత్రపఠాన్ని మెదడులో ముద్రిస్తున్నా, నాకు గుర్తొచ్చిన ఉపమానం నోటిపైన ఆడేవరకూ మెడనరాలు బిగబెట్టాయి. ఓ కొండ ఉంది – చిన్నదే! శిఖరం నుండి ఎడమవైపేమో చాలా చిన్న విస్తీర్ణం. కుడిపక్కకేమో చాలా దూరం వరకూ విస్తరించుంది. ఎడమవైపు కొండ చీకటిలో కల్సిపోయింది. కుడిపక్కనంతా విద్యుద్దీపాలు వరుసగా సమదూరంలో ఉన్నాయి. దీన్ని ఓ రెండు మూడు కిలోమీటర్ల దూరం నుండి చూస్తూ ఉంటే, భద్రాద్రిలో రామనవమి నాడు కళ్యాణంలో రామునికెదురుగా కూర్చున్న సీతమ్మవారి జడ. నల్లని జడ మీద మెరుస్తున్న నగల్లా ఉన్నాయ్ ఆ కొండ మీద విద్యుద్దీపాలు. కొండేమో దేవుడిది. దీపాలేమో మనిషివి. ఇద్దరి మేలు కలయికా ఇది?

ఒకే ఐపాడ్ నుండి వెలువడే సంగీతం చెరో ఇయర్-ఫోన్ నుండి ఇద్దరి మనుషుల్లోకి ఎక్కుత్తోంది. సంగీతానికి గాయాలు మాన్పే గుణం, సాంత్వన కలిగించే లక్షణం ఉన్నాయంటారు. నా పక్కనున్న మనిషికేమో నిద్రపుచ్చే మత్తులాంటిదేదో ఎక్కుతున్నట్టుంది హాయిగా నిద్రపోతున్నాడు. నాకేమో రెచ్చగొట్టే మాదకద్రవ్యమేదో ఇచ్చినట్టుంది.  నేను వింటుంటే కదా, ప్రతీ పాటకీ ఒక భీకరమైన జ్ఞాపకాన్ని తట్టి నిద్రలేపి, ఆ పునశ్చరణ కలిగించే బాధను పంటికింద బిగించి దిక్కులు చూస్తున్నాను. కిటికీలో నుండి రివ్వున వీస్తున్న గాలి, పైన చందమామ, అతడికి దగ్గరలో చుక్క, నేల పై చెట్లూ, కొండలూ, అక్కడక్కడా మానవ నిర్మిత భవనాలు – చీకటి మసక వెలుతురులో! ఆలోచన సుడుల్లో చిక్కుకొని ఎప్పుడు నిద్రపోయానో! నిద్రేనా అది?

“వచ్చేసిందా? ఏ ఊరీది?” అన్న మాటలతో కళ్ళు తెరిచాను. ఇంకా తెల్లారలేదు.. మసక వెలుతురే! నే వేసుకొన్న చెప్పులు బస్సు కుదుపలకి ఎక్కడో పోయాయి. వాటిని వెతుక్కోడానికి కాసేపు జిమ్మికులు చేసి, కుదరక ఆనక చూడచ్చునులే అని ఊరుకొని బయటకి చూడ్డం మొదలెట్టా. ఏవో చిన్న చిన్న ఊర్లు! ఇంకా ఎవరూ నిద్రలేవనట్టున్నారు. సీటుపై మోకాలపై కూర్చుని “అనంతపురం వస్తే చెప్పండి ప్లీజ్.. ” అన్నాను. నిద్రను వదిలించుకుంటున్న వ్యక్తి “మాక్కొత్త.. మేం ఇదే మొదటిసారి వస్తున్నాం” అన్నారు. నేను సీటు దిగి తిన్నగా కూర్చుందాం అనుకుంటుండగా కనిపించిన ఓ మహాదృశ్యం.

