కినిగె పత్రికలో ’ఓ చిత్ర కథ’


http://patrika.kinige.com/?p=1516

అద్దం ముందు నిలుచుంది ఆమె.

తనని తాను తీక్షణంగా చూసుకుంటోంది. చెదిరిన జుట్టు, ఉబ్బిన మొహం, ఎరుపెక్కిన కళ్ళు, ఆఫీసునుండి వచ్చాక మార్చని బట్టలు కనిపిస్తున్నాయి ట్యూబ్‍లైట్ ప్రసరించే వెలుగులో. ఆ కనిపిస్తున్నవేవీ ఆమెకు నచ్చటంలేదు. పక్కన లేని అర్జున్‍ను అద్దంలో ఉన్నట్టు ఊహించుకోసాగింది.

ఊహాల అద్దంలో కనిపిస్తున్న తమ జంటలో, తనని చెరిపేసుకొని, ఆ స్థానంలో అర్జున్‍కు నచ్చిన సినిమా హీరోయిన్‍ను నిలబెట్టింది. బాగనిపించారు వాళ్ళిద్దరు. హీరోయిన్‍ను చెరిపేసి తనను పెట్టుకుంది మళ్ళీ! అబ్బే.. బాలేదు.

ఆ ఊహలోకి మనోహర్ జొరబడ్డాడు అకస్మాత్తుగా. ప్రతిస్పందనగా డ్రెసింగ్ టేబుల్ ముందున్న చిన్న స్టూల్ మీద కూలబడిపోయింది. కళ్ళు మూసుకొంది. స్టేజ్‍ పైన మనోహర్ పక్కన ఆమె దండలతో నుంచున్న జ్ఞాపకం ముందుకు తోసుకొచ్చింది.

పైనుండి పూలవాన. ఎదురుగా కాలేజి విద్యార్థుల చప్పట్లు. అదో నిజమనిపించే అబద్ధం.

ఆ ఏడాది జరగబోయే వార్షిక నాట్యోత్సవంలో జంటగా డాన్స్ చేయటానికి ఆమె, మనోహర్ ఎంపికయ్యారు. కావ్యని కాకుండా, తనని ఎందుకు ఎంచుకున్నారన్న అనుమానం వస్తూనే ఉన్నా, ఆనందాతిశయాలు ఆమెను తోచనివ్వలేదు. అంతలోనే, అది టాగోర్ రాసిన “చిత్ర” నాటకం ఆధారంగా రూపొందిస్తున్న నృత్యనాటకమనీ, అందులో చిత్ర పాత్రకు “రఫ్”గా, “మాన్లీ”గా ఉండే అమ్మాయిని కావాల్సి వచ్చిందని కో-ఆర్డినేటర్ చెప్పినప్పుడు మనసు చివ్వుక్కుమంది. వరం పొందాక అందంగా మారిపోయిన చిత్రగా కావ్యకూ పాత్ర ఉందని తెల్సి నీరుగారిపోయింది.

మనోహర్‍కు దగ్గరగా ఉండడానికి ఇంతకు మించిన అవకాశం దొరకదని ఒప్పుకుంది. రిహార్సల్స్ జరిగే కొద్దీ ఆమెకు తాను ధరిస్తున్న పాత్రలోని మానసిక సంక్షిష్టత, తన మనసులోని అలజడి రెండూ బాగా అర్థమయ్యాయి. నాటకంలోనూ మనోహర్ ఆమెను చూడడు. కావ్యని చూడ్డం మానడు.

అర్జునుడు కాదన్నాక చిత్ర మానసిక సంఘర్షణకు లోనవుతుంది. అతడిని ఒప్పించాలని, ఒప్పుకునేదాకా ప్రాధేయపడాలని తపిస్తుంది. ముందు ఈ సీన్‍ను యథాతథంగా చిత్రీకరించడానికి పూనుకున్నారు. ఆమె మనోహర్‍కు తన మనసులోని మాట చెప్పాలి, మనోహర్ కాదంటాడు, ఆమె మనోహర్ కాళ్ళ మీద పడివేడుకుంటుంది. ఇది విన్న లెక్చరర్ ఒకరు “రాజ్యాన్ని ఏలే సామర్థ్యం ఉన్న వ్యక్తి, ఆ రాజ్యానికి రాజు తర్వాత రాజంతటి స్త్రీ, కేవలం మనసుపడ్డ వాడు కాదన్నాడని, ఇలా దేబరిస్తుందా?!” అన్న ప్రశ్న లేవనెత్తారు. జవాబుగా మరో రెండు పాత్రలు పుట్టుకొచ్చాయి.

స్టేజి మధ్యలో ఒక తెల్లని తెర కట్టి, దాని వెనుక ఒక ఆడా, మగలను నిలబెట్టి, వారి నీడలను చిత్రార్జునల ఆత్మలుగా చూపించాలని నిర్ణయించారు. రిహార్సల్ చేసి చూద్దామనుకున్నారు.

చిత్ర తన ప్రేమను వ్యక్తీకరించేటప్పుడు ఆమె ఆత్మ (తెరవెనుక నీడై) కూడా అచ్చు అలానే లయబద్ధంగా ఆడుతుంది. అర్జునుడూ, అర్జునుడి ఆత్మ ఆమె ప్రస్తావన తిరస్కరించి, వెళ్ళిపోడానికి వెనక్కి తిరుగుతారు. చిత్ర అలానే చూస్తూ ఉంటుంది, గంభీరంగా. తెరవెనుక నీడలా ఉన్న ఆమె ఆత్మ మాత్రం ఒక్కసారిగా అర్జుని ఆత్మ కాళ్ళపై పడుతుంది. అర్జునుడూ, ఆత్మ నడుచుకుంటూ స్టేజి పక్క వింగ్‍లోకి వెళ్ళిపోతారు. చిత్ర అలానే చూస్తూ ఉంటుంది. ఆమె ఆత్మ అర్జుని ఆత్మచే ఈడ్వబడుతూ పక్క వింగ్‍లోకి వెళ్ళిపోతుంది.

లైట్సాఫ్!

మళ్ళీ లైట్లు వేసేలోపు ఆమె హాస్టల్‍కు పరిగెత్తుకొనిపోయింది, రొప్పుతూ, ఆయాసపడుతూ, ఏడుస్తూ. ఆమె పరిస్థితి గ్రహించిన సీనియర్ అయిన రూమ్మేట్, “తొలిప్రేమ సినిమా చూశావా నువ్వు? అందులో వేణు మాధవ్ అమ్మాయిలను ఎ, బి, సి క్లాసులుగా వర్గీకరిస్తాడు. కావ్య ‘ఎ’ క్లాస్. ఏ అర్హతులు ఉన్నా లేకపోయినా, అందరూ ‘ఎ’ క్లాస్ అమ్మాయిలకే ఎగబడతారు. ఆ.. జీవితం ముప్పుతిప్పలుపెట్టి, ముక్కుపిండినప్పుడు, నీలాంటి, నాలాంటి ‘బి’ క్లాస్ అమ్మాయిలను పెళ్ళిజేసుకుంటారేమోగానీ.. ప్రేమించరు. అందులో కావ్య కూడా మనోహర్‍ను కావాలనుకుంటుంది. మర్చిపోవడమే నీకు అన్ని విధాలా శ్రేయస్కరం.” అని గీతోపదేశంజేసింది.

సీనియర్ మాటలు తప్పవ్వాలని బలంగా కోరుకుంది. మనోహర్ దృష్టి తన మీద పడుతోందిగానీ నిలువలేకపోతుందని తెల్సుకుంది. అందుకోసం నచ్చని, నప్పని పనులు ఎన్నో చేసింది. వాటిలో చాలావరకూ ఇప్పుడు మర్చిపోయింది. కొంచెం కష్టమనిపించినా ఆ దశనుండి త్వరగానే బయటపడింది. గాడిన పడిన జీవితం మళ్ళీ ఆమెను అలాంటి పరిస్థితుల్లోనే నిలబెట్టింది, ఈసారి అర్జున్ ఎదురుగా!

వేణుమాధవ్ లెక్కలు అబ్బాయిలకు అన్వయించుకుంటే, అర్జున్ ‘ఎ’ క్లాస్‍వాడు. అందగాడు, జీతగాడు, మంచివాడు. ఆర్నెల్ల పరిచయంలో అతడితో భవిష్యత్తు ఎంత అందంగా, ఆనందంగా ఉండగలదో ఊహించుకునే కొద్దీ బాధ. అందదని అనిపిస్తున్న ఆ ద్రాక్ష పుల్లగా అవ్వలేదింకా. ఆ ద్రాక్షను అందుకునే అర్హత తనకెలాగైనా వస్తే బాగుణ్ణన్న చిన్న ఆశ ఆమెచే రంగురంగుల అద్దాల మేడను కట్టించింది. అందులో ప్రతి అద్దంలోనూ ఆమె, అర్జున్.

కల చెదిరింది. కళ్ళు తెరిచింది. ఎదురుగా అద్దంలో ఆమె ఎప్పటిలానే ఉంది. ఆమే ఉంది.

* * *

ఆ మాయాభవనంలోకి ఆమె అడుగుపెట్టగానే అడుగులకు మడుగులొత్తుతూ ఓ ఇద్దరుముగ్గురు యువతులు ఆమెను లోపలికి తీసుకొనివెళ్ళారు. ఆమె ఓ యువరాణి అయ్యినట్టు మర్యాదలు చేశారు. పానీయాలూ, ఫలహారాలు వద్దంటున్నా వదల్లేదు. ఎగ్జిక్యూటివ్ వచ్చి బ్రైడల్ పాకేజ్ గురించి అనర్గళంగా చెప్పుకుంటూ పోతూంటే, ఆమెను ఆపి పెళ్ళికి తయారవటం కాదు, పెళ్ళయ్యేలా తయారు చేయడం కుదురుతుందా అని అడిగింది. మేకప్, మేకోవర్ కన్నా మించినదేదో అడుగుతుందని గ్రహించి, పెద్ద చేపే వలలో చిక్కిందన్న ఆనందంలో తలాడించింది ఎగ్జిక్యూటివ్.

మొదట ఆమె నిలువెత్తు 3డి ఫొటో ఒకటి తీసి, పెద్ద ఎల్.ఇ.డి స్రీన్‍లో ఫీడ్ చేశారు. దాంట్లో ఆమెకు నచ్చినట్టు మార్పులు చేసుకుంటూ పోయారు. ఫైనల్‍గా ఒక బొమ్మ అనుకున్నారు. అనుకున్న మార్పుల్లో ఏవేవి ఆమె శరీరానికి సరిపడతాయో చూడ్డానికి తలవెంట్రుక నుండి కాలిగోటి దాకా అన్నింటి పరీక్షలూ చేశారు.

పరీక్షలయ్యాక ఎగ్జిక్యూటివ్ వచ్చి, ప్రతి ట్రీట్మెంట్‍కూ ఇంత ఇంత అంటూ వేసుకుంటూ పోతూ, “మొత్తం ఇంత!” అని తేల్చింది. తిరిగిపోతున్న ఆమె కళ్ళకు బ్రేక్ వేస్తూ “అంతా కట్టనవరం లేదు ఇప్పుడే. ముందు పది పర్సెంట్ కట్టండి. ట్రీట్మెంట్స్ అయ్యే కొద్దీ మిగితా డబ్బులు కట్టచ్చు.” అంది. అయినా కూడా, అంత మొత్తం ఎప్పటికి తీసుకురాగలదు?

“మీరేం వర్రీ కాకండి. ఈ.ఎం.ఐ ఆఫర్ ఉంది మా దగ్గర. మీరు ఏ విషయం చెప్తే, నేను మా బాంక్ వాళ్ళతో మీటింగ్ అరేంజ్ చేస్తాను.”

అంత మొత్తం పెడితే భారతదేశంలో ఓ మహానగరంలో ఖరీదైన ఇల్లు కొనుక్కోవచ్చును. మనసుపడినవాడిని మనువాడకపోయాక, ఇల్లుంటే ఏంటి? లేకపోతే ఏంటి? అని ఆమెకు అనిపించింది. అందం, సులభ వాయిదా పద్ధతిలో వస్తానంటే కాదనుకోవడానికి ఆమె సిద్ధపడలేదు. ఇంట్లో మాటమాత్రంగానైనా చెప్పకుండా, సన్నిహితుల సలహా కూడా తీసుకోకుండా సంతకాలు చేసింది, ఎక్కడపడితే అక్కడ.

ట్రీట్మెంట్స్ మొదలయ్యాయి. కొన్ని తేలిగ్గా అయిపోతే, మరికొన్ని తిప్పలుపెట్టాయి. కొన్ని వద్దని డాక్టర్లు వారించినా, ఆమె వినిపించుకోలేదు. ఒక్కో ట్రీట్మెంట్ ఒక్కోరకంగా బాధించింది. అయినా భరించింది.

ఆర్నెళ్ళల్లో ఇంతకు మునుపులేని నిగారింపు ఆమెలో చూసి “పెళ్ళికళ!” అని చెవులు కొరుక్కున్నారందరూ. వెతకక్కర్లేకుండానే మంచి సంబంధం వచ్చిన సంబరంలో కూతురిలో సంతోషాన్ని చూడగలిగారేగానీ తల్లిదండ్రులు, ఆమెలో కొత్త అందాన్ని పట్టించుకోలేదు. వారంవారం కొత్తకొత్తగా కనిపించే ఆమెలోని మార్పుల చిట్టాను మొదట శ్రద్ధగానే లెక్కెట్టిన కొలీగ్స్ కొన్నాళ్ళకు ఆ ప్రయత్నాన్ని వదులుకున్నారు. కాలేజి రోజులకీ ఇప్పటికీ వచ్చిన మార్పును అప్పటి స్నేహితులు పోల్చుకోలేకపోయారు. ‘ఏం చేయించుకున్నావో మాకూ చెప్పచ్చు కదే తల్లీ! అర్జున్ అంతటివాడు కాకపోయినా, మేమూ ఎవరో ఒకర్ని పడేయాలిగా!’ అని అంటూ ఆరా తీశారుగానీ, రహస్యం తెల్సుకోలేకపోయారు.