అవతలి పక్క కిటికీ నుండి చూస్తుంటే, విశాలమైన మైదానం. భూమి నుండి అడుగు ఎత్తుకన్నా ఎక్కువ కాని మొక్కలు అక్కడక్కడా ఉన్నాయంతే. మిగితా అంతా మట్టీ, రాళ్ళు. మిగితా అంతా ఆకాశం. లేత నీలం రంగు మొత్తం పేపరు మీద సమానంగా పెయింట్ వేసి, దాని పై లేత గులాబీ రంగును మధ్యమధ్యన నీలం ప్రస్ఫుటంగా కనిపించేట్టు అసమానంగా వేసి, మధ్యన ఒక ముదురు గులాబీ రంగుని సంపూర్ణ వృత్తంలో నింపితే – అదీ ఆ దృశ్యం. అప్పుడప్పుడే తెలతెలవారుతున్నప్పుడు ఆకాశంలో కనిపించే రంగుల మాయాజాలం. నేనింతకు ముందు చాలా సూర్యోదయాలు చూశాను. అందరూ సముద్రం దగ్గరా, కొండలపైన నుండీ చూసే వాటి నుండి అద్భుతం అని వర్ణిస్తారు కానీ, మాసబ్ టాంక్ ఫ్లై ఓవర్ ఎక్కుతున్నప్పుడు, బిల్డింగుల మధ్యనుండి స్టైలిష్‍గా వచ్చే సూర్యుణ్ణి చూడ్డమంటే నాకు భలే ఇష్టం. ఆ తర్వాత నాకీ సూర్యోదయం నచ్చింది. అడ్డు రావటానికి ఇక్కడేమీ లేకపోవటం వల్ల, లేలేత సూర్యకిరణాలు తాకి నేలకి ఒక కొత్త సొగుసు వచ్చింది. దేవుడు గొప్ప చిత్రకారుడు అనిపించాడు ఆ ఒక్క క్షణంలో.

అనంతపురంలో ఉన్న పధ్నాలుగు గంటల్లో బోలెడన్ని విశేషాలు జరిగినా, ఆ రాత్రి ప్రయాణం మాత్రం చాలా గమ్మత్తుగా అనిపించింది. విపరీతమైన బడలిక వల్ల తిరుగు ప్రయాణంలో సుబ్బరంగా బొజ్జోటం వల్ల, “తిరిగొస్తున్నప్పుడు వీటిని మళ్ళీ చూడాల”న్న నా మెగా ప్లాన్ ప్లాప్ అయ్యింది. ఫ్లాప్ అంటే గుర్తొచ్చింది, అనంతపురంలో “గోపి, గోపికా, గోదావరి” అనే సినిమాను హౌస్ ఫుల్ హాల్‍లో చూడాల్సివచ్చింది. కళ్ళల్లో నుండి, కర్ణాల్లో నుండి రక్తాలు కారాయంటే అతిశయోక్తి కాదు.. పచ్చి నిజం.  వద్దొద్దంటున్నా నన్నీ సినిమా తీసుకెళ్లారన్న కక్షను క్లైమాక్స్ కు వచ్చే సరికి తలలు బాదుకుంటున్న మా గాంగ్‍ని చూసి మాత్రం ఒక పైశాచిక నవ్వు నవ్వాను, ఆపకుండా అరగంట! నవ్వుని మహా గొప్ప “ఒఫెన్సివ్” మంత్రంగా గుర్తించాను, ఈ టూర్ వల్ల.

పుస్తకంలో నేను :P


మా ఆఫీసులో ప్రతీ వార్షికోత్సవానికి డబ్బులు పోసి “ఎంటర్‍టేన్‍మెంట్” కొనుక్కోకుండా, మేమే మమల్ని మేమే ఎంటర్‍టేన్ చేసుకుంటుంటాం! “ఏం చెయ్యాలి?” నుండి “ఎలా చెయ్యాలి?” వరకూ అన్నింటికీ చర్చలే! ఆ చర్చల్లో గమ్మునుండక, తల్లోకొచ్చిన ప్రతీ ఐడియాను ప్రతి తలతో పంచుకోవచ్చు. ఐడియా బాలేకపోతే “ఊహు” తో ఊరుకుంటారు! అదే బాగుంటే, ఐడియాను నిర్విఘ్నంగా సఫలం చేసే బాధ్యత చెప్పినోళ్ళ నెత్తి మీదే పడేస్తారు. నోరూరుకోని నాబోటి బద్ధకస్తులకి ఇటువంటి ఘట్టాలు – చంచాలో మహాసాగరాలు ఈదటంతో సమానం. ఏదో బ్లాగర్ల పుణ్యమా అని బోలెడు మంచి పుస్తకాలు కొనుక్కున్నాన్న అత్యుత్సాహంలో, “ఎంత బడాయి ఈ పిల్లకి!” అనుకునేరు జనులు అన్న జంకూ బొంకూ లేకుండా ఓ చాంతాండంత లిస్ట్ రాసిందే కాక, చివర్న నా బుద్ధి వంకరను చూపించుకోటానికన్నట్టు.. “పుస్తకాలకీ నవతరంగం లాంటి సైటు” అని నిప్పు అంటీ అంటించకుండా పక్కకు పోదాం అనుకుంటుండగా, అసలు పొరపాటున కూడా నా బ్లాగు తనంతట తాను చదవని సౌమ్య, ఆ టపా చదివి, “ఐడియా బాగుంది.. బాగుంది” అంది. నేను ఉబ్బితబ్బియ్యైపోతున్న వేళ, “మనమిద్దరమే చేయ్యచ్చేమో!” అనగానే గుండెల్లో మొదలైన రైలు “మనమిద్దరం చేద్దాం” అన్న స్టేషను దాటి “మనమిద్దరం చేస్తున్నాం” వరకూ సౌమ్య నడుపుకొచ్చేసింది. ఇహ ఆలస్యం చేస్తే లాభం ఉండదని నేను “రాస్తారోకో”లు మొదలెట్టాను. “అమ్మాయ్.. నా వల్ల కాదు! నేనిందుకు పనికి రాను. యు నో.. ఐ కాన్ట్ డు థిస్. అది కాదు, అసలు నాబోటి వాళ్ళు ఇంతటి మహత్తక్కార్యాలకు ఎలా కుదురుతారు?” లాంటివెన్నో అంటూనే ఉన్నా! కానీ ఒక్కసారి కమిట్ చేయించడానికి కమిట్ అయ్యిన సౌమ్య మాట ఎవ్వరైనా వినాల్సిందే కాబట్టి.. పుస్తకం.నెట్ తో నా ప్రస్థానం మొదలయ్యింది.

నేనింత వరకూ ఇలాంటి కమ్మింట్‍మెంట్ తో కూడిన లాంగ్ టర్మ్ ప్రాజెక్టుల్లో ఇన్‍వాల్వ్ కాలేదు. అందుకు ముఖ్యాతి ముఖ్య కారణం నా అభిరుచులు పెద్ద కారణాలేమీ లేకుండా ఊరికూరికే మారిపోతుంటాయి. నా మూడ్ ఏమో ఉత్తపుణ్యానికి, ఉత్తపాపానికీ మారి(మారకుండా) పోతూ ఉంటుంది. (దీన్నే మా ఇంట్లో “బద్ధకం” అంటూ ఉంటారు.. అదే నిజం అని నేను చెప్పను!) ఎరక్క పోయి ఇరుకున్నా కాబట్టి ఎప్పుడోకప్పుడు “రిటైర్డ్ హర్ట్” కావచ్చులే అన్న ధైర్యంతో ముందుకు పోవడానికి సిద్ధపడ్డాను.