మిసెస్. అర్జున్ – ఆ కొత్త పేరు ఆమెను పులకింపజేసింది. ఆమె అందం మరింత ఇనుమడించింది. పదిమందిలో ఉన్నప్పుడు ఎక్కువ చూపులు తనవైపు తిరగడం, కొత్తల్లో ఇబ్బందిపెట్టినా, గర్వంతో కూడిన సంతోషాన్ని అందించింది. పార్టీలలో తనను పరిచయంజేసేటప్పుడు అర్జున్ కళ్ళల్లో మెరుపు ఆమెను ఉక్కిరిబిక్కిరిజేసింది.

* * *

సైక్రియాట్రిస్ట్ దగ్గర ఎట్టకేలకు ఆమె నోరు విప్పింది.

“అర్జున్ కోసం చేశాను.” అని ఆమె జవాబు, డాక్టర్ వేసిన ప్రశ్నకు.

తన కోసమా? తన కోసం ఎవరు చేయమన్నారు? తాను ఏనాడైనా అడిగాడా ఇలా చేయమని? లేదే?! ఆమెను చూడకుండానే ప్రేమించలేదా? అసలు ఇండియాకి ఇంకా వెళ్ళకముందే ఆమె గురించి ఇంట్లో చెప్పి, ఒప్పించలేదా? అమ్మాయిని తనూ చూడలేదని, ఆఫీస్ ప్రొఫైల్‍లో ఒక పాస్‍పోర్టు ఫోటోనే చూశాననీ, ఆమె పెద్దగా బాగోకపోయినా పెళ్ళిచూపుల్లోనే ఏ నిర్ణయం తీసుకోవద్దనీ తనవాళ్ళని బతిమిలాడుకోలేదా? వాళ్ళకీ నచ్చేసి పెళ్ళి ఏ అడ్డంకులూ లేకుండా అయిపోయిందిగానీ, ఏ అడ్డంకి వచ్చినా దాన్ని ఎదుర్కోవాలని తాను ముందే అనుకోలేదా? మరి అలాంటి తనను అపరాధిగా నిలబెడుతుందేంటి?

డాక్టర్ ఇంకేవో అడుగుతున్నాడు. ఆమె ఏడుపు ఆగినప్పుడల్లా సమాధానాలు చెప్పడానికి ప్రయత్నిస్తోంది. కాలేజినాటి సంగతులేవో చెప్పుకొస్తోంది. వాడెవడో కాదన్నాడని ఏం తోచితే అది చేసేయటమేనా? మగాడుగా పుట్టిన ప్రతివాడూ అందానికి తప్ప మరిదేనికీ లొంగడని తీర్మానించుకోవడమేనా? చిరాకేస్తోంది అతడికి.

నాలుగేళ్ళ కాపురంలో పిల్లలు పుట్టకపోవడం అతణ్ణి కలవరపరచలేదు. ఇద్దరూ మొదటి రెండుమూడు ఏళ్ళు కెరీర్లపైనే దృష్టి పెట్టారు. ఇంతలో అటువైపు, ఇటువైపు పెద్దవాళ్ళు ఒత్తిడి తెచ్చారు, మనవలకోసం. స్నేహితులూ, తెల్సినవారూ కనేస్తే ఓ పనయ్యి పోతుందిగా అన్నట్టు సలహా ఇచ్చారు. పదినెలల నుండి ప్రయత్నిస్తున్నారు పిల్లల కోసం.

కొన్ని నెలలక్రితం ఓ అబార్షన్! కొంచెం భయమనిపించినా పర్లేదనుకున్నాడు. కానీ అప్పటి నుండి ఆమె ముభావంగా ఉండడం మొదలెట్టింది. ఆమెలో ఉత్తేజం మాయమయ్యింది. చిత్రంగా రోజులు గడిచేకొద్దీ ఆమె తేరుకోవడం అటుంచి, ఇంకా ఇంకా కూరుకుపోయినట్టనిపించింది. ఎంత అడిగినా చెప్పేది కాదు. తనకి చెప్పటం లేదని ఇంట్లోవారితో అడిగించాడు. అయినా లాభం లేకపోయింది.

చివరకు గైనకాలజిస్ట్ దగ్గర విషయం బయటపడింది. ఆమె కన్సీవ్ కాకలేకపోవచ్చుననీ, కన్సీవ్ అయినా కూడా చాలా కాంప్లికేషన్స్ వస్తాయని తేల్చి చెప్పింది డాక్టర్. మెడికల్ హిస్టరీ గురించి నొక్కి, నొక్కి డాక్టర్ అడిగినప్పుడు పెళ్ళికి ముందు చేయించుకున్న ట్రీట్మెంట్ వివరాలు బయటపడ్డాయి.

విషయం తెల్సిన అందరూ ఆమెను ఒక్కసారిగా బోనులో నిలబెట్టేసి, తీర్పులివ్వటం మొదలెట్టారు. తెలియని అమాయకత్వంలో చేసిందని వెనకేసుకొచ్చింది తనే! కానీ ఆమె పరిస్థితి మాత్రం దిగజారింది. శారీరకంగా ఒకరకమైన ఇబ్బందులైతే, మానసికంగా కూడా కృంగిపోయింది.

డాక్టర్ మందులేవో రాసిచ్చి, ఆమె ఆలోచనల్లో కూరుకుపోకుండా, బిజిగా ఉండేట్టు చూడమని అతడికి సలహా ఇచ్చి, మళ్ళీ వచ్చేవారం రమ్మని చెప్పి పంపేశాడు.

ఇంటికి చేరుకొని ఆమెకు వేయాల్సిన మందులు వేసి, ఆమె పడుకున్నాక వచ్చి హాల్లో, చీకట్లో, మ్యూట్ పెట్టిన టివి ముందు కూర్చొని, లాప్‍టాప్‍ తెరిచాడు.

చాలా ఒంటరిగా ఉన్నట్టు అనిపించింది అతడికి. అంతకు మించి అలసటగా ఉంది. “అర్జున్ కోసం చేశాను” అన్నది మరుపుకు రావడంలేదు. ఆమె చేసినవన్నీ చేయడానికి తానేమైనా దోహదపడ్డాడా? మాటమాటల్లో తనకు తెలీకుండానే ఆమెను ఇలా చేయడానికి ప్రేరేపించాడా? పిల్లలు పుట్టకపోతే పోనీ -అంత దాకా వస్తే, దత్తత తీసుకోవచ్చు- కానీ ఆమెకి మరే విధంగానైనా ఆరోగ్యం చెడితే?! నెలనెలా తన సొంత ఖర్చులంటూ ఎవరికి డబ్బు ట్రాన్సఫర్ చేస్తుందో పట్టించుకోన్నందుకు తనని తాను తిట్టుకున్నాడు. ఎప్పుడు ఆమె స్కూల్, కాలేజిల గురించి అడిగినా ఏవో ముక్కలను జాగ్రత్తగా అతికినట్టు చెప్పుకొచ్చేదేగానీ, ఇష్టంగా చెప్పేదికాదు. రానురాను ఆ కబుర్లూ తక్కువైపోయాయి. అలంకరణలపై ఆసక్తి ఆడవాళ్ళ అలవాటనుకున్నాడుగానీ, అది అభద్రతను సూచిస్తుందని ఇప్పటి వరకు తట్టలేదు. అమ్మానాన్నలను, దేశాన్ని వదిలి తనతో వచ్చినట్టుగా, అప్పటివరకూ ఆమె తాను జీవించిన ఇరవై మూడేళ్ళ జీవితాన్ని వదిలివచ్చేసినట్టు వ్యవహరించేది. అది అతడికి ఇప్పుడు ఎబ్బెట్టుగా తోచి, ఇబ్బంది పెట్టింది.

“ఏమన్నార్రా డాక్టర్?” – అక్క పింగ్ చేసి పదినిముషాలవుతుందని గ్రహించాడు.

“ఏం లేదు. ఏవో మందులిచ్చారు. సమయం పడుతుందని అన్నారు.”

“నువ్వెలా ఉన్నావ్?”

“ఏదో.. ఉన్నాను.”

“ఎక్కువ ఆలోచించకురా! జరిగిందేదో జరిగిపోయింది. జస్ట్ ట్రై టు గెట్ ఓవర్ ఇట్..”

“హమ్మ్.. ప్రయత్నిస్తున్నాను. ప్రస్తుతానికి మాట్లాడే ఓపిక లేదు. నిద్రపోతాను. బై.”

అవతల వైపు నుండి ఏం సమాధానం వచ్చిందో కూడా చూసుకోకుండా లాప్‍టాప్ మూసేశాడు. సమస్యకు సమాధానం వెతుక్కోవడమా, లేక సమాధనపడ్డమా అని మధనపడుతూ పడుకున్నాడు.

Advertisements

పోటీదారులు


ఆమె-1 కూ, ఆమె-2 కూ మధ్య పోటీ మొదలయ్యింది. ఇద్దరూ చెరో మట్టి బొమ్మ చేయాలి – అతడి బొమ్మ. ఎవరి బొమ్మ అతడికి దగ్గర పోలికలతో ఉంటే, వారికే ట్రోఫీ – అతడు. 

నిజానికి వీళ్ళ మధ్య పోటీలో సమానత్వం లేదు. ఆమె-1 బలమైన ప్రత్యర్థి. ఆమె-2 కన్నా ఆమె అన్ని విధాలా సీనియర్ – వయస్సులోనూ, అనుభవంలోనూ, అతడితో పరిచయం, స్నేహం, ప్రేమ, వగైరాలలోనూ. ఈ పోటీకి కామెంటేటర్లు లేరుగానీ, ఉండుంటే ఆమె-2ను తీసిపాడేద్దురు వారి మాటల్లో!

ఆమె-1 మట్టి తీసుకొని పని మొదలెట్టేసింది. మెల్లిమెల్లిగా మట్టి ముద్ద అతడి రూపును సంతరించుకుంటోంది. 

ఆమె-2 కళ్ళుమూసుకొని మట్టిని తీసుకొని పిసుకుతూనే ఉంది. ఎంతకీ అతడి రూపం ఆమె ఊహకి అందటం లేదు. సమయం అయిపోతుంది. అతడనగానే ఆమెకు తోచే రూపాన్ని మట్టిలో మలిచింది.

ఇద్దరు చేసిన బొమ్మలూ అతడికి చూపించడానికని తీసుకెళ్ళారు. ఆ పాటికే అతడు మరొకరిని మెడలో తాళైయ్యాడు. 

ఇద్దరూ బొమ్మలను నేలకేసి కొట్టారు. నుజ్జునుజ్జు చేశారు. ఆవేశం తగ్గాక వారిద్దరికీ ఆపుకోలేనంత నవ్వొచ్చింది.

నవ్వేశారు. 

Yours Maid-ly


అది అతని గది!

ఆరడుగుల కాయం సోఫాలో పట్టక కాళ్ళూ, చేతులూ బయటకు వచ్చేశాయి ఉన్నాయి. వెలికిలా పడుకొన్న అతడి పొట్ట మీద చదువుతున్న సినిమా మాగజైన్ బోర్లా పడుకుంది. టివిలో ఫాషన్ టివి నడుస్తుంది. ఎవో పాటలూ గుసగుసలాడుతున్నాయి, జారిపోయిన ఇయర్ ఫోన్స్ లోంచి.

కాలింగ్ బెల్ మోగింది.

మళ్ళీ మోగింది. వెళ్ళి తలుపు తెరిచాడు. ఎదురుగా శృతి. దెబ్బకు నిద్ర ఎగిరిపోయింది. చెదిరిన క్రాఫూ, మసిబట్టలా ఉన్న చొక్కా, దారాలు వేలాడుతున్న నిక్కరూ స్పృహకు వచ్చాయి. తెగ ఇబ్బంది పడిపోయాడు.

కాలింగ్ బెల్ మళ్ళీ మోగింది. శృతి పోయి,  మెలకువ వచ్చింది. దానితో పాటు విసుగూ, కోపం కూడా! ఆగిన బెల్‍లాగానే విసవిసగా నడుస్తూ తలుపు తెరిచాడు.

భుజాన ఓ జోలి వేసుకొని, భూతద్దాల్లాంటి కళ్ళద్దాలతో నల్లగా, లావుగా ఉన్న అమ్మాయెవరో ఉంది తలుపు తీసేసరికి. చూసీ చూడగానే “అవసరం లేదు.” అని తలుపు వేసేశాడు.

రెండడుగులు వేశాడో లేదో, మళ్ళీ బెల్ మోగింది. విసురుగా తీశాడు తలుపు. అతడేదో అనేలోపే ఆమె “మె ఐ లవ్ యూ సర్!” అంది. నిద్రమత్తులోనూ గుడ్లప్పగించి చూశాడు. “ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడండి సర్! ఇంకెవరూ ప్రేమించలేనంతగా మిమల్ని ప్రేమించిబెడతాను. ప్లీజ్..ప్లీజ్” అంటూ తెరిచిన తలుపు సందులోకి దూరిపోయింది. అతడు తలుపు ఇంకా తెరచి, వెనక్కి జరగాల్సి వచ్చింది.

“నాకవసరం లేదండి. మీరు వెళ్ళచ్చు!” అన్నాడు అయోమయంగా.

“అలా కాదు సార్! ఒక్క ఛాన్స్. మీరే చూడండి. నచ్చకపోతే వెళ్ళిపోతాను.” అని ఏడుపుగొంతుతో అర్థించింది. అతడికున్న అతి పెద్ద బలహీనతల్లో మొదటిది – ఆడవాళ్ళ కన్నీరు. పెద్ద, పిన్న అన్న తేడా లేదు; ఆడవాళ్ళ ఏడుపు అంటే అంతే, కరిగిపోతాడు.

“సరే. మీకు నచ్చకపోయినా, నాకు నచ్చకపోయినా మీరు వెళ్ళిపోవాలి.” అంటూ ఆమెను పూర్తిగా లోపలికి రానిచ్చాడు. తన నచ్చటం వరకూ రానేరాదని, ఆమే పారిపోతుందని నమ్మకం. ఏమీ కానట్టు వెళ్ళి మళ్ళీ పట్టని సోఫాలో పడుకున్నాడు.

అతడు లేచేసరికి గదంతా మారిపోయింది. చిందరవందరగా పడున్న పుస్తకాలూ, పేపర్లూ, డివిడిలూ అన్నీ చక్కగా సర్ది ఉన్నాయి. తాగి పారేసిన బీర్ బాటిళ్ళను అందంగా అమర్చి, కిటికీ నుండి వస్తున్న వెలుతురు పడేలా పెట్టింది. వాటినుండి రంగురంగుల కిరణాలు వెలవడుతున్నాయి. బిర్యాని వాసన గుప్పుమన్న గదిలో అగరబత్తి వాసన వస్తోంది. ముతక వాసన వచ్చే బట్టలన్నీ ఇస్త్రీతో పెళపెళాడిపోతున్నాయి. చివరకు వేసుకున్న బట్టలు కూడా! ఎక్కడో మూలన పడేసిన కీబోర్డు మళ్ళీ ఎదురుగా వచ్చింది, తళతళాడుతూ. ఇవ్వన్నీ చూసి అతడికి ముచ్చటేసింది. మతి కూడా పోయింది. చిరాగ్గా ఉన్న గదిని, పరాగ్గా ఉండే తనని భరించలేక పారిపోతుందని అనుకున్నాడే! ఇప్పుడెలా?! ఆలోచిస్తున్నాడు.

ఇంతలో మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది. వెళ్ళి చూశాడు. ఎదురుగా శృతి! తలుపు పూర్తిగా తెరవకుండా ఈ పిల్ల ఎక్కడుందా అని కలియజూసాడు గది మొత్తం. దాక్కుంటున్నానంటూ సైగ చేసి ఆమె కనిపించని ఓ మూలకి వెళ్ళిపోయింది.

తలుపూ, అతడూ శృతిని సాదరంగా ఆహ్వానించారు.

“వావ్! నిన్ను సర్ప్రైజ్ చేద్దామని వచ్చాను. నాకే నమ్మలేనంత ఆశ్చర్యంగా ఉంది. రియల్లీ! బాచలర్స్ గదంటే ఎంత చిరాగ్గా ఉంటుందనుకున్నాను.

“ఐటి జాబ్ అంటే వీకెండ్ మొత్తం మొహం వాచినట్టు నిద్రపోతుంటారుగా! నువ్వు కూడా పడుకొని ఉంటావ్ అనుకున్నా! నైస్.

“ఇన్ని బీర్ బాటిల్స్.. ఐ నో! ఫ్రెండ్స్ కొందరు అర్థం చేసుకోరు. వీటిని మీ “మెయిడ్” సర్దిందా, ఇంత బాగా? క్రియేటివ్.

“ఏంటిది? కీబోర్డ్ వాయించటం వచ్చా? గ్రేట్! ఐ లవ్ థిస్.

“పద.. అలా బయట తిరిగి వద్దాం!”

అలా బయటకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఆ గదికి తిరిగిరాలేదు.

ఆమె కూడా ఆ మూల నుండి బయటకు రాలేదు. గదిలో తక్కినవాటితో పాటు ఆమెకూ బూజు పట్టేసింది. శుభ్రం చేసే అలవాటు అతడికి ఎటూ లేదు.

ఇప్పటికీ అది అతడి గదే! కానీ ఆ మూల మాత్రం ఆమెది.

కల(త)


డైనింగ్ టేబుల్ మీద వేసున్న బట్టను స్లో మోషన్‍ లో బలంగా లాగాడు అతడు. దానితో టేబుల్ మీదున్న వస్తువులు కొన్ని స్లో మోషన్లో భళ్ళున్న పగిలితే, మరికొన్ని అంతే నిదానంగా కిందపడి దొర్లాయి. వాటి తాహత్తుకు తగ్గట్టు అవి చప్పుళ్ళు చేశాయి. ఆ శబ్ధాలకు  సగం నిద్రతో, సగం పరుగుతో తన గది బయటకు వచ్చింది ఆమె.

“నో! నో! నో!” అని అతడు గొంతు చించుకుంటున్నాడుగానీ మాట బయటకు వినబడ్డం లేదు.

“ఏంటి రామ్ ఇది? చెప్పానుగా పనిమనిషి రేపూ, ఎల్లుండి రాదని? ఇప్పుడివ్వన్నీ ఎవరు శుభ్రం చేస్తారు?” నిలదీసింది ఆమె.

అతడు మాత్రం తన ఎదురుగా ఉన్న వ్యక్తినే చూస్తూ నించున్నాడు. చూడ్డానికి ఆ వ్యక్తి అతడికన్నా యవ్వనంలో ఉన్నాడు. కొంచెం వదులు చొక్కా, బెల్‍బాటం ఫాంటూ, చెవులూ, నుదురు కప్పుకునిపోయేలా క్రాఫూ.

“నువ్వు ఫో ఇక్కన్నుంచి.. పోతావా లేదా?” అతడు గట్టిగానే అరుస్తున్నా, నూతిలోంచి మాట్లాడుతున్నట్టు వినిపిస్తోంది. ఆమె మాత్రం పగిలిన పాత్రలపై అతడి పాదాలు పడకుండా ఉండడానికి నానా హైరానా పడుతోంది.

“ఏం? చెప్పేది నీకు కాదూ? మా అమ్మ నీతో రాదు. రాదంటే రాదు. ఏం? మా అమ్మ ఏమైనా అరవై, డబ్భైలలో వచ్చిన హింది సినిమాలలోని నిరుప రాయ్ అనుకుంటున్నావా? నీకోసం ఇన్నాళ్ళూ తులసి మొక్క దగ్గర పూజజేయడానికి? నీకోసం ఎదురుచూడ్డానికి? నువ్వు వచ్చీరాగానే కరిగిపోయి… ” అతడు ఆవేశంలో ఊగిపోతూనే ఉన్నాడు. ఆమె అతడిని పక్కకు తోస్తూ, పడున్న వస్తువులను సర్దుతూనే ఉందామె.

ఆమె రెక్క పట్టుకొని గుంజి, “చెప్పు సంజూ! చెప్పు ఈ  మనిషికి మా అమ్మ రాదనీ.. అతణ్ణి పొమ్మనీ..” అని అంటుండగానే, ఇద్దరూ నిర్ఘాంతపోయి అటువైపు చూశారు. అతడి తల్లి ఆ వ్యక్తి పక్కకు వచ్చి జేరింది. కొత్త పెళ్ళికొడుకూ, పెళ్ళికూతురూ ఫోటో దిగడానికి ఇచ్చే ఫోజులో నించున్నారు ఇద్దరూ.

“ఎంత చక్కని జోడి కదా?!” అందామె అప్రయత్నంగా. అతడికి గుప్పెడు జెర్రలని నోట్లో పోసినట్టనిపించింది. కొండచిలువలు అతణ్ణి చుట్టుకుంటున్నట్టు అనిపించింది. మెదడు బొత్తిగా మొద్దుబారిపోయింది. అమ్మ! అమ్మ! అమ్మ! అని అనాలి అనుకుంటున్నా వీలుపడ్డం లేదు.

“అత్తయ్యా! ఈ చీర మీరు మొన్న చూపించిందే కదా. కట్టుకుంటే ఎంత బావుందో..”  అంటూ వెళ్ళి చీర కొంగు పట్టుకొని పరీక్షించింది ఆమె. “ఈ ముత్యాల గొలుసు కూడా ఎంత బావుందో చూడండి మీకు. మీరేమో, నాకెందుకూ, నువ్వు ఉంచేసుకో అంటూ నాకిచ్చేయబోయేరు..” అని కొనసాగించింది.

ఆ ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందినవారిలా, వాళ్ళ అన్యోన్యతలను చూసి తట్టుకోలేని తానొక్కడే అనాథలా అనిపించింది అతడికి. కోపాన్నంతా డైనింగ్ టేబుల్ మీద ప్రదర్శించాడు. మళ్ళీ స్లో మోషన్‍లోనే, గాజు డైనింగ్ టేబుల్‍పై కుర్చీవేసి కొట్టాడు. గాజు పగిలిన శబ్దం భళ్ళున వచ్చింది.

ఆమె ఒక ఉదుటున అటునుండి ఇటు వచ్చి, “ఎంత పనిజేశావ్?  కనీసం మూడు ఈ.ఎం.ఐలు కూడా కట్టలేదింకా? అప్పుడే పగలగొట్టేశావా?” అని విసుక్కుంటూ అరిచింది. వెంటనే మొబైల్ తీసుకొని, ఆ కంపెనీవాళ్ళిచ్చే ఇన్సూరెన్స్ డిటేల్స్ చదువుతూ కూర్చొంది.

అటువైపున అమ్మా, అమ్మ పక్కనా వ్యక్తి అలానే నవ్వుతూ ఫోజు ఇస్తున్నట్టే నిలబడ్డారు.

అతడు మొకరిల్లి, గట్టి గట్టిగా అమ్మ, అమ్మ! అని ఏడుస్తున్నాడు.

*****

 “రామ్.. రామ్!” అని కుదుపుతున్నా అతడికింకా మెలకువ రావటం లేదు. మెలకువ వచ్చిన క్షణం అతడికీ ఏం అర్థం కాలేదు. వెంటనే వీపు నిమురుతూ, గ్లాసుడు మంచినీళ్ళు తాగించింది.

“ఏమయ్యింది? పీడకలా? ఆ? చెప్పు రామ్.. పీడకలా?”

అవునన్నట్టు తలూపాడు. “ఏం కాదులే! ఉత్తి కలే!” అంటూ అతడిని దగ్గరతీసుకొంది.

“అమ్మ.. అమ్మ” అని మెల్లిగా, కలవరపాటుగా అన్నాడు అతడు. ఆమె ఒక్కసారి గట్టిగా ఊపిరి తీసుకొంది.

“చిన్న జ్వరం రామ్.. దానికింత గాభరా ఏంటి?” అని ముద్దుగా విసుక్కుంది.

“కాదు. అమ్మ నన్ను విడిచివెళ్ళిపోతుంది. అమ్మ నన్ను వదిలేసి..” అని చెప్తూండగానే, ఆమె అతణ్ణి ఆపేసింది.

“నువ్వూ, నీ పిచ్చి ప్రేమలూ! మామూలు జ్వరానికి కూడా ఇలా అయిపోతే ఎలా?” అని తలనిమిరింది. అమ్మని ఒకసారి చూసొస్తానంటూ వెళ్ళబోయిన అతణ్ణి ఆపేసింది. “ఇప్పుడుగానీ నీ ప్రిన్సెస్ లేచిందనుకో, అందరికీ జాగరమే ఇక!” అంటూ దుప్పటి కప్పేసి పడుకోబెట్టేసింది.

ఆమె జోకొట్టినట్టు, తన గతాన్నికూడా జోకొట్టగలిగితే ఎంత బావుణ్ణో అని అనుకున్నాడు అతడు మనసులో.

మా జీవితాల్లోకి మళ్ళీ తగలడతాడా? అమ్మ ఏం చేస్తుందప్పుడు? నిజంగానే, నన్ను వదిలిపోతుందా? – ఇలాంటి ఆలోచనలతో యుద్ధం చేస్తూ చేస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు.

న్యాయాన్ని ఆశ్రయిస్తే..


First published on patrika.kinige.com
(హరిశంకర్ పార్సాయి (1924-1995) హింది సాహిత్య జగత్తులో వ్యంగ్యహాస్య రచయితగా సుప్రసిద్ధి చెందినవారు. కేంద్రసాహిత్య ఎకాడెమీ అవార్డు గ్రహీత. అలతి పదాలతో, నిరాడంబర శైలిలో కొనసాగే వీరి రచనలు సమాజంలో పేరుకుపోయిన కుళ్లును కళ్ళకు కట్టినట్టు చూపిస్తాయి. ఉపరితలంలో హస్యం ఉబికినట్టు కనిపించినా, వీరి రచనల్లో అంతర్లీనంగా కనిపించేది సమాజం పట్ల బాధ్యత. “షికాయత్ ముఝె భీ హై” అనే వీరి వ్యాసాల సంపుటి నుండి “న్యాయ్ కా దర్వాజా” వ్యాసానికి తెలుగనువాదం ఇది.)

సామెతల్లో చెప్పినట్టు ఏం జరగటంలేదు ఈ మధ్య.

సామెతల ప్రకారం – అబద్ధానికున్నముసుగును తొలగిస్తే నిజం నగ్నంగా కనిపిస్తుంది. అబద్ధానికన్నా నిజానికి సిగ్గెక్కువ.

ఇప్పుడు న్యాయం తలుపు తట్టాక ఈ సామెతలకు విరుద్ధమైనవి కనుగొన్నాను. కొంతమంది పేదవాళ్లపై అబద్ధపు కేసు బనాయించబడింది. మేము వాళ్ళ తరపున న్యాయస్థానం తలుపులు తట్టాము. న్యాయం తలుపు దగ్గరే డ్యూటీ మీద కూర్చుంటుందనీ, ఇలా తలుపు తట్టగానే అలా న్యాయదర్శనం అవుతుందనీ అనుకున్నాము. ఎంతసేపటికి తలుపు తెరుచుకోకపోయేసరికి ఆందోళన మొదలైయ్యింది. ఏమయ్యింది? న్యాయం “సిక్ లీవ్” గానీ తీసుకొనిపోలేదు గదా? అసలే, ముసలితనం కావటంతో తరచూ జబ్బు పడే అవకాశం ఎక్కువ.

చివరికి మేమే తలుపులు బద్దలుగొట్టుకొని లోపలికి ప్రవేశించాము. అంతా ఖాళీగా ఉంది. బాత్రూం తలుపు నెడితే, ఒకడు నగ్నంగా స్నానం చేస్తూ కనిపించాడు.