ఓ ఏడాది పాటు అనుభవాలన్నీ రాసుకోవాలంటే కాస్త కష్టమే. హైలైట్స్ లో ఎక్కువగా బౌండరీలే చూపించాలి. కానీ అసలు ఇన్నింగ్స్ ఏర్పడేది సింగిల్స్ వల్ల. పుస్తకం.నెట్ కోసం చాలా విధాలుగా నా comfort zone దాటుకొని కొన్ని చేయాల్సి వచ్చింది. అందులో ఎప్పటికీ నాతో నిల్చిపోయేది మాత్రం అబిడ్స్ ఫుట్‍పాత్ మీద అమ్మకందారులతో వారి వ్యాపార సంబంధ విషయాలు మాట్లాడ్డం. కోఠీ, అబిడ్స్ వీధులు తిరిగి బోలెడన్ని చెప్పుల జతలు అరగదీశాం. హైద్ లో ఈ మాల్స్ అవీ రాక ముందు పుస్తకాల నుండి ప్రతీ వస్తువు షాపింగ్ ఆ వీధుల్లో జరగాల్సిందే. హైదరాబాదీ అంటే బాగా బేరమాడగలగాలి అన్న తమాష వ్యాఖ్య ఉంది. అసలు ఏ మాటా అనకముందే “ఇంకో మాట చెప్పు” అనాలంట! నాకు బొత్తిగా బేరాలాడడం రాదు. నేనో వస్తువు తీసుకొని “ఎంత?” అంటాను. వాడు, “వంద” అంటాడు. నేను “పాతిక” అంటాను. వాడు బాగులో దాన్ని వేసి నాకు ఇచ్చేస్తాడు. అంటే దీని అర్థం, అది ఏ ఐదు, పది రూపాయల వస్తువని! అందుకే నా స్నేహితురాళ్ళందరూ నన్ను షాపింగ్ కని తీసుకెళ్లి వస్తువుల ఎన్నిక కాగానే బయటకి పంపించేస్తారు. బేరమాడ్డం రాకపోయినా, బేరం షాపోడికి అనుకూలించే చేయటంలో నా దగ్గరేదో రహస్య విద్య ఉందని వాళ్ల నమ్మకం. అలాంటి నేను, ఫుట్‍పాత్ మీద అరికాళ్ళ మీద కూర్చొని నేను కంగారుపడుతూనే తడబడుతున్న వాళ్లని నెమ్మదింపచేసి, ప్రశ్నలు అడిగి, సమాధానాలు రాబట్టి – అదో ప్రహసనంలా అనిపించింది. కొన్ని పనుల ఫలితం చూడ్డానికి చాలా చిన్నగా అనిపిస్తాయి. నిజానికి అవి చిన్నవే కూడా! కాకపోతే వాటి వల్ల మనలో వచ్చే మార్పులు ఎంత గణనీయం అంటే, మనం మరెన్నో పెద్ద పనులు చెయ్యటానికి ఊతాన్ని అందిస్తాయి.

పుస్తకం.నెట్ వల్ల కలిగిన మరో సదవకాశం, కొందరితో పరిచయాలు. బ్లాగుల వల్ల స్నేహాలు చాలానే కలిగాయి. అందునా, నా వయస్సూ, నా ఆలోచనలూ, నా ఆవేశాలకూ దరిదాపుల్లో  ఉన్నవారితో కాబట్టి ఓ రకంగా పాతుకుపోయాయనే చెప్పాలి. పుస్తకం.నెట్ వల్ల కల్సిన కొందరు మనుషులు మాత్రం, నా ప్రపంచానికి చాలా దూరంగా ఉండేవారు. “కదంబి” రామకృష్ణ ఆచార్య గారితో పరిచయం అలాంటిదే! ఆయనతో మొదటిసారి మాట్లాడినవన్నీ పూసగుచ్చినట్టు ఇక్కడ రాసినా కూడా, ఇంకా ఎన్నో చెప్పటం మర్చిపోయానే అనిపిస్తూనే ఉంటుంది. ఆచార్యగారి పుస్తక పఠనాభిలాషను పక్కకు పెడితే, ఆయన గత యాభై ఏళ్ళుగా రోజూ పొద్దున్నే ఒకటే షాపుకి అదే ఉత్సాహంతో వస్తున్నారంటే మాకు భలే ఆశ్చర్యం వేసింది. ఆయన “నేను కొట్టుకు రాకుండా ఉండలేను, ఆదివారం నాడే నాకు ప్రాణం మీదకి వచ్చినట్టు ఉంటుంది.” అన్నప్పుడు ఆయన కళ్ళల్లోని వెలుగుని తర్జుమా చెయ్యాలంటే ఏ భాషా సరిపోదు. ఇంకా పూర్తిగా  మెలకువ రాకముందే, “అబ్బా.. ఇవ్వాళ ఆఫీసుకు వెళ్లాలా? ఇవ్వాళ అర్జెంటు పని వచ్చే అవకాశం ఉందా? లీవ్స్ ఎన్ని మిగిలాయ్ ఇంకా?” అనుకుంటూ ఓ అరగంట నిద్ర కోసం కక్కుర్తిపడే నాకు, ఆయన ఉత్సాహం చూస్తూ ఉంటే నిజంగానే సిగ్గేసింది. ఆయనతో మాట్లాడ్డం కానిచ్చుకొని తిరిగొచ్చేస్తుండగా..