మేం అడిగాం – నువ్వు న్యాయానివి కదూ? త్వరగా బట్టలు వేసుకో. నీతో మాట్లాడాలి.

అతను అన్నాడు – నేను న్యాయాన్ని కాదు, అన్యాయాన్ని. నగ్నంగానే ఉంటాను. అన్యాయానికి సిగ్గేంటి: న్యాయానికి కవల సోదరుడిని. ఒకేలాంటి మొహం. జనాలు అతడనుకొని నన్ను కలుస్తుంటారు.

మేం అడిగాం – ఇద్దరి మధ్య ఏదో ఒక తేడా అయినా ఉండాలే!

అతను అన్నాడు – ఆ, ఉంది. చూడు, నాకు మెల్ల. ఎటో చూస్తున్నానని నువ్వు అనుకుంటావ్, కానీ నేను నిన్నే చూస్తున్నాను. మా సోదరుడు న్యాయం ఒంటి కన్నువాడు. ఒకవైపే చూస్తాడు. ఇప్పుడు వాడికి చెవుడు కూడా వచ్చింది.

మేం అడిగాం – మరి తలుపు కొట్టినప్పుడు ఎవరు తీస్తారు?

అతడు అన్నాడు – నేనే తెరుస్తాను. అదే కదా మజా. జనాలు నన్ను న్యాయమనుకుంటారు.

మేం అడిగాం – మీరిద్దరూ ఎవరి పిల్లలు?

అతడు అన్నాడు – “ఎవిడెన్స్ ఆక్ట్” మా నాన్న. “ఇండియన్ పీనల్ కోడ్” మా అమ్మ.

మేం అడిగాం – మేము న్యాయాన్ని కలవాలి. అతనేడీ?

అతనన్నాడు – ఇప్పుడే పెరటి గుమ్మం నుంచి పోలీస్ స్టేషన్‍కు వెళ్ళాడు. వచ్చేస్తుండచ్చు.

ఏం బాబూ, ఖలీల్ జిబ్రాన్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నావా? లేదు. న్యాయస్థానపు గుట్టు రట్టు చేస్తున్నాను. న్యాయం తలుపు తట్టేవాళ్లారా, మీరేమో ముందు గుమ్మం తలుపు తడుతుంటారు, అదేమో పెరటి గుమ్మం గూండా పోలీసుల ఆజ్ఞలు పాటించడానికి వెళ్ళిపోతుంది. న్యాయానికి చెవుడు. తలుపు కొట్టేది కూడా వినిపించదు. తలుపు కొట్టగానే తెరిచే ఆ మెల్లకన్ను వ్యక్తి అన్యాయం. తలుపు కొట్టినంత మాత్రాన దొరికేది అన్యాయమే. తలుపు బద్దలుగొడితే గానీ న్యాయం దొరకదు.

ఏం బాబూ, ఇప్పుడు నక్సలైటు అవుదామని ప్రయత్నిస్తున్నావా? లేదు. ఇది పెద్ద ప్రయత్నించకుండానే వచ్చి అంటుకునే బిరుదు. ఈ మధ్య నేను ఒక పత్రికలో, పోలీసులు హాస్టల్‍లో చొరబడి అమాయకులైన విద్యార్థులను ఎందుకు కొట్టారని రాస్తే, నేను నక్సలైట్ ఐపోయాననే గుసగుసలు వినబడ్డాయి. నల్లులు కుట్టినా అది నక్సలైట్ల పనే అనిపిస్తోందిప్పుడు. పిల్లవాడు పాలకోసం ఏడ్చినా తండ్రి వాడి తల్లితో అంటాడు – “పాలు పట్టీయకు. వాడికి ఆకలీ లేదు పాడూ లేదు. నక్సలిస్టయి కల్లోలం సృష్టిస్తున్నాడు.”

ఉన్నట్టుండి సత్యపు గుట్టు కూడా రట్టయిపోతూంటుంది. దేవునిపై ప్రమాణం చేసి న్యాయస్థానాల్లో ఎన్ని అబద్ధాలు చెప్తారో అన్ని దేవుని వీపు వెనుక అయినా చెప్పరు. నరుడు కరుడుగట్టిపోయి నారాయణుని ముందే అబద్ధాలు చెప్పటానికి అలవాటు పడిపోయాడు. ధర్మం మంచివాళ్ళని పిరికివాళ్ళ గానూ, చెడ్డవాళ్ళని ధైర్యస్తులుగానూ చేస్తుంది. అసత్యం కొద్దిపాటి పవిత్రత సాయంతో సత్యపు బెర్తు ఆక్రమించేస్తుంది. ఆ సాయం గంగామాత కావచ్చు, జంధ్యప్పోగు కావచ్చు, ధర్మమే కావచ్చు, లేక ఈశ్వరుడే కావచ్చు.

 

ఇప్పుడిక్కడ సాక్ష్యం ఇచ్చేందుకు బోనులో నించున్న వ్యక్తి భగవంతుణ్ణి సాక్షిగా చేసేసుకున్నాడు – ప్రభూ, రా, నేను నీ ముందు అబద్ధమాడాలని ఉబలాటపడుతున్నాను. వాడు చదువూ, సంస్కారం, అందంగల వాడు. పోలీసులకు ఇలాంటి దొంగ సాక్షి దొరికాడంటే పోలీస్ లైన్‍లో హనుమంతుని ముందు కొబ్బరికాయలు పగులుతాయి. హనుమంతునిది మరో వింత. ఆయనకు ఎన్నో పేర్లు  – ‘శత్రు వినాశక హనుమాన్’, ‘సంకట మోచన హనుమాన్’, ‘పోలీసు మహావీర్’. పూనాలో వేశ్యవాడల్లో ఉన్న హనుమంతుని పేరు – “వగలాడి మారుతి”.  భారతీయుడు ఓ అద్భుతం. అతగాడి దగ్గర వగలాడి మారుతీ ఉన్నాడు, నపుంసకుల మసీదూ ఉంది. సరే, మనం మాట్లాడుకుంటున్నది హనుమంతుని గురించి కాదు, దొంగ సాక్షి గురించి. వాణ్ణి వెంటబెట్టుకుని ఇప్పటిదాకా ఇనస్పెక్టరు తాను దొంగ సాక్ష్యానికి  పట్టుకొచ్చింది సాక్షాత్తూ సత్యహరిశ్చంద్రుణ్ణే అన్నంత దర్పంగా వరండా అంతా తిరిగాడు.

నిజాయితీపరునిగా కనిపించటానికి ఆ సాక్షి పూర్తి ప్రయత్నం చేస్తున్నాడు. అబద్ధాన్ని పద్ధతిగా చెబితే చాలు, దాన్నే నిజమనుకుంటారు. వాడు గుండెల నిండా ఆత్మవిశ్వాసాన్ని నింపుకుని చుట్టూ చూస్తున్నాడు. ఆత్మవిశ్వాస పూరితమైన అబద్ధం నిజమనిపించుకుంటుంది. నమ్మకంగా చెప్పని నిజం కూడా అబద్ధమైపోతుంది. నిజంలా కనిపించటానికి అబద్ధానికి ‘మేకప్’ కూడా కావాలి. వాడు మొహానికి స్నో పౌడర్ పూసుకున్నాడు. మంచి సూటు తొడుక్కున్నాడు. అసలు నిజం అంటే ఏమిటి? మంచి బట్టలేసుకున్న అబద్ధం.

వాడి మొహం కేసి చూశాను. పెదాలు బాగా పగిలున్నాయి.  పళ్లు బయటకు కనిపించడానికి తొందరపడుతూ ఉన్నాయి. అబద్ధాలకోరుదీ, వాగుడుకాయదీ నోరు ఇలానే తయారవుతుంది. అబద్దాలకోరుల్లో మళ్లా రెండు రకాలు: మితభాషి, లొడలొడవాగేవాడు. మితభాషి పరిణతి చెందిన అబద్ధాలకోరు. అతను ఒకట్రెండు వాక్యాలలో అబద్ధాన్ని సర్దేస్తాడు. లొడలొడవాగేవాడు మాత్రం ఇంకా తన అబద్ధం అతకలేదని అనుకుంటాడు. అందుకని మరో  పది మాటలు లొడలొడా వాగేస్తాడు. ఈ దెబ్బకి దవడలు సాగిపోతాయి. వీడి దవడలు కూడా అలానే సాగిపోయున్నాయి. వీడి నోరు అబద్ధాల చీముతో ఉబ్బిన కణితిలా ఉంది. కాస్త పొడిస్తే చాలు చీమంతా బయటకు పొర్లిపోతుంది.

వాడు ఇప్పుడు దగ్గి గొంతును సవరించుకున్నాడు. జేబు రుమాలుతో నోరు తుడుచుకున్నాడు. చూస్తుంటే, సాక్ష్యం ఇవ్వడానికి వచ్చిన వాడిలా లేడు, న్యాయపు కూతురిని  పెళ్ళాడ్డానికి వచ్చిన పెళ్ళికొడుకులా ఉన్నాడు.

ప్రభుత్వ వకీలు అడిగిన ప్రశ్నలే అడిగాడు. అతగాడు చెప్పిన సమాధానాలే చెప్పాడు. ఫలానా వ్యక్తి మృతుణ్ణి లాఠీతో కొడుతుండగా అతను చూశాడు.

అతనికి లాఠీని చూపించారు. ఏదో పాత మిత్రుణ్ణి గుర్తుపట్టినట్టు గుర్తుపట్టాడు దాన్ని.

అతనికి ఒక రాయి ముక్క చూపించారు. అతను దాన్ని కూడా గుర్తుపట్టేశాడు – అదే రాయి, అక్కడ పడి ఉన్న రాయి.

నేను పక్కనే కూర్చున్న వకీలు దోస్తుతో అన్నాను – ఏరా, ఇదేంటి? వీడు రాయిని ఎలా గుర్తుపట్టగలడు?

అతనన్నాడు – గమ్మునుండు, ఎవిడెన్స్ ఆక్ట్ ప్రకారం అది సబబే!

సాక్షికి రక్తం కలిసిన మట్టిని చూపించారు. అతను మట్టిని కూడా గుర్తుపట్టేశాడు.

నేను వకీలు దోస్తుతో అన్నాను – ఇది మరీ విడ్డూరం. వీడు మట్టిని కూడా గుర్తుపట్టేస్తున్నాడు.  అతనన్నాడు – మాట్లాడకు. ఎవిడెన్స్ ఆక్ట్!

నాకేమనిపించిందంటే – ఇప్పుడు వకీలు ఇతనికి గాజు సీసాలో బంధించిన ఈగను చూపిస్తాడు. అడుగుతాడు – ఈ ఈగను గుర్తుపట్టగలవా నువ్వు? సాక్షి అంటాడు – ఇది అదే ఈగ, కొట్లాట సమయంలో అక్కడ చక్కర్లు కొట్టిన ఈగ . నేను గుర్తుపట్టేశాను. దీని మొహం మా అమ్మలా ఉంది.

అంతా ఎవిడెన్స్ ఆక్ట్ మహత్యం!

హరిశ్చంద్రుడు తన కలలో ఎవరికైతే దానం ఇచ్చాడో ఆ బ్రాహ్మణుడే గనక ఆస్తుల స్వాధీనం విషయంలో కోర్టుకెక్కాల్సి వస్తే, అప్పుడు అతను కూడా ఇద్దరు ముగ్గురు ప్రత్యక్ష సాక్షులను తీసుకొచ్చి నిలబెట్టి ఉండేవాడు. అప్పుడు వాళ్లనేవారు – మా ముందే ఈ విప్రునికి హరిశ్చంద్ర మహారాజు దానం ఇచ్చారు. వకీలు అడిగేవాడు – ఆ సమయంలో మీరు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు చెప్పుండేవారు –  మేం కూడా రాజావారి కలలోనే  ఉన్నాము.

డిఫెన్సు న్యాయవాది ‘క్రాస్ ఎగ్జామినేషన్’ చేయడానికి లేచి నుంచున్నాడు. ఇది దడపుట్టించే విషయం. ఒకసారి నన్నూ గడగడలాడించాడు. అప్పుడు నేను చెప్తూన్నది నిజమే, అయినా వకీలు రెండు నిమిషాల్లో ఆ నిజానికి చెమటలు పట్టించాడు.

 

సాక్షి సన్నద్ధమయ్యాడు. నోరు తుడుచుకున్నాడు. ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ నింపుకున్నాడు.

వకీలు అడిగాడు – సంఘటనా స్థలం నుండి నువ్వెంత దూరంలో ఉన్నావు?

అతడు ఇంకా నోరు తెరవకుండానే వకీలు మళ్లీ అన్నాడు – తొందరేమీ లేదు. ఆలోచించుకొని చెప్పు.

‘ఆలోచించుకొని చెప్పు’ – ఈ సూచన సాక్షిని కంగారుపెడుతుంది. అతడికి తాను అనుకున్నంత తేలిక వ్యవహారం కాదిది అని తెలుస్తుంది. ప్రశ్న కష్టమైనది. ఆలోచించాలి.

అతడు ఇందాక ప్రభుత్వ వకీలుకు తాను పదడుగుల దూరంలో ఉన్నాడని చెప్పాడు.

ఇప్పుడు ఆలోచించుకొని చెప్పాడు – పది – పదిహేను అడుగుల దూరం.

వకీలు – అలాగా, పదడుగుల దూరంలో ఉన్నావా?

సాక్షి – అదే, పదిహేను – ఇరవై అడుగుల దూరం.

వకీలు – అయితే పదిహేను – ఇరవై అడుగుల దూరంలో ఉన్నానంటావ్.

సాక్షి – ఆ, ఇరవై – ఇరవై అయిదు అడుగుల దూరం అనుకోండి.

మూడు ప్రశ్నల్లో అతడు పదిహేను అడుగుల దూరం జరిగిపోయాడు. ఒకవేళ వకీలు ప్రశ్నలు అడుగుతూనే ఉండుంటే, అతడు సంఘటనా స్థలానికి ఐదు మైళ్ళ దూరానికి వెళ్ళిపోయేవాడు. కానీ అతనికి మాత్రం సంబరంగానే ఉంది, వకీలుని “కన్ఫ్యూజ్” చేసినందుకు.

– నువ్వు సంఘటనస్థలానికి ఎన్ని గంటలకు చేరుకున్నావ్?

– తొందరేమీ లేదు. ఆలోచించుకొని చెప్పు.

– ఒంటిగంటన్నర – రెండు.

– అలాగా, ఒంటిగంటన్నర – రెండు గంటలకు వచ్చావేం.

– అవును, అదే రెండూ – రెండున్నర గంటల మధ్య.

– ఒహో, రెండూ – రెండున్నర గంటల మధ్య చేరావన్నమాట.

– అదే, రెండున్నర – మూడు గంటలనుకోండి.

– మృతుని వయస్సు ఎంత?

– ఇరవై ఐదు – ముప్ఫై ఏళ్ళు.

– అలాగా, ఇరవై ఐదు – ముప్ఫై ఏళ్ళవాడా!

– అవును, ముప్ఫై- ముప్ఫై ఐదు ఏళ్ళవాడు.

– అంటే అతడి వయస్సు ముప్ఫై – ముప్ఫై ఐదు ఏళ్ళు ఉండచ్చన్నమాట.

– అదే, ఒక ముప్ఫై ఐదు – నలభై ఏళ్ళు అయ్యుండచ్చు.

కొన్ని రోజుల పాటు నేనీ సాక్ష్యాల ఆటను చూస్తూనే ఉన్నాను. నాకు మతిపోయింది. బయట ఎంత వెతికినా నిజాయితీ గల మనిషీ ఒక్కడూ దొరకడు, కానీ న్యాయస్థానాల్లో మాత్రం ఇంతమంది నిజాయితీపరులు ఏయే  మూలల్లోంచి వచ్చి పోగవుతున్నారో అర్థం కాలేదు. అబద్ధం చెప్పడానికి అన్నింటి కన్నా సురక్షితమైన చోటు న్యాయస్థానం. ఇక్కడ రక్షణ కోసం దేవుడూ, న్యాయమూర్తి హాజరవుతూ ఉంటారు.

నా వకీలు-దోస్తు అన్నాడు – ఇదంతా చట్టపరిధిలోనే జరుగుతుంది. ఒకవేళ న్యాయమూర్తి సాక్షిని నమ్మితే, ఉరిశిక్ష. నమ్మకపోతే, విడుదల.

ఉన్నది ఒక్కడే సాక్షి, కానీ అతని వల్లే ఒక వ్యక్తికి ఉరి ఐనా పడవచ్చు, లేదా విడుదలైనా కావచ్చు. అదే సాక్ష్యం ఆధారంగా ఆ వ్యక్తిని ఒక న్యాయమూర్తి ఉరిశిక్షకు అర్హుడుగా భావించవచ్చు, అతణ్ణే ఇంకొక న్యాయమూర్తి నిర్దోషిగా భావించవచ్చు.

నేను వకీలు దోస్తుతో అన్నాను – మనిషికున్న ఈ న్యాయవ్యవస్థను  యంత్రం ఎక్కువ రోజులు సహించదు. ఏదోరోజున ఇక్కడ న్యాయస్థానం బదులు ఒక పెద్ద కంప్యూటర్ ఉంటుంది. అందులో మీ న్యాయవాదులనీ, సాక్షులనీ, న్యాయమూర్తిని అందరిని కలిపి వేస్తారు. కంప్యూటర్ నడిచి, మీలో ఒకరి తోలుమీద నిర్ణయం ముద్రితమై బయటకు వస్తుంది.

అన్యాయంగా కేసులో ఇరికించబడ్డ ఈ ముగ్గురు నలుగురు వ్యక్తులూ రోడ్డు పక్కన మురుక్కాలవ అవతల గుడిసెలు వేసుకుని బతుకుతున్నారు. వీళ్లు ఉరికంభం పై వేలాడటానికి ఖర్చు కూడా చేశారు – వకీళ్లను నియమించుకున్నారు, పోలీసులకు డబ్బు తినిపించారు.

అంతే కాదు, ఇక్కడ యేసు తన శిలువను తానే తయారుచేసుకుంటున్నాడు, లేదా ఉరికంభం మీద వేలాడుతున్నాడు. యేసుకి తన కాళ్ళ మీద తనే మేకులు కొట్టుకోక తప్పని పరిస్థితి కల్పిస్తున్నారు. ఆయన అంటున్నాడు – తండ్రీ, వీళ్ళని ఎట్టిపరిస్థితుల్లో క్షమించకు. ఎందుకంటే, ఈ వెధవలకి, వాళ్ళేం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలుసు.

Whatever you may call that!


కొత్త మెయిల్ వచ్చింది మెయిల్-బాక్స్ లోకి. ఆమె నుండే! పైకి ఒప్పుకోకపోవచ్చుగానీ, అది వస్తుందని అతడికి ఓ మోస్తరు నమ్మకం. రావాలన్న కోరిక కూడా కాబోలు. చూసీ చూడని ఎదురుచూపులూ ఉన్నాయి. తీరా అది రానే వచ్చాక దాన్ని వెంటనే తెరిచే ధైర్యం లేక మంచానికి వాలబడ్డాడు. చీకటిగా ఉన్న గదిలో లాప్‍టాప్ వెలుతురు మొహం మీద పడుతుంటే, ఓ రెండున్నర గంటల ముందు వాళ్ళిద్దరి మధ్యా ఫోన్ సంభాషణ మళ్ళీ వినిపించింది.

పరస్పరం “హలో!” అన్నాక ఓ అర నిముషం నిశ్శబ్ధం. కొత్తల్లో ఆమె ఇట్లాంటి నిశ్శబ్ధాలకు బెదిరిపోయేది.  తనను ఇంట్లోనే వదిలేసి అమ్మ బయటకివెళ్ళేటప్పుడు చిన్నపిల్ల భయపడిపోయినట్టు, ఒకటే కంగారు. “లేదమ్మా.. నేను మళ్ళీ వచ్చేస్తాను. తప్పకుండా వచ్చేస్తాను.” అని నమ్మించి, బుజ్జగించి, మాయచేసి మెల్లిగా బయటకు జారుకునేట్టు జారుకునేవాడు. బహుశా, ఎటూ ఎదగనని మోరాయించిన వాళ్ళ బంధంలో ఆమె ఎదిగిందేమో, ఈ మధ్యనలా కంగారు పడి గోలజేయటం మానేసింది. అతడి నుండి వినిపించే “హలో!”నే ఆమెకు సరిపోతుంది. అంతకన్నా ఎక్కువగా ఒక్క మాటైనా ఆమెకు బోనస్! అవకాశం ఇవ్వాలే గానీ ఆమె అలాంటి నిశ్శబ్ధాన్ని గంటలకు గంటలకు భరించగలదు, ఫోనులో కూడా! అందుకే అతడు వెంటనే సర్దుకొని “నేను ఒక ఐదు నిముషాల్లో మళ్ళీ చేయనా?” అని అడుగుతాడు. డీల్ కుదురిపోతుంది.

ఆ ఐదు నిమిషాలూ ఎప్పటికీ అవ్వవని ఇద్దరికీ తెల్సు. ఎలా అవుతాయి? ఆరో నిముషంలో అతడు ఆమెకు ఫోన్ చేసి మాత్రం ఏమని చెప్పగలడు? ఎంతని చెప్పగలడు? మనఃస్థితిని పూసగుచ్చినట్టు వివరించడానికి ఆమె ఎవరని? ఏమవుతుందని? ఇంకో నాలుగు నిముషాలు ఉగ్గపెట్టుకొని, పదకొండో నిముషంలో “ఏమయ్యా పెద్దమనిషి, ఐదు నిముషాలన్నావ్? ఇంకా ఉలుకూ పలుకూ లేదు?” అని ఆమె కూడా నిలదీయలేదు. “ఏం? ఎందుకు చేయాలి? ఎందుకు చెప్పాలి? అసలు నువ్వెవరు?” అని అతడు గదమాయిస్తే, ఇంకేమన్నా మిగులుతుందా? అలా అడగలేనంత మంచితనం అతడికి ఉండచ్చు. అయినా గానీ, ఎందుకు అవకాశం తీసుకోవటం? తాను కట్టుకున్న కలల కోటకు (తెలిసో, తెలియకో) అతడే కాపలా కాస్తుంటే, ఆమె ఎందుకు కాళ్ళదన్నుకుంటుంది వాటిని?

ఫోన్ చేసే ముందు “కాల్ లిఫ్ట్ చేసి హలో అంటే చాలు నాకు. అంతకన్నా ఎక్కువ అడగను.. ప్లీజ్” అని మొక్కుకున్న మొక్కులు, ఫోన్ పెట్టగానే హుళిక్కి అంటాయి. అతడు మాట్లాడాలని అనుకున్నవన్నీ ఇప్పుడు ఆమె ఊహల్లో ఊసులవుతాయి. అవి అలానే గాల్లో కల్సిపోతాయని ఆమె అనుకుంటుందిగానీ, అవ్వనీ ఆమె మెదడులో తిష్ఠ వేస్తాయి. బరువెక్కిన తలతో తాగుబోతు వాగినట్టు ఆమె ఎడా-పెడా ఓ ఉత్తరం రాసేస్తుంది. తప్పులు, తడకలతో. అయోమయ వాక్య నిర్మాణాలతో. పబుల్లో కూర్చొని బాగా ఎక్కేసిన మగాళ్ళ వింత చేష్టలను భరించిన అనుభవాలు సైతం అతడిని కాపాడలేకపోతాయి, పాపం, ఆమె పైత్యాలనుండి.

కొన్ని నిముషాలకు అతడా మెయిల్ తెరిచాడు. అందులో ఏముంటుందో ఊహించటం కొంచెం కష్టమే! ఒక్కోసారేమో, రాసిన ప్రతి పదం పదిరెట్ల వాల్యూమ్ తో వినిపిస్తాయి – అరుస్తోందన్నమాట, గొంతు చించుకొని. ఇంకొన్ని సార్లు గలగలమంటూ ప్రతి పదం మువ్వలా వినిపిస్తుంది – శాంతావతారం! మరికొన్ని సార్లు ఒక్కో పదంలో నుండి అర బక్కెట్టు నీళ్ళు వచ్చేలా! ఒక్కోసారి ఒక్కోలా ఉంటాయి ఆమె రాసేవి. అతడు ఉన్నది శరత్కాలమనుకొని, ఆమె కుంపటి పంపిస్తుంది చలి కాచుకోవడానికి. అప్పటికి అతడి వైపు వసంతం వచ్చేసి ఉంటుంది. పుండును శుభ్రంగా కడిగి, మందేసి, కట్టేసి కట్టాక ఆమె ఉత్తరం దాన్ని కెలకడానికి తయారవుతుంది.  ఏమున్నా, చదవడం పూర్తయ్యేసరికి అస్తవ్యస్తంగా మారిన మానసికావస్థను మళ్ళీ కుదుటపర్చుకోవాల్సి వస్తుంది. ఆమె చెరిపేసిన గీతలను అతడు మళ్ళీ గీసుకోవాల్సి వస్తుంది. ఈ తతంగాలన్నీ అయ్యేసరికి అర్థరాత్రి దాటింది. లాప్‍టాప్ కట్టేసి పెళ్ళి-కాని-తనంలో మాత్రమే సాధ్యమయ్యే కల్తీలేని ఏకాంతాన్ని కప్పుకొని పడుకున్నాడు తన గదిలో.

ఆమె నిద్రపోయి అప్పటికే చాలా సమయమవుతుంది. 

తెల్లారాక మెయిల్ రాయటం, చదటం రెంటిని కలలు అన్నట్టు వ్యవహరించాలంటే, వాళ్ళిద్దరూ నిద్రపోవాలిగా ఆ మాత్రం.

ప్రేమగాని ప్రేమ


ఎవరో ముక్కు చీదుతున్నట్టు అని-వినిపించింది అతగాడికి గానీ, ఎవరో అనుకొని ఏకధాటిగా మాట్లాడుతూనే ఉన్నాడు. ఆ అమ్మాయి ఏకంగా తలదించుకొని, చున్నీతో కళ్ళలు తుడుచుకుంటుందని ఎవరో దారినపోయే వాళ్ళు వీళ్ళకేసి వింతగా చూసేంత వరకూ గ్రహించనేలేదు. నడిరోడ్డున మర్డరు చేసి రెడ్ హాండెడ్‍గా పట్టుబడిపోయినవాడిలా దొంగచూపులు చూశాడు. “అర్రె.. ఏమయ్యింది? ఎందుకు బాధపడుతున్నారు?” అని ఓ పక్క అడుగుతూనే, ఇంకో పక్క ఆమె తక్కువలో తక్కువమందికి కనిపించేలా ఆమెకు అడ్డంగా నుంచున్నాడు. “ప్లీజ్.. ఏడుపాపండీ!” అని బతిమాలుకున్నాడు. ఆమె అతనికేసి సూటిగా చూసి, ఆపినట్టే ఆపి మళ్ళీ అందుకుంది.

“సరే.. ఏడవండి!” అంటూ ఆమె పక్కనే కూలబడ్డాడు. “ఇప్పుడు ఎవడో వస్తాడు. నేను మిమల్ని ఏదో చేసేశాననీ, అందుకని మీరిలా బాధపడుతున్నారనీ గోల చేస్తాడు. ఓ పదిమంది పోగుబడతారు.. పర్లేదు.. మీరు కానివ్వండి..” అంటూ ఓసారి చుట్టూ కలియజూసి తలవంచుకొని, గడ్డి మధ్యలోని మట్టిలోంచి వస్తున్న చీమలను తదేకంగా చూస్తూ కూర్చున్నాడు, ఆ చీమకెప్పుడైనా తనలాంటి పరిస్థితి వచ్చి ఉంటుందా అని ఆలోచిస్తూ..