“అమ్మాయ్.. దాహం” అని సౌమ్య, “అమ్మమ్మో.. దాహం” అంటూ నేనూ, పక్కనే ఉన్న బేకరీకి పరిగెత్తాం వాటర్ బాటిల్ కోసం. ఇద్దరి మొహాలు వాడిపోయి ఉన్నాయి. టైం చూసుకుంటే అర్థమయ్యింది, ఆయనతో మేం దాదాపు మూడు గంటల సేపు మాట్లాడాం అని. (మాట్లాడాం = ఆయన మాట్లాడుతుంటే మేం వింటూ నోట్స్ రాసుకున్నాం.)

“చాలా అలసిపోయినట్టు అనిపిస్తోంది. ఎక్కడైనా కూర్చొని ఏదో ఒకటి తినాలి” అన్నా నేను.
“అవును.. కానీ ఆయనకి ఛాన్స్ ఇస్తే ఇంకో మూడు గంటల పాటు అదే ఎనర్జీతో కొనసాగేలా ఉన్నారు. మనమేంటి ఇలా?” అని ఊసురోమంది సౌమ్య.
“మనం యూత్ కదా” అన్నా నేను.

ఇది చదివి మీకు నవ్వురాకపోయుండచ్చు కానీ, మేం మాత్రం విరగబడి, పగలబడి నవ్వుకున్నాం. “మేం అలా నవ్వుకుంటూనే పనిచేస్తాం” అని అంటే చక్కగా చిర్నవ్వు చిందిస్తూ పనిలో మునిగిన ఇద్దరు మీ మనోఫలకం మీద కనిపిస్తుంటే, అబ్బే.. అది రాంగ్ పిక్చరైజేషను. మా నవ్వులు పనులు ఆపేంత భారీ స్థాయిలో ఉంటాయి మరి!

ఎ.ఎ.హుస్సేన్ షాపుకెళ్లినప్పుడు కూడా ఆ షాపు ఓనరతో మాట్లాడ్డం భలే మంచి అనుభవం. ఆయన భోం చేసి వచ్చేలోపు (మొదట్లో, అజ్ఞానం కొద్దీ ఎప్పుడు తోస్తే అప్పుడు షాపుల్లోకి దూరి “ఇంటర్వ్యూ ప్లీజ్” అనేవాళ్లం.) నేనూ, సౌమ్య ఆ షాపులో పుస్తకాలన్నీ పేరుపేరునా చదివి పండగ చేసుకున్నాం. “మీ కాఫ్కా” అని తను ఆటపట్టిస్తుంటే, “అదో.. మీ అగతా క్రిస్టీ” అని నేను. మధ్యలో ఎక్కడో “మన” అనుకునే బాపతు పుస్తకాలు తగలడం. అక్కడున్న కొన్ని ఫిక్షన్ పుస్తకాల పేర్లు మామూలుగానే ఉన్నా (మారీడ్, బట్ అవైలబుల్ లాంటివి 😉 ) మేం జోకులేసుకున్నాం. సినిమా పేర్లన్నీ కలిపి సినిమా పాటలొచ్చినట్టు, పుస్తకాల పేర్లతో ఓ కథ రాయాలని అనుకున్నాం. (ఈ ఐడియా పేటెంటెడ్ అని తెలియజేసుకుంటున్నాం. )

యనభైల్లో వచ్చిన కొన్ని సినిమాల్లో హిరోయిన్‍లా (కళ్లద్దాలు పెట్టుకొని చేతి సంచి పట్టుకొని దేశాన్ని ఉద్ధరించే కొందరి వీరవనితల పాత్రలు) రోడ్లమీద పడేసరికి చాలా మంది, మాకిదే ఉద్యోగం అనుకున్నారు. జీతమెంతేంటి? అనడిగారు. “అబ్బే.. ఊరికే.. ఊసుపోక చేస్తుంటాం” అని చెప్తుంటాం. మొన్న బుక్ ఫేర్ లో జోకాతి జోకు: “అమ్మాయిలూ మీరేం చేశారూ.. తెలుగు?.. ఎం.ఏ లాంటివి?” అనడిగారు ఓ స్టాల్ ఆయన. మాకు నవ్వాగలేదు. మధ్యన మధ్యన నవ్వాపుకుంటూ, “లేదండీ.. మేం సాప్ట్ వేర్ ఇంజనీర్లం” అని చెప్పి నవ్వసాగుతూనే ఉన్నాం. నా స్పోకన్ బ్రోకెన్ టెల్గూ విని కూడా ఆయన అలా అడిగారంటే.. (నాకు నవ్వాగటం లేదు.)

అర్జీ, ది డ్వార్ఫ్ పుస్తకావిష్కరణలో చంద్రహాస్ చౌదరిని కలవటం, బ్యూటిఫుల్ ట్రీ పుస్తకావిష్కరణలో ఐ.వి. సుబ్బారావు గారినీ, ఆ పుస్తక రచయితతో మాట్లాడ్డం, బుక్ ఫేర్ వాక్ సందర్భంగా ప్రముఖులకి పుస్తకం ని పరిచయం చేయటం – పుస్తకం.నెట్ లేకపోయినా నేనీ సందర్భాల్లో ఉండేదాన్ని, కానీ ఇంత స్ట్రాంగ్ purpose లేకపోయేది. నా ఫ్రెండ్ నన్ను ఏడిపించటానికి అంటూ ఉంటాడులే.. “పుస్తకంని అడ్డం పెట్టుకొని పండగ చేసుకుంటున్నావు కదా!” అని. అందులో చాలా నిజం ఉందనే అనిపిస్తుంది. 🙂

“పుస్తకం పనులున్నాయ్.. నాకు ఈ వీకెండ్ కుదరదు!” అని స్నేహితులతోనూ, “నాకు వేరే పనులున్నాయ్.. నేను ఇంట్లో ఉండటం లేదు శనివారం మొత్తం” అని ఇంట్లోనూ మా వాళ్లతో చాలా సార్లు చెప్పాను. నేను ఉద్దరిస్తుందేమిటో వాళ్లకి అర్థం కాకపోయినా, నా వెర్రి గురించి ఐడియా ఉన్నవారు కాబట్టి అడిగినప్పుడల్లా వదిలేసారు. అందుకు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది – 2009లో టాలీవుడ్ నష్టాల్లో కొట్టుకుందిట! నేను మాత్రం నా జీవితంలోనే అత్యధిక సినిమాలు చూసి ఏడ్చాను. (రెండూ నిజమే – చూడ్డమూ, ఏడ్వటం). ఇహ ఇంట్లో వాళ్లు నాతో వేగడంలో సర్టిఫికేషన్స్ సంపాదించారు కాబట్టి, వాళ్ల గురించి ఇప్పుడొద్దు! పాపం, పుస్తకాలంటే అట్టే ఆసక్తి లేకపోయినా కేవలం నాకోసం పుస్తకం పనుల మీద వచ్చి, బోరు కొడుతున్నా గంటల కొద్దీ పనయ్యే వరకూ ఓపిక పట్టే స్నేహితులుండడం వల్ల, ఒకదాని కోసం మరోటి మిస్స్ అవుతున్నానేమో అన్న మీమాంస తప్పింది. పుస్తకం.నెట్ సమిష్టి వ్యవసాయం! (నేను కోతి కొమ్మచ్చి సిరీస్ కొని చదివా!) అందులో నా వంతు నేను చేసానో లేదో కానీ, నాకు చేతనైనంత మాత్రం చేయగలిగాను.