“నేను మీతో మాట్లాడాలి..” అని అంది. “నిజమా?” అన్నట్టు చూశాడు. “కానీ ఏడుపు వచ్చేస్తుంది.” అంది. అతడు లేచి, బయలుదేరుదామన్నట్టు సంకేతం ఇచ్చాడు. “నేను ఇప్పుడు ఇవ్వాళే మాట్లాడాలి మీతో. కానీ మా ఇంట్లో కుదరదు. మీ ఇంట్లో అవకాశమే లేదు. ఇక్కడా బాలేదు. మన ఇద్దరికి కొంచెం ప్రవసీ ఉండేలాంటి చోటు??” అని ఆమె ఇంకా పూర్తి చేయకముందే, “హోటెల్!” అన్నాడు. అని నాలుకు కర్చుకున్నాడు. ఇప్పుడే వస్తానంటూ సైగ చేసి, పక్కకెళ్ళి కాల్ చేసి వచ్చాడు. “మా ఫ్రెండ్ ఇళ్ళు ఇక్కడికి దగ్గరే! అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి.” అని బైక్ మీద ఆమెను తీసుకెళ్ళాడు.

“మీ ఫ్రెండ్ ఇంట్లో వాళ్ళూ?”

“వాళ్ళ నాన్న ఊర్లో లేరు. అమ్మ గుడికి వెళ్ళిందంట. వాళ్ళ చెల్లి కోచింగ్కు వెళ్తుంది. ఇంకో రెండు గంటల్లో వస్తారు వాళ్ళు. ఈ లోపు మీరు చెప్పాల్సింది అయిపోతుందిగా?”

ఆమె సమాధానం ఇచ్చిందో లేదో, అతడికి మాత్రం వినిపించలేదు.

ఫ్రెండ్ సాదరంగా ఆహ్వానించాడు. ఇద్దరికి మంచినీళ్ళిచ్చి, టీ -బిస్కెట్స్ అక్కడే పెట్టి, బయట పనేదో వచ్చిందని జారుకున్నాడు.

“ఇప్పుడు చెప్పండి..”

“నేను మీకు నిజంగానే నచ్చానా? నేనసలు ఈ పెళ్ళిచూపులకి ఒప్పుకుందే వచ్చినవాళ్ళు కాదంటారేమోనన్న ఆశతో. నాకీ పెళ్ళి ఇష్టం లేదు.”

అతడేం మాట్లాడలేదు.

“ఐ యామ్ సారి. ఇదంతా చాలా చెత్తగా తయారవుతుంది. ఇందుకే చెప్పాను మా ఇంట్లోవాళ్ళతో ఇవ్వన్నీ ఇప్పుడు పెట్టద్దొని. మీ నాన్నగారికి మాట ఇచ్చేశారని, నన్ను తొందరపెట్టారందరూ..”

అతడింకా ఏం మాట్లాడలేదు.

“నేను.. నేను” అంటూ, కాస్త కాస్తగా వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ, “ఇంకొకరిని ప్రేమించాను. కానీ ఆ మనిషికి పెళ్ళి కుదిరిపోయిందని ఆలస్యంగా తెల్సుకున్నాను. అయినా అతణ్ణి మర్చిపోలేకపోతున్నాను..”

ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకున్నాడు అతడు. “ఐ కాన్ అండర్‍స్టాండ్.” అన్నాడు ఆత్మీయంగా. అంతే! ఆ ఒక్క ముక్క వినపడగానే ఆమె వెక్కివెక్కి ఏడ్చింది. గుక్కలు తిప్పుకుంటూ, మధ్యమధ్యన “నేనింకెవ్వరిని ఆక్సెప్ట్ చేయలేని స్థితిలో ఉన్నాను.” అన్నదాన్ని ముక్కముక్కలుగా విరగొట్టి చెప్పింది. మధ్యలో వీలైనన్ని చోట్ల “సారీ”లు జతజేసింది.

“డోంట్ బి సారీ! ఇందులో మీ తప్పేం లేదు. ఇలాంటివి ఎంత బాధ కలిగిస్తాయో నేను ఊహించగలను. నా గురించి మీరేం భయపడనవసరం లేదు. మీ మీదకుగానీ, మీవాళ్ళ మీదకు గానీ రాకుండా ఈ సంబంధం తప్పించే బాధ్యత నాది!” అని భరోసాతో పాటు ఆమెకు గ్లాసుడు మంచినీళ్ళు కూడా ఇచ్చాడు. ఆమె కళ్ళు తుడుచుకుని, నీళ్ళన్నీ గడగడా తాగేసింది. కొద్ది నిముషాల పాటు ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు.

అటు వైపువారికి, ఇటువైపువారికి ఇద్దరూ ఒకే అబద్ధం, అది కూడా ఎక్కడా అతుకులు కనిపించకుండా చెప్పాలని గ్రహించారిద్దరూ, ధీర్ఘాలోచనలో మునిగారు.

“ఆ అబ్బాయికి పెళ్ళి అయిపోతుందంటున్నారు. ఇవ్వాళ నన్ను కాదన్నా.. అదే, నేను కాదన్నా.. రేపు మీవాళ్ళు మరో సంబంధం తీసుకొస్తారు. అప్పుడేం చేద్దామనీ?”

“అవ్వన్నీ నేను ఆలోచించలేదు. అతణ్ణి గురించి తప్ప నేనింకేం ఆలోచించలేకపోతున్నాను.”

“మీరా అబ్బాయికి చాలా క్లోజ్ అయినట్టున్నారు.” తలూపింది, అంగీకారంగా.

“అతడికీ మీ మీద ఇంట్రెస్ట్ ఉందేమో?” పెదవి విరిచింది, తెలీదన్నట్టు.

“వివరాలు అడుగుతున్నందుకు ఏం అనుకోకండి.. మీ కొలీగా అతడు?” తలాడించింది, అనంగీకారంగా. మంచితనానికి ఫాంటూ, షర్టూ వేసినట్టున్న అతడి దగ్గర ఈ మాత్రం వివరాలు కూడా చెప్పకపోతే బాగుండదని, మెల్లిగా అందుకుంది.

“అతడు నా ఫేస్‍బుక్ ఫ్రెండ్. నాకు ఫ్లోరిస్ట్ అవ్వాలని భలే కోరిగ్గా ఉండేది. కానీ మా ఇంట్లో ఇంజినీరింగే చదవాలనేవారు. ఉద్యోగం వచ్చాక హాబీగా floristry కోర్సు చేశాను. ఒకానొక గ్రూప్ లో daffodils పూలు ఎక్కడ దొరుకుతాయి అని అడిగాడు ఈ అబ్బాయి. అవి దొరకవూ, వాటి బదులుగా ఏమేం తీసుకోవచ్చో చెప్పాను. ఈ రోజు పోయాక అక్కడ థాంక్స్ తో పాటు, నాకో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది…ఆక్సెప్ట్ చేశాను.

“అప్పుడోసారి అప్పుడోసారి పలకరించుకునేవాళ్ళం. నా ఆఫీసులో ఫేస్బుక్ బ్లాక్ చేశారు. అందుకని ఇద్దరం మా కంపెనీవాళ్ళు బ్లాక్ చేయలేని మెసెంజర్ లో మాట్లాడుకునేవాళ్ళం. అలా అలా స్నేహం మొదలయ్యి, ఎప్పుడో తెలీదుగానీ అతడంటే ఇష్టమూ మొదలయ్యింది.”

“ఎప్పుడన్నా కల్సుకున్నారా?”

“ఊహు. ఒకసారి అతనడిగాడు కలుద్దామని, అప్పుడు నేను ఆన్-సైట్ కి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకోసారి నేను అడుగుదామనుకున్నాను, అతడు ఏకంగా పెళ్ళికే రమ్మన్నాడు.”

“అంతేనా?”

“అంతే!”

“నిజంగా.. ఇంతేనా?”

“ఇంతే!”

అప్పటిదాకా లోలోపల అణుచుకుంటున్న నవ్వంతా ఒక్కసారిగా కట్టలు తెచ్చుకొని వచ్చేసింది అతడికి. అప్పటిదాకా ఎదురుగా కూర్చొని ఆలకించిన అతడు, పక్కకొచ్చి కూర్చున్నాడు. “మొన్న మీ నాన్న, “మా అమ్మాయి అమాయకురాలండీ” అంటుంటే ఏమో అనుకున్నా. మరీ ఇంత పిచ్చి మొద్దువా?” అని తల మీద మెల్లిగా మొట్టాడు. ఏం అర్థంకాక ఆమె దిక్కులు చూసింది.

“ఇంకా నయం. నీ మాటలు పట్టుకొని నేనీ సంబంధం కాన్సిల్ చేసుకోలేదు. అయినా ఫేస్బుక్ లో ఎవడో తీయగా మాట్లాడితే, పడిపోవటమేనా?” ఆమె చూసేసిన దిక్కులనే మళ్ళీ మళ్ళీ చూస్తోంది.

“సరే.. పో, ఆ రైట్ లో బాత్రూమ్ ఉంటుంది. మొహం కడుక్కొనిరా పో..ఇక బయలుదేరుదాం. ఆకలేస్తుందా? ఏదన్నా తింటావా?”

ఆమె దిక్కులతో పనికావటం లేదని తేల్చుకొని, సూటిగా అతడినే చూస్తూ, “You aren’t getting it. I love him.” అని ఇంగ్లీషులో ఏడ్చింది.

“It’s you who aren’t getting it. This ain’t love, baby!”

అమెకి ఇప్పుడు ఇంతకు ముందు కనిపించని దిక్కులేవేవో కూడా కనిపించసాగాయి. ఆమె పరిస్థితి అర్గం చేసుకొన్న అతడు, ఆమెకు కొంచెం దగ్గరగా జరిగి, చుటూ చేయి వేసి, “చూడు అమ్మడూ. ఇది మహా అయితే infatuation అయ్యుంటుంది. అంతే! నువ్వేదో ఊహించేసుకొని, అదే నిజమనుకుంటున్నావ్. అతడికి నువ్వంటే ఇష్టమే ఉంటే వెళ్ళి వేరే వాళ్ళని పెళ్ళిచేసుకోడు కదా! అతడేదో కాస్త ఫ్రెండ్లీగా మూవ్ అయ్యేసరికి నువ్వు ఎట్రాక్ట్ అయిపోయుంటావ్.”

“కానీ.. అతనితో మాట్లాడేటప్పుడు అంత ఆనందంగా ఎందుకు అనిపించేది? అతనితో మాట్లాడలేని రోజుల్లో ఎందుకంత దిగులుగా ఉండేది. అతడి ఆఫీసులో జరిగిన క్రికెట్ టోర్నీలో అతడు గెలిస్తే నాకెందుకంత సంబరమేసేది? అతడికి చిన్నదెబ్బ కూడా తగలకపోయినా, అతడి కార్‍కి ఆక్సిడెంట్ జరిగిందంటే నాకెందుకెంత భయం వేసింది?”

“ఎందుకంటే, నువ్వుత్త వెర్రి మా తల్లివి కాబట్టి..” అని ఇంకా దగ్గరకు తీసుకున్నాడు ఆమెను.

“నేను ఇంకొకరిని ప్రేమించానని తెల్సి కూడా నన్ను పెళ్ళి చేసుకుంటారా?”

“మళ్ళీ అదే మాట. ఫస్ట్ నైట్ జరగని పెళ్ళి పెళ్ళికానట్టూ, ఒకరినొకరు చూసుకోకుండా, మనసు విప్పి మాట్లాడుకోకుండా సాగే పరిచయం కూడా ప్రేమ కిందకు రాదు. తప్పనిసరిగా బైక్ మీద తిరగాలి, ఒక కోక్ లో రెండు స్టాలు వేయాలని అని అననుగానీ, నువ్వు చెప్పినవేటినీ మాత్రం ఖచ్చితంగా ప్రేమ అనరు.”

ఆమెకు దుఃఖం మళ్ళీ పొంగుకొచ్చింది. ఈసారి అతడినే కావలించుకొని ఏడ్చింది. ఆ కన్నీళ్ళు దేనికో ఆమెకే అర్థం కాలేదు – తను ఇన్నాళ్ళూ భ్రమలో బతికినందుకా?  తనది ప్రేమగాని ప్రేమ అని ఇప్పుడన్నా తెల్సుకున్నందుకా? అతడి దగ్గర ఈ వాగుడంతా వాగి లోకవైపోయినందుకా? లోకువైనా అతడు తనని అంగీకరించినందుకా? ఇప్పుడు ఇదైనా నిజమేనా, లేక ఇదింకో రకం భ్రమా?

వెచ్చని కౌగిలి, మెల్లిగా ఊయల ఊగుతోంది. ఆమె అతడిని ఇంకా ఇంకా గట్టిగా పట్టుకుంటోంది. అందివచ్చినదాన్ని వదులుకునేంత వెర్రిదేం కాదు ఆమె.

 

irctcయాడు వింత నాటకమ్ము..


రైలు కదలటం మొదలెట్టింది. అతడి కళ్ళల్లో ఇంకా ఆశ, ఆమె వస్తుందేమోనని..

***

irctc.co.inలానే విధి కూడా బలీయమైనది. ఆ విధే ఆ అమ్మాయిని, అబ్బాయిని కలిపింది.

కాంపస్ రిక్రూట్‍మెంట్లంటే అంత. మనమేం రైలు ఎక్కుతున్నాం?, అది ఎప్పుడు బయలుదేరుతుంది?, ఎక్కడెక్కడ ఆగుతుంది?, ఎక్కడికి చేరుకుంటుంది?, ఎన్నాళ్ళు ప్రయాణిస్తుంది? మొదలైన వివరాలేమీ అక్కర్లేదు. ఫలనా టైంకు, ఫలానా ప్లాట్‍ఫారం ఒకటే బండగుర్తు చాలు. వాళ్ళిద్దరూ ఒకే ప్లాట్‍ఫారంపై కూర్చొని ఎంతో సేపు “ఆఫర్” అనే టిక్కెట్టు పట్టుకొని “ఉద్యోగమ”నే రైలు కోసం ఎదురుచూశారు, ఒకళ్ళ గురించి ఒక్కళ్ళకి తెలీకుండా. ఎట్టకేలకు రైలొచ్చాక ఎదురెదురు సీట్లలో కూర్చున్నారు, ఒకరినొకరు పలకరించుకోకుండా! చూపులు కలుస్తున్నా నవ్వులు పుట్టలేదు. ప్రయాణం అలా జరుగుతుండగా..

“ఉద్యోగం” రైలు ఆగిపోయింది, ఆగాల్సిన అవసరం లేని చోట. “ఏదోలే!” అనుకున్నారంతా! ఊరుకున్నారు. బండి మాత్రం ఎంతకీ కదల్లేదు. “ఇంజిన్ ఫెయిల్” అని గాలి కబురు మోసుకొచ్చింది. ఉసురోమన్నారంతా. ఊరికే ఉన్నారు. సమయం ఆగుతుందా? తిండికి, నీటికి కూడా సమస్య మొదలైంది. “పర్లేదు.. బాగయిపోతుంది” అన్నారు కొందరు. “దీనికన్నా కాలినడక త్వరగా చేరుకుంటాం.” అన్నారు ఇంకొందరు. ఆమెకేమీ పాలుపోలేదు. అతడు మాత్రం బింకంగానే ఉన్నాడు. ఆమెకు ఆశ్చర్యమేసింది. అతడిపై అనుమానం కలిగింది. ఆపై నమ్మకం కుదిరింది. వారిద్దరి పరిచయం, వైయా స్నేహం, ప్రేమ మజిలి చేస్తున్నప్పుడెప్పుడో “ఉద్యోగం” బండి కూడా గాడిన పడి, వేగమందుకుంది.

ప్రేమంటే సికింద్రాబాద్‍కు ముందొచ్చే మోలాలీ స్టేషన్ లాంటిది. “ఆల్మోస్టు వచ్చేశాం” అని అనుకోడానికేగానీ, వచ్చినట్టు లెక్కకు రాదు. అక్కడివరకూ ఎంత సూపర్‍ఫాస్ట్ గా వచ్చినా, ఇక్కడికి వచ్చాక లైన్‍లోకి రావాల్సిందే!
వీళ్ళిద్దరకి స్కూలు, కాలేజీలకు ఇంట్లోవాళ్ళే రిజర్వేషన్లు చేశారు. ఉద్యోగానికి కాలేజివాళ్ళు చేశారు. కానీ ప్రేమించుకున్నాక “పెళ్ళి” అనే రైలెక్కడానికి వీళ్ళిద్దరూ స్వయంగా పూనుకోవాల్సిన అగత్యం. వెరసి వీళ్ళిద్దరి టికెట్లూ వెయిటింగ్ లిస్టులో..

అతడికో అక్క. ఆమెకు సంబంధాలు కుదరటం లేదు. అది అయితే గానీ ఇతడి టికెట్ “కన్‍ఫర్మ్” కాదు.
ఆమెకో చెల్లి. చెల్లికి పెళ్ళి. ఆమె టికెట్ ఇక “కన్‍ఫర్మ్” అవ్వక తప్పని పరిస్థితి.

ఎన్నో యుగాలుగా ఇట్లాంటి జటిల సమస్యలకు తోచిన పరిష్కారాలు ఇస్తూ విసిగిపోయిన విధి, irctcకే వీటిని ఔట్‍సోర్స్ చేయటం మొదలుపెట్టింది.

“partial waitlist అంటే?”, “ఒకరి టికెట్ కన్‍ఫర్మ్ అయ్యి, ఇంకొకరిది కాకపోతే? ఇద్దరినీ పంపుతారా?” — చాలా తర్జనభర్జనలు జరిగాయి. వీల్లేనప్పుడు ఎవరి జుట్టు వాళ్ళు, కుదిరినప్పుడు ఒకరి జుట్టు ఒకళ్ళు పీక్కున్నారు.

“ఎవరి టికెట్టు కన్‍ఫర్మ్ అయితే వాళ్ళే వెళ్ళాలట – మిగితా వాళ్ళకి నో ఛాయిస్ అట – అలా ఎలా కుదురుతుంది? – పోనీ నువ్వెళ్ళిపో – మరి నువ్వు? – నా చావు నే చస్తా – మరప్పుడు కల్సిబతుకుదామని ఎందుకన్నావ్? – బుద్ధి గడ్డి తిని! – ఇహ అదే గడ్డి నా బుద్ధి తినదులే” మాటామాటా పెరిగింది. గొడవ జరిగింది.

గొడవయ్యాక తలపట్టుకొని కూర్చున్నాడు అతడు. ఆమె అలా నిలవలేకపోయింది. రుసరుసలాడుతూ వెళ్ళి, చరచరా తన టికెట్టు కాన్సిల్ చేసేసింది.

***

రైలు స్టేషన్ను ఎప్పుడో దాటేసి సిటి బయటకు వచ్చేసింది. ఊపందుకున్న రైలులో నుండి దూకేయ… రైలు తలుపులు వాటంతటవే మూసుకుపోయాయి. ఆర్.ఎ.సి టిక్కెట్టు మీద ప్రయాణిస్తూ, బెర్తు లేక టాయిలెట్ల కంపు దగ్గరే కూర్చున్న ఓ పెద్దమనిషి అతడి అయోమయాన్ని చూసి ముసిముసిగా నవ్వాడు. “ఈ రైల్లో ఎక్కటం నీ చేతుల్లో – ఉన్నట్టు అనిపించినా – లేనిది. ఈ రైల్లోంచి దిగటం, దూకటం కూడా నీ చేతుల్లో లేనివి. దొరికింది జానాబెత్తుడు జాగానా? లేక రాయల్ కోచ్? అన్నది కాదు సమస్య. సమస్యల్లా ఉన్నదానిని నువ్వెంత అందిపుచ్చుకుంటావన్నదే!” అని వాయించాడో నాలుగు గంటలు.

తల దిమ్మెక్కి ఉన్న అతడు, తన అప్పర్ బెర్తు చేరుకొని కాళ్ళు బార్లా చాపుకొని సుబ్బరంగా పడుకున్నాడు. అతడి బెర్తుకు అటువైపున్న బెర్తుల్లో ఒకదాంట్లో “తత్కాల్”లో టిక్కెట్టు కొన్న ఆమె, ఆమె భర్తా కొత్తగా పెళ్ళైనవాళ్ళకే అర్థమయ్యే అర్థంకాని గుసగుసలేవో ఆడుకుంటున్నారు.

విధిన్నూ, irctcనూ విచిత్రమైనవి.

….


ఈడు అయిపోతున్నా పెళ్ళికాని ఆమె ఊసు రాగానే అందరూ నోళ్ళు నొక్కుకునేవారు. గుసగుసలాడుకునేవాళ్ళు. కొన్నిసార్లు ఆమెకూ, ఆమె కుటుంబసభ్యులకూ వినపడాలనే గొంతుపెంచి సణిగేవాళ్ళు. పెళ్ళి కాకపోవటానికి బలమైన కారణాలు చూపించలేక, పెళ్ళి చేయలేక ఆమె ఇంట్లో వాళ్ళంతా మానసిక క్షోభ అనుభవిస్తూ ఉన్న సమయంలో..

అనుకోకుండా ఒక రోజు ఒకడు ఎవరికీ తెలీకుండా ఇంట్లోకి జొరబడ్డాడు. వచ్చీ రాగానే ఆమె చేయి పట్టుకున్నాడు. ఆకుచాటునున్న ఆడపిల్లాయె! హడలిపోయింది. ఇంట్లోవాళ్ళకి తెల్సీ తెలియగానే పెద్ద రాద్ధాంతమే అయ్యింది. ఈ విషయం బయటకు పొక్కనివ్వకుండ డబ్బిచ్చో, కాళ్ళుపట్టుకునే అతడిని వదిలించుకోవాలనుకున్నారు. అందుకు తగ్గ సన్నాహాలు మొదలెట్టారు.

అతడు డబ్బులకు లొంగలేదు. అతడి చేతిలో వీళ్ళ జుట్టుకానీ, అతడి కాళ్ళు వీళ్ళకి అందే అవకాశమే లేదని తెల్సుకున్నారు మెల్లిమెల్లిగా. అతణ్ణి చూస్తే చాలు ఆమె జడిచిపోయేది. “ఇతగాడికిచ్చి నాకు పెళ్ళి చేస్తే ఏ నుయ్యో, గొయ్యో చూసుకుంటాను” అని కూడా అనలేదు, పాపం. “నన్ను కాపాడండో..” అని విలవిలాడిపోయేది. బిడ్డ పడే వేదనకు మించిన శిక్షేముంటుంది కన్నవారికి? మందూ-మాకు అతడిని తరిమికొట్టలేకపోతే, చివరకు భూతవైద్యుణ్ణి కూడా పిలిపించారు.

అతడి ఊహే భరించలేని ఆమె ముందుకు ఓ సాయంకాలం వచ్చి కూర్చొని సూటిగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఏదో ధ్యాసలో ఉన్న ఆమె ఆ కళ్ళల్లోకి చూసింది. అవి మామూలు కళ్ళు కావు. అందులోని అయిస్కాంతపు శక్తి ముందు ఆమె నిలువలేకపోయింది. పరవశురాలయ్యి అతడికి అన్నీ సమర్పించుకుంది.

ఇంత జరిగాక ఇంక దాచటం ఎవరి తరం? గుండె రాయి చేసుకొని ఆమెను అతడితో సాగనంపటానికే సంసిద్ధమయ్యారు. కొత్తబట్టల్లో ఆమె కడిగిన ముత్యంలా ఉంది. తల్లిదండ్రులు బావురుమన్నారు. అన్నాళ్ళూ నోరుజేసుకున్న ఊరు-వాడ, ఆమె అప్పగింతల్లో కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. “మూణ్ణెళ్ళు తిరక్క ముందే శుభవార్తతో మళ్ళీ రావే” అని ఆటపట్టించే వీలే లేదుగా మరి.

అలా ఆమె వెళ్ళిపోయింది, అతడి వెంట… తిరిగిరాని లోకాలకు.

అమ్మాయి, అబ్బాయి, ఆ వీధి.


డ్యూటి ఎక్కిన రెండుమూడు గంటలకే ఆపసోపాలు పడుతూ, ఆవలిస్తూ ఉన్నాయి ఆ వీధి దీపాలు. కొన్ని మాత్రం సిన్సియారిటికి మారుపేరుగా వెలిగిపోతున్నాయి.

“థు! సండేనాడు కూడా పని. అదీ ఇంత బోరింగ్ వీధిలో. నాట్ హాపనింగ్ యార్!” అందో దీపం.

“నిజమే! అసలే బోర్ రా బాబూ అనుకుంటుంటే మధ్యలో ఈ మెట్రో పని ఒకటి. గుంతలకి, గుట్టలకి వెలుతురిస్తున్నాం. మనుషులు చరచరా మరమనుషుల్లా వెళ్ళిపోతున్నారు..” అని మరో దీపం వంతపాడుతుండగా-

“ఒకప్పుడు ఈ వీధి ఏం కళకళాడేది అనుకుంటున్నారు ఈ వేళకి. అవి నేను కొత్తగా ఉద్యోగంలో చేరిన రోజులు. ప్రేమజంటలు, పెళ్ళైన కొత్తల్లోని బిడియాలు-ప్రణయాల combo, విరహవేదనలు, బుడంకాయల కేరింతలు-పరుగులు, వయసు మళ్ళిన వాళ్ళ కులాసా నడకలు -ఓహ్, ఆ రోజులు. పక్కపక్కనే జిలేబి-కాఫీ బళ్ళు. వాటి ముందే పూలో, పళ్ళో పెట్టుకొని అమ్మేవాళ్ళు. బుడగల వాళ్ళు. ఇప్పుడసలు క్షణం తీరికున్నట్టు కనిపిస్తున్నారా ఎవరన్నా?” అందో సీనియర్ స్ట్రీట్ లైట్.

ఇంతలో..

“ఇదిగో ఇక్కడో పడుచు జంట. ఇప్పుడే వీధిలోకి వచ్చారా హోటెల్ నుండి.” అన్న బ్రేకింగ్ న్యూస్ వెలువడింది.

“ఆ.. ఏముంది? బై-బై అని చెప్పుకొని ఎవరిదారిన వాళ్ళు పోవటమో లేక ఒకే బైక్ ఎక్కి తుర్రుమనటమో..” – పొంగుతున్న బ్రేకింగ్ న్యూస్ మీద ఓ దీపం నీళ్ళు చల్లింది. తక్కినవారంతా “మమ” అనుకున్నారు.

“అదే మా రోజుల్లో.. ” సీ.సి.లై (అదే సీనియర్ స్ట్రీట్ లైట్) మాత్రం రికార్డు ఆన్ చేసింది.

“నాహ్.. సంథింగ్ కుక్కింగ్ హియర్” అంటూ వాళ్ళకి దగ్గరగా ఉన్న దీపం చెవులు రిక్కరించుకొని విన్నవన్నీ తక్కినవాళ్ళకి చేరవేసింది ఇలా:

అతడు: మీ రూమ్ దగ్గర దిగబెట్టేసి వెళ్తాను.
ఆమె: వద్దండి..
అతడు: నేను దిగబెట్టటం మీకు ఇబ్బంది అయితే..
ఆమె: weather బాగుంది. డిన్నర్ కూడా ఎక్కువయ్యింది. ఇలాంటప్పుడు నడవటం నాకు భలే ఇష్టం.
అతడు: చలిగాలేస్తోంది. పొద్దున్నకల్లా ముక్కు దిబ్బడేసుకుపోతుంది. పదండి, నేనే డ్రాప్ చేస్తాను.
ఆమె: నో. ఐ యామ్ వాకింగ్. యు మె జాయిన్.. వెల్..

“అయినా కూడా అబ్బాయి బైక్ తీస్తున్నాడు. “నీ ఖర్మ. పోయి చలిగాలికి తిరిగి జలుబు తెచ్చుకో.. నేను చక్కాపోతాను” అని అనుకుంటున్నాడేమో. అమ్మాయి అప్పటికే ఒక పదడుగులు వెళ్ళిపోయింది.” అంటూ ముగించింది.