కాలం గమ్మత్తైనది. కాలం అనంతమే! ఒక్కోసారి పట్టుకోలేనంత చిన్నదిగా ఉంటుంది. ఒక్కోసారి పెనుభూతమై ఏడిపిస్తుంది. ఒక్కోసారి నత్తనడక నడిచి విసిగిస్తుంది, మరోసారి సునామీలా మారి ముంచేస్తుంది. గడచిపోయిన కాలమంతా గతమై వెక్కిరిస్తూ ఉంటుంది. మంచుపొగలో నుంచొని అస్పష్ట చిత్రాన్ని చూపించే భవిష్యత్తు భయపెడుతూ ఉంటుంది. రెంటి మధ్యా సంధికాలమైన “ప్రస్తుతం” మీద గతం నీడలూ, భవిష్యత్ భయాలు. అయినా, గమ్మెత్తైనదీ అని ఎందుకు అన్నానంటే జరుగుతున్నప్పుడు మాత్రం కాలం జర్రున్న జారిపోతూ ఉంటుంది.  ఏదో క్షణాన మనల్ని దానికి అప్పజెప్పేస్తే, మిగితా అంతా లాక్కెళ్లిపోతుంది – ఇదే నాకు 2009 నేర్పించింది.   In an otherwise disastrous year personally, I can still look back for some lovely moments, thanks to the words – “Let not the fear of not continuing stop us from starting.”

అందరకీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

Sowmya’s Post here

ఆర్య 2


అచ్చ కొత్త తెలుగు సినిమాలకి తప్పనిసరై ఉండాల్సిన టాగ్‍లైన్ ఆర్య 2 కి కూడా ఉంది..ట! (“బేబీ.. హి లవ్స్ యు” అని నాతో పాటు సినిమా చూసిన జీవి జ్ఞానోదయం చేశాక తెల్సింది.)

కాకపోతే ఈ సినిమాకి అంతకన్నా స్టైలిష్ టాగ్‍లైన్ పెట్టచ్చు – the psycho unleashed, for you baby అని.

పరీక్షకు బ్లాంక్ మైండ్ తో హాజరైన విద్యార్థి, ప్రశ్నాపత్రం చూడగానే మైండ్ బ్లాక్ అయ్యి వెర్రిచూపులు చూడక, ఎంచక్కా “ధైర్యే additionalsఏ మార్కులు” అని దణ్ణం పట్టుకొని రీఫుల్లకు రీఫుల్లు పేపరు మీద కక్కించేసిన చందాన ఉన్న స్క్రీన్ టైం ని నింపడానికి ఇష్టం వచ్చిన ఆలోచనల్లా తెరకెక్కించేసి, “ఇందులో కథను కనుక్కోండీ.. చూద్దాం” అని ప్రేక్షకుల మీదకు వదిలేయటం పరిపాటి. ఆర్య – రెండు (అనకూడదా?!) అందుకు పరాకాష్ఠ.

“హై.. ఐ ఆమ్ ఆర్య” అనగానే “బట్… నేను ఆర్య టు కోసం వచ్చేనే?!” అందాం అనిపించింది.

తెలుగునాట సాప్ట్ వేర్ అంటేనే సభ్యసమాజంలో పరమ లోకువ. దేన్నైనా కాష్ చేసుకోవడంలో వస్తాదులైన సినిమా వాళ్ళు ఈ లోకువని ఎలా వదులుకుంటారు? ఒక డిగ్రీ కూడా లేనోడే సాప్ట్ వేర్ లో ఉద్యోగం సంపాదించేస్తాడు. వాడు కంపనీలోకి చేరగానే, ఇహ సెటైర్లు గుప్పించేయడం. ఆ పై హీరోయిన్ ఎంట్రీ.. ఆ భామ కోసం ఎగబడ్డం, తెగనరుక్కోవడం, మెలోడ్రామాలు, మధ్య మధ్యన తలకమాసిన కామెడీ బిట్స్… సినిమా మొదట్లో పేర్లు ఇచ్చేటప్పుడు ఎవడి పేరు అయితే ముందొస్తుందో, వాడికీనూ – తెరపై అత్యధిక భాగం కనిపించిన సుందరాంగికీ పెళ్ళి అయ్యినట్లో, అవ్వడానికి గల అన్ని అడ్డంకులూ తీరిపోయినట్టో చూపిస్తే – అంతే, మీ ముందో తలకమాసిన యాబ్రాసి సినిమా రెడీ!

ఇహ.. ఆర్య characterization. నాకు నచ్చింది. ఇలాంటి వాళ్ళు లేకపోలేరు. స్నేహాలూ, ప్రేమలూ, అప్యాయతలూ, అనురాగాలూ – ఇచ్చిపుచ్చుకుంటేనే అందం, అందులోనూ మనస్ఫూర్తిగా ఇచ్చిపుచ్చుకుంటేనే అందం అని గమనించనివాళ్ళు. “నేను ప్రేమిస్తున్నా కదా.. అది చాలదా?!”, “నేను నీకు ఫ్రెండ్ అయితే, నువ్వు నాకు ఫ్రెండ్ -” (as in, if a = b then b=a) అనేసుకొని అవతలి వాళ్ల ఇష్టా-అయిష్టాలను గుర్తించక తమ భావోద్వేగంలో పడి కొట్టుకుంటూ, చుట్టూ ఉన్నవాళ్లకి ఓ చిన్న సైజు నరకం సెట్టేసి చూపిస్తారు. ఆర్య కూడా ఆ కోవ చెందినవాడే! కాకపోతే ఆ పాత్రని మన హీరోగారు పోషించేశారు కాబట్టి, ఇహ వాడేం చేసినా అది మంచిదే, ఏదో బలమైన కారణం ఉన్నందుకే అలా చేస్తున్నాడు అనేట్టు చూపించటం. తనని గౌరవించని (గౌరవం అంటే మీరూ, గార్ల పిలుపులు కావు) వ్యక్తితో ఏర్పడే ఏ బంధం నిలవదని తెల్సుకోకుండా, వెంటపడి, వేధించి.. “వాడు, నేనూ ఫ్రెండ్స్! నేను మంఛి ఫ్రెండ్, వాడు చెడ్డ ఫ్రెండ్” అనే ముక్తాయింపు ఇచ్చేసినందుకు మాత్రం చిరాకేసేసింది.
ఒక హీరోజం కోసం వెంపర్లాడక, ఒక పాత్రను స్వభావాన్ని బట్టి కథ మల్చుంటే బాగుండేది.

ఇహ, మేడ మీద నుండి దూకేయబోతున్నవాడికి, ఒకడి మీద కోపం వస్తే ఇంకోడికి “ఐ లవ్ యూ”లు చెప్పటమే అమ్మాయిల వ్యక్తిత్వం అని నిర్ణయిచ్చేస్తారు ఈ సినిమాలు. ఎటు గాలి వీస్తే అటు ఊగిసలాడే చిగురుటాకలనుకుంటారో ఏమో?! దీని గురించి రాస్తే ఇప్పటికయ్యేది కాదు.

వెళ్ళి చూసొచ్చింది కాక, ఇప్పుడు మళ్ళీ ఎందుకు బుర్రబద్దలు గొట్టుగోవడం అంటే, అవును నిజమే! ఆపేస్తున్నా..