మెడికల్ షాపు ముందున్న వీధిదీపం అందుకుంది.

“వాడు నానాయాతనా పడుతూ బైక్ నెట్టుకొస్తున్నాడు, ఆమె ముందు నడుస్తోంది – మహావిలాసంగా. ఆమె ఆగి రోడ్డు దాటమంటోంది. “బైక్ తో ఎట్టా కుదురుతుంది?” అని అడుగుతున్నాడు. ఆమె రోడ్డులో ఓ సగం దాటేసి, “వస్తావా?” అన్నట్టు చూస్తోంది. రోడ్డు మధ్యలో అడ్డదిడ్డంగా ఉన్న మట్టిగుట్టలు, రాళ్ళను దాటటం ఆమెకి సమస్య కాదు. కానీ బండెలా దాటుతుంది, పాపం? దరిదాపుల్లో యూ-టర్న్ లేదు. కొంచెం సందు కనిపించింది రాళ్ళ మధ్య. తన టూ-వీలర్ డ్రైవింగ్ స్కిల్స్ చూపించక తప్పదని అందుల్లోంచే బండి తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆమె అనుసరిస్తోంది. మధ్యలో ఒకరాయి అడ్డు వచ్చింది. అక్కడే ఉన్న పనివాడో చేయివేస్తున్నాడు. సులువుగానే జరిగిపోయింది.(పని, రాయి – ఏదనుకున్నా ఒకే!) రోడ్డు దాటారు.”

కాపీ కొట్టుకు ఐమూలగా ఉన్న దీపం స్పీకింగ్..

“ఆమె కాఫీ తాగడానికి అనుకుంట అక్కడ ఆగింది. అతడు బైక్ పక్కకు పెట్టి వచ్చాడు.
“కాపీ సార్?” అని అడిగింది కొట్టువాడిలా అభినయిస్తూ.
“ఇప్పుడా?” అని ఆశ్చర్యపోతున్నాడు.
“చిక్కటి రాత్రి. చల్లని గాలి. మత్తెక్కించే కాఫీ వాసన. ఇంత రొమాంటిక్ సెట్టింగ్ లో కాఫీ తాగనివాడు…. ” – ఏమనాలో ఆమె ఆలోచిస్తుండగా, పండుతున్న నాలుకను బయటకు తీసి చూపించాడు.
“కిళ్ళీతో పాటు కాఫీని కూడా లోపలికి తోస్తే నా కడుపు “మనిషివేనా?” అని అడుగుతుంది. అందుకనీ…”
“హమ్మ్.. ఏం చేస్తాం. చక్కని కాఫీ మిస్ అయ్యిపోతున్నారు. మీ బాడ్ లక్.”
“సర్లేండి. కాఫీ తాగేస్తే నేను దింపేసి వెళ్తాను.”
“అయ్యో.. మీకు ఆలస్యం అవుతున్నట్టుందే! నేను కాఫీ గబగబా తాగలేను. అసలే ఇది చాలా వేడిగా ఉంది.”
“నాకాలస్యం కాదు. మీ గురించే!”
పేపర్ గ్లాస్ ఇవ్వమని కొట్టువాడిని ఇంగ్లీషులో అడిగి, హిందిలో గదమాయించి, తెలుగులో తిట్టుకుంటోంది. కన్నడలో ఏదో సర్దిచెప్పి గ్లాస్ ఇప్పించుకున్నాడు అతడు.

బైక్‍ ని అక్కడే ఉంచేసి, కప్పులో కాఫీలా పొగలు కక్కుతున్న ఆమె వెంట నడుస్తున్నాడు. ఓవర్.”

రిపేర్ లో ఉన్న డ్రైనేజ్ మాన్‍హోల్ దగ్గరున్న వీధిదీపం, ముక్కు మూసుకునే సంగతులు చెప్పుకొచ్చింది, మూడు ముక్కల్లో.

“వెనక్కి తిరిగి కొట్టువాడినింకా తిట్టుకుంటూ..కింద చూసుకోకుండా..ఎగుడుదిగుడుగా ఉన్న బండ తగిలి… ఆమె పడబోయి.. అతడు పట్టుకొని.. కాఫీ వలకబోయి.. అది ఆపలేక, అతడి చొక్కా మొత్తం.. ”

అక్కడితో వీధిదీపాల వరుస ఆగిపోయింది. ఎత్తైన రోడ్డు. దారికి రెండు పక్కలా గుబురుగా చెట్లు. ఆకులు జల్లడిపడుతున్న వెన్నెల తప్ప మరో వెలుగు లేదు. కరెంటు పోయినట్టుంది.

“ఈ కొండ ఎక్కి దిగితే మా రూం. ఒక పావుగంట నడక. మీరు వెళ్ళండిక. నేను వెళ్తాను.” అంది ఆ అమ్మాయి. కానీ వెన్నెలమ్మ కదా. అన్నవే కాదు, అనుకుంటున్నవి కనిపెట్టేసే కిటుకు ఉంది. “రావోయ్.. ఏం వెడతావ్ లే!” అని అమ్మాయిగారి ఉద్దేశ్యం.

“ఇంత చీకట్లో ఒక్కత్తే వెళ్తా అంటుందేంటి? ధైర్యమా? వెర్రా?” అని అనుకొని, “పదండి.. నేనూ వస్తాను.” అని అనేసి, “హా.. మాన్-యు మాచ్ మొదలవ్వదు కదా?!” అని లెక్కలూ వేసుకున్నాడు.

ఇద్దరూ నడుస్తున్నారు. ఎక్కువగా ఆమె ముందు నడుస్తోంది. ఆగి, వెనక్కి తిరిగి మాట్లాడుతోంది, అప్పుడప్పుడూ.

“ఏంటి, ఇలా రోడ్లు అరిగదీయిస్తుంది నాచేత అని తిట్టుకుంటున్నారా?” అని అడిగింది. “ఏం వాగాలో తోచకపోతున్నా, ఏదోటి వాగుతున్నానా.. యు టూ బ్లాబర్ సంధింగ్, ఐ సే!”

“అదేం లేదు. నాకు ట్రెక్కింగ్ అంటే ఇష్టం. నో! ఇది ట్రెక్కింగ్ అని అనటం లేదు. గుర్తొచ్చింది.. చెప్పాను. సో, లాంగ్ వాక్స్, రాక్ క్లైంబింగ్ ఇవ్వన్నీ నేను ఇష్టంగా చేస్తాను. అందుకని తిట్టుకోను అని చెబుదామని..” అని కష్టం మీద పూర్తిచేసుకొచ్చాడు చెప్పాలనుకున్నది.

“ఎవరితో వెళ్తుంటారేంటి వాక్స్ కి?” (నాతో వచ్చినట్టు ఎవరితో బడితే వాళ్ళతో వెళ్ళిపోవుగదా!)

“డిపెండ్స్.. యు నో.. ఐ మీన్.. సీ.. ఇట్స్ లైక్.. యు నో..” = గాడ్.. మాటలు – మాటలు రావేంటి?

“ఎందుకంత తటపటాయిస్తారు? అమ్మాయిలని చెప్పేయండి..” (సే నో!)

“నాకు అమ్మాయిలతో పెద్ద పరిచయాలు లేవండి. మా వెధవలతోనే వెళ్తుంటాను, ఎక్కడికైనా..” (ఉఫ్)

“అర్రె.. ఈ చెట్టుకి ఒక పువ్వు కూడా లేదు.  నా చెవిలో పెట్టేవారే!” (కన్‍ఫర్మ్ గా చెప్పు అదే ముక్కనీ)

“అదేంటి? మీకంత పెద్ద జడ ఉందిగా?” అనేశాక, బల్బ్ వెలిగింది. (అంటే నేను అబద్ధాలు చెబుతున్నాననా? మట్టి బుర్ర అసలు వెలగలేదు. నవ్వాపు ప్లీజ్..)

“లేకపోతే ఏంటి సార్? బెంగళూర్లో పుట్టి, పెరిగి, చదువుకొని, ఉద్యోగం చేస్తూ అమ్మాయిలతో చనువు లేదంటే ఎట్టా నమ్మేది?” (మర్యాదగా చెప్పు, అప్పుడో అమ్మాయిని అప్పుడో అమ్మాయిని చూడ్డం తప్పించి, చూసి తలదించుకోవటం తప్పించి ఇంకేం ఘనకార్యాలు చేయలేదని చెప్పు..లేకపోతే చంపేస్తాను)

(అయిపోయాను. అమ్మాయిలతో చనువు లేదంటే చేతగాని మొహం అనుకుంటుంది. ఉందంటే “తెరి నియత్ ఖరాబ్ హై” అని సునీధి చౌహాన్ కన్నా హైపిచ్ లో పాడేస్తుంది.)

“బెంగళూరులో పుట్టిపెరిగితే.. ఐ డోంట్ గెట్ ఇట్?!”

“ఏమో! కానీ అంతా అంటుంటారు గదా! యూత్ లో ఉన్న అబ్బాయిలకి బెంగళూరును మించిన ప్లేస్ ఇండియాలోనే లేదని. ఇక్కడ అమ్మాయిలు చాలా చాలా చా…లా బాగుంటారని. ఒకసారి ఈ అమ్మాయిలని చూసిన కళ్ళతో ఇంకే అమ్మాయిలు నచ్చరని?”

“ఎవరు చెప్పారివ్వన్నీ?!”

“ఫ్రెండ్స్.”

“మీరు మరీను. కుంబ్లె, ద్రావిడ్ గురించి మీరెప్పుడైనా అఫైర్స్ అంటూ గాసిప్స్ అయినా విన్నారా అసలు? వాళ్ళు బెంగళూరులో పుట్టి, పెరిగినవాళ్ళేగా?” (ఈవిడగారి ఫేస్-బుక్ ప్రొఫైల్ క్షుణ్ణంగా బట్టీపట్టటం ఇలా పనికొచ్చింది. ద్రావిడ్ అంటే ప్రాణం అంటుందిగా, ఇప్పుడెలా కౌంటర్ వేస్తుందో చూస్తా)

కొంచెం ఆలోచించి, ఇంకొంచెం ఆలోచన అభినయించి, ఓటమిని అంగీకరించబోతున్నట్టు తల పంకించి “అర్థమయ్యింది” అంది. గెలుపును మరోసారి ఆమె గొంతులోనే వినాలనుకున్న అతడు “ఏం అర్థమయ్యింది?” అని రెట్టించాడు.

“ప్చ్.. మా ఊర్లో ఒకే ఒక్క బుద్ధుడుంటాడు. అదీ నీటి మధ్యలో. బోటెక్కెళ్ళాలి. ఇలా చేయి చాచగానే అందడు..” అంటూ అతడి వైపు చేయిజాచింది. అతడు ఆమెవైపు ఓ అడుగేశాడు. ఆమె చేయి వెనక్కి తీసుకొని, వెనక్కో అడుగేసింది. అతడింకో రెండుమూడు అడుగులు వేశాడు. ఆమె ఒకడుగు వేసి, ఇంకోటి వేసేలోగా అతడు వెనక్కి నుండి పట్టుకున్నాడు ఆమెను. ఆమె ఇంక్కొంచెం ఉంటే చెట్టుకు గుద్దుకునేది. అక్కడే ఉన్న కుక్కలు రెండు వాటి ప్రైవసీని పాడు చేసినందుకు విసుగ్గా తోకలూపుకుంటూ వెళ్ళిపోయాయి. చలిగాలి చెవిలో మెల్లిగా ఊదుతోంది. వాళ్ళిద్దరూ అచేతనావస్థలో ఉన్నారు. సమయం ఆగిపోయింది, ఆ ఇద్దరికి.

ఇంతలో ఓ కుక్క వచ్చి ఆమె పక్కకే నుంచుంది. “హుష్ హుష్” అంటూనే పక్కకు జరుగుతోంది. ఆమెతో పాటే అతడూ. అలా ఆ కుక్క వాళ్ళ చేత ఉన్నచోటే ఓ రెండు ప్రదక్షిణలు చేయించి, ఏదో గుర్తొచ్చినట్టు పరిగెత్తింది. ఊపిరి పీల్చుకొని తలెత్తేసరికి అతడి మెడ చుట్టూ చేతులూ, అతడి షూల మీద ఆమె పాదాలు లాంటివన్నీ గమనించుకుంది. దూరంగా జరగబోయింది. “కుక్క!” అన్నాడు. హడలి యాధాస్థితికి వచ్చిందామె. కుక్క లేదని గ్రహించి, విసురుగా దూరంగా జరిగింది. చున్నీ సర్దుకుంటూ

“చాక్లెట్ బాయ్ అనుకుంటే బ్రౌన్ షుగర్…”

“అలా మార్చినవాళ్ళని ఏమనాలి?”

అప్పుడే మబ్బుచాటునుండి వస్తున్న చంద్రుడు ఆమె కళ్ళల్లో మెరిశాడు. ఆమె ఒక్కసారిగా పరుగందుకుంది. ఆమె పరుగుకన్నా వేగంగా అతడి గుండె కొట్టుకోసాగింది. పైకెగిరి ఓ కొమ్మను ఊపితేగానీ అతడి అడ్రినలిన్ శాంతించలేదు. ఆమె కనుమరుగయ్యేవరకూ వేచిచూసి వెనుదిరిగాడు.

అదీ కథ. అయితే అసలు కథ ఇంకా ఉంది. వీళ్ళిద్దరూ ఆగిన రోడ్డుకు అవతల వైపునుండి ఈ కథనంతా ఆ అమ్మాయి రూమ్మేట్స్ చూశారు. ఇహ, ఆ రాత్రి వాళ్ళందరూ ఆమెను పెట్టే అల్లరి, ఆమె చేత అతడి గురించి చెప్పించుకునే సంగతులు, వేళాకోళాలూ, ఇకఇకలూ, పకపకలూ తెల్సుకోవాలంటే మాత్రం, ఎప్పుడో ఆ గదిచేత కథ చెప్పించుకోవటమే